ముఖ్యమంత్రి ఉద్వాసనకి రంగం సిద్దం అయినట్లేనా

  మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలలో నిజానిజాలెలా ఉన్నపటికీ, అవి ముఖ్యమంత్రి ఉద్వాసనకు అవసరమయిన తగిన పరిస్థితులను సృష్టించగలిగాయి. రాష్ట్ర విభజన నిర్ణయం జరిగినప్పటి నుండి అధిష్టానాన్ని దిక్కరిస్తూ గట్టిగా సమైక్యవాదం వినిపిస్తున్నప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డిని పదవిలోంచి తొలగిస్తే సీమంద్రాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతాయనే భయంతో ఇంత కాలంగా సంకోచిస్తున్నకాంగ్రెస్ అధిష్టానానికి, ఇప్పుడు ఆయనను తొలగించడానికి మార్గం సుగమం అయింది. అందువల్ల ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం ‘హస్తం’ కూడా ఏమయినా ఉందా? అనే అనుమానాలున్నాయి.   అదేవిధంగా రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెపుతున్నఒకరిద్దరు సీమంద్రా మంత్రులు కూడా ముఖ్యమంత్రికి దినేష్ రెడ్డి చేత కిరణ్ కుర్చీకి ఎసరు పెట్టిస్తున్నారా అనే సందేహాలు ఉన్నాయి.   ఏమయినప్పటికీ, దినేష్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు కిరణ్ వ్యతిరేఖ వర్గాలన్నిటినీ ఒక త్రాటిపైకి తెగలిగాయి. రాష్ట్రవిభజనను అడ్డుకొంటున్నందుకు ఆగ్రహంగా ఉన్నతెరాస, టీ-కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు, ఆయన సమైక్యవాదంతో హీరోగా ఎదుగుతూ తమను పెద్ద జీరోలను చేసినందుకు కోపంగా ఉన్న కొందరు సీమాంధ్ర మంత్రులు, గతంలో కిరణ్ దెబ్బకు బలయిన మంత్రులు, తన నిర్ణయాన్నే సవాలు చేస్తున్నదుకు ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని పదవి నుండి తప్పించవలసిన అవసరం ఉందని భావించేందుకు ఎవరి కారణాలు వారికున్నాయి.   కాంగ్రెస్ అధిష్టానం కూడా తన హస్తానికి బురద అంటకుండా కాగల కార్యం గందర్వులే పూర్తి చేసినట్లు ఈవిధంగా దినేష్ రెడ్డి ముఖ్యమంత్రిని తొలగించడానికి మార్గం సుగమం చేస్తున్నపుడు కాదనేందుకు ఏముంటుంది?ఇక భక్తులు భగవంతుడు ఒకటే కోరుకొంటున్నపుడు ఇంకా ఆలస్యం దేనికి?   బొత్సవత్సలమయిన కాంగ్రెస్ అధిష్టానం ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని, త్వరలోనే సమైక్య కిరణాన్ని ఆర్పివేసి ‘తన వీర భక్తుడి కోరిక’ తీరుస్తుందేమో?       

జగన్ కాంగ్రెస్ పార్టీకి కూడా హస్తం ఇవ్వబోతున్నారా?

  కాంగ్రెస్-వైకాపాల మధ్య కుదిరిన రహస్య ఒప్పందం వల్లనే జగన్మోహన్ రెడ్డి బెయిలుపై బయటకి వచ్చి సమైక్యరాగం ఆలపిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆరోపణ. జగన్ కోసం కాంగ్రెస్ అధిష్టానం తమ రాజకీయ జీవితాన్ని, చివరికి పార్టీని కూడా పణంగా పెట్టిందని స్వయంగా కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్-వైకాపాల మధ్య ఉన్న రహస్య అనుబంధం గురించి ప్రత్యక పరిశోధన మరవసరం లేదు.   కానీ జగన్మోహన్ రెడ్డి గత నాలుగు రోజుల్లో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీని పొగుడుతూ మాట్లాడటం చూస్తే ఇప్పుడు అతను కాంగ్రెస్ పార్టీకి కూడా హస్తం ఇవ్వబోతున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.   మొన్న జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఒక వ్యక్తి వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడటం అంటే అతను సమర్ధుడనే కదా లెక్క? మోడీ తన పార్టీని సెక్యులర్ పార్టీగా మలచగలిగితే, భవిష్యత్తులో బీజేపీకి అనేక పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది,” అని అన్నారు. అంటే వైకాపా బీజేపీతో జతకట్టే అవకాశాలున్నాయని స్పష్టం చేస్తున్నారు.   అయితే కాంగ్రెస్ అధిష్టానంతో ఒప్పందం కుదుర్చుకొని ఇప్పుడు అతను బీజేపీకి అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నట్లు? ఆయన జైలు నుండి విడుదలయిన రోజునే సీనియర్ కాంగ్రెస్ నేత పీసీ చాకో “వ్యక్తులు జైలులో ఉన్నపటికీ, బయట ఉన్నపటికీ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఈయవలసి ఉంటుందని” అని స్పష్టంగా చెప్పారు. మరటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నట్లు? పది చార్జ్ షీట్లు వెనకేసుకొన్నఆయన, తనను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కావాలనుకొంటే అప్పుడు మళ్ళీ జైల్లోకి పంపగలదని గ్రహించకనే ఈవిధంగా మాట్లాడుతున్నారా? అని ఆలోచిస్తే కాదనే చెప్పవచ్చును.   కాంగ్రెస్-వైకాపాల మధ్య అనైతిక బంధం, జగన్ బెయిలు కోసం సీబీఐని ఏవిధంగా నిర్వీర్యం చేసిన సంగతినీ తెదేపాతో సహా అన్ని ప్రతిపక్షాలు కోడై కూస్తుంటే, దానిని స్వయంగా అధికార కాంగ్రెస్ నేతలే రూడీ చేస్తుంటే, వీటి నుండి బయట పడేందుకే నరేంద్ర మోడీని పొగుడుతూ, బీజేపీతో పొత్తుల గురించి మాట్లాడుతూ ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.   “ఆయన సోనియాను విమర్శించిన మరు క్షణమే ఆయన బెయిలు రద్ధవుతుందని” తెదేపా చేసిన ఆరోపణలు తప్పని ఋజువు చేసేందుకే ఆయన ఇప్పుడు సోనియా గాంధీని కూడా విమర్శించడం మొదలు పెట్టారు. అయితే బహుశః ఇది కూడా ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను మభ్యపెట్టేందుకేనని చెప్పవచ్చును.   అయితే ఈవిధంగా వ్యవరించడం వలన మరో ప్రయోజనం కూడా ఉంది. ఒకవేళ రానున్నఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచలేక పోయినట్లయితే అప్పుడు ఇదే ప్రాతిపదికన బీజేపీతో పొత్తులు సాగించడానికి మార్గం సుగమం అవుతుంది. ఈసారి ఎలాగైనా కేంద్రంలో అధికారం దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ, వైకాపా కోరుండి మద్దతిస్తామని ముందుకు వస్తుంటే ఎందుకు కాదంటుంది? అందువల్ల రానున్న ఎన్నికలలో ఎవరు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచగలిగితే వారికే వైకాపా మద్దతు ప్రకటించడం ఖాయం.

సీమంధ్ర కాంగ్రెస్ నేతల కొత్త డ్రామా

  ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరో సరికొత్త డ్రామా మొదలయింది. సీమంధ్ర నేతలలో కొంత మంది పదవులకోసం ఆశపడుతూ రాష్ట్ర విభజనకు కేంద్రానికి సహకరించారని కొందరు ఆరోపిస్తుంటే, కాదు వారే మమ్మల్ని చివరి నిమిషం వరకు మభ్యపెడుతూ రాష్ట్ర విభజనకు కారకులయ్యారని మరికొందరు ఆరోపిస్తున్నారు.   ఈ కొత్త డ్రామా మొదటి అంకంలో ప్రధాన పాత్రదారులుగా లగడపాటి, బొత్స సత్యనారాయణ తెరపైకి వచ్చారు. త్వరలోనే మిగిలిన పాత్రదారులు కూడా ముందుకు రావచ్చును. లగడపాటి మీడియాతో మాట్లాడుతూ కొందరు మంత్రులు పదవులకు ఆశపడి సమైక్యఉద్యమానికి ద్రోహం చేసారని, సమయం వచ్చినప్పుడు వారి పేర్లను బహిర్గతం చేస్తానని అన్నారు.   జరుగుతున్న పరిణామాలు గమనిస్తే లగడపాటి బొత్సను ఉద్దేశ్యించే అని ఉంటారని అర్ధం అవుతుంది. రాష్ట్ర విభజన జరగడానికి బొత్స సత్యనారాయణే కారకుడని బలంగా నమ్ముతున్న సమైక్యవాదులు ఆయనకు చెందిన ఆస్తులపై దాడులు చేస్తున్నారు. ఎనాడూ చిన్న సంఘటన కూడా ఎరుగని ప్రశాంత పట్టణంగా పేరుగాంచిన విజయనగరం నేడు యుద్దభూమిగా మారిపోయింది. చివరికి కర్ఫ్యూకూడా విదించాల్సి వచ్చింది. అయినా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.   దీనితో తీవ్ర ఆగ్రహం చెందిన బొత్స తనపై పార్టీలో కొందరు లేనిపోని ప్రచారం చేస్తూ తనను ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం వెలువడగానే అందరూ కలిసి కట్టుగా రాజీనామాలు చేసి రాజ్యంగ సంక్షోభం సృష్టించి, రాష్ట్రవిభజనను అడ్డుకొందామని చెప్పినప్పుడు పార్టీలో కొందరు పెద్దమనుషులు విభజనను అడ్డుకొనేందుకు తగిన ప్రణాళికలు తమవద్ద ఉన్నాయని భరోసా ఇస్తూ, చివరికి వారే రాష్ట్ర విభజనకు పరోక్షంగా సహకరించి, ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రులను, శాసనసభ్యులను, చివరికి యంపీలను కూడా రాజీనామాలు చేయవద్దని వారిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి బొత్స ఈ మాటలు అని ఉంటారని అర్ధం అవుతోంది.   ముందు రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని ప్రశ్నించిన బొత్స, ఆ తరువాత అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాట ఇచ్చివచ్చారు. ఆ తరువాత తిరుపతి వెళ్లినప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని దేవుడిని ప్రార్దించానని ఆయనే స్వయంగా మీడియాకు చెప్పారు. మళ్ళీ మొన్న కిరణ్-భాదిత మంత్రుల సంఘం సమావేశంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నిర్ణయం తీసుకొని, అదేమాట దిగ్విజయ్ సింగ్, షిండే చెవిలో వేసేందుకు డిల్లీలో వాలారు.   అంతవరకు టీ-నోట్ పై రకరకాల కధలు చెపుతూ వచ్చిన షిండే, దిగ్విజయ్ సింగ్, బొత్స తమ చెవిన వేసిన వార్త తరువాత కేవలం టేబిల్ నోట్ మాత్రమే క్యాబినెట్లో ప్రవేశపెట్టబోతున్నట్లు మీడియాకు లీకులిస్తూ, ఎప్పుడో తయారు చేసి సిద్దంగా ఉంచిన 22 పేజీల సమగ్రమయిన టీ-నోట్ ను క్యాబినెట్లో ప్రవేశపెట్టడం, వెంటనే దానిని మంత్రి మండలి ఆమోదించేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అందువల్ల ఇక టీ-నోట్ శాసనసభ ఆమోదం కోసం రావడం కూడా అనుమానమే.   ఇటువంటి నేపధ్యంలో ఇప్పుడు బొత్స తాను నిర్దోషినని సంజాయిషీలు ఇచ్చుకొంటూ, ఇతరులను నిందించడం విశేషం. నిజం చెప్పాలంటే తిలాపాపం తలోపిడికెడు అన్నట్లు రాష్ట్ర విభజన పాపంలో మొత్తం సీమంధ్ర కాంగ్రెస్ నేతలందరికీ భాగం ఉంది. కానీ ప్రజలను మభ్యపెట్టే పనిలో మళ్ళీ ఈ కొత్త డ్రామకి తెర తీసారు. దానిని ప్రజలు ఇంకా గుడ్డిగా నమ్ముతారని వారు గుడ్డిగా నమ్ముతున్నారు. ఏది ఏమయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వీరందరూ ద్రోహులుగా మిగిలిపోవడం ఖాయం.  

