అమరావతి అణుబాంబు కన్నా స్ట్రాంగ్! 

అమరావతిపై నటుడు శివాజి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించాలని కోరుతూ  437 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులు, మహిళలకు మద్దతు తెలిపేందుకు అమరావతికి వచ్చారు శివాజీ. అమరావతి ఆందోళనకు మద్దతు తెలిపారు. రైతుల సంకల్పం, వారి తెగువ అమరావతిని నిలబెడతాయన్న నమ్మకం తనకుందని అన్నారు  శివాజి. రాజధానిపై రైతుల్లో ఉన్న దృఢసంకల్పమే వారిని విజయతీరాలకు చేరుస్తుందని తెలిపారు. అమరావతి భావితరాల సొత్తు అని, దీన్ని ఎవరూ దొంగిలించలేరని స్పష్టం చేశారు. రాజధాని రైతులను ఏపీ ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని శివాజీ వ్యాఖ్యానించారు. గతంలో ఇక్కడే రాజధాని ఏర్పాటు చేయాలని అమరావతి రైతులు కోరలేదని, ప్రభుత్వం కోరిన పిమ్మట బాధ్యతగా తమ భూములు అప్పగించారని శివాజీ వెల్లడించారు. ఇప్పుడా భూములకు విలువలేదని అంటే అది చెల్లదని అన్నారు. అమరావతి ఎక్కడికీ పోదని, ఆ విధంగా శాసనం చేయబడిందని చెప్పారు. ఇది శివాజీ చెబుతున్న మాట అని ఉద్ఘాటించారు. ఆ శాసనాన్ని బద్దలు కొట్టాలంటే అణుబాంబు వల్ల కూడా కాదని శివాజి స్పష్టం చేశారు. అమరావతి ఎప్పటికీ ఆంధ్రుల రాజధానే అన్నారు శివాజి. అమరావతి రైతులను ఎవరూ మోసం చేయలేరని, తాను చెప్పింది చెప్పినట్టు జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని, అదే సమయంలో అమరావతి రాజధాన నిర్మాణం కూడా కొనసాగాలని శివాజి ఆకాంక్షించారు.

రావాలి.. రావాలి.. జూ.ఎన్టీఆర్ రావాలి..! మరి, వస్తాడా?

జై బాబు. జై జై బాబు. కుప్పంలో చంద్రబాబు రోడ్ షో సూపర్ హిట్. సీబీఎన్ టూర్ కంటే ఆ రోడ్ షోలో జరిగిన ఓ అనూహ్య ఘటన ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. టీడీపీలో విస్త్రుత చర్చ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రావాలంటూ చంద్రబాబు రోడ్ షో లో నినాదాలు మారుమోగాయి. రావాలి.. రావాలి.. జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా రావాలి.. టీడీపీ ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దించాలంటూ తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు సమక్షంలో బహిరంగంగా డిమాండ్ చేశారు. జై చంద్రబాబు.. జై జూనియర్ ఎన్టీఆర్ నినాదాలతో కుప్పం రోడ్ షో లో హోరెత్తించారు. ఎన్టీఆర్ ఫోటోలతో కుప్పంలో ఫ్లెక్సీలు వెలిశాయి. జూనియర్ ఎన్టీఆర్. సినిమా హీరోగా ఫుల్ క్రేజ్. నందమూరి వారసుడిగా ఇటు నటన, అటు రాజకీయం ఆయన రక్తంలోనే ఉంది. పెద్ద ఎన్టీఆర్ పోలికలు, అనర్గళ వాగ్ధాటి జూనియర్ కు జన్మతా వచ్చిన లక్షణాలు. నందమూరి ఫ్యామిలీలో బాలయ్య తర్వాత తారక్ లోనే ఆ చరిష్మా. ఆ ఆకర్షణ. తాత పెట్టిన పార్టీ కోసం గతంలో టీడీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు జూనియర్. అచ్చం పెద్ద ఎన్టీఆర్ మాదిరే ఖాకీ డ్రెస్ ధరించి.. చైతన్యరథంపై పర్యటించి అదరగొట్టారు. తెలుగు తమ్ముళ్లలో ఉత్తేజం, ఉత్సాహం నింపారు. అయితే.. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వచ్చినంత ప్రాభవం.. ఆనాటి ఎన్నికల ఫలితాల్లో మాత్రం కనిపించలేదు. 2009లో వైఎస్సార్ ప్రభంజనానికి ఎదురొడ్డి.. టీడీపీని అధికారంలోకి తీసుకురావడంలో జూనియర్ విఫలమయ్యాడు. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు గెలవలేకపోయారు. దీంతో. వ్యక్తిగత ఇమేజ్ వేరు.. రాజకీయాలు వేరనే తర్కం బుడ్డోడికి బోధపడింది. ఆ తర్వాత కుటుంబంలో, పార్టీలో వచ్చిన పరిణామాలు.. జూనియర్ ను పసుపు జెండా నుంచి దూరం పెట్టాయి. లోకేశ్ ఎంట్రీతో ఎన్టీఆర్ అవసరం తగ్గిపోయింది. పార్టీని లోకేశ్ సమర్ధవంతంగా నడుపుతుండటంతో టీడీపీలో జూనియర్ కు స్పేస్ లేకుండా పోయింది.  రాజకీయాలు తనకిప్పుడు సెట్ కావని భావించిన జూనియర్.. అప్పటి నుంచీ సినిమాలపైనే పూర్తిగా ఫోకస్ పెట్టారు. అనేక సూపర్ హిట్లు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన మూవీ గ్రాఫ్ పీక్స్ మీదుంది. టాలీవుడ్ లో టాప్ హీరోగా లైమ్ లైట్లో ఉన్న జూనియర్ ను సడెన్ గా రాజకీయాల్లోకి రావాలంటూ కుప్పం ప్రజలు డిమాండ్ చేయడం అనూహ్యం. అందుకే, జూనియర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ జరుగుతోంది.  జగన్ దూకుడుతో టీడీపీ ఇబ్బంది పడుతోంది. వరుస దాడులు, కేసులతో కేడర్ డీలా పడుతోంది. ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వస్తే పార్టీలో జోష్ పెరుగుతుందని కుప్పం ప్రజలు భావించి ఉండొచ్చు. అయితే.. గ్రహణం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మబ్బులు వీడాక మళ్లీ చంద్రోదయం ఖాయం. తాత్కాలిక కష్ట, నష్టాలను తట్టుకుని నిలబడటమే రాజకీయాల్లో ఉన్న వారికి అవశ్యకం. జూనియర్ ఎన్టీఆర్ వరుస హిట్లతో సినిమాల్లో మంచి పొజిషన్ లో ఉన్నారు. ఆయనకు కావలసినంత వయసు, మంచి భవిష్యత్తు ఉంది. ఒకసారి చేదు అనుభవం ఎదురై.. రాటు దేలిన ఎన్టీఆర్.. ఇప్పటికిప్పుడే పొలిటికల్ ఎంట్రీకి సిద్ధంగా లేరు. ఎన్టీఆర్ సినీ అభిమానులు సైతం ఇదే కోరుకుంటున్నారు. పాలిటిక్స్ వద్దంటూ ట్విట్టర్ లో జూనియర్ ఫ్యాన్స్ ట్వీట్లతో ఊదరగొడుతున్నారు. సినీ ఫ్యాన్స్ రాజకీయాలు వద్దంటుంటే.. పొలిటికల్ ఫ్యాన్స్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ డిమాండ్ చేస్తుండటం ఆసక్తికరం. మరి, ఆ మనువడి మదిలో ఏముందో..? 

