రాష్ట్ర విభజనతో రాజకీయ పార్టీలకు కొత్త సమస్యలు

  రాష్ట్ర విభజనతో రాజకీయ పార్టీలకు కొత్త సమస్యలు కాంగ్రెస్ పార్టీ చర్చల పేరిట మళ్ళీ మరో మారు తెలంగాణా ప్రజలను మోసం చేయకపోతే రేపు జరగనున్న కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర విభజనపై ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే, వచ్చే ఎన్నికలలోగా విభజన ప్రక్రియ పూర్తి చేసి, ఎన్నికల తరువాత మిగిలిన కార్యక్రమాన్ని తాపీగా పూర్తి చేయవచ్చును. అంటే, రేపు కాంగ్రెస్ గనుక తెలంగాణా అంశంపై ఒక నిర్దిష్టమయిన ప్రకటన చేసినట్లయితే, అన్ని రాజకీయ పార్టీలు రెండు రాష్ట్రాలలో ఎన్నికలను ఎదుర్కోవడానికి ఇప్పటి నుండే సమాయత్తం కావలసి ఉంటుంది.   కేవలం తెలంగాణకే పరిమితమయిన తెరాస ఎన్నికలకి ఎప్పటి నుండో సిద్దంగానే ఉంది. అయితే, తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీజేపీ మరియు లెఫ్ట్ పార్టీలు మాత్రం రెండు రాష్ట్రాలలో పోటీ చేసేందుకు వీలుగా వ్యూహ రచన చేసుకోవడం కత్తి మీద సాము అవుతుంది. ముఖ్యంగా నాలుగు ప్రధాన పార్టీలకి మరింత తల నొప్పులు తప్పవు. రెండు ప్రాంతాలలో వాటికి బలమయిన క్యాడర్ ఉన్నపటికీ, ఇప్పుడు వేర్వేరుగా ముఖ్యమంత్రి అభ్యర్ధులను నిర్ణయించుకోవడం, పార్టీ విధానాలు రూపొందించుకోవడం, రెంటి మద్య సరయిన సమన్వయం ఏర్పరుచుకోవడం వంటివి అనేక అంశాలు పార్టీలకు కొత్త సమస్యలు సృష్టించబోతున్నాయి.   రాష్ట్రం విడిపోతే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న డజన్ల కొద్దీ ఉన్న ముఖ్య మంత్రుల అభ్యర్ధుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకొని వారిలోంచి తగిన వారిని ఎంపిక చేసుకోవడానికి ఆ పార్టీ అధిష్టానం చాలా తల నొప్పులు భరించవలసి ఉంటుంది. ఇక తెదేపా విషయానికి వస్తే, సీమంధ్ర ప్రాంతానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా భావిస్తే, తెలంగాణా ప్రాంతానికి మరో అభ్యర్ధిని ఎంచుకోవడానికి కొంత శ్రమ పడకతప్పదు. వైకాపాకు కూడా ఇంచు మించు ఇదే సూత్రం వర్తిస్తుంది. బీజేపీ మరియు లెఫ్ట్ పార్టీలు రెండు ప్రాంతాలలో కూడా ఆధిపత్యం సాధించడం అసాద్యం గనుక వాటికి ఇంత శ్రమ ఉండదు. అన్ని రాజకీయ పార్టీలకి కూడా రెండు ప్రాంతాలలో తమ పార్టీలు, వాటి నేతలు తమ అధిష్టానానికి కట్టుబడి ఉండేలా చూసుకోవడం కూడా పెద్ద సవాలుగా మారవచ్చును.   వివిధ రాష్ట్రాలలో అధికారంలోఉన్నకాంగ్రెస్ పార్టీకి ఈవిషయంలో కొత్తగా వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండకపోయినా తెదేపా, వైకాపాలకి ఇదొక కొత్త అనుభవమే అవుతుంది. ఇక రెండు రాష్ట్రాలకు ప్రత్యేకంగా పార్టీ విధి విధానాలు, మానిఫెస్టోలు, రాష్ట్ర నిర్మాణానికి తగిన ప్రణాళికలు వగైరా రచించుకోవలసి ఉంటుంది. ఈ విషయంలో కూడా కాంగ్రెస్ జాతీయ పార్టీ అయిఉండటం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమే.   అయితే, ఏపార్టీకయినా రెండు ప్రాంతాలలో ఘన విజయం సాదించి అధికారం కైవసం చేసుకొంటే రెండు రాష్ట్రాల శాఖల మధ్య సమన్వయము చేసుకోవడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కానీ, కేవలం ఒక ప్రాంతంలో నెగ్గి మరొక ప్రాంతంలో ఓడిపోయినట్లయితే, పెద్దగా ఒత్తిడి ఉండకపోవచ్చును. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు ప్రాంతాలలో ఏ పార్టీ కూడా పూర్తి మెజార్టీ సాధించే అవకాశం లేదు.   తెలంగాణాలో కాంగ్రెస్, తెరాస, తెదేపాల మధ్య ముక్కోణపు పోటీ ఉంటే, సీమంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్, వైకాపా, తెదేపాల మధ్య ముక్కోణపు పోటీ తప్పదు. అయితే, కాంగ్రెస్ అటు తెరాసతో, ఇటు వైకాపాతో గనుక విలీనాలు లేదా ఎన్నికల పొత్తులు చేసుకోగలిగితే, తేదేపాకు గడ్డు సమస్యే అవుతుంది.

వైకాపాతో స్నేహానికి తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీ

  మొన్న దిగ్విజయ్ సింగ్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి గురించి రెండు మంచి ముక్కలు మాట్లాడి వెళ్ళిపోయిన తరువాత, అధిష్టానం మనసులో ఆలోచనలను పసిగట్టేసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ అందివచ్చిన రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలని ఎంతో భక్తిశ్రద్దలతో చాలా ఘనంగా నిర్వహించేసారు. నిన్న మొన్నటి వరకు వారిలో చాల మంది ఏదో విధంగా ఆయనని తప్పుపట్టినవారే. కానీ డిల్లీ నుండి ప్రసారమవుతున్న సిగ్నల్స్ కి అనుగుణంగా తమ మైండ్ సెట్ కూడా వెన్వెంటనే మార్చేసుకొని, కొందరు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన గొప్పదనం గురించి లెక్చర్లు ఇవ్వగా, మరి కొందరు అన్నదాన, రక్తదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.   కాంగ్రెస్ పార్టీకి అకస్మాత్తుగా మళ్ళీ ఆయనపై ఇంత అభిమానం ఎందుకు పుట్టుకు వచ్చిందంటే దానికి కారణం ఆయన కొడుకు జగన్ మోహన్ రెడ్డేనని చెప్పక తప్పదు. ఒకప్పుడు ‘రాజశేఖర్ రెడ్డి మా స్వంతం కానీ అతని కొడుకు మాత్రం మాకు శత్రువేనని’ ప్రకటించిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ఆ కొడుకుది కూడా మా డీ.యన్.ఏ.నని చెప్పుకోవడం ఎందుకంటే, రానున్నఎన్నికలలోఅతనితో పొత్తులకోసమేనని చెప్పవచ్చును. రాష్ట్రంలో ఒకవైపు తెలంగాణా అంశము, మరో వైపు జగన్, తెదేపాలు ఉన్నందున, రాష్ట్రంలో తాము మళ్ళీ అధికారంలోకి రావాలంటే తప్పనిసరిగా జగన్ మోహన్ రెడ్డి తో చేతులు కలపక తప్పదనే చేదు నిజం గ్రహించిన్నందునే ఇప్పుడీ అవ్యాజమయిన ప్రేమ పుట్టుకొచ్చింది.   అయితే రాత్రికి రాత్రే పొత్తులు కుదుర్చుకోవడం వీలుపడదు గనుక, ఇప్పటి నుండే దానికి తగిన వాతావరణం కల్పించడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక్కడ హైదరాబాదులో రెండు మంచిముక్కలు మాట్లాడి వెళ్ళిపోయిన దిగ్విజయ్ సింగ్, మళ్ళీ డిల్లీలో దిగిన తరువాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుల గురించి మీడియాతో మరోసారి మాట్లాడారు. ఏకే ఆంటోనీ నేతృత్వంలోని నేతృత్వంలోని సబ్‌ కమిటీ వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్న విషయాన్ని ఖరారు చేస్తుందని, అందులో భాగంగానే వైకాపా అంశాన్నీ పరిశీలించే అవకాశాలున్నాయని, అయితే తుది నిర్ణయం మాత్రం రాహుల్ గాంధీయే తీసుకొంటారని ఆయన అన్నారు. ఈ విధంగా తరచూ జగన్ మోహన్ రెడ్డి పార్టీతో పొత్తుల గురించి మాట్లాడుతూ, ప్రజలు కూడా దానికి మానసికంగా అలవాటుపడిన తరువాత అప్పుడు ఆ రెండు పార్టీలు పొత్తులో లేక విలీనం గురుంచో ఒక అవగాహనకు రావచ్చును.   అంటే అప్పటి నుండి ఇక ఒకరి తప్పులు మరొకరికి ఇంకా కనబడవన్నమాట. అయితే అంతవరకు షర్మిల, విజయమ్మ తదితర వైకాపా నేతలు కాంగ్రెస్ పార్టీని తిడుతూనే ఉంటారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా జగన్ మోహన్ రెడ్డిని తిడుతూనే ఉంటారు.

