వైఎస్ఆర్ అవార్డులు.. సొమ్మొకరిది.. ప్రచారం వేరొకరిదీనా!?
posted on Nov 2, 2022 @ 3:14PM
చేసే ప్రతి పనిలోనూ తాము రాజకీయంగా ప్రయోజనం పొందాలనుకునే నాయకులు అధికారంలో ఉంటే ఇలా కాకుండా ఇంకెలా జరుగుతుందనే విమర్శలు రావడం సహజం. తాత్కాలికంగా అయినా తమకు ప్రయోజనమే కలగాలని నేతలు కోరుకునే తీరును పలువురు వేలెత్తి చూపిస్తుంటారు. ఇలాంటి స్వార్థపూరిత చర్యకు జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్ పాల్పడిందంటూ జనం దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ పేరు మీద జగన్ సర్కార్ ఇచ్చిన అవార్డుల వ్యవహారం చూస్తే.. ఇలాంటి రాజకీయ ప్రయోజనమే చూసుకున్నట్లు అర్థం అవుతోందంటున్నారు. సొమ్మేమో రాష్ట్ర జనానిది.. ప్రచారం మాత్రం వైఎస్సార్ కా అని ప్రశ్నిస్తుండడం గమనార్హం.
ఇన్ స్టెంట్ రాజకీయ ప్రయోజనాల కోసం తపించే రాజకీయ నేతల్లో ఏపీ సీఎం జగన్ కూడా నిలుస్తారని చెబుతారు. జగన్ రోటీన్ కు భిన్నంగా వ్యవహరిస్తారు. ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు. గడచిన మూడున్నరేళ్ల పాలనలో సంక్షేమ కార్యక్రమాల పేరుతో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు చెప్పుకుంటారాయన. అయితే.. రాష్ట్రానికి శాశ్వత మేలు చేకూర్చే ఒక్క ప్రాజెక్టును కూడా ఆయన పూర్తి చేయని వైనాన్ని జనం ఇప్పుడు బాగా గుర్తుచేసుకుంటున్నారు.
అవార్డు కోసం ప్రభుత్వం ఎవరినైనా ఎంపిక చేసిందంటేనే అది ఆయా వ్యక్తుల సేవలకు ఇచ్చే గౌరవంగా భావిస్తారు. అదే తమకు ప్రభుత్వం చేసే ఎనలేని సత్కారం అనుకుంటారు. భారత రత్న, పద్మ అవార్డులు, సైన్యంలోని వీరులకు ఇచ్చే గ్యాలంటరీ అవార్డులు, శాంతిస్థాపన కోసం చేసే ఎనలేని కృషికి ఆయా వ్యక్తులకు ఇచ్చే గాంధీ పీస్ అవార్డు ఇలాంటివే. ఆయా అవార్డులకు ఎంపిక అవడమే కోట్లు ఇచ్చినా రానంత గుర్తింపు వస్తుంది. అంతలా గుర్తింపు లభిస్తుంది కనుకే.. ఆయా అవార్డులకు ఎంపికైన వారికి ప్రభుత్వం భారీగా నగదు పారితోషికాలు అందించదు. నగదు కన్నా గుర్తింపే ఎంపికైన వారికి అత్యంత ప్రధానం.
కానీ.. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుల పేరుతో సీఎం జగన్ ఇలాంటి సాంప్రదాయాన్ని పూర్గిగా మార్చేయడం విమర్శలకు చోటు ఇచ్చినట్లు అయిందని పెద్దలు చెబుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ ఒకటో తేదీన జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులు ప్రదానం చేసింది. అయితే.. తన తండ్రి పేరిట ఇచ్చే ఈ అవార్డులకు పెద్దగా గుర్తింపు తీసుకు రావడం కోసం భారీ మొత్తంలో ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడం విమర్శలకు దారితీస్తోంది. దాంతో పాటు ఏ అవార్డుల ప్రదానంలోనూ జరగని విధంగా పెద్ద మొత్తంలో నగదు పారితోషికం కూడా ఇవ్వడాన్ని జనం వేలెత్తి చూపుతున్నారు.
నిజానికి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళా రంగానికి సంబంధించి నంది అవార్డులు ఇచ్చేవారు. అయితే.. తాను సీఎం అయినప్పటి నుంచీ నంది అవార్డులను పక్కన పెట్టేశారు. కానీ తన తండ్రి పేరు మీద ఇచ్చే వైఎస్ఆర్ అవార్డులకు మాత్రం భారీ ఎత్తున గుర్తింపు, ప్రచారం తేవడం కోసం పెద్ద మొత్తంలో నగదు పారితోషికాలు అందజేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒక్కో వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు గ్రహీతకు 10 లక్షలు, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు గ్రహీతలు ఒక్కొక్కరికీ 5 లక్షల రూపాయల చొప్పున పారితోషికం ఇవ్వడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ రెండు కేటగిరీలకు కలిపి మొత్తం 35 మందికి అవార్డులు ఇవ్వడమే కాకుండా.. పారితోషికంగా 3 కోట్ల రూపాయలకు పైగానే అందజేయడం గమనార్హం. దాంతో పాటు తన సొంత మీడియాతో పాటు తన అనుకూల మీడియాలో ప్రకటనల కోసం మరో మూడు కోట్ల రూపాయలకు పైనే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ఖర్చంతా ప్రభుత్వ ఖాతా నుంచి ఇవ్వడం, తద్వారా స్వప్రయోజనానికి వినియోగించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.
అసలే ఏపీ ఆర్థిక వ్యవస్థ దివాళా అంచుల్లో ఉంది. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉంది. ఈ సమయంలో దగ్గరదగ్గర ఆరు కోట్ల రూపాయల్ని వైఎస్సార్ అవార్డుల పేరిట ఖర్చు చేయడం తీవ్రమైన చర్య అని జనం భావిస్తున్నారు. అవార్డుల్ని కూడా ‘నగదు పంపిణీ స్కీం’గా మార్చేసిన జగన్ తీరును చూసి ఔరా! ఎంత బరి తెగింపు అని ప్రజాసంఘాలు అవాక్కవుతున్నాయి.