జగన్ ఒక సీతయ్య.. ఎవరి మాటా వినడు!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తొందరపాటు నిర్ణయాల వల్ల ఆయనకు, ఆయన పార్టీకీ తీరని డ్యామేజ్ జరిగిందన్నది వాస్తవం. ఈ విషయం ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఆయనతో కలిసి పని చేసిన పార్టీ నేతలే కాదు, ఉన్నతాధికారులూ చెబుతున్నారు. వారి మాటల్లో చెప్పాలంటే జగన్ ఎవరి సలహాలూ, సూచనలూ స్వీకరించరు. తోచింది చేసేస్తారు. వాటి పర్యవశానాల వల్ల తనకు అత్యంత సన్నిహితులు, తనను నమ్ముకున్న వారూ నిండా మునిగిపోయినా పట్టించుకోరు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఏదో సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. సీతయ్య ఎవడి మాటా వినడు అని. జగన్ సీతయ్యకు మించి..ఆయన కూడా ఎవడి మాటా వినరు. వినకపోవడమే కాదు.. ఎవరైనా ఏదైనా చెప్పాలని ప్రయత్నించినా సహించరు. ఔను.. ఈ విషయం ఎవరో కాదు.. గతంలో జగన్ అధికారంలో ఉండగా సీఎస్ గా పని చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వయంగా చెప్పిన మాట.
ఇటీవల ఓ సందర్భంలో ఆయన జగన్ వర్కింగ్ స్టైల్ గురించి చెబుతూ, ఆయన చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారనీ, ముందు వెనుకలు ఆలోచించరనీ, ఎవరైనా చెప్పినా వినరనీ, అలా చెప్పడానికి ప్రయత్నించిన వారపై ఫైర్ అయిపోతారనీ చెప్పారు. జగన్ ఆ వైఖరి కారణంగానే ఆయనకూ, ఆయన పార్టీకీ కూడా భారీగా డ్యామేజి జరిగిందని వివరించారు. జగన్ తనంతట తానుగానే నిర్ణయాలు తీసుకుని ఇక వాటికే కట్టుబడి ఉంటారనీ, మంచి చెడ్డల గురించి చెప్పబోయినా వినిపించుకోరనీ వివరించారు. జగన్ తీరు కారణంగానే వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఎల్వీ చెప్పారు.
ఇందుకు జగన్ తీసుకువచ్చిన ఇసుక విధానమే పెద్ద ఉదాహరణ అని అయన అన్నారు. జగన్ సీఎంగా అధికార పగ్గాలు చేపట్టడానికి ముందు రాష్ట్రంలో ఇసుక ఉచితంగా లభ్యమయ్యేది. అయితే జగన్ అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు. జగన్ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. పలు కుటుంబాలు ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడింది. అలాగే మద్యం విధానం కూడా జగన్ ప్రభుత్వానికి పూడ్చలేనంత నష్టం చేసింది. జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా జగన్ ఇసుక, మద్యం విధానాల విషయంలో వెనక్కు తగ్గలేదు. అధికారులు ఏమైనా చెప్పబోయినా, నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది. ఇక మార్చేది లేదు. అని కరాఖండీగా చెప్పేసి వాళ్ల నోళ్లు మూయించే వారని ఎల్వీ సుబ్రహ్మణ్యం జగన్ హయాంలో అధికారుల అసహాయత, నిస్సహాయత గురించి వవరించారు.
జగన్ వైఖరి పట్ల పలువురు ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి చెందేవారనీ, ఈ యాటిట్యూడ్ ఏమిటని ఆశ్చర్యపోయారనీ కూడా ఎల్వీ వివరించారు. అన్నిటికీ మించి జగన్ ముఖ్యమంత్రి పదవి అంటే ఒక ప్రభుత్వోద్యోగం అన్నట్లుగా వ్యవహరించేవారిని ఎల్వీ గుర్తు చేసుకునే వారు. ఒక రాజకీయ నాయకుడి నుంచి అందరూ ఆశించే పనితీరు ఆయనలో మచ్చుకైనా కనిపించేది కాదన్నారు. ప్రజా సమస్యల పట్ల ఆయనలో ఇసుమంతైనా సీరియస్ నెస్ కనిపించేది కాదన్నారు. డబ్బు, అధికారం ఉంటే చాలు అన్నట్లుగా జగన్ తీరు ఉండేదన్నారు.
జగన్ ముందు చూపు లేని వ్యవహార శైలి కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారనీ, అందుకే జగన్ పట్ల స్వల్ప కాలంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందనీ వివరించారు. జగన్ తన నిర్ణయాల కారణంగా ప్రభుత్వం, ప్రజలూ కూడా ఇబ్బందుల్లో, సమస్యల్లో కూరుకుపోతున్నా కూడా జగన్ తాను చేసిందే రైట్ అని భావించేవారని ఎల్వీ సుబ్రహ్మణ్యం వివరించారు. మొత్తం మీద జగన్ ప్రభుత్వ పనతానికి పూర్తి కారణం ఆయనేనని ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పకనే చెప్పారు.