భేటీల వెనక బలమైన వ్యూహం ?

కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్’ వచ్చారు. మునుగోడు మాజీ శాసనసభ్యుడు, కోమటి రెడ్డి వెంకటరెడ్డి  భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని, ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. వెంకట రెడ్డికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాసని ఓడించి  ముఖ్యమంత్రి కేసీఆర్, అరాచక, కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  అయితే, వచ్చిన పని చూసుకుని  ఇంచక్కా విమానం ఎక్కరా అంటే లేదు.  పనిలో పనిగా, రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి, ఈనాడు, ఈటీవీ సంస్థల అధినేత రామోజీ రావుతో భేటి అయ్యారు. అంతే కాదు, అక్కడి నుంచి నోవాటెల్’ హోటల్’కు వచ్చి జూనియర్ ఎన్టీఆర్’ తో సంవేసంయ్యారు. ముందు 15 నిముషాలు అనుకున్న ఈభేటీ సుమారు 40 నిముషాలకు పైగా సాగింది. డిన్నర్ తో ముగిసింది. రామోజీ రావును అమిత్ షా ఎందుకు కలిశారు? జూనియర్ ఎన్టీఆర్’తో అంతసేపు ఏమి ముచ్చటించారు? ఈ ప్రశ్నల చుట్టూ రాజకీయ చర్చ ఇంకా అలా సాగుతూనే వుంది. ఊహాగానాలు. రాజకీయ విశ్లేషణలు వినిపిస్తూనే ఉన్నాయి.   ఇంతలోనే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్రానికి వచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మూడవ విడత ప్రజా సంగ్రామ పాద యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్’ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఆరాచక పాలన, నియత్రుత్వ పోకడలను ఎండగట్టారు. ఎన్నికల ఎప్పుడొచ్చినా అధికారం తమదేనని రొటీన్ స్పీచ్ ఇచ్చారు.  అయితే, అమిత్ షా తమ పర్యటనలో ఈనాడు, ఈ టీవీల అధినేత రామోజీ రావును, ఫిల్మ్ స్టార్’ జూనియర్ ఎన్టీఆర్’ ను కలిస్తే, నడ్డా  టాలీవుడ్ హీరో నితిన్‌తో భేటీ అయ్యారు. అలాగే, మాజీ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ కూడా నడ్డాతో సమావేసమయ్యారు.  ఈ సమావేశాలు ఒకెత్తు అయితే, టీవీ 9 అధిపతి, రియల్ ఎస్టేట్ వ్యాపారి మైహోం రామేశ్వరరావుతోనూ జేపీ నడ్డాతో భేటీ అయినట్లు తెలుస్తోంది. రామేశ్వర రావు ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య నిన్న మొన్నటి వరకు మంచి సాన్నిహిత్యముంది. ఆర్థిక బంధాలు, బంధనాలు ఉన్నాయి. కేసేఆర్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రామేశ్వర రావు ఆర్థిక సహాయం చేస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్ అణా పైసలతో సహా తిరిగి చేల్లిచండమే కాకుండా,  ఆయన వ్యాపార అభివృద్ధికి అన్ని విధాలా సహకరించారు. బినామీ వ్యవహారాలు నడిచాయని అంటారు.  అయితే, ఈ మధ్య కాలంలో, రామానుజుల వారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఇద్దరికీ పెద్ద దిక్కుగా ఉన్న చిన్న జీయర్ స్వామితో  ముఖ్యమంత్రి  కీసీఆర్’ కు చెడింది. ఆ ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం కాణంగా  రామేశ్వరరావు, కేసీఆర్ మధ్య కూడా దూరం పెరిగిందని, పుంఖాను పుంఖాలుగా కథనాలు, కథలు వస్తూనే ఉన్నాయి.  ఇక ఆతర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ, రామేశ్వరరావు ఇప్పుడు బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆయన పలుమార్లు రహస్యంగా ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారన్న ప్రచారం ఉంది. అలాగే, బీజేపీ ఆయనకు యూపీ లేదా మరో రాష్ట్రం నుంచి  రాజ్య సభ టికెట్ ఆఫర్ చేసిందనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపధ్యంలో  మైహోం రామేశ్వరరావు, జేపీ నడ్డాతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.  నిజం రాజకీయ నాయకులు, ముఖ్యంగా  బీజేపీ అగ్ర త్రయం రాజకీయ ఉద్దేశ, దురుద్దేశాలు  లేకుండా ఎవరినీ కలవరు. కలసినా,, ఇలా గంటల గంటలు సమయం వృధా  చేసుకోరు.. సో ఈ వరస భేటీల వెనక బీజేపీ పెద్దల, ‘పేద్ద’ వ్యూహమే ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసేందుకు , ఓ వంక ఇతర పార్టీల  నుంచి సీనియర్ నాయకులను తెచ్చుకోవడంతో పాటుగా, ఇతర రంగాల్లో ముఖ్యంగా సినిమా, క్రీడా రంగాల్లో ఇప్పటికే మంచి గుర్తింపు ఉన్న వారిని ఆకర్షించేందుకే, మోడీ, అమిత్ షా, నడ్డా ఎక్కడికి వెళ్ళినా అక్కడి లోకల్ టాలెంట్’ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే  రాష్ట్రానికి వచ్చిన నాయకులు వివిద రంగాల ప్రముఖలతో సంవేసమవుతున్నారని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. అలగే, ఇది ఏదో ఒక్క తెలంగాణకు సంబందించిన వ్యూహం కాదని, దేశం అంతటా ఉన్నదనే అని కూడా  అంటున్నారు.

అప్పులు చేస్తే తిప్పలు తప్పవు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకు పోయింది. ఇదేమి రహస్యం కాదు. అందరికీ తెలిసిన వాస్తవం. నిజానికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మొదలు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రులు, బీజేపీ కేంద్ర నాయకులు ఇదే మాట.. మళ్ళీ మళ్ళీ చెపుతున్నారు. అయినా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్నది లేదు. కొత్త కొత్త మార్గాలలో కొత్త అప్పులు చేస్తూనే ఉన్నారు. సంక్షేమం పేరుతొ పందారం కానిచ్చేస్తున్నారు. ప్రజల సొమ్ములతో ప్రజల ఓట్లను కొల్లగొట్టే ఓటు బ్యాంకు రాజకీయాలకు సంక్షేమం ముసుగేసి, మోసం చేస్తున్నారు.  అదలా ఉంటే ఇప్పుడు తాజగా కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్’ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులకు హద్దులు లేకుండా పోయాయని, విమర్శించారు. శ్రీ లంక పరిణామాల నుంచి, ఏపీ ముఖ్యమంత్రి గుణ పాఠం నేర్చుకోవాలని హితవు పలికారు. లోక్‌సభ ప్రవాసీ కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి విశాఖలో పర్యటించారు. పక్క దేశాల్లో అప్పు పెరిగితే ఏ రకమైన పరిస్థితులు ఎదురవుతున్నాయో గమనించాలని, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికిసూచించారు.  చివరకు ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి మరీ, ఎక్కడంటే అక్కడి నుంచి  అప్పు తీసుకుంటున్నారని అది మంచి పద్ధతి కాదన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు కూడా ఇది వ్యతిరేకమని వివరించారు. ప్రభుత్వం చట్టబద్ద పరిపాలనా పద్దతులను పాటించాలని చెప్పారు. ప్రభుత్వ భూములను, ఆస్తులను తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని అన్నారు.  ప్రభుత్వాలు ప్రజల ఆస్తులకు ట్రస్టీలుగా ఉండాలే తప్ప యజమానుల్లా వ్యవహరించరాదని హెచ్చరించారు. అలాగే, ప్రభుత్వ పథకాలకు ముఖ్యమంత్రి పేరు లేదంటే ముఖ్యమంత్రి  కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకోవడం మంచి పద్దతి కాదన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు కుటుంబ పాలనను తిరస్కరిస్తున్నారని స్పష్టం చేశారు. మూడేళ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిని పూర్తిగా వదిలేసిందని, ఈ ప్రభుత్వ హయాంలో విశాఖలో భూకబ్జాల సంస్కృతి, కమిషన్లు, లంచాలు ముట్టజెప్పితే భూములను క్రమబద్ధీకరిస్తామనడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇది చాలా సిగ్గుచేటని, ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగితే ఈ రకమైన ఫిర్యాదులపైన విమర్శలపైన వెంటనే విచారణ నిర్వహించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు

కేసీఆర్ ఛీ అన్నా మోడీనే నంబర్ వన్

“ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ళ పాలనలో, దేశానికి పనికొచ్చే ఒక్క మంచి పనిచేసింది, లేదు. ఏ వర్గాన్ని సంతృప్తి పరిచిందీ లేదు. మోడీ వట్టి పనికిమాలిన  ప్రధాని. ఇంత పనికి మాలిన ప్రదానిని నేను నా 40 సంవత్సరాల  రాజకీయ జీవితంలో చూడలేదు.” ఈ మాటలు ఎవరివో వేరే చెప్పనక్కరలేదు. ఈ మధ్య కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచు చేస్తున్న విమర్శ ఇది. నిజమే, ఒక్క కేసీఆర్ అనే కాదు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదలు రేవంత్ రెడ్డి వరకు. ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరూ, మోడీని విమర్శించడంలో ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు.   కానీ, దేశంలో విపక్షాలు మోడీని ఎంతగా విమర్శించినా, అంతర్జాతీయంగా ఆయన ప్రతిష్ట మరింతగా పెరుగుతూనే వుంది, కానీ, గ్రాఫ్ పడిపోయిన దాఖలాలు మాత్రం లేవు. నిజానికి, అంతర్జాతీయంగానే కాదు, జాతీయంగానూ, రాహుల్ గాంధీ సహా ప్రధాని రేసులో ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరికంటే, మోడీనీ ఫస్ట్ ప్లేస్’లో ఉన్నారు. ఓ పక్షం రోజుల క్రితం ‘ఇండియా టుడే’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ డి నేషన్ సర్వే’లోనూ 53 శాతం మంది ప్రజలు మాలీ మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. మోడీ తర్వాత రెండవ స్థానంలో ఉన్న రాహుల్ గాంధీని పీఎంగా చూడాలని అనుకుంటోంది కేవలం 9 శాతం మంది మాత్రమే. అలాగే, జస్ట్ ఓ 7 శాతం మంది కేజ్రీవాల్’ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. సో, రాహుల్ గాంధీ, కేసీఆర్ వంటి ప్రతిపక్ష పార్టీల నాయకులు మోడీని  పనికిమాలిన ప్రధాని అని ఎద్దేవా చేసినా దేశ ప్రజలు మాత్రం  మోడీకే జై కొడుతున్నారని, అనుకోవచ్చును. సర్వేలే కాదు. ఎన్నికల ఫలితాలు కూడా అదే సుస్చిస్తున్నాయి, అనుకోండి, అదివేరే విషయం.    అదలా ఉంటే, దేశీయంగానే కాదు, అంత‌ర్జాతీయంగా కూడా  ప్రధాని మోడీ ఛ‌రిష్మా ఒకేలా వుంది. ప్రధాని పదవిలో ఎనిమిదేళ్లు పూర్తిచేసుకున్న మోడీకి జాతీయ స్థాయిలో ఎంత ఫాలోయింగ్ ఉందో అంత‌ర్జాతీయంగా కూడా అంటే  ఫాలోయింగ్ ఉందని మరో మారు రుజువైంది. అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ "మార్నింగ్ కన్సల్ట్‌ "ప్ర‌పంచ అత్యుత్త‌మ నేత‌” ఎవరనే విషయంగా నిర్వహించిన స‌ర్వేలో మోడీ మళ్ళీ మొదటి స్థానంలో నిలిచారు. ఓటింగ్’లో పాల్గొన్న వారిలో 75 శాతం మంది, ‘మోడీ ది బెస్ట్’  అని కితాబు నిచ్చారు.  ప్రపంచ నేతల్లో నరేంద్ర మోడీయే మళ్లీ నెంబర్ వన్ గా నిలిచారు. మొత్తం 22 మంది అంతర్జాతీయ నేత‌ల‌పై మార్నింగ్ కన్సల్ట్‌ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ 22 మంది దేశాధినేతల్లో అత్యధికంగా 75 శాతం రేటింగ్ సంపాదించుకుని మోడీ ప్రధమ స్థానంలో  నిలిచారు. 63 శాతం ఆమోదంతో రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడార్ ఉండగా, 54 శాతంతో మూడో స్థానంలో ఇటలీ ప్రధానమంత్రి మారియో ద్రాగి నిలిచారు. అయితే ఈ సర్వేలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం 41 శాతం అప్రూవల్ రేటింగ్తో 5వ స్థానంతో సరిపెట్టుకున్నారు. కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో 39 శాతం, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద 38 శాతంతో బైడెన్ తర్వాత స్థానంలో ఉన్నారు. మార్నింగ్ కన్సల్ట్‌... పలు దేశాలను పాలించే నేతలకున్న ప్రజామోదాన్ని ట్రాక్‌ చేస్తుంది. ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా ఈ రాజకీయపరమైన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తుంది. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, జర్మనీ, బ్రెజిల్, స్పెయిన్, నెదర్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ వంటి దేశాల్లో ఈ సంస్థ సర్వేను నిర్వహించింది. ఈ సంస్థ ఈ సర్వేను ప్రారంభించినప్పటి నుంచి ప్రధాని మోడీ అప్రూవల్ రేటింగ్స్ 2020 మే నెలలో అత్యధిక స్థాయిలో కనిపించాయి. అయితే గత ఏడాది కొవిడ్ రెండో ప్రభంజనం సమయంలో ఆయన అప్రూవల్ రేటింగ్స్ అతి తక్కువ స్థాయికి పతనమయ్యాయి. ఈ సంవత్సరం జనవరిలో విడుదలైన ఒక సర్వేలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటి స్థానంలో నిలిచారు.ఇప్పడు మళ్ళీ అదే స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

తెలంగాణాను న‌యా నిజాం దోచేస్తున్నారు.. జేపీ న‌డ్డా

తెలంగాణాను న‌యా నిజాం దోచేస్తున్నార‌ని, మీర్ ఉస్మాన్ అలీఖాన్ బాట‌లోనే కేసీఆర్ న‌డుస్తున్నాడ‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా అన్నారు. వ‌రంగ‌ల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో బీజేపీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో న‌డ్డా ప్ర‌సంగించారు. త్వ‌ర‌లోనే ప్ర‌జ‌లు కేసీఆర్‌ను ఇంటికి పంపు తార‌ని, రాష్ట్రంలోప్ర‌జాస్వామ్యాన్ని కేసీఆర్ సాగ‌నీయ‌డం లేద‌ని న‌డ్డా అన్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటిఎంలా మారింద‌ని ఎద్దేవా చేశారు. మల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మిస్తామ‌ని హామీ ఇచ్చ జైలును కూల్చ‌డం త‌ప్ప మ‌రే  నిర్మాణం చేప‌ట్ట‌లేద‌ న్నారు.    టీఆర్ ఎస్ పాల‌న‌లో తెలంగాణా అంధ‌కారంలోకి వెళ్లింద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బండి సంజ య్ చేప‌ట్టిన మూడు విడ‌త‌ల పాద‌యాత్ర విజ‌య‌వంత‌మైంద‌ని న‌డ్డా ఆనందం వ్య‌క్తం చేశా రు. కేసీఆర్ పాల‌న‌కు ముగింపు ప‌ల‌కాల‌నే సంజ‌య్ పాద‌యాత్ర చేప‌ట్టార‌ని న‌డ్డా అన్నారు. బీజేపీ స‌భ ఏర్పాటుకు ఇక్క‌డి ప్రభుత్వం అడుగ‌డుగునా ఆంక్ష‌లు పెట్ట‌డంప‌ట్ల బీజేపీ నేత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 144 సెక్షన్ బూచి చూపి జనం రాకుండా అడ్డుకున్నారని.. హైకోర్టు అనుమతితో సభ నిర్వహించు కుంటున్నామని జేపీ నడ్డా తెలిపారు.   కేంద్ర ప్రభుత్వ నిధులను కేసీఆర్ సర్కార్ దుర్వినియోగం చేస్తోంది.  జల్‌ జీవన్‌ మిషన్  కింద తెలంగా ణకు కేంద్రం 3,500 కోట్లు కేటాయింపు.  తెలంగాణ ప్రభుత్వం రూ. 200 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదు.  అవినీతికి పాల్పడ్డ కేసీ ఆర్‌లో భయం మొదలైంద‌ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.   

మూజ్ పాట‌.. భార‌త్‌,పాక్ సైనికుల ఆనందం!