దత్తన్నను తోసేసిన ఎమ్మెల్యేలు

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు  బడ్జెట్ సమావేశాల తొలిరోజు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ కాంప్లెక్స్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనను ఘెరావ్ చేశారు. ఈ తోపులాటలో దత్తాత్రేయ కిందపడ్డారు. ఉదయం 11 గంటలకే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వెనువెంటనే విపక్ష కాంగ్రెస్ నేతలు ఒక్కపెట్టున ఆందోళనకు దిగారు. విపక్ష నేత అగ్నిహోత్రి తన సీట్లోంచి లేచి నినాదాలు చేశారు. సభలో గందరగోళ పరిస్థితుల మధ్య గవర్నర్ తన ప్రసంగంలోని చివరి లైను మాత్రమే చదవి వినిపించారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్‌‌, స్పీకర్ విపిన్ పార్మర్‌‌తో కలిసి బయటకు వస్తుండగా స్పీకర్ ఛాంబర్ వద్ద గవర్నర్‌ను నిలువరించేందుకు విపక్ష ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. సభ తిరిగి సమావేశం కాగానే గవర్నర్‌ను ఘెరావ్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ భరద్వాజ సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. బడ్జెట్ సమావేశాలు జరిగినన్ని రోజులు సభకు రాకుండా వారిని సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో కాంగ్రెస్ విపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రితో పాటు ఎమ్మెల్యేలు హర్ష వర్ధన్ చౌహాన్, సుందర్ సింగ్ ఠాకూర్, సత్పాల్ రైజడ, వినయ్ కుమార్ ఉన్నారు.ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశ చెందడాన్ని ఈ చర్య ప్రతిబింబిస్తోందని అన్నారు.   

వ్యక్తి మృతి కేసులో ఏ1 ముద్దాయిగా కోడి అరెస్ట్.. రీజన్ ఇదే..

ఏమిటి ఆశ్చర్య పోతున్నారా .. ఒక వ్యక్తి చనిపోతే కోడిని అరెస్ట్ చేయడమేంటని.. ఈ ఘటన నిజంగానే తెలంగాణాలో జరిగింది. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం, కొండపూర్‌కు చెందిన సతీష్ అనే యువకుడు పందెంకోడి కాలికి అమర్చిన కత్తి గుచ్చుకుని మృతిచెందాడు. అతడు తన స్నేహితులతో కలిసి తరచుగా కోడిపందేలు నిర్వహిస్తుంటాడు. అయితే కోడిని పందెంలో దించే సమయంలో పొరపాటున కత్తికట్టిన కాలు కాకుండా మరో కాలిని పట్టుకున్నాడు. దీంతో తప్పించుకునేందుకు ప్రయత్నించిన కోడిపుంజును సతీష్ గట్టిగా పట్టుకోవడంతో కాలికి అమర్చిన కత్తి సతీష్ పొట్టలో గుచ్చుకుంది. దీంతో బాధితుడిని జిగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. ఈ ఘటన మూడు రోజుల క్రితం చోటుచేసుకుంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సతీష్ మరణానికి కారణమైన కోడిని పట్టుకొచ్చి స్టేషన్‌లో కట్టేశారు.అంతేకాకుండా ఆ కోడితోపాటు అక్కడ పందేలు ఆడినవారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.   మరోపక్క సతీష్ మరణానికి కోడే కారణమని తేల్చిన పోలీసులు దాన్ని ఏ1 ముద్దాయిగా చేర్చారు. త్వరలో ఆ కోడిని కోర్టులో కూడా హాజరు పరచనున్నారు. అప్పటివరకు ఆ కోడి బాగోగుల భారం పోలీసులపై ఉండడంతో దానిని చూసుకునేందుకు వారు నానా తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం ఆ కోడిని కాసేపు సెల్‌లో, మరికాసేపు చెట్టుకిందకు మార్చి దానికి గింజలు వేస్తున్నారు. అయితే కోడిపుంజును కట్టివేయడంతో అది తన కూతలతో పోలీస్ స్టేషన్‌ టాప్ లేపుతోంది  

పల్లె మనదే.. పట్నం మనదే..

పల్లెలు గెలిచాయి ఇప్పుడిక  మన వంతు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై పల్లెలు గెలిచాయని, ఇప్పుడిక మనవంతు అని ట్విటర్‌లో అన్నారు. పట్టణాల అభివృద్ధి కోసం 10 వాగ్దానాలతో మ్యానిఫెస్టో విడుదల చేశామని ఆయన తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని కోరారు. పురపాలక ఎన్నికల్లో గెలిస్తే ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామన్నారు. 21 నెలల జగన్ రెడ్డి పాలనలో పట్టణాల అభివృద్ధి శూన్యమన్నారు. కనీసం రోడ్డుపై గుంతలు పూడ్చలేని అసమర్థ ప్రభుత్వాన్ని చూశామన్నారు లోకేశ్ విమర్శించారు.  ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేసాడని, మరో ఛాన్స్ ఇస్తే ప్రజల జీవితాలను పాతరేస్తాడని  సీఎం జగన్‌ను ఉద్దేశించి లోకేశ్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆలోచించి ఓటు వెయ్యండని అంటూ  ట్విటర్‌లోఅన్నారు. పట్టణాల అభివృద్ధి కోసం 10 వాగ్దానాలతో టీడీపీ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసామని తెలిపారు.  

పాంచ్ పటాకా.. తెలుగునాట ధమాకా..

