విభజనతో విద్యార్ధులకు కొత్త ఇక్కట్లు
సంక్లిష్టమయిన రాష్ట్ర విభజన వ్యవహారాన్ని కేంద్రం చాలా ఆషామాషీగా తూతూ మంత్రంగా పూర్తి చేసేసి చేతులు దులుపుకొంది. అనేక క్లిష్టమయిన అంశాలకు, సమస్యలకు తాత్కాలిక ఉపాయాలు చూపించి దానితో ఎలాగో సరిబెట్టుకోమని ఉచిత సలహా ఇస్తోంది. నీళ్ళు, విద్యుత్, ప్రాజెక్టులు వంటి క్లిష్టమయిన సమస్యలకు అది ఎటూ సరయిన పరిష్కారం చూపలేకపోయింది. కనీసం హైదరాబాద్ విషయంలో నయినా సరయిన పరిష్కారం చూపుతుందేమోనన్న ప్రజల ఆశ అడియాసగానే మిగిలిపోయింది.
దశాబ్దాల సమిష్టి కృషి కారణంగా రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దబడ్డ హైదరాబాద్ నగరంతో యావత్ రాష్త్ర ప్రజలు ఏదో రూపంగా బలమయిన సంబంధాలు కలిగిఉన్నారు, అధారపడి ఉన్నారు. కొన్ని లక్షల మందికి ఆ నగరం ఉపాధి కల్పిస్తే, అనేక వేలమంది విద్యారులకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అది గమ్యస్థానంగా నిలిచింది. అందువలన ఈ రాష్ట్ర విభజన వలన అటువంటి విద్యార్ధులు భవిష్యత్ కూడా ప్రశ్నార్ధకంగా మారబోతోంది.
మొన్న కేంద్రం ఆమోదించిన రాష్ట్ర విభజన బిల్లులో, “రెండు రాష్ట్రాలలో విద్యార్ధులందరికీ ఉన్నత విద్య అభ్యసించేందుకు సమానావకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలలో ప్రస్తుతం అమలులో ఉన్నస్థానిక కోటా పద్దతినినే యదాతధంగా ఐదేళ్ళకు మించకుండా అమలుచేసేందుకు ఆమోదించబడినది,” అని పేర్కొంది.
అయితే హైదరబాద్ ని పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచుతున్నపుడు కేవలం ఐదేళ్ళు మాత్రమే ఈవిధానం ఎందుకు అమలుచేస్తున్నట్లు? పదేళ్లు అమలు చేయడానికి అభ్యంతరమేమిటి? ఐదేళ్ళ కోర్సులయిన యంబీబీయస్ వంటి వైద్య విద్యలో వచ్చే సంవత్సరం నుండి ఇతరులకు ప్రవేశం ఇస్తారా, లేదా? ఒకవేళ ఈగడువు ముగిసే సమయానికి కోర్సు మధ్యలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి? ఈ ఐదేళ్ళ గడువు ముగిసే ముందు సంవత్సరంలో ఇటువంటి దీర్ఘకాలిక కోర్సులలో చేరదలచిన వారి పరిస్థితి ఏమిటి? అని ఆలోచిస్తే కేంద్రం ఎంత అనాలోచితంగా నిర్ణయాలు తీసుకొందో అర్ధం అవుతుంది.
ఇక స్థానిక కోటాలను పరిశీలిస్తే, హైదరబాద్ ఉస్మానియా పరిధిలో జంట నగరాలు, రంగారెడ్డి, మెదక్, కరీం నగర్, ఖమ్మం, మెహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ మరియు వరంగల్ జిల్లాలు ఉన్నాయి.
అదేవిధంగా రాయలసీమలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థానిక కోటా పరిధిలో అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప మరియు నెల్లూరు జిల్లాలున్నాయి.
ఇక విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయం స్థానిక కోటా పరిధిలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలున్నాయి.
ఒక విద్యార్ది ఆయా ప్రాంతాలలో కనీసం నాలుగు సం.లకు తక్కువ కాకుండా విద్యాభ్యాసం చేసి ఉంటే, అతడు లేదా ఆమె స్థానిక విద్యార్ధిగా పరిగణింపబడుతారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవారి విషయంలో రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనయినా వరుసగా ఏడు సం.లు విద్యాభ్యాసం చేసినట్లయితే ఆ ప్రాంతంలో స్థానికుడిగా పరిగణింపబడతారు. కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత అప్పుడు కూడా ఇదే స్థానిక విధానం ఐదేళ్ళవరకు అమలు చేస్తారా? రెండు రాష్ట్రాలు తమ తమ ప్రాంత విద్యార్థులకే ప్రాధాన్యం ఇవ్వదలచుకొంటే అప్పుడు ఈ స్థానిక విధానం ఏవిధంగా అమలు చేస్తారు? అనే విషయంపై బిల్లులో ఎటువంటి వివరణ లేదు.
ఇటువంటి లోపభూయిష్టమయిన విధానాల వలన రెండు రాష్ట్రాలలో విద్యార్ధులకు అవస్థలు, సమస్యలు తప్పకపోవచ్చును. ఇటువంటి లోపాలు మిగిలిన వ్యవస్థలలోను లెక్కకు మించి ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాటివల్ల రెండు రాష్ట్రాలలో ప్రజలు నిత్యం సమస్యలు ఎదుర్కొనక తప్పదు. కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు తప్పదు.