ఎవ‌ర‌యినా పాట విన‌గానే కాస్తంత మ‌న‌సూ పారేసుకుంటారు. సినిమాపాట మ‌రీ న‌చ్చిన పాట ఎక్క‌డి నుంచి విన‌ప‌డుతున్నా ఓ క్ష‌ణం ఆగి ఓ ముక్క అలా విని మ‌రీ క‌దులుతారు. అదీ సంగీతం మ‌హిమ‌. సంగీతానికి దేశ‌,ప్రాంత‌, జాతీ భేదాలు ఉండ‌వు. పాట పాటే, సంగీతం సంగీత‌మే. వినే మ‌న‌సుండాలే గాని తెలుగు, హిందీ, పంజాబీ.. మ‌రే భాష‌ద‌యినా స‌రే విన‌సొంపుగా ఉంటే చాలు. కొన్ని పాట‌లు దేశ విదేశాల్లో వీరాభిమానుల‌ను ఎప్ప‌టికీ ఆక‌ట్టుకుంటాయి. అదుగో అలాంటి ఇటీవ‌లి పాటే బంబిహా బోలే అనే పాట‌. పంజాబీ సింగ‌ర్ సిద్ధు మూస్‌వాలా అద్భుతంగా పాడిన‌ది. దీనికి పాకిస్తాన్ పంజాబీలు ఫిదా అయ్యారు. అది విన‌కుండా నిద్ర‌పోనంత‌గా ఆ పాట వీరాభిమానుల‌ను సంపాదించుకుంది. అన్న‌ట్టు భార‌త సైని కులు భార‌త్‌,పాక్ స‌రిహ‌ద్దు ద‌గ్గ‌ర స‌ర‌దాగా పాడుకుంటూంటే, అటు వేపు పాకిస్తాన్ సైనికులూ స‌ర‌దాగా డాన్స్ వేస్తూ వారి అభిమానాన్నీ చాటారు. అదీ మూజ్ పాట మ‌హ‌త్తు! దీనికి సంబంధించి ఓ ట్విట‌ర్ ను ఐపిఎస్ అధికారి హెచ్‌జి ఎస్‌.ధాలివాల పోస్టు చేశారు. సిద్దు పాట స‌రిహ‌ద్దుకి రెండు వేపులా ఎంతో యిష్టంగా వింటూ డాన్స్ చేయ‌డం గ‌మ‌నార్హం. అదో అద్భుతం. పాట‌కు, సంగీతానికి దేశ స‌రిహ‌ద్దులు తుడిపేసే శ‌క్తి ఉంద‌న‌డానికి ఇదో తాజా రుజువు!  శారీర‌కంగా రెండు దేశాల పౌరులుగా విడ‌పోయిన‌ప్ప‌టికీ పంజాబీలుగా సంగీత‌ప్రియులుగా అంతా ఒక్క‌టే అని ఒక నెటిజ‌న్ టాగ్‌పెట్ట‌డం మ‌రింత ఆక‌ట్టుకుంది. నిజ‌మే. ఒక్క పాట‌, ఒక్క గాయ‌కుడు ఎంత దారు ణాన్న‌యినా, విబేదాల‌న‌యినా మ‌ర్చిపోయేలా చేస్తారు. ఈ పంజాబీ పాట 2020లో విడుద‌ల అయింది. మూజ్‌తో పాటు అమృత్ మాన్ కూడా గొంతు క‌లిపారు. 207 మిలియ‌న్ మంది చూసి త‌రించార‌ట‌!  కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ అంత అద్బుత సింగర్ మూజ్ మే 29న మాన‌సా జిల్లా జ‌వ‌హార్కె గ్రామంలో హ‌త్య‌కు గుర‌య్యాడు. 

కింగ్ కోహ్లీ ప‌రుగుల వ‌ర‌ద సృష్టిస్తాడా?

ర‌న్‌మిష‌న్‌, రికార్డుల రాజు, కింగ్ కోహ్లీ మ‌రొక రికార్డుకు అత్యంత చేరువ‌లో ఉన్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ ఇటీవ‌ల అంత‌గా ప‌రుగులు చేయ‌క ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానుల‌ను కాస్తంత నిరాశ ప‌ర‌చిన మాట వాస్త‌వ‌మే. గ‌తం గ‌తహా అన్నారు పెద్ద‌లు. ఆ ఆలోచ‌న‌ల్లోంచి బ‌య‌ట‌ప‌డి కొత్త‌గా కింగ్ ఆసియా క‌ప్ లోకి దిగ‌నున్నాడు. ఫామ్ కోల్పోయి విమ‌ర్శ‌లు ఎదుర్కొన‌డం స‌చిన్ అంత‌టివాడికీ త‌ప్ప లేదు. అవ‌న్నీ క్రీడారంగంలోనూ మామూలే. ప్ర‌స్తుతం ఆ పాచ్ దాటి కొత్త కోహ్లీ నూత‌నోత్సాహంతో రెచ్చి పోయే స‌మ‌యం వ‌చ్చింద‌ని వీరాభిమానుల మాట‌. ఎవ‌రెన్ని చెప్పినా రికార్డులు సృష్టించ‌డం కోహ్లీ వంటివారికే సాధ్య‌ప‌డుతుంది. విమ‌ర్శ‌కుల‌కు ఆసియాక‌ప్ లో మంచి స్కోర్ త‌ప్ప‌కుండా సెంచరీ సాధించి బ్యాట్‌తో స‌మాధానం చెబుతాడ‌నే ఆశించాలి.  ఆసియాక‌ప్‌లో తొలిమ్యాచ్‌లోనే చిర‌కాల ప్ర‌త్య‌ర్ధి పాకిస్తాన్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఇంత‌వ‌ర‌కూ 99 టీ 20 మ్యాచ్‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హించిన కోహ్లీకి ఈ తొలి మ్యాచ్ వందో మ్యాచ్ అవుతుంది. అంటే క్రికెట్ అన్నిఫార్మాట్స్‌లోనూ సెంచరీ సాధించిన భార‌త్ సూప‌ర్‌స్టార్‌గా రికార్డుల‌కు ఎక్కుతాడు. 2008లో అంత‌ర్జా తీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కోహ్లీ కెరీర్ అద్భుతంగా మ‌ల‌చుకుని ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానుల‌ను సంపాదించుకున్నాడు.  ఇప్పటి వరకు 99 టీ20లు ఆడిన కోహ్లీ 50.12 సగటుతో 3,308 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 94 పరుగులు. 30 అర్ధ సెంచరీలు చేశాడు. 2017-2021 మధ్య కాలంలో కోహ్లీ 50 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. అందులో 30 మ్యాచుల్లో జట్టును విజయాల బాటలో నడపగా 16 మ్యాచుల్లో జట్టు ఓటమి పాలైంది. రెండు మ్యాచ్‌లు టై కాగా, మరో రెండింటిలో ఫలితం తేలలేదు. కెప్టెన్‌గా అతడి విజయాల రేటు 64.58గా ఉంది.  ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా జట్టుకు విజయాన్ని అందించడంతోపాటు తన సెంచరీల సంఖ్యను 71కి పెంచుకోవాలని కోహ్లీ పట్టుదలగా ఉన్నాడు. కోహ్లీ చివరి సారి నవంబరు 2019లో సెంచరీ బాదాడు. ఆ తర్వాత 27 టీ20లు ఆడినా సెంచరీ చేయడంలో విఫలమయ్యాడు. అలాగే, చివరి సెంచరీ తర్వాత ఎనిమిది అర్ధ సెంచరీలు సాధించాడు. అలాగే, చివరి సెంచరీ తర్వాత అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు 68 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 2,554 పరుగులు చేశాడు. అందులో 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి.  ఈ ఏడాది కోహ్లీ ఇప్పటి వరకు ఆడింది నాలుగు టీ20 మ్యాచ్‌లే. 81 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో ఈ ఏడాది విరాట్ అత్యధిక స్కోరు 52 పరుగులు మాత్రమే. అన్ని ఫార్మాట్లలో కలిపి ఈ ఏడాది 16 మ్యాచుల్లో 19 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 476 పరుగులు మాత్రమే చేశాడు. బెస్ట్ 79 కాగా, నాలుగు అర్ధ సెంచరీలు మాత్ర మే చేశాడు. ఈ నేపథ్యంలో ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌పైనే అందరి కళ్లూ ఉన్నాయి. 