దేశంలో మినీ సంగ్రామానికి నగారా మోగింది. నాలుగు రాష్ట్రాలు కేరళ, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు,అస్సాంతో పాటు  కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నకల గంట మోగింది. వీటితో పాటు 16 రాష్ట్రాల్లోని 34 స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది సీఈసీ. అసోంలో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అసోంలో మార్చి 27న తొలి దశ పోలింగ్ జరగనుంది. తమిళనాడు, కేరళ. పుదిచ్చేరిలో ఒకే దశలో ఏప్రిల్ ఆరున పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది దశలో పోలింగ్ నిర్వహిస్తామని సీఈసీ తెలిపింది. బెంగాల్ లో కూడా మార్చి 27న తొలి దశ పోలింగ్ జరగనుంది. మే2న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రానున్నాయి.మొత్తం 18.68  కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని సీఈసీ సునిల్ అరోరా తెలిపారు. ఆన్ లైన్ లో నామినేషన్లను ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.  ఈసారి ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలలో నాలుగు వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఈశాన్య భారతంలోని అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంటే, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో వుంది. దక్షిణాన ఎన్నికలు జరిగే కేరళలో వామపక్ష కూటమి, తమిళనాడులో అన్నా డీఎంకే అధికారంలో ఉన్నాయి. పుదుచ్చేరిలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, ఫిరాయింపుల నేపధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలి పోయింది. అక్కడ రాష్ట్ర పతి పాలన విధించారు.  ఈ ఎన్నికలలో 294 అసెంబ్లీ స్థానాలున్నపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సుమారు మూడు దశాబ్దాల పాటు, రాష్ట్రాన్నిపాలించిన వామపక్ష కూటమి ప్రభుత్వాన్ని2011 ఎన్నికలలో గద్దెదించిన మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ 2016లో వరసగా రెండవసారి కూడా తిరుగులేని విజయాన్ని సాధించింది. రేపటి ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించి హట్రిక్ కొట్టాలని మమతా బెనర్జీ తమదైన శైలిలో రణతంత్రాన్ని రచించుకున్నారు. అయితే, 2019 లోక్ సభ ఎన్నికలలో అనూహ్యంగా పుంజుకుని 40 శాతం ఓట్లతో 18స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. తృణమూల్ కు గట్టి సవాలు విసురుతోంది. మొదటి నుంచి మమతా దీదీకి కుడి ఎడమ భుజంగా ఉన్నసువేందు అధికారి సహా పలువురు కీలక నేతలు, మంత్రులు, సిట్టింగ్,ఎంపీలు,ఎమ్మెల్ల్యేలు బీజీపీలో చేరి మమతకు సవాలు విసురుతున్నారు.  అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న మరో రాష్ట్రం అస్సాం  చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా వుంది. అయితే 2016లో బీజీపే తొలి సారిగా అక్కడ ఘన విజయం సాధించింది. సర్బానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రిగా ఏర్పడిన తొలి బీజేపీ ప్రభుత్వం గడచినా ఐదేళ్ళలో మంచి మార్కులే తెచ్చుకుంది. అన్నిటినీ మించి,కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా, నిలిచిన మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ ఈ సంవత్సరం మొదట్లో కాలం చేశారు. ఆయన స్థానాన్ని భర్తీ చేయగల నాయకుడు ఇంకెవరు హస్తం పార్టీలో లేక పోవడం, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కుంటున్న నాయకత్వ సంక్షోభం నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అదీగాక  గోగోయ్ తర్వాత ఆస్థాయిలో చక్రం తిప్పగల హిమనంద్ బిశ్వాస శర్మ, 2016కు ముందే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి, కాషాయం కట్టుకున్నారు.సో కాంగ్రెస్ బలహీనత ఆధారంగా అస్సాంలో మరోమారు కాషాయ జెండా ఎగిరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. 140 స్థానాలున్న కేరళలలో మొదటి నుంచి కాంగ్రెస్ సారధ్యంలోని, యునైట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ , వామపక్షాల నేతృత్వంలోని లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ల మధ్యనే అధికార మార్పిడి జరుగుతోంది. ఈసారి కూడా ప్రధాన పోటీ రెండు కూటముల మధ్యనే ఉంటుంది. గత ఎన్నికల్లో లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ విజయం సాధించింది. ఈసారి ఏ కూటమిని అధికారం వరిస్తుంది అనేది కొంత ఆసక్తి రేకెత్తిస్తోంది. గత ఎన్నికలలో కేవలం ఒకే ఒక్క సీటుకే పరిమితమైన బీజీపే ఈ సారి ఓటర్లను ఆకర్షించేందుకు సరికొత్త వ్యూహాలను అమలుచేస్తోంది. ఇటీవలే మెట్రో మ్యాన్‌ శ్రీధర్‌ తో పాటుగా కొందరు సినిమా రంగ ప్రముఖులు ఇతరరులు కూడా పార్టీలో చేరారు. అయితే ఎంత చేసిన కేరళకు సంబంధించినంతరకు బీజేపీ ఆటలో అరటిపండు మాత్రమే.    దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీలదే పై చేయిగా ఉన్న తమిళనాడులో ప్రస్తుతం  అన్నాడీఎంకే అధికారంలోవుంది. జయలలిత మరణం తర్వాత జరుగుతన్న ఈ ఎన్నికలలో  అన్నాడీఎంకేతో బీజేపీ, డీఎంకేతో కాంగ్రెస్ ఇప్పటికే పొత్తు పెట్టుకున్నాయి. డిఎంకే అగ్రనేత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, అన్నాడీఎంకే  అధినాయకురాలు జయలిత తెర మీద లేకుండా జరుగతున్న ఈ ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ప్రస్తుతానికి ఊహకు కూడా అందని విషయంగా ఉందని అంటున్నారు.  ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరికి శాసన సభ ఎన్నికలు కూడా చివరి క్షణంలో చేసుకున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అక్కడ నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కారు కుప్పకూలింది. ఎందుకనో గానీ పుదుచ్చేరి మీద కమలనాధుల కన్ను పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కద పర్యటించారు. అలాగే పార్టీ అగ్రనేతలు కూడా తరచూ పుదుచ్చేరిలో పర్యటిస్తూ పార్టీ విస్తరణకు వ్యూహాత్మకంగా పావులు కడుపుతున్నారు.  సో... దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కి  ఉన్న పరిస్థితులలో జరుగతున్న అసెంబ్లీ ఎన్నికలు, మినీ సంగ్రామాన్ని తలపించడమే కాదు.. దేశ  రాజకీయ భవిష్యత్ నప నిర్ణయించే ఎన్నికలుగా కూడా బావించ వచ్చును.  

మెడ మీద తలకాయలు ఉండవ్..ఆకు రౌడీ, పిచ్చి కుక్క..