టీ-నోట్ పై దిగ్విజయ్ తిరకాసు సమాధానాలు

  ఈ రోజు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది గనుక దానిపై ఈ రోజు సాయత్రంత్రం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించవచ్చని మీడియాకు తెలిపారు. ఈ రోజు క్యాబినెట్ లో టీ-నోట్ ప్రవేశపెడతారా అనే ప్రశ్నకు జవాబు చెపుతూ ఆవిషయం నాకు కూడా తెలియదు. ప్రవేశపెడుతున్నట్లు మీడియాలో వార్తలు చూసాను,” అని జవాబిచ్చారు. అయితే రాష్ట్రవిభజన నిర్నయమనేది అందరి ఆమోదంతో తీసుకోన్నదే గనుక దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే అని ఆయన గట్టిగా చెప్పారు. అంటే ఇది ముఖ్యమంత్రికి ఆయన మీడియా ద్వారా ఇస్తున్న సందేశమని భావించవచ్చును.   కానీ, హోంమంత్రి షిండే మీడియా ప్రశ్నకు జవాబు చెపుతూ ఆ వార్తలన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. అయితే టీ-నోట్ ఎప్పుడో పూర్తిగా తయారయ్యి షిండే వద్ద సిద్ధంగా ఉందని మరో తాజా వార్త.   ఈ టీ-నోట్ వార్తలతో సీమాంధ్ర నేతలలో, మంత్రులలో, ఉద్యోగులు, ప్రజలలో ఒక్కసారిగా మళ్ళీఅలజడి మొదలయింది. ఉద్యోగులు కేంద్రమంత్రుల ఇళ్ళను ముట్టడించి ధర్నాలు చేస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తలనినిజమో కాదో ఖచ్చితంగా దృవీకరించవలసిన కాంగ్రెస్ నేతలిద్దరూ చెరో రకంగా మాట్లాడటం భాద్యతా రాహిత్యమేనని చెప్పక తప్పదు. రాష్ట్రవిభాజనపై వెనకడుగు వేసేది లేదని గట్టిగా చెపుతున్న దిగ్విజయ్ సింగ్, మరి టీ-నోట్ పై అంతే ఖచ్చితంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారో తెలియదు   కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాంగ్రెస్ అధిష్టానం తనతో నేరుగా సంప్రదింపులు జరుపుతోందని ప్రకటించిన తెరాస అధ్యక్షుడు కేసీఆర్ రెండు రోజుల క్రితమే టీ-నోట్ క్యాబినెట్ ప్రవేశపెట్టడానికి మరికొంత సమయం పట్టవచ్చని తెలిపారు. అందువల్ల ఈరోజు టీ-నోట్ క్యాబినెట్ ముందుకు రాకపోవచ్చును.   . .

కాంగ్రెస్ నష్టబోతున్నా ముందుకే ఎందుకు

  రాష్ట్ర విభజన అంశంతో ప్రతిపక్షపార్టీలను దెబ్బతీయబోయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రెండు ప్రాంతాలలో చాలా దెబ్బతింది. అయినా కూడా వెనకడుగువేసే ప్రసక్తే లేదని చెపుతూ అందుకు అనుగుణంగా రాష్ట్రంలో జగన్ ద్వారా ఉద్యోగులలో, అనం, డొక్కావంటి మంత్రులద్వారా తన స్వంత పార్టీలో చీలికలు సృష్టించేందుకు చురుకుగా పావులు కదుపుతోంది. దీనివలన పార్టీ రెండు ప్రాంతాలలో తీవ్రంగా నష్టపోతుందని తెలిసినా కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు ఇంత మొండిగా ముందు సాగుతోంది? ఇది ఆ పార్టీ అవివేకమా? లేకపోతే అతి తెలివితేటలనుకోవాలా?అని ఆలోచిస్తే రెండూ కాదు, చాలా దూరాలోచన అని అర్ధం అవుతుంది.   ఏవిధంగా అంటే, కాంగ్రెస్ అధిష్టానం దృష్టి ఇప్పుడు రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడం కంటే కేంద్రంలో అధికారం సాధించడంపైనే ఎక్కువుంది. ఇక్కడ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా ఆ పార్టీకి పెద్దగా నష్టం లేదు, కానీ కేంద్రంలో కోల్పోతే మాత్రం ఆ తరువాత వచ్చే నరేంద్ర మోడీ ముందే హెచ్చరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ కోలుకోని విధంగా ఘోరంగా దెబ్బ తీయడం ఖాయం. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని కలలు కంటున్నకాంగ్రెస్ అధిష్టానం, ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్నిమోడీకి వదులుకోలేదు. వదులుకొంటే అది కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యతో సమానం.   అవసరమయితే రాష్ట్రాన్ని వదులుకోవచ్చు కానీ కేంద్రాన్ని మాత్రం కాదు. ఒకవేళ కేంద్రంలో ఓడిపోయి, రాష్ట్రంలో గెలిచినా దానివల్ల కాంగ్రెస్ అధిష్టానానికి పెద్దగ ఒరిగేదేమీ ఉండదు. గనుక కేంద్రంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పరిచేందుకు అవసరమయిన యంపీ సీట్లను తప్పనిసరిగా రాష్ట్రం నుండే పోగేసుకోక తప్పదు. అయితే ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్నిఒక్కటిగా ఉంచినా, ముక్కలు చేసినా కాంగ్రెస్ పార్టీ రెండు చోట్లా గెలిచే అవకశాలు ఎట్టి పరిస్థితుల్లో లేవు. గనుక కనీసం తనకు మద్దతునిచ్చే పార్టీలు వైకాపా, తెరాసలకు అధికారం దక్కినా అది తనకు దక్కినట్లేనని కాంగ్రెస్ భావన కావచ్చును.   అందుకే రాష్ట్రoలో పార్టీ సర్వనాశనం అవుతోందని ఆ పార్టీ నేతలు ఎంత గగ్గోలుపెడుతున్నా పట్టించుకోవట్లేదని లేదని చెప్పవచ్చును. అదేవిధంగా రెండు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచితే ఇన్నిసీట్లు, విడదీస్తే ఇన్ని సీట్లు సాధించి ఇస్తామని చెపుతున్న మాటలని కూడా విశ్వసించకపోవడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో తన ఓటమి ఖాయమని అందుతున్నఇంటలిజన్స్ నివేదికలేనను కావచ్చును.   ఈ గొప్ప రహస్యం చెప్పేందుకు ఇంటలిజన్స్ నివేదికలే అవసరం లేదు రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెపుతారు. అందుకే కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ అధిష్టానం, అందుకోసం రాష్ట్రంలో అధికారాన్ని వదులుకొనేందుకు కూడా సిద్దపడుతోందని చెప్పవచ్చును.   మరి కాంగ్రెస్ అధిష్టానం యొక్క ఈ దూర దురాలోచానకు రాష్ట్ర ప్రజలు ఎందుకు భారీ మూల్యం చెల్లించాలన్నదే ప్రశ్న.

బీజేపీ వైపు మళ్ళిన రాష్ట్ర రాజకీయాలు

  రాష్ట్ర విభజన అంశంపై రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య యుద్ధం జరుగుతున్ననేపధ్యంలో దీనికంతటికీ మూల కారణమయిన కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరగవలసిన రాజకీయాలు,ఇప్పడు అకస్మాత్తుగా బీజేపీ చుట్టూ తిరగడం మొదలయింది. నిన్నమొన్నటి వరకు రాష్ట్రంలో రాజకీయ పార్టీలేవీ కూడా ఆ పార్టీని అసలు లెక్కలోకే తీసుకోలేదు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఆ పరిస్థితి మారింది.   మొదట, నరేంద్ర మోడీ తేదేపాతో స్నేహాసంకేతాలు పంపడంతో ఈ మార్పు మొదలయింది. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు కూడా అందుకు సానుకూలత చూపుతునట్లు వ్యవహరిస్తుండటంతో రాష్ట్రంలో మిగిలిన పార్టీలు ఉలిక్కిపడ్డాయి. రేపు ఢిల్లీలో ‘సిటిజన్ కౌన్సిల్ ఫర్ అకౌంటబులిటి గవర్నన్స్’ నిర్వహిస్తున్న ఓ సమావేశంలో చంద్రబాబు, మోడీ ఒకే వేదికపై కలువనున్నారు. ఇది ఆ రెండు పార్టీలు క్రమంగా దగ్గరవుతున్నాయని సూచిస్తోంది.   ఇక ఇంతకు ముందు బీజేపీతో అసలు పొత్తుల ఆలోచనే ఉండదని నిర్ద్వందంగా ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి, తమ పార్టీ చంద్రబాబులా మాటిమాటికి ‘యూ’ టర్న్ తీసుకోదని చెపుతూనే, తమ పార్టీ సెక్యులర్ పార్టీగానే ఉంటుందని గట్టిగా చెపుతూనే, నరేంద్ర మోడీని మంచి పరిపాలనాధ్యక్షుడని పొగడటం, ఆయన అన్నిరాజకీయ పార్టీలను సెక్యులర్ వేదికపైకి వచ్చేలా కృషిచేయాలని కోరడం, రానున్న ఎన్నికల తరువాత కేంద్రంలోఏ కూటమిని సమర్ధించాలానే విషయంలో తమ లెక్కలు తమకున్నాయని చెప్పడం చాలా ఆశ్చర్యకరమయిన మార్పు(యూ టర్న్?)గా చెప్పవచ్చును.   ఇక తెరాస అధ్యక్షుడు కేసీఆర్ మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి ‘బీజేపీ బూచి’ని చూపిస్తూ తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకొనేలా చేయగలిగాడు. మళ్ళీ మొన్న హైదరాబాదులో జరిగిన సకలజన భేరి సభలో కూడా కాంగ్రెస్ కాకపోతే బీజేపీ ఉండనే ఉందని మరో మారు ప్రకటించారు.   ఈవిధంగా రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు కూడా ఒకేసారి బీజేపీ వైపు చూడటం చాలా ఆశ్చర్యకర పరిణామమే. బహుశః రానున్న ఎన్నికలలో నరేంద్ర మోడీ అద్వర్యంలో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిచే అవకాశాలున్నట్లు భావించడంవల్లనే మూడు పార్టీలు బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయని భావించవవచ్చును.   అయితే ఈ మూడు పార్టీలకు మళ్ళీ వేటి కారణాలు వాటికున్నాయి. కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వకపోతే బీజేపీ ద్వారా సాధించుకోవాలని తెరాస, జగన్మోహన్ రెడ్డిపై ఉన్నసీబీఐ కేసుల దృష్ట్యా బీజేపీకి మద్దతు ఈయవలసిన అవసరం గుర్తించిన వైకాపా, ఒకవేళ కాంగ్రెస్ తెరాస, వైకాపాలతో జత కట్టినట్లయితే, రెండు ప్రాంతాలలో తన బలం పెంచుకొనేందుకు తెదేపా, బీజేపీ వైపు చూస్తున్నాయని చెప్పవచ్చును. అంతే గాక జాతీయ స్థాయిలో ఈ మూడు పార్టీలు చక్రం తిప్పాలనే కోరిక కూడా ఆ పార్టీ వైపు ఆకర్షింపజేస్తోందని చెప్పవచ్చును.   ఏమయినప్పటికీ ఇది బీజేపీకి చాలా కలిసివచ్చే అంశం. రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు వాటివాటి అవసరాల కోసం మద్దతు ఇస్తే, బీజేపీ మాత్రం ఎందుకు కాదంటుంది? అయితే, రాష్ట్రంలో పొత్తుల విషయంలో బీజేపీ ఏ పార్టీ తనకు మంచి ఆఫర్ ఇస్తుందో దానికే ప్రాధాన్యం ఈయవచ్చును. అయినప్పటికీ, ఒకవేళ బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిచే పరిస్థితి ఏర్పడితే, ఈ మూడు పార్టీల సహాయం తీసుకోవచ్చును.   అయితే మోడీ ఈ మూడు కత్తులను ఒకే ఒరలో ఇముడ్చుకొని నేర్పుగా తన పని చక్కబెట్టుకోవలసి ఉంటుంది. మోడీకి అది వెన్నతో పెట్టిన విద్యే.