టీ-జేయేసీ నేతలని దువ్వుతున్నకాంగ్రెస్ అధిష్టానం

  కాంగ్రెస్ పార్టీ తెలంగాణాపై చేస్తున్న కసరత్తు గురించి, ఆ క్రమంలో ఎదురవుతున్న సాధక బాధకాల గురించి కేసీఆర్ కి తెలిసి ఉన్నపటికీ, అవేమి తెలియనట్లు అతను తమను నిందిస్తూ, తమ పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నందున, కాంగ్రెస్ పార్టీ అతనిని వదిలించుకొని, ఇప్పుడు టీ-జేయేసీ నేతలని దువ్వుతోంది.   కేసీఆర్ తో పోలిస్తే టీ-జేయేసీ అధ్యక్షుడు ప్రొఫెసర్.కోదండరాంకి తెలంగాణా ప్రజలలో మంచి పేరుండటమే కాక, తెరాసకు ఎంత మాత్రం తీసిపోని స్థాయిలో ఆయన కుదురుకొనున్నారు. పైగా టీ-జేయేసీ నేతలు రాజకీయ పార్టీగా ఏర్పడనందున అటువంటి వారితో చేతులు కలిపినా వారి వల్ల ఎన్నికలలో తమకు ఎటువంటి నష్టము జరగదని కాంగ్రెస్ భావిస్తోంది. అందువల్ల వారికి తెలంగాణపై తను చేస్తున్న కృషిని వివరించి, వారి నుండి మరికొంత సమయం పొందే ఆలోచనలో ఉంది. వారిని గనుక ఒప్పించగలిగితే వారి ద్వారానే తెలంగాణా ప్రాంతంలో తనకనుకూల వాతావరణం సృష్టించుకోవాలని కాంగ్రెస్ ఆలోచన. తద్వారా తనకు తెలంగాణా విషయంలో మరికొంత వెసులుబాటు లబించడమే కాకుండా, తనపై తెరాస చేస్తున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకొని తెరాసను రాజకీయంగా నిలువరించవచ్చని కాంగ్రెస్ ఆలోచన.   అందుకే, మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్ కొద్ది రోజుల క్రితం టీ-జేయేసీ సమావేశం అయ్యి, వారిని డిల్లీ రప్పించగలిగారు. అయితే, వారు డిల్లీ వచ్చీ రాగానే నేరుగా కాంగ్రెస్ పార్టీతో మంతనాలు మొదలుపెడితే, అక్కడ కేసీఆర్ మంటలు విరజిమ్మితే, అతనిని తట్టుకోవడం కష్టమని, వారు ముందుగా ప్రతిపక్ష నేతలందరితో రౌండ్ టేబిల్ సమావేశం అవుతున్నారు. ప్రస్తుతం టీ-జేయేసీ నేతలు ప్రతిపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతున్నపటికీ, వారు ఆ తరువాత తెలంగాణా కోసం వినతి పత్రం ఇచ్చే మిషతో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా వారితో సంప్రదింపులు జరిపేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తోంది.   ఒకవేళ, కాంగ్రెస్ అధిష్టానానికి వారికి మధ్య సయోధ్య కుదురితే, రాష్ట్ర కాంగ్రెస్ నేతల ద్వారా వారికి మరింత దగ్గిరయ్యే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం వారిని తనకనుకూలంగా మార్చుకొనగలిగితే, తెలంగాణాలో కేసీఆర్ ని, అతని తెరాస పార్టీని ఒంటరి చేసి తన టీ-కాంగ్రెస్ నేతలతోనే చెక్ పెట్టించవచ్చునని కాంగ్రెస్ ఆలోచన.   త్వరలో రాజకీయపార్టీ పెట్టి ఎన్నికలలో పోటీ చేస్తానంటున్న ఉస్మానియా విద్యార్దుల సంఘం, టీ-జేయేసీ, రెండూ కూడా తెరాసకు వ్యతిరేఖంగా పనిచేసినట్లయితే, అది కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా చాలా లబ్ది చేకూరుస్తుది గనుక, ముందుగా కాంగ్రెస్ పార్టీ టీ-జేయేసీ నేతలని దువ్వడం మొదలుపెట్టింది.   ఇక, టీ-జేయేసీ నేతలకి కూడా ఇది ఊహించని అతిపెద్ద ఆఫర్ అని చెప్పవచ్చును. దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పెద్దలతో స్నేహ సబందాలు ఏర్పరచుకోగలిగితే, అది తమ రాజకీయ జీవితాలని మలుపు తిప్పి ఉన్నత శిఖరాలకి చేర్చుతుందని వారికి తెలుసు. అందువల్ల వారుకూడా అందివచ్చిన ఈ సువర్ణావకాశాన్ని వదులుకోకపోవచ్చును. వారి మధ్య సయోధ్య కుదిరితే ఇక కేసీఆర్ కి ముందున్నది ముసళ్ళ పండుగేనని భావించవచ్చును.

పంచాయతి నగారా దేనికోసం?

....సాయి లక్ష్మీ మద్దాల       పంచాతి ఎన్నికలకు రంగం సిద్దమయింది. రెండేళ్ళ తరువాత జరుగనున్న ఎన్నికలు ప్రజలలో ఆద్యంతం ఉత్కంఠతను రేపుతోంది. మరి ముఖ్యంగా 50%మహిళలకు రిజర్వేషన్ కల్పించి మరింతగా మహిళలను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు పోటీదారులు. బి. సి లు మాత్రం ఈసారి ఎన్నికలలో తమకు న్యాయం జరగలేదని అంటున్నారు. ముందు M.P.T.C. లకు , Z..P.T.C లకు ఎన్నికలు నిర్వహించి అప్పుడు గ్రామ పంచాయతి ఎన్నికలకు వెళ్ళటం అనే సాంప్రదాయాన్ని ఎందుకు మార్చారు. ఇహ గ్రామాల విషయానికి వస్తే గత రెండేళ్లుగా గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి లేక గ్రామీణ ప్రాంతాలు వెల వెల బోతున్నాయి.   నేడు గ్రామాలలో వీధిదీపాలు,తాగునీరు,రోడ్లు,పాఠశాలలు,ఆసుపత్రులు లేక అక్కడి ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. ఇవి కేవలం రెండేళ్లుగా ఉన్న సమస్యలు కావు. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుండి ఈ సమస్యలు అలాగే ఉన్నాయి. ఇది ప్రజలను ఏలుతున్న ప్రభుత్వాల నిర్వాకం. ఇప్పటికైనా ఈపరిస్థితులు చక్కబడాలంటే చిత్తశుద్ధి గల సర్పంచ్ లు కావాలి. 4,000కోట్ల పంచాయతి నిధులు ఈ ఎన్నికల అనంతరం విడుదల కానున్నాయి. కాని ఈ నిధులు సక్రమంగా ఖర్చయ్యేనా !          ముఖ్యంగా రిజర్వేషన్ పేరుతో కొన్ని ప్రాంతాలను ఆయా కేటగిరిల కిందకు తెస్తున్నారు. అది ఎలా ఉందంటే కొన్ని ప్రాంతాలను S.C,S.T రిజర్వేషన్ చేసి ఆయాప్రాంతాలకు ఒక్క S.C అభ్యర్ధి,ఒక్కS.T అభ్యర్ది ఉంటె వారినే ఏకగ్రీవంగా ఎన్నుకొని అగ్రవర్ణాల వారి పెత్తనమే సాగుతుంది. మహిళా రిజర్వేషన్ కింద తమ బంధువర్గంలో ని అభ్యర్ధులకు ఇప్పించుకొని వేలంపాట ద్వారా పదవులు పొందుతున్నారు. ఇంకా ఇలాంటి పరిస్థితులలో సర్పంచులకు స్వతంత్ర నిర్ణయాధికారం ఎలాఉంటుంది?దీనిని ఇప్పటికైనా ఎన్నికల సంఘం గుర్తించి,అరికట్టే ప్రయత్నం చేయాలి,లేకుంటే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు గాక తప్పదు. భారతదేశ ఆత్మ పల్లెలలోనే ఉన్నదని గాంధీజి అన్నారు. కాని నేటి పల్లెల పరిస్థితి నానాటికి దిగాజారిపోతున్నది. వ్యవసాయం మొక్కుబడిగా మారింది. గ్రామాల నుండి పట్టణాలకు వలసలు ఎక్కువవుతున్నాయి. దీనికి కారణం ఎవరు,ఏమిటి ?అక్కడ కోరవడుతున్న ఉపాధి అవకాశాలు,కనుమరుగవుతున్న కులవృత్తులు.              ఎన్నికల వేళ నేతలందరూ గ్రామాభివ్రుద్దే తమ ధ్యేయమని,వ్యవసాయరంగాన్ని ఆదుకుంటామని,దానికోసం హరితవిప్లవమని పెద్ద పెద్ద కబుర్లు చెబుతారు. ఎన్నికల అనంతరం అవన్నీ గాలిలో కలిసిపోతాయి. ఫలితం ఏళ్లుగా గ్రామ సౌభాగ్యం అలా వెనుకబడే ఉంటున్నది. గ్రామాలలో ఎటువంటి సౌకర్యాలు లేకున్నా,మద్యం సౌకర్యం పుష్కలంగా ఉంటోంది. అన్నిటికి మించి ఈనాటి ఈపంచాయతి ఎన్నికలను అన్ని పార్టీలు చాల ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ సహకార ఎన్నికల బావుటాను మళ్లి ఎగురవేయాలనే ఉద్దేశ్యంలో ఉంది. ఈ గెలుపునే రానున్న 2014 ఎన్నికల నగారగా మ్రోగించే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. కానీ ఈరోజున ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించే అన్ని పార్టీలు ముఖ్యంగా T.R.S,Y.S.R.C.P లు వారి వారి పంతాలతో తెచ్చిన ఉపఎన్నికల కారణంగా కూడా పంచాయతి ఎన్నికలు ఆలస్యమైనాయి.అన్నిటికి మించి ఒకేసారి ఉద్యోగాల ప్రకటన విడుదల చేసి,వివిధ శాఖలలో 24,078పోస్టుల భర్తీకి సంభందించి ప్రకటన జారీ చేసింది.వివిధ కార్పోరేషన్లకు చైర్మన్లను,డైరెక్టర్లను నియమించింది. పలువురు I.A.S,I.P.S అధికారులను బదిలీ చేసింది సర్కారు.                 మొత్తం మీద అన్ని రకాల తాయిలాలను చేతబూని ,అన్నిటికి మించి తెలంగాణ అంశాన్ని అరచేతిలో ఊరిస్తూ పంచాయతి ఎన్నికల బరిలో నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ గ్రామీణ ప్రాంత వాసులు ఎదురుచూసేది తమ బ్రతుకుల్లో వెలుగు కోసం. నాయకులను అందలం ఎక్కించటానికి కాదు . కానీ ఇక్కడ నాయకులు కోరుకుంటున్నది గ్రామీణాభివృద్ధి కాదు రానున్న ఎన్నికలకు తమ దారిని సుగమం చేసుకోవటానికి. ఇంకెప్పుడు ఈ దేశం బాగుపడేది.