పవన్ అంటే ఫైర్. పవన్ అంటే పవర్. పవన్ అంటే తిక్క. లెక్కలేనంత ఆ తిక్కను కెలికితే ఊరుకుంటారా? అరేవో సాంబా అంటూ రెచ్చిపోడూ. అదే జరిగింది. జనసేన అధినేత ఇగోను దెబ్బతీశారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. పీకేకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అందరినీ బెదిరించే పవన్ ను బెదిరిస్తే ఆయన ఊరుకుంటారా? ఓ రేంజ్ లో రెచ్చిపోయారు పవన్ కల్యాణ్. ఆకు రౌడీ నుంచి వీధి కుక్క వరకూ.. డైలాగులతో భీమవరం ఎమ్మెల్యేను ఏకిపారేశారు. పీకే వర్సెస్ గ్రంధి శ్రీనివాస్ ఎపిసోడ్ పశ్చిమలో కాక రేపుతోంది. ఎమ్మెల్యే ఏమన్నారంటే.. పవన్ కళ్యాణ్ మెడ మీద తలకాయలు ఉండవ్ అని హెచ్చరించారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురిలో జనసేన కార్యకర్తలు దళితులపై దాడి చేశారని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసి ధ్వంసం చేశారని విమర్శించారు. జనసేన కార్యకర్తలు సంఘ విద్రోహ శక్తులుగా అరాచకాలు చేస్తున్నారని విమర్శించారు. దళితులపై దాడి జరిగిందని తెలిసి వెళ్లిన తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దళితులపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయకపోతో ఛలో మత్స్యపురికి పిలుపునిస్తామని గ్రంధి శ్రీనివాస్ హెచ్చరించారు.  పవన్ స్ట్రాంగ్ కౌంటర్.. మెడ మీద తలకాయలు ఉండవ్ అంటే పీకే ఊరుకుంటారా? ఆవేశంతో ఊగిపోరూ. అదే చేశారు పవన్ కల్యాణ్. తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్న శ్రీనివాస్.. ఓ ఆకు రౌడీ, బ్యాంకులను దోచేసిన వ్యక్తి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేస్తే చూస్తూ కూర్చోమని.. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించేంత సంయమనం తమ దగ్గర లేదంటూ ఓ వీడియో ప్రకటనలో వార్నింగ్ ఇచ్చారు జనసేనాని. వైసీపీ ఎమ్మెల్యే ఆగడాలను కట్టడి చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కోరారు. లేదంటే శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతుందని హెచ్చరించారు. దళితలపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు అక్రమంగా బనాయిస్తే... మానవహక్కుల సంఘానికి తాను స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేస్తానన్నారు. దళితులను రక్షించాల్సిన చట్టాన్నే దళితులపై ప్రయోగిస్తున్నారని తప్పుబట్టారు. వ్యక్తిగతంగా దూషణలకు దిగుతున్న... వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాటలను... జనసేన శ్రేణులు పట్టించుకోవద్దని సూచించారు. ‘వీధిలో కొన్ని కుక్కలు అరుస్తాయి.. కొన్ని పిచ్చికుక్కలు కరుస్తాయి. కరిచినంత మాత్రాన ఆ కుక్కను మనం కరవం కదా. మున్సిపాలిటీ వాళ్లకు ఫోన్ చేస్తాం. వచ్చే వరకు ఆగుతాం. మీకు మాటిస్తున్నాను. మున్సిపాలిటి వ్యాన్ వస్తుంది.. అప్పటి వరకు సంయమనం పాటించండి’ అంటూ పీకే తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్, గ్రంధి శ్రీనివాస్ ల మధ్య డైలాగ్ వార్ పశ్చిమలో రాజకీయ రచ్చ రాజేస్తోంది.  

వామనరావు హత్య వెనుక అసలు నిజమిదే! 

తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతుల హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. పోలీసుల విచారణలో బిట్టు శ్రీను సంచలన అంశాలు చెప్పాడని తెలుస్తోంది. అడ్వకేట్ దంపతుల హత్యకు నిరసనగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళి సైని కలిసి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదుపై  గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి తదితరులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.  గవర్నర్ ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి .. కేసీఆర్ సర్కార్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.  వామనరావు దంపతుల హత్యలో అధికార పార్టీ నేతల హస్తం ఉన్నా.. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. శీలం రంగయ్య మృతి కేసులో వామన్‌ రావు దంపతులు హైకోర్టులో కేసు వేయడం, మంథనిలో టీఆర్ఎస్  అక్రమాలకు అడ్డుగా నిలవడంతోనే  పథకం ప్రకారం హత్య చేశారని  తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పరిసరాల్లో నుంచి రూ.4వేల కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించారని, దీనిపైనా వామన్‌రావు పోరాటం చేసేందుకు సిద్ధమవుతుండగా మట్టుబెట్టారని ఉత్తమ్ వివరించారు.  న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య రాష్ట్ర చరిత్రలోనే అత్యంత  కిరాతకమైన ఘటన అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు.రాష్ట్రాన్ని కుదిపేసిన ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్‌ తమిళి సైని కోరగా, సానుకూలంగా స్పందించారని తెలిపారు. న్యాయవాద దంపతుల హత్యలో పోలీసుల పాత్ర ఉందని జనం నమ్ముతున్నారన్నారు.  పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్టుకు అక్రమ మార్గంలో సేకరిస్తున్న నిధులను వామన్‌రావు బయటపెట్డడంతోనే అడ్డు తొలగించుకున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.   

ప్రేమజంట ఆత్మహత్య..

ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కలిసి బతుకుదాం అనుకున్నారు. పెద్దలు తమ ప్రేమను అంగీకరించరేమోనని అనుమానంతో ఓ ప్రేమజంట నిండు ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. కోదాడ పట్టణంలోని పెద్ద చెరువులో దూకి ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ప్రేమజంట ఆత్మహత్య కలకలం రేపుతోంది. మృతులు లక్ష్మీపురంకు చెందిన మణికంఠ, ఫాతిమా గా పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి  ప్రేమ జంట ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించరేమోనని ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. 

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు  హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ఈసీ నోటిఫికేషన్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు జరపవచ్చని  హైకోర్టు స్పష్టం చేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ ఇచ్చి 11 నెలలు గడిచిందని. కొత్త నోటిఫికేషన్‌ను ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో 16 పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించని న్యాయస్థానం.. పాత నోటిఫికేషన్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికలు యథావిధిగా మార్చి 10న పోలింగ్‌, 14న ఓట్ల లెక్కింపు చేపట్టవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.  

