సీజేఐగా జ‌స్టిస్ ల‌లిత్ ప్ర‌మాణ‌స్వీకారం

భారత సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్  శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.రాష్ట్రపతి భవన్ లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది మూర్ము జస్టిస్ యు.యు.లలిత్తో ప్రమాణ స్వీకారం చేయించారు. \ఈ  ప్రమాణ స్వీకారోత్సవంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్,  ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.సీజేఐగా జస్టిస్ ఎన్.వి. రమణ పదవీ విరమణ చేయడంతో జస్టిస్ యు.యు.లలిత్ కొత్త సీజేఐగా బాధ్యతలు స్వీకరిం చారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ కూడా పాల్గొన్నారు.

వ‌రంగ‌ల్‌లో ఫెక్సీల ర‌గ‌డ‌.. హ‌న్మ‌కొండ‌లో బండి సమావేశం

వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫ్లెక్సీల రగడ మళ్లీ మొద లైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు స్వాగతం పలుకుతూ బీజేపీ కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు సంఘటనా స్థలంలో ఆందోళన చేస్తున్నారు. ఫ్లెక్సీల చించివేత టీఆర్ఎస్ పనేనంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వరంగల్ లో హై టెన్షన్ వాతావరణం నెల కొంది. ఆందోళన చేస్తున్న పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మూడ‌వ విడ‌త ప్ర‌జాసంగ్రామ యాత్ర ముగింపు సంద‌ర్భంగా హ‌న్మ‌కొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ప్ర‌త్యేక స‌భ జ‌ర‌గ‌నుంది. దీనికి బీజేపీజాతీయ అద్య‌క్షుడు న‌డ్డాతో పాటు ముఖ్య‌నేత‌లు హాజ‌రుకానున్నారు.  జనగామ జిల్లా పాంనూర్‌ వద్ద బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ప్రజాసంగ్రామ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. మూడు రోజుల విరామం తర్వాత హైకోర్టు అనుమతితో యాత్ర ఆగిన చోట నుంచే తిరిగి మొదలైంది.  ఈ క్రమంలోనే వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ సీపీ తరుణ్‌జోషి ఉత్తర్వులను జారీ చేయడం, ఆర్ట్స్‌ కళాశాలలో సభ నిర్వహణకు ప్రిన్సిపాల్‌ అనుమతి నిరాకరించడంతో.. బీజేపీ బహిరంగ సభ నిర్వహణపైనా అనిశ్చితి నెలకొన్నది. అయితే, బీజేపీ నేతలు హై కోర్టును ఆశ్రయించి.. సభకు అనుమతి సాధించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. కళాశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సభా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవా లని సూచించింది. దీంతో బీజేపీ నాయకత్వం రెట్టించిన ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిష్ఠాత్మ కంగా సభహనుమకొండలో నిర్వహించనున్న బహిరంగ సభకు బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈనెల 21న  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటించి రాష్ట్రంలో రాజకీయ అలజడికి తెరలేపగా, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేపీ నడ్డా ఎలాంటి కీలక సందేశం పార్టీ శ్రేణులకు ఇవ్వబోతున్నార న్నది ఆసక్తికరంగా మారింది.   ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల ముఖ్యనేతలతోపాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, పలువురు సీనియర్‌ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్‌చార్జిగా నియమితులైన సునీల్‌ బన్సల్‌ శుక్రవారమే వరంగల్‌ చేరుకున్నారు. బన్సల్‌తో పాటు పార్టీ రాష్ట్ర మరో ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ తదితర సీనియర్‌ నేతలు ఈ బహిరంగసభలో పాల్గొననున్నారు

స‌భ‌కు రాకుంటే జ‌రిమానా!.. టీఆర్ ఎస్ హెచ్చ‌రిక‌

బ‌డికి రాక‌పోతే కొడ‌తానంటా రు టీచ‌ర్లు, ప‌నికి స‌రిగా రాక‌ పోతే తీసేస్తామంటారు అధికా రులు, మాట వినకుంటే తంతానంటాడు తండ్రి. . వీట‌ న్నింటికంటే చిత్ర‌మైంది టీఆర్ఎస్ వారి వాట్స‌ప్ మెసేజ్‌!  రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి రాకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుం దని, సీఎం కేసీఆర్‌ సభకు హాజరు కాని వాళ్లకు భవిష్యత్తులో లోన్లు ఇవ్వరని బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలకు వాట్స్‌ప్‌లో సందేశాలు పంపేరు.  ఇప్పుడు ఇది పెద్ద వివాద‌మైంది.  పంపడం వివాదాస్పదమైంది.  రేపు కొంగర దగ్గర కలెక్టర్‌ ఆఫీస్‌ ఓపెనింగ్‌ ఉంది. డ్వాక్రా మహిళలందరూ కేసీఆర్‌కు స్వాగతం పలకాలి. ఉదయం 11 గంటలకల్లా మునిసిపల్‌ ఆఫీసు దగ్గరికి రావాలి. రాని వారి పేర్లు నమోదు చేసుకొంటాం. వాళ్లకు భవిష్యత్తులో లోన్లు, ఎన్నికల సమయంలో డబ్బు ఇవ్వరు’ అని బుధవారం డ్వాక్రా మహిళలకు సందేశాలు వెళ్లాయి. సభకు రాలేని వాళ్లు రూ.500 ఫైన్‌ కట్టాలని మరో మెసేజ్‌ పంపారు. సమావేశానికి వెళ్లలేని కొందరు మహి ళలు తమ గ్రూప్‌ లీడర్లకు ఫైన్‌ కట్టినట్లు సమాచారం. దీనిపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ వ్యవహా రంపై విచారణ జరిపించి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధులు, బీజేపీ మహిళా కార్పొరేటర్లు శుక్రవారం బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ కమిష నర్‌కు వినతి పత్రం అందజేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, డ్వాక్రా సంఘాల లీడర్లు ఇలా బెదిరి స్తూ సందేశాలు పంపారని ఆరోపించారు

అస‌లే టెన్ష‌న్ టెన్ష‌న్‌.. మ‌రో వంక కేటీఆర్ 

హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను అరెస్టు చేయ‌డం ఆయ‌న‌పై పీడీ యాక్టు విధించ‌డంతో ప‌రిస్థితులు అదుపుత‌ప్పాయి. భ‌జ‌రంగ ద‌ళ్ వీహెచ్‌పీ కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. దీంతో చాంద్రాయ‌ణ‌గుట్ట ప్రాంతం హైటెన్ష‌న్ చోటు చేసుకుంది. ఈ ప‌రిస్థితుల్లో కేటీఆర్ చాంద్రాయ‌ణ‌గుట్ట ఫ్లైఓవ‌ర్ ప్రారంభోత్స‌వానికి పూను కున్నారు.  ఈనెల 23న ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కావాల్సి ఉండగా బీజేపీ నేతల ఆందోళనలతో వాయిదా పడింది. రాజాసింగ్ అరెస్టు అనంతరం ఓల్డ్ సిటీలో ఘర్షణలతో చాంద్రాయణ గుట్టలో పోలీసులు హై అలర్ట్ ప్రక టించారు. భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ కార్యకర్తలు అడ్డుకుంటారనే సమాచారంతో భారీగా పోలీసులు మోహ రించారు. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేసి మంగళహాట్ పోలీసులు కోర్టుకు తరలించిన తర్వాత పీడీయాక్ట్ నమోదు చేసిన విషయాన్ని ప్రకటించారు. అంతకు ముందు రెండు పాత కేసుల్లో ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఓ వర్గం మత మనోభావాలను కించ పరిచేలా ఆయన ఓ వీడియో ను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయడంతో వివాదం ప్రారంభమయింది. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసినప్పటికీ.. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. దీంతో  పాతబస్తీలో ఉద్రిక్తత ఏర్పడింది. చివరికి పోలీసులు పీడీయాక్ట్ కింద అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజాసింగ్‌ది పూర్తిగా వివాదాస్పదమైన చరిత్ర. రాజకీయ కారణాలతో ఆయన  ఓ వర్గాన్ని  తీవ్రంగా ద్వేషిస్తూ వ్యాఖ్యలు చేస్తూంటారు. ఈ క్రమంలో  పలు కేసులు నమోదయ్యాయి.  సాధారణంగా రిమాండ్ ఖైదీలను చంచల్ గూడ జైలుకు తరలిస్తారు. అయితే చంచల్ గూడ కూడా పాతబస్తీ పరిధిలోనే ఉండటంతో భద్రతా కారణాలతో ఆయనను చర్లపల్లి తరలించాలని నిర్ణయిం చారు.  