కిరణ్ సమైక్య వాదన: తెరాసకు కిక్కునిచ్చే టానిక్కు

  కేంద్రం రాష్ట్ర విభజన చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత తెరాస భవిష్యత్ అయోమయంలో పడింది. కాంగ్రెస్ లో విలీనం కావాలా లేక ఆ పార్టీతో ఎన్నికలలో పొత్తులు పెట్టుకోవాలా అనే విషయంపై తీవ్ర ఆలోచనలు చేసిన తరువాత, విలీనం కంటే పొత్తులే ఇరు పార్టీలకి ఎక్కువ లాభదాయకమని నిర్ణయం అయింది. నాటి నుండి కేసీఆర్ కాంగ్రెస్ అధిష్టానాన్ని కొంచెం వెనకేసుకు వస్తూ, ఇద్దరికీ కొత్త ప్రత్యర్ధిగా మారిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు సీమాంద్ర కాంగ్రెస్ నేతలపై బాణాలు ఎక్కుపెట్టడం మొదలుపెట్టాడు.   కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ఇస్తానని చెపుతోంది గనుక టీ-కాంగ్రెస్ నేతలు ఇక రంకెలు వేయననవసరం లేదు. కానీ, తెరాస కూడా చేతులు కట్టుకొని కూర్చొంటే అది ఆ పార్టీకే నష్టం. గనుకనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదం వినిపించిన వెంటనే కాంగ్రెస్ నేతల కంటే ముందే తెరాస నేతలు ఆయనపై రంకెలు వేస్తూ టీ-కాంగ్రెస్ నేతలకు కర్తవ్యం ఉపదేశిస్తున్నారు.   తెరాస నేతలందరూ మూకుమ్మడిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై దాడి చేస్తున్నపటికీ, ఆయన చేస్తున్నసమైక్యవాదన వలనే వారికి తెలంగాణా ప్రజలను ఆకట్టుకొనే ఈ సదవకాశం దొరుకుతోందని చెప్పవచ్చును. తద్వారా ఇంతవరకు తెలంగాణా సాధించిన ఘనతను తమ ఖాతాలో వ్రాసుకొంటున్న టీ-కాంగ్రెస్ నేతలకు చెక్ పెడుతూ, తామే ఏకైక తెలంగాణా రక్షకులమని డంకా బజాయించి చెప్పుకొనే సదవకాశం తెరాస నేతలు పొందుతున్నారు. ఇందుకు వారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంతయినా ఋణపడి ఉండాలి. రానున్న ఎన్నికల వరకు లేదా తెలంగాణా రాష్ట్రo ఏర్పడే వరకు ముఖ్యమంత్రి, సీమాంధ్ర నేతలు, ఉద్యోగులు ప్రజలు రాష్ట్రవిభజనను ఎంతగా వ్యతిరేఖిస్తే అంతగా తెరాస బలపడుతుంది.   ఈరోజు హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో జరుగబోయే సకలజన భేరి సభకు ఊహించన దానికంటే చాలా ఎక్కువ ప్రజలు తరలి వస్తున్నట్లు తాజా సమాచారం. అందుకు ప్రధాన కారణం కేసీఆర్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బూచిగా చూపించి, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడమే. ఈ రోజు జరిగే సభలో తెలంగాణకు వ్యతిరేఖంగా జరుగుతున్నా కుట్రల గురించి మరింత వివరంగా మాట్లాడుతానని కేసీఆర్ చిన్నసస్పెన్స్ కూడా సృష్టించారు.

సమైఖ్యాంద్ర ఇంటి దొంగలు

    .... సాయి లక్ష్మీ మద్దాల   ఆంధ్రరాష్ట్ర విభజన అంశం కాంగ్రెస్ అధిష్టానానికి కోరి తెచ్చుకున్న కొరివిగ తయారయింది. ఆంద్ర ప్రదేశ్ శాసనసభ అభిప్రాయం తీసుకున్న తరువాతనే విభజనపై ముందుకు వెళ్లాలని రాష్ట్రపతి కోరుతున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో విభజన తీర్మానాన్ని గెలిపించుకోవటానికి కాంగ్రెస్ అధిష్టానం వేస్తున్న ఎత్తు గడలను జాగ్రత్తగా గమనించవలసి ఉంది. ప్రస్తుత పరిస్థితులలో ఈ తీర్మానం నెగ్గటం అసంభవం. ఎందుకంటె సీమాంద్ర ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉంది కనుక. ఈ ఎత్తుగడలలో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానంతో వై.ఎస్.ఆర్.సి.పి కుమ్మక్కు అయి తన ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదింప చేసుకోవటానికి చేసిన ప్రయత్నాలు బట్టబయలు ఐన కారణంగా వై.ఎస్.ఆర్.సి.పి వ్యూహం మార్చి శాసనసభలో సమైఖ్యాంద్ర తీర్మానం ప్రవేశ పెట్టి కేంద్రానికి పంపించాలని ప్రకటించటం మొదలుపెట్టింది. ఈ తీర్మానం వలన కూడా తొందరగా విభజన చేపట్టే అవకాశం ఉందని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. రాజకీయ పార్టీలకు చిత్తశుద్ది ఉంటె జె.ఎ.సి ద్వారా ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి వారి అభిప్రాయాలను రికార్డు చేసి ప్రధానికి,రాష్ట్రపతికి పంపించవచ్చు.                  వై.ఎస్.ఆర్.సి.పి రాజీనామా ఎత్తుగడలు విఫలం కావడంతో కాంగ్రెస్ అధిష్టానం తన సొంత ఎమ్మెల్యేలని సమైఖ్యాంద్ర  కు అనుకూలంగా రాజీనామా చేయించి తద్వారా విభజన తీర్మానాన్ని గెలవాలని ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే బొత్స సత్యనారాయణ లాంటి తనకు అనుకూలురైన కొంతమంది ఎమ్మెల్యేలు,మంత్రులు చేత రాజీనామా చేయించి తద్వారా సీమాంద్ర ఎమ్మెల్యేల సంఖ్య తగ్గించి తెలంగాణ తీర్మానాన్ని గెలవాలనేది కాంగ్రెస్ అధిష్టానం ఎత్తుగడగా కనిపిస్తోంది. రాజకీయనేతలు తమ పదవులను అడ్డం పెట్టుకుని ఎన్ని అవినీతులకు,అక్రమాలకూ పాల్పడుతున్న ప్రజలు సహించారు,భరించారు,చూస్తూ ఊరుకున్నారు. కాని నేడు  ప్రజలు తమ జీవితాలు,తమ పిల్లల భవిష్యత్తు నాశనమవుతుంటే మాత్రం సహించబోరని నేడు జరుగుతున్న ఉద్యమాల ద్వారా బొత్సకు,జగన్ కు బోధ పడటక పోవటం విచారకరం.                   సమైఖ్యాంద్ర నినాదాన్ని భుజాన ఎత్తుకుంటూనే సమైఖ్యాన్ద్రకు ద్రోహం చేస్తున్న నేతల పట్ల సీమాంధ్రులు చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. ఎవరైనా కాంగ్రెస్ అధిష్టానం తో కుమ్మక్కై సమైఖ్యాంద్ర కు ద్రోహం చేస్తే సీమాంద్రలో సంఘ బహిష్కారానికి గురికాక తప్పదు. 

