సవాళ్ళకు జవాబు.. క్యాడర్ కు ప్రత్యేక శిక్షణ!
తెలుగు దేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఓవంక సుపరిపాలన ద్వారా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుంటూనే, మరో వంక పార్టీ పటిష్టతపై దృషి కేంద్రీకరించారు. గతంలో అధికారంలో ఉన్న ఐదేళ్లలో.. అప్పటి పరిస్థితులు, ముఖ్యంగా రాష్ట్ర విభజన విసిరిన సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కునే క్రమంలో .. చంద్రబాబు, స్టేట్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ నినాదంతో శక్తి యుక్తులు అన్నింటినీ రాష్ట్ర ప్రయోజనాలకే వెచ్చించారు. రాష్ట ప్రయోజనాలకు ఇచ్చిన ప్రాధాన్యత పార్టీకి ఇవ్వలేదు. పార్టీ పటిష్టత పై అంతగా దృష్టి పెట్టలేదు. ఫలితంగా పార్టీనే కాదు, రాష్ట్రం కూడా ఎంతగానో నష్ట పోయింది. వైసీపీ ఐదేళ్ళ సుందర ముదనష్ట పాలనలో.. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దశాబ్దాల కాలం వెనక్కి తీసుకు పోయారు.
గతంలోనే ఈ వాస్తవాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు.. మరో మారు అలాంటి అనర్ధం జరగ కుండా ఉండేందుకు, ఇప్పటికే చాల వరకు పట్టాల పైకి తెచ్చిన పరిపాలన పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూనే, పార్టీ పటిష్ఠతపై కూడా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని నిర్ణయించారు. అవును.. కింది స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై చంద్రబాబు దృష్టిని కేంద్రీకరించారు. ఇందులో భాగంగా.. తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, నియోజకవర్గాల వారీగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించారని పార్టీ నేతలు చెబుతున్నారు.
నిజానికి.. మారుతున్న పరిస్థితులకు, ముఖ్యంగా టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు, నూతన ఆవిష్కరణలకు అనుగుణంగా నూతన పద్దతులను అడాప్ట్ చేసుకోవడం, ఆచరణలో పెట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొట్టినపిండి. అంతే కాదు ఒక్క రాజకీయ, పరిపాలన రంగాలలోనే కాదు, ఏ రంగంలో అయినా టెక్నాలజీ సమర్ధవంతంగా వినియోగించుకోవడం అభివృద్దికి మూల మంత్రంగా చంద్రబాబు నాయుడు గట్టిగా విశ్వసిస్తారు. అదే విషయాన్ని ఆయన పలు సందర్భాలలో, అనేక వేదికల నుంచి ప్రస్తావించారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన తెలుగువన్ రజతోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొని చేసిన ప్రసంగంలోనూ.. చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. టెక్నాలజీ రంగంలో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుంటూ పాతికేళ్ళ విజయ ప్రస్థానం సాగించిన, తెలుగు వన్ చైర్మన్ కంఠంనేని రవిశంకర్ ను అభినందిచారు.
అలాగే.. ఇటీవల కాలంలో అన్ని రంగాలకు ఆయువు పట్టుగా మారిన సోషల్ మీడియా సమర్ధ వినియోగం పైనా చంద్రబాబు నాయుడ దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకే.. నియోజకవర్గాల వారీగా నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో సంస్థాగత విషయాలు.. రాజకీయ అంశాలతో పాటుగా, సోషల్ మీడియా సద్వినియోగం విషయంలోనూ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పార్టీ నేతల తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా కార్యకర్తలు, నాయకులకు రాజకీయ అవగాహన, రాజకీయ వ్యూహాల పట్ల అవగాహనా కల్పించడంతో పాటుగా.. స్వర్ణాంధ్ర విజన్ – 2047, పీ – 4 ఇనిషియేటివ్స్ ముఖ్య ఉద్దేశాలపై అవగాహన కల్పిస్తామని నేతలు చెప్పారు. అదే విధంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేలా చేయడం జరుగుతుందని తెలిపారు.
ఇప్పటికే కుప్పం, మంగళగిరి సహా మరి కొన్ని నియోజక వర్గాల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని మహానాడు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా, అన్ని నియోజక వర్గాల్లో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ముందుగా.. గత ఎన్నికల్లో ఓడిపోయిన విశాఖపట్నం నార్త్, చింతలపూడి, తెనాలి, పెనుగొండ,కనిగిరి నియోజక వర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, ఈ ఐదు నియోజక వర్గాల్లో శిక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత మంచి చెడులను సమీక్షించుకుని, రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ శిక్షణ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ సిద్దాంతం, పార్టీ లక్ష్యం, నాయకత్వ లక్షణాలు, సంక్షేమ పథకాల అమలుకు చేపట్టిన కార్యక్రమాలు, సోషల్ మీడియాని సమర్ధవంతంగా వినియోగించుకోవడ్డం వంటి పలు కీలక అంశాలపై ఎంపిక చేసిన క్రియాశీల కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాలలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. భవిష్యత్ లో ప్రొఫెసర్లు, ఇతర రంగాలకు చెందిన నిపుణుల సేవలను కూడా వినియోగించుకోవడం జరుగుతుందని అంటున్నారు. అదే విధంగా వైసీపీ సోషల్ మీడియా సాగించే ప్రభుత్వ వ్యతిరేక దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టేందుకు వీలుగా మండల స్థాయి నుంచి కార్యకర్తలకు సోషల్ మీడియా సమర్ధ వినియోగంపై శిక్షణ ఇవ్వడం కూడా శిక్షణలో భాగంగా ఉంటుందని అంటున్నారు.