ఆజాద్ రాజీనామా .. కాంగ్రెస్’లో కొత్త ట్విస్ట్

కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు ఇద్దరు కాదు, చాలా మంది  నాయకులు పార్టీని వదిలి బయటకు వెళ్లి పోయారు. ముఖ్యంగా 2019 ఎన్నికల ఓటమి తర్వాత, సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా డజన్ల కొద్ది నేతలు క్యూకట్టిమరీ పార్టీని వదిలి వెళ్ళిపోయారు. ఇంకా పోతూనే ఉన్నారు.అదే క్రమమలో పార్టీ సీనియర్ నాయకుడు, ఒకప్పుడు ట్రబుల్ షూటర్’గా పార్టీని అనేక విధాల ఆదుకున్న గులాం నబీ ఆజాద్’ కూడా పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఐదు పదుల అనుబంధాన్ని తెంచుకుని పార్టీకి  గుడ్’ బై చెప్పారు.   నిజానికి, గులాం నబీ ఆజాద్’ పార్టీని వదిలిపోవడం ఉహించని విషయం కాదు. అనూహ్య పరిణామం అసలే కాదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్’గా కీలక బాధ్యతలు నిర్వహించిన గులాం నబీ ఆజాద్’ చాలా కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అలాగే,పార్టీ అధినాయకత్వం కూడా ఆయన్ని, పరాయి వాడిగానే చూస్తోంది. కొంత దూరంగానే ఉంచుతోంది.  సుమారు రెండేళ్ళ క్రితం 2020లో ఆజాద్ సహా మరో 22 సీనియర్ నాయకులు, జీ 23 పేరిట ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి ఆ వేదిక ప్రధాన లక్ష్యం, పార్టీని బతికించు కోవడమే, అందుకే, పార్టీ సంస్థాగతంగా బలపడవలసిన అవసరాన్ని నొక్కి చెపుతూ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. సంస్థాగత వ్యవహారాలపై దృష్టి పెట్టాలని కోరారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని కోరారు.  ఇక అక్కడి నుంచి, పార్టీ సీనియర్ నాయకులకు, పార్టీ అధిష్టానానికి మద్య దూరం పెరుగుతూవచ్చింది. జీ 23కి అసమ్మతి ముద్ర పడింది. అజాద సహా, జీ 23 నాయకులకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది. అవమనాలు ఎదురయ్యాయి. ఏ నేపధ్యంలోనే, పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేసి, ఎస్పీ మద్దతుతో రాజ్యసభకు ఎనికయ్యారు.మరో వంక  కొద్ది రోజుల క్రితం జమ్మూ కశ్మీర్’ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్’ పదవి పుచ్చుకున్నట్లే పుచ్చుకుని వద్దని వదిలేశారు. ఏఐసీసీ, జమ్మూ కశ్మీర్’ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్’ గా అయన పేరు ప్రకటించిన కొద్ది గంటలకే అయన రాజీనామా చేశారు. ఆయన వెనక, హిమాచల ప్రదేశ్ ప్రచార కమిటీ చైర్మన్ ఆనంద్ శర్మ అదే బాటలో  అడుగేశారు. ఆయన రాజీనామా చేశారు.  అదలా ఉంటే, గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం కంటే, ఆయన తమ రాజీనామా లేఖలో ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశాలు అవుతున్న్నాయి. ఆజాద్ ఐదు పేజీల లేఖలో, ప్రధానంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీ అపరిపక్వ రాజకీయాల కారణంగానే కాంగ్రెస్ పార్టీకి ఈ దుర్గతి పట్టిందని, ఆరోపించారు. చివరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ 'చేయాల్సింది భారత జోడో యాత్ర కాదు..కాంగ్రెస్ జోడో యాత్ర అంటూ, నేరుగా రాహుల్ గాంధీ పైనే అస్త్రాలను ఎక్కుపెట్టారు. అంతేకాదు,  కాదు “ఏఐసీసీని నడిపే కోటరీ ఆధ్వర్యంలో పోరాడాలన్న సంకల్పం, సామర్థ్యాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. భారత్ జోడో యాత్ర కన్నా ముందు పార్టీ అధినాయకత్వం కాంగ్రెస్ జోడో యాత్రను చేపట్టాల్సింది" అని ఆజాద్ దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీ ప్రవేశంతోనే కాంగ్రెస్‌కు కష్టాలు ఆరంభమయ్యానని ఆజాద్‌ ఆరోపించారు. అదే విధంగా 2019 ఎన్నికల ఓటమి తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడాన్ని తప్పుపట్టారు.  రాహుల్‌ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు అయ్యాక పార్టీ నాశనమైందని, అనుభవజ్ఞులైన నేతలను రాహుల్‌ పక్కకు పెడుతున్నారంటూ విమర్శించారు ఆజాద్‌. కొత్త కోటరీ ఏర్పాటు చేసుకొని అపరిపక్వ రాజకీయాలు చేశారని విమర్శించారు. పార్టీలోని సంస్థాగత మార్పుల కోసం లేఖ రాసిన 23 మంది నేతలను తీవ్రంగా అవమానించారని అని ఆయన అన్నారు.అలాగే, సోనియా గాంధీ, కేవలం నామమాత్రపు అధ్యక్షురాలిగా మిగిలిపోయారని, నిర్ణయాలు అన్నీ, రాహుల్ గాంధీ ఆయన చుట్టూ చేరిన కోటరీ తీసుకుంటోందని లేఖలో పేర్కొనారు.  నిజానికి, ఆజాద్ ప్రస్తావించిన అంశాలు ఏవీ కొత్తగా వింటున్నవి కాదు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చాలా కాలంగా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అనేక మంది సీనియర్ జూనియర్ నాయకులు వ్యక్తిగత సంభాషణల్లో రాహుల్ గాంధీ కారణంగానే పార్టీ, రోజురోజుకు బలహీనమవుతోందని అంటూనే ఉన్నారు. అయితే, పిల్లి మెడడలో  గంట కట్టే ప్రయత్నం ఎవరూ చేయలేదు. నిజానికి, చేయలేదని అనేందుకు కూడా లేదు ఎందుకంటే, జీ 23 లేఖలో సంస్థాగతంగా పార్టీ బలోపేతం కావలసిన అవసరాన్ని, నొక్కి చెప్పారు.అలాగే, పార్టీ సీనియర్ నాయకులు సమయం వచ్చిన ప్రతి సందర్భంలోనూ పార్టీ అధ్యక్ష ఎన్నికల గురించి ఇతరత్రా తీసుకోవలసిన నిర్ణయాల విషయంలో హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా అధిష్టానం పట్టించుకోలేదు. అయితే ఇప్పుడైనా పార్టీ, అధినాయకత్వం వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని, అడుగులు వేస్తుందా ? అంటే, అలాంటి సూచనలు కనిపించడం లేదు. అజాద్’ తమ లేఖలో ప్రస్తావించిన అంశాలను పక్కన పెట్టి, ఆయన రాజీనామాకు ఎంచుకున్న సమయం సరింది కాదని  పార్టీ తప్పుపడుతోంది. కాంగ్రెస్ పార్టీ వివిధ అంశాలపై బీజేపీతో పోరాడుతోన్న సమయంలో ఆజాద్ పార్టీని  వీడటం దురదృష్టకరమని పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ పేర్కొన్నారు. నిజానికి, కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకునేందుకు, ఆజాద్ రాజీనామా ఒక అవకాశం కల్పించింది. కానీ, పార్టీ అందుకు సిద్ధంగా ఉన్న దాఖలాలు అయితే కనిపించడంలేదనే పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తానికి అజాద్ రాజీనామాతో కాంగ్రెస్ ప్రస్థానం మరో మలుపు తిరిగింది.. పార్టీ భవిష్యత్ మరింత ప్రశ్నార్ధకంగా మారింది.