రామ‌గుండం ఎరువుల ప‌రిశ్ర‌మ‌పై కేసీఆర్‌కు రేవంత్ లేఖాస్త్రం

తెలంగాణాలో ఎరువుల ప‌రిశ్ర‌మ‌లో చోటు చేసుకుంటున్న అవ‌క‌త‌వ‌క‌లు, అవినీతి ప‌ట్ల టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. రామ‌గుండం ప‌రిశ్ర‌మ‌లో ఉద్యోగాల నియామ‌కంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగా య‌ని ఆయ‌న తెలంగాణా సీఎం కేసీఆర్ కు రాసిన లేఖ‌లో తెలియ‌జేశారు.  మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్‌ కలిసి దాదాపు 800 మంది నిరుద్యోగుల నుంచి రూ. 6 లక్షల నుంచి రూ.15 లక్షలవరకు వసూలుచేసి తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చారని లేఖలో తెలిపారు. ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామని..అవసరం అనుకుంటే ఆ ఉద్యోగాన్ని వేరే వాళ్లకు అమ్ముకోవచ్చని బాధితులకు నమ్మబలికారన్నారు. ఉద్యోగాల నియామకంలో దాదాపు రూ. 50 కోట్లు చేతులు మారాయని సీఎం కేసీ ఆర్ కు రాసిన లేఖలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.  ఈనేపథ్యంలోనే ఇటీవల రామగుండం ఉద్యోగాల నియామక కాంట్రాక్ట్ మారిందని..వారు గతంలో నియ మించిన వారిలో సగం మందిని తొలగించారని పేర్కొన్నారు. ఇప్పుడు బాధితులంతా ఆందోళనలు, ఉద్య మాలు చేస్తున్నారని చెప్పారు. ఈక్రమంలోనే తీవ్రంగా మానసిక ఆందోళన గురై కేశవపట్నం మండలం అమ్మలపురానికి చెందిన హరీష్‌ అనే యువకుడు సెల్ఫీ వీడియో పెట్టి బావిలో దూకి ఆత్మ హత్య చేసుకు న్నాడని లేఖలో సీఎం దృష్టికి తీసుకొచ్చారు రేవంత్‌రెడ్డి. 

కుటుంబ‌పాల‌న‌ను త‌రిమికొట్టాలి.. రాజ‌గోపాల్‌రెడ్డి పిలుపు

తెలంగాణలో కుటుంబ పాలనను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచి పోయే తీర్పు ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డి కోరారు.  త‌న రాజీనామా త‌ర్వాత‌నే సీఎం కేసీఆర్ ఫామ్‌ హౌస్‌నుంచి మునుగోడుకి వ‌చ్చార‌ని, త్వ‌ర‌లోనే కేసీఆర్‌, కేటీఆర్ స్కామ్‌లూ బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని మాజీ ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు.  ఆయ‌న శ‌నివారం (ఆగ‌ష్టు 27) మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి అమిత్ షా రాక‌తోనే ఎమ్మెల్సీ క‌విత ఢిల్లీ లిక్క‌ర్ బాగోతం బ‌య‌ట‌ప‌డింద‌ని అన్నారు. మునుగోడు ఉపఎన్నిక‌కు నోటిఫికేష‌న్ రాక‌ముందే ప్ర‌చారాన్ని త‌ల‌పించేఆ బ‌హిరంగ స‌భ‌లు, స‌మావేశా లు, చేరిక‌ల్లో పార్టీలు త‌ల‌మున‌క‌లు కావ‌డం గ‌మ‌నిస్తున్నాం. మోవంక అధికారులు మునుగోడు ఉప ఎన్నిక కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఎన్నిక‌ల క‌మిష‌న్‌షెడ్యూల్‌ను ప్ర‌క‌టించేలోగా ఈవీఎంలను సిద్ధం చేస్తు న్నారు. జిల్లాలో ఈవీఎంల కొరత ఉండగా, ఎన్నికల కమిషన్‌ అనుమతి మేరకు యాదాద్రి జిల్లా నుంచి వాటిని తీసుకోనున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైందన్న‌ది తెలిసిందే.  ఆయన రాజీనామాతో ప్రధాన పార్టీలు భారీ సభల తో తొలి దశ ప్రచారానికి తెర లేపాయి.

క‌ర్ణాట‌క విద్యారంగం పై మోదీకి  ఫిర్యాదు

క‌ర్ణాట‌కాలో అవినీతి మితిమీరింద‌ని రాష్ట్రంలో విద్యాసంస్థ‌ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. పాఠశాల‌ల‌కు గుర్తింపు స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డానికీ లంచాలు డిమాండ్ చేయ‌డం దారుణ‌మ‌ని, దీనిపై వెంట‌నే ద‌ర్యాప్తు చేప‌ట్టా ల‌ని ప్ర‌ధాని మోదీకి రాసిన లేఖ‌లో కోరారు.  ది అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్స్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్, ది రిజిస్టర్డ్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఈ లేఖను రాశాయి. దాదాపు 13వేల  ప్రైవేటు పాఠశా లలు, విద్యా సంస్థలకు ఈ సంఘాలు ప్రాతినిధ్యంవహిస్తున్నాయి. అశాస్త్రీయమైన, హేతుబద్ధత లేని, వివక్షాపూరితమైన, ఆచరణ సాధ్యంకానటువంటి నిబంధనలను కేవలం అన్ఎయిడెడ్ పాఠశా లలకు మాత్రమే వర్తింపజేస్తోందని ఈ లేఖలో మోదీకి తెలిపాయి. అవినీతి తారస్థాయిలో ఉందని ఆరోపిం చాయి.   రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్‌కు అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం కనిపించలేదని చెప్పా యి. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. అస‌లు విద్యావ్యవ‌స్థ‌నే నీరుగార్చార‌ని ఆరోపించారు. బడ్జెట్ స్కూళ్ల‌కు ఇద్ద‌రు బీజేపీ విద్యాశాఖా మంత్రులు తీర‌ని న‌ష్టం చేశార‌ని ఆరోపిం చాయి. అంతే గాక‌, పెట్టుబ‌డిదారుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి విద్యాశాఖ ఆస‌క్తి చూప‌డంలేద‌ని పేర్కొన్నారు.  బడ్జెట్ స్కూళ్ళకు ఇద్దరు బీజేపీ విద్యాశాఖ మంత్రులు తీరని నష్టం చేశారని ఆరోపించాయి. తల్లి దండ్రుల నుంచి భారీ స్థాయిలో ఫీజులు గుంజుతున్న పాఠశా లల కన్నా బడ్జెట్ స్కూళ్ళను దారుణంగా దెబ్బతీశారని పేర్కొన్నాయి. 

జీఎన్ ఏ  డిఎన్ ఏ ..మోడీ ఫైడ్‌... ఆజాద్‌పై కాంగ్రెస్ పంచ్‌లు

పార్టీనుంచి బ‌య‌ట‌ప‌డిన‌పుడే అవ‌త‌లి వ్య‌క్తి నిజ‌స్వ‌రూపాలు బ‌య‌ట‌ప‌డ‌టం ఈమ‌ధ్య కాంగ్రెస్‌కీ అను భ‌వమ‌వుతోంది. సీనియ‌ర్ నేత గులాంన‌బీ అజాద్ పార్టీ ప‌ద‌వులు, స‌భ్య‌త్వాన్ని కాద‌ని బ‌య‌ట ప‌డ్డారు. అయితే దాని వ‌ల్ల త‌మ‌కు న‌ష్టం లేద‌న్న‌ట్టుగా కాంగ్రెస్ నాయ‌కులు చెబుతున్నారు. ఆజాద్‌కి బీజేపీ వారి ప‌ట్ల అనూహ్య‌రీతిలో ప్రేమ క‌ల‌గ‌డంలో పెద్ద ఆశ్చ‌ర్య‌ప‌డ‌న‌వ‌స‌రం లేద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు అంటున్నా యి. జీఎన్ ఏ (గునాంన‌బీ ఆజాద్‌) డీఎన్ఏ మోడీ ఫై అయింద‌ని పంచ్‌లు విసురుతు న్నారు. పార్టీ నాయ కత్వం పట్ల ద్రోహానికి పాల్పడి.. తన నిజ స్వరూ పాన్ని బయటపెట్టారని దుయ్య బట్టారు.  ఆజాద్‌ రిమోట్‌ కంట్రోల్‌ ప్రధాని మోదీ చేతిలో ఉందని, ఈ విషయం రాజ్యసభ పదవీ కాలం ముగిసిన సమయంలోనే బయటపడిందని విమర్శించారు. ఆజాద్‌, మోదీల మధ్య ప్రేమ పార్లమెంటులోనే కని పించింద‌ని వ్యాఖ్యానించారు. తొలుత మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత పద్మవిభూషణ్‌ ఇచ్చారు. అనంతరం నివాస సదుపాయాన్ని పొడిగించారు.  ఇవేమీ యాదృచ్చికంగా జరిగినవికాదు. వ్యూహాత్మకంగా, సహకార పద్ధతిలో జరిగినవేన‌ని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్‌ ఇన్‌చార్జి జైరాం రమేశ్‌ దుయ్యబట్టారు. తన రాజీనామా లేఖలో అగ్ర నేత రాహుల్‌ గాంధీని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని రమేశ్‌ తప్పుబట్టారు.   పార్టీని బలహీన పరుస్తున్నవారే.. పార్టీ బలహీనపడిందని ఎదురు దాడి చేస్తున్నారని మీడియా విభాగం ఇన్‌చార్జి పవన్‌ ఖేరా నిప్పులు చెరిగారు. ఆజాద్‌ రాజీనామా జీ-23 నేతలను కూడా విస్మయానికి గురి చేసిం ది. తాము కోరుకున్నది ఇది కాదని వారిలో ఒకరైన మాజీ ఎంపీ సందీప్‌ దీక్షిత్‌ అన్నారు.  

