తోక కట్ చేస్తా.. గుట్కా ఎమ్మెల్యే ఖబడ్దార్
posted on Mar 8, 2021 @ 3:58PM
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలు, జగన్ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గుంటూరులో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు.. వైసీపీ నాయకుల చిల్లర రాజకీయాలు ఇక చెల్లవన్నారు. తన రాజకీయ జీవితంలో ఇంత చిల్లర రాజకీయాలు చూడలేదని ఆగ్రహం చంద్రబాబు వ్యక్తం చేశారు. పులివెందుల, మాచర్ల రాజకీయాలు సాగనీయమన్నారు చంద్రబాబు. అందరి తోక కట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.
స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిని మూడు ముక్కలు చేస్తే ఇక్కడ ఎమ్మెల్యేలకు సిగ్గు లేదా అన్నారు. గుట్కా ఎమ్మెల్యే ఖబడ్దార్ అని హెచ్చరించారు. గుట్కా ఎమ్మెల్యేకు మీరు ఊడిగం చేస్తే ... ఆ ఎమ్మెల్యే తాడేపల్లి వెళ్లి జగన్‌కు ఊడిగం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఓటు విషయంలో మరోసారి తప్పు చేస్తే మీ జీవితాలు అధోగతిపాలేనని చెప్పారు.
దేశంలోని అందరినీ ఇక్కడకు రప్పించేందుకు అమరావతి రాజధానిగా ఏర్పాటు చేశామని చెప్పారు. ఏ1 ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రం మూడు ముక్కలాటతో అందరినీ ఇతర ప్రాంతాలకు పంపుతున్నాడని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజలు కన్నెర్ర చేస్తే తాడేపల్లి నుంచి పారిపోతావ్ అని హెచ్చరించారు. టీడీపీ పాలనలో రౌడీయిజం, ఉగ్రవాదం, టెర్రరిజం లేకుండా చేశామన్నారు. నేను ఓట్లు కోసం రాలేదు.. మీ భవిష్యత్తు కోసం వచ్చానని వ్యాఖ్యానించారు. ఎవరికీ భయపడకుండా ఓటు వేయండి.. మీ ఓటు దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ బయటకు వస్తాడని చంద్రబాబు పేర్కొన్నారు.