మర్రికి మరోసారి మోసం! వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
posted on Feb 25, 2021 @ 3:23PM
ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఏపీలో ఆరు స్థానాలకు ఎన్నిక జరగనుండగా.. సీఎం జగన్ ఖరారు చేసిన పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే ఇటీవల మృతిచెందిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు కల్యాణచక్రవర్తి, చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు భగీరథరెడ్డిలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య, హిందూపురం వైసీపీ నేత మహ్మద్ ఇక్బాల్, విజయవాడకు చెందిన కరీమున్నీసాను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సీఎం ఎంపిక చేశారు. ఆరుగురిలో ఇద్దరు ముస్లింలకు అవకాశం కల్పించి అశ్చరపరిచారు జగన్.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ వార్తల్లోకి వచ్చారు. ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెనాయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు సొంతూరు నిమ్మాడలో దువ్వాడ హంగామా చేశారు. నిమ్మాడలో దశాబ్దాలుగా సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుండగా.. ఈ సారి మాత్రం అక్కడ వైసీపీ అభ్యర్థిని పోటీలో పెట్టారు. అది కూడా అచ్చెనాయుడు సమీప బంధువునే బరిలోకి దింపడం సంచలనంగా మారింది. నామినేషన్ సందర్భంగా గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్థిని పోటీ చేయవద్దని బెదిరించారంటూ అచ్చెనాయుడుపై కేసు పెట్టి జైలుకు కూడా పంపించారు. నిమ్మాడ ఘటనలో దువ్వాడ శ్రీనివాస్ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడతో పాటు దాని చుట్ట పక్కల ప్రాంతాల్లోనూ టీడీపీ మంచి విజయాలు సాధించింది. దువ్వాడ ఓవరాక్షన్ వల్లే వైసీపీకి నష్టం జరిగిందనే చర్చ జరిగింది. అయినా దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
సీ రామచంద్రయ్య గతంలో టీడీపీలో కీలక పదవులు అనుభవించారు. రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. అయితే వైసీపీలో చేరిన తర్వాత చంద్రబాబును చాలాసార్లు టార్గెట్ చేశారు రామచంద్రయ్య. అందుకే ఆయనను ఎమ్మెల్సీగా ఖరారు చేశారని తెలుస్తోంది. హిందూపురం వైసీపీ నేత మహ్మద్ ఇక్బాల్ కు మరోసారి అవకాశం కల్పించారు జగన్. గతంలో ఆయనకు పూర్థి కాలం పదవి రాకపోవడంతో మళ్లీ అవకాశం ఇచ్చినట్లు చెబుతున్నారు. విజయవాడకు చెందిన కరీమున్నీసాకు ఎమ్మెల్సీ ఇచ్చి అశ్చర్య పరిచారు జగన్. గత సారి కూడా కర్నూల్ కు చెందిన ముస్లిం మహిళకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. త్వరలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక జరగనుంది. విజయవాడలో ముస్లిం ఓటర్లు ఎక్కువ కాబట్టి.. వాళ్ల ఓట్ల కోసమే కరీమున్నీసాను ఎంపిక చేశారని భావిస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ ఎంపికలో మరోసారి కొందరు నేతలకు అన్యాయం జరిగింది. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇస్తానని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించారుజగన్. ఎమ్మెల్సీనే కాదు మంత్రిని చేస్తానని కూడా ప్రకటించారు. కాని ఇంతవరకు ఆయనను పట్టించుకోలేదు. ఈసారైనా పదవి వస్తుందని ఆశించిన మర్రి రాజశేఖర్ కు మరోసారి హ్యాండిచ్చారు జగన్ రెడ్డి. మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం గుంటూరు జిల్లాలో చర్చగా మారింది. గుంటూరుకే చెందిన లేళ్ల అప్పిరెడ్డి కూడా ఈసారి తనకు ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని భావించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ కు మద్దతుగా ఉన్నారు అప్పిరెడ్డి. గోదావరి జిల్లాకు చెందిన కొయ్య మోషన్ రాజు పేరు వినిపించినా.. ఆయనకు కూడా మరోసారి నిరాశే ఎదురైంది.