దక్షిణాది పై పట్టు కోసం ..  కమల దళం కొత్త వ్యూహం

భారతీయ జనతా పార్టీ, 2024 ఎన్నికలలో ముచ్చటగా మూడవసారి విజయం సాధించి, హ్యాట్రిక్ సొంతం చేసుకునేందుకు, ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఒకప్పుడు కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన పార్టీ, ఇప్పుడు ఇక్కడ  అక్కడ  అని కాకుండా, దేశం అంతటా ప్రాబల్యం పెంచుకు నేందుకు గట్టి ప్రయత్నాలు సాగిస్తోంది. ముఖ్యంగా 2024 ఎన్నికల నాటికి  దక్షిణాదిలో పాగా వేసేందుకు, వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందుకోసంగా, ‘బీజేపీ సౌత్ మిషన్’ పేరిట బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేసిందని పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. ఇందు భాగంగానే, కమల దళం ఉభయ తెలుగు రాష్ట్రాలపై  ప్రత్యేక దృష్టి ని కేంద్రీకరించింది.  నిజానికి, అమిత్ షా 2014లో పార్టీ అధ్యక్ష పదవి చేపట్టినప్పుడే ఇప్పటి వరకు పార్టీ ఒకసారి  కూడా అధికా రంలోకి రాలేని దక్షిణ, తూర్పు రాష్ట్రాలలో అధికారం చేపట్టడమే పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యంగా ప్రక టించారు. ఆ తర్వాత అస్సాంతో సహా  పలు  ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగరేసింది. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ప్రధాన ప్రతిపక్షంగా సమీప భవిష్యత్తులో అధికారం లోకి రాగలమనే ధీమాతో ఉన్నారు.   అయితే, మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో ఆ వ్యూహాలు ఫలించలేదు.  ఇతర పార్టీల నుండి పేరొందిన నాయకులను దిగుమతి చేసుకోవడం, ఇతర రాష్ట్రాల నుండి సొంత నాయకులను తీసుకురావడం, ప్రముఖ సినీ తారలను ఆకట్టుకోవడం, ప్రాంతీయ  పార్టీలలో చీలికలను ప్రోత్సహించడం వంటి అనేక ప్రణాళికలు చెప్పుకోదగిన ఫలితాలు ఇవ్వలేదు. గతంలోని కొన్ని వ్యూహాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో పార్టీ ఇప్పుడు దక్షిణాదిని విస్తరిం చేందుకు, 2024 ఎన్నికలలో కొత్త ఎన్నికల విజయాలను సాధించేందుకు కొన్ని కీలక మార్పులతో సరికొత్త ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. దక్షిణాది రాజకీయాలు ఉత్తరాదికన్నా భిన్నమైనవని పార్టీ నాయకత్వం గ్రహించింది.  ఉత్తరాదిలో మంచి ఫలితాలు ఇస్తున్న హిందుత్వ రాజకీయాలకు భిన్నమైన రీతిలో, సైద్ధాంతిక అంశాలకు, సంక్షేమ కార్యక్రమాలకు  మధ్య గల సరిహద్దులను అధిగమించి దక్షిణాది ప్రజలకు ఆమోదయోగ్యమైన పార్టీగా నిలబడే కృషి ప్రారం భించారు. ఐదు దక్షిణాది రాష్ట్రాలలో మూడింటిలో ప్రాంతీయ పార్టీలు రాజకీయ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తు న్నం దున,ఈ ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడానికి బిజెపి వారసత్వ రాజకీయాలపై పోరాటం ఆయు ధాన్ని ఎంచుకొంటున్నది.  కాంగ్రెస్-ముక్త్ భారత్, అవినీతి రహిత భారతదేశం 2014 నుండి ప్రముఖ బీజే పీ నినాదాలు. అయితే 2024లో `వారసత్వ ముక్త - భారత్’ నినాదాన్ని జోడింపనున్నది. తద్వారా యువత ను ఆకట్టుకోవచ్చని భావిస్తున్నది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కేడర్‌ను ఉద్దే శించి చేసిన ప్రసంగంతో ప్రారంభించి ప్రధాని మోడీ తరచూ కుటుంబ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుంటూ ప్రసంగిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ , బీజేపీకి కుటుంబ పాలన వ్యతిరేక సెంటిమెంట్  రాజకీయం గా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది.   అంతేకాకుండా, ఎన్నికలలో ఇప్పటికీ ప్రాబల్యం చూపించలేక  పోతున్న  రాష్ట్రాల్లో పార్టీ సరికొత్త విధా నాన్ని ఆవలంభించ వలసిన అవసరాన్ని గుర్తించింది. పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో తప్ప మిగి లిన రాష్ట్రాలలో క్షేత్రస్థాయిలో బీజేపీ పటిష్టంగా లేదన్నది వాస్తవం. కాబట్టి పార్టీ మొత్తం రాష్ట్రంపై దృష్టి పెట్టకుండా, కొన్ని నియోజకవర్గాలను కైవసం కోవడంపై దృష్టి సారిస్తూ, ఆ బాధ్యతలను కేంద్ర మంత్రు లకు  అప్పచెప్పి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా అక్కడ పట్టు సాధించే ప్రయత్నం చేపట్టనుంది. ఉదాహరణకు, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు సాపేక్షంగా మెరుగైన పనితీరు కనబరిచిన కేరళలోని లోక్‌సభ నియోజకవర్గాలకు కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్, అశ్విని కుమార్ చౌబే, శోభా కరంద్లాజేలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి తెలంగాణలో నియోజక వర్గాల ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. తమిళనాడులో, రాష్ట్రంలోని ఉత్తరాది ప్రాంతాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఆ సామాజికవర్గ ప్రభావాన్ని ఉపయోగించుకునేలా, ఆధిపత్య వన్నియార్లను ఆకర్షించడానికి పార్టీ తన ప్రయత్నాలను కొనసాగి స్తుంది. దాదాపు 150 బలహీన నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని ‘ప్రవాస్’ ప్రచారంతో పాటు రూపొందించిన కొత్త వ్యూహం, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరించి, ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే పట్టుదలను వెల్లడి చేస్తుంది. ఇప్పటి వరకు దక్షిణాదిన చేస్తున్న ప్రయత్నాలు తగు ఫలితాలు ఇవ్వకపోవడం గ్రహించి,  సరికొత్త వ్యూ హాలతో బిజెపి సరికొత్త సౌత్ మిషన్‌ను సిద్ధం చేశారు. ఉదాహరణకు, తమిళనాడులో, రజనీకాంత్ వంటి ప్రముఖ స్టార్‌ను ఆకట్టుకోవడం కోసం ప్రయత్నించి విఫలమైంది.   ఏఐఏడీఎంకేతో పొత్తు కూడా ఆశిం చిన ప్రయోజనం చేకూర్చలేక పోయింది. అదేవిధంగా, కేరళలో, భరత్ ధర్మ జనసేన  (బిడిజెఎస్)  ద్వా రా ఓబిసి ఈజ్వా కమ్యూనిటీని ప్రభావితం చేయడానికి చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితం ఇవ్వ లేదు. అయితే తెలంగాణలో టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాజీ నమ్మకస్తుడైన ఈటెల రాజేందర్‌ ను పోటీకి దింపి హుజూరాబాద్‌ అసెంబ్లీ సీటును బీజేపీ గెలుచుకో గలిగింది.   ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులలోని కొన్ని నియోజకవర్గాలపై బీజేపీ ప్రధానంగా దృష్టి సారిస్తుం డగా, తెలంగాణ మాత్రం బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి బలమైన అవకాశం ఉందని భావిస్తు న్నారు. ప్రముఖ క్రీడాకారిణి పి టి ఉష (కేరళ), సంగీత మాంత్రికుడు ఇళయరాజా (తమిళనాడు), వితరణశీలి వీరేంద్ర హెగ్డే, సినీ రచయిత కె వి విజయేంద్ర ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)లను రాజ్యసభకు నామినేట్ చేయ డానికి ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్య దక్షిణాది రాష్ట్రాలపై దాని కొత్త జోరులో భాగమే.   పైగా, తెలంగాణ నుండి డా. లక్ష్మణ్ కు, కర్ణాటక నుండి యడ్డ్యూరప్పకు పార్టీ పార్లమెంటరీ బోర్డు, ఎన్ని కల కమిటీలలో స్థానం కల్పించారు. డా. లక్ష్మణ్ కు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చారు. సంస్థాగత వ్యవహారాలలో నిపుణుడైన సునీల్ బన్సల్ ను తెలంగాణతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ లలో పార్టీ సంస్థాగత వ్యవ హారాల ఇన్ ఛార్జ్ గా పంపారు. ఏ మూడు రాష్ట్రాలలో అడిహకారంలోకి రావడంకోసం కృషి చేస్తుండడం తెలిసిందే. నిజానికి, 2024లో తిరిగి అధికారాన్ని నిలుపుకోవడంతో పాటుగా, ప్రాంతీయ పార్టీ ల ప్రాబల్యా న్ని కట్టడి చేసేందుకు, బీజేపీ దీర్ఘకాల ప్రణాళికతో ముందుకు వస్తోందని, పార్టీ వర్గాల సమా చారంగా ఉందని, అంటున్నారు.   

