ఆంధ్రా నీరో జగన్!!
posted on May 17, 2024 @ 4:44PM
రోమ్ నగరం తగలబడి పోతుంటే అప్పటి రోమన్ కింగ్ నీరో (nero) ఏం చేశాడో ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. రోమ్ తగలబడిపోతే తగలబడిపోనీ నాకేంటి అనుకుంటూ, చక్కగా తన రాజమందిరంలో ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడు. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ వింత చర్య గురించి ఇప్పటికీ చెప్పుకుంటూ వుంటారు. మళ్ళీ ఇన్నాళ్ళకు నీరో రేంజ్లో మన సమాజానికి దక్కిన మరో పాలకుడు వై.ఎస్.జగన్!
పోలింగ్ సందర్భంగా, పోలింగ్ తర్వాత వైసీపీ గూండా మూకలు భారీ స్థాయిలో దాడులు చేసి వందల మందిని గాయపరిచాయి. సాక్షాత్తూ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని హత్య చేయడానికి ప్రయత్నించాయి. తెలుగుదేశం కార్యకర్తల మీద, తెలుగుదేశం సానుభూతిపరుల మీద, తెలుగుదేశానికి ఓటు వేశామని చెప్పినవాళ్ళ మీద దాడులు చేసి రక్తాన్ని పారించారు. ఎన్నికల ఫలితాలు వెలువడేలోపు, ఫలితాలు వెలువడిన తర్వాత కూడా రాష్ట్రంలో రక్తపాతం ఇంకా జరిగే ప్రమాదం వుందని ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా చెబుతున్నాయి.
రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా జగన్ ఎంతమాత్రం స్పందించలేదు. దారుణాలు ఆపే ప్రయత్నాలు చేయలేదు. తీవ్రంగా గాయపడిన అనేకమందిని పరామర్శించే సంగతి అటుంచి, కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయలేదు. ఇలాంటి అల్లర్లను ఆపాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయలేదు.. ఎంచక్కా తనంతట తాను విహారయాత్రలు చేయడానికి విదేశాలకు చెక్కేస్తున్నారు. ఆనాడు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో ఎలాంటివాడో, ఇప్పుడు రాష్ట్రం అట్టుడికిపోతుంటే పట్టించుకోకుండా విహారయాత్రకు వెళ్తున్న జగన్ కూడా అలాంటివాడే.