లవ్ లెటర్లు కాదు.. జాబ్ లెటర్లు కావాలి! 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ పై పాలనపై కాంగ్రెస్ నేతలు ఘాటు విమర్శలు చేశారు. తమ హయాంలో దాదాపు లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేశామంటూ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన ప్రకటనకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రవణ్ కుమార్ కౌంటరిచ్చారు. తండ్రి మాదిరిగానే కొడుకు కేటీఆర్ సిగ్గు లేను మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు అపాయింట్ మెంట్ లెటర్లు కావాలి.. లవ్ లెటర్ లు కాదని శ్రవణ్ ఎద్దేవా చేశారు.   2014 లో లక్ష 7 వేల ఖాళీలు వున్నాయని కేసీఆరే చెప్పారన్నారు శ్రవణ్ కుమార్. బిశ్వాల్ కమిటీ కూడా లక్ష 91 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పిందన్నారు. తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులే వుండరు అన్న కేసీఆర్.. మళ్లీ కాంటాక్ట్ ఉద్యోగులను ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో.. కేసీఆర్ ఫ్యామిలీకే కొలువులు దొరికాయన్నారు. తమ కుటుంబానికి తప్ప తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వరా అని  శ్రవణ్ నిలదీశారు. రాష్ట్రంలో 47 శాతం ఉద్యోగాలు భర్తీ లేకుండా ఉన్నాయన్నారు.  ఉద్యోగులు పూర్తి స్థాయిలో ఉంటేనే పాలన సరిగా జరుగుతుందన్నారు శ్రవణ్ కుమార్. ప్రగతి భవన్ లో ఉద్యోగులు ఉంటే సరిపోదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 10వేల ఉద్యోగాలు వేశారని కేటీఆర్ చెప్పడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ వ్యతిరేకి కిరణ్ కుమార్ రెడ్డి లక్ష 10వేల ఉద్యోగాలు  వేశారని చెప్పారు. టిడిపి, కాంగ్రెస్ హయాంలో వరుసగా టీచర్ ఉద్యోగాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ లు వచ్చాయన్నారు. గ్రూప్ -1, గ్రూప్ -2, 3 నోటిఫికేషన్ లు రానే రాలేదన్నారు శ్రవణ్ కుమార్. 

నిండు చంద్రుడు ఒకవైపు.. చుక్కలు ఒకవైపు?

రేవంత్ రెడ్డి ఒక్కడు ఒకవైపు. కాంగ్రెస్ సీనియర్లంతా మరోవైపు. టీపీసీసీలో అసలేం జరుగుతోంది? రేవంత్ రెడ్డిని ఎందుకంతలా టార్గెట్ చేస్తున్నారు? జగ్గారెడ్డి నుంచి జానారెడ్డి వరకూ అంతా వర్కింగ్ ప్రెసిడెంట్ పైనే పడి ఎందుకు ఏడుస్తున్నారు? పని చేసే లీడర్ ను పని చేయనీయరా? ఫైర్ బ్రాండ్ లీడర్ కు ఎందుకు మోకాలడ్డుతున్నారు? వాళ్లు చేయరు, రేవంత్ ను చేయనీయరా? ఇదీ తెలంగాణ కాంగ్రెస్ వాదుల్లోఎగిసిపడుతున్న ఆక్రోశం. కాంగ్రెస్ లో నడుస్తున్న కోల్డ్ వార్ కి తాజాగా జానారెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. పరోక్షంగా రేవంత్ రెడ్డి అండ్ టీమ్ ను టార్గెట్ చేస్తూ జానారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు.. సీనియర్లంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని జానా కామెంట్ చేశారు. అటువంటి వాళ్లపై పీసీసీ చర్యలు తీసుకోవాలని.. లేదంటే తాను అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు జానారెడ్డి. ఎక్కడా రేవంత్ రెడ్డి పేరు వాడకపోయినా జానారెడ్డి ఇచ్చిన వార్నింగ్ రేవంత్ టీమ్ కే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది కేవలం రేవంత్ రెడ్డి అభిమానులు మాత్రమే. వాళ్లు ఫ్యాన్స్ కాదు రేవంత్ సైన్యం. రేవంత్ రెడ్డి కోసం ఏదైనా చేస్తారు. ఎంతకైనా తెగిస్తారు. తన అభిమాన నేతకు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్న కాంగ్రెస్ సీనియర్లను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు రేవంత్ ఫ్యాన్స్. సీనియర్ నేతలు తప్పుకొని వెంటనే రేవంతన్నకు పీసీసీ పగ్గాలు అప్పగించాలని.. లేదంటే కాంగ్రెస్ పతనం ఖాయమంటూ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. దీంతో, జానారెడ్డికి చిర్రెత్తుకొచ్చి ఇలా వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు.  కాంగ్రెస్ కథ మారదా? కాంగ్రెస్ లో మొదటి నుంచీ అంతే. ఆ పార్టీని ప్రత్యర్థులు ఓడించనక్కరలేదు. ఆ పార్టీ వారే ఓడిస్తారు. రాజకీయాల్లో మర్డర్లు ఉండవు, సూసైడ్లే అనే డైలాగ్ కాంగ్రెస్ కు సరిగ్గా సరిపోతుంది. ఎదిగే నేతనుఎదగనివ్వరు. పని చేసే వారిని పని చేయనివ్వరు. గ్రూపులు, గొడవలు, ఆధిపత్య పోరు.. అబ్బో హస్తం పార్టీ అదో టైపు. వైఎస్సార్ మరణం తర్వాత నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది కాంగ్రెస్ పార్టీ.బలమైన నేత లేక కేడర్ అంతా కకావికలం అవుతోంది. అనేక మంది పార్టీ మారితే.. ఆశాజీవులు మాత్రం మళ్లీ మంచి రోజులు రాకపోతాయా అని పార్టీనే నమ్ముకొని ఉన్నారు. అలాంటి వారందరికీ ఆశాకిరణం రేవంత్ రెడ్డి మాత్రమే. సో కాల్డ్ సీనియర్లు ఎందరున్నా.. రేవంత్ రెడ్డికి వాళ్లెవరూ సరి సమానం కాదనేది ద్వితియ శ్రేణి నాయకుల మాట.  కాలు పట్టి లాగడమే కాంగ్రెస్ నైజమా? కొంతకాలంగా పెద్ద పెద్ద నేతలంతా ప్రెస్ మీట్లకే పరిమితమైతే.. రేవంత్ రెడ్డి మాత్రం పాదయాత్ర, రణభేరితో దూకుడు మీదున్నారు. రేవంత్ రెడ్డి ఒక్క మాటంటే.. ఒక్క పిలుపు ఇస్తే.. అది ప్రజల్లోకి రాకెట్ లా దూసుకుపోతుంది. వాక్ చాతుర్యం, దూకుడు రాజకీయం ఆయన బలం. ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి ఫైర్ మీద ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతూ వెనక్కి లాగుతుంటారు సీనియర్లు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాకు తగ్గట్టే రేవంత్ యాక్టివ్ గా పని చేసుకు పోతుంటే.. మిగతా సీనియర్ల నుంచి ఆయనకు ఎప్పుడూ సహాయ నిరాకరణే. ఇటీవల అచ్చంపేట నుంచి వావిలాల వరకూ రేవంత్ రెడ్డి రైతు భరోసా పాదయాత్ర చేస్తే అది పార్టీ నిర్ణయం కాదంటూ అడ్డుపుల్లలు వేశారు కొందరు నేతలు. ఇక రైతు రణభేరి సభకూ సీనియర్లంతా డుమ్మా కొట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటం కాంగ్రెస్ లో మరే నేత అయినా చేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు ఆయన అభిమానులు. కాంగ్రెస్ లో కేసీఆర్ భయపడేది ఒక్క రేవంత్ రెడ్డికేనని అంటున్నారు. పార్టీ కోసం ఇంత చేస్తున్న రేవంత్ కు సీనియర్లు కాస్తైనా సహకరిస్తే తమ లీడర్ మరింత దూసుకుపోతాడని.. సర్కారుకు చుక్కలు చూపిస్తాడని అంటున్నారు. పోనీ, సహకరించకున్నా పర్వాలేదు కనీసం అడ్డుకోకుండా ఉన్నా చాలంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటేనే రేవంత్ రెడ్డి ఇంత యాక్టివ్ గా పని చేస్తుంటే.. ఇక పీసీసీ పగ్గాలు అప్పగిస్తే కేడర్ లో మరింత జోష్ రావడం ఖాయం అంటున్నారు. అలా జరిగితే అది కాంగ్రెస్ ఎందుకవుతుంది? ఎదిగే వారిని కాలు బట్టి లాగడమే కాంగ్రెస్ నైజం. రేవంత్ రెడ్డి విషయంలోనూ అదే జరుగుతోందా..? సమయం లేదు హైకమాండ్.. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఆలస్యం అవుతుండటంతో ఉత్సాహంగా పని చేసే నాయకుల్లో నిరుత్సాహం ఆవహిస్తోంది. అధిష్టానం తీరుతో విసుగెత్తి పార్టీ వీడుతున్నారు పలువురు ప్రముఖులు. కుతుబుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, గ్రేటర్ లో స్ట్రాంగ్ లీడర్ కూన శ్రీశైలం గౌడ్, సిర్పూర్ కాగజ్ నగర్ కు చెందిన బలమైన నేత పాల్వాయి హరీష్ బీజేపీలో చేరిపోయారు.  నాంపల్లి ఫైర్ బ్రాండ్ లీడర్ ఫిరోజ్ ఖాన్ కూడా  పార్టీని వీడి యోచనలో ఉన్నారు. వీరంతా రేవంత్ రెడ్డి వర్గీయులే. తమ నేతకు ఇంకా పీసీసీ పదవి రావడం లేదనే అసహనంతో వారంతా పార్టీకి దూరమయ్యారు. మరింత ఆలస్యం అయితే.. మరింత మంది నేతలు హస్తం పార్టీకి హ్యాండ్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కు తెల్ల ఏనుగుల్లాంటి సీనియర్లు కావాలా? థౌజండ్ వాట్స్ పవర్ ఉన్న చిరుత లాంటి చిచ్చర పిడుగు రేవంత్ రెడ్డి కావాలో ఢిల్లీనే తేల్చుకోవాలి. సమయం లేదు హైకమాండ్.. ఆలస్యమైతే కాంగ్రెస్ ఖతం అంటున్నారు రేవంత్ రెడ్డి ఫ్యాన్స్.  