జగన్ ను డీ కొనలేకనే వైకాపాతో దోస్తీకి కాంగ్రెస్ సిద్దపడుతోందా

  నిన్న దిగ్విజయ్ సింగ్ జగన్, రాజశేఖర్ రెడ్డిల గురించి చేసిన వ్యాక్యలతో కలవరపడిన కాంగ్రెస్ నేతలు వాటి పరమార్ధం వెతికే పనిలోపడ్డారు. జగన్, రాజశేఖర్ రెడ్డిల ప్రభావం తెలంగాణా కంటే సీమంధ్రాలోనే అధికంగా ఉండటంతో సీమంధ్ర నేతలలో ఈ విషయంపై తీవ్ర చర్చలు మొదలయ్యాయి. తాము జగన్ మోహన్ రెడ్డిని, అతని పార్టీని తమ ప్రాంతంలో నిలవరించగలమని గట్టిగా చెప్పకపోవడం వలననే, దిగ్విజయ్ సింగ్ విధిలేని పరిస్థితుల్లో జగన్ పార్టీతో పొత్తులు తప్పవని హెచ్చరించారని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు.   సీమంధ్రా ప్రాంతంలో, జగన్ చేతిలో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని అధిష్టానం గుర్తించినందునే, అయిష్టంగానయినా అతని పార్టీతో పొత్తులకు సిద్దపడి ఉండవచ్చునని వారు భావిస్తున్నారు. తద్వారా కొంత మేరయినా పార్టీకి నష్టం తగ్గించాలని భావించినందునే, దిగ్విజయ్ సింగ్ ఆవిధంగా అని ఉండవచ్చునని కొందరు సీమంద్రా నేతలు అభిప్రాయ పడ్డారు.   ఇటువంటి నేపద్యంలో, తెలంగాణా అంశం మరింత కాలం సాగదీయడం వలన, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రెంటికి చెడిన రేవడిలా మారుతుందనే ఆందోళనతోనే పార్టీ అధిష్టానం తెలంగాణా ఇచ్చేసేందుకు సిద్దపడుతోందని వారు భావిస్తున్నారు. తెలంగాణా ఈయకుంటే తెరాస చేతిలో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని టీ-కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి గట్టిగా చెప్పినందునే తెలంగాణా ప్రకటనకి సరికొత్త గడువు ప్రకటించారని భావిస్తున్నారు. పార్టీని రెండు ప్రాంతాలలో కాపాడుకొనేందుకు, అటు తెలంగాణా ప్రకటనకి, ఇటు జగన్ మోహన్ రెడ్డితో దోస్తీకి పార్టీ సిద్దం అవుతోందని వారు అబిప్రాయపడ్డారు.   దిగ్విజయ్ సింగ్ కేవలం పది రోజుల్లో రాష్ట్ర విభజనపై స్పష్టమయిన ప్రకటన చేస్తానని చెప్పడంతో, తాము ఈలోగానే జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొని పార్టీకి సీట్లు సాధించగలమని గట్టిగా చెప్పాలని సీమంధ్రా నేతలు ఆలోచిస్తున్నారు. లేకుంటే, ఈసారి కేంద్రం తెలంగాణా ప్రకటన చేసిన తరువాత మరిక వెనక్కి తగ్గే అవకాశం ఎంత మాత్రం ఉండదని వారు భావిస్తున్నారు. అందువల్ల మళ్ళీ వెంటనే మరో సమావేశమయ్యి జగన్ మోహన్ రెడ్డిని తాము ఏవిధంగా నిలువరించగలమో ఒక పధకం ఆలోచించుకొని డిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలిసి వివరించి తెలంగాణాను, జగన్తో దోస్తీని ఎలాగయినా అడ్డుకోవాలని వారు నిశ్చయించుకొన్నట్లు సమాచారం.   క్రిందటి ఎన్నికల సమయంలో చిరంజీవి కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టిస్తే, ఈసారి జైల్లో ఉన్నపటికీ జగన్ మోహన్ రెడ్డి ఆపని చేయడం విశేషం.

కోదండరామ్ కి డిల్లీలో పనేమిటో

  ఒకవైపు టీ-కాంగ్రెస్ నేతలు నేడోరేపో తెలంగాణా ప్రకటన ఖాయం అంటూ ఒకటే హడావుడి పడిపోతుంటే, మరో పక్క తెరాస నేతలు మరియు తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ మాత్రం ఇదంతా కాంగ్రెస్ మార్క్ ఎన్నికల డ్రామా అని తేలికగా తీసిపారేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం తమకు లేదని అంటున్నారు. తన పదేళ్ళ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేసుకుపోతుందేమోననే బెంగతో ఉన్న తెరాస నేతలు ఆవిధంగా మాట్లాడటం సహజమే అయినప్పటికీ, తనకు తెలంగాణా సాధన తప్ప రాజకీయాలు ముఖ్యం కాదంటున్న కోదండరామ్ కూడా ఆవిధంగానే మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది.   కేసీఆర్ ప్రోద్బలంతో, తెలంగాణా ఉద్యమం పుణ్యమా అని పైకి ఎదిగిన అనేక మంది నాయకులలో ఆయన కూడా ఒకరు. ఆయనకు కూడా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర స్థాయిలో మంచి పలుకుబడి ఏర్పడింది. గనుక, దానిని ఉపయోగించుకొని పూర్తి స్థాయి రాజకీయాలలో ప్రవేశించి, చక్రం తిప్పాలని ఆయన కూడా సిద్దపడుతునట్లున్నారు. అందుకే తెలంగాణా ఏర్పాటు గురించి మాట్లాడుతున్నటీ-కాంగ్రెస్ నేతలను కాదని, తెలంగాణా ఇస్తామని ఖచ్చితంగా చెపుతున్న బీజేపే నేతలని కూడా పక్కనబెట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణా సాధనకి ఏమాత్రం ఉపయోగపడని జాతీయ నాయకులయిన జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు బిశ్వాస్‌లతో జూలై 4న డిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నారు. తద్వారా తెలంగాణా సాధన సంగతి ఎలా ఉన్నపటికీ, ఆయన కేంద్ర స్థాయిలో నేతలతో పరిచయాలు పెంచుకొని మరింత బలపడే అవకాశం ఉంది. బహుశః ఈ పరిచయాలు స్నేహాలు, తన రాజకీయ భవిష్యత్తు తీర్చిదిద్దుకొనేందుకు కోదండరామ్ కి బాగా ఉపయోగపడవచ్చును.   ఆయన కేవలం తెలంగాణా సాధనే తనకు ముఖ్యమని భావిస్తున్నపుడు, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణా ఈయదని ధృడంగా విశ్వసిస్తున్నపుడు, తెలంగాణా ఇస్తామని ఖచ్చితంగా చెపుతున్న బీజేపే నేతలని కలవకుండా, తెలంగాణా ఈయలేని ఇతర పార్టీల నేతల్నికలవడం చూస్తే, కోదండరామ్ కి రాజకీయ ఆలోచనలున్నాయని అర్ధం అవుతోంది. ఆయన రాజకీయ నాయకుడు కాడు గనుక, బీజేపీని మతతత్వ పార్టీ అనే వంకతో ఆ పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పడానికి లేదు.   తెలంగాణా సాధనకోసం అవసరమయితే బొంత పురుగుని కూడా ముద్దు పెట్టుకొంటానని కేసీఆర్ చెపుతుంటే, కోదండరామ్ జాతీయ పార్టీలయినా కాంగ్రెస్, బీజేపీలను కాదని, ఇతరపార్టీ నేతలతో సమావేశాలు పెట్టుకోవడం కేవలం తన రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నవేనని అర్ధం అవుతోంది. ఈవిధంగా తెలంగాణా అంశం ప్రతి ఒక్కరికి కూడా ఒక రాజకీయ సోపానంగా మారిపోవడం చాల దురదృష్టకరం.

నిలదీసే హక్కు ప్రజలకు లేదా?

.....సాయి లక్ష్మీ మద్దాల       ఓట్లు అడిగేవాళ్ళు ఓటర్లకు తమను నిలదీసే హక్కు లేదంటున్నారు. రాజకీయ పార్టీలు ప్రజలకు తమను నిలదీసే హక్కు ఇవ్వబోరట. ప్రజాస్వామ్యంలో వ్యవస్థను నడిపించేది రాజకీయ పార్టీలే. ఎన్నికల వేళ ఆయా రాజకీయ పార్టీలు ఎన్నో వాగ్దానాలు చేసి,మేనిఫెస్టో ప్రకటించి అందలమెక్కుతాయి. ఆ తరువాత వాటిలో అమలు కానివే ఎక్కువగా ఉంటాయి. వీటిపై ఆయా పార్టీలను నిలదీసే హక్కు ప్రజలకు ఉంది. అది ఇపుడు చట్టబద్డంకూడా అయ్యింది. కాని సమస్యల్లా సమాచార కమిషన్ ముందు జనానికి సమాచార హక్కు ఇవ్వటం చట్ట వ్యతిరేకమని ప్రధాన పార్టీలు వాదిస్తున్నాయి. అధికారంకోసం అబద్ధపు వాగ్ధానాలు చేసి వాటిని నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేస్తే ప్రజలు ఏం చేయాలి?ఆయా పార్టీలను నిలదీయటం తప్పంటే ఎలా ?    ఏ  పార్టీ అయిన సరే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అది చేసే విరాళాలు,వసూళ్లు, ఆయా పార్టీలలో ఉన్న అభ్యర్ధులు పాల్పడిన అవినీతి,దానికి సంబంధిత పార్టి వారిపై తీసుకొనే చర్యలు, ఎన్నికల సంస్కరణలకు సంబందించి ఆయా పార్టీలు చేసే సూచనలు...... తదితర వివరాలతో ఏవైనా సరే ప్రజలు అడిగిన తక్షణం సమాచారం ఇవ్వటానికి పార్టీలు సిద్ధంగా ఉండాలి. ఇలాంటి వివరాలకు సుభాష్ చంద్ర అగర్వాల్ బి.జె. పి,కాంగ్రెస్,సి . పి ఐ, సి. పి.ఎమ్,బి . ఎస్ . పి ,ఎన్. సి. పి  లను లిఖిత పూర్వకంగా అడిగారు. దానికి ఆయా పార్టీలు తాము ఆర్ . టి . ఐ  కిందికి రామని,తాము పబ్లిక్ అధారిటీలము కాదు కనుక అడిగిన సమాచారం ఇవ్వబోమని జవాబిచ్చాయి.                  ఇది ఎంతవరకు సమంజసం?ప్రజల విరాళాలతో,వివిధ సంస్థల విరాళాలతో నడిచే స్వచ్చంద సంస్థలు ఆర్ . టి . ఐ  పరిధిలో ప్రజలకు సమాధానం చెప్పటానికి సిధంగా ఉన్నపుడు ప్రజాధనం తో నడిచే ఆయా రాజకీయ పార్టీలు ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పరు?ప్రజాస్వామ్యం లో ఆయా రాజకీయపార్టీలు వారి పారసర్సాకతను నిరూపించు కోవాలంటే ప్రజలకు ఎప్పుడు జవాబుదారిగానే ఉండాలి. వారసత్వ సంప్రదాయమే నేటికి భారత రాజకీయ పార్టీలలో కొనసాగుతున్నపుడు ఆ పార్టీల ఆర్ధిక వ్యవహారాలు ఆ పార్టీలోని సభ్యులకైన ఎంతవరకు తెలిసే అవకాశం ఉంది. అటువంటపుడు ప్రజలకు తెలిసే అవకాశం ఇంకెక్కడుంది?ఈ సమాచార హక్కు చట్ట పరిధిలోనికి అన్ని రాజకీయ పార్టీలు వస్తేనే నేడు వినబడుతున్న క్విట్ ప్రోకో పద్ధతి మాటున ఎంత అవినీతి జరుగుతుందనేది ప్రజలకు అర్ధమవుతుంది. ఎందుకంటే నేడు ఏ పార్టీ ఐనా ఒక వ్యక్తి నాయకత్వం లోనే నడుస్తోంది కనుక.  కోట్ల రూపాయల ఆదాయం ఉన్న పార్టీలు కూడా ప్రభుత్వం నుండి ఆదాయపు పన్ను మినహాయింపు పొందుతూ,సదరు పార్టీల  m.l.a,m.p లు ప్రభుత్వం నుండి జీతాలు తీసుకుంటూ,ప్రజల నుండి పార్టీ నిధులు వసూలు చేస్తూ,అధికారం ప్రజల కోసమే వినియోగిస్తున్నామంటూ,పబ్లిక్ అధారిటి కాదంటున్నారు. ప్రజలకు జవాబుదారి కాదంటున్నారు. రాజకీయ పార్టీలు,లెజిస్లేచర్ పార్టీలు అన్ని కూడా పబ్లిక్ అధారిటీలె అని సుప్రీం కోర్టు అంగీకరిస్తూ  c.i.c  తీర్పును సమర్ధించినా,పబ్లిక్ అధారిటి నిర్వచనానికి లోబడి ప్రజలకు జవాబుదారిగా ఉండేందుకు ఏ ప్రభుత్వానికి కాని,ఏ పార్టీకి కాని ధైర్యం లేదు. రాజకీయ పార్టీలు ఎన్నటికి పబ్లిక్ అధారిటీలు కావని c.i.c చట్టాన్ని సవరించే ప్రమాదము లేకపోలేదు.  

ఉద్యమాల నుండి ఎన్నికలల వరకు తెలంగాణాయే సోపానం

  క్రమంగా ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఉద్యమ పార్టీ తెరాసతో సహా అన్నీరాజకీయ పార్టీలు కూడా ఎన్నికలే ధ్యేయంగా ఎత్తులు వేస్తూ వ్యవహరిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఆవిధంగా ప్రవర్తించడం వింతేమి కాకపోయినా, ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెరాస, ఉద్యమంలో పాల్గొన్నఇతర నేతలు కూడా ఇప్పుడు ఎన్నికలలు కనడం విశేషం.   ఉద్యమాన్నివదిలి ఎన్నికల బాట పట్టిన కేసీఆర్ దానిని సమర్దించుకోవడమే కాకుండా, నిజాయితీగా ఉద్యమంలో పాల్గొన్నవారికి కూడా ఎన్నికలలో పోటీ చేయాలనే ఆశ పుట్టించడంలో సఫలమయ్యాడు. అందువల్ల, ఇప్పుడు తెలంగాణా ఉద్యమకారులు ఇతరుల దృష్టిలో పలుచనవడమే కాకుండా, వారి ఉద్యమ నిబద్దతపై కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి.   ఉజ్వల భవిష్యత్తు ఉన్నదాదాపు వెయ్యి మంది యువకులు తెలంగాణా కోసం బలిదానాలు చేస్తే, అందుకు బహుమానంగా కేసీఆర్ మరియు కొందరు ఉద్యమకారులు ఉద్యమాన్ని పక్కనపడేసి, ఎన్నికలలో గెలవడమే వారికి ఘన నివాళిగా భావిస్తున్నారు. కేసీఆర్ తమని ఉద్యమంలో పూర్తిగా వాడుకొని ఇప్పుడు తమకి టికెట్స్ఇవ్వట్లేదని కొందరు ఉద్యమకారుల అలకల గురించి వార్తలు చదవుతుంటే, వారిని ఆవిధంగా తప్పుదోవ పట్టించినందుకు కేసీఆర్ ని నిందించాలా? లేక తమ కర్తవ్యం మరిచి కేసీఆర్ ను నిందిస్తున్న ఉద్యమ నేతలను తప్పుబట్టాలా? అనే అనుమానం కలుగక మానదు.   కేసీఆర్ తనను తానూ ఏవిధంగానయినా సమర్ధించుకోగల సమర్ధుడు, గనుక తన లక్ష్య సాధనకు ఎన్నికలను ఒక మార్గంగా ఎంచుకొన్నానని ఆయన చాలా బాగానే చెప్పుకొస్తున్నాడు. అయితే గతంలోనే ఎన్నికలలో పోటీ చేసిన తెరాస ఇప్పుడు కొత్తగా ప్రజలకి ఎటువంటి సంజాయిషీలు ఇచ్చుకోనవసరం లేదు. ఎందుకంటే, ఆ పార్టీ ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీగా, అయిపోగానే వెంటనే ఉద్యమపార్టీగా రంగులు మార్చుకొంటుందని ప్రజలకీ అర్ధం అయిపోయింది. అయితే, ఉద్యమంలో ఉన్నవారు, తెరాసకు ‘బై-ప్రోడక్ట్’ గా పుట్టుకొచ్చిన టీ-జేయేసీ నేతలు, అనేక ఇతర జేయేసీ నేతలు కూడా ఎన్నికలలు కనడం మొదలుపెట్టడంతో ‘డిమాండ్ అండ్ సప్లై’ సమస్య ఏర్పడింది. ‘నోట్లు, సీట్లు, ఓట్లు’ అంటూ కేసీఆర్ మూడు ముక్కల్లో తన ‘ఎన్నికల విధానం’ ప్రకటించడంతో, ఆ రేంజిలోకి రాలేనివారు సహజంగానే అసంతృప్తికి గురయ్యారు. అందుకు పరిష్కారంగా ప్రత్యామ్నాయ పార్టీగా ఉన్న బీజేపీలో చేరి టికెట్ సంపాదించుకోవడానికో లేక స్వతంత్ర అభ్యర్దిగానయినా నిలబడి ఎన్నికలలో పోటీ చేయాలనో ఆరాటపడుతున్నారు.   రానున్న ఎన్నికలలో తెలంగాణాలో మరింత బలపడాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ, ఇదంతా గమనించి టీ-జేఏసీ నేతలు ఉద్యమంలో ఉంటారో, లేక రాజకీయ పార్టీల్లో చేరుతారో తేల్చుకోవాలని తాజాగా ఒక అల్టిమేటం జారీ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ‘టీ జేఏసీ నేతలు రాజకీయ పార్టీల్లో చేరుతున్నారనే ప్రచారం ఉద్యమానికి నష్టం చేస్తుందని’ అంటూనే వారు తెరాస వైపు కాకుండా బీజేపీ వైపు వస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.   ఈవిధంగా నేడు అందరికీ తెలంగాణా అంశం తమ రాజకీయ భవిష్యత్తుకి ఒక సోపానంగా మారిపోవడం చాల విచారకరం.

ఢిల్లీ సాక్షిగా ఆంధ్ర పరువు గంగ పాలు

...సాయి లక్ష్మీ మద్దాల       ఉత్తరాఖండ్ వరదలు రాజకీయ నేతలు కావలసినంత రాజకీయం చేసుకోవటానికి ఆటవస్తువుగా వినియోగించుకుంటున్నారు. గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్రమోడి విపత్తు సంభవించిన తక్షణం స్పందించిన తీరు,దేశ ప్రజలందరిని అబ్బుర పరచింది. దానికి సదరు కాంగ్రెస్ నేతలు మోడీ హెలికాఫ్టర్లో తీసుకెళ్తున్నది వరద బాధితులను కాదు,ఓటర్లను అని విమర్శలు గుప్పించారు,వారు తమ భాద్యత విస్మరించారు. ఏదో ఇహ అవకాశం దొరికినపుడు దానినెందుకు జారవిడుచుకోవాలని భావించిన చంద్రబాబు ఢిల్లీ ఎ.పి భవన్ లో ధర్నాలని, ప్రత్యేక విమానమని ,ఎన్.టి.ఆర్ ట్రస్ట్ భవన్ నుండి డాక్టర్లని, వరద బాధితులకు రూ॥ 10,000/- పరిహారమని, మళ్లి ఇక్కడ హైదరాబాదు నుండి వారి వారి స్వస్థలాలకు కొడుకు లోకేష్ పర్యవేక్షణలో ప్రత్యేక బస్సులని ఏవో ఆయన తంటాలు ఆయన పడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు,సరే బాబుని చూసి బుద్ధి తెచ్చుకున్న కాంగ్రెస్ నేతలు తమ వంతు బాధ్యత తాము బుద్ధిగా నిర్వహించకుండా నిన్న ఎ.పి భవన్ లో బాహాబాహికి దిగిన తీరు చూస్తే,వరద బాధితులు సహితం అసహ్యించుకుంటున్నారు. అసలే తెలుగు వారిని ఉత్తరాది వారు చాలా చులకనగా చూశారని యాత్రికులు ఒక పక్కన వాపోతుంటే మళ్ళి డిల్లీలో  ఏ. పి  భవన్ సాక్షిగా ఈ ముష్టి యుద్ధాలు,బూతు పురాణాలు,శవ రాజకీయాలు ఏమిటి? నేడు చంద్రబాబు ఉత్తరాఖండ్  వరద బాధితులైన తెలుగువారి విషయంలో చేసిన సహకారం కొని యాడ దగినదే,అయితే గత 9సం॥ లు గా ఆయన ప్రతిపక్షనేత గా ఉన్నపుడు ఐల తుఫాన్,లైలా తుఫాన్ అని చాలా రకాల ప్రకృతి వైపరీత్యాలు ఆంధ్ర ప్రదేశ్ లో ను సంభవించాయి. అపుడు కూడా చాలా మంది నిరాశ్రయులైనారు. ఇదేవిధంగా చంద్రబాబు వారికి కూడా తన వంతు సహాయాన్ని,సహకారాన్ని అందించి నట్లైతే చాలా బాగుండేది. పాదయాత్ర మానుకుని మరీ ఒకసారి వెళ్లి సదరు బాధితుల్ని మొక్కుబడిగా పేపర్లో ఫోటోల కోసం పరామర్శించి వచ్చేశారు గాని,వారికి కావలసిన తక్షణ సహాయాన్ని ఏనాడు అందించలేదు,ఇపుడు డిల్లీలో చేస్తున్న మాదిరిగా. అలాగే సదరు టి.డి.పి  ఎం.పి  లు కూడా చంద్రబాబు అమెరికా నుండి వచ్చేవరకు బాధితులను పట్టించుకోకుండా ఏమిచేస్తున్నారో తెలియలేదు. అంతేకాదు నేడు రాష్ట్రం లో చాలా సమస్యలు గత 9సం॥ లు గా రాజ్యమేలుతున్నాయి. వాటి మీద కూడా తగు రీతిలో శాసనసభలో పోరాటం చేసి ఉంటే బాగుండేది. అసలు సభకే హాజరవ్వకుండా అమెరికా యాత్ర ఒక సారి,పాద యాత్ర ఒకసారి.ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలు కుళ్లిపోయి కంపు కొడుతున్నాయి. ఇంకా వాటిని డిల్లి సాక్షిగా ఉత్తర భారతదేశం వారికి కూడా వాసన చూపించటం దేనికి?ఏది ఏమైనా ఈ రెండు పార్టీల పుణ్యమా అని నేడు డిల్లి సాక్షిగా గంగలో కలిసిన పరువుని ఎవరు బయటకు తీస్తారు?

తాగుడు ప్రభుత్వం

  కొత్త మద్యం విధానంలో పర్మిట్ రూమ్ లకు అనుమతి నిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. దీంతో ఇప్పటివరకు పట్టణాలకే పరిమితమైన బార్లు ఇప్పుడు గ్రామాల్లోను దర్శన మివ్వ నున్నాయి. 2లక్షల లైసెన్స్ ఫీజు సంత్సరానికి చెల్లించాలి. ఇప్పటివరుకు లైసెన్సు ఉన్న దుకాణాలు 5,979. ఈ సంత్సరం కొత్తగా లైసెన్సు కోసం దరఖాస్తులు ఆహ్వనిస్తున్నవి 617. ఇప్పటికే లైసెన్సు ఉన్నవాటికి మరో సంత్సరం పాటు పోడిగిస్తుండగా,లైసెన్సు పొందనివాటిని మరోప్రాంతానికి మార్చి అక్కడ కొత్తగా దుకాణాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మినీ బార్ల సాంప్రదాయం జులై 1నుండి అమలులోకి రానుంది. ఈ లైసెన్సింగ్ విధానం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 1700కోట్లు.   ఓట్ బ్యాంకు రాజకీయాలతో పనికిమాలిన సంక్షేమ పధకాల అమలుకోసం ప్రభుత్వ ఖజానా నింపుకోవటానికి ఇలా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్న కిరణ్ కుమార్ ప్రభుత్వానికి ఏవిధమైన చిత్తశుద్ధి లేదని తెలుస్తోంది. ఈ కొత్త మద్యం విధానం పట్ల ప్రజల నుండి తీవ్ర నిరసనలు వెల్లువెత్తు తున్నాయి. ముఖ్యంగా మహిళలు తమ రక్షణ పట్ల ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నగదు బదిలీ పధకం ద్వారా ప్రజలను సోమరి పోతులుగా చేసి ఇప్పుడిలా మద్యం దుకాణాలకు సిట్టింగ్ అనుమతులు జారీ చేయటం మూలంగా అసాంఘీక కార్యకలాపాలు చెలరేగిపోవా?మహిళాభ్యున్నతే మా ప్రభుత్వ ధ్యేయం అని చెప్పే కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మహిళకు పొంచి ఉన్న అభద్రత పట్ల ఏమని సమాధానం చెపుతారు?   ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలంటే మద్యం అమ్మకాలను ప్రోత్సహించాలనే ఆలోచన ముఖ్యమంత్రి పరిపాలనా సామర్ధ్యాన్ని సంకించటం లేదా?ఒక పక్క ఉచిత విద్యుత్తు అని మరోపక్క విద్యుత్ కోతలని అటు రైతాంగాన్ని,ఇటు పారిశ్రామిక రంగాన్ని తీవ్ర నష్టాల పాల్జేసి,అన్ని ఉత్పత్తులు గణనీయంగా పడిపోవటానికి ప్రధాన కారణమైన కిరణ్ కుమార్ నిర్ణయ రాహిత్యాన్ని ఏమనాలి?బెల్టు షాపులు నిర్మూలించాల్సిన ముఖ్య మంత్రి ఈనాడు సిట్టింగ్ షాపులకు అనుమతి నిస్తుంటే ఇహ మహిళల భద్రత గాలిలో దీపమే కదా!నేతలు వారి వారి వ్యాపారాలను పెంచుకోవటానికి చేస్తున్న కుట్రలో ప్రజలు బలై పోవలసిందేనా?ఈమాత్రానికి ఇంకా ఎక్సైజ్ శాఖ ఎందుకు?తాగి వాహనాలను నడిపే వారిని అరెస్టులు చెయ్యటమెందుకు?

వారిని విడదీయడం మహా పాపం

  జగన్ చల్లగా ఉంటే చూసి ఓర్వలేని సీబీఐ అన్యాయంగా ఆయనని చంచల్ గూడా జైల్లో పెట్టి హింసిస్తోంది. ఆయనకు ఏదో కొంచెం మాట సాయం చేసి, తన తెలివి తేటలతో నాలుగు రాళ్ళు సంపాదించిపెట్టిన పాపానికి, పాపం! విజయసాయి రెడ్డి మీద కూడా సీబీఐ కక్ష పెంచుకొని అన్యాయంగా అతనిని కూడా కటకటాల వెనక్కి తోసేసింది.   అయితే మంచి వాళ్ళకు ఎప్పుడు మంచే జరుగుతుందనే ఫార్ములా ప్రకారం ఆయన తంతే బూర్లె గంపలో పడినట్లు, పోయి పోయి చంచల్ గూడా జైల్లో జగన్ ఒళ్ళోనే పడటంతో, సీబీఐ కరెంటు షాక్కు కొట్టినట్లు త్రుళ్ళిపడింది. వారిద్దరినీ ఒకే జైలులో ఉంచితే న్యూట్రలు, ఫేసు వైర్లు కలిసిపోయినట్లు వారి బుర్రలు మరింతగా వెలిగిపోతాయి, గనుక వారిరువురినీ వేర్వేరు జైళ్ళలో ఉంచాలని కోర్టుకి సీబీఐ సవినయంగా మనవి చేసుకొంది. అయితే, బొమ్మ బొరుసు వలె అతుక్కుపోయున్న వారిరువురిని విడదీయడం కుదరదని కోర్టు కూడా కరాకండిగా తేల్చి చెప్పేసింది. తానొకటి తలిస్తే కోర్టోకటి తలచిందని సీబీఐ వాపోతే, ఈనాటి ఈ బందం ఏనాటిదో’ అని వారివురు చంచల్ గూడా జైల్లో యుగళ గీతం పాడుకొంటున్నారు.

ప్రకృతి విలయం వెనుక మానవ తప్పిదం ..ప్రభుత్వ నిర్లక్ష్యం

....సాయి లక్ష్మీ మద్దాల       ఉత్తరాఖండ్ ...... చార్ ధామ్ .......... ప్రముఖ పుణ్య క్షేత్రాల నిలయమే కాదు. భూకంపాలు, వరద భీత్సాలు,కొండచరియలు,విద్వంసపు విలయాలకు మారుపేరుకుడా! ఈ రాష్ట్రంలో 93%పర్వత ప్రాంతమే. ప్రస్తుతం చోటుచేసుకున్న వైపరీత్యానికి మానవతప్పిదమే కారణమంటున్నారు పర్యావరణ వేత్తలు. పర్యాటకుల తాకిడిని తట్టుకునేందుకు పెద్ద ఎత్తున చేపట్టిన రోడ్లు,భవనాల నిర్మాణం నదులను ఆక్రమిస్తూ హోటళ్ళు,ఇళ్ళ నిర్మాణం ...... ఫలితం .... నేడు రుద్రనేత్రుడి ఆలయ ప్రాంగణం రుద్రభూమిని తలపిస్తోంది. ఉత్తరాఖండ్ లో జరుగుతున్న పర్యావరణ విద్వంసాన్ని 'కాగ్' మూడేళ్ళ కిందటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తెచ్చింది. జల విద్యుత్త్,మైనింగ్ ప్రాజెక్టుల కోసం పర్యావరణ నిబంధనలు అడ్డగోలుగా ఉల్లంఘిస్తున్నారని,అక్కడి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇది భవిష్యత్తులో పెనుముప్పుగా పరిణమిస్తుందని 'కాగ్ 'హెచ్చరించింది. ప్రాజెక్టుల వల్ల భాగీరధి,అలకనందలు బాగా దెబ్బతింటున్నాయని వివరించింది. ఫలితంగా వర్షాలు ఉదృతంగా పడితే.... వరదలు విలయం సృష్టిస్తాయని 'కాగ్'తెలిపింది. ఈ జల విద్యుత్ కేంద్రాలు... పేలడానికి సిద్దంగా ఉన్న బాంబుల్లాంటివని అభిప్రాయపడింది. ఇక్కడ పట్టనీకరణకు,హైడల్,మైనింగ్ ప్రాజెక్టుల కోసం అవసరమైన మేర విచ్చలవిడిగా అడవులను నరికేస్తున్నారు. పశ్చిమ హిమాలయాలలో ముఖ్యంగా గడ్వాల,కుమనోవ్ ప్రాంతంలో వాణిజ్య అవసరాల కోసం విచక్షణంగా అడవులను నాశనం చేస్తున్నారు. వరదలను తట్టుకునే స్వభావం ఉన్న ఓక్ చెట్లను,చిర్ అడవులను నరికేస్తున్నారు. దీనితో నీటిని పీల్చుకోగలిగే,భూమిని బిగువుగా ఉంచగలిగే చెట్లవేళ్ళు లేకపోవటంతో...... కురిసిన వర్షం వరదలా కిందికి దూసుకొస్తోంది. ఈ ప్రాంతంలో ఉన్న పుణ్య క్షేత్రాలను దర్శించుకొనే వారి సంఖ్య క్రమేపి పెరగటంతో ఇక్కడ ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేసింది. కొండల వెంబడి రోడ్లు నిర్మించింది. ఇదే అదనుగా నదీ పరీవాహక ప్రాంతమంత ఆక్రమిత కట్టడాలతో నిండిపోయింది. దీనిని ప్రభుత్వం పట్టించుకోలేదు. నదీ తీరానికి 100 మీటర్ల లోపు నిర్మాణాలేవీ చేపట్ట కూడదని 2002లో ప్రభుత్వం నుండి ఉన్న నిషేధాజ్ఞలను నేడు తుంగలో తొక్కిన ఫలితం ఇంతమంది ప్రాణాలకు ముప్పు. ఇవన్ని నేటి ప్రకృతి ప్రకోపానికి ప్రధాన కారణాలు. కాని ప్రమాదం సంభవించిన తర్వాత,దానికి ముందు ప్రభుత్వం తీరును పరిశీలిస్తే ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల పట్ల అంతగా భాద్యత ఉన్నట్లు కనిపించటంలేదు.                    వారం రోజులుగా తిండి లేదు....... నీరులేదు.... పొంచి ఉన్న ప్రమాదం గురించి అక్కడి ప్రజలను ముందుగా హెచ్చరించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వము చేయలేదు,అక్కడి రాష్ట్ర ప్రభుత్వానినికి అంతటి వైపరీత్యాన్ని అంచనా వేసే వాతావరణ పరిశీలనా కేంద్రములేదు. ఇది ఎవరి తప్పిదం. నదుల క్యాచ్ మొనిట్ ఏరియాలో వర్షం పడిన వెంటనే వరదలు రావని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. భారీ వర్షం మొదలైన 15 గంటల తర్వాత  నదులకు నీటి తాకిడి పెరిగి వరదలు సంభవిస్తాయని వారు ఇస్తున్న సమాచారం. జూన్ 16న 340 మి॥ మీ ॥ వర్షపాతం నమోదు అయింది. ఇది ఆ ప్రాంతం లో 375%ఎక్కువ. దీనిని కేంద్ర ప్రభుత్వం అంచనా వేయటంలో అలసత్వం వహించింది. పోనీ ఆతరువాత అయినాయుద్ధ ప్రాతిప్రదికన పనులు చేపట్టటం లోను ప్రభుత్వం ధోరణి ప్రజలకు చాల అసహనాన్ని కలిగిస్తోంది. వరదల్లో చిక్కుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని రక్షించ టంలో ఉన్న చొరవ,అక్కడి వరదల్లో చిక్కుకున్న యాత్రికులను రక్షించటం లో కనబరచలేదు. ముఖ్యంగా దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించటానికి కుడా వెనుకాడుతున్నారు. ఇక్కడ చేపట్టిన చర్యలలో ప్రభుత్వ అధికారుల మద్య సమన్వయం కొరవడిందని సాక్షాత్తు కేంద్ర హొమ్ మంత్రి షిండే వ్యాఖ్యానించటం మరింతగా ప్రభుత్వ అలసత్వాన్ని తేట తెల్లం చేస్తోంది.             ఎవరి తీరు ఎలా ఉన్న సైన్యం సేవలను అక్కడి ప్రమాదం నుండి బయట పడిన యాత్రికులు వేనోళ్ళ కొనియాడుతున్నారు. వారి సేవలు అనిర్వచనీయం. గతంలో నిర్భయ వ్యవహారంలోనూ కేంద్రం రెండు,మూడు రోజులు ఆలస్యంగా స్పందించింది. అన్నాహజారే విషయంలోనూ వారం రోజులు ఆలస్యంగా స్పందించింది. ఇప్పుడు ఉత్తరాఖండ్ లోను మూడు రోజుల తర్వాత స్పందించింది. అన్నిటికి మించి ఆప్రాంతాని నష్ట పరిహారంగా 143 కోట్లు ప్రకటించటం అంటే,అసలు అక్కడ సంభవించిన నష్టాన్ని అంచనా వేయటంలో కుడా కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందా?ఇప్పటికైనా దేశంలోని ఆక్రమిత నదీ పరివాహక ప్రాంతాలను గుర్తించి వాటిని తక్షణం ఖాళి చేయించే చర్యలను చేపట్టక పోతే భవిష్యత్తులో మరిన్ని భయానక సంఘటనలను చూడవలసి వస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ప్రమాదం హైదరాబాదుకు పొంచి ఉంది,మూసి పరివాహక ప్రాంత ఆక్రమణలతో.     

రాజకీయ శాసనసభ

.....సాయి లక్ష్మీ మద్దాల       మొత్తం మీద శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసి అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 20 రోజులపాటు జరిగిన శాసనసభ సమావేశాలలో ప్రజాసమస్యలు పక్కదారి పట్టినాయి. 294 మంది సభ్యులలో సభకు హాజరైనది ఎంత మంది. ఈసారి శాసనసభ సమావేశాల కోసం వినియోగించిన సమయం అక్షరాల 57 గంటల 29 నిముషాలు. ప్రజాసమస్యల మీద సభలో గళమెత్తవలసిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఒకసారి బడ్జెట్ సమావేశాల సమయంలో పాదయాత్ర లో మరోసారి సమావేశాలలో అమెరికా యాత్రలో బిజీగా ఉన్నారు. ఉన్న కొద్దిమంది తే.దే. పా ఎం.ఎల్.ఎ లకు కళంకిత మంత్రుల మీద ఎదురుదాడి చేయటమే సరిపోయింది. అందులో ప్రజావాణి ఎందరిది?విమర్శల గోల ఎవరిదో?ప్రజలకు అర్ధంకాని పరిస్థితి. పార్టీల ఎజెండాలో ప్రజాసమస్యలు ఎక్కడా చర్చకు రాలేదు. ఆరంభసూరత్వంగా చర్చలు మిగిలినాయి.   విపక్షాల వాకౌట్లు,నిరసనలు,సస్పెన్షన్లతోనే  సభాసమయాన్ని పూర్తిగా వృధా చేశారు. కేవలం బిల్లుల ఆమోదం కోసమే సభా నిర్వహణ జరిగిందా?16 బిల్లులు,8 పద్దులకు సభ ఆమోదం లభించింది.ఆకోవలోనే ద్రవ్య వినిమయ బిల్లు కూడా ఆమోదం పొందింది. కొన్ని సందర్భాలలో అధికారపక్ష  నేతలు,మంత్రులు కొందరు లేకుండానే బిల్లుల ఆమోదం జరిగిపోయింది. నిభందనల మేరకు శాసనసభ కనీస సమయం 144 గంటలు. కాని ఈ  57 గంటల సమయాన్ని వెచ్చించి మాత్రం ముఖ్యమంత్రి,ఆయన సహచర మంత్రులు ఏమి సాధించారు?

చాప క్రింద నీరులా పేరుకుపోతున్న అవినీతి

  రాజకీయనాయకులు, అధికారులు, అవినీతి ఈ మూడు కలిస్తే ఏర్పడేదే ప్రభుత్వం. ఈ నిర్వచనం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి కొంచెం ఎక్కువ వర్తిస్తుంది. ఎందుకంటే, అక్కడ ఎవరూ ఎవరికీ జవాబు దారీ కారు. ఇక విషయానికి వస్తే, కళంకిత మంత్రులను నిర్లజ్జగా, నిర్బీతిగా వెనకేసుకు వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి చాప క్రింద నీరులా ఎప్పుడూ ఉండనే ఉంటుంది.   అవినీతి నిరోధక, విజిలన్స్, పోలీసు వంటి వివిధ శాఖలు సమర్పించిన నివేదికలు దాదాపు 400పైనే పేరుకుపోయున్నాయి. రెవెన్యు, మునిసిపల్, ఆరోగ్యం, నీటిపారుదల వంటి అనేక ప్రభుత్వ శాఖలలో అవినీతి, లంచగొండి అధికారులను వలపన్ని పట్టుకొని, , వారిపై శాఖా పరంగా మరియు సివిల్, క్రిమినల్ కేసులు నమోదుచేసి వెంటనే తగిన చర్యలు తీసుకోమని కోరినప్పటికీ, నేటి వరకు ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. కారణం కొందరు కాంగ్రెస్ నేతలతో సదరు అధికారులకు ఉన్న సత్సంబందాలే. వారిపై దైర్యం చేసి చర్యలు తీసుకొన్నట్లయితే, పార్టీలో, ప్రభుత్వంలో కొత్త శత్రువులు పుట్టుకొస్తారు. గనుక, ఏ నిర్ణయమూ తీసుకోకుపోవడమే ఒక నిర్ణయంగా మారింది.   దీనివల్ల ప్రభుత్వాధికారులకి మరింత దైర్యం కలిగితే, వారిని శ్రమ పది పట్టుకొన్న విజిలన్స్ మరియు అవినీతి శాఖల అధికారుల మనో దైర్యం నానాటికి సన్నగిల్లి నిర్లిప్తత ఏర్పడుతుంది.   కేవలం అవినీతి, లంచ గొండి అధికారులను పట్టుకోవడమే కాక, వివిధ శాఖలలో, ప్రభుత్వ పధకాల అమలులో అవినీతి బీజాలు పడుతున్నపుడే వాటిని కనిపెట్టి విజిలన్స్ శాఖ ప్రతీనెలా టంచనుగా హెచ్చరిక నివేదికలు కూడా పంపుతుంటుంది. అంటే అవినీతిని మొగ్గ దశలోనే త్రుంచేసే వ్యవస్థ కూడా మనకి ఉందన్న మాట. అయితే, కిరణ్ ప్రభుత్వం కనీసం ఈ హెచ్చరికలను సైతం ఖాతరు చేసే పరిస్థితిలో లేదని ఆయన వద్ద పేరుకుపోయిన 197 (2011); 176 (2012); 228 (2013) నివేదికలు తెలియజేస్తున్నాయి.   కిరణ్ కుమార్ రెడ్డి నవంబర్ 2010లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఇంత వరకు విజిలన్స్ మరియు అవినీతి నిరోధక శాఖలు మొత్తం 395 నివేదికలు పంపి వెంటనే తగిన చర్యల కోసం సిఫార్స్ చేస్తే వాటిలో కనీసం ఒక్కటి ఇంతవరకు పరిష్కరించలేదు. వాటిలో 148 మంది ప్రభుత్వంలో అత్యున్నత పదవులలో ఉన్నవారిపై చర్యలకి సిఫార్సు చేయబడినవీ ఉన్నాయి. అయితే షరా మామూలుగానే ఆ నివేదికలన్నీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో బూజులు పడుతున్నాయి.   ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలో పనులు ఏవిధంగా జరుగుతాయో ఎవరయినా ఊహించవచ్చును. తాజా లెక్కల ప్రకారం గత 3 నుండి 12 సం.ల కాలంలో పంపబడిన 1987 నివేదికలతో కలిపి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద మొత్తం 2,966 నివేదికలు పోగుబడి ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గిర పడినప్పుడు రైతుల రుణాలు, వడ్డీలు మాఫీ చేసినట్లు, సదరు ప్రభుత్వాధికారులను మంచి చేసుకొనే ప్రయత్నంలో ప్రభుత్వం ఈ నివేదికలన్నీ బుట్ట దాఖలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.   ఇక, అటువంటప్పుడు ప్రభుత్వ శాఖలలో అవినీతి గురించి ఎంత చర్చించుకొంటే మాత్రం ఏమి ప్రయోజనం?

కళంకిత మంత్రులు నిర్దోషులని ముఖ్యమంత్రి జడ్జిమెంట్

  ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రా రెడ్డి ఇద్దరు రాజీనామా చేసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ తాము నిర్దోషులమని, కోర్టు కేసులోంచి త్వరలోనే బయటపడతామని అన్నారు. వారి మాటలను పట్టుకొని వారిరువురూ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారంటూ సీబీఐ మరో కొత్త కేసు పెట్టింది. కళంకిత మంత్రుల వ్యవహారం కోర్టులో ఉంది గనుక దానిపై మాట్లాడటం తగదంటూనే సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా అవే అభిప్రాయలు వ్యక్తం చేయడమే కాకుండా కళంకిత మంత్రులందరూ నిర్దోషులని ఆయన జడ్జిమెంటు కూడా ఇచ్చేసారు.   శాసనసభలో జరిగే చర్చలు కోర్టు పరిధిలోకి రాకపోవచ్చు గాక, కానీ ముఖ్యమంత్రి ఈ విధంగా శాసన సభ సాక్షిగా తన మంత్రులు నిర్దోషులని, వారికి న్యాయ సహాయం చేస్తామని ప్రకటించడాన్ని సాక్షులను ప్రభావితం చేయవా? అటువంటప్పుడు సీబీఐ ఏవిధంగా స్పందించాలి?   ఇక, కాంగ్రెస్ అధిష్టానం కళంకిత మంత్రుల విషయంలో కటినంగా వ్యవహరించి వారికి ఉద్వాసన చెప్పించిన తరువాత కూడా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వారిని ఇంకా వెనకేసుకు రావడం గమనిస్తే, ఆయన పార్టీ అధిష్టానం నిర్ణయాన్నిఇప్పటికీ వ్యతిరేఖిస్తునట్లు అర్ధం అవుతుంది. మరి దీనిని బట్టి చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి కూడా క్రమంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి అడుగు జాదలలోనే నడుస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే తానే అన్నవిధంగా వ్యవహరిస్తున్నట్లు అర్ధం అవుతుంది. మరి ఆయన ధోరణిని కాంగ్రెస్ అధిష్టానం సమర్దిస్తుందా? లేక ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో ఆయన ఈ ధిక్కార ధోరణిని చూసి చూడనట్లు ఊరుకొంటుందా?   ఇక శాసనసభలో ప్రజా సమస్యల గురించి చర్చించి వాటిని పరిష్కరించవలసిన ముఖ్యమంత్రి మరియు శాసనసభ్యులు అందరూ తమ బాధ్యతలు మరిచి కళంకిత మంత్రులపైనే తీవ్ర వాదోపవాదాలు చేయడం ఎంతవరకు సబబు? దానివల్ల ప్రజలకి ఒరిగేదేమిటి? వారి వారి రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం సభలో ఈ విధంగా గంటలు గంటలు వాగ్వాదాలు చేసుకొంటూ విలువయిన సమయాన్ని, అంతకంటే విలువయిన ప్రజాధనాన్ని వృధా చేయడం విచారకరం.

కేంద్రంలో మంత్రివర్గ 'విస్తరి '

......సాయి లక్ష్మీ మద్దాల       కేంద్రమంత్రివర్గ విస్తరణ కారణంగా దేశానికి, తద్వారా ప్రజలకు కొత్తగా ఒరిగేదేమీ లేదు. కేవలం 2014 ఎన్నికల దృష్టితోనే కాంగ్రెస్ అధిష్టానం ఈ ప్రయత్నం చేసిందనేది అందరికి తెలిసిన విషయం. కాకపోతే ప్రధాని మన్మోహన్ సింగ్ 77 మంది సైన్యంతో తన కొలువును నింపుకున్నారు. అసలే కుంభకోణాల మాయమై పోయిన కేంద్ర సర్కారుకు తాజా విస్తరణ కారణంగా రాబోయే ఎన్నికలను ఎదుర్కోవచ్చు అనే అభిప్రాయం ఉండవచ్చు. యు. పి. ఎ తొలివిడత పాలన పట్ల పెరిగిన ప్రజావిశ్వాసంతో తమ బాధ్యతను గుర్తెరిగి మరింత సమర్ధవంతమైన మంత్రివర్గకూర్పు ఉంటే ప్రజలకు మరోసారి తమపట్ల విశ్వాసాన్ని కలిగించిన వారయ్యేవారు. అక్కడ ప్రదానికే స్వేఛ్చ లేని విస్తరణ. ఇహ దీనివలన ఎవరు లాభనష్టాల బేరీజు వేసుకోవాలి? జనం ఆకాంక్షల్ని తీర్చే ధీటైన ప్రభుత్వం ఇదికాదు. అసలు మంత్రివర్గమంటే ఏమిటి? ఐక్య ప్రగతిశీల కూటమి. కాని నేటి పాలక కూటమిలో ఐక్యత ఎక్కడుంది? భయపెడుతున్న ఆహారద్ర వ్యోల్భణం రోజురోజుకి పడిపోతున్న రూపాయి విలువ,గుండెబేజారేత్తిస్తున్న కరెంటు ఖాతా లోటు ...... ఇంకా చెప్పుకుంటూ పోతే అభివృద్ధికి ఆమడ దూరంలో భారత ప్రగతి ఆగిపోయింది. ఒకనాదు ఆర్ధిక శాస్త్ర వేత్తగా ఈ దేశాన్ని ప్రగతి పధంలో నడిపించిన వ్యక్తి పాలనలో నేడు దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభానికి కారణం ఎవరు? ఆయన నోరుమెదపలేని మెతకవైఖరి కాదా? మరి ఈఆర్ధికసంక్షోభం గురించి ఆలోచించే ప్రయత్నం అంటే వారి దృష్టిలో అసలు ఉందా? నిర్ణయ రాహిత్యం,పారదర్సకత లేని నిధులవ్యయమ్ వెరసి పారిశ్రామికరంగం కుప్పకూలుతున్న వైనం.                సత్వరాభివ్రుద్ధిని గాలికి వదిలేసి లక్షల కోట్లకుంభకోణాలలో మన్మోహన్ ప్రభుత్వం కూరుకుపోయి ఉంది. నాలుగేళ్ళలో రైల్వే శాఖకు ఆరుగురు,మిగతా వివిధ శాఖలకు ముగ్గురేసి,నలుగురేసి మంత్రుల చొప్పున మారిపోయిన ఏలుబడిలో ఇప్పుడు కొత్తగా పరచిన మంత్రి వర్గ విస్తరి ఎవరి కడుపు నింపటానికి? అవినీతి నిర్నయరాహిత్యం ఇవి రెండు ప్రభుత్వాన్ని తద్వారా ప్రజలను పట్టిపీడిస్తున్న అంశాలు. వాటినుండి ఈ తొమ్మిదేళ్ళలో ఈ దేశ ప్రజలను రక్షించే ప్రయత్నం ఏలినవారు ఎన్నడూ చెయ్యలేదు. మాటికిముందు మంత్రి వర్గ విస్తరణ పేరుతో ఆయా ఖాళీలను భర్తీ చేసుకుంటూ సదరు మంత్రులను సంతుష్ట పరుస్తున్నారు తప్పించి.

ఛలో అసెంబ్లీ హిట్టా ఫట్టా

.....సాయి లక్ష్మీ మద్దాల       తెలంగాణా సాధన కోసం తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం మొత్తం మీద ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ముగిసింది. అయితే దీని ద్వారా కె.సి. ఆర్ సాధించినది ఏమిటి? అనవసరంగా సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడటం తప్పించి. అంతగా ఉద్యమం అని పరితపించే ఆయన ఎందుకు నిన్న జరిగిన ఛలోఅసెంబ్లీ లో పాల్గొన లేదు. ఇది చాలామంది తెలంగాణా వాదుల సందేహం కూడా. ఇంతకు ముందు తలపెట్టిన తెలంగాణా మార్చ్ లో కూడా కె.సి.ఆర్ పాల్గొనలేదు. అంటే వారు పిలుపునిస్తారు కానీ వారు మాత్రం ఫామ్ హౌసులొ విశ్రాంతి తీసుకుంటారు. చదువుకోవలసిన విద్యార్ధులు వారి భవిష్యత్ నాశనం చేసుకోవాలి, రోజు కూలీలు వారి బ్రతుకు నష్ట పోవాలి కాని గులాబి బాస్ మాత్రం అంత అయిపోయిన తర్వాత తెలంగాణ బంద్ కు మళ్ళి పిలుపునిస్తారు. మల్లి ఇక్కడ నష్టపోయేది అదే సామాన్య ప్రజానీకం. అసలు నిన్న జరిగిన ప్రహసనాన్ని చూస్తే రాజకీయ నాయకులు అంటేనే జుగుప్సగా అనిపిస్తోంది. ఎవరికి వారే రాజకీయ లబ్ధి కోసం పార్టీలతో సంబంధం లేకుండా రోడ్డెక్కి ఛలోఅసెంబ్లీఅని నినాదాలు,అరెస్టులు విపరీతమైన రాజకీయ నాటకాలు. ఏరాజకీయ లబ్దికోసం వీరు ఇంతగా తాపత్రయ పడుతున్నారో ప్రజలకు అర్థం కావటంలేదనే భ్రమలో వారు ఉన్నారు. కానీ ప్రజలకు అన్ని తెలుసు. కానీ ఒక్క విషయంలో వీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. శాసనసభాపతులుగా ప్రమాణ స్వీకారం చేసేటపుడు సభా మర్యాదను కాపాడుతామని,సభ గౌరవానికి భంగం వాటిల్లకుండా చూస్తామని ప్రమాణం చేసిన ఈపెద్దమనుషులు నిన్న అన్నీ మర్చిపోయారా? వారి రాజకీయ స్వార్ధం ముందు సభ దాని విలువ,మర్యాద , గౌరవం  అన్ని మంట గలసి పోయాయా? ఈనాడు శాసనసభ పట్ల ఇంత అనుచితంగా ప్రవర్తించిన వీరికి మళ్ళి ఎన్నికలలో నిలబడే అర్హత ఉందా? ఎన్నికల కమీషన్ ఎలాంటి చర్యలు వీరి మీద తీసుకోదా?

అద్వాని రాజీనామా నాటకాలెందుకు?

  .....సాయి లక్ష్మీ మద్దాల         మొత్తం మీద ఆర్.ఎస్.ఎస్ జోక్యంతో, సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ, ఉమాభారతి వంటి ఆయన ప్రియ శిష్యుల బుజ్జగింపుతో అద్వాని రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు రాజనాధ్ సింగ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇక్కడ దేశ ప్రజలు అద్వానీ నుండి చాలా సమాధానాలు ఆశిస్తున్నారు. కానీ మధ్యలో రాజనాధ్ సింగ్ రాయబారాన్ని కాదు. అసలు అద్వాని ఎందుకు రాజీనామా చేశారు? ఎందుకు ఉపసంహరించుకున్నారు? నరేంద్ర మోడీకి కేవలం గుజరాత్ ప్రజల జనాకర్షనే తప్ప, దేశ ప్రజల జనాకర్షణ లేదని అద్వాని అభిప్రాయం. అలాంటివాడు ప్రజాస్వామ్యంలో దేశనేత కాలేడు అని ఆయన పిడి వాదం కుడా. కాని మరి అద్వాని ఎ ప్రజాకర్షణతో బి. జె. పి అధ్యక్షుడు అయ్యాడు.   అద్వాని మొన్న రాజీనామా చేసినా, నేడు దానిని ఉపసంహరించుకున్నఅది ఎవరికోసం? ప్రజల కోసమా? పార్టీ కోసమా? పదవి కోసమా? ఈ ప్రశ్నలన్నిటికి  సమాధానం దేశ ప్రజలకు అద్వాని వివరించాలి. ఇలా మొహం చాటేయటం కాదు ఒక అనుభవఘ్నుడైన రాజనీతిఘ్నుడు చేయవలసింది. బి. జె. పి.. ఆర్. ఎస్. ఎస్ ఆధ్వర్యం లోనే నడుస్తుందని మోహన్ భగవత్ రాయభారంతో మెత్తబడిన అద్వాని వైఖరే స్పష్టం చేస్తోంది. మరి అద్వాని సారధ్యంలోని బి.జె. పి కి ఏ ముద్ర వేయాలి? దానికి మళ్ళి రాజీనామా, ఉపసంహరణ అంటూ ఇంత ప్రయోగాత్మకమైన చవుకబారు నాటకాలెందుకు? ఈ మొత్తం ఉదంతంతో దేశప్రజలకు అద్వాని గురించి ఏమని అర్ధం కావాలి? అద్వానీ కేవలం ఒకరాజకీయ నాయకుడే కాని, రాజనీతిఘ్నుడుకాడు అనా !.....