ఎక్క‌వ‌ద్దు... మీ మ‌మ్మీ న‌న్నుకొడుతుంది! 

పిల్ల‌ల‌కి పాక‌డం రావ‌డం ఆల‌స్యం ఇల్లంతా తిరిగేస్తుంటారు. వారికి అదో ఆట‌. ఇల్లంతా క‌లియ తిర‌గ డానికి ప్ర‌య‌త్నిస్తుంటా. కానీ అంత శుభ్రంగా ఉందీ లేనిదీ త‌ల్లిదండ్రుల‌కు తెలుసు కాబ‌ట్టి పిల్ల‌ల్ని అలా ఇల్లంతా పాక‌నీయ‌రు. ఓ క్షణం త‌ర్వాత ఎత్తుకుంటారు. కానీ కొత్త‌గా నేర్చిన ఆట ఎప్పుడూ ప‌సం దుగానే ఉంటుంది.. పిల్ల‌ల‌కీ అంతే. మాట‌లు రావు గ‌నుక చేత్తుల‌తో ఎత్తుకున్న‌వారి మొహాన్ని కొడుతూ కింద‌కి వ‌ద‌ల‌మంటారు. త‌ల్లిందండ్రులకు, ఇంట్లో పెద్ద‌వారికి అదో ఆనందం. దానికి అంతే ఉండ‌దు.  కానీ ఇలా అమితోత్సాహంతో పిల్ల‌లు మేడ మెట్లు ఎక్క‌డానికీ ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇది ప్ర‌మాద‌క‌రం. అందుకే వెన‌కాలే తిరుగుతూ మెట్ల వేపు వెళ్ల‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతుంటారు, జాగ్ర‌త్త‌ప‌డాలి. న‌డ‌క వ‌స్తే ప‌ట్టుకోవడం మ‌రీక‌ష్టం. ఇంట్లో పిల్ల‌ల‌తో పాటు కుక్క‌పిల్ల‌నీ అంతే  ప్రేమ‌గా చూసుకునేవారు చాలా మందే ఉన్నారు. అది కూడా అలా పాకుతూనో, న‌డ‌క‌నేర్చి రెండు అడుగులు వేసే పిల్ల‌ల‌తోనో తిరుగు తూనే ఉంటుంది. దానికి పెద్ద‌వాళ్ల త‌ర్వా త ఇంట్లో హ‌ఠాత్తుగా ఈ రాజు, రాకుమారి ఎవ‌రా అని ఆశ్చ‌ర్యం.  మెల్ల‌గా ఇంట్లోవారు పిల్ల‌నో, పిల్లాడినో ఎలా చూస్తున్నార‌న్న‌ది కుక్క‌పిల్లా గ‌మ‌నిస్తుంది. అదీ అంతే జాగ్ర త్త‌లు తీసుకుంటుంది. వేగంగా వెళు తుంటే అడ్డుకోవ‌డం, మెట్లు ఎక్క‌బోతే వారించ‌డ‌మే చేస్తుంది. పిల్ల లు కోప‌గించి దాన్ని కొడ‌తారు. దానికి  దెబ్బే త‌గ‌ల‌దు కానీ,  అడ్డుకోవ‌డం మాత్రం మాన‌దు. ప‌డ‌తార‌న్న భ‌యం త‌ల్లిదండ్రుల‌కు ఎలా ఉంటుందో తోడుగా తిరిగే కుక్క‌పిల్ల‌కీ ఉంటుందేమో!  మీరు చూస్తున్న ఫోటోలో సీన్ అదే. ఆ ప‌సికూన మెట్లెక్క‌డానికి విశ్వ‌య‌త్నం చేస్తోంది. స‌సెమీరా అంగీ క‌రించ‌ని కుక్క అడ్డుకుంటోంది. పిల్ల‌డు ఎక్కి ప‌డితే త‌ల్లిదండ్రులు ఓదార్చి ముద్దెడ‌తారు. కానీ త‌న్ను లు మాత్రం త‌న‌కు త‌ప్ప‌వుక‌దా!  అదీ కార‌ణం కావ‌చ్చు.. అందుకునే అడ్డుకుంటోంది! ఇది ఎక్క‌డ‌ద‌ని కాదు.. ప్ర‌తీ ప్రాంతంలో దాదాపు కుక్క‌లున్న ప్ర‌తీ ఇంట్లో సీన్ ఇలానే ఉంటుంది. కుక్క‌లు య‌జ‌మాని భ‌క్తులు. తిండిపెట్టి పెంచుతున్నారు గ‌నుక‌, దెబ్బ‌లు తిన‌కూడ‌దుగ‌దా! అందుకునే ఈ ర‌క్ష‌ణకు పూనుకుంటుంది!

సోరెన్ కో న్యాయం , జగన్ కో న్యాయం .. ఇదెక్కడి అన్యాయం ?

చట్టం ముందు అందరూ సమానమే, కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం దృష్టిలో కొందరు ఎక్కువ సమానం.అవును,ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్’ అధికార దుర్వినియోగానికి పాల్ప డ్డారనే ఆరోపణపై, కేంద్ర ఎన్నికల సంఘం ఆయన పై కొరడా ఝుళిపించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం, ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆయన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది.  అయితే, ఇంతకీ సోరెన్ చేసిన నేరం ఏమిటి? ఎన్నికల సంఘం ఆయనపై వేటుకు ఎందుకు సిఫార్సు చేసింది? అంటే, ముఖ్యమంత్రి సోరెన్ తనకు తానే మైనింగ్‌ కేటాయించుకుని,అధికార దుర్వినియో గానికి పాల్పడ్డారనే ఆరోపణపై ఎన్నికల సంఘం విచారణ జరిపింది. ఆరోపణలు నిజమని తేలడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే  ఆయనపై అనర్హత వేటు వేయాలని ఈసీ ఆ రాష్ట్ర  గవర్నర్’ కు సూచించింది. గవర్నర్ సోరెన్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారు.  ఇంతవరకు అంతా బాగుంది. కానీ, సోరెన్’కు వర్తించే చట్టం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వర్తించదు అనేదే, ఇప్పుడు అందరిముందున్న ప్రశ్న. నిజానికి, జగన్ రెడ్డి, ముఖ్య మంత్రిగా కాదు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  ముఖ్యమంత్రి కుమారుడి హోదాలోనే అనేక అక్రమాలకు పాల్పడ్డానే ఆరోపణలున్నాయి. పదికి పైగా అక్రమాస్తుల కేసుల్లో ఆయన ‘ఎ వన్’ గా ఉన్నారు. అరెస్టయ్యారు. పదహారు నెలలు జైల్లో ఉన్నారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జగన్ రెడ్డి ఆస్తులు కొన్నింటిని జప్తు చేసింది. ఈరోజుకు కూడా ఆయన బైలు మీదనే ఉన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావలసి ఉన్నా, ఏదో ఒక సాకున వ్యక్తిగత హజరు నుంచి మినహాయింపు పొదుతు న్నారు.  అదెలా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి, సోరెన్ బాటలోనే పయనిస్తున్నారు. నిజానికి, సోరెన్ బాటలో జగన్ కాదు జగన్ బాటలోనే సోరెన్ తప్పటడుగులు వేస్తున్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మూడు సంవత్సరాల కాలంలో, జగన్ రెడ్డి ఫ్యామిలీ వ్యాపారాలకు ప్రభుత్వ నిధుల కేటాయిం పులు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన పత్రిక సాక్షికి.. నేటికీ నెలకు రూ. ముఫ్పై కోట్ల వరకూ ప్రజాధనం ప్రకటనల రూపంలో పంపిణీ అవుతూ ఉంటుంది. పల్నాడులో ఇంత వరకూ కట్టని సరస్వతి పవర్ పరిశ్రమకు పెద్ద ఎత్తున గనుల కేటాయింపులు చేసుకున్నారు. నీటి కేటాయింపులు కూడా చేసుకున్నారు. ఇక ప్రభుత్వం తరపున కొంటున్న సిమెంట్‌ లో అత్యధికం భారతీ సిమెంట్‌దే. ఇలా చెప్పుకుంటూ పోతే..జార్ఖండ్ సీఎం సోరెన్ చేసింది చాలా చిన్న తప్పు.  అందుకే, ఒక్క తప్పు చేసిన సోరెన్ అనర్హుడు అయితే, జగన్ ఎలా అర్హుడవుతారు? సోరెన్’కు ఒక రూలు జగన్ రెడ్డికి మరో రూలు, ఏమిటి? ఇదెలా న్యాయం అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. జగన్ రెడ్డి ప్రధాని మోడీ ప్రభుత్వానికి అడుగులకు మడుగులోట్టు తున్నారు, కాబట్టి ఆయన జోలికి రావడం లేదని, సోరెన్ విపక్ష శిబిరంలో ఉన్నారు కాబట్టే ఈసీ,ఆయన మెడ మీద కట్టి పెట్టిందని అంటున్నారు.