మరో షాక్.. వ్యాక్సిన్ రెండో డోసు తర్వాత కూడా పాజిటివ్

దేశం లో కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 16,577 మందికి కొత్త‌గా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరోపక్క తెలంగాణాలో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మొన్న‌టివరకు రాష్ట్రంలో మొత్తం 200 లోపే కేసులు బ‌యవస్తుండగా .. గురువారం ఒక్క జిహెచ్ఎంసీ పరిధిలోనే 192 కొత్త కేసులు వెలుగు చూడ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఇది ఇలా ఉండగా గతంలో కరీంనగర్ ను వణికించిన కరోనా మరోసారి విజృంభిస్తోంది.తాజాగా జిల్లా వ్యాప్తంగా 26 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. రామగుండం ఎన్టీపీసీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ కు, గోదావరి ఖని బ్లడ్ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగికి, అతడి భార్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గోదావరి ఖని ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగి రెండు సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకడంతో వైద్యులు షాక్ కు గుర్యయారు. బ్లడ్ బ్యాంక్ ఉద్యోగి వాసన కోల్పోవడంతో అనుమానం కలిగి కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. అతడు గత నెల 18న కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకోగా.. ఈనెల 18న రెండో డోస్ కూడా తీసుకున్నాడు. మరోపక్క బ్యాంక్ మేనేజర్‌కు కరోనా సోకడంతో అధికారులు బ్యాంక్‌ను మూసివేశారు. దీంతో కొద్దిరోజులుగా బ్యాంకుకు వెళ్లిన వినియోగదారులలో కూడా ఆందోళన నెలకొంది. మరోపక్క బ్యాంకు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా కరోనా భయం పట్టుకుంది. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

జగన్ కు మ్యాటర్ వీక్...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్ రెడ్డి పాలనపై మరోసారి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైసీపీ పాలనలో ఏపీ పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. వైసీపీ పాలన చూస్తుంటే.. ‘పబ్లిసిటీ పీక్..మ్యాటర్ వీక్’ అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. దీనికి సన్నబియ్యమే ఒక ఉదాహరణగా చెప్పారు.  ఎన్నికల ముందు సన్నబియ్యం ఇస్తామని చెప్పారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నబియ్యం కాదని.. నాణ్యమైన బియ్యం ఇస్తామన్నామని మాట మార్చారని విమర్శించారుయ  ఇంటింటికి రేషన్ సరఫరా చేస్తామంటూ గొప్పలు చెప్పుకున్నారు.. వేల కోట్లు ఖర్చుచేసి వాహనాలు ఏర్పాటు చేశారు.. స్పీడుగా గ్రామాలకు పంపారు.. ప్రజలు ఛీ కొట్టారు.. మళ్లీ స్పీడుగా ఆ వాహనాలు తాడేపల్లి ప్యాలస్‌కు వచ్చాయని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. అందుకే జగన్ రెడ్డి ప్రభుత్వానికి పబ్లిసిటీ పీక్..మ్యాటర్ వీక్ అని అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అడిగి.. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా అభివృద్ధి జరగలేదని లోకేష్ విమర్శించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 38.89 శాతం పంచాయతీలను తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారని చెప్పారు నారా లోకేష్.  

డేటింగ్ కపుల్ ఛీటింగ్.. 11.5కోట్లతో జల్సాలు..