రాప్తాడులో వైసీపీ నాయ‌కుల వీరంగం

రాష్ట్రంలో వైసీపీ పార్టీవారి వీరంగం మ‌రింత పెరిగింద‌న్న అభి ప్రాయాలు రాష్ట్ర‌మంత‌టా వెల్లు వెత్తు తు న్నాయి. తాజాగా అనంత‌పురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి సోద‌రుడు రెచ్చి పోయా రు. పట్టపగలు అందరూ చూస్తుండగానే టీడీపీ నాయకులపై భౌతిక దాడికి దిగారు. అచ్చం సినిమాల్లో సీన్ త‌ల‌పించేవిధంగా ఉందన్నారు.  శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మేజర్‌ పంచాయతీ ఉప సర్పంచి వైసీపీ నాయకుడు ఎం.రాజారెడ్డి మరికొందరితో కలిసి టీడీపీలోకి చేరేందుకు మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి శుక్రవారం (ఆగ‌ష్టు 26 )ఉదయం బయలుదేరారు. వీరివెంట మండలంలోని టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. వీరి వాహనాలు కుంటిమద్ది చెరువు కట్ట మీదకు వెళ్లగానే వైసీపీ నాయకులు తమ వాహనాలు అడ్డుగా ఉంచారు.  ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్‌రెడ్డి, అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. ఆయ‌న కూడా  టీడీపీ నాయ కులపై భౌతిక దాడులు చేశారు. మాజీ ఎంపీపీ అంకే అమరేంద్ర, టీడీపీ నాయకులు వడ్డే దుర్గా, అమరేంద్ర రెడ్డి తదితరులపై దాడి చేశారు. ఇష్టం వచ్చినట్లు తిడుతూ, కాళ్లతో తంతూ వీరంగం సృష్టించారు. దీంతో స్థానికులూ ఎంతో భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.  ఉప సర్పంచి రాజారెడ్డిని కారులో నుంచి బయటకు లాగి, వైసీపీ నేతల వాహనంలోకి తోసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.  విషయం తెలుసుకున్న పరిటాల సునీత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ చెన్నే కొత్తపల్లికి  బయలుదేరారు. వీరిని రామగిరి పోలీసు స్టేషన్‌ వద్ద పోలీసులు అడ్డు కున్నారు. దీంతో పోలీసుల తీరును ఖండిస్తూ, స్టేషన్‌ ఎదుటే వారు బైఠాయించారు. టీడీపీ జిల్లాఅధ్యక్షుడు బీకే పార్థసారథి కూడా అక్కడికి చేరుకుని, నిరసనకు దిగారు. రాప్తాడు, ధర్మ వరం నియోజకవర్గాల నుంచి టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున చేరుకోవడంతో రెండు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దాడి జరిగినట్లు ఆధారాలు చూపిస్తే ఎమ్మెల్యే సోదరుడిని అరెస్టు చేస్తామని, అలా చేయక పోతే తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తానని సీఐ చిన్నగౌస్‌ శపథం చేశారు. రెండు వర్గాలూ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి.

ఎన్నిక‌ల‌కు జ‌గ‌న్ సిద్ధ‌మా? ... ర‌ఘురామ కృష్ణంరాజు స‌వాలు

జ‌గ‌న్ స‌ర్కార్‌కి వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు మ‌ళ్లీ హెచ్చ‌రిక చేశారు. త‌న రాజీనామా కోర‌డం అర్ధ ర‌హిత‌మ‌ని దాని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకించి చేకూరే ప్ర‌యోజ‌న‌మేమిట‌ని ప్ర‌శ్నించారు. రాజీనామా చేసినా తాను మ‌ళ్లీ పోటీచేసి త‌ప్ప‌కుండా గెల‌వ‌గ‌ల‌న‌న్న ధీమా వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఆగ‌ష్టు  26న ఢిల్లీ లో విలే క‌రుల‌తో మాట్లాడుతూ తాను రాజీనామాకు సిద్ధ‌మేన‌ని,  సీఎం జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి ఎన్ని క‌ల‌కు వెళ్ల‌డానికి సిద్ధ‌మేనా అని స‌వాలు విసిరారు. జ‌గ‌న్ అందుకు లిఖిత పూర్వ‌క హామీ ఇవ్వాల‌న్నారు.  తనపై ఫిర్యాదు చేస్తానని ఏ2 పేర్కొనడం హాస్యాస్పదమని, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌,  స్టట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారులతో కలిసి గతంలోనే ఎన్నో చేయరాని పనులు చేశారు కదా! అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, జగన్‌ను ఢిల్లీకి పిలిపి చీవాట్లు పెట్టారని... రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అరాచకాలు, అప్పులపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేేస్త ముఖ్యమంత్రి బయటికి వచ్చి ఏవో కబుర్లు చెప్పుకొచ్చారని ఎద్దేవా చేశారు.   ప్రస్తుతం టీడీపీకి 18 స్థానాలు ఉన్నాయని, ఆ 75కు 18 కలిపితే 93 స్థానాలే అవుతాయని, తన సర్వే తప్పె లా అవుతుందని ప్రశ్నించారు. కాగా, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌పై అనర్హత వేటు వేస్తే, ఏపీ సీఎం జగన్‌కు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు.  ప్రభుత్వ ఖజానాను జలగల్లా పీలుస్తున్న జగన్‌ సలహాదారులు పదవుల నుంచి తప్పు కావాలంటూ ఆయన డిమాండ్‌ చేశారు.

ఏపీ ఆర్ధిక ప‌రిస్థితి అస్థ‌వ్య‌స్థం.. జీవీ రెడ్డి

చాక్లెట్ బావుంద‌ని వెన‌క‌టికి ఓ పిల్లాడు చ‌దువు అశ్ర‌ద్ధ‌చేసి చాక్లెట్ల‌కోసం పెద్ద బడి ద‌గ్గ‌ర దుకాణాన్ని మ‌రిగాట్ట‌. అలా ఉంది ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి వ్య‌వ‌హారం. చాక్లెట్లు అడిగినంత సులువుగా ఆర్‌బీఐ ని అప్పు అడిగేస్తున్నారు. రాష్ట్ర బేవ‌రేజెస్ కార్పొరేష‌న్ ద్వారా కూడా రుణాలు చేస్తున్నారు.  ఏపీ ప్రభుత్వం అప్పుల్లో రికార్డ్‌ సృష్టిస్తోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐదు నెలల వ్యవధిలో ఏపీ రూ.46,603 కోట్లు రుణం సమీ కరించిందని, ఏపీ చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని తెలిపారు. వచ్చే మంగళవారం మరో రూ.2 వేల కోట్లు అప్పుకు ఆర్బీఐ కి  ఏపీ ప్రభుత్వం ఇండెంట్ పెట్టిందని  జీవీ చెప్పారు.  ఇవికాక కార్పొరేషన్‌ ద్వారా తెచ్చిన అప్పులు అదనంగా తెస్తున్నారని జీవీ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతోందని ఆయ‌న ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ సమస్య లు, విభజన అంశాలపై కేంద్ర ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్‌ ఆధ్వర్యంలోని కమిటీ రాష్ట్ర బృందం తో గురువారం సమావేశమైంది.  రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ బృం దంలో ఉన్నారు. ప్రధాని కార్యాలయం (పీఎంవో) ఈ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో జరిగిందొకటి.. బయటికొచ్చాక విజయసాయి, బుగ్గన చెప్పింది వేరొకటి కావడం గమనార్హం. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా సమకూర్చకపోవడం, డిస్కమ్‌లు చెల్లించా ల్సిన రుణాలపై నివేదికలు ఇవ్వకపోవడం, రైల్వే ప్రాజెక్టులకు నిధులు, భూములు ఇవ్వకపోవడంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది.

 హేమంత్ సొరేన్ శాస‌న‌స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దు

జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ శాసన సభ్యత్వాన్ని గవర్నర్ రమేశ్ బయిస్ శుక్రవారం(ఆగ‌ష్టు 26) రద్దు చేశారు. సొరేన్ అధికార దుర్వినియోగానికి పాల్పడి, తనకు తానే మైనింగ్ లీజును కేటాయించుకున్నారని, ఆయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ నేత రఘుబర్ దాస్ ఫిర్యాదు చేయడంతో, ఎన్నికల కమిషన్ విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలను విన్నతర్వాత సొరే న్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్‌కు ఈసీ సిఫారసు చేసింది. దీంతో గవర్నర్ శుక్రవారం సొరేన్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడని ప్రకటించారు.  గ‌నుల విష‌యంలో హేమంత్ సోరెన్‌పై విమ‌ర్శ‌ల వెల్లువెత్తిన క్ర‌మంలో హేమంత్ వ్య‌వ‌హార స‌ర‌ళిపై కేంద్ర ప్ర‌భుత్వానికి గవర్నర్ ఫిర్యాదు చేయ‌డం, ఆ ఫిర్యాదును కేంద్రం ఎన్నిక‌ల సంఘానికి పంపడం, హేమంత్ శాస‌న స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దుకు ఈసీ సిఫార‌సు చేయ‌డం, ఈసీ సిఫార‌సు ఆధారంగా హేమంత్ ఎమ్మెల్యే పదవిని ర‌ద్దు చేస్తూ గ‌వ‌ర్న‌ర్ నిర్ణయం తీసుకోవ‌డం వేగంగా జ‌రిగిపోయాయి. ఈ కీల‌క ప‌రిణా మం త‌ర్వాత త‌న ప్ర‌భుత్వాన్ని కాపాడుకునేందుకు హేమంత్ సోరెన్ ఎలాంటి అడుగు వేస్తార‌న్న‌ది ఆస‌క్తి కరంగా మారింది. గనుల లీజు వ్యవహారంలో హేమంత్ సోరెన్ అక్రమాలకు పాల్పడ్డారని.. ఆయనపై అనర్హత వేటు  వేయా లని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయనపై అనర్హుడిగా ప్రకటించాలని గవర్నర్‌ రమేష్ బైస్‌ కి  ఈసీ లేఖ రాసినట్లు రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. కానీ దీనిపై గవర్నర్ గానీ.. రాజ్‌భవన్ గానీ.. అధికారిక ప్రకటన చేయలేదు. గురువారం (ఆగ‌ష్టు 25) సాయంత్రం ఢిల్లీ నుంచి రాంచీకి వచ్చారు గవర్నర్. ఈ వ్యవహారంపై 26న  కీలక ప్రకటన చేసేరు.  షెల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి భారీగా ఆస్తులు సంపాదించినట్లు సోరెన్ కుటుంబంపై ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై బీజేపీ కూడా గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 9A నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించింది. చట్ట సభ్యుడిగా ఉన్నవారు ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు పొందరాదని..దీన్ని ఉల్లంఘిస్తే అనర్హతకు గురవుతారని.. అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే గవ్నరర్ ఈసీ అభిప్రాయాన్ని కోరగా.. ఈసీ తన స్పందన తెలియజేసింది. అనర్హతకు సిఫారసు చేసినట్లు సమాచారం.