రాష్ట్ర రాజకీయాలలో క్విడ్-ప్రోలు

  జగన్మోహన్ రెడ్డి కేసుల పుణ్యమాని ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా న్యాయ సంబందమయిన అంశాల పట్ల కొంత అవగాహన ఏర్పడింది. జగన్ కేసుల్లో ఎక్కువగా వినబడే ‘క్విడ్-ప్రో’(నీకు ఇది-నాకు అది) సిద్ధాంతాన్నికాంగ్రెస్-వైకాపాలు ఇప్పుడు రాజకీయాలలోకి కూడా ప్రవేశపెట్టాయని, అందువలనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బెయిలు వచ్చిందని తెదేపా వాదన. అందుకు ప్రతిగా రానున్న ఎన్నికలలో వైకాపా కాంగ్రెస్ పార్టీలో విలీనం లేదా మద్దతు ఇస్తుందని చంద్రబాబు అంచనా.   ఈ ఫార్ములాను విజయవంతంగా అమలు చేసేందుకే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాష్ట్ర విభజన నిర్ణయం గురించి ముందుగానే జగన్మోహన్ రెడ్డి చెవిలో వేసి, వ్యూహాత్మకంగానే వైకాపా శాసనసభ్యుల చేత సమైక్యాంధ్రకి మద్దతుగా రాజీనామాలు చేయించారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. తద్వారా సీమాంధ్రలోతెదేపాను దెబ్బతీసి, వైకాపా రానున్నఎన్నికలలో పైచేయి సాధిస్తే, ఎన్నికల తరువాత పరిస్థితిని బట్టి ముందు నిర్ణయించుకొన్న‘క్విడ్-ప్రో’ నియమావళి ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారం పంచుకోవాలని కాంగ్రెస్-వైకాపాలు ఎత్తు వేశాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెరాస, వైకాపాలతో ‘క్విడ్-ప్రో’ ఒప్పందాలు చేసుకొని, సీమాంధ్రలో జగన్మోహన్ రెడ్డిని, తెలంగాణా లో కేసీఆర్ ని ముందుంచి తెదేపాను దెబ్బ తీయాలని వ్యూహం పన్నిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.   చంద్రబాబు ఆరోపణలలో వాస్తవం ఉండవచ్చుగాక, కానీ ప్రత్యర్ధ రాజకీయపార్టీలు తమ మనుగడ కోసం, అధికారం కోసం ఎటువంటి ఎత్తులు వేసినా వాటిని తట్టుకొని విజయం సాధించడంలోనే రాజకీయ నేతల గొప్పదనం తెలిసేది.   కాంగ్రెస్-వైకాపాలు ‘క్విడ్-ప్రో’ ఒప్పందం చేసుకొన్నాయని ఆరోపిస్తున్న చంద్రబాబు కూడా ఇప్పుడు బీజేపీతో అదే ఒప్పందం చేసుకొనేందుకు సిద్దపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రానున్న ఎన్నికలు తెదేపా-బీజేపీలకు జీవన్మరణ సమస్య వంటివి గనుక, ఎన్నికలలో గెలిచేందుకు తెదేపా-బీజేపీలు చేతులు కలిపితే అప్పుడు అది కూడా క్విడ్–ప్రోగానే భావించాల్సి ఉంటుంది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి తెదేపా సహాయపడితే, తెదేపా ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి బీజేపీ సహాయపడే అవకాశం ఉంది.   అయితే ఈ నాలుగు పార్టీల మధ్య జరుగబోయే ఈ రాజకీయ ‘క్విడ్-ప్రో’ ఒప్పందాలలో ఏ ఒప్పందం ఎవరికీ అధికారం కట్టబెడుతుందో తెలుసుకోవాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.   ఈ సారి ఎన్నికలలో నరేంద్రమోడీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి మరియు కేసీఅర్ లు ప్రజలపై ఎంత ప్రభావం చూపగాలరనే అంశంపైనే వార్వారి పార్టీల విజయావకాశాలు ఆధారపడవచ్చును. ఈ సారి ప్రజలు వీరిలో సరయిన కాంబినేషన్స్ ను ఎంచుకోవలసి ఉంటుంది. అప్పుడే రాష్ట్రంలో దేశంలో స్థిరమయిన ప్రభుత్వాలు ఏర్పడి పాలన సజావుగా సాగే అవకాశం ఉంది. లేకుంటే ప్రజలకి ‘ఇన్-ఫ్రంట్, ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్’ తప్పదు.

జగనన్న ప్లాన్ అట్టర్ ఫ్లాప్

      ఎప్పుడు ప్రత్యర్ధులపై విరుచుకుపడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల సొంత పార్టీ పైన సంచలన వ్యాఖ్యలు చేసింది. సీమాంధ్రలోని 13 జిల్లాలు, తెలంగాణలో రంగారెడ్డి, ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాల నియోజకవర్గ కోఆర్డినేటర్ల సమావేశం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యలయంలో జరిగింది. ఈ సమావేశంలో షర్మిల సమైక్య ఉద్యమంలో అధ్యక్షుడి లక్ష్యాన్ని చేరుకోవడంలో పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు.     తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్లి ఏకంగా సదస్సులు నిర్వహిస్తూ, నేతలు నిరాహార దీక్షలకు దిగుతూ ముందుకు వెళ్లగలుగుతున్నారని వివరించారు. చంద్రబాబు కన్నా ఎక్కువ దూరం పాదయాత్ర, ఆయనకు దీటుగా బస్సుయాత్ర చేసి పార్టీకి మైలేజ్ తీసుకొచ్చానని ఆమె అన్నట్లు తెలిసింది. పార్టీ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షురాలు పదవులకు రాజీనామా చేసి నిరాహారదీక్షకు కూర్చున్నా నియోజకవర్గాల్లో తగినంత ఫలితాన్ని రాబట్టలేకపోయామని పెదవి విరిచినట్లు తెలిసింది. ఇకపై సమైక్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొని పార్టీకి మైలేజ్ తీసుకురావాలని, గాంధీ జయంతి నుంచి ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం వరకూ ప్రజల్లోకెళ్లి కార్యక్రమాలు చేపట్టాలని పది కార్యక్రమాలతో కూడిన టైంటేబుల్ అందజేశారు. సమావేశానికి హాజరైన కో ఆర్డినేటర్లకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో పలువురు అసంతృప్తితో వెనుదిరిగారు.

'హస్తం' పడగలో ప్రజల భవిష్యత్తు

    ......సాయి లక్ష్మీ మద్దాల   నేటి ఆంద్రప్రదేశ్ అనిశ్చిత స్థితికి కారణం ఎవరు అని ఎవరిని అడిగినా వెంటనే వచ్చే సమాధానం అన్ని రాజకీయ పార్టీల నాయకులు అని. దీనిలో మొదటగా చెప్పుకోవలసింది సోనియాగాంధీ. తన కొడుకు రాహుల్ ను ప్రధానిని చేయటానికి రాష్ట్ర విభజన అంశాన్ని తీసుకుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. కాంగ్రెస్ పార్టీ వారు అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తరువాతనే విభజన ప్రక్రియ చేపట్టామని చెబుతున్నారు. మరి సోనియా గాంధీ అన్ని వర్గాల అభిప్రాయం తెలుసుకోవటానికి శ్రీకృష్ణ కమిటి రిపోర్ట్ చదివారా?చదివినతరువాత కూడా ఆమె ఆ నిర్ణయం తీసుకుంటే తెలుగు వారి పట్ల ఆమెకు ఎంత ద్వేష భావం ఉందొ తెలుసుకోవచ్చు. ఇక చరిత్ర చూసినా ఇందిరాగాంధీ కుటుంబానికి తెలుగువారంటే ఎటువంటి అభిప్రాయం ఉందొ వేరుగా చెప్పనవసరం లేదు. నాటి బ్రహ్మానందరెడ్డి,నీలం సంజీవరెడ్డి నుంచి మొదలు నేటి తరానికి తెలిసిన పి.వి.నరసింహా రావు,  ఎన్.టి.రామారావు, రాజశేఖరరెడ్డి,  చంద్రబాబునాయుడు లాంటి తెలుగు నేతల సత్త వారికి బాగా తెలుసు. అందుకే విభజించి పాలించు అనే సూత్రాన్ని అవలంబిస్తున్నారు.     ఇంతకు ముందు  తెలంగాణ కోసం  తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం జరిగితే,నేడు సమైక్యాంధ్ర కోసం సీమాంద్ర ప్రాంతంలో ఉద్యమం జరుగుతోంది. వీటన్నిటి నేపధ్యంలో విభజన జరుగుతుందా అంటే జరగదు అనే విశ్లేషణలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.  విభజన దిశగా కేంద్రం ముందుకు వెళ్తే సీమాంద్ర మంత్రులకు,ఎంపి లకు ఈ పరిస్థితులలో కేంద్రంలో ఉన్న మైనార్టీ  ప్రభుత్వాన్ని గద్దె దించటం తప్ప మరొక అవకాశం లేదు. ఇక విభజనను సమర్ధిస్తున్న బి.జె.పి లో కూడా పరిస్థితులు మారుతున్నాయి. నాయకత్వ బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోడి హైదరాబాదులో బహిరంగ సభలో ప్రసంగిస్తూ టి.డి.పి ని పొగడటం,సమైఖ్య వాది ఐన రామారావుని ప్రసంసించటం లాంటివి చేసినా, నిన్న విజయవాడలో జరిగిన సేవ్ ఆంద్రప్రదేస్ సభకు సీమాంద్ర బి.జె.పి  నేతలు సంఘీభావం తెలపటాన్ని చూసినా  వారు నెమ్మదిగా రాష్ట్ర విభజన విషయంలో యు టర్న్ తీసుకుంటున్నారని అర్ధమవుతుంది.                         ఈ పరిస్థితులలో రాష్ట్ర విభజన సాధ్యం కాదు. 2014 లో సమైఖ్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయి. పైన ఉదాహరించుకున్న పరిణామాల నేపధ్యంలో 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి డిపాజిట్లు కూడా రావు. రాష్ట్ర విభజన పై కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న వివిధ నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో రెండు ఉప ప్రాంతీయ పార్టీలైన టి. ఆర్.ఎస్,వై.ఎస్.ఆర్.సి.పి లను బలోపేతం చేసి,టి.డి.పి ని బలహీన పరచి ఈ రెండు ఉప ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యంతో తిరిగి 2014 ఎన్నికలలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ కలలుకంటోంది. 2004లోను 2009లోను రెండుసార్లు కేంద్రం లోను రాష్ట్రం లోను కాంగ్రెస్ ను అధికార పీఠం మీద కూర్చోబెట్టిన తెలుగువారిపట్ల వారు అనుసరిస్తున్న వైఖరికి తగిన బుద్ధి చెప్పే అవకాశం తెలుగు ప్రజలకు ఈ ఎన్నికలలో కలుగనున్నది.                         మళ్ళి ఎన్నికల సమయం ఆసన్నమవుతోంది. దేశాన్ని ప్రగతి పధం వైపు నడిపించగల తగిన సత్తా,సామర్ధ్యం గల నేత కోసం దేశం నేడు ఎదురు చూస్తోంది. అలాంటి నేతను ఎన్నుకోవటానికి ప్రజలకు మళ్ళి ఒక బంగరు అవకాశం వచ్చింది. కులమతాల కతీతంగా,ప్రాంతాలకు,వర్గాలకు అతీతంగా అవినీతి మరకలు లేని,సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలిగిన,దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించ గలిగిన సమర్ధుడైన నేతను ఎన్నుకొనే బాధ్యత ప్రజలందరిపైన ఉంది. ప్రజలు ఇప్పుడు కనుక చైతన్య వంతులు కాకపోతే, అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ నే అనాలోచితంగా గెలిపిస్తే ఈ దేశాన్ని రక్షించటం ఆ భగవంతుడి వల్ల  కూడా కాదు.