వాళ్లిద్దరు మహా కిలాడీలు. కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నారు. అతడు ఐపీఎస్ ఆఫీసర్ గా బిల్డప్ కొట్టాడు. ఆమె అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్‌పర్సన్‌గా ఫోజు కొట్టింది. ఇద్దరూ కలిసి ఓ బకరాను పెళ్లి పేరుతో మోసం చేశారు. ఏకంగా 11.5 కోట్లు కాజేశారు. ఈజీ మనీని విచ్చలవిడిగా ఖర్చు చేశారు. 40 లక్షలు కట్టి 40 రోజుల పాటు ఓ హోటల్ లో ఫుల్ ఎంజాయ్ చేశారు. 2 కోట్ల బీఎమ్ డబ్ల్యూ కారులో షికార్లు చేశారు. మరో ఐదు కార్లతో హంగామా చేశారు. ఖరీదైన విల్లా, భారీగా బంగారు ఆభరణాలు.. అబ్బో ఓ రేంజ్ లో సాగింది వారి యవ్వారం. కట్ చేస్తే.. ఆ డేటింగ్ కపుల్ లో విజయ్ కుమార్ రెడ్డి సూసైడ్ చేసుకున్నాడు. అతని పార్ట్ నర్ శిరీష అలియాస్ స్మృతి సింహ కటకటాలు లెక్కపెడుతోంది.  సంచలనంగా మారిన బాచుపల్లి మోసం కేసులో పోలీసు విచారణతో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. కడప ప్రాంతానికి చెందిన మైనింగ్‌ వ్యాపారి పి.వీరారెడ్డి (36) బాచుపల్లిలోని ఏపీఆర్‌ ప్రణవ్‌ అంటిల్లా విల్లా నంబర్‌ 268లో నివాసం ఉంటున్నారు. పక్క విల్లాలో ఉంటున్న అంకిరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి వీరారెడ్డితో పరిచయం పెంచుకున్నాడు. తాను ఐపీఎ్‌సకు ఎంపికయ్యానని, తన భార్య శ్రుతి సిన్హా మానవ హక్కుల కమిషన్‌ దక్షిణ భారత విభాగానికి చైర్మన్‌ అని. తన తండ్రి రాఘవ రెడ్డి డీసీపీ అని.. తమకు 77 బస్సులున్నాయని, 32 ఎకరాల పొలం ఉందని వీరారెడ్డికి అబద్ధాలు చెప్పాడు. వీరారెడ్డి తన తమ్ముడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు తెలుసుకుని.. తమకు తెలిసిన ప్రవల్లిక అనే అమ్మాయి పెళ్లికి సిద్ధంగా ఉందని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన వీరారెడ్డి ఆమెతో మాట్లాడుతానని అడగ్గా.. శ్రుతిసిన్హాతో ఫోన్‌లో మాట్లాడించాడు.  నిజానికి వారిద్దరూ భార్యాభర్తలు కారు. వృత్తి రీత్యా కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ అయిన విజయ్‌కుమార్‌ రెడ్డి.. భర్తను వదిలేసి ఒంటరిగా ఉంటూ బోరబండలో సూపర్‌మార్కెట్‌ నిర్వహిస్తున్న శ్రుతి సిన్హాతో సహజీవనం చేసేవాడు. విజయ్‌కుమార్‌ రెడ్డి, శ్రుతి సిన్హాలు వీరారెడ్డిని 2017 నుంచి మోసం చేస్తూ వచ్చారు. రకరకాలుగా నమ్మిస్తూ లక్షల్లో వసూలు చేశారు. నాలుగేళ్లలో మొత్తం 11.50 కోట్లు  వసూలు చేశారు.  రోజులు గడుస్తున్నా డబ్బు చెల్లించకపోవడంతో వీరారెడ్డికి అనుమానం వచ్చి విజయ్‌కుమార్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. ఎక్కడున్నావని అడిగితే డెహ్రాడూన్‌లోని పోలీసు అకాడమీలో ఉన్నానని చెప్పాడు. వాట్సప్‌లో లైవ్‌ లొకేషన్‌ పంపించాలంటూ వీరారెడ్డి అడిగాడు. అప్పటికే పలుమార్లు సమాధానం చెప్పలేక తప్పించుకుంటూ వచ్చిన విజయ్ కుమార్ రెడ్డి ఇక మరింత కాలం వీరారెడ్డిని మేనేజ్ చేయడం ఆయన వల్ల కాలేదు. విలాసాలపై శ్రుతి మోజు మరింతగా పెరగడం, వీరారెడ్డి నుంచి డబ్బు కోసం ఒత్తిడి పెరుగుతుండడంతో విజయ్‌కుమార్‌ రెడ్డి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరారెడ్డి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. శ్రుతి సిన్హాతో పాటు ఆమెకు సహకరించిన విజయ్‌కుమార్‌రెడ్డి బంధువులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

తిరుపతి, సాగర్ బైపోల్ షెడ్యూల్!  

ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయిన తిరుపతి లోక్ సభ తో పాటు తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద రావు సెప్టెంబర్ 16న చనిపోయారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ డిసెంబర్ 1న మరణించారు. ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. శుక్రవారం  మధ్యాహ్నం 4.30 గంటలకు మీడియా సమావేశాన్ని ఈసీ ఏర్పాటు చేసింది. దీంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.    నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీలను భారత ఎన్నికల కమిషన్  ప్రకటించనుంది. పశ్చిమబెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది.  ఏప్రిల్-మేలో ఈ ఐదు చోట్ల ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు గత బుధవారంనాడు ఈసీ సమావేశమైంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న లోక్ సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనుంది సీఈసీ.  తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, పశ్చిమబెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.  అసోంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా, కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. విశ్వాస పరీక్షకు ముందు ముఖ్యమంత్రి నారాయణ స్వామి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల రాజీనామా చేయడంతో పాండిచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించారు.

చంపేస్తావా ద్రౌపదీ..