యుఎస్ ఓపెన్‌కు జోకో దూరం.. కార‌ణం ఏమిటంటే..

కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోనందుకు సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మరో గ్రాండ్ స్లామ్‌కూ దూరమ య్యాడు. వ్యాక్సిన్‌ తీసుకోని వారికి అమెరికాలో ప్రవేశానికి అనుమతి లేదు.  సోమవారం మొదల య్యే ఈ ఏడాది ఆఖరి గ్రాండ్‌స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌ నుంచి వైదొలగుతున్నట్టు జొకోవిచ్‌ గురువారం ప్రకటిం చాడు. టీకా వేసుకోని జోకోను ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలి యన్‌ ఓపెన్‌ ఆడేందుకు అనుమతించని విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ వేసుకోకుండా ఆస్ట్రేలియా లో అడుగుపెట్టిన నొవాక్‌ను బలవంతంగా ఆ దేశం నుంచి పంపించారు.  ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు చాంపియ‌న్‌గా నిలిచిన నొవాక్ జొకోవిచ్ తాను న్యూయార్క్‌లో జ‌రిగే యూ ఎస్ ఓపెన్‌లో పాల్గొనేందుకు నేను ప్ర‌యాణం చేయ‌లేక పోతున్నాని, ఇది విచార‌క‌రమ‌నీ అన్నాడు.  అయితే త‌న‌కు మద్ద‌తు, ప్రేమ తెలిపిన వారికి ధ‌న్య‌వాదాలు. స‌హ‌చ‌ర ప్లేయ‌ర్ల‌కు గుడ్ ల‌క్` అని ట్వీట్ చేశారు. 35 ఏళ్ల సెర్బియన్‌ ఖాతాలో 21 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లున్నాయి. స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ (22 టైటి ల్స్‌) కంటే ఒకటి తక్కువ. దీన్ని తాజా గ్రాండ్‌స్లామ్‌లో జొకో సాధిస్తాడని అభిమానులు ఆశించారు. అతను 2011, 2015, 2018లో మూడుసార్లు విజేతగా నిలిచాడు. మరో ఆరుసార్లు రన్నరప్‌గా తృప్తి పడ్డాడు. ఇంతటి ఘన రికార్డు ఉన్న అతనికి న్యూయార్క్‌లో మరో టైటిల్‌ గెలవడం, నాదల్‌ రికార్డును సమం చేయడం కష్టం కాదు. అయితే అమెరికా, కెనడా దేశాల్లో స్వదేశీయులు తప్ప టీకా తీసుకోని విదేశీయులను అనుమ తించడం లేదు  కొవిడ్ ప్రొటోకాల్స్ ప్ర‌కారం అమెరికాకు వెళ్ల‌డానికి జొకోవిచ్. వ్యాక్సినేష‌న్ చేయించుకున్న వారు మాత్ర‌మే అమెరికాకు వెళ్ల‌డానికి నిబంధ‌న‌లు అనుమ‌తినిస్తాయి. ఈ ఏడాది ప్రారంభంలో జ‌రిగిన‌ ఆస్ట్రే లియా ఓపెన్ టెన్నిస్ టోర్నీకి ముందు వెన‌క్కు పంపిన సంగ‌తి తెలిసిందే.  ఇలా ఒక టెన్నిస్ ఓపెన్ చాంపి య‌న్ షిప్‌కు జొకోవిచ్ దూరం కావ‌డం ఇది రెండోసారి. 

చంద్రబాబును ప్రజలే కాపాడుకోవాలి?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ఎన్ఎస్ జీ భద్రతను భారీగా పెంచారు. ఇప్పటి దాకా 6+6 గా ఉన్న ఆయన భద్రతను 12+12కు ఎన్ఎస్జీ పెంచింది. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబుకు శుక్రవారం నుంచే ఎన్ఎస్జీ భద్రతను రెట్టింపు చేయడానికి కారణం ఏదో ఉండి ఉంటుందనే సందేహాలు సర్వత్రా   వ్యక్తం అవుతున్నాయి.    ఎన్ఎస్జీ డీఐజీ సమరదీప్ సింగ్ నేతృత్వంలో ఒక బృందం అకస్మాత్తుగా ఢిల్లీ నుంచి వచ్చి గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ప్రతి గదికీ వెళ్లి నిశితంగా పరిశీలించడం, మరుసటి రోజే ఆయనకు ఎన్ఎస్జీ భద్రతను రెట్టింపు చేయడం  టీడీపీ నేతలు, శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే చంద్రబాబు నాయుడి భద్రత గురించి ఎన్ఎస్జీ  డీఐజీ పరిశీలించడం మరింత ఆందోళనకు కారణమవుతోంది. చంద్రబాబు భద్రతకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన నివేదికల ఆధారంగానే ఎన్ఎస్జీ డీఐజీ ఇలా అకస్మాత్తుగా సమీక్షించారు. ఈ క్రమంలో రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులను కూడా సమరదీప్ సింగ్ కలిసినట్లు సమాచారం. ఏపీలో ఇటీవలి కాలంలో అధికార- విపక్ష టీడీపీ- జనసేన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విధానపరమైన విమర్శలు కాకుండా పార్టీల నేతలు వ్యక్తిగత విమర్శలు, తిట్ల దండకాలతో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటన సందర్భంగా అధికార వైసీపీ, టీడీపీ నేతలు, శ్రేణుల మధ్య ఘర్షణాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి.  ఈ సందర్భంగా జరిగిన అల్లర్లు, హింస వైసీపీ- టీడీపీ మధ్య రచ్చకు మరింత ఆజ్యం పోశాయి. టీడీపీ నేతలు తమ శ్రేణులను చితకబాదారని వైసీపీ ఆరోపిస్తోంది. పోలీసులను వినియోగించి తమ పైనే వైసీపీ దాడి చేయించిందని టీడీపీ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. కుప్పంలో దాడులు జరిగిన సందర్భంలో జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్న చంద్రబాబు నాయుడి పైన కూడా వైసీపీ మూకలు దాడికి యత్నించడం ఆందోళన కలిగిస్తోంది. చంద్రబాబుకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందంటున్నారు. వాస్తవానికి కీలకమైన పదవుల్లో ఉన్నవారికి టెర్రరిస్టులు, మావోయిస్టుల నుంచి ముప్పు ఉంటుంది. అలాంటి వీఐపీలకు నేషనల్ సెక్కూరిటీ గ్రూప్ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తుంది. జెడ్ ప్లస్ భద్రత కలిగిన చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పంలో చోటుచేసుకున్న సంఘటనలు ఆయన భద్రతకు ముప్పు ఉందనేందుకు సూచనలంటున్నారు. చంద్రబాబు కాన్వాయ్ పై వైసీపీ శ్రేణులు రాళ్లు విసిరేందుకు యత్నించినట్లు వార్తలు రావడం గమనార్హం. కుప్పం ఘటనలతో ఒక్కసారిగా చంద్రబాబులో ఆగ్రహం పెల్లుబికింది. వైసీపీ శ్రేణులు, నేతల ఆగడాలను నిరోధించకుండా పోలీసులు చోద్యం చూడడంపై విరుచుకుపడ్డారు. 60 వేల మంది ఉన్న పోలీసులపై 60 లక్షల మంది ఉన్న టీడీపీ శ్రేణులు విజృంభిస్తే.. వారి గతి ఏమవుతుందో ఊహించుకోవాలని హెచ్చరించారు. అన్నా క్యాంటీన్ వద్ధ వైసీపీ శ్రేణులు బ్యానర్లు చింపి, అన్నా క్యాంటిన్ ను ధ్వంసం చేసిన ఘటనా స్థలాన్ని పరిశీలించి, అక్కడే రోడ్డుపై బైఠాయించారు. టీడీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జి చేయడంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. మా కార్యకర్తలను కొడితే.. నేను మీ ఇళ్లకు వచ్చి కొడతా’ అని హెచ్చరించారు. ఏపీలో వైసీపీ సర్కార్ వచ్చిన తొలి రోజుల్లోనే చంద్రబాబు ‘ఛలో ఆత్మకూరు’లో పాల్గొనకుండా నిరోధించేందుకు ఆయన ఇంటి గేట్లకు తాళ్లు వేశారు. చంద్రబాబు అమరావతి పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన ప్రయాణించే బస్సుపై చెప్పులు, రాళ్లు వేశారు. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడికి వచ్చారు. చంద్రబాబును భౌతికంగా ఇబ్బంది పెట్టే యత్నాలు జరుగుతున్నాయన్న ఇంటెలిజెన్స్ నివేదికలతో కేంద్రం ఆయన రక్షణపై దృష్టి సారించిందంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇటీవల చేస్తున్న పర్యటనల్లో వైసీపీ శ్రేణులు తరచుగా గొడవలు సృష్టిస్తున్నారు. కొన్ని నెలల క్రితం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై రాళ్ల దాడి లాంటి పరిణామాలు కూడా చంద్రబాబుకు భద్రత పెంచే విషయంపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందంటున్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడి విషయంలో, టీడీపీ విషయంలో వరుసగా జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే.. ఆయనకు ముప్పేదో ఉందనే సంకేతాలు వస్తున్నాయని ఆ పార్టీ నేతలు, శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ చంద్రబాబుకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఎదురైతే ప్రజలే ఆయనను కాపాడుకోవాలని వారు అంటున్నారు.

కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే రాజాసింగ్ ఎపిసోడ్ కు ఇంత హైప్?!

గత ఎనిమిదేళ్లుగా.. అంటే తెలంగాణ ఆవిర్బావం నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ గతంలో ఎన్నడూ ఎదుర్కోనన్ని చిక్కులను ఇటీవలి కాలంలో ఎదుర్కొన వలసి వస్తున్నది. వరుస సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న టీఆర్ఎస్ ఆ సమస్యల నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవాలనుకుంటోంది. అవకాశాలు అంది రాకపోతే సృష్టించుకోవాలని ప్రయత్నిస్తున్నది. అదిగో అలాంటి ప్రయత్నమే రాజాసింగ్ అరెస్టు అని పరిశీలకులు అంటున్నారు. మునావర్ స్టాండప్ కామెడీ షో, దానికి వ్యతిరేకంగా ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆందోళన, ఆ తరువాత మత విద్వేషాలకు దోహదపడే విధంగా వివాదాస్పద వీడియో విడుదల చేసి అది తన కామెడీ షో అనడం ఇవన్నీ కూడా ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి టీఆర్ఎస్ సృష్టించుకున్న అవకాశంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.   ఎందుకంటే.. మామూలుగా వంద మంది రాజాసింగ్ లు వివాదాస్పద కామెంట్లు,  చేసినా, వీడియోలు చేసి విడుదల చేసినా హైదరాబాద్ మహానగరంలో మత విద్వేషాలు పెచ్చరిల్లే అవకాశం లేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ముందు హైదరాబాద్ లో మత కల్లోలాలు జరిగేవి.. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత తీసుకున్న చర్యలు, చేపట్టిన అభివృద్ధి పనులు, ఆయన తరువాత చంద్రబాబునాయుడు హయాంలో కూడా హిందూ ముస్లింల మధ్య సామరస్యమే కొనసాగింది. హైదరాబాద్ లో సున్నిత అంశాల మధ్య ముస్లిం, హిందువులు సంయమనం పాటిస్తున్నారు. ఎవరో రెచ్చగొట్టారని రెచ్చిపోయే పరిస్థితి లేదు. మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా హైదరాబాద్ విలసిల్లుతోంది. అటువంటి హైదరాబాద్ లో రాజాసింగ్ తీరు మతసామరస్యాన్ని రెచ్చగొడుతోందంటూ టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను, విమర్శలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.   మునావర్ కామెడీ షో, దానిని అడ్డుకోవడానికి జరిగిన ప్రయత్నాన్ని భూతద్దంలో చూపి హైదరాబాద్ లో మత కల్లోలాలు జరగబోతున్నాయన్నంతగా హడావుడి చేయడం వెనుక టీఆర్ఎస్ పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు అంటున్నారు. కేసీఆర్ కు మొదటి నుంచీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అలవాటేననీ, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారనీ అంటున్నారు. ఒక వైపు కాళేశ్వరం వైఫల్యం, లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన ఆ ప్రాజెక్టు ఒకే ఒక్క వరదకు ఎందుకూ పనికి రాకుండా పోవడం, దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండటం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ తనయ కవిత పేరు ప్రముఖంగా బయటకు రావడం, అలాగే కుమారుడు కేసీఆర్ కు సంబంధించినదడిగా చెబుతున్న ఫీనెక్స్ కంపెనీపై ఐటీ దాడులు వంటి అంశాలపై చర్చకు అవకాశం లేకుండా ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికే రాజాసింగ్ ఇష్యూకు అంత హైప్ ఇచ్చారని విశ్లేషిస్తున్నారు. పాత బస్తీలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారిందనీ, అల్లర్లు జరుగుతున్నాయనీ టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న ప్రచారం, ఆర్భాటం అన్నీ కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని అంటున్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత, పాలనా వైఫల్యాలు, తన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు ఇలా ముప్పేట దాడిలో ఉక్కిరి బిక్కిరైపోతున్న కేసీఆర్.. రాజా సింగ్ వ్యవహారానికి అవసరానికి మించిన ప్రాధాన్యత ఇచ్చి ప్రజల దృష్టిని మరల్చాలని భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. హైదరాబాద్ లో మత వైషమ్యాలు పెచ్చరిల్లే కుట్ర, శాంతి భద్రతలకు విఘాతం అంటూ టీఆర్ఎస్ సర్కార్ చెబుతున్నట్లుగా హైదరాబాద్ లో పరిస్థితి లేదనీ, నగరంలో మతసామరస్యానికి విఘాతం కలిగించడం ఎవరి వల్లా కాదనీ, ప్రజలలో చైతన్యం వచ్చిందనీ పరిశీలకులు అంటున్నారు.    1984 తరువాత హైదరాబాద్ నగరంలో మత పరమైన ఘర్షణలు తలెత్తిన సంఘటన ఒక్కటీ లేదనీ, మత సామరస్యానికి ప్రతీకగా నాడు ఎన్టీఆర్ హైదరాబాద్ నగరాన్ని తీర్చి దిద్దారని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజా సింగ్ వ్యవహారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న హడావుడి ప్రచారం అంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేననీ విశ్లేషిస్తున్నారు.