తెదేపాతో బీజేపీ పొత్తుకి నాగం అనుమతి కూడా కావాలా

  అనేక కలలతో తెలుగుదేశం పార్టీ నుండి బయటకి వచ్చిన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్ధనరెడ్డి తెరాస, టీ-జేఏసీ చేతిలో భంగపడటంతో విధిలేని పరిస్థితుల్లో బీజేపీలో జేరారు. తెదేపా నుండి బయటకి వచ్చిన తరువాత ఆయన చంద్రబాబుపై చాలా తీవ్ర విమర్శలు చేసారు. అయితే ఇప్పుడు తను చేరిన బీజేపీ కూడా మళ్ళీ తెదేపా వైపే అడుగులు వేస్తుండటంతో ఆయన కంగు తిన్నారు. బీజేపీ ప్రధాన అభ్యర్ధిగా ప్రకటింపబడ్డ నరేంద్రమోడీ తెదేపాతో పొత్తులకు ఆసక్తి చూపడం, అందుకు చంద్రబాబు కాదనకుండా వ్యూహాత్మకంగా మౌనం వహించడంతో, భూమి గుండ్రంగా ఉంటుందన్నట్లు నాగం జనార్ధన్ రెడ్డి తిరిగి తిరిగి మళ్ళీ తెదేపా దగ్గరకే చేరుకొన్నట్లయింది.   ఇంతవరకు తెదేపా బీజేపీతో పొత్తుల గురించి మాట్లడకపోయినప్పటికీ నాగం మాత్రం “తెదేపా తెలంగాణపై స్పష్టత ఇచ్చినట్లయితేనే పొత్తుల గురించి తాము ఆలోచిస్తామని” అన్నారు. తమ పార్టీ తెలంగాణాకు అనుకూలమని అదేవిధంగా తెదేపా కూడా ద్వంద వైఖరి విడనాడి తెలంగాణాకు అనుకూలమని స్పష్టంగా ప్రకటిస్తేనే తాము పొత్తుల గురించి ఆలోచించగలమని ఆయన అన్నారు.   అయితే, రెండు పార్టీల మధ్య పొత్తుల విషయంలో ఆయన నిర్ణయాలు తీసుకొనే స్థాయిలో లేరని బహుశః ఆయనకీ తెలిసే ఉండవచ్చును. చంద్రబాబు, మోడీ, బీజేపీ అగ్రనేతలు రెండు పార్టీలకు రాజకీయంగా ప్రయోజనం ఉందనుకొంటే పొత్తులకు అంగీకరించవచ్చును తప్ప నాగం జనార్ధన్ రెడ్డి అంగీకారం కోసం వారు చూడరనే సంగతి మరి నాగం గ్రహించారో లేదో. బహుశః ఆయన తెదేపాతో మళ్ళీ కలిసి పనిచేయవలసి వస్తుందనే వ్యాకులతతో ఈవిధంగా మాట్లాడి ఉండవచ్చును.

మతఘర్షణల నుండి లబ్ది కోసం రాజకీయ పార్టీల ఆరాటం

  ఉత్తరప్రదేశ్, ముజఫర్ నగర్ మత ఘర్షణలలో అధికారిక లెక్కల ప్రకారం 45మంది ప్రజలు చనిపోగా దాదాపు 40,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని సమాచారం. అయితే నిజానికి ఈ సంఖ్య ఇంత కంటే చాలా ఎక్కువే ఉంటుందనేది బహిరంగ రహస్యమే. మత ఘర్షణలు వలన ఇంత మంది అమాయకులయిన ప్రజలు ప్రాణాలు కోల్పోయి నిరాశ్రయులవుతుంటే, భాద్యతగా మెలగవలసిన ప్రధాన రాజకీయ పార్టీలు, ఈ దురదృష్ట సంఘటనల నుండి లబ్దిపొందేందుకు చేస్తున్ననీచ రాజకీయాలను చూసి అక్కడి ప్రజలు కూడా అసహ్యించుకొంటున్నారు.   స్థానిక బీజేపీ నేత ఒకరు మత ఘర్షణలకు సంబందించి ఒక నకిలీ వీడియోను ఇంటర్ నెట్ లో పెట్టడంతో అల్లర్లు మరింత పెరిగాయని అధికారిక సమాజ్ వాదీ ప్రభుత్వం ఆరోపించింది. త్వరలో ఐదు రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఈ దుశ్చర్యకు పాల్పడిందని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఆరోపిస్తున్నాయి.   ఈ అల్లర్లలోనష్టబోయిన హిందూ, ముస్లిం ప్రజలను ఓదార్చే మిషతో ఎలాగయినా ఆకట్టుకొని వారి ఓట్లకు గేలం వేయాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రయత్నంలోనే కాంగ్రెస్ పార్టీ తరపున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ ఈ రోజు ముజఫర్ నగర్ పర్యటనకు బయలుదేరుతున్నారని భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన కంటే ఒకరోజు ముందుగానే అంటే నిన్నఆదివారం నాడే ముజఫర్ నగర్ లో భాదిత కుటుంబాలను పరామర్శకు బయలుదేరారు. కానీ అక్కడి ప్రజలు నల్ల జెండాలు పట్టుకొని ఆయనకు వ్యతిరేఖంగా నినాదాలు చేయడంతో అఖిలేష్ తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని వెనుతిరగవలసి వచ్చింది.   ఇక ముఖ్యమంత్రి పదవి కోసం తహతహలాడుతున్న మాజీ ముఖ్యమంత్రి మాయావతి మత ఘర్షణలను నివారించడంలో విఫలమయిన అఖిలేష్ ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసి, రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని పదేపదే డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర భారత రాజకీయాలపై పెను ప్రభావం చూపే ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో పైచేయి సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు విషాదకరమయిన ఈ మత ఘర్షణలను అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయి.

త్వరలో చంద్రబాబు తెలంగాణా యాత్ర

  సమైక్యాంధ్ర ఉద్యమాలు జోరుగా సాగుతున్న తరుణంలో రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర పేరిట బస్సుచేసేందుకు సిద్దపడినప్పుడు, ఆయన రాకతో ప్రజలలో తమకు వ్యతిరేఖత ఏర్పడుతుందనే భయంతో స్వయంగా పార్టీ నేతలే వ్యతిరేఖించారు. ఆయనపై సమైక్యవాదులు దాడిచేసే ప్రమాదం ఉందని వారు ఆయనని వారించే ప్రయత్నం చేసారు. కానీ వారు భయపడినట్లుగా ఆయన యాత్రకి ఎటువంటి ఆటంకాలు ఏర్పడలేదు, పైగా దానివల్లే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పుంజుకొంది.   కానీ, ఈ యాత్ర తెలంగాణాలో తేదేపాకు వ్యతిరేఖ భావనలు ఏర్పడేందుకు కారణమయ్యింది. చంద్రబాబు తన యాత్రలో “తమ పార్టీ సీమాంధ్రకు ప్రాతినిధ్యం వహిస్తుందని, వారి హక్కులకోసం ఎంత పోరాటానికయినా సిద్దమని” గట్టిగా చెప్పడం వలన, తెదేపా కూడా వైకాపాలాగే తెలంగాణాను వదులుకొని, పూర్తి సీమాంధ్ర పార్టీగా మారడం తధ్యమని అందరూ భావించారు. ఒకవేళ చంద్రబాబు కూడా తెలంగాణా విషయంలో ‘మడమ తిప్పినట్లయితే’ తమ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందని పార్టీలోని తెలంగాణా నేతలు కూడా చాలా ఆందోళన చెందారు.   అయితే చంద్ర తన మొదటి విడత ఆత్మగౌరవ యాత్ర పూర్తి చేసుకొని హైదరాబాదు తిరిగి రాగానే వారికి ఉపశమనం కలిగిస్తూ తను తెలంగాణాలో కూడా పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నానని, అందుకు రోడ్ మ్యాప్ సిద్దం చేయమని చెప్పారు. తెదేపా టీ-ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, త్వరలో చంద్రబాబు తెలంగాణాలో బస్సు యాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. అందుకు తగిన సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన మీడియాకు తెలియజేసారు.   తీవ్ర వ్యతిరేఖ పరిస్థితుల నడుమ సీమాంధ్రలో తను చేసిన బస్సు యాత్ర విజయవంతం అవడంతో, దాదాపు అటువంటి పరిస్థితులే నెలకొన్న తెలంగాణాలో కూడా ఇప్పుడు యాత్ర చేయడం సాధ్యమేనని ఆయనకు నమ్మకం కలిగినందునే ఇందుకు సిద్దపడుతుండవచ్చును. ఆయన తన ఆత్మగౌరవ యాత్ర ద్వారా సీమాంధ్రలో పార్టీ శ్రేణులకు ఏవిధంగా కొత్త ఉత్సాహం కలిగించగలిగారో, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణాలో కూడా పార్టీ శ్రేణులలో పార్టీపట్ల నమ్మకం నిలిపేందుకు యాత్ర చేసి తద్వారా అక్కడ కూడా పార్టీని బలపరచుకోవాలని చంద్రబాబు ఆశిస్తున్నట్లు అర్ధం అవుతోంది.   కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పరచడం ద్వారా అక్కడ పాగా వేయాలనుకొంటున్న కాంగ్రెస్ పార్టీ, దానితో చేతులు కలిపేందుకు సిద్దపడుతున్న తెరాసలు, తీవ్ర ప్రతికూలపరిస్థితులలో నెగ్గుకొచ్చిన చంద్రబాబు, ఇప్పుడు తెలంగాణాలో కూడా పర్యటించి మళ్ళీ పార్టీని బలపరచుకోబోతుంటే ఆయనతో ఏవిధంగా వ్యవహరిస్తాయో చూడాలి.