అడ్డుక‌ట్ట‌లేని పోలీసుల జులుం.. టీడీపీయే ల‌క్ష్యం

ఏపీలో అధికార‌గ‌ణానికి పోలీసులు వ‌త్తాసు ప‌లుకుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు మ‌రింత రుజువ‌వుతున్నా యి. ఇటీవ‌లికాలంలో పోలీసులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తూ, విచ‌క్ష‌ ణార‌హితంగా విప‌క్ష టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ మీదా దాడులు చేస్తున్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు ఉన్నాయి. చూడ‌ బోతే ప్ర‌భుత్వ యం త్రాంగం పోలీసు ల‌కు మ‌ద్ద‌తునిస్తున్న‌ద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతు న్నాయి.  కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తల అరెస్ట్‌లు మొదలయ్యాయి.  ఎమ్మెల్సీ గౌనివారి శ్రీని వాసులు మరో ఇద్దరు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే  రామకుప్పం మండలం మాజీ జడ్పీటీసీ సభ్యుడు మునుస్వామిని అరెస్ట్ చేశారు. టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ లను పార్టీ అధినేత చంద్ర బాబు తీవ్రంగా ఖండించారు. అక్రమ అరెస్టులకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆందోళనలకు సిద్ధ మవుతు న్నాయి. తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లమీద  లాఠీలు విసిరి, కేసులు పెట్టి, దూకుడుగా వెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుంద‌ని టీడీపీ ఆరోపిస్తున్న‌ది.  రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలను చూస్తే అవున‌నే అనే సమాధాన మే లభిస్తోంది. వైసీపీ ఆడుతున్న రాజకీయ చదరంగంలో పోలీసులు పావులుగా మారారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.   కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే గేమ్ మొదలు పెట్టిందనే టాక్ బలంగా నడు స్తోంది. ఇప్పటికే అరాచకంతో కుప్పంలో ప్రశాంత వాతావరణాన్ని మార్చేసి ఆ ప్రాంతాన్ని వైసీపీ కార్య కర్తలు రణరంగంగా మార్చారు. పోలీసులు సైతం వీరికి అండగా నిలిచారని టీడీపీ విమర్శిస్తోంది. తాజాగా టీడీపీ కార్యకర్తల అరెస్ట్‌కు వైసీపీ పెద్దలు పోలీసులను ఉసిగొల్పుతున్నారని బాహాటంగానే విమ ర్శలు వినవస్తు న్నాయి. 

జగన్ వేట.. టీడీపీ నేతలకు గాలం..?

వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాల వేటలో వైసీసీ అధినేత వైఎస్ జగన్ ఉన్నారట.. వివిధ సర్వే నివేది కలను సమీక్షించిన తర్వాత ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేల్లోని అధిక శాతం మందికి టిక్కెట్లు ఇచ్చే ఛాన్స్ లేదని ఇప్పటికే జగన్ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో వ్యక్తిగత ఇమేజ్ ఉన్న టీడీపీ నేతలకు గాలం వేయడానికి జగన్ స్కెచ్ వేశారట. తన ఇమేజ్ తోనే ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలని కలలు గన్న జగన్ ఇలా ఎందుకు టీడీపీ నేతల వైపు చూస్తున్నారనేదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ఫ్యాన్ గాలికి తిరుగే లేదని ఇంతకాలం ఊహల్లో విహరించిన జగన్.. ఇప్పుడు వాస్తవ పరిస్థితిని గుర్తించక తప్పలేదంటున్నారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అనే రీతిలో కళ్లు ఆకాశం వైపు చూసిన వైసీపీ అధి నేతకు ఇప్పుడు బొమ్మ కనిపించి.. దిమ్మదిరిగి.. అవే కళ్లు బైర్లు కమ్మి.. టీడీపీ నేతలకు ఎర వేయడానికి రెడీ అయ్యారంటున్నారు. ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి జనంలో మంచి పట్టు, పలుకుబడి ఉన్న టీడీపీ నేతలను జిల్లాకు ముగ్గురు, నలుగురు చొప్పున వైసీపీలో చేర్చుకోవాలని జగన్ తహతహలాడుతున్నారని చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో తమ పార్టీ తరఫున బరిలో దిగితే.. వారికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయినా.. తాను చూసుకుంటానని తన పార్టీలో చేరితే చాలని టీడీపీ నేతలకు జగన్ బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు సమా చారం. అయితే.. ఈ పనికి చేసేందుకు వైసీపీ నేతలను కాకుండా తనకు వ్యక్తిగత పరిచయాలున్న ఇతర నేతలను జగన్ ప్రయోగిస్తుండడం గమనార్హం. ఏమాత్రం ఈ సమాచారం లీకైనా స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు జంప్ చేసే అవకాశాలు ఉన్నాయని.. జగన్ తానే స్వయంగా ఈ పని చేసుకుంటున్నారట. జగన్ చేయించుకున్న సర్వేలో వైసీపీ మునిగిపోతున్నదని, ఇప్పుడున్న సీట్లలో సుమారు వందకు పైనే అడ్రస్ గల్లంతవుతాయని నివేదికల సారాంశంగా ఉందంటున్నారు. వైసీపీ అభ్యర్థులను మార్చేటపుడు స్థానికంగా తప్పకుండా గెలిచే టీడీపీ నేతలను తెచ్చుకోవాలని ప్రశాంత్ కిశోర్ టీమ్ జగన్ కు సలహా ఇచ్చిందట. అందుకోసం జగనే స్వయంగా టీడీపీ నుంచి నేతల ఆకర్ష్ ప్రారంభించారట. జగన్ నేరుగా రంగంలోకి దిగి, ‘క్యాష్ ఫ్రీ టిక్కెట్ పక్కా’ అంటూ హామీలు ఇస్తున్నారని సమాచారం. కరోనా అనంతరం జగన్ బండారాన్బి ఎండగడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఒక పక్క.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరో పక్కన చేస్తున్న కార్యక్రమాలు జనంలోకి బాగా వెళ్లడంతో జగన్ కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే సొంత పార్టీ నేతలకు తెలియకుండా తానే స్వయంగా గెలుపు గుర్రాలుగా భావిస్తున్న టీడీపీ నేతలను నేరుగా ఆహ్వానిస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలో ఈ మధ్యనే కొందరు రాయలసీమ టీడీపీ నేతలను జగన్ టచ్ చేశారని సమాచారం. నిజానికి రాయలసీమ ప్రాంతతో పాటు ప్రకాశంజిల్లా వరకు వైసీపీకి మంచి పట్టే ఉంది. అయితే ఇక్కడ చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ద్వితీయశ్రేణి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ విషయం పసిగట్టిన జగన్ ముందు రాయలసీమలో, ప్రకాశంజిల్లాల్లో చక్కదిద్దితే ఆ ఎఫెక్ట్ రాష్ట్రమంతా పడుతుం దని స్కెచ్ వేశారట. అయితే జగన్ ప్రతిపాదనపై కొందరు టీడీపీ నేతలు సరిగా స్పందించ లేదట. దీంతో ఆ టీడీపీ నేతల వారసుల నుండి వత్తిడి తెచ్చే ప్రయత్నం జగన్ చేస్తున్నారని తెలుస్తోంది. పాలనపై దృష్టి సారించకుండా ఇలా విపక్షంలోని నేతల కోసం పరుగులు తీయడాన్ని చూస్తుంటే.. జగన్ కు ఓటమి భయం పట్టుకుందనే అంచనాలు వస్తున్నాయి.