కాంగ్రెస్‌కు  గులాంన‌బీ ఆజాద్ గుడ్ బై  

చాలాకాలం నుంచి అసం తృప్తితో స‌త‌మ‌త‌మ‌వుతున్న గులాంన‌బీ ఆజాద్ ఎట్ట‌కేల‌కు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చారు. పార్టీ ప్రాధ‌మిక స‌భ్య‌త్వం, ప‌ద‌వులను ఆయ‌న వ‌దులుకున్నారు. ఇటీవ‌లే ఆయ‌న కాంగ్రెస్ క‌మిటీ ఛైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. అయితే పార్టీ ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్ గా నియ‌మిస్తూ పార్టీ ఉత్త‌ర్వులు అందుకున్న కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఆజాద్ త‌న నిర్ణ‌యాన్ని లేఖ ద్వారా ప్ర‌క‌టించి పార్టీకి ఊహించ‌ని షాక్ ఇచ్చారు. వాస్త‌వానికి ఆయ‌న చాలాకాలం నుంచి పార్టీ తీరుతెన్నుల ప‌ట్ల‌, అభిప్రాయాల ప‌ట్ల విమ‌ర్శిస్తూనే ఉన్నారు. మొత్తానికి పార్టీతో ఉన్న 50 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటూ.. హస్తం పార్టీని వీడారు. ఈ మేరకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కి నాలుగు పేజీల లేఖ రాశారు. ఈ సంద ర్భంగా పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆజాద్. కాంగ్రెస్‌ పార్టీని  అనుభవం లేని సైకోఫాంటిక్ నాయకుల కొత్త సర్కిల్‌గా ఆయన అభివర్ణించారు. భారత్ జోడి యాత్రను ప్రారంభించే ముందు కాంగ్రెస్ జోడి యాత్ర చేసి ఉండాలని విమర్శించారు. తన రాజీనామా లేఖలో రాహుల్ గాంధీ పైనా  విమర్శలు గుప్పించారు. ఆయనలో రాజకీయ పరిపక్వత లేదని.. ఇంకా చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రెండేళ్ల క్రితం కూడా  కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది అసమ్మతి వర్గం నేతల్లో గులాం నబీ ఆజాద్ సైతం ఉన్నారు. జీ-23గా పేరున్న సీనియర్ నేతల బృందం.. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. వారు లేఖ రాయడంపై అప్పట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారా లను రచ్చకీడుస్తున్నారని మండిపడ్డారు.అప్పటి నుంచీ గులాం నబీ ఆజాద్ పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు.  కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్  రాజీనామా చేయడంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఘాటుగా స్పందించింది. రాజీనామా చేసేందుకు ఇదా సమయం అని ఆ పార్టీ ప్రతినిధి ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రతినిధి జైరాం రమేష్ నిల‌దీశారు. ఆయ‌న  శుక్రవారం (ఆగ‌ష్టు 26) మీడియాతో మాట్లాడుతూ,  ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం సహా పలు అంశాలపై బీజేపీతో కాంగ్రెస్ పోరాటం సాగిస్తున్న తరుణంలో ఆజాద్ రాజీనామా చేయడం విచారకరమని అన్నారు. రాహుల్ గాంధీ పార్టీకి తీరని నష్టం చేశారని, రాహుల్‌కు పరిపక్వత లేదని, రిమోట్ కంట్రోల్‌తో పార్టీ నడుస్తోందని గులాంనబీ ఆజాద్ తన సుదీర్ఘ రాజీనామా లేఖలో ఆరోపించారు. కేవలం కీలుబొమ్మ ల్లాంటి ప్రాక్సీ ల పేర్లు పార్టీ అధ్యక్షుడి పదవికి వినిపిస్తున్నాయని ఆరోపించారు. పార్టీలో సంస్కరణలు కోరుతూ 23 మంది నేతలు సంతకాలతో లేఖ రాసిన తర్వాత సీడబ్ల్యూసీ సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి తమను చిన్నబుచ్చారని ఆరోపించారు.  కాగా, గులాం నబీ ఆజాద్ తన లేఖలో పేర్కొన్న అంశాలు అవాస్తమని,  ద్రవ్యోల్బణం, పోలరైజైషన్‌కు వ్యతిరేకంగా పార్టీ పోరాటం సాగిస్తున్న తరుణంలో ఆయన రాజీనామా చేయడం సందర్భోచితం కాదని వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామాపై ఆ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ  ఆజాద్ కు  అన్నీ ఇచ్చిందని, ఆయన ఈరోజు పేరున్న నాయ కుడు అయ్యాడంటే ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ సోనియాగాంధీ కారణమని అన్నారు. పార్టీలో ఆయన ఎన్నోపదవులు కూడా చేపట్టారని, అలాంటి ఆజాద్ రాజీనామా లేఖ రాసారంటే ఏమీ మాట్లాడ లేకుండా ఉన్నామని అన్నారు.  రాజీనామా లేఖ రాస్తారని ఎవరూ ఊహించలేదని అన్నారు. గతంలో ఆయన సోనియా గాంధీ వైద్యపరీక్షల కోసం అమెరికా వెళ్లినప్పుడు కూడా  లేఖ రాశారని అన్నారు.

జనం తిరగబడితే ఖాకీల గతేంటి?

ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో సామాన్య జనంలో సైతం తీవ్రం అసంతృప్తి పెరిగిపోతోంది. అధికార పార్టీ కొమ్ము కాస్తున్న కొందరు పోలీసులపై ప్రజలు బహిరంగంగానే రగిలిపోతున్నారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో  కొందరు పోలీసుల వ్యవహార శైలిపై  పెద్ద ఎత్తున , ఆగ్రహావేశాలు, వ్యతిరేకత వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో పోలీసుల నిర్లక్ష్య ధోరణి వల్లే శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటన రెండో రోజున అధికార పార్టీ నేతలు దాడులకు దిగడం, పోలీసులు లాఠీచార్జి చేయడంపై తీవ్రంగా స్పందించారు. ఏపీ మొత్తంలో పోలీసులు 60 వేల మంది ఉంటే.. టీడీపీ కార్యకర్తలు 60 లక్షల మంది ఉన్నారని, వారంతా వచ్చి మీ మీద పడితే ఏమవుతుందో ఊహించుకోవాలని హెచ్చరించారంటేనే పోలీసుల తీరు ఎలా ఉందో అర్ధమౌతుంది. చంద్రబాబు నాయుడు ఎలాంటి సందర్భంలో అయినా సాధారణంగా  సంయమనం కోల్పోకుండా మాట్లాడతారు. అలాంటి చంద్రబాబునే  పోలీసులు  తీరు ఇంతలా రగిలించిందంటే.. ఇక సాధారణ కార్యకర్తలు, ప్రజలలో    ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయని వేరేగా చెప్పనవసరం లేదు. ‘టీడీపీ కార్యకర్తలను కొడితే.. మీ ఇళ్లకు వచ్చి కొడతా’ అని హెచ్చరించే దాకా చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చంద్రబాబు కుప్పం పర్యటన సమయంలోనే అధికార పార్టీ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లినా.. టీడీపీ ఫ్లెక్సీలను చించేసినా.. అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేస్తున్నా పోలీసులు వాళ్లకు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అంతే కాదు టీడీపీ కార్యకర్తలపై  దాడులకు దిగినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని సర్వత్రా తప్పుపడుతున్నారు.  ఏపీలో పోలీసుల తీరు ఇంకా ఇలాగే అధికార పార్టీకి కొమ్ము కాసేలా ఉంటే.. భవిష్యత్తులో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకడమే కాకుండా.. జనాగ్రహంలో వారు కొట్టుకుపోయే పరిస్థితులు వస్తాయని పలువురు అంటున్నారు. ఈ క్రమంలోనే ఒక సీఐని తీరుపై విపక్షకార్యకర్తలు కోపంతో రగిలిపోతున్నారు. జనం నీతి నిజాయితీ ముందు ఖాకీ డ్రెస్ వేసుకుని వీరుల్లా విర్రవీగుతున్న పోలీసులు చిత్తుకాగితం లాంటి వారే అని జనం వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఇప్పుడు అధికార పార్టీకి కొమ్ము కాసిన పోలీసులకు భవిష్యత్తులో అవమానాలు, ఇబ్బందులు తప్పకపోవచ్చంటున్నారు. అసలు జనమే తిరగబడితే.. పోలీసులు తాము ఏమైపోతామనేది ఊహించుకోవాలని అంటున్నారు.  

నో రోడ్‌.. నో ఓట్ ... పార్టీలకు ఓట‌ర్ల అల్టిమేటం!