ఏ దౌర్భాగ్యాలకీ మరణశాసనం

     ....సాయి లక్ష్మీ మద్దాల   ఢిల్లీ లో డిసెంబర్ 16 న అత్యాచారానికి గురికాబడిన నిర్భయ కేసులో ఢిల్లీ సాకేత్ కోర్ట్ న్యాయమూర్తి తీర్పు నిచ్చారు. అందరూ కోరుకున్నట్టు గానే నిందితులు నలుగురికి మరణ శిక్ష విధించారు. యావత్ భారత ప్రజానీకం ముఖ్యంగా నిర్భయ తల్లిదండ్రులు చాలా సంతోషించారు. అదే తరహాలో అన్ని అత్యాచార కేసులు పరిష్కరించబడితే భారత దేశంలో ఆడవాళ్ళకి కొంత మానసిక భరోసా దొరుకుతుంది. కానీ అది ఎప్పటికీ ఎండమావే. ఎందుకంటె తీర్పు వెలువడిన అనంతరం నిందితుల తరఫు న్యాయవాది ఇంతకముందు జరిగిన అన్ని రేప్ కేసుల్లోనూ ఇలాగే కోర్టులు వ్యవహరించాయ అని ప్రశ్నిస్తూ,రాబోయే 3 నెలలలో ఒక్క రేప్ కూడా జరగదా అని ప్రస్నిమ్చటం జరిగింది. ఆ న్యాయవాది భావాన్ని దేశ ప్రజలు యేమని అర్ధం చేసుకోవాలి. అన్నిటికి మించి చాలా అరుదైన నేరాలలోనే ఉరి శిక్షను విధించే భారత చట్టాలు ఏ భావజాల మార్పుకోసమని ఇంతటి కఠిన శిక్షను విధించారు. ఇప్పటివరకు భారత దేశంలో ఒక్క నిర్భయ మీద మాత్రమే అత్యాచారం జరుగలేదు. ఇప్పటివరకు పరిష్కారానికి నోచుకోని రేప్ కేసులు రెండున్నర లక్షలు ఉన్నాయి. మరి వాటి సంగతేమిటి. మళ్ళి యావత్భారత యువత రోడ్లమీదికి వచ్చి పోరాటాలు చేస్తేనే గానీ వాటి జోలికి ఈ న్యాయస్థానాలు వెళ్ళవా?ఇక్కడ పరిష్కారం కావలసిన దౌర్భాగ్యాలు చాలా ఉన్నాయి. జస్టిస్ వర్మ గారు తన నివేదికలో ఎన్నో అంశాలను ప్రస్తావించారు. మనం నేడు చూస్తున్న చాలా వ్యస్థలలొ మార్పురావాలని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. విద్యావ్యవస్థలో,న్యాయవ్యవస్థలో,పోలీసు వ్యవస్థలో,తల్లిదండ్రులలో మార్పురావాలని ఆయన పేర్కొనటం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా స్త్రీని ఈ సమాజం చూసే దృక్కోణంలో మార్పు రావాలన్నారు. అన్నిటితో బాటుగా మన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని కూడా ఆయన సూచించారు.                      నేటి భారతీయ విద్యావిధానం వ్యాపార కోణంలోనే సాగుతోంది కాని,సామాజిక చైతన్యాన్ని కల్పించే దిశలో కాని,సంస్కారహితంగా కానీ,మానవీయ విలువలను నేర్పించే విధంగా కానీ లేదు. దీనిని గురించి ఒక్కరోజైన చట్టసభలలో చర్చించ లేదు. అలాగే భారతదేశంలో ఆడవాళ్ళమీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఏ ఒక్కరోజున కూడా ఈ చట్టసభలు చర్చించాలని అనుకోలేదు. అసెంబ్లీ లోనే స్వయంగా తమ సెల్ ఫోన్లలో నీలిచిత్రాలు చూసే స్థాయికి శాసనసభ్యులు దిగజారుతుంటే ఇంక చర్చలు ఎలా జరుగుతాయి?. ఢిల్లీ లో రాత్రి 9 గంటల సమయంలోనే నడిరోడ్డు మీదే ఇంతటి ఘోరకలి జరిగే స్థితికి అక్కడి పోలీసు వ్యస్థను ఏమనాలి?ఢిల్లీ లో అత్యాచారాలు లెక్కలేనన్ని జరుగుతాయ్ ఇది మామూలే అనే ఆలోచనా సరళిని ఎవరు మార్చాలి?                       తల్లిదండ్రులలో మార్పు రావాలి అంటే .దాని అర్ధం మార్పు ఇంటి నుండే మొదలవ్వాలి అని. ఆడపిల్లను ఒకరకంగ,మగపిల్లవాడిని ఒకరకంగా పెంచే విధానంలో మార్పు రావాలి. మరీ ముఖ్యంగా నేటి సినిమాలు,టీవీలలో వచ్చే కార్యక్రమాలు,వ్యాపార ప్రకటనలు,వార్త పత్రికలు,ఇంటర్నెట్,ఇలాచెప్పుకుంటూ పోతే మన చుట్టూరా ఉన్న మన సభ్య సమాజంలోని చాలా వ్యవస్థల మీద ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. సినిమాలకు సెన్సార్ బోర్డు ఉంది కానీ సినిమాలలోని అశ్లీల దృశ్యాలకు అడ్డుకట్ట ఉండదు. మరి వీటన్నిటి గురించి ఆలోచించ వలసిన భాద్యత చట్టాలకు,ప్రభుత్వాలకు లేదా?అధికారులను ప్రభావితం చేస్తున్న రాజకీయ వ్యవస్థ కారణంగా ఎంతమంది తమకు న్యాయం జరగలేదని అల్లడుతున్నారో సదరు నేతలకు తెలియదా?                       ఈనాడు ఇంతగా బ్రష్టు పట్టిన ఈ సమాజంలో ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరగకూడదు అంటే కఠినమైన శిక్షలతో బాటుగా విలువలతో కూడిన విద్యావిధానం,సామాజిక చైతన్యం,సంస్కారయుతమైన కుటుంబ వాతావరణం,అన్నిటికి మించి ఏ పరివర్తన కోసం జైలు శిక్షలు విదిస్తున్నారో ఆ పరివర్తన తాలూకు విధానాల అమలు సరిగా జరగలేనినాడు ఎవరికి ఎటువంటి న్యాయమూ జరగదు. సమస్యకు మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోకుండా ఒక సమస్యకు ఒక కఠిన శిక్ష విధించి చేతులు దులిపెసుకుంటే నేరాలు ఎలా అరికట్టబడతాయి.                      ముఖ్యంగా యావత్ ప్రపంచం గుర్తించాల్సింది ఆడది ఒక విలాస వస్తువు కాదు. ఆడది రెండో వర్గం పౌరురాలు కాదు. ఆడది లేని ఈ సమాజాన్ని ఎవరైనా ఊహించగలరా?ఆడది  కేవలం ఒక భోగ వస్తువుగా చూపించబడుతున్నంత కాలం ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. మరి శిక్షలు ఎవరికి వేస్తారు?అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారికా లేక వారిని అలా ప్రేరే పిస్తున్న వివిధ రకాలైన నియంత్రణ లేని వ్యవస్థలకా?

విభజనే అభివృద్దా?

      ఆంధ్ర తెలంగాణ అంటూ ఇరు ప్రాంత ప్రజలు గత 10సంత్సరాలుగా ఉద్యమాలతో ఊగిపోతున్నారు. దీనికి కారణం ఏమిటి?తెలంగాణ ప్రాంతం అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉందని,ఆ ప్రాంతానికి అన్యాయం జరిగిందనే వాదనతో కె.సి.ఆర్ ఆధ్వర్యంలో 13 సంత్సరాల క్రితం టి.ఆర్.ఎస్ పార్టీ పుట్టింది. కాని వాస్తవానికి అప్పటికే తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది అనేది కాదనలేని వాస్తవం.ఎన్.టి రామారావు పుణ్యమా అని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనంతరం తెలంగాణలో,జరిగిన అభివృద్ధిని ఎవరైనా అంగీకరించవలసిందే. నిజానికి ఆ తెలంగాణ ప్రాంత అభివృద్ధికి అడ్డుకట్ట వేసింది అక్కడి దొరలే. కేవలం దొర పెత్తనం కారణంగానే ఆ ప్రాంతంలో వెనుకబాటుతనం తాండవించింది. ఆనాడు ఆ వెనుకబాటు తనం నుండి ఆ ప్రాంతాన్ని బయటకు తీసుకురావాలని కాని,ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కాని తెలంగాణ ప్రాంత నేతలెవరు ప్రయత్నించక పోవటం కడు బాధాకరం. కానీ ఈ వాస్తవాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ఎందుకు గమనించలేదు?గుర్తించలేదు?   ఇక సీమాంద్ర ప్రాంత విషయానికి వస్తే అక్కడ కూడా అభివృద్ధి అంటే కేవలం వ్యవసాయం మాత్రమే. పారిశ్రామిక అభివృద్ధి కేవలం ఒక్క వైజాగ్ లోనే జరిగింది. అది కేవలం ఒక్క స్టీల్ ప్లాంట్ ద్వారా మాత్రమే జరిగింది. మిగతా ప్రాంతాలలో ఎలాంటి పారిశ్రామిక అభివృద్ధి కాని, విద్యారంగ అభివృద్ధి కాని,వానిజ్యపరమైన అభివృద్ధి కాని వైద్య పరమైన అభివృద్ధి కాని జరుగలేదు.   దీనికి కారణం  ఎవరు?ప్రజలా?నేతలా?రాజకీయముసుగులో ఉన్న పెట్టుబడిదారులు అనేది జగమెరిగిన సత్యం. ఆ ఒక్క కారణం గానే ఒక్క హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందింది. మరి ఈనాటికి యావత్ ఆంద్ర రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు చాలా ఉన్నాయి. అరకు నుండి ఆదిలాబాద్ వరకు చాలా గిరిజన ప్రాంతం ఉంది. వారు ఈనాటికి నాగరికతకు ఆమడదూరంలో ఉన్నారు. దీనికెవరు బాధ్యులు?చేతకాని ఈ రాజకీయ నేతలు కాదా?ఒక ప్రాంతంలో అభివృద్ధి జరగలేదంటే,ఒక ప్రాంతం వెనుకబడి ఉందంటే దానికి పరిష్కార మార్గం ఆ ప్రాంతాన్ని రెండుగా విభజించటమేనని ఏ శాస్త్రం చెబుతోంది? ఆయా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామంటే ఏ ప్రజలు వద్దన్నారు వీళ్ళని?                        స్వాతంత్ర్యం వచ్చి 67 సంత్సరాలు గడుస్తున్నా కూడా నేటికి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం గానే ఉండటానికి ఎవరు బాధ్యులు?ప్రజాసంక్షేమం అభివృద్ధి చెందవలిసిన చోట లంచగొండితనం,అవినీతి,అక్రమాలు అన్యాయాలు అభివృద్ధి చెందాయి. ఇది ఎవరి అసమర్ధతకు తార్కాణం అనిచెప్పాలి. కాంగ్రెస్ ఉన్నతికి భిక్ష పెట్టింది ఆంద్ర రాష్ట్రం. దేశానికి అన్నపూర్ణ ఆంధ్ర రాష్ట్రం. దేశంలో ఉన్న పెద్ద రాష్ట్రాలలో ఆంద్ర రాష్ట్రం ఒకటి. మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం,ఆంధ్రరాష్ట్రం. అలాంటి సమైక్య జాతిని రెండుగా చీల్చి ఒకేజాతి ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి ఈ కాంగ్రెస్ పార్టీ సాధించేదేమిటి?                           ఒకనాడు ఒకరాజకీయ నేత రాజకీయ లబ్ధి కోసం పురుడుపోసుకున్న వాదం నేడు తెలుగుజాతిని విచ్చిన్నం చేసే దిశగా వెళ్తోంది. విభజన తర్వాత జరిగే అభివృద్ధి ఏమిటి?నేడు ఉన్న అభివృద్ధి కూడా నిలబడదు. ఆంద్ర రాష్ట్రం అంటే నిత్యం రావణకాష్టం అనే అభిప్రాయం యావత్ ప్రపంచానికి తెలిసింది. తద్వారా ఆంద్ర రాష్ట్రానికి రావలసిన పరిశ్రమలు,ఉపాధి అవకాశాలు వెనక్కు మళ్ళిపోతున్నాయ్. భవిష్యత్ మరింత ఆందోళనకరంగా మారనున్న ఈ తరుణంలో ప్రజలు చాలా తెలివిగా ఆలోచించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు మొదలైన ఈ విద్వేషాలు ఇక్కడితో ఆగే పరిస్థితి ఎంత మాత్రం లేదు. విభజన కనుక ఖచ్చితంగా జరిగితే నీటి విషయంలో ఇరు ప్రాంత ప్రజల మధ్య భయంకరమైన గొడవలు జరుగుతాయి. రాజధాని విషయంలో సీమాంద్ర ప్రాంత వాసులు నిత్యం కొట్టుకు చావాల్సిందే. దీనికి ఎవరు భాద్యులు?                            ఈరోజున్న కాంగ్రెస్ కాని,తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ ఇస్తామన్న బి.జె.పి కాని రాబోయే భవిష్యత్తులో ఆంద్ర రాష్ట్రానికి ఏ విధమైన న్యాయం చేయాలో,అసలు న్యాయం అంటే ఎలా చేయాలో ఖచ్చితంగా తెలియదు. మరి ఏ అభివృద్ధి కోసం,ఏ న్యాయం కోసం ప్రజలు పోరాడాలి?అను నిత్యం ఇలా కొట్టుకు చావాలి. ఇప్పటికైనా ఈ నేతలు బుద్ధితెచ్చుకుని  అభివృద్ధి అంటే విభజన కాదు అని తెలుసుకుంటారా?  

