గొల్లపూడిలో కొత్త శాటిలైట్ రైల్వే స్టేషన్ కోసం ఎంపీల వినతి
గొల్లపూడిలో కొత్త శాటిలైట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎంపీలు కేశినేని శివనాథ్, దగ్గుబాటి పురందేశ్వరి రైల్వేమంత్రిని కోరారు. దీనివల్ల విజయవాడ స్టేషన్‌పై భారం తగ్గుతుందని, అమరావతి కనెక్టివిటీ పెరుగుతుందని తెలిపారు. అలాగే, కొండపల్లి రైల్వే స్టేషన్ వద్ద నీటి సమస్యను పరిష్కరించి, రైళ్ల రాకపోకలకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలపై రైల్వే మంత్రి నిర్ణయం కీలకం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా శాటిలైట్ రైల్వే స్టేషన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గొల్లపూడి సమీపంలో శాటిలైట్ రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. వినతిపత్రం సమర్పించారు.
గొల్లపూడిలో శాటిలైట్/హాల్ట్ రైల్వేస్టేషన్ ఏర్పాటు చేస్తే విజయవాడ రైల్వేస్టేషన్ పై భారం తగ్గుతుందని ఎంపీలు వివరించారు. ఈ శాటిలైట్ స్టేషన్ ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం బల్బ్‌లైన్స్ చుట్టూ ఖాళీ స్థలాలున్నాయని, వాటిని రైల్వే అవసరాలకు సులభంగా సేకరించవచ్చని రైల్వేమంత్రికి వివరించారు. ఈ ప్రాంతం కొత్త రైలు, వాయుమార్గాలతో అనుసంధానం కానుందని.. అమరావతి రైల్వేలైన్ నిర్మాణం కూడా జరుగుతోందన్నారు. ఈ ప్రాంతం విజయవాడ నగరానికి అన్ని సౌకర్యాలకు సెంటర్‌గా ఉంది కాబట్టి, గొల్లపూడిలో హాల్ట్/శాటిలైట్ స్టేషన్ నిర్మించాలన్నారు.
అంతేకాదు కొండపల్లి రైల్వేస్టేషన్ దగ్గర నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. కొండపల్లి రైల్వేస్టేషన్ నుంచి కృష్ణా మిల్క్ యూనియన్ వరకు రైల్వే ట్రాక్‌పై నీరు చేరకుండా నీటి నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా ఎంపీలు కోరారు. ఈ రెండు సమస్యల పరిష్కారం వల్ల ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. కొండపల్లి రైల్వేస్టేషన్ నుండి విజయవాడలోని కృష్ణా మిల్క్ యూనియన్ వరకు ఉన్న రైల్వే ట్రాక్‌పై మురుగునీరు, వర్షపునీరు నిలిచిపోవడం వల్ల రైళ్ల రాకపోకలకు భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని వారు వివరించారు.
చిన్నపాటి వర్షం వచ్చినా ఇక్కడ నీరు నిలిచిపోతోందని, దీనివల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని ఎంపీలు కేశినేని శివనాథ్, దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రమంత్రికి తెలిపారు.ఈ సమస్యను పరిష్కరించడానికి, ట్రాక్ పక్కన డ్రైనేజీ కాలువలు, కల్వర్టులు నిర్మించి వర్షపునీరు సులభంగా వెళ్లిపోయేలా చూడాలని వారు కోరారు. ఇందుకోసం వెంటనే నిధులు కేటాయించి, పనులు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యల వల్ల రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ప్రయాణికుల భద్రత కూడా మెరుగుపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఎంపీల ప్రతిపాదనలపై రైల్వే మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
కొండపల్లి రైల్వే స్టేషన్ నుంచి విజయవాడలోని కృష్ణ మిల్క్ యూనియన్ వరకు ఉన్న రైల్వే ట్రాక్ వెంట మురుగునీరు, వర్షపు నీరు నిల్వ అవుతున్న సమస్యలను కూడా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవికి వివరించాను. వర్షాకాలంలోనే కాకుండా సాధారణ వర్షపాతం సమయంలో కూడా శాస్త్రీయంగా రూపొందించిన డ్రైనేజ్ నెట్వర్క్, క్రాస్ డ్రైనేజ్ నిర్మాణాలు, కాలువలు అనుసంధానం లేకపోవడం వల్ల ట్రాక్ వెంట మురుగు నీరు నిల్వవుంటుందని తెలియజేశాను.. ఈ నీటి నిల్వల వల్ల స్థానిక నివాసితులు, పరిశ్రమలు ముఖ్యంగా కృష్ణ మిల్క్ యూనియన్ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిపాను.
ఈ ప్రతిపాదనకు అమల్లోకి వస్తే విజయవాడ నగరంలో రైల్వే రవాణా మరింత సవ్యంగా మారడంతో పాటు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, రైల్వే భద్రత, పరిశ్రమలు, స్థానిక ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని ఆశభావం వ్యక్తం చేశాను.. ఈ ప్రతిపాదనలపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు సానుకూలంగా స్పందించారు' అంటూ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ ప్రతిపాదనలపై రైల్వే మంత్రి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.