పార్టీలు, అజెండాలు,సిద్ధాంతాలు, వాస్త‌వ కార్యాచ‌ర‌ణ‌ల‌కు ఏమాత్రం సంబంధం లేకుండా రాజ‌కీయ పార్టీలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌న్నది ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ఆరోప‌ణ‌. అధికార‌ పార్టీలు ముఖ్యంగా, తాము అధి కారంలో మ‌రింత కాలం ఉండిపోవ‌డానికి, విప‌క్షాలు వారిని చొక్కాలాగి కింద‌ప‌డేయ‌డానికే అన్న‌ట్టు త‌యార‌య్యాయి. ప్ర‌జాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించి చేసిన‌, చేస్తున్న ప్ర‌మాణాలు, ఇచ్చిన ఇస్తున్న హామీలు, ప్ర‌సంగాల‌కు బొత్తిగా పొంత‌నే ఉండ‌టం లేదు. కేవ‌లం మంచి రోడ్డు, మంచి ఆస్ప‌త్రి, బ‌డి మించి ఏ ఓట‌రూ ఎక్క‌వ‌గా ఏదీ డిమాండ్ చేయ‌డు. కానీ ఆ చిన్న స‌మ‌స్య‌ను, డిమాండ్‌ను తీర్చ‌డంలోనూ అధికార‌, విప‌క్షాలు ఏమాత్రం కృషి చేయ‌డం లేదు. కేవ‌లం ప్ర‌జ‌ల్ని ఓట‌ర్లుగా చూడ‌ డంతోనే అస‌లు స‌మ‌స్య త‌లెత్తు తోందన్న‌ది విశ్లేష‌కుల మాట‌.  ఇటీవ‌ల భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో చాలా గ్రామాల్లో రోడ్లు, వంతెన‌లు కొట్టుకుపోయాయి. వాటిని వెంట‌నే ఉప‌యోగ‌ప‌డేలా చేయ‌డానికి ప్ర‌భుత్వం ఏమాత్రం గ‌ట్టి చ‌ర్య తీసుకోలేదు. గ‌తంలో అనేక‌ప‌ర్యాయాలు ప్ర‌భుత్వం గ్రామాల విష‌యంలో ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కేవ‌లం త‌మ పాల‌న ఎలా ఉంది?   మీకు అన్నీ అందుతున్నాయా? ప‌థ‌కాలు ఎలా ఉన్నాయి వంటి ప్ర‌శ్న‌లు అడిగి ప్ర‌జ‌ల నుంచి సానుకూల స్పంద‌న‌నే కోరుకోవ‌డం త‌ప్ప వాస్త‌వానికి ఏమీ చేయ‌డం లేద‌న్న‌ది సుస్ప‌ష్టం. ప్ర‌తీ చిన్న ప‌ని కూడా అధికారుల చుట్టూ తిర‌గ‌డం సామాన్యుల‌కు అల‌వాటు చేశారు. అన్ని ప్రాంతాల్లో, అన్ని కార్యాల‌యాల్లోనూ నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌జాసంక్షేమం అంటూనే ప్ర‌జ‌ల‌ప‌క్షంగా ఆలోచించి చేయ‌డ‌మ‌న్న‌ది జ‌ర‌గ‌డమే లేదు. అందుకే ప్ర‌జ‌లు ఆగ్ర‌హించారు. అందుకే ఓట్లు అడ‌గ‌డానికి వ‌చ్చేవారిని ప్ర‌జ‌లే నిల‌దీస్తున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణే మునుగోడు ఓట‌ర్ల అల్టిమేటం. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నేతలకు ఓటర్లు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఎలక్షన్ నోటిఫి కేషన్కు ముందే తమ డిమాండ్‌లను లేవనెత్తుతున్నారు. ఆ క్రమంలోనే చండూరు మండలం పడమటితాళ్ల గ్రామస్తులు నిరసన చేపట్టారు. మాకు రోడ్లు వేస్తే.. మీకు ఓట్లు వేస్తాం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలతో ర్యాలీ తీశారు.  రోడ్డు సౌకర్యం సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్‌లతో మూకుమ్మడి తీర్మానం చేశారు. అంతేకాదు తమ డిమాండ్‌లను పరిష్కరించకపోతే ఓట్లు వేయబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. నో రోడ్  నో ఓటు అని ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు మును గోడులో హాట్ టాపిక్‌గా మారాయి.

బీజేపీ రాజాసింగ్ ను సస్పెండ్ చేయడానికి కారణమదేనా?

బీజేపీలో ఫైర్ బ్రాండ్ నాయకులలో ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒకరు. రాజాసింగ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లను ఇటీవలి వరకూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఆర్ఇర్ గా అభివర్ణించేవారు. అలాంటిది రాజాసింగ్ ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పార్టీ శ్రేణులలో దిగ్భ్రమకు కారణమైంది. అయితే ఆయన సస్పెన్షన్ పై ఎవరూ నోరు మెదపలేదు. ఇటీవలి కాలంలో రాజా సింగ్ బీజేపీకి దూరంగా ఉంటున్నారనీ, అంతే కాకుండా తెరాసకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారనీ ఆయనపై పార్టీలోనే ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తాను ధర్మాన్నే నమ్ముతాననీ, తనకు ధర్మం కంటే పార్టీ ఏమంత ముఖ్యం కాదనీ రాజా సింగ్ వ్యాఖ్యానించడాన్ని కూడా పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. రాజా సింగ్ మాటలలో పార్టీ ధర్మాన్ని పాటించడం లేదన్న విమర్శ ఉందని కూడా వారంటున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభ మసకబారిందనీ, బీజేపీ అధికారం చేపట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయనీ బీజేపీ భావిస్తోంది. ఈ సమయంలో పార్టీ ఎమ్మెల్యే పార్టీ విధానాలను తోసి రాజన్నట్లు మాట్లాడటం, బీజేపీకి నష్టం చేకూర్చేలా సున్నితమైన విషయాలలో అనవసర దూకుడు ప్రదర్శించడం పట్ల పార్టీ నాయకత్వంలో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతున్నది. ఈ నేపథ్యంలోనే స్టాండప్ కమేడియన్ మునావర్ షో ను నిరసిస్తూ రాజా సింగ్ చేసిన హడావుడి, ఆ తరువాత ఆయన విడుదల చేసిన వివాదాస్పద క్యాసెట్ అన్నీ కూడా రాజకీయంగా టీఆర్ఎస్ కు ప్రయోజనం చేకూర్చేవిగానే ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గత కొంత కాలంగా రాజాసింగ్ వ్యవహార శైలిని నిశితంగా గమనిస్తున్న పార్టీ అధిష్ఠానం ఆయనను ఇంకెత మాత్రం ఉపేక్షించడం తగదన్న నిర్ణయానికి వచ్చే సస్పెన్షన్ వేటు వేసిందని పరిశీలకులు అంటున్నారు. మునావర్ స్టాండప్ కామెడీ షోకు వ్యతిరేకంగా బీజేపీ ఎటువంటి ఆందోళనా కార్యక్రమాలకూ పిలుపు నివ్వకపోయినా రాజా సింగ్ తన వ్యక్తిగత హోదాలోనే మునావర్ షోను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగడం, అరెస్టు కావడం వంటివన్నీ తెరాసకు మేలు చేసేవిగానే ఉన్నాయని వారంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ వివాదాస్పద వీడియో విడుదల చేయగానే క్షణం ఆలస్యం చేయకుండా రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకండా.. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించరాదో పది రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసిందని చెబుతున్నారు. ఆ తరువాత రాజాసింగ్ పై పీడీయాక్ట్ నమోదు చేసి అరెస్టు చేసినా బీజేపీ నుంచి ఎవరూ ఖండించకపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా రాజకీయ వర్గాలు చూపుతున్నాయి. అసలు మునావర్ స్టాండప్ కామెడీ షోకు వ్యతిరేకంగా రాజాసింగ్ హడావుడి చేయడం.. ఆ తరువాత తాను స్వయంగా ముస్లింల మనోభావాలను కించపరిచే విధంగా వివాదాస్పద వీడియో విడుదల చేయడం.. వీటన్నిటి వెనుకా టీఆర్ఎస్ అగ్రనేత ఒకరు ఉన్నారని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగత హోదాలో మునావర్ షోకు వ్యతిరేకంగా హంగామా చేయడం, ఆ తరువాత వివాదాస్పద వీడియో విడుదల చేయడంతో రాజాసింగ్ టీఆర్ఎస్ తో చేతులు కలిపి ఆ పార్టీ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారన్న నిర్ధారణకు వచ్చిన బీజేపీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిందని చెబుతున్నారు.

జ‌గ‌న్‌..  ముస్సోలిని, తావోస్‌!