ఒబామా ఒకసారి కమిట్ అయితే

  రసాయనిక ఆయుధాలను ఉపయోగించి అమాయకులయిన 1500 సిరియా ప్రజల ప్రాణాలు బలిగొన్న సిరియా అధ్యక్షుడు అసాద్ ప్రభుత్వంపై ఎప్పుడెప్పుడు బాంబుల వర్షం కురిపిద్దామాని తెగ ఆత్రపడుతున్న అమెరికాకు రష్యా దేశం మోకాలు అడ్డుతోంది. ఇక నేడో రేపో మీట నొక్కడం తరువాయి అనుకొంటున్న తరుణంలో, రష్యా అధ్యక్షుడు వాల్దిమిన్ పుతిన్ జోక్యం చేసుకొని, సిరియా తన రసాయన ఆయుధాలను అప్పగించేందుకు ఒప్పించగలిగారు. దానితో యుద్ధానికి ఉరకలు వేస్తున్నఅమెరికా అధ్యక్షుడు ఒబామా కొంత వెనక్కు తగ్గవలసి వచ్చినప్పటికీ, ఇంగ్లాండ్ లేవనెత్తిన ధర్మ సందేహంతో యుద్దానికి మళ్ళీ కారణం, అవకాశం దొరికినందుకు సంతోషపడుతున్నారు. సిరియా తన రసాయన ఆయుధాలను అప్పగించినంత మాత్రాన్న అసాద్ చేసిన ఘోర కృత్యాలను క్షమార్హం ఎలా అవుతాయని ఇంగ్లాండ్ ప్రశ్న. అది కాక, ఆయుధాల అప్పగింతతో అమెరికా వెనక్కి తగ్గుతోందని తెలియగానే అసాద్ తన యుద్ద విమానాలతో స్వదేశంలో శత్రు శిభిరాలపై బాంబుల వర్షం కురిపించడంతో, అది అమెరికాకు మరో అవకాశం కలిగించింది. ఇక ఆరు నూరయిన సిరియాపై ‘సున్నితంగా’ పరిమిత ప్రదేశాలలోబాంబుల వర్షం కురిపిస్తానని ఒబామా ప్రకటించారు. అంటే సిరియా ప్రజలను అమెరికా నుండి ఆ దేవుడు కూడా కాపాడలేడని నిర్ధారణ అయినట్లే. ఒబామాగారికి మన దేశం మీద కూడా కోపం రాకూడదని ఆ దేవుడిని కాదు...కాదు... ఆ ఒబామానే ప్రార్ధిద్దాము.

రాజకీయ నాయకులకు, ఎన్జీవోల "సమైక్యాంధ్ర'' సభ గుణపాఠాలు!

      - డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]     బొంకరా గురవా అంటే, ఇదే అదననుకున్న సన్నాసి ఒకడు "ఆ గురజాల దోమలు గురిగింజలంత ఉంటాయిరా'' అని కోసేశాడట! భాషాప్రయుక్త ప్రతిపాదికపైన ఒకేజాతి, ఒకేభాషా సంస్కృతుల కుదుళ్ళపైన ఏర్పడిన విశాలాంధ్ర (ఆంధ్రప్రదేశ్) రాష్ట్రాన్ని నిట్టనిలువుగా చీల్చడం ద్వారానే పార్లమెంటులో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ ల తర్వాత అధికసంఖ్యలో [42 స్థానాలు] సభ్యుల బలంతో నెహ్రూ కుటుంబ వారసుడుగా ఈ తరం ప్రతినిథి అయిన రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం సాధ్యమని యు.పి.ఎ. అధ్యక్షురాలు, కాంగ్రెస్ నాయకురాలైన సోనియాగాంధీ తలపోయడంతో తెలుగు రాష్ట్రం విచ్చిత్తికి బీజాలు నాటింది. అందుకోసం "బోడితలకూ మోకాలికి ముడి''పెట్టి, కుదరని ఆ ప్రక్రియకు కారకులు ఆంధ్రప్రదేశ్ లోని అవకాశవాద రాజకీయ పార్టీల మీదికి తెలివిగా నెట్టి కూర్చుంది. ముందుగా రాష్ట్రవిభజన సమస్యపైన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీలాగా నీళ్ళు నమలకుండా కేంద్రంలో ఒక పాలకశక్తిగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గ నేత్రిగా స్పష్టాతి స్పష్టంగా విభజన అనర్థమని సోనియా చెప్పలేకపోయింది!     రేపు కొడుకు రాహుల్ ని [ఆ శక్తి ఉన్నా లేకపోయినా] దేశప్రధానిగా గద్దెనెక్కించే తొందరలో తాడూ బొంగరం లేని ఒక ప్రాంతపు స్థానిక పార్టీని స్థాపించుకున్న రాజకీయ నిరుద్యోగ నాయకుడి బెదిరింపులకు లొంగిపోయి కాంగ్రెస్ భవిష్యత్తుకే చేటుతెచ్చి తెలుగుజాతిని చీల్చడానికి వెనుదీయని కాంగ్రెస్ అధినేత్రి రాష్ట్రప్రజలను, రాష్ట్ర భవిష్యత్తును అయోమయ పరిస్థితుల్లోకి నెట్టింది; వలస సామ్రాజ్యపాలనా వ్యవస్థపై తిరగబడిన జాతీయ స్వాతంత్ర్య సమరంతో బొత్తిగా పరిచయంలేని, అవగాహనలేని సోనియాను పార్టీకి అధినేత్రిగా నెత్తికెక్కించుకున్న కాంగ్రెస్ పార్టీలోని "డూడూ బసవన్నలు'' కేవలం కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రిపదవులను విడిచిపెట్టలేక, తెలుగుజాతిని చీల్చుతున్న అధినేత్రికి ఈ క్షణంలో కూడా కొమ్ముకాయడం తెలుగుజాతికే అవమానకరం.  ప్రపంచబ్యాంకి ప్రజావ్యతిరేక 'సంస్కరణల' చాటున దాగి దేశరాజకీయ, ఆర్థికవ్యవస్థా ప్రయోజనాలకే చేటుతెచ్చి, దేశాన్నే తాకట్టుపెట్టడానికి వెరవని కాంగ్రెస్ అధిష్ఠానం సుమారు 3000 సంవత్సరాల చరిత్ర గలిగిన తెలుగుజాతి సమైక్యతను కూడా పదవీప్రయోజనాల కోసం బలిపెట్టడానికి జంకదు!   తాజావార్తలను బట్టి [08-09-2013] చూస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రస్తుత ప్రధానమంత్రి ప్రజావ్యతిరేక సంస్కరణలకు పురోహితుడైన డాక్టర్ మన్ మోహన్ సింగ్ ను తప్పించి రాహుల్ ను ఆ స్థానంలో కూర్చోపెట్టే వైపుగా పావులు కదులుతున్నాయి. ఇందుకు సాక్ష్యం - ఒక్కటిగా ఉన్న తెలుగుజాతిని చీల్చడానికి అనుకూలంగా కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీపరంగా తీసుకున్న నిర్ణయాన్ని ఒక్కసారి కూడా వ్యతిరేకించలేని మన్మోహన్ సింగ్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే గాక, తన ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకోగల స్థితిలో లేకపోవటం. అందుకు తగినట్టుగానే తన ఉత్తరాధికారిగా రాహుల్ ప్రధాని కావాలన్న ఆకాంక్షను దాచుకోలేకుండా బయటపెట్టడం - మధ్యయుగాల నాటి రాజరికపు సంస్కృతికే నిదర్శనం.   ఈ పూర్వరంగంలో, రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి కేవలం నాయకత్వస్థాయిలోనూ, అదికూడా మూడు, నాలుగు "జక్కాయి బుక్కాయి'' రాజకీయపక్షాల క్యాడర్ కు ప్రధానంగా పరిమితమై "వేర్పాటువాద'' ఉద్యమాన్ని సాగలాగుతున్న ఆ పక్షాల తాలూకు రాజకీయ నాయకుల వల్ల సాధ్యంకాని లక్షలాదిమంది ప్రజాసమీకరణ సమైక్యాంధ్ర ఉద్యమానికి ఏ పార్టీల తోడ్పాటు లేకుండా, విభజనవల్ల మూడు ప్రాంతాలలోని ప్రజలు ఎదుర్కొనబోతున్న సమస్యలపైన ఆంధ్రప్రదేశ్ ఎన్.జి.వో.లు హైదరాబాద్ లో తలపెట్టిన "సమైక్యాంధ్ర'' మహాసభ (07-09-2013) ఘనంగా విజయవంతమయింది. సంకుచిత మనస్సుతో తెలుగుజాతి ప్రయోజనాలకు హానికల్గించే స్వార్థపూరిత లక్ష్యంతో కొందరు "ప్రత్యేకరాష్ట్ర'' వాదంతో నడుపుతున్న ఉద్యమకారులనుంచి వచ్చిన బెదిరింపులకు లోనుగాకుండా ఎ.పి.ఎన్.జి.వో.ల సమన్వయ సంఘం జరిపిన సదస్సు ఎంత ప్రశాంతంగా, ఎంతటి క్రమశిక్షణతో, ఎవరికీ ఇబ్బంది కల్గించని రీతిలో, ఉద్రేకాలకు లోనుగాకుండా, ప్రజల్ని కించించే తప్పుడు నినాదాలు లేకుండా ఆంధ్ర (తెలుగు)జాతి విడిపోరాదని, విడిపోతే చెడిపోతామన్న స్ఫూర్తితో రాష్ట్రరాజధాని నడిబొడ్డులో అత్యంత జయప్రదంగా ముగిసినసభ - కేంద్ర, రాష్ట్ర రాజకీయ నాయకులందరికీ పెద్ద కనువిప్పు కావాలి; గుణపాఠం కావాలి. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా తెలుగుజాతి భవిష్యత్తుకోసం జాతి వికాసం కోసం, కేవలం జాతి మౌలిక ప్రయోజనాల రక్షణ కోసం ఉద్యోగులు బహుళసంఖ్యలో తలపెట్టిన మొట్టమొదటి సభ యిది. తెలంగాణాలో ఇంకా సజీవులుగా ఉన్న ఒకనాటి తెలంగాణా సాయుధ పోరాటయోధులు సహితం స్వాతంత్ర్యోద్యమ కాలంలో మాత్రమే యిలా ఐచ్చికంగా వివిధ వర్గాల ప్రజలు ఎవరికి వారుగా చొరవతో ఇనుమడించిన దేశభక్తితో యిలా పాల్గొన్నారని వ్యాఖ్యానించడం జరిగింది. తెలుగుజాతిని చీల్చడం కోసం రాజకీయ స్వార్థంతో తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్, దాని సంకీర్ణ ప్రభుత్వమూ ఉపసంహరించుకునే దాకా - ఎన్నిమాసాలు పట్టినా సరే, జాతికోసం "సమైక్యాంద్ర'' ఉద్యమం విశ్రమించబోదని ఇది జీతాలకోసం కాదు, జాతి జీవితాలకోసం జరుగుతున్న పోరాటమనీ ఉద్యోగులు, సభావారూ ప్రతినబూనటం యావత్తు తెలుగుజాతిలోనూ విశ్వాస సూర్యోదయాలు నింపింది!   ప్రజలతో నిమిత్తం లేకుండా, వివిధ ప్రాంతాల్లోని యావత్తు తెలుగుజాతి అభిప్రాయాలు తెలుసుకోడానికి జనవాక్య సేకరణ జరపకుండానే, ఏ పార్టీకి ఆపార్టీ తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం పోటాపోటీలమీద తెలుగుజాతిని విభజించే 'నెగెటివ్' ప్రక్రియలో పడిపోయి, ముందుగా ఎలాంటి సొంత ప్రతిపాదన ప్రాతిపదికగా తానుగా కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని ప్రకటించని దశలో  జాతి విధ్వంసకులుగానూ, ప్రజాబాహుళ్యానికి విశ్వసనీయ నాయకత్వం అందించలేని వాజమ్మలుగానూ ప్రధాన ప్రతిపక్షాలు అవతరించడం ఘోరం! మంచి పాలనా శాస్త్రానికి సంబంధించిన "పొలిటికల్ సైన్స్'' పదవికే ఈ ప్రతిపక్షాలు చెడు అర్థాలు, నెగెటివ్ నినాదాలూ, 'నిఘంటువు'ల కెక్కించడానికి తాపత్రయపడ్డాయి!   'సమైక్యాంధ్ర' రక్షణనే సభలో ప్రసంగించిన ఉద్యోగానాయకులు పదేపదే కోరుకున్నారుగాని సోదర తెలంగాణా తెలుగుబిడ్డల ప్రయోజనాలు పట్టని కొందరు రాజకీయ నిరుద్యోగుల మాదిరిగా తెలుగువారు తెలుగుప్రాంతంలో తిరగడానికి 'వీసాలు'' పొందాలని కోరలేదు; 'తెలుగువాళ్ళు విడిపోతే చెడిపోతాం'' అన్నారేగాని కొందరిలా "కాళ్ళు విరగ్గొడతాం'' అనలేదు. "అందరం కలిసుందాం, కలిసి ఎదుగుదాం'' అన్నారేగాని "విడిపోతేనే వికాసం'' అనలేదు' ఉభయత్రా ఎదురయ్యే సమస్యలను "చర్చలద్వారా కలిసి పరిష్కరించుకుందాం'' అన్నారేగాని "నోరెత్తితే నాలుకలు కోసేస్తాం'' అనలేదు; రాజధాని హైదరాబాద్ ను "మూడుప్రాంతాల ప్రజల కష్టార్జితమ''న్నారేగాని ఉమ్మడి శ్రమఫలితంగా నిర్మించుకున్న "తెలుగువారి రాజధాని నుంచి తెలుగువారే వెళ్ళిపోవాల''ని ఉద్యోగ వక్తలు కోరుకోలేదు;   వీటన్నింటికిమించి, సమైక్యాంధ్ర మహాసభకు సీమాంధ్రనుంచి, హైదరాబాద్ చుట్టుపట్లనుంచి సమైక్యతాంధ్రను చెదరగొట్టరాదనీ భావించి బారీగా బస్సులలో, ఇతరవాహనాలలో తరలివస్తున్నప్పుడూ, సభను శాంతంగా, జయప్రదంగా ముగించుకుని తిరిగి తమతమ ప్రాంతాలకు వెడుతున్నప్పుడూ, పలుచోట్ల "ముసుగువీరులు'' కొందరిని ప్రేరేపించి ధైర్యంచాలక ఉద్యోగుల వాహనాలపైన రాళ్ళూరప్పలూ వేయించి గాయపరిచినా, సదస్యులు ఎదురుదాడి చేసి 'సీన్లు' సృష్టించలేదు; నిజాంకళాశాలలోని కొందరు విద్యార్థుల్ని సభకు వస్తున్న వారిపై రాళ్ళు రువ్వెందుకు కొందరు రాజకీయ నిరుద్యోగులు అజ్ఞాతంగా ప్రోద్భలపరిచినా, సభకు వచ్చిన ప్రతినిధులు గణనీయమైన సంఖ్యలో ఉన్నా సంయమనం పాటించారన్న ఇటీవల వెలసిన ఒకే ఒక స్థానిక పత్రికతప్ప ఆంగ్లపత్రికలు సహా మిగతా పత్రికలన్నీ పేర్కొన్నాయి! అన్నింటికన్నా విచిత్రమూ, సిగ్గుచేటైన విషయమూ - సభకు వస్తున్న సీమాంధ్ర ప్రతినిధులపైన రాళ్ళు విసురుతూ నిజాంకళాశాల భవనం మీదనుంచి ఒక విద్యార్థి జారిపడిపోయి క్షతగాత్రుడుకాగా, ఆ విద్యార్థిని భవనం మీదనుంచి పోలీసులు కిందకి తోసేశారని ఒక్క స్థానిక పత్రిక తప్ప మరే పత్రిక రాయకపోవటం. మిగతా పత్రికలన్నీ "రాళ్ళు విసిరే హడావుడిలో అతడే జరిపడ్డాడని రాశాయి!   అన్ని పత్రికలూ ఎ.పి.ఎన్.జీ.వో.ల "సమైక్యాంధ్ర మహాసభ'' ఘనంగా విజయవంతమైందని పతాకశీర్శికలు వార్త ప్రచురించగా సభనే ఒక "దండయాత్ర''గానూ, "సీమాంధ్రుల దాడిలో గాయపడిన తెలంగాణా'' అని తెలుగుప్రజల మధ్య రాజకీయ నిరుద్యోగులు మరింత విద్వేషాన్ని రగుల్కొల్పారు. మరో విచిత్రమైన అబద్ధం - సమైక్యతను కోరేవారి "గొంతుకలు కోస్తానని'' చాకు చూపించే ఒక వ్యక్తిది మార్ఫింగ్ చేసి ఒక స్థానిక ఛానెల్ చూపడం! ఈ విద్వేష ప్రచారం చాటున ఆ "గుప్పెడు'' రాజకీయ నిరుద్యోగులయిన దొరలు, భూస్వాములయిన పాత జాగిర్దారీ, దేశ్ ముఖ్, పటేల్, పట్వారీల సంతతీ మళ్ళీ తెలంగాణా ప్రజలపైన స్వారీ చేయడానికి, బడుగు బలహీనవర్గాల  బొమికలలో మిగిలిన 'మూల్గుల''ను కూడా పీల్చుకు తినడానికీ అధికారం చేజిక్కించుకోడానికే బలవంతంగా తెలుగుజాతిని చీల్చడానికి ఆఖరి ప్రయత్నం చేస్తున్నారని తెలుగువారంతా గమనించాలి. ఈ సందర్భంగా, ఇంతకుముందు రాష్ట్రవిభజన విషయంలో కొంత 'పిడివాదం'లోకి జారుకున్నట్టు కన్పించిన మావోయిస్టు సోదరుల ధోరణిలో కూడా తాజాగా కొంత మార్పు కన్పిస్తోంది. "కోస్తాంధ్ర, రాయలసీమ మేధావులు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ భారతకమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఒక ప్రకటనను [ 06-09-2013] పత్రికలకు విడుదల చేసింది. రాష్ట్రవిభజన ప్రతిపాదనపైన స్పష్టంగా, ఎలాంటి అనుమానాలకు తావులేకుండా అభిప్రాయాన్ని వెల్లడించకపోయినా భారతమావోయిస్టు పార్టీ కేంద్రీయ, ప్రాంతీయ మండలి తెలుగు "ప్రజలమధ్య ఐక్యత చాలా అవసరమ''ని చాటి చెబుతోంది! ఆ ప్రకటనలో యింకా యిలా ఉంది : "తెలంగాణా రాష్ట్ర ఏర్పాటువల్ల తలెత్తే స్సమస్యలు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించుకోడానికి ప్రజాసంఘాలు, ఉద్యమసంస్థలు ఒక ప్రజాస్వామిక వాతావరణంలో కలిసి చర్చించుకుని ముందుకుపోవాలి. ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టి పాలకవర్గాలు చోద్యం చూస్తున్నాయి. ఆ వలలో (ట్రాప్)పడకుండా సమస్యలను సామరస్యంగా, న్యాయంగా పరిష్కారం చేసుకోవాలి. ప్రజల ప్రజాస్వామిక డిమాండ్ల పట్ల మూడుప్రాంతాల ప్రజలూ చైతన్యయుతంగా మెలగాలి''!   అంతేగాదు, ఈ మేరకు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణా మేధావులు, ప్రజాస్వామిక వాదులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి, యువజన తదితర "సమస్త ప్రజానీకానికి'' మావోయిస్టుపార్టీ సెంట్రల్ రీజనల్ బ్యూరో కార్యదర్శి హోదాలో 'ఆనంద్' పేరిట విడుదలయిన ఈ ప్రకటనలో మూడు ప్రాంతాల ప్రజలమధ్య "ఐక్యత, సంయమనం చాలా అవసరమ''ని మావోయిస్టు పార్టీ ఎందుకు భావిస్తోందో కూడా యిలా పేర్కొంది : "తెలంగాణా ఏర్పాటు విషయంలో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల దళారీ (కాంప్రచార్), నిరంకుశాధికార బడాపెట్టుబడిదారీ,భూస్వామ్యవర్గాలు సామ్రాజ్యవాదంతో కుమ్ముక్కయి దోచుకోవడానికి ప్రయత్నిస్తూ తీవ్రంగా అణచివేస్తున్న ఈ తరుణంలో ప్రజలమధ్య ఐక్యత చాలా అవసరం''!   సహృదయంతో మావోయిస్టు పార్టీ చేసిన ఈ ప్రకటనలో - ఈ మాత్రపు అవసరాన్ని కూడా ముందుగా గుర్తించకుండా కొందరు రాజకీయ నిరుద్యోగులు తలపెట్టిన స్వార్థపూరిత వేర్పాటు ఉద్యమాన్ని పరోక్షంగా కూడా ఎందుకు ఆ పార్టీ ఎందుకని ఖండించలేకపోయింది? పత్రికావార్తలను బట్టి చూస్తే ఆ పార్టీ పరోక్షంగా కూడా రాజకీయ నిరుద్యోగులు కొందరు బూతులతో, అబద్ధపుప్రచారాలతో, ఇరుప్రాంతాల ప్రజలమధ్య పూడ్చుకోలేనంత విద్వేషా, విషపూరితంగా ఎక్కిస్తున్న దశలో మావోయిస్టుపార్టీ ఈ ఐక్యతా సందేశాన్ని యిచ్చి ఉంటే ప్రజల్ని బాగా ప్రభావితం చేసి ఉండేది! ఒక బడా వేర్పాటు వలసవాద 'దొర' ప్రారంభించిన స్వార్థపూరిత, కేవలం నాయక ప్రయోజన కేంద్రంగా అల్లిన కృత్రిమ ఉద్యమం ఆ నాయకుడుగాని, "మల్టీనేషనల్ కంపెనీ'' స్థాయిలో పెరిగిన అతడి కుటుంబం నుంచి ఎలాంటి త్యాగమూ చేయకుండా బడుగు, బలహీనవర్గాలకు చెందిన తెలుగుబిడ్డల్ని భ్రమలతో ఆత్మహత్యలవైపు నెట్టేశారు!   ఈ పరిణామదశలోనే కొన్నాళ్ళక్రితం నేను "సమాచార హక్కు చట్టం'' కింద ఆత్మహత్యల పాలైన బిడ్డల, కుటుంబాలకు చెందిన వివరాలను తెలుగువారి తెలంగాణాