మీ కారు కాన్వాయ్ ఇంత చీకాకు పెడితే ఎలా సారూ!

ప్రభుత్వాధినేత ఎవరైనా సరే ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన జీవనం అందించేందుకు పాటుపడాలి. గత పాలకులకంటే తన పాలన మెరుగ్గా ఉందని నిరూపించుకోవడానికి పని చేయాలి. అలా కాకుండా స్వయంగా ఆయన వల్లనే జనం తీవ్రమైన ఇబ్బందులు పడేలా వ్యవహరిస్తే ఎలా? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి ప్రజలు ముఖ్యంగా హైదరాబాదీయులు సరిగ్గా ఇదే అనుకుంటున్నారు.  ఆయన ప్రగతి భవన్ నుంచి తన  ఫాం హౌస్ కు తరచూ చేసే ప్రయాణాలు హైదరాబాదీయులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ప్రగతి భవన్ నుంచి రాజీవ్ రహదారి మీదుగా ఆయన చాలా తరచుగా చేస్తున్నపర్యటనల పట్ల జనం చీకాకుపడుతున్నారు. ఆయన తిరగడానికి మేం ట్రాఫిక్ లో చిక్కుకుని యాతన పడాలా అని ప్రశ్నిస్తున్నారు. పైగా ఆయన ఈ ప్రయాణం హైదరాబాద్ లో అత్యంత రద్దీగా ఉండే సమయాలలోనే సాగుతుంది. ఉదయం విద్యార్థులు పాఠశాలలకూ, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే సమయంలోనూ.. అలాగే సాయంత్రం తిరిగి వారు ఇళ్లకు చేరే సమయంలోనూ కేసీఆర్ కాన్వాయ్ కోసం పోలీసులు ట్రాఫిక్ ను ఆపేస్తుంటారు. ప్రగతి భవన్ నుంచి బేగంపేట, ప్యాట్నీ సెంటర్, జూబ్లీ బస్టాండ్, తిరుమలగిరి చౌరస్తా, అల్వాల్ మీదుగా సాగే ఆయన పయనం.. ఆ దారిలో వెళ్లే వారికి నరకం చూపిస్తోంది. ఈ పరిస్థితి వారంలో కనీసంలో కనీసం రెండు సార్లు ఉంటుంది. అంటే వారంలో రెండు సార్లు ఉదయం, సాయంత్రం జనం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తా ట్రాఫిక్ లో ఇరుక్కుని చిక్కులు పడాల్సిందే. అంబులెన్సులు సైతం నిలిచిపోయినా పోలీసులు పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ ను ఆపడానికి పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరు వైపులా కనిపించే పోలీసులు సీఎం కాన్వాయ్ వెళ్లిపోగానే మాత్రం కనిపించరు. దీంతో కాన్వాయ్ వెళ్ళిన తరువాత అప్పటి వరకూ నిలిచిపోయిన వాహనాలు ఒకే సారి అన్ని వైపుల నుంచీ కదలడంతో ఆ ట్రాఫిక్ క్లియర్ కావడానికి మరో గంట, వెరసీ కనీసం రెండు గంటల పాటు సీఎం కాన్వాయ్ వల్ల ట్రాఫిక్ చిక్కులు ఎదురౌతున్నాయి. గతంలో ఏ సీఎం వల్లా ఇలా ట్రిఫిక్ ఇబ్బందులు ఎదురైన దాఖలాలు లేవు. ఎప్పుడో ఒక సారి ఏదో అత్యవసర పని మీద భారీ కాన్వాయ్ తో సీఎం కదిలారంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఇలా తరచూ క్యాంపుకార్యాలయానికీ, ఫాంహౌస్ కు తిరగడానికి గంటల తరబడి ట్రాఫిక్ నిలిపివేయడం ఎంత వరకూ సమంజసమని జనం విసుక్కుంటున్న పరిస్థితి ఆయన కాన్వాయ్ వెళుతున్న ప్రతి సందర్భంలోనూ కనిపిస్తోంది.   దేశానికే ఆదర్శవంతమైన అభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్  జనానికి ట్రాఫిక్ చుక్కలు చూపించే విషయంలో మాత్రం ఎవరికీ ఆమోదయోగ్యం కాని విధానాన్ని అవలంబిస్తున్నారు

ఏపీలో కొత్త సమీకరణాలు.. వైసీపీకి ప్రమాద ఘంటికలు

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది నానుడి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఆ నానుడికి అద్దంపట్టేవిగానే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాలుగేళ్ల కిందట మైత్రీ బంధాన్ని తెంచుకున్న తెలుగుదేశం, బీజేపీలు మళ్లీ దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాయా? ఏపీలో తెలుగుదేశంతో మైత్రి బీజీపీకి తెలంగాణలో రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందా? తెలంగాణ బీజేపీ నాయకత్వం ఏపీలో తెలుగుదేశంతో పార్టీ పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ అగ్రనాయకత్వానికి చెప్పిందా? అన్న ప్రశ్నలకు పరిశీలకులు ఔననే సమాధానం ఇస్తున్నారు.  తెలంగాణ కమలం పార్టీ అధికారం చేపట్టాలంటే తెదేపా సహకారం అవసరం అని  బీజేపీ అగ్రనాయకత్వం కూడా భావిస్తుండటం వల్లనే ఏపీలో హటాత్తుగా వైసీపీపై బీజేపీ ఉద్దేశపూర్వక దూరాన్ని పాటిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వినాయకమండపాలకు ఫీజులపై అటు బీజేపీ-ఇటు టీడీపీ సర్కారుపై ఏకకాలంలో దాడి చేయడం   ఆ రెండు పార్టీలూ దగ్గర అవుతుందనడానికి సంకేతమని పేర్కొంటున్నారు.  అదే కాకుండా బెజవాడలో ముర్ముతో టీడీపీ నేతల భేటీ వద్దంటూ వైసీపీ  బీజేపీపై ఎంత  ఒత్తిడి తసుకు వచ్చినా వినకుండా  ఆమెతో టీడీపీ నేతల భేటీ కి సోము వీర్రాజు వంటి నేతలు స్వయంగా పూనుకోవడాన్ని కూడా ఇందుకు ఉదాహరణగా పరిశీలకులు చూపుతున్నారు. అంతే కాకుండా ఉరుము లేని పిడుగులా హఠాత్తుగా  చంద్రబాబుకు   12+12 ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ పెంచడం  కూడా ఆ రెండు పార్టీలూ దగ్గర అవుతున్నాయనడానికి నిదర్శనమేనని అంటున్నారు. మోదీ-బాబు భేటీ తర్వాతే ఏపీ బీజేపీ వైసీపీ ఎదురుదాడి తీవ్రతను పెంచిందని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో మోడీ, చంద్రబాబు కొన్ని నిముషాల పాటు ముచ్చటించుకోవడాన్ని వైసీపీ వారు జీర్ణించుకోలేకపోవడం కూడా బీజేపీ, తెలుగుదేశం పార్టీల మధ్య సయోధ్య అన్న ఆలోచనే వైసీపీని వణికిస్తోందనడానికి ప్రబల నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నిటికీ మించి ఇటీవల అమరావతి మహిళా జేఏసీ ఉపరాష్ట్రపతిని కలసి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆయన దృష్టికి తీసుకువెళ్లింది. ఎంపీ గోరంట్ల మాధవ్ అంశంపై ఆయనకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ సందర్భంగా ఉపరాష్ట్రపతి చంద్రబాబు దార్శనికతను   ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో వణుకు పుట్టించాయని చెప్పక తప్పదు.  అందుకే మోడీని విమర్శించిన టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే అది వాళ్లిష్టం అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామృష్ణారెడ్డి వ్యాఖ్యానించారని అంటున్నారు. నిజానికి పొత్తులు అన్నది పూర్తిగా రెండు పార్టీలకు సంబంధించిన అంతర్గత వ్యవహారం.  ఆ విషయంలో ఎవరైనా ఎందుకు ఉలిక్కిపడాలో, ఎందుకు అభ్యంతరం చెప్పాలో అర్ధం కాని వ్యవహారం. ఇక చంద్రబాబుకు తాజాగా ఎన్ఎస్జీ భద్రత పెంపు విషయంలో కూడా వైసీపీ భుజాలు తడుముకుంటోంది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యంగా తయారవ్వడమే భద్రత పెంపునకు కారణమని ఎవరూ విమర్శలు గుప్పించకపోయినా స్వచ్ఛందంగా వివరణలు ఇచ్చుకుంటోంది. కమలం తీర్థం పుచ్చుకున్న ఇద్దరు నేతల వల్లే చంద్రబాబుకు భద్రత పెంచారని వైసీపీ విమర్శించడం బీజేపీ, తెలుగుదేశం పొత్తుపై ఆ పార్టీలో నెలకొన్న ఆందోళనకు, భయానికీ తార్కానంగా చెబుతున్నారు.

అస్సాంలో మ‌ద‌ర‌సా కూల్చివేత‌

అస్సాం బార్‌పేట జిల్లాలో ఒక మ‌ద‌ర‌సాను బుల్డోజ‌ర్‌తో కూల్చివేశారు. దీనికి ఉగ్ర‌వాద సంస్థ అల్‌ ఖైదాతో సంబంధాలున్నాయ‌న్న‌ది బ‌య‌ట‌ప‌డింది. బార్‌పేట జిల్లాలో బంగ్లాదేశ్ ఉగ్ర‌వాద సంస్థ అస్స‌రుల్లా బంగ్లా టీమ్‌లో సంబంధాలున్నాయ‌నే ఆరోప‌ణ‌ల‌పై అక్బ‌ర్ అలీ, అబుల్ క‌లాం అజాద్ అనే సోద‌రుల‌ను పోలీ సులు అరెస్టు చేశారు. ఆ త‌ర్వాత‌నే మ‌ద‌ర‌సాను కూల్చివేశారు.  ధకలియాపరా వద్ద ఉన్న మదరసా  టెర్రరిస్టు హబ్‌గా నడుస్తున్నందున తాము దాన్ని బుల్డోజరుతో కూల్చివేశామని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ  చెప్పారు.  దేశ వ్యతిరేక కార్యకలాపాలు, జిహాదీ సంస్థ ల కార్యకలాపాల్లో పాలు పంచుకోవడంతోపాటు ప్రభుత్వ భూమిలో ఉన్నందున దాన్ని కూల్చామని ప్రభుత్వ అద నపు కమిషనర్ లచిత్ కుమార్ దాస్ చెప్పారు. అంతకు ముందు ఆగస్టు 4వతేదీన కూడా అసోంలోని మోరిగావ్ జిల్లాలో ఒక మదరసాను కూల్చివేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం, విపత్తు నిర్వహణ చట్టం కింద రెండు మదర్సాలను కూల్చి వేశామని సీఎం హిమంత శర్మ చెప్పారు. ఈ ఏడాది అసోంలో ఐదు ఉగ్రవాద కుట్రలను ఛేదించి, పలువురి ని అరెస్టు చేశామని అసోం అధికారులు చెప్పారు. 

మ‌ళ్లీ రాజుకున్న క‌డియం, రాజ‌య్య విభేదాలు

ఒకే  ఒర‌లో రెండు క‌త్తులు  ఇమ‌డ‌వు. దీనికి పెద్ద  ఉదాహ‌ర‌ణ‌గా  టీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత‌లు కాపు రాజ య్య‌,  మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిగా చెప్పుకోవ‌చ్చు. చిత్ర‌మేమంటే ఇద్ద‌రిదీ నియోజ‌క‌వ‌ర్గం, రాజ‌కీయంగా ఒకే కారులో ప్ర‌యాణం. కానీ ఎజెండాల్లో తేడా వ‌చ్చింది. చాలాకాలం నుంచే వీరిద్ద‌రి మ‌ధ్య ఆధిప‌త్య‌పోరు తెర‌మీద‌కు వ‌స్తూనే ఉంది. ఒక‌రిపై ఒక‌రు అవ‌కాశం దొరికిన‌పుడ‌ల్లా మాట‌ల తూటాల‌తో విరుచుకుప‌డ‌టం తెలంగాణా ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూనే ఉన్నారు. ఇప్పుడిద్దరూ ఒకే పార్టీ కానీ.. ఒకప్పుడు రాజయ్య కాంగ్రెస్‌. కడియం టీడీపీ. అప్పట్లోనే ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేది. ఇప్పుడు ఒకే పార్టీ జెండా నీడన ఉన్నా నిల‌వ‌లేక‌పోతున్నారు.  కడియం శ్రీహరి పై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య  సంచలన వ్యా ఖ్యలు చేశారు. కడి యం శ్రీహరి 361 మంది నక్సలైట్ల ను పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలోనే  ఈ హత్యలు జరిగాయన్నారు. ఒక్క స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గం లోనే ఇంత మంది చనిపోయారని తెలిపారు.  వైఎస్సార్  నీ గురువైతే,  కేసీఆర్  నా దేవుడు. స్టేషన్ ఘన పూర్ నియో జకవర్గానికి నేను పూజారిని. స్టేషన్ ఘనపూర్ నా అడ్డా, ఎవరినీ అడుగు పెట్టనివ్వబోను అంటూ రాజయ్య శపథం చేశారు.  ఇప్పటికే రాజయ్య, కడియం మధ్య ఉప్పునిప్పుగా పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీలతో అభివృద్ధి జరగదని, ఎమ్మెల్యేలతోనే జరుగుతుందని ఇప్పటికే కడియం శ్రీహరిని ఉద్దేశించి రాజయ్య  వ్యాఖ్యలు చేసిన విష యం తెలిసిందే. ఈక్రమంలోనే తాజాగా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాలలోని ఓ కార్యక్రమంలో కడి యంను ఉద్దేశించి రాజయ్య చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాలి. నడిచే ఎద్దుకే ముళ్ళు కర్ర.. పండ్లున్న చెట్టుకే రాళ్లు. అంటూ  గ‌తంలో  టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య కడియం శ్రీహరి పై  గ‌తంలో  పరోక్ష విమర్శలు గుప్పించారు.  రాజకీయాల్లో ఎవరి ఎత్తు గడలు వాళ్ళకి ఉంటాయి. కేసీఆర్ సర్వే చూస్తే మీకు తెలుస్తుంది ఎవరు గొప్పనో.. చంద్రబాబు నాయకత్వం లో కడియం పనిచేసినప్పుడు జన్మభూమి లో జరిగితే కొన్ని పనులు జరగొచ్చు. కానీ తాను కేసీఆర్ నాయకత్వంలో అంతకు మించి పనులు చేస్తున్నా,  సాగునీటి రంగంలో స్టేషన్ గన్ పూర్ నంబర్ వ‌న్ గా ఉంద ని, ఇందిరమ్మ ఇళ్లు  త‌న హయంలోనే వచ్చాయ‌న్నారు. ఎవరు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తారో కాలమే నిర్ణయిస్తుంద‌ని రాజయ్య  వెల్లడించారు. 

అడుగు బయటపెట్టకుండానే అనుకున్నది సాధించారు!

సీపీఎస్ ఉద్యోగుల సెప్టెంబర్ 1 చలో విజయవాడ వాయిదా పడింది. ఈ విషయాన్ని  సీపీఎస్ ఉద్యోగులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ వాయిదా ప్రకటన ఒక లాంఛనం మాత్రమే. ఏపీలో సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం జరగకుండా చూసేదుకు ఏపీ సర్కార్ ఏకంగా వారిపై యుద్ధాన్నే ప్రకటించింది. బైండోవర్ కేసులు, ఉద్యోగులకు సెలవులు లేవంటూ నిబంధనలు విధించింది. దాదాపు నెల రోజులుగా ఉపాధ్యాయులపై వేధింపులు తీవ్ర తరం చేసింది. బ్యాస్కట్ బాల్, వాలీబాల్ వంటి ఆటల్లో మేన్ టు మేన్ అని ఒక వ్యూహం ఉంటుంది. సీపీఎస్ ఉద్యోగుల కట్టిడికి వైసీపీ అదే వ్యూహాన్ని అనుసరించినట్లు కనిపిస్తోంది. ఒక ఉద్యోగికి ఒక పోలీస్ అన్నట్లుగా పోలీసు వ్యవస్థను వినియోగించుకుంది. నోటీసులు ఇచ్చింది. విజయవాడ వెళితే ఖబడ్దార్ అని హెచ్చరించింది. ఇవి చాలవని భయపడిందో ఏమో విజయవాడలో వేలాది మంది పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. రాష్ట్రంలో ప్రభుత్వానికి సీపీఎస్ ఉద్యోగులకే మధ్య యుద్ధం జరుగుతోందా అన్న వాతావరణాన్ని కల్పించింది. సామాన్య జనం కూడా టీచర్ల ఆందోళనలను అణచివేయడానికి ఇంత చేయాలా అని భావించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇక జగన్ నివాసానికి వెళ్లే దారులన్నిటినీ ఇప్పటికే మూసేశారు. టీచర్లు ముట్టడించకుండా ఉండేందుకు ప్రభుత్వమే సీఎం ఇంటిని ముట్టడి చేసింది. చీమ కూడా ఆ ముట్టడిని దాటి రాలేని పరిస్థితి ఏర్పరిచింది.   రోడ్ల పక్కన నాలుగైదు అడుగుల ఎత్తున ఇనుప ముళ్ల కంచెలు పెట్టారు.   ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని ప్రకటించినది   రెండు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు మాత్రమే. ప్రభుత్వం మాత్రం మొత్తం రాష్ట్రమంతా ప్రభుత్వానికి, జగన్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తోందా అన్న లెవల్ లో చలో విజయవాడను భగ్నం చేయడానికి ఏర్పాట్లు చేసింది. వారు చివరి క్షణంలో అంటే సెప్టెంబర్ 1కి రెండు రోజుల ముందే వారు చలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు ప్రకటించినా.. ఇప్పటికే వారు సాధించాల్సింది సాధించేశారు. ప్రభుత్వాన్ని టెన్షన్ పెట్టారు, భయపెట్టారు. వారి చలో విజయవాడ పిలుపునకు ప్రభుత్వం వణికిపోయిందన్న భావన సామాన్య జనాలలో సైతం కలిగించగలిగారు. ఇది సీపీఎస్ ఉద్యోగుల ఘన విజయంగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం మాత్రంప్రభుత్వాన్ని వారిలా టెన్షన్ పెట్టడం పెద్ద సక్సెస్. ముందు ముందు దీన్ని కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. 

సీపీఎస్ ర‌ద్దుచేయాలి.. 1న  నిర‌స‌న‌ల‌కు ఉపాధ్యాయుల హెచ్చ‌రిక‌ 

పాల‌న‌తో ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకోవాల్సిన ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను మ‌రింత ఇబ్బందిపెడుతూ, అవ‌మానాల‌కు గురిచేయ‌డంవ‌ల్ల సాధించేదేమీ ఉండ‌దు. ఏపీలో ఉపాధ్యాయుల‌ప‌ట్ల ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు మ‌రీ దారుణ‌మ‌ని విశ్లేషకులు అంటున్నారు. మామూలు ఉపాధ్యాయుల‌ను పోలీసు స్టేష‌న్ల‌కు పిలిపించి వేధించ‌డం మ‌రీ దారుణ‌మ‌ని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మండిప‌డుతున్నారు.  తాము సీపీఎస్ రద్దు కోసం నిలబడి తీరుతామని  ఉపాధ్యాయుల నాయ‌కులు స్పష్టం చేశారు. అక్రమ నిర్బంధాలకు నిరసనగా ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతామని ప్రకటించారు. జిల్లా స్థాయి లోనూ, మండల స్థాయిల్లోనూ తమ నిరసనలు ఉంటాయన్నారు. ఉపాధ్యాయుల్ని నిర్బంధిస్తే కుటుంబ సభ్యులతో ఆందోళనలు చేయిస్తా మని బాలసుబ్రహ్మణ్యం హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణ‌యాల‌ను ప్ర‌శ్నించకూడ‌ద‌న్న శాస‌నం అర్ధంలేనిది. ప్ర‌శ్నించిన‌వారిని రాజ‌కీయ‌దాడికి పాల్పడుతున్నారంటూ వారి మీద క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు అని ఎమ్మెల్సీ వి. బాలసుబ్ర‌హ్మ‌ణ్యం ఆగ్ర‌హిం చారు.  ఉపాధ్యాయుల‌పై బైండోవ‌ర్ కేసులు న‌మోదు చేయ‌డం పై పీడీఎఫ్ ఎమ్మెల్సీలు తీవ్ర‌నిర‌స‌న  వ్య‌క్తం చేస్తున్నారు. హక్కుల కోసం నిరసన తెలుపుతుంటే కక్షసాధింపు చర్యలకు దిగటం దుర్మార్గమని అన్నా రు. ఉపాధ్యాయులు పండుగ చేసుకోరాద‌ని, అస‌లు బ‌డికే వెళ్ల‌వ‌ద్ద‌ని పోలీసు స్టేషన్ల‌కు పిలిపించ‌డం అనై తిక‌మ‌ని అన్నారు. రాష్ట్రంలో పాఠ‌శాల‌ల అభివృద్ధికి, ఉపాధ్యాయుల శ్రేయ‌స్సుకీ కంక‌ణం క‌ట్టుకుని ఉంద‌ని ముందు భారీ ప్ర‌చారాలు చేసుకున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీరా మూడేళ్ల త‌ర్వాత అస‌లు రంగు బ‌యట‌పెట్టార‌ని విమ‌ర్శ‌కులు అంటున్నారు. సిసిఎస్ ర‌ద్దుకోసం నిల‌బ‌డ‌తారా, ప్రాణాలు తీసుకుంటారా అనే సందేశాన్ని కిందిస్థాయి ఉద్యోగుల వ‌ర‌కూ ప్ర‌భుత్వ‌మే పంపింద‌ని ఉపాధ్యాయ‌ సంఘాల  నాయకులు, ఎమ్మెల్సీలు అన్నారు. ఇంత‌కంటే ప్ర‌భుత్వం వేరే దారుణమేమీ చేయ‌లేద‌ని ఆరోపించారు.  స్వతంత్ర ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ, బ్రిటీష్ కాలంలో కూడా  ఈ  తరహా నిర్బంధాలు ఉద్యోగులు ఎదుర్కోలేదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనే అడుగుతున్నామని అన్నారు. ఎన్నికల హామీలో పెట్టకుండానే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి  రాష్ట్రాలు సీపీఎస్ రద్దు చేశాయని గుర్తుచేశారు.  కాగా,  సీపీఎస్ రద్దు చేయకుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని  ఉత్తరాంధ్ర ఉపాధ్యా య ఎమ్మెల్సీ రఘువర్మ హెచ్చరించారు. లక్షన్నర ఉపాధ్యాయులతో పాటు వారి కుటుంబాల ఓట్లు తమతో ముడిపడి ఉన్నాయని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఓపీఎస్ పునరుద్ధరణ కోసం ఉద్యోగుల వెంట ఉద్య మిస్తామని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ అధ్యక్ష రేసులో కొత్త పేరు శశిథరూర్

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలో ఇంత వరకూ సుముఖత చూపలేదు సరికదా.. తమ కుటుంబానికి చెందని వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలన్న తన పాత మాటకే కట్టుబడి ఉన్నానని చెబుతున్నారు. అయితే సోనియా గాంధీ మాత్రం తమ కుటుంబానికి చెందిన వ్యక్తే పార్టీ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నారు. తన బిడ్డలిద్దరిలో ఆమె రాహుల్ వైపే మొగ్గు చూపుతున్నారు. రాహుల్ గాంధీయే పార్టీ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఈ విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతలోనే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్ ను ఖరారు చేసేశారు. మల్లికార్జున్ ఖర్గే వంటి నేతలైతే రాహులే తమ నాయకుడనీ, ఆయనకు ప్రత్యామ్నాయం లేదనీ అంటున్నారు. ఇక రాహుల్ అంగీకరించకపోతే.. అశోక్ గెహ్లాట్ కు పగ్గాలు అప్పగించాలని సోనియా భావించినా.. అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించారని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు పేర్లు వినిపించాయి. తాజాగా ఇప్పటి వరకూ రేస్ లో లేని శశిథరూర్ పేరు తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఆయన పోటీ పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.  ఎందుకంటే పార్టీలో సంస్థాగత సంస్కరణలు అనివార్యం అంటూ రెండేళ్ల కిందట పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన జీ23 నేతలలో ఎంపీ శశిథరూర్ కూడా ఒకరు. తాజాగా ఒక మళయాళ పత్రికకు రాసిన వ్యాసంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒక్క అధ్యక్ష స్థానానికే కాకుండా సీడబ్ల్యుసీలో ఖాళీగా ఉన్న స్థానాలకు కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం చాలా అవసరమని ఆ ఎన్నికే పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావడానికి నాంది అవుతుందని శశిథరూర్ ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 22న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడుతుంది.  ఎన్నిక అక్టోబర్ 17న జరుగుతుంది. అదే నెల 19న ఫలితం వెలువడుతుంది. కాగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇప్పటి వరకూ రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. తొలి సారి 1997లో జరిగాయి. ఆ ఎన్నికలో శరద్ పవార్, రాజేష్ పైలట్, సీతారాం కేసరిలో పోటీ చేశారు. సీతారాం కేసరి విజయం సాధించారు. ఆ తరువాత 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికలో జితేంద్రప్రసాదర్ సోనియాగాంధీపై పోటీ చేశారు. ఆ ఎన్నికలో సోనియా గాంధీ ఘనమైన మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికలో సోనియా గాంధీకి 7448 ఓట్లు వచ్చాయి. జితేంద్రప్రసాద్ కు కేవలం 94 ఓట్లు వచ్చాయి. అయితే ఈ సారి మాత్రం పోటీ జరిగితే గతానికి భిన్నమైన పరిస్థితి ఉంటుందన్నది మాత్రం నిర్వివాదాంశం. ఈ సారి ఎన్నికలలో తాను రంగంలో ఉంటానని శశిథరూర్ తన వ్యాసం ద్వారా చెప్పకనే చెప్పారు.  గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తికే పార్టీ అధ్యక్ష పదవి అన్నది అనివార్యమైతే పోటీలో ఉండే వారి సంఖ్య బారీగానే ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.

రాజాసింగ్ ...  బీజేపీ అర్ధ‌ర‌హిత రాజ‌కీయ నాట‌కం

నాట‌కానికి మంచి న‌టులు కావాలి. అప్పుడే ర‌క్తిక‌డుతుంది. కానీ బీజేపీవారి నాట‌కానికి ప్ర‌త్యేకించి న‌టు ల‌ను వెతుక్కోన‌వ‌స‌రం లేదు. తెలంగాణాలో పార్టీ నిండా న‌టులేన‌న్న ఆరోప‌ణ‌లు బాగా విన‌ప‌డుతున్నా యి. బీజేపీ గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీనుంచి స‌స్పెండ్ చేయ‌డం పెద్ద డ్రామా అని తెలం గాణా రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తున్న విశ్లేష‌కులే అంటు న్నారు. తాజాగా మ‌జ్లీస్ అధినేత ఎంపీ అస‌దు ద్దీన్ ఒవైసీ అన్నారు. క‌ర్ణాట‌కాలో గ‌ణేష్ చ‌తుర్ధి సంద‌ ర్భంగా మాంసాహారంపై నిషేధం విధించ‌డ మేమి ట‌ని ఆయ‌న మండిప‌డ్డారు.    బెంగళూరులో మాంసాహారాన్ని నిషేధించడం ద్వారా బీజేపీ ప్రపంచానికి ఏం సందేశం ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని ఓవైసీ  ప్రశ్నించారు. మాంసం అమ్మేవారిలో ఎక్కువ మంది ముస్లిం వర్గానికి చెందిన వాళ్లు ఉన్నారన్న అక్కసుతోనే మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తున్నారని ఒవైసీ అన్నారు.  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పలు స్టేషన్లకు వరుస ఫిర్యాదులు అంద‌డంలో రాజాసింగ్‌ను షాహినాయత్‌ గంజ్‌ పోలీసు లు అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు సోషల్‌ మీడియాలో రాజా సింగ్‌ పెట్టిన వీడియోపై మజ్లిస్‌ ఆందోళనలు చేపట్టింది. మనోభావాలు దెబ్బతీశారంటూ పలు పోలీసు స్టేషన్ల ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు.  రాష్ట్రంలో రెచ్చగొట్టే  ధోరణితో బీజేపీ బలపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నదని  టీఆర్ ఎస్ నేత‌లు కూడా ఆరో పిస్తున్నారు. రాజాసింగ్‌తో ఆ ప్రకటన చేయించి,  ఆయనపై సస్పెన్షన్ వేటు  డ్రామా న‌డ‌ ప‌డం ఎవ్వ‌రికీ తెలియ‌ద‌నుకోవ‌డమే బీజేపీ అవివేక‌మ‌ని టీఆర్ ఎస్ నేత‌ల మాట‌. తెలంగాణ ప్రజలు వీటిని జాగ్రత్తగా గమనించాలని కోరారు. బీజేపీ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కల్పించి రాజకీయ ప్రయోజ నాలు పొందాలని చూస్తున్నదన్నారు. టీఆర్ఎస్ క్యాడర్‌ను రెచ్చగొట్టి ప్రతీకార దాడులు జరిపించుకోవాలని తీవ్రప్రయత్నం చేస్తున్నదన్నారు. కానీ, కేసీఆర్‌ది, టీఆర్ఎస్‌ది అలాంటి ఆలోచన లు కావని , టీ ఆర్ఎస్ క్యాడరే తిరగబడితే రాష్ట్రంలో బీజేపీ ఉంటుందా? అని  టీఆర్ ఎస్ సీనియ‌ర్ నేతలు హెచ్చ‌రి స్తు న్నారు.  అస‌లు మునావ‌ర్ హైద‌రాబాద్ షో గురించి ఎవ్వ‌రికీ లేని అభ్యంత‌రాలు రాజాసింగ్‌కే రావ‌డంతోనే ఘ‌ర్ష ణ‌కు ప‌రిస్థితులు దారితీశాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మహ్మద్‌ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో  భగ్గుమన్న ఎంఐఎం శ్రేణులు పాతబస్తీలో ఆందోళన చేపట్టాయి. రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల ఫిర్యాదుతో యూట్యూబ్‌ రాజాసింగ్‌ వీడియోను తొలగిం చింది. ఇలాఉండ‌గా,  శాంతియుతంగా ఉండే తెలంగాణలో కల్లోలం సృష్టించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఆయన పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారని హోంమంత్రి మహమూద్‌ అలీ ఆగ‌ష్టు 29న‌ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయ‌న్నారు. అందుకే ప్రముఖ బ‌హుళ‌జాతి కంపెనీలు త‌మ కార్యాల‌యాల‌ను ఇక్క‌డ ఏర్పాటు చేసుకోవ‌డానికి ఆస‌క్తి చూపుతున్నాయ‌న్న‌ది బీజేపీ గుర్తించాల‌ని హోం మంత్రి అన్నారు.  బండి సంజయ్‌ వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనం. సైబర్‌ నేరాల అదుపులో, నేరాల నమోదు, నేరస్తుల అరెస్టులు, డబ్బుల రికవరీ, శాంతిభద్రతల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు.  దేశంలోని మరే ఇతర రాష్ట్రం చేయని విధంగా రాష్ట్ర పోలీసులు ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని మొఘల్‌ సరాయిలో సైబర్‌ నేరస్తుల నుండి రూ.9 కోట్లను రికవరీ చేశారు. కానీ బీజేపీ వారికి ఇవేమీ క‌న‌ప‌డ‌వు, విన‌ప డ‌వు. కేవ‌లం గోల చేసి లేని స‌మ‌స్య‌ల్ని సృష్టించి రాష్ట్రంలో రాజ్యాధికారం చేజిక్కించుకోవాల‌న్న ఆతృ తే బీజేపీ క్యాడ‌ర్ క‌న‌ప‌రుస్తోంది. వారికి అరిచి గోల‌చేయ‌డం మీద‌నే ఎక్కువ ఆస‌క్తి అనే విమ‌ర్శ‌లు రాష్ట్ర మంత‌టా ఉన్నాయన్న‌ది  విమ‌ర్శ‌కుల మాట‌.  తెలంగాణా బీజేపీ నేత‌ల‌కు కేంద్రంలో ఉన్న‌వారిని ఎలాగ‌యినా ఆక‌ట్టుకోవాల‌న్న ఆతృత‌, కేంద్రంలో ఉన్న బీజేపీ సీనియ‌ర్ల‌కు రాష్ట్రంలో ఉన్న‌వారిని ఉసిగొలిపి మ‌రీ రాష్ట్రంలో గొడ‌వ‌లు, పార్టీల క్యాడ‌ర్  మ‌ధ్య విభేదాలు సృష్టించేందుకు ఉత్సాహ‌ప‌ర‌చ‌డం త‌ప్ప వేరే కార్య‌క్ర‌మం ఏమీ ఉండ‌డం లేద‌న్న‌ది ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూనే ఉన్నారు. గ‌ట్టిగా ఏ స‌మ‌స్యా లేకున్నా మ‌త‌ప‌ర‌మైన చిన్న అంశం అడ్డుపెట్టుకుని మ‌రీ రెచ్చిపోయి దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డం బీజేపీ నేత‌లు బాగా అల‌వ‌ర్చుకున్నారు. అటు ఆంధ్రాలో కూడా తాజాగా గ‌ణేష్ మండ‌పాల విష‌యంలో లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. విగ్ర‌హాలు, మండ‌పాల విష‌యంలో అక్క‌డి ప్ర‌భుత్వం ఇప్ప‌టికే సంబంధిత యాజ‌మాన్యాల‌కు త‌గిన సూచ‌న‌లు చేసింది. అయినా వాటికి సంబంధించి స్వ‌యంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేయాల‌న్న ప‌ట్టుద‌ల అర్ధంలేని ద‌ని వైసీపీ, కాంగ్రెస్ కూడా మండిప‌డుతున్నాయి. 

చావనైనా చస్తా కానీ కాంగ్రెస్ లో చేరను.. గడ్కరీ

నితిన్ గడ్కరీ.. బీజేపీలో నిన్న మొన్నటి వరకూ ఓ వెలుగు వెలిగిన నేత. నాగపూర్ సంబంధాలతో పార్టీలో, ప్రభుత్వంలో మోడీతో సమానుడిగా అంతా భావించిన నాయకుడు. ఒక సమయంలో మోడీకి ప్రత్యామ్నాయం ఎవరన్న చర్చ వచ్చినప్పుడు నిర్ద్వంద్వంగా అంతా గడ్కరీ పేరే చెప్పారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న నాయకుడు నేడు బీజేపీలో ఎవరికీ కొరగాని నేతగా మారిపోయారు. అందుకు మోడీషా మ్యాజిక్కే కారణమన్న విమర్శలు, అభిప్రాయాలూ వెల్లువలా వ్యక్తమయ్యాయి. అందుకు గడ్కరీ స్వయంకృతం కూడా కొంత వరకూ కారణమన్న అభిప్రాయం బీజేపీ శ్రేణుల్లోనే వ్యక్తమైంది. మోడీ కేబినెట్ లో స్వతంత్రంగా వ్యవహరించే ఏకైక మంత్రిగా గడ్కరీకి తిరుగులేని గుర్తింపు ఉంది. ఆ స్వతంత్ర వైఖరే మోడీ, షా ద్వయానికి రుచించలేదని పరిశీలకులు అంటారు. మోడీ ప్రమేయం లేకుండానే బీజేపీయేతర రాష్ట్రాలలో జాతీయ రహదారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం, రైల్వే లైన్లకు ఓకే చెప్పేయడం వంటి చర్యలతో మోడీ షా ద్వయానికి గడ్కరీ దూరమయ్యారని అంటారు. ఆ కారణంగానే ఆయనకు ప్రాధాన్యత గణనీయంగా తగ్గిపోయింది. ఆ అసంతృప్తితోనే రాజకీయాలంటే అధికారమేనా, సేవ కాదా అంటూ నిర్వేదంతో వైరాగ్యం ఒలికేలా మాట్లాడారు గడ్కరి. దీంతో పార్టీలో ఆయన ఎగ్జిట్ కు ఆయనే బాటలు వేసుకున్నట్లైంది. అత్యంత కీలకమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డులో స్థానం కోల్పోయారు. ఇది ఆయనలో అసంతృప్తిని మరింత పెంచింది. ఈ నేపథ్యంలోనే గడ్కరీ పార్టీ మారుతారంటూ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన కాంగ్రెస్ గూటికి చేరుతారన్న వార్తలు కూడా వినవస్తున్నాయి. దీంతో గడ్కరీ ఆ ప్రచారానికి తెర దించాలని భావించారు. అందుకే తాను పార్టీ మారే ప్రశక్తే లేదనీ, బీజేపీలోనే కొనసాగుతాననీ స్పష్టం చేశారు. అయినా తాను పార్టీ మారడమేమిటి? మారితే అది కూడా కాంగ్రెస్ లో చేరడమేమిటని ఆశ్చర్యపోయారు. చావనైనా చస్తా కానీ కాంగ్రెస్ లో మాత్రం చేరనని కుండబద్దలు కొట్టేశారు. అయినా ఇప్పుడేమిటి..  దివంగత కాంగ్రెస్ నేత, తనకు స్నేహితుడు అయిన శ్రీకాంత్ జిచ్కార్ చాలా కాలం కిందటే తనను కాంగ్రెస్ లో చేరాల్సిందిగా ఆహ్వానించారని గడ్కరీ చెప్పారు. అప్పుడే ఆయనకు బావిలో దూకి చస్తాను కానీ కాంగ్రెస్ గూటికి మాత్రం చేరనని ఆయనకు స్పష్టం చేశానని గడ్కరీ వివరించారు.  కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తనకు నచ్చవన్నారు. తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి, ఇప్పుడు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  

చీమలు చంపేస్తున్నాయి!

 శివుడాజ్ణ లేకుండా చీమ కుట్టదంటారు. అలా కుడితే కుట్టీ కట్టంగానే చస్తుందని కూడా చెబుతారు. కానీ ఎల్లో క్రేజీ యాంట్స్ మాత్రం శివుడాజ్ణ తీసుకుని మరీ దండెత్తుతున్నాయా అన్న రేంజ్ లో భయందోళనలకు కారణమౌతున్నాయి. తమిళనాడులోని కరంతమలై రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లోని ఓ ఏడు గ్రామాలను చీమలు హడలెత్తిస్తున్నాయి. ఈ చీమలను ఎల్లో క్రేజీ యాంట్స్ అంటారు. ఇవి అటవీ ప్రాంత సమీపగ్రామాలను బెంబేలెత్తించడమే కాదు.. ఆ గ్రామాల ప్రజల జీవనోపాధిపైనా దాడి చేస్తున్నాయి. ఈ గ్రామాల ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం, పశువుల పెంపకం. అయితే చీమల దాడి ఆ జీవనోపాధినే దెబ్బతీసేంత తీవ్రంగా ఉంది. మనుషులను అవి కుట్టవు కానీ పాకితే చాలు ఒంటిపై పొక్కులు వస్తున్నాయి. చీమలు దండుగా వస్తుండటంతో తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. వీటి కారణంగా చాలా మంది ఊళ్లు వదిలేసి వేరే ప్రాంతాలకు వలస వెడుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఇవి చిన్నచిన్న కీటకాలను, పురుగులను చంపేస్తుంటాయి. స్థానిక జాతుల కీటకాలు, చీమల పుట్టల్ని ఆక్రమించి వాటిని నాశనం చేస్తుంటాయి. ఒకటని కాదు ఏది దొరికితే దానిని తినేస్తాయి.సమస్యలు ఇక్కడితో తీరడం లేదు. చీమల వల్ల కుందేళ్ల సంతతి గణనీయంగా తగ్గిపోయింది.  ఈ చీమలు కుట్టకపోయినా అవి విడుదల చేసే ఒక రకమైన రసాయనం (యాసిడ్) వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పశువులకు ప్రాణహాని కలుగుతోంది. అవి విడుదల చేసే యాసిడ్ కారణంగా చర్మం పొట్టురాలిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ చీమల బెడదను అరికట్టేందుకు కీటక సైంటిస్టులు, అటవీశాఖ అధికారులు ప్రయత్నాలను ప్రారంభించారు. గతంలో ఆస్ట్రేలియాలోని ఒక ఐలెండ్ లో ఎర్రచీమల బెడద తీవ్రమైన సందర్భంగా హెలికాప్టర్ ద్వారా మందులను పిచికారీ చేసి సత్ఫలితాలను సాధించారు. ఇప్పుడు ఆ దిశగా అధికారులు ప్రయత్నాలు చేయనున్నారు.  

కేసీఆర్ బీహార్ పర్యటన.. జాతీయ రాజకీయాల దిశగా మరో అడుగా?

మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో తన నాయకత్వంలో పోరాటం చేయాలన్న తన ఆకాంక్షను నెరవేర్చుకునే దిశగా కేసీఆర్ మరో అడుగు వేస్తున్నారు. ఈ నెల 31(బుధవారం)న ఆయన బీహార్ పర్యటనకు వెళుతున్నారు. బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వాన్ని కూలదోసి మహాఘట్ బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో భేటీ అవ్వడానికి కేసీఆర్ బీహార్ వెళుతున్నారు. వీరి భేటీలో బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ కూడా పాల్గొంటారు. ఈ పర్యటనకు కారణంగా కేసీఆర్ గతంలో ప్రకటించిన విధంగా గాల్వాన్ ఘర్షణలో మరణించిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయడానికే అని చెబుతున్నప్పటికీ సాకు అదే అయినా అసలు కారణం మాత్రం రాజకీయ వ్యూహాలను ఖరారు చేసుకునేందుకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పర్యటన సందర్బంగా కేసీఆర్ గాల్వాన్ ఘర్షణలో అమరులైన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయడంతో పాటు హైదరాబాద్ లో టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్ కు చెందిన కార్మికుల కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం అందజేస్తారు.  అదలా ఉంటే.. రాజకీయంగా మాత్రం కేసీఆర్ బీహార్ పర్యటన అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో లంచ్ భేటీలో ఇరువురూ జాతీయ రాజకీయాలపై చర్చించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇటీవల నితీష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా 2024 ఎన్నికలలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన లక్ష్యం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని కేసీఆర్ గత కొంత కాలంగా ప్రతి సందర్భంలోనూ చెబుతున్నారు. అలాగే బీహార్ ఉప ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ కూడా బీహార్ లో బీజేపీ పనైపోయింది.. ఇక ఢిల్లీ నుంచి బీజేపీని పంపేయడమే మిగిలిందని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఒకే లక్ష్యంతో ఉన్న ముగ్గురు నేతల భేటీపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. నిన్న మొన్నటి వరకూ ఎన్డీయే కూటమిలో ఉన్న జేడీయూ ఇటీవలే కూటమితో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ బీజేపీయేతర రాష్ట్రప్రభుత్వాలను కూలదోయడానికి ఎత్తులు వేస్తుంటే.. నితీష్ కుమార్ వ్యూహాత్మకంగా బీహార్ లో ఎన్డీయే సర్కార్ ను కూల్చి బీజేపీ వ్యతిరేక పార్టీలలో ఒక ఉత్సాహాన్ని నింపారని పరిశీలకులు అంటున్నారు. దీంతో జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలను మళ్లీ కొత్తగా ప్రారంభించేందుకు కేసీఆర్ తన తొలి అడుగు బీహార్ లో వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఈ  నేపథ్యంలోనే సీఎం కేసీఆర్.. బీహార్ పర్యటన ప్రధాన్యత సంతరించుకుంది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని ప్రకటించిన కేసీఆర్.. కలిసి వచ్చే పార్టీలతో సమావేశమవుతున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ (పశ్చిమ బెంగాల్), సమాజ్ వాదీ పార్టీ (ఉత్తర ప్రదేశ్), డీఎంకే (తమిళనాడు), ఆమ్ ఆద్మీ పార్టీ (ఢిల్లీ) అధినేతలతో భేటీ అయ్యారు. పలువురు నేతలు హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్‌తోనూ భేటీ అయ్యారు. రెండు రోజుల కిందట 26 రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించారు. గత కొంత కాలంగా ఎక్కడ సభ జరిగినా.. ఎవరితో భేటీ అయినా సందర్భం ఏదైనా కేసీఆర్ బీజేపీ ముక్త్ భారత్ జపమే చేస్తున్న సంగతి విదితమే.   

కేంద్రం ఆదేశాలు సరే.. కేసీఆర్ ఏం చేస్తారు?

ఎట్టకేలకు రాష్ట్ర విభజన  చట్టంలోని ఒక అంశంపై కేంద్రంలో కదలిక వచ్చింది. ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు నెల రోజుల్లో చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.  రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ డిస్కమ్ లకు విద్యుత్ సరఫరా చేసినందుకు ఏపీకి విద్యుత్ అసలు వ్యయం  రూ.3వేల 441 కోట్లు, ఆలస్యానికి సర్ చార్జీగా రూ.3వేల 315 కోట్లు చెల్లించాలని కేంద్రం తెలంగాణను ఆదేశించింది. అంటే మొత్తం మూడు వేల ఏడు వందల కోట్లకుపైగా తెలంగాణ సర్కార్ ఏపీకి చెల్లించాల్సి ఉంది. అయితే ఈ విద్యుత్ బకాయిల చెల్లింపు వివాదం 2017 నాటిది. విభజన చట్టంలో ఉందని అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం 2014 నుండి మూడేళ్ల పాటు తెలంగాణకు కరెంట్ సరఫరా చేసింది. అయితే సరఫరా చేసిన విద్యుత్ కు తెలంగాణ డబ్బులు చెల్లించకపోవడంతో నిలిపివేసింది. ఆ మూడేళ్ల పాటు సరఫరా చేసిన దానికీ తెలంగాణ సర్కార్ ఇంత వరకూ డబ్బులు చెల్లించలేదు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఎక్కువ ఉందన్న కారణంగా.. విభజన చట్టంలో 57 శాతం కరెంట్ ను తెలంగాణకు కేటాయించారు. ఏపీకి కేవలం 43 శాతం కేటాయించారు. అదనంగా ఇస్తున్న కరెంట్‌కు తెలంగాణ డబ్బులు చెల్లించాలి. మూడున్నరేళ్ల పాటు కరెంట్ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అడిగి.. అడిగి చివరికి ఏపీ ప్రభుత్వం కరెంట్‌ సరఫరాను తెలంగాణ ప్రభుత్వానికి నిలిపి వేసింది. అయినప్పటికీ కరెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో (ఎన్సీఎల్టీ)కేసు వేసింది. తెలంగాణ జెన్కోను దివాలా దీసినట్లుగా ప్రకటించి తమకు రావాల్సిన నిధులు తమకు ఇప్పించాలని కోరింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత  ఎన్సీఎల్టీలో పిటిషన్ ఉపసంహరించుకుంది. రెండున్నరేళ్ల పాటు ఒక్క రూపాయి చెల్లించమని అడగలేదు. కానీ గత సెప్టెంబర్‌లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విద్యుత్ సరఫరా చేసినందుకు రూ.3,441 కోట్లు.. 2017 జూన్ నాటికి రూ.2,841 కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉందని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. మరో వైపు తెలంగాణ సర్కార్ ఏపీకి తాము ఇవ్వడం కాదు.. తమకే ఏపీ ఇవ్వాలని అంటోంది. ఏపీ నుంచే తమకు ఐదు వేల వరకూ కోట్లు ఇవ్వాల్సి ఉందని.. లెక్కలు చూసుకుందాం రమ్మంటే రావడం లేదని ఆరోపిస్తోంది. ఈ వివాదం ప్రస్తుతం హైకోర్టులో ఉంది. అయితే కేంద్రం వద్ద తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి జగన్.. ఆ డబ్బులు ఇవ్వాలని ఆదేశాలు తెప్పించుకున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ   ఎలా స్పందిస్తుందన్నది కీలకం. ఇప్పటికే   అప్పులు కూడా పుట్టక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ ఇప్పుడు కొత్తగా కోర్టులో ఉన్న దానికి డబ్బులు చెల్లించమంటే.. సీఎం అంగీకరిస్తారా అన్నది కీలకం.  ఇప్పటికే కేంద్రం ఆదేశాలను తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తప్పుపట్టారు. ఏకపక్షంగా బకాయిలు చెల్లించాలంటూ ఆదేశాలు ఇవ్వడాన్ని దేశ ద్రోహ చర్యగా అభివర్ణించారు. కేంద్రం తెలంగాణ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదనడానికి ఇదే ఉదాహరణ అని జగదీశ్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేయాలన్నదే కేంద్రం కుట్ర అని తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన చేసిన ఒక ట్వీట్ లో ఏపీ విద్యుత్ సంస్థలే తెలంగాణకు 12 వేల941 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై కేంద్రానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నఫలితం లేకపోయిందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన నిర్ణయాలను జీర్ణించుకోలేకే కేంద్రం ఇలాంటి ఆదేశాలు జారీ చేసిందని విమర్శించారు. దీనిని బట్టే కేంద్రం ఆదేశాల విషయంలో తెలంగాణ వైఖరి ఏ విధంగా ఉండబోతోందో అర్ధమౌతోందని పరిశీలకులు అంటున్నారు. కోర్టులో ఉన్న అంశంపై కేంద్రం ఇలా ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేయడం వల్ల ఉపయోగం ఉండదనీ విశ్లేషిస్లున్నారు. 

15 వసంతాలు పూర్తి చేసుకున్న ఎన్టీవీ

తెలుగు లోగిళ్లలో ఏ ఇంట చూసినా.. ఏ న్యూస్‌ వీక్షించాలన్నా.. ఇప్పుడు ఎన్టీవీ.. అంతలా తెలుగు వీక్షకులు ఎన్టీవీతో కనెక్ట్‌ అయ్యారు.. 2007 ఆగస్టు 30వ తేదీన ఎన్టీవీ 24 X 7 తెలుగు న్యూస్‌ చానెల్‌ను ప్రారంభించారు.. రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ తుమ్మల నరేంద్ర చౌదరిగారు..  ఆ తర్వాత.. భక్తి టీవీ, వనిత టీవీలతో ప్రజలకు మరింత చేరువయ్యారు.. ఆధ్యాత్మిక పరమయిన ఏ కార్యక్రమాలు చూడాలన్నా భక్తి టీవీ పెట్టాల్సిందే. మహిళల్లో మరింత చైతన్య భావాలు కలగాలంటే వనితా టీవీ చూడాల్సిందే అనేలా వాటిని తీర్చిదిద్దారు. మహిళల కోసం దక్షిణ భారత దేశంలో తొలి చానల్‌ ప్రారంభించిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ఇప్పుడు ఎన్టీవీ తెలుగు న్యూస్‌ చానెల్‌ నంబర్‌ వన్‌గా కొనసాగుతోంది.. దాదాపు గత ఏడాది కాలంగా.. తనకు సాటిలేదంటూ నంబర్‌ వన్‌గా దూసుకుపోతోంది.. అంతేకాదు 15 ఏళ్ల పండుగకు సిద్ధమైంది..  ఈ 15 ఏళ్ల ప్రయాణం అంత సులువుగా సాగింది ఏమీ కాదు.. జర్నలిజం అంటే ఒక బాధ్యత.. ఒక కట్టుబాటు.. కత్తిమీద సాము అనే చైతన్యంతో తన జర్నీని ప్రారంభించింది.. అప్పటికే 24X7 న్యూచానెళ్లు తెలుగులో ఉన్నా.. లైవ్‌లు అంతంత మాత్రమే.. ఎన్టీవీ ఎంట్రీతో ఆ సీన్‌ మారిపోయింది.. ప్రతీక్షణం.. ప్రత్యక్ష ప్రసారం.. ప్రతీక్షణం.. ప్రజాహితం అంటూ.. ఎప్పటికప్పుడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతీ ప్రాంతం నుంచి.. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా న్యూస్‌ టెలికాస్ట్‌ చేసింది.. వార్తలు చెప్పడంలో విలక్షణత చూపిస్తూ జనం గొంతుకగా నిలిచింది. ఓబీ వ్యాన్లతో వార్తా ప్రసారాల స్థాయిని పెంచుతూ అసలు లక్ష్యం ప్రజాహితమే అంటూ దూసుకెళ్లింది.. ప్రతి వార్తకీ ప్రజలే కేంద్రం కావాలి. ప్రతి కార్యక్రమానికీ ప్రజాహితమే లక్ష్యం కావాలి.. జనాకాంక్షకు ప్రతిక్షణం ఎన్టీవీ వేదిక కావాలన్న లక్ష్యంతో.. కేవలం వార్తా ప్రసారాలకే పరిమితం కాకుండా.. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజలతో మమేకం అయ్యింది. ఆది నుంచి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడంలో తన ప్రత్యేకతను చాటుకుంది ఎన్టీవీ.. విద్యార్థులు, ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించేలా జాతీయ గీతాలాపన నిర్వహించింది.. 'మన దేశం - మన గీతం' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జాతీయ గీతాలాపనలో కోట్లాది మందిని కదిలించింది. ఇక, ఎన్నికల సర్వేలు అంటే ఎన్టీవీవి పెట్టింది పేరు.. ఎన్టీవీ సర్వేలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.. అవి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచాయి. ఇలా ఎన్టీవీ ఎప్పటికప్పుడు వార్తా ప్రసారాల్లో కొత్త ట్రెండ్‌ సృష్టిస్తూ వచ్చింది.. అంతే కాదు.. మరో వైపు ట్రెడిషన్‌ను కూడా ఫాలో అవుతూ వచ్చింది.. కోటీదీపోత్సవం పేరుతో ప్రతీ ఏడాది ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు ప్రత్యేకంగా బస్సు సర్వీసులు నడుపుతారంటే.. ఆ కార్యక్రమానికి ప్రజల్లో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకోవచ్చు.. సనాత ధర్మ పరిరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది.. పీఠాలను, పీఠాధిపతులను, ధర్మకర్తలను ఇలా ఎంతో మందిని కోటి దీపోత్సవం పేరుతో సామాన్యులకు చేరువ చేసింది.. దిగ్విజయంగా 15వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈ సుదీర్ఘ దిగ్విజయమైన జర్నీలో యాజమాన్యం కమిట్‌మెంట్‌ అసాధారణమైనది.. అదే స్థాయిలో ఉద్యోగుల నుంచి యాజమాన్యానికి అసాధారనమైన సపోర్ట్‌ లభించింది.. ఇక, ఉద్యోగులకు ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుకున్నారు చౌదరి గారు.. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి.. ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది.. అది మీడియా రంగాన్ని కూడా తాకింది.. అలాంటి సమయంలోనూ యథావిథిగా తన ఉద్యోగులకు సాలరీస్‌   అందించారు.. 15 వసంతాలు పూర్తి చేసుకున్న ఎన్టీవీ.. మరింత దిగ్విజయంగా ముందుకు సాగాలని ఆశిద్దాం..

నార్వే... అర్ధ‌రాత్రి సూరీడి అద్దం!

సూర్యోద‌యం, సూర్యాస్త‌మ‌యం చూడాలంటారు పెద్ద‌వాళ్లు. మ‌నిషిలో ఉత్సాహాన్ని జీవితం మీద ఆస‌క్తిని పెంచుతుందంటారు. ఆ మాట ఎలా ఉన్నా క‌వులు, అందులోనూ సినీ క‌వులు ఆ రెంటినీ బ్ర‌హ్మాండంగా వ‌ర్ణిస్తూ పాటల‌తో అల‌రించారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ ఏదీ ఎక్కువ రోజులు భ‌రించ‌లేం. ప‌గ‌ల యినా, చీక‌ట‌యినా.  ప్ర‌పంచంలో కొన్ని ప్రాంతాల్లో రాత్రి స‌మ‌యం మ‌రికొన్ని ప్రాం తాల్లో ప‌గ‌లు అవు తుంది. ఇది వింటేనే ఇంత చిత్రంగా ఉంటే, అస‌లు ప‌గ‌టి కాల‌మే ఎక్కువ‌గా ఉన్న ప్రాంతం గురించి వింటే మ‌రెంత ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. అవును అలాంటి ప్రాంత‌మే నార్వే స్వాల్బార్డ్‌. ఇక్క‌డ ప్ర‌తీ ఏడూ ఏప్రిల్ 22 నుంచి ఆగ‌ష్టు 22 వ‌ర‌కూ అంతా పండ‌గ వాతావ‌ర‌ణ‌మే ఉంటుంది. ప్ర‌జ‌లు ఎన్నో శుభ కార్యాలు చేస్తూంటారు. ముఖ్యంగా ఆర్కిటిక్ స‌ర్కిల్ ప్రాంతంలోనివారు. కార‌ణం ఇక్క‌డ మ‌ధ్య‌రాత్రి స‌మ‌యం లోనూ సూర్యుడు క‌న‌ప‌డ‌తాడు! ఈ ప్రాంతం స‌గం నార్త్‌పోల్‌, నార్వేకి మ‌ధ్య‌లో ఉన్న కార‌ణంగా అంతా అద్భుతంగా, ఆశ్చ‌ర్య‌క‌రంగానే ఉంటుంది. గ‌డియారం ప్ర‌కారం అర్ధ‌రాత్రి అయిన‌ప్ప‌టికీ వేడుక‌ల‌కు కొద‌వ ఉండ‌దు. స‌ముద్రం మీద వేల్ స‌ఫారీలు లేదా పెద్ద పెద్ద కెర‌టాల‌ను విరుస్తూ స‌ర్ఫింగ్‌కి యువ‌త పోటీప‌డుతుంటారు. ఇంకా చిత్ర‌మేమంటే, పెద్ద‌వాళ్లు, అమ్మాయిలు అంతా క‌లిసి ఏకంగా ఆ స‌మ‌యంలో గోల్ఫ్ ఆడ‌టం! అలాగే సైక్లింగ్‌, స‌ముద్రం మీద ప‌డ‌వ‌ల పోటీల‌కు వెళ్ల‌డం ...అబ్బో అదో మ‌హ‌దానంద ప్ర‌వాహం. అదో ఆనంద హేల‌! స్వాల్డార్డ్ ద్వీపాలు పోలార్ బేర్‌ల‌కు నివాస ప్రాంతాలు. కానీ పెద్దగా వాటినుంచి ప్ర‌మాదం ఉండ‌ దంటారు ఇక్క‌డి వారు. చాలామంది దీవిలో కూచుని రాత్రంగా బాతాఖానీ కొడుతుంటారు. అచ్చం మ‌నం ప‌గ‌లు రోడ్ల‌మీద‌, పార్కుల్లోనో కూచుని మాట్లాడుకుంటున్న‌ట్టుగా. ఎండాకాలం అంతా సూర్య‌డు అలా ప్ర‌ద‌క్షి ణా లు చేస్తూనే ఉంటాడు. అంద‌రినీ త‌నతో పాటు తిప్పుతాడు.  అక్క‌డ ఆధునిక‌త సంత‌ రించుకున్న లాంగ్యార్ బైన్ ప‌ట్ట‌ణం ప‌లు సంస్కృతులకు కేంద్రం. అక్క‌డ అనేక ర‌కాల సంప్ర‌ దాయాల‌వారు క‌లిసి ఆట‌పాట‌లు, తిండీ, ఆట‌ల‌తో కాలం తెలియ‌కుండా గ‌డిపేస్తుంటార‌ట‌. హోట‌ళ్లు, బార్లు, రెస్టారెంట్లు అన్నీ ఫుల్ బిజీ! కొత్త‌వారు త‌ప్ప‌కుండ ఎవ‌రో ఒక‌రి సాయంతో న‌గ‌ర ప్ర‌వేశం చేయాల్సిందే. లేకుంటే చిన్నపిల్ల‌లు సంత‌లో త‌ప్పిపోయిన‌ట్టు అవుతుంది. గుర్తించ‌ డం,ప‌ట్టుకోవ‌డం చాలా క‌ష్ట‌మైపోతుందిట‌. ఇక్క‌డి వేష‌భాష‌లు, ప్ర‌జ‌ల తీరుతెన్నుల్లో వ్య‌త్యాసాలు అన్నీ కొత్త‌వారిని ఖంగారుపెట్ట‌క‌పోవు.  అర్ధ‌రాత్రి సూరీడుని చూసి తీరాలి. బ‌హు విచిత్ర రంగుల్లో ప‌ట్ట‌ణాల‌ను రంగు రంగుల కాంతుల‌తో క‌ప్పేసి ప్ర‌జ‌ల‌కు ఎంతో మాన‌సిక ఉల్లాసాన్ని క‌లిగిస్తాడు. క‌వులు, గాయ‌కుల‌కు ఇది ముఖ్యంగా ఆ స‌మ‌యం స్వ‌ర్గంలో  ఉన్న‌ట్టే! ప్ర‌కృతి స‌హ‌జ అందంలో ప్ర‌జ‌లు ఆనంద‌డోలిక‌ల్లో తేలిపోతూంటారు. అదో పొయి ట్రీ. చూసి, త‌రించి తీరాల్సిందే. ఫిన్‌మార్క్‌, ట్రామ్స్‌, లోఫ్టోన్‌, వెస్ట‌ర్లాన్, హెల్గెలాండ్‌, బోడో, సాల్తాన్ వంటి ప్రాంతాల్లోనూ ప్ర‌జ‌లు ఈ ఆర్ధ‌రాత్రి సూర్యుడితో కాలం గ‌డుపుతుంటారు. అదో అద్భుతం, అదో అందం. ఫోటోగ్రాఫ‌ర్ల‌కు, ఆర్టిస్టుల‌కు ఇదో స్వ‌ర్గం. రోజుకో అద్భుతాన్ని, అందాన్ని చూసి త‌రించ‌ డంలో కాలం గ‌డిచిపోతుంది. 

పోలవరం ఇంక అంతేనా జగన్?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గందర గోళంలో పడింది. ప్రాజెక్టును ఎప్పటికి పూర్తిచేస్తామో చెప్పలేమని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పదే పదే చెబుతున్నారు.  ప్రతిపక్షనాయకుడి హోదాలో జగన్ ఇచ్చిన హామీలకు, ప్రస్తుతం సీఎంగా ఆయన మాటలకు పొంతన లేకుండా పోయింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అప్పట్లో జగన్ చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్నదానికి ఏమాత్రం పొంతన లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఘాటు విమర్శలు చేశారు. ప్రాజెక్టు నిర్మాణం ఇంత ఆలస్యమా అని నిందించారు. అంచనాలు పెంచేశారని ఆగ్రహించారు. నిర్వాసితుల ముఖాల్లో ఆనందం చూసేందుకు వారి డిమాండ్లు నెరవేర్చలేరా అని టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రంతో పోరాడలేరా? అని నిలదీశారు. అలాంటి జగన్ తన మాట ఇప్పుడు మార్చేశారు. కాడి కింద పడేశారు. మడమ తిప్పేశారు, మాట తప్పేశారు.  ఇదంతా నేను ఒక్కణ్ణ్ని చేసేది కాదు కదా కేంద్రాన్ని అడుగుతా.. ఒత్తిడి చేస్తా.. వాళ్లు నిధులిస్తే మీకు అందిస్తా.. లేకపోతే నేనేం చేయగలను అని బేలగా ప్రకటించి చేతులెత్తేశారు. అధికారంలోకి రాగానే పోలవరం అవినీతిని తేల్చేస్తానంటూ ఓ కమిటీని జగన్ నియమించారు. ఆ కమిటీ రేపో మాపో అవినీతి వరద లోతుల్ని తేల్చేస్తుందని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కమిటీ నివేదిక ఇచ్చినా ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జగన్ అధికారంలోకి రాగానే పోలవరం పనులను ఆపేశారు. 2019 నవంబరులో రివర్స్ టెండరింగ్ పేరుతో గుత్తేదారును మార్చి, మేఘా  ఇంజినీరింగ్ కంపెనీకి పనులు అప్పగించారు. ఆ తర్వాతైనా పోలవరం పనులు వేగం పుంజుకున్నాయా? అంటే అదీ లేదు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణాలను సకాలంలో పూర్తిచేయలేదు. దీంతో 2019, 2020లలో డయాఫ్రం వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట భారీగా ఇసుక కోత ఏర్పడి ప్రాజెక్టు భవితవ్యానికి పెను సవాల్ విసిరింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసంపైనా జగన్ ఆడిన మాట తప్పారు. పోలవరం ప్రాజెక్టుకు భూములిచ్చిన వారికి రూ.5 లక్షలు ఇస్తామని నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రకటించారు. ఇప్పటికీ ఆ ప్రకటనకు అతీగతీ లేదు. పునరావాస ప్యాకేజీ రూ. 10 లక్షలకు పెంచుతామని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం గరిష్ఠంగా ఎస్టీలకు రూ.6.86 లక్షలు ఇస్తున్నారు. గిరిజనేతరులకు రూ.6.36 లక్షలే ఇస్తున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంపై రకరకాల గడువులు చెప్పారు. 2021 డిసెంబర్ నాటికి పూర్తిచేస్తామని తొలుత ప్రకటించారు. ఆనక 2022 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తిచేసి నీళ్లిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ మాటలన్నీ నీటిమూటలయ్యాయి. పోలవరం ప్రాజెక్టుపై జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు   చేతులెత్తేశారు. ప్రాజెక్టు పూర్తిచేస్తామని రెండేళ్లుగా నమ్మించిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందంటే సమస్యలు ఎవరి హయాంలో తలెత్తాయనే ప్రశ్నలు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలంటే నిధులే కీలకం. ఇప్పటికీ రెండో డీపీఆర్ కు ఆమోదం లేదు. 2019 ఫిబ్రవరిలో 55 వేల 549 కోట్ల రూపాయలకు సాంకేతిక సలహా కమిటీ పోలవరం అంచనాలు ఆమోదించింది. ఆ తర్వాత కేంద్రం దీన్ని రివైజ్డ్ కాస్ట్ కమిటీకి  అప్పజెప్పింది. ఆ కమిటీ 47 వేల 726 కోట్ల రూపాయలకు అంచనాలు ఆమోదించింది. పోలవరం తాజా అంచనాలకు ఇంతవరకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలపలేదు. కేంద్రం కొర్రీలపై కొర్రీలు వేస్తున్నా ఏపీ సర్కార్ పరిష్కరించుకోలేకపోతోంది. నాడు డీపీఆర్ ఆమోదించు కోలేకపోయారని విమర్శించిన జగన్ ఇప్పుడు.. 'పోలవరం నిధులు కేంద్రం ఇవ్వడం లేదు.. మనం కిందా మీద పడుతున్నాం. వెయ్యి కోట్లో, 2 వేల కోట్లో అయితే నేనే ఇచ్చేసేవాణ్ణి. వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వాలి. నేనేం చేయగలను' అని ఎదురు ప్రశ్నిస్తుండడం గమనార్హం. ఏపీలో అన్ని ఎంపీ స్థానాల్లోనూ వైసీపీని గెలిపిస్తే.. ప్రత్యేక హోదా సాధిస్తా, కేంద్రం నుంచి అన్నీ తెస్తా అని ఎన్నికల్లో ఓట్లు అడిగిన జగన్ రాష్ట్రపతి ఎన్నిల్లోనూ, పలు కీలక బిల్లుల విషయంలో కేంద్రానికి బేషరతుగా ఎందుకు మద్దతు ఇస్తున్నారు? రాజ్యసభలో, లోక్ సభలో ఎందుకు మద్దతిస్తున్నారు? పోలవరం డీపీఆర్-2 ఆమోదం పొందేలా కేంద్రంపై ఒత్తిడి ఎందుకు చేయడం లేదు.. అనే విమర్శలు వెల్లువెత్తుతున్నా జగన్ స్పందించడం లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలు మూడేళ్లుగా అవస్థలు పడుతున్నాయి. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తయిన తర్వాత గోదావరి వరదనీరు వెనక్కి ఎగదన్ని ముంపు గ్రామాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. నిర్వాసితుల వరద కష్టాలు కళ్లారా చూసినా వరదల సమయానికి కూడా వైసీపీ ప్రభుత్వం కనీసం తొలిదశ పునరావాసం ఎందుకు పూర్తి చేయలేకపోయిందనే ప్రశ్నలు ప్రతిపక్ష టీడీపీ సంధిస్తోంది. తొలిదశలో 20 వేల 946 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 8 వేల 272 కుటుంబాలకే కల్పించింది. పునరావాస కాలనీలు ఇంకా పూర్తికాలేదు. పునరావాస ప్యాకేజీ అందలేదు. వరద ముంపును తట్టుకోలేక నిర్వాసితులు గోకవరం, జంగారెడ్డిగూడెం, చర్ల వంటి చోట్లకు వలస వెళ్లి అద్దె ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్నారు. నెలకు 6 వేల నుంచి 8 వేల రూపాయల వరకు అద్దెలు భరిస్తున్నారు. జగన్ చెప్పినట్లు ‘మా ముఖాల్లో ఆనందం చూడటం అంటే ఇదేనా?’ అని నిర్వాసితులు నిలదీస్తున్నారు. ఏటా వరదల ముందు అందరినీ తరలించేస్తామని మూడేళ్లుగా ప్రణాళికలు రచిస్తున్నా ఇప్పటికీ అది కార్యరూపం దాల్చపోవడాన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

యాత్ర‌లందు బీజేపీ యాత్ర‌లు వేరయా..!

యాత్ర‌లు ప‌లు ర‌కాలు. భ‌క్తులు దూర‌ప్రాంతాల్లోని పెద్ద‌పెద్ద దేవాల‌య ద‌ర్శ‌నానికి చేసే యాత్ర‌లు, హిమాల‌యాల‌కు వెళ్లే జ‌నం యాత్ర‌, అయ్య‌ప్ప దీక్ష‌లుప‌ట్టి వెళ్ల‌వారి యాత్ర‌. ఇప్పుడు రాజ‌కీయ‌ప‌ర‌మైన కాషాయ‌రంగుతో కొత్త‌గా విన‌ప‌డుతున్న‌ది బీజేపీ యాత్ర‌. ఈ యాత్ర రాజకీయ‌ప‌ర‌మై దండ‌యాత్ర‌కు కాస్తంత త‌క్కువ స్థాయిది. దీనికి కార్య‌క‌ర్త‌లు, పెద్ద పెద్ద పార్టీ ప‌తాకాల‌తో వీల‌యిన‌న్ని ర‌క‌ర‌కాల బ‌ళ్ల‌ మీద నాయ‌కుని వెంట వేలంవెర్రిగా చేసే యాత్ర‌. దీనికి ల‌క్ష్యం కేవ‌లం రాజ‌కీయ ల‌బ్ధి. కేవ‌లం ఆయా ప్రాంత పాల‌కుల మీద గొంతు చించుకోవ‌డానికి, నినాదాల‌తో హోరెత్తిండం దాని ల‌క్ష్యం. రాజ‌కీయంగా త‌మ స్థిర‌త్వాన్ని నిరూపించుకోవ‌డానికి, త‌మ స‌త్తాను ప్ర‌జ‌ల‌కు, పాల‌క‌వ‌ర్గీయుల‌కు గ‌ట్టిగా తెలియ‌జేయ‌డానికి, త‌మ‌ను మించిన‌వారు వేరెవ్వ‌రూ ల‌భించ‌ర‌న్న ప్ర‌చారం చేసుకోవ‌డంలో ఉవ్వె త్తున భారీ ప్ర‌చార‌హోరుతో చిన్నా చిత‌కా నాయ‌కులు ఊరేగే యాత్ర‌. దీనికి కేవ‌లం త‌మ పార్టీ నీడలో బాగా ప్ర‌శాంతంగా ఉండ‌వ‌చ్చ‌న్న న‌మ్మ‌కం క‌లిగించ‌డానికి వీల‌యిన‌న్ని తిట్ల దండ‌కంతో విప‌క్షాల‌మీద విరుచుకుప‌డే అవ‌కాశం ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్ర‌భుత్వాల‌ను నిర్వీర్యం చేసి అధికారంలోకి రావ‌డానికి బీజేపీ శాయ‌శ‌క్తులా కృషి చేస్తోంది. ఎలాగ‌యినా రెండు రాష్ట్రాల సీఎంలు ప్ర‌జాభిమానాన్ని పొంద‌ని నాయ‌కులుగా ప్ర‌చారం చేసి త‌మ పార్టీయే ప్ర‌జాసంక్షేమాన్ని నిజంగా కోరుకుంటోంద‌న్నది ప్ర‌చార హోరుతో ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టు కుంటూ అధికారంలోకి వ‌చ్చేయాల‌న్న ఆకాంక్ష‌తో బీజేపీ రెచ్చి పోయి రాజ‌కీయ యాత్ర‌లు చేప‌డుతోంది. ఏదో ఒక‌స‌మ‌స్య‌ను సృష్టించ‌డ‌మో, ఉన్న‌దాన్ని కాస్తంత విమ‌ర్శ‌ల కారం పూసి పాల‌క‌ప‌క్షాన్ని మ‌రింత విసిగెత్తించి అస‌హ‌నాన్ని అనుకూలం చేసుకోవ‌డంలో బీజేపీ నాయ‌కుల మేధోశ‌క్తి మ‌రెవ‌రికీ ఉండ‌దు. అది వారికి వెన్న‌తో పెట్టినవిద్య‌. నిన్న మొన్న‌టివ‌ర‌కూ తెలంగాణాలో భారీ ప్ర‌ద‌ర్శ‌న‌లు, స‌మావేశాల‌తో ఊద‌ర‌గొట్టారు. కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని, పాల‌నా విధానాన్ని, ప‌థ‌కాల అమ‌లు అన్నింటా ప్ర‌జ‌ల్ని మోసం చేశార‌ని ఘాటుగా విమ‌ర్శిస్తూ ప్ర‌జ‌ల అభిమానాన్ని పొందేందుకు బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు కూడా ఢిల్లీ నుంచి తెలంగాణా యాత్ర‌లు చేశారు. అక్క‌డ మునుగోడు ఉప ఎన్నిక ల‌క్ష్యంతో ప్ర‌జ‌ల్ని ఓట‌ర్ల‌ను త‌మ వేపు తిప్పుకోవ‌డానికి వేయాల్సిన వ‌ల‌ల‌న్నీ ప‌న్ని వేశారు, వేస్తున్నారు.  ఇపుడు కాస్తంత స‌మ‌యం తీసుకుని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాయ‌ల‌సీమ వేపు మ‌రో యాత్ర‌కు బీజేపీ సిద్ధ‌ ప‌డింది. రాయలసీమ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మరోయాత్ర కు రాష్ట్ర బిజేపీ నిర్ణయం తీసుకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు  యాత్రకు నాయకత్వం వహించనున్నారు. బీజేపీ బలోపేతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. 25 చోట్ల బహి రంగ సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానా లకు వ్యతిరేకంగానూ, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు నాయకులు వివరిం చను న్నారు.  కేవ‌లం త‌మ‌కు దేశంలో ప్ర‌తిప‌క్షం ఉండ‌కూడ‌ద‌న్న యావ‌తోనే ఇటువంటి యాత్ర‌ల‌తో  విప‌క్షాల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేయ‌డానికి, ప్ర‌జ‌ల‌ను మ‌రింత సందిగ్ధంలో ప‌డేయ‌డానికి పూనుకున్నారేగాని వాస్త వానికి కేంద్రంలో త‌మ పాల‌న విష‌యంలో త‌లెత్తుతున్న వ్య‌తిరేక‌త‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం మేలు. కానీ వారికి ద‌క్షిణాదిన ఎలాగ‌యినా ప‌ట్టు సాధించాల‌న్న ల‌క్ష్య‌మే జీవిత ల‌క్ష్యంగా మారింది.  

నేను రాజకీయాల్లో లేకుండా ఉంటే బీజేపీ వాళ్ల నాలుకలు చీరేసేదాన్ని.. మమత

మమతా బెనర్జీ మరోసారి కేంద్రంపైనా, బీజేపీపైనా తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. తాను రాజకీయాలలో లేకుండా ఉన్నట్లైతే వారి (బీజేపీ) నాలుకలు చీరేసి ఉండేదాన్నని ఆగ్రహం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ర్యాలీని ఉద్దేశించి మమతా సోమవారం (ఆగస్టు 29) ప్రసంగించారు.   బీజేపీ వారు అందరిపైనా ‘దొంగలు’ అన్న ముద్ర వేస్తున్నారని విమర్శించారు.  కేంద్ర దర్యాప్తు సంస్థలు, బీజేపీకి అక్రమంగా సంక్రమించిన సొమ్ముతో రాష్ట్రాలలో ప్రజలెన్నుకున్న బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చివేయాలని ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు.2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీని ఓడించి తీరుతానని శపథం చేశారు. తమను వ్యతిరేకించే వారందరిపైనా బీజేపీ ‘దొంగలు’ అన్న ముద్ర వేస్తోందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్న మనమంతా దొంగలం, ఒక్క బీజేపీ పార్టీ, ఆ పార్టీ నాయకులు మాత్రమే సచ్ఛీలురు అన్నట్లుగా వారి ప్రచారం ఉందన్నారు.  తనతో సహా తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేతలు  ఫిర్హాద్ హకీమ్, అభిషేక్ బెనర్జీ వంటి సీనియర్ నేతలకు వ్యతిరేకంగా దుర్మార్గమైన ప్రచారానికి బీజేపీ  తెరలేపిందన్నారు.  తాజాగా ఫిర్హాద్ హకీమ్ కు కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులు జారీ చేశాయనీ, బహుశా హకీమ్ ను త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉందని మమతా బెనర్జీ అన్నారు. ఒక వేళ హకీమ్ ను అరెస్టు చేసినా ఎవరూ ఖంగారు పడవద్దనీ, ఆయనపై నమోదు చేసింది తప్పుడు కేసేననడంలో సందేహం లేదనీ మమతా బెనర్జీ అన్నారు. \కేవలం ఆయనను వేధింపులకు గురి చేసేందుకే బీజేపీ తప్పుడు కేసులు బనాయిస్తున్నదని విమర్శించారు. తృణమూల్ నేతల వద్ద కట్టల కొద్దీ సొమ్ము ఉందంటూ బీజేపీ వారు ఆరోపణలు చేస్తున్నారనీ, వాస్తవంగా రాష్ట్రాలలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ వారికి అంత సొమ్ము ఎలా సమకూరిందో వారే చెప్పాలన్నారు. హవాలా ద్వారా బీజేపీ కోట్లాది రూపాయలను విదేశాలలో దాచేసిందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీని ఓడించి తీరాలన్నారు. బేటీ బచావో గురించి మాట్లాడే బీజేపీ బిల్కిస్ బానో అత్యాచార దోషులను ఎలా విడుదల చేసిందని మమతా బెనర్జీ ప్రశ్నించారు. బిల్కిస్ బానో అత్యారార దోషులపై చర్యలకు డిమాండ్ చేస్తూ తాను కోల్ కతాలో 48 గంటల పాటు ధర్నా చేయనున్నట్లు మమతా బెనర్జీ ఈ సందర్భంగా వెల్లడించారు. 

ఇక  యూపీఐ చెల్లింపుల‌పై ఛార్జీలు..  ఆర్బీఐ

 యుపిఐ చెల్లింపులు దేశంలో ఇప్పుడు కొత్త‌కాదు. న‌గ‌దు లావాదేవీలు యుపిఐ ఇపుడు  మ‌రింత సుల‌భ త‌రం చేసింది. అంతేగాక‌, అనేక రంగాల‌కు చెందిన వారి వాణిజ్య‌, వ్యాపార అవ‌కాశాల‌కు మ‌రింత వీలు క‌ల్పించింది. అయితే దేశంలో ఇపుడు ఆర్బీఐ అలాంటి యుపీఐ చెల్లింపుల మీద చార్జీల మోత‌కు సిద్ధ‌ప‌డింది. అయితే ఈ విష‌యంలో ఆర్బీఐ ప్ర‌జాభిప్రాయం కోర‌నుంది.  దీనిపై దేశంలో చ‌ర్చకు సెంట్ర‌ల్‌ బ్యాంక్ ప్ర‌త్యేక ప‌త్రం విడుద‌ల చేసింది. రిజ‌ర్వ్ బ్యాంక్ సాధార‌ణ ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ఇప్ప‌టికే తెలుసుకున్న‌ది. యుపిఐ ద్వారా చేస్తున్న చెల్లింపుల‌పై ఎంత ఫీజు వ‌సూలు చేయాల‌న్న‌ది ఇంకా చ‌ర్చించాల్సి ఉన్న‌ది. ఈ ప‌రిస్థితుల్లో స‌మీప భ‌విష్య‌త్తులో యుపీఐ చెల్లింపు ల‌పై కొంత ఫీజు చెల్లించ‌వ‌ల‌సి వ‌స్తుంది. దేశంలో చెల్లింపుల ప్ర‌క్రియ సంబంధించిన వ్య‌యం రిక‌వ‌ర్ చేయ డానికి,  ఆర్బీఐ సిద్ధ‌ప‌డింది. యూపీఐ కూడా ఐఎంపిఎస్ వ‌లె నిధుల బ‌దిలీ విధాన‌మ‌ని ఆర్బీఐ పేర్కొన్న‌ది. క‌నుక‌, ఐఎంపిఎస్ వ‌లె అది కూడా ఛార్జ్ చేయాల‌న్న‌ది. అయితే ప‌లు ర‌కాల మొత్తాల‌కు ప‌లు విధాలుగా ఈ ఛార్జీలు ఉంటాయ‌న్న‌ది.  చెల్లింపులు స‌త్వ‌రంగా, స‌క్ర‌మంగా జ‌రిగిన‌దీ లేనిదీ నిర్ధారించేందుకు, పిఎస్ ఓలు, బ్యాంకులు త‌గిన మౌలిక స‌దుపాయాలు క‌ల్పించుకోవాలి. అప్పుడే లావాదేవీల్లో ఎలాంటి ఆటంకాలు ఉండ‌వ‌ని ఆర్బీఐ ప‌త్రం పేర్కొన్న‌ది.  అంతేగాక‌, ఎలాంటి ఆర్ధిక కార్య‌క‌లాపాల్లో, చెల్లింపుల విధానంలోస‌హా అన్నింటా, ఉచిత సేవ‌లు చేయ డం న్యాయ‌మ‌నిపించుకోద‌ని ఆర్బీఐ స్ప‌ష్టం చేసింది. 

నాణ్యతా లోపానికి నిలువెత్తు నిదర్శనం..!

భారీ వర్షాలకు   బెంగళూరు, మైసూరు హైవే నీట మునిగింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. బెంగళూరు నగరంలో భారీ వర్షాలకు నాణ్యతా లోపం కారణంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బెంగళూరు, మైసూరులను కలిపే  మెగా రోడ్డు ప్రాజెక్ట్ పై భారీగా నీరు నిలిచింది. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో  హైవేలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ పరిస్థితిని రోడ్డు నిర్మాణంలో నాణ్యతా లోపమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు ఫేజుల్లో నిర్మించిన ఈ హైవే కోసం మొదటి ఫేజ్ కు రూ. 3,501 కోట్లు , రెండో ఫేజ్ కు రూ. 2,920 కోట్లు  వ్యయం చేశారు.  కుంబల్ గోడు, బిడాది, రామనగర్, చన్నపట్నం సమీపంలోని   హైవేలు  పూర్తిగా లజమయం కావడంతో వాహనాలు కదలలేని పరిస్థితులు నెలకొన్నాయి. చాలా చోట్ల వాహనాలను దారి మళ్లించాల్సి వచ్చింది. నిజానికి హైవేలో వరదలు రావడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో కురిసిన వర్షాలకు కూడా మద్దూరు, మాండ్య సమీపంలోని రోడ్లన్నీ జలమయమై  రాకపోకలు నిలిచిపోయాయ. అంతే గాక, భారీగా వరద రావడంతో పలు వాహనాలు నీట మునిగాయి.  హైవేపై వర్షం నీరు నిలవకుండా రోడ్లు చాలి. అయితే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన హైవేల విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారనడానికి బెంగళూరు, మైసూరు జాతీయ రహదారే నిదర్శనమని విమర్శకులు అంటున్నారు.