కాలం క‌లిసిరాన‌పుడు ఏదో ఒక మార్గాన్ని అనుస‌రించి ఆధిప‌త్య ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌నుకోవ‌డ‌మే రాజ‌కీ యాల్లో నాయ‌కుల‌ను అప్ర‌తిష్ట‌పాలు చేస్తోంది. ఈ ప‌రిస్థితి తెలిసి కూడా కొంద‌రు అదే విధంగా పాటిస్తూ మ‌రింత‌గా ప్ర‌జ‌ల దృష్టిలో ప‌డుతున్నారు. అధికార గ‌ర్వం, అహంకారంతో వ్య‌వ‌హ‌రించిన‌పుడు ఎదు ర‌య్యే స‌మ‌స్య‌లే ఇపుడు ఏపీ సీఎం జ‌గ‌న్ ఎదుర్కొంటున్నార‌నాలి. రాష్ట్రంలో స‌ర్వ‌త్రా సామాన్య జ‌నం కూడా ఆయ‌న ప‌ట్ల విముఖ‌తే ప్ర‌ద‌ర్శి స్తున్నారు.  ప్ర‌జ‌లకు ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ఏమాత్రం న‌మ్మ కం కూడా లేకుండా పోయింది. ప్ర‌జ‌ల‌ను విప క్షాల‌ను ఇబ్బందిపెట్ట‌డ‌మే ధ్యేయంగా వ్య‌వ‌హ‌రిస్తు న్నార న్న‌ది ఇటీవ‌లి ఆరోప‌ణ‌. ముఖ్యంగా వైసీపీ కార్య క‌ర్త‌ల దాడులు, తిట్ల‌పురాణం అన్నీ ఆ పార్టీ ప‌రిస్థితికి అద్దం ప‌డుతున్నాయి.    కుప్పంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై వైసీపీ గూండాల దాడి పిరికిపంద చ‌ర్య అని అది కేవ‌లం జ‌గ న్ హ్ర‌స్వ‌దృష్టి, అహంకారానికి నిద‌ర్శ‌న‌మ‌ని  టీడీసీ సీనియ‌ర్ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు అన్నా రు. సీఎం జ‌గ‌న్ ఏపీ ముస్సోలినీగా మారార‌ని ఆయన వ్యాఖ్యానించారు.  తరచూ ప్రతిపక్ష నేత పర్య ట నను అడ్డుకోవటం, దాడులకు పాల్పడటం ఏపీ లో తప్ప దేశంలో మరెక్కడైనా ఉందా?  అని ప్రశ్నిం చారు.  ఇదిలాఉండ‌గా, జ‌గ‌న్‌ను ఎవెంజ‌ర్స్ సినిమాలో విల‌న్‌తో పోల్చారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. త‌న ను ద‌త్త‌పుత్రుడు అని అరోపించే జ‌గ‌న్‌కు ఎవెంజ‌ర్స్‌లో విల‌న్ తానోస్ అని పేరు పెట్టాన‌ని ప‌వ‌ర్ స్టార్ అన్నారు.  అంతేకాదు జ‌గ‌న్‌ను సిబిఐ ద‌త్త‌పుత్రుడు అనీ సంబోధించాల్సి వ‌స్తుంద‌నీ హెచ్చ‌రించారు.   ఇంకోసారి వైసీపీ అధికారంలోకి వస్తే జపాన్ లో మద్యం పోటీలు పెట్టినట్లు పెడతారని  ఆరోపించారు. వైసీ పీ పార్టీని ఓడించడమే తమ‌ తొలి అజెండా అన్నారు.   ఏపీలో అధికార వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నిప్పులు చెరిగారు. వైసీపీపై త‌న‌కు ఎలాంటి ద్వేషం లేద‌ని, వైసీపీనేతలు  ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌క‌పోతే మాత్రం త‌ప్పనిస‌రిగా  నిల‌దీస్తాననీ స్పష్టం చేశారు. 

సుప్రీం కోర్టు ప్రొసీడింగ్స్ ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం!

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ ప‌ద‌వీ కాలం శుక్ర‌వారం (ఆగ‌ష్టు 26) ముగియ‌ నుంది. కాగా శుక్ర‌వారం కోర్టు ప్రొసీడింగ్స్‌ను ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేయ‌నున్నారు. వాస్త‌వానికి కోర్టు ప్రొసీడింగ్స్ ఇలా ప్రత్య‌క్ష‌ప్ర‌సారం ఇంత‌వ‌ర‌కూ జ‌ర‌గ‌లేదు.  కోర్టు వాద‌న‌లు టెలికాస్ట్  చేయ‌డం న్యాయ‌ మూర్తుల‌పై ఒత్తిడి పెరుగుతుందనే అభిప్రాయాలున్నాయి. ఈ కార‌ణంగానే ప్రొసీడింగ్స్‌ను ప్ర‌త్య‌క్ష‌ ప్ర‌సారానికి ఎవ‌రూ అంగీ క‌రించ లేదు.   కాగా,  శుక్రవారం రోజు విచారణకు రానున్న, తీర్పు వెలువరించనున్న కేసులకు సంబంధించిన జాబి తాను ప్రకటించింది. కాగా.. నేడు సీజేఐ‌గా జస్టిస్‌ రమణ ఐదు కీలక కేసులుపై తీర్పులను  వెలువరిస్తు న్నారు. విశేషం ఏంటంటే.. తొలిసారిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ‌తో కూడిన ప్రొసీడింగ్స్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.  దీంతో ఇప్పటి వరకూ లైవ్ ప్రొసీడింగ్స్‌కు అనుమతి ఇవ్వలేదు. కానీ ఎన్వీ రమణ తొలి నుంచి కూడా కోర్టు ప్రొసీడింగ్స్ లైవ్ ఇవ్వాలి అని వాదించారు. కోర్టులో వాదనలు ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం ఇవ్వ‌డం సాధ్యా సాధ్యాల‌పై  ఒక  కమిటీని  కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సైతం లైవ్ ఇవ్వొచ్చు అని నివేదిక ఇచ్చింది. అయితే  దీనిని కొందరు న్యాయమూర్తులు ఇష్టపడలేదు.  చివరికి తన ఫేర్ వెల్‌ను అయినా ఇలా లైవ్ ఇవ్వాలని సీజేఐ ఎన్వీ రమణ భావించారు.

జాతి నిర్మాణంలో శ్రామిక‌శ‌క్తిదే కీల‌క‌పాత్ర‌.. ప్ర‌ధాని మోదీ

క‌రోనా కాలంలో ప్ర‌పంచ‌మంతా భ‌యాందోళ‌నలు పీడిస్తున్న స‌మ‌యంలో దేశాన్ని గ‌ట్టెక్కించేందుకు కార్మికులు పూర్తి శ‌క్తిసామ‌ర్ధ్యాల‌ను వెచ్చించార‌ని ప్ర‌ధాని మోదీ  కితాబునిచ్చారు.  తిరుపతిలో రెండు రోజుల జాతీయ కార్మికసదస్సును ఆయన గురువారం(ఆగ‌ష్టు 25) ఢిల్లీ నుంచీ వర్చు వల్‌గా ప్రారంభిం చారు.  భార‌తదేశ క‌ల‌లు, ఆశ‌ల‌ను నెర‌వేర్చ‌డం ద్వారా జాతి నిర్మాణంలో శ్రామిక శ‌క్తి ప్ర‌ధాన‌పాత్ర పోషి స్తోంద‌ని ప్ర‌ధాని మోదీ కొనియాడారు. ఈ ఘ‌న‌త త‌ప్ప‌కుండా త‌ప్ప‌కుండా కార్మికుల‌కే ద‌క్కుతుం ద‌న్నారు. దేశంలో  కోట్లాదిమంది సంఘ‌టిత‌, అసంఘ‌టిత రంగాల కార్మికుల సంక్షేమం కోరి నిరంత‌రం త‌మ ప్ర‌భుత్వం శ్ర‌మిస్తున్న‌ద‌ని అన్నారు. ఒక  అధ్యయనం ప్రకారం  ది ఎమర్జెన్సీ క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌ కరోనా కష్ట కాలంలో 1.50 కోట్ల ఉద్యోగాలను కాపాడిందని తెలిపారు. కార్మిక శక్తికి భద్రత కల్పించడంలో ఇ-శ్రమ్‌ పోర్టల్‌ కీలకపాత్ర పోషిస్తోందని, ఏడాదిలోనే 28 కోట్లమంది కార్మికులు పోర్టల్‌లో నమోదయ్యారని తెలి పారు.  కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఎస్‌హెచ్‌ భూపేంద్ర యాదవ్‌ అధ్యక్షత వహించిన ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల కార్మికశాఖ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్‌ధన్‌ యోజన, ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమాయోజన తదితర పథకాలు కోట్లాదిమంది కార్మికులకు ఎంతో కొంత రక్షణ, భద్రత కల్పిస్తున్నా యని ప్రధాని చెప్పారు.  భవన నిర్మాణ కార్మికుల సెస్‌ నిధులను రూ.38 వేల కోట్లకుపైగా రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం డిజిటల్‌ యుగంలోకి ప్రవేశించిందని, ఆన్‌లైన్‌లో  షాపింగ్‌, హెల్త్‌ సర్వీ సెస్‌, ట్యాక్సీ, ఫుడ్‌ డెలివరీ జీవితంలో భాగమయ్యాయన్నారు. ఈ రంగాల్లో సరైన విధానాలు, సరైన కృషి దేశాన్ని ప్రపంచానికి నాయకత్వం వహించేలా చేస్తాయని చెప్పారు. ఇదిలా ఉండ‌గా, కార్మిక చట్టాలను హరించే సదస్సు.. జాతీయ కార్మికసదస్సును అడ్డుకుంటామని కార్మి క సంఘాల నేతలు ముందుగానే ప్రకటించడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.  సుమా రు 200 మందిని అదుపులోకి తీసుకొని రామచంద్రాపురంలో నిర్బంధించారు. సదస్సు జరిగే ప్రాంతానికి ర్యాలీగా వస్తున్న సీపీఎం నేతలు పి.మధు, గఫూర్‌, ఏఐటీ యూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కార్మిక చట్టాలను హరించేందుకు సదస్సు నిర్వహిస్తుంటే దానికి జగన్‌ ఆతిథ్యమివ్వడం దారుణమని మధు, గఫూర్‌, రవీంద్రనాథ్‌, ఐఎ ఎఫ్‌టీయూ నేత ప్రసాద్‌ విమర్శించారు.  తమను అమానుషంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. దీనిపై శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేస్తామని ప్రకటించారు.