కళాకారులు పాత్రలో నటించడం కంటే జీవిస్తేనే రక్తికడుతుంది. అది సినిమా అయినా, నాటకమైనా. హాస్యం, శృంగారం, శాంతి, కరుణ, అద్భుతం, సన్నివేశాలు ఐతే పరవాలేదు. కానీ రౌద్రం, భయానాకం, బీభత్సము, వీరత్వం సన్నివేశాలు  ఐతేనే కొంచెం రిస్క్ . నాటక దారులు పాత్రలో జీవితే ఒకే కానీ లీనమైతేనే ఇబ్బంది! తాజాగా ఓ కళాకారిణి ఇలా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి హత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర సంచలనం కలిగించింది.ద్రౌపది పాత్రలో నటించిన ఓ కళాకారిణి నిజంగానే రౌద్రావతారం ఎత్తిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కర్ణాటకలో మండ్య జిల్లాలోని నాల్వడి కృష్ణరాజ ఒడయార్‌ కళామందిరంలో ఈ నెల 4న ‘కౌండలీకన వధ’ అనే పౌరాణిక నాటక ప్రదర్శన జరిగింది. దీనిలో ద్రౌపది పాత్ర పోషించిన దొడ్డ శృతి నాటకం చివర్లో కాళికాదేవి అవతారమెత్తి త్రిశూలంతో రాక్షసుడు కౌండలికను సంహరించే సన్నివేశం ఉంది. చివర్లో కౌండలికను ద్రౌపది కింద పడేసి త్రిశూలాన్ని అయన గుండెకు ఆనిస్తే నాటకం పూర్తవుతుంది. కానీ.. కౌండలీకను గట్టిగా తోసి కిందపడేసిన ద్రౌపది పాత్రధారి ఆవేశంతో బిగ్గరగా కేకలు వేస్తూ త్రిశూలంతో ఆయన్ను పొడిచేందుకు ముందుకురికింది. అయితే పరిస్థితిని గమనిస్తున్న సహకళాకారులు.. ఉపద్రవాన్ని ముందే గుర్తించి వేదికపైకి వెళ్లి ఆమెను బలవంతంగా అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. శృతి మాట్లాడుతూ.. వేదికపై ఒక్కక్షణం ఏమైందో తనకు తెలియలేదని అన్నారు. 

ఏపీలో దేవుడి ఆస్తులకు రక్షణ ఏది?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి దుండగులు దేవాలయాల మీద దాడులు, విగ్రహాలను ద్వసం చేయడం సహా ఇతరత్రా ఆలయాలను పవిత్రతను పాడుచేసే చర్యలు యద్దేచ్చగా జరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం ఫిబ్రవరి 12,13 తేదీలలో నెల్లూరు జిల్లా బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో  రథాన్ని దుండగులు తగుల బెట్టారు.అంతకు ముందు కూడా పనిగట్టుకుని దేవాలయాలప పవిత్రతను చెరచే చర్యలు అనేక జరిగిన బిట్రగుంట సంఘటన తర్వాత దాడుల వెనుక దాగున్న కుట్ర మెల్ల మెల్ల మెల్లగా వెలుగులోకి రావడం ప్రారంభమైంది.అయినా  దాడులు ఆగలేదు సరికదా మరింత పెరిగాయి.  గత సంవత్సరం మే22 న జగన్ రెడ్డి ప్రభుత్వం సంవత్సర పాలన పూర్తయ్యే నాటికే ఆయన పాలనలో దేవాలయాలపై దాడుల సంఖ్య శతకాన్ని దాటింది. అదే క్రమంలో అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి రథం తగల బడింది. గత డిసెంబర్ 29 రామతీర్థంలో రాములోరి విగ్రహం తలను దుండగులు తీసేశారు.ఈ సంఘటన తర్వాత రాజకీయ వేడి రాజుకుంది.ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మొదటి సారిగా ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంపై స్పందించారు. ప్రభుత్వాన్ని నిందించారు. రామతీర్థం ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు.. ప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణంగానే రాష్ట్రంలో హిందూ దేవాలయలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ ఇతర హిందూ ధార్మిక సంస్థలుకూడా తీవ్రంగా స్పందించాయి.ఈనేపధ్యంలో జనవరి 17 న కర్నూల్ జిల్లా మంత్రాలయం నుంచి దేవాలయాల సందర్శన యాత్ర చేపట్టిన  త్రిదండి చినజీయర్ స్వామి రాయలసీమ జిల్లాల యాత్రను ముగించుకుని గురువారం తిరుమల శ్రీవేకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చినజీయర్ స్వామి.. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలు , దేవాలయాల ఆస్తులు దాడులకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నాటికీ అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  దేవాదాయశాఖ ఆధీనంలో 4లక్షల 60వేల ఎకరాల భూమి ఉందని తెలిపారు. దేవుని ఆస్తులను రక్షించవలసిన ప్రభుత్వాలు సక్రమంగా వ్యవహరించక పోవడం వలన ఇప్పటికే చాలావరకు దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయని చిన జీయర్ స్వామి అన్నారు. పర్యవేక్షణ లోపం కారణంగానే రాష్ట్రంలో అనేక దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు.  ఆలయాల యాత్రకు సంబందించి, రాయలసీమలో దాడులు జరిగిన 27 ఆలయాలను పరిశీలించానని...ఈ ఆలయాలలోని 17 ఆలయాలలో అభివృద్ధికి తీసుకోవాల్సిన పలు సూచనలతో ఓ విఙ్ఞాపన పత్రాని టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డికి అందజేసినట్లు చినజీయర్ స్వామి తెలిపారు. రాష్ట్రంలో చాలా ఆలయాలు అభివృద్దికి నోచుకోలేదని, ప్రభుత్వం వెంటనే వాటిని అభివృద్ధి చేయాలని కోరారు. ఆలయాలు బాగున్నప్పుడే ప్రజలలో నైతిక ప్రవృత్తి బాగుపడుతుందని  చిన్నజీయ్యర్ స్వామి చెప్పారు. అయితే అయిన వాళ్ళకు ఆకుల్లో కానీ వాళ్ళకు కంచాల్లో అన్నట్లుగాముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యమతాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ, హిందువుల పట్లవివక్ష చుపుతున్నారని, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సహా పలువురు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. 

కోడలిని రేప్ చేసిన మామ..

మహిళలకు సమాజంలో రక్షణ లేకుండా పోతోంది. ఇంటి బయటే కాదు. ఇంట్లోనూ భద్రత కరువైంది.అమ్మాయిలు ఇంట్లో నుండి ఒంటరిగా బయటికి వెళ్లాలంటే సొంత వాళ్ళు తోడు వెళ్లాల్సిన సమాజంలో బతుకుతున్నాం. అమ్మాయికి తోడుగా వెళ్లిన ఇంటి మనుషులే తోడేళ్లవుతున్నారు. తండ్రి లా చూసుకోవాలిసిన మామే.. కామంచో కుళ్ళు మూసుకుపోయి సొంత కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఢిల్లీకి చెందిన మామా, కోడలు వస్త్రాల వ్యాపారం చేసేందుకు  హైదరాబాద్ వచ్చారు. ఆ అమ్మాయి మామ ను తన తండ్రితో సమానం అనుకుంది. మామతో కలిసి ఆ యువతి నాంపల్లిలోని ఓ లాడ్జ్‌లో రూం తీసుకొని బసచేసింది.  కోడలి పై కన్నేసిన మామ రాత్రి  కోడలిపై మృగంలా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హబీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.  తన మామే తనపై బలవంతం చేశాడని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.