రాహుల్‌కు ప్ర‌త్యామ్నాయం లేరు... ఖ‌ర్గే

కాంగ్రెస్ పార్టీ నుంచి  సీనియ‌ర్ నేత గులామ్‌న‌బీ అజాద్ బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత పార్టీలో అంతా గంద‌ర గోళం నెల‌కొన్న‌ది. ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయ‌క‌త్వాన్ని ఆయ‌న వ్య‌తిరేకించ‌డం, ఆ ప‌ద‌వికి ఆయ‌న త‌గ‌డ‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌డం వివాదాస్ప‌దంగా మారింది. ఈ  ప‌రిస్థితుల్లో పార్టీని ముందుకు న‌డిపించ‌గ‌ల నేత రాహుల్ గాంధీ మాత్ర‌ మే అంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే  పార్టీ అధ్యక్షపదవిని మళ్లీ స్వీకరించాలని తాము ఆయనను ఒప్పిస్తామని అన్నారు.  ఖర్గే శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఎవరు చేపట్టినా, వారికి దేశవ్యాప్తంగా మద్దతు లభించాలన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు అందరూ మద్దతివ్వాలన్నారు. యావత్తు కాంగ్రెస్ పార్టీకి ఆ నేత ఆమోదయోగ్యుడై ఉండాలని  అటువంటి నేత రాహుల్ గాంధీ మినహా మరొకరు లేరని అన్నారు.  కాంగ్రెస్లో చేరి, పార్టీ కోసం పని చేయాలని సోనియా గాంధీపై సీనియర్ నేతలంతా గతంలో ఒత్తిడి తీసు కొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా రాహుల్ కూడా వచ్చి, పోరాడాలని అన్నారు. రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయ నేత వేరొకరు ఉన్నారా? అని ప్రశ్నించారు.  కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను చేపట్టడానికి రాహుల్ ఇష్టపడటం లేదని జరుగుతున్న ప్రచారంపై మాట్లా డుతూ, పార్టీ కోసం, దేశం కోసం బాధ్యతలు చేపట్టాలని ఆయనను కోరుతామని చెప్పారు. ఆరెస్సె స్ , బీజే పీ లపై పోరాడుతూ, దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని విజ్ఞప్తి చేస్తామని తెలిపారు.  ఇదిలావుండగా, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూలును ఆమోదించవలసి ఉంది. ఆ పార్టీ వర్కిం గ్ కమిటీ  సమావేశం వర్చువల్ విధానంలో ఆదివారం జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ ఎన్ని కల షెడ్యూలును ఆమోదించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ   అధ్యక్షత వహిస్తారు. 

సీజేఐగా జ‌స్టిస్ ల‌లిత్ ప్ర‌మాణ‌స్వీకారం

భారత సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్  శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.రాష్ట్రపతి భవన్ లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది మూర్ము జస్టిస్ యు.యు.లలిత్తో ప్రమాణ స్వీకారం చేయించారు. \ఈ  ప్రమాణ స్వీకారోత్సవంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్,  ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.సీజేఐగా జస్టిస్ ఎన్.వి. రమణ పదవీ విరమణ చేయడంతో జస్టిస్ యు.యు.లలిత్ కొత్త సీజేఐగా బాధ్యతలు స్వీకరిం చారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ కూడా పాల్గొన్నారు.

వ‌రంగ‌ల్‌లో ఫెక్సీల ర‌గ‌డ‌.. హ‌న్మ‌కొండ‌లో బండి సమావేశం

వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫ్లెక్సీల రగడ మళ్లీ మొద లైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు స్వాగతం పలుకుతూ బీజేపీ కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు సంఘటనా స్థలంలో ఆందోళన చేస్తున్నారు. ఫ్లెక్సీల చించివేత టీఆర్ఎస్ పనేనంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వరంగల్ లో హై టెన్షన్ వాతావరణం నెల కొంది. ఆందోళన చేస్తున్న పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మూడ‌వ విడ‌త ప్ర‌జాసంగ్రామ యాత్ర ముగింపు సంద‌ర్భంగా హ‌న్మ‌కొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ప్ర‌త్యేక స‌భ జ‌ర‌గ‌నుంది. దీనికి బీజేపీజాతీయ అద్య‌క్షుడు న‌డ్డాతో పాటు ముఖ్య‌నేత‌లు హాజ‌రుకానున్నారు.  జనగామ జిల్లా పాంనూర్‌ వద్ద బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ప్రజాసంగ్రామ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. మూడు రోజుల విరామం తర్వాత హైకోర్టు అనుమతితో యాత్ర ఆగిన చోట నుంచే తిరిగి మొదలైంది.  ఈ క్రమంలోనే వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ సీపీ తరుణ్‌జోషి ఉత్తర్వులను జారీ చేయడం, ఆర్ట్స్‌ కళాశాలలో సభ నిర్వహణకు ప్రిన్సిపాల్‌ అనుమతి నిరాకరించడంతో.. బీజేపీ బహిరంగ సభ నిర్వహణపైనా అనిశ్చితి నెలకొన్నది. అయితే, బీజేపీ నేతలు హై కోర్టును ఆశ్రయించి.. సభకు అనుమతి సాధించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. కళాశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సభా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవా లని సూచించింది. దీంతో బీజేపీ నాయకత్వం రెట్టించిన ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిష్ఠాత్మ కంగా సభహనుమకొండలో నిర్వహించనున్న బహిరంగ సభకు బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈనెల 21న  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటించి రాష్ట్రంలో రాజకీయ అలజడికి తెరలేపగా, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేపీ నడ్డా ఎలాంటి కీలక సందేశం పార్టీ శ్రేణులకు ఇవ్వబోతున్నార న్నది ఆసక్తికరంగా మారింది.   ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల ముఖ్యనేతలతోపాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, పలువురు సీనియర్‌ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్‌చార్జిగా నియమితులైన సునీల్‌ బన్సల్‌ శుక్రవారమే వరంగల్‌ చేరుకున్నారు. బన్సల్‌తో పాటు పార్టీ రాష్ట్ర మరో ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ తదితర సీనియర్‌ నేతలు ఈ బహిరంగసభలో పాల్గొననున్నారు

స‌భ‌కు రాకుంటే జ‌రిమానా!.. టీఆర్ ఎస్ హెచ్చ‌రిక‌

బ‌డికి రాక‌పోతే కొడ‌తానంటా రు టీచ‌ర్లు, ప‌నికి స‌రిగా రాక‌ పోతే తీసేస్తామంటారు అధికా రులు, మాట వినకుంటే తంతానంటాడు తండ్రి. . వీట‌ న్నింటికంటే చిత్ర‌మైంది టీఆర్ఎస్ వారి వాట్స‌ప్ మెసేజ్‌!  రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి రాకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుం దని, సీఎం కేసీఆర్‌ సభకు హాజరు కాని వాళ్లకు భవిష్యత్తులో లోన్లు ఇవ్వరని బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలకు వాట్స్‌ప్‌లో సందేశాలు పంపేరు.  ఇప్పుడు ఇది పెద్ద వివాద‌మైంది.  పంపడం వివాదాస్పదమైంది.  రేపు కొంగర దగ్గర కలెక్టర్‌ ఆఫీస్‌ ఓపెనింగ్‌ ఉంది. డ్వాక్రా మహిళలందరూ కేసీఆర్‌కు స్వాగతం పలకాలి. ఉదయం 11 గంటలకల్లా మునిసిపల్‌ ఆఫీసు దగ్గరికి రావాలి. రాని వారి పేర్లు నమోదు చేసుకొంటాం. వాళ్లకు భవిష్యత్తులో లోన్లు, ఎన్నికల సమయంలో డబ్బు ఇవ్వరు’ అని బుధవారం డ్వాక్రా మహిళలకు సందేశాలు వెళ్లాయి. సభకు రాలేని వాళ్లు రూ.500 ఫైన్‌ కట్టాలని మరో మెసేజ్‌ పంపారు. సమావేశానికి వెళ్లలేని కొందరు మహి ళలు తమ గ్రూప్‌ లీడర్లకు ఫైన్‌ కట్టినట్లు సమాచారం. దీనిపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ వ్యవహా రంపై విచారణ జరిపించి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధులు, బీజేపీ మహిళా కార్పొరేటర్లు శుక్రవారం బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ కమిష నర్‌కు వినతి పత్రం అందజేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, డ్వాక్రా సంఘాల లీడర్లు ఇలా బెదిరి స్తూ సందేశాలు పంపారని ఆరోపించారు