మీ కారు కాన్వాయ్ ఇంత చీకాకు పెడితే ఎలా సారూ!
posted on Aug 30, 2022 @ 12:17PM
ప్రభుత్వాధినేత ఎవరైనా సరే ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన జీవనం అందించేందుకు పాటుపడాలి. గత పాలకులకంటే తన పాలన మెరుగ్గా ఉందని నిరూపించుకోవడానికి పని చేయాలి. అలా కాకుండా స్వయంగా ఆయన వల్లనే జనం తీవ్రమైన ఇబ్బందులు పడేలా వ్యవహరిస్తే ఎలా? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి ప్రజలు ముఖ్యంగా హైదరాబాదీయులు సరిగ్గా ఇదే అనుకుంటున్నారు.
ఆయన ప్రగతి భవన్ నుంచి తన ఫాం హౌస్ కు తరచూ చేసే ప్రయాణాలు హైదరాబాదీయులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ప్రగతి భవన్ నుంచి రాజీవ్ రహదారి మీదుగా ఆయన చాలా తరచుగా చేస్తున్నపర్యటనల పట్ల జనం చీకాకుపడుతున్నారు. ఆయన తిరగడానికి మేం ట్రాఫిక్ లో చిక్కుకుని యాతన పడాలా అని ప్రశ్నిస్తున్నారు. పైగా ఆయన ఈ ప్రయాణం హైదరాబాద్ లో అత్యంత రద్దీగా ఉండే సమయాలలోనే సాగుతుంది. ఉదయం విద్యార్థులు పాఠశాలలకూ, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే సమయంలోనూ.. అలాగే సాయంత్రం తిరిగి వారు ఇళ్లకు చేరే సమయంలోనూ కేసీఆర్ కాన్వాయ్ కోసం పోలీసులు ట్రాఫిక్ ను ఆపేస్తుంటారు. ప్రగతి భవన్ నుంచి బేగంపేట, ప్యాట్నీ సెంటర్, జూబ్లీ బస్టాండ్, తిరుమలగిరి చౌరస్తా, అల్వాల్ మీదుగా సాగే ఆయన పయనం.. ఆ దారిలో వెళ్లే వారికి నరకం చూపిస్తోంది.
ఈ పరిస్థితి వారంలో కనీసంలో కనీసం రెండు సార్లు ఉంటుంది. అంటే వారంలో రెండు సార్లు ఉదయం, సాయంత్రం జనం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తా ట్రాఫిక్ లో ఇరుక్కుని చిక్కులు పడాల్సిందే. అంబులెన్సులు సైతం నిలిచిపోయినా పోలీసులు పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ ను ఆపడానికి పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరు వైపులా కనిపించే పోలీసులు సీఎం కాన్వాయ్ వెళ్లిపోగానే మాత్రం కనిపించరు. దీంతో కాన్వాయ్ వెళ్ళిన తరువాత అప్పటి వరకూ నిలిచిపోయిన వాహనాలు ఒకే సారి అన్ని వైపుల నుంచీ కదలడంతో ఆ ట్రాఫిక్ క్లియర్ కావడానికి మరో గంట, వెరసీ కనీసం రెండు గంటల పాటు సీఎం కాన్వాయ్ వల్ల ట్రాఫిక్ చిక్కులు ఎదురౌతున్నాయి.
గతంలో ఏ సీఎం వల్లా ఇలా ట్రిఫిక్ ఇబ్బందులు ఎదురైన దాఖలాలు లేవు. ఎప్పుడో ఒక సారి ఏదో అత్యవసర పని మీద భారీ కాన్వాయ్ తో సీఎం కదిలారంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఇలా తరచూ క్యాంపుకార్యాలయానికీ, ఫాంహౌస్ కు తిరగడానికి గంటల తరబడి ట్రాఫిక్ నిలిపివేయడం ఎంత వరకూ సమంజసమని జనం విసుక్కుంటున్న పరిస్థితి ఆయన కాన్వాయ్ వెళుతున్న ప్రతి సందర్భంలోనూ కనిపిస్తోంది. దేశానికే ఆదర్శవంతమైన అభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ జనానికి ట్రాఫిక్ చుక్కలు చూపించే విషయంలో మాత్రం ఎవరికీ ఆమోదయోగ్యం కాని విధానాన్ని అవలంబిస్తున్నారు