ఏపీలో కొత్త సమీకరణాలు.. వైసీపీకి ప్రమాద ఘంటికలు
posted on Aug 30, 2022 @ 12:15PM
రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది నానుడి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఆ నానుడికి అద్దంపట్టేవిగానే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాలుగేళ్ల కిందట మైత్రీ బంధాన్ని తెంచుకున్న తెలుగుదేశం, బీజేపీలు మళ్లీ దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాయా? ఏపీలో తెలుగుదేశంతో మైత్రి బీజీపీకి తెలంగాణలో రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందా? తెలంగాణ బీజేపీ నాయకత్వం ఏపీలో తెలుగుదేశంతో పార్టీ పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ అగ్రనాయకత్వానికి చెప్పిందా? అన్న ప్రశ్నలకు పరిశీలకులు ఔననే సమాధానం ఇస్తున్నారు.
తెలంగాణ కమలం పార్టీ అధికారం చేపట్టాలంటే తెదేపా సహకారం అవసరం అని బీజేపీ అగ్రనాయకత్వం కూడా భావిస్తుండటం వల్లనే ఏపీలో హటాత్తుగా వైసీపీపై బీజేపీ ఉద్దేశపూర్వక దూరాన్ని పాటిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వినాయకమండపాలకు ఫీజులపై అటు బీజేపీ-ఇటు టీడీపీ సర్కారుపై ఏకకాలంలో దాడి చేయడం ఆ రెండు పార్టీలూ దగ్గర అవుతుందనడానికి సంకేతమని పేర్కొంటున్నారు. అదే కాకుండా బెజవాడలో ముర్ముతో టీడీపీ నేతల భేటీ వద్దంటూ వైసీపీ బీజేపీపై ఎంత ఒత్తిడి తసుకు వచ్చినా వినకుండా ఆమెతో టీడీపీ నేతల భేటీ కి సోము వీర్రాజు వంటి నేతలు స్వయంగా పూనుకోవడాన్ని కూడా ఇందుకు ఉదాహరణగా పరిశీలకులు చూపుతున్నారు. అంతే కాకుండా ఉరుము లేని పిడుగులా హఠాత్తుగా చంద్రబాబుకు 12+12 ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ పెంచడం కూడా ఆ రెండు పార్టీలూ దగ్గర అవుతున్నాయనడానికి నిదర్శనమేనని అంటున్నారు. మోదీ-బాబు భేటీ తర్వాతే ఏపీ బీజేపీ వైసీపీ ఎదురుదాడి తీవ్రతను పెంచిందని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో మోడీ, చంద్రబాబు కొన్ని నిముషాల పాటు ముచ్చటించుకోవడాన్ని వైసీపీ వారు జీర్ణించుకోలేకపోవడం కూడా బీజేపీ, తెలుగుదేశం పార్టీల మధ్య సయోధ్య అన్న ఆలోచనే వైసీపీని వణికిస్తోందనడానికి ప్రబల నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అన్నిటికీ మించి ఇటీవల అమరావతి మహిళా జేఏసీ ఉపరాష్ట్రపతిని కలసి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆయన దృష్టికి తీసుకువెళ్లింది. ఎంపీ గోరంట్ల మాధవ్ అంశంపై ఆయనకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ సందర్భంగా ఉపరాష్ట్రపతి చంద్రబాబు దార్శనికతను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో వణుకు పుట్టించాయని చెప్పక తప్పదు.
అందుకే మోడీని విమర్శించిన టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే అది వాళ్లిష్టం అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామృష్ణారెడ్డి వ్యాఖ్యానించారని అంటున్నారు. నిజానికి పొత్తులు అన్నది పూర్తిగా రెండు పార్టీలకు సంబంధించిన అంతర్గత వ్యవహారం. ఆ విషయంలో ఎవరైనా ఎందుకు ఉలిక్కిపడాలో, ఎందుకు అభ్యంతరం చెప్పాలో అర్ధం కాని వ్యవహారం. ఇక చంద్రబాబుకు తాజాగా ఎన్ఎస్జీ భద్రత పెంపు విషయంలో కూడా వైసీపీ భుజాలు తడుముకుంటోంది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యంగా తయారవ్వడమే భద్రత పెంపునకు కారణమని ఎవరూ విమర్శలు గుప్పించకపోయినా స్వచ్ఛందంగా వివరణలు ఇచ్చుకుంటోంది. కమలం తీర్థం పుచ్చుకున్న ఇద్దరు నేతల వల్లే చంద్రబాబుకు భద్రత పెంచారని వైసీపీ విమర్శించడం బీజేపీ, తెలుగుదేశం పొత్తుపై ఆ పార్టీలో నెలకొన్న ఆందోళనకు, భయానికీ తార్కానంగా చెబుతున్నారు.