ఆకలి చుట్టూ అ...రాజకీయ దుమారం !
ఎవరో కవి, ఆకలికి అన్ని భాషలు వచ్చన్నారు. నిజం. ఆకలికి అన్నిభాషలు వచ్చును. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలలో ఆకలి మాట్లాడుతుంది. అలాగే,బెంగాలీ, పంజాబీ మరాఠీ, గుజరాతీ, అస్సామీ, ఉర్దూ, హిందీ ఇలా ఉత్తర దక్షణాది భాషలు అన్నిటిలో, ఆకలి మాట్లాడుతుంది. భారతీయ భాషలే కాదు, ప్రపంచ భాష ఇంగ్లీష్’ లోనూ ఆకలి అనర్గళంగా మాట్లాడ గలదు. అలాగే, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, చైనీస్ ఇలా మొత్తంగా ఏడువేలకు పైగా ఉన్న ప్రపంచ భాషలు అన్నిటిలో ఆకలి మాట్లాడుతుంది.మాట్లాడుతూనే వుంది. ఆకలి కేవలం మాట్లాడమే కాదు, మాట్లాడిస్తుంది.పోట్లాడుతుంది. కేకలు పెడుతుంది. కేకలు పెట్టిస్తుంది. అంతే కాదు, రాజకీయ గర్జనలు చేస్తుంది. అయితే, రాజకీయ ఆకలి కేకలు ఎంతవరకు నిజం అంటే, బొమ్మా బొరుసు రెండూ నిజమే, రెండు కాదు.
ప్రపంచంలో ఆకలి ఉన్నది ఎంత నిజమో, ఆకలి రాజకీయమూ అంతే నిజం. ఆకలిని రాజకీయ అస్త్రంగా మలచుకునే ప్రయత్నాలు దేశీయంగానే కాదు. అంతర్జాతీయంగాను జరుగుతున్నాయి. ఇందుకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2022 (జిహెచ్‌ఐ-2022) పేరిట ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఫ్ఆర్ఐ) విడుదల చేసిన తాజా నివేదిక ఒక తాజా ఉదాహరణ. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ ఆకలి సూచిలో భారత దేశం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరో ఆరు మెట్లు దిగజారి 121 దేశాల్లో 107 స్థానానికి పడిపోయింది. గత సంవత్సరం 116 దేశాల్లో 101 స్థానంలో వుంది.
అయితే, ఈ నివేదిక ఎంతవరకు ప్రామాణికం, నివేదిక తయారు చేసిన ఐఎఫ్ఆర్ఐకు ఉన్న విశ్వసనీయత ఎంత అనే విషయంలో ఎవరి అనుమనాలు వారికున్నాయి. సహజంగానే కేంద్ర ప్రభుత్వం జిహెచ్‌ఐ-2022 నివేదికను తిరస్కరించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు, జిహెచ్‌ఐ-2022ను బోగస్ నివేదిక అని కొట్టి వేస్తున్నాయి. దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు జరుగతున్నకుట్రగా పేర్కొంటున్నాయి.
ఆర్ఎస్ఎస్ అనుబంధ స్వదేశి జాగరణ్ మంచ్ (ఎస్జేఎం) అయితే భారత దేశ ప్రతిష్టను దిగజార్చే దురుద్దేశంతో, బాధ్యతారహితంగా జిహెచ్‌ఐ-2022 నివేదికను రూపొందించి/ప్రచురించి సంస్థ పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. జర్మనీకి చెందిన ప్రభుత్వేతర సంస్థ, ‘వెల్ట్ హుంగర్ హిల్ఫే పై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని జాగరణ్ మంచ్ డిమాండ్ చేసింది. నిజానికి గత సంవత్సరం ఇదే సంస్థ ఇదే తప్పుడు గణాంకాల ఆధారంగా తప్పుడు ఆరోపణలు చేసినప్పుడ, ప్రపంచ ఆహారసంస్థ (ఎఫ్ఏఓ) తప్పును ఒప్పుకుని సరిదిద్దుతామని మాటిచ్చి మళ్ళీ ఇప్పుడు అదే తప్పు చేసిందని స్వదేశి జాగరణ మంచ్ పేర్కొంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి భారత దేశం ఆర్థిక, ఆహార, ఔషద సహాయం అందుకుంటున్నఇరుగు పొరుగు దేశాలు పాకిస్థాన్, బంగ్లా దేశ్, శ్రీలంకల కంటే భారత దేశంలో పరిస్థితి అధ్వానంగా ఉందని నివేదిక పేర్కొనడం అసత్యం మాత్రమే కాదు హాస్యస్పదంగానూ ఉందని స్వదేశీ జాగరణ్ మంచ్ పేర్కొంది.
నిజానికి, కొన్ని విదేశీ సంస్థలు భారత దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు, ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడే కాదు, గతంలో దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పటి నుంచి కూడా ఇలాంటి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. అయితే, ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం విదేశీ స్వచ్చంద సంస్థల కార్యకలాపాలకు సంబందించిన నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో ఒక్క ఆకలి విషయంలోనే కాదు ఇంకా అనేక విధాల దేశం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. కొవిడ్ మరణాల విషయంలో భారత దేశ జనాభాలో కనీసం మూడో వంతు జనాభా ఉన్నా అమెరికా, అంతకంటే తక్కువ జనాభా ఉన్న మరి కొన్ని చిన్న చిన్న దేశాలతో పోల్చి దేశంలో హాహాకారాలు సృష్టించే ప్రయత్నాలు జాతీయంగా, అంతర్జాతీయంగా జరిగిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు.
మరోవంక ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఐఎఫ్ఆర్ఐ నివేదికకు, ఎర్ర తివాచీ పరిచి స్వాగతిస్తున్నాయి. హరతులిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాలకు ఇది నిదర్శనమని అంటున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇదే అదనుగా తీసుకుని ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టార్గెట్ గా వ్యంగ్య బాణాలు విసిరారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అసత్య ప్రచారంతో దేశాన్ని బలహీన పరుస్తున్నాయని ఆరోపించారు. అలాగే, ప్రధాని మోడీని విమర్శించడంలో ముందుండే తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు, తమదైన స్టైల్లో మోడీ పాలనలో కొద్ది మంది అస్మదీయులకు మాత్రమే అచ్చే దిన్, అమృత కాల్ దేశానికి మాత్రం డబుల్ ఇంజిన్ విధ్వంశం” అని ట్వీట్ చేశారు.
అయితే, 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కేవలం 3000 మంది అభిప్రాయలు సేకరించి, చిత్రించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2022 విశ్వసనీయత విషయంలో అధికార పార్టీకే కాదు, సామాన్యులకు కూడా సందేహాలున్నాయని అంటున్నారు. కొవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి పేద ప్రజలను కాపాడేందుకు, 2020 నుంచి కేంద్ర ప్రభుత్వం దేశంలో 80 కోట్ల మంది పేద ప్రజలకు నెలకు ఐదుకిలోల వంతును ఉచితంగా గోధుమలు/ బియ్యం సరఫరా చేస్తోంది. మరో వంక శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దక్షిణ ఆసియా దేశాల ఆకలి కేకలు ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి. అలాగని భారత దేశంలో ఆకలి లేదని కాదు. అంతా బాగుందని అసలే కాదు. కానీ, జిహెచ్‌ఐ-2022 నివేదిక పేర్కొన్నట్లుగా పాక్, బంగ్లా, శ్రీలంక కంటే భారత దేశంలో పరిస్థితి అధ్వానంగా అయితే లేదు. ఇక్కడే జిహెచ్‌ఐ-2022 నివేదిక ‘సృష్టి’ కర్తలు తప్పులో కాలేశారని అంటున్నారు.
అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలి, కానీ, జిహెచ్‌ఐ-2022 వివేదిక నిండా బొక్కలే ఉన్నాయని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. నిజానికి దక్షిణ ఆసియాలోనే కాదు, ప్రపంచం మొత్తంలో మసక బారుతున్న ఆర్థిక వ్యవస్థకు వెలుగు కిరణం ఏదైనా ఉందంటే అది భారత దేశం ఒక్కటే అని ఇటీవలనే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ తెలిపింది. అయితే, అది సంపూర్ణ సత్యమా, అంటే కాకపోవచ్చును కానీ, జిహెచ్‌ఐ-2022 మాత్రం సంపూర్ణ అసత్యం, అని నిపుణులు అంటున్నారు.