కాంగ్రెస్, బీజేపీలకు 'చీపురు' దెబ్బ

 

 

రాజకీయ దిగ్గజాలయిన కాంగ్రెస్, బీజేపీలకు ఏడాది వయసు కూడా లేని ఆమాద్మీ పార్టీ డిల్లీలో చుక్కలు చూపించింది. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళనం చేసేందుకు ఉద్భవించిన ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల కమీషన్ చీపురు కట్టను ఎన్నికల చిహ్నంగా కేటాయించడం యాదృచ్చికమే అయినా, ఆమాద్మీకి అదే కలిసి వచ్చిన అంశంగా మారింది. ఆమాద్మీ(సామాన్య పౌరుడు) చేతిలో ఆ చీపురు కట్టే వజ్రాయుధంగా మారి, రాజకీయ దిగ్గజమయిన కాంగ్రెస్ పార్టీని డిల్లీ నుండి పూర్తిగా ఊడ్చిపెట్టేయగా, బీజేపీ అధికారం దక్కించుకోనీయకుండా  ఆ చీపురుకట్టనే ఆమాద్మీ ఇప్పుడు అడ్డువేస్తున్నాడు.

 

ఆమాద్మీ పార్టీ విజయం వెనుక ఆ పార్టీ కృషి ఎంత ఉందో, అంతకు మించి అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలోఉన్నవిముఖత కూడా దానికి ఆ పార్టీకి కలిసి వచ్చింది. రాహుల్ గాంధీ ఆమాద్మీ పార్టీ గురించి మాట్లాడుతూ, “ఆమాద్మీ ప్రజలతో మమేకమయ్యి వారి భావాలకు అనుగుణంగా వ్యవహరించినందునే విజయం సాధించిందని, అందువల్ల తమ పార్టీ కూడా నేటి వరకు అనుసరిస్తూ వచ్చిన రాజకీయ కోణం నుండి కాక ప్రజాకోణం నుండే పరిపాలన సాగించవలసి ఉంటుందని” అనడం గమనిస్తే ఆయన తమ పార్టీ చేస్తున్న తప్పులను, నడుస్తున్న దారి తప్పని గ్రహించినట్లే ఉన్నారు. ప్రజాసంక్షేమం కోసమే రాజకీయాలు చేయాలి కానీ, రాజకీయాలకు ప్రజా సంక్షేమం బలి చేయకూడదనే సత్యం ఆయన చాలా ఆలస్యంగా గ్రహించారు. అయితే ఆ సత్యం తెలుసుకోవడానికి కాంగ్రెస్ చాలా భారీ మూల్యమే చెల్లించవలసి వచ్చింది.

 

అయితే ఇకనయినా కాంగ్రెస్ పార్టీ తన తీరు మార్చుకొని నిజాయితీగా రాజకీయాలు చేస్తుందని నమ్మకం లేదని ఆయన తల్లి సోనియా గాంధీ మాటలే స్పష్టం చేసాయి. ఈ ఎన్నికలలో అధిక ధరలు మరి కొన్ని ఇతర చిన్న పెద్ద అంశాలు తమ ఓటమికి కారణమయ్యాయని, తమ వైఫల్యాలకు కారణాలను సమీక్షించుకొంటామని, అయితే ఈ ఫలితాలు రాబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఎటువంటి ప్రభావమూ చూపించాబోవని” ఆమె అన్నారు. ప్రస్తుతం జరిగిన శాసనసభ ఎన్నికలకి, 2014లో జరుగబోయే సాధారణ ఎన్నికలకి చాలా తేడా ఉంటుందని ఆమె అన్నారు. తగిన సమయంలో తమ పార్టీ ప్రధాని అభ్యర్ధి పేరు ప్రకటిస్తామని ఆమె అన్నారు.

 

ఎన్నికలలో ఓడిపోయినా ప్రతీసారి ఆత్మవిమర్శ చేసుకొంటామని, తమ వైఫల్యాలకు కారణాలు తెలుసుకొని పార్టీని చక్కదిద్దుకొంటామననే పడికట్టు పదాలను వల్లెవేసినట్లే, ఈసారి కూడా ఆమె మరోమారు వల్లె వేయడం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆలోచనా ధోరణిలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం అవుతోంది.

 

ప్రతీ ఎన్నికలలో పరాభవం చవి చూస్తున్నా కూడా తన పనితీరు మాత్రం ఎన్నడూ మెరుగు పరుచుకోదు. పాలనలో సమర్ధత కనబరచదు. అవినీతికి దూరంగా ఉండలేదు. అయినప్పటికీ స్వంత డబ్బాకొట్టుకోవడం కూడా మరచిపోదు. బహుశః మిజోరం ఎన్నికలలో సాధించబోతున్నవిజయం గురించి మాట్లాడుతూ తమను తాము కాపాడుకొనే ప్రయత్నం చేయవచ్చును. పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలతో గానీ పోవన్నట్లు, కాంగ్రెస్ అంత త్వరగా తన పాత అలవాట్లను, పద్దతులను, ఆలోచన శైలిని వదులుకోలేదు.

 

కాంగ్రెస్ పార్టీని తిరస్కరించిన ప్రజలే మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలలో సమర్ధ పాలన అందించినందుకు బీజేపీకి మళ్ళీ మూడోసారి పట్టం కట్టారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ ను గద్దె దింపి బీజేపీకి పగ్గాలు అప్పగించారు. డిల్లీలో చీపురు కట్టతో ఊడ్చి బయటకు సాగనంపారు. అందువల్ల యదావిధిగా పడికట్టు మాటలు వల్లే వేసే బదులు, నిజంగా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని తమ వైఫల్యాల కారణాలను గుర్తించగలిగితే కాంగ్రెస్ పార్టీకే మంచిది. లేకుంటే ఈసారి మోడీ ప్రభంజనంతో కాంగ్రెస్ పార్టీ దేశం నుండే ఊడ్చుకుపోయినా ఆశ్చర్యం లేదు.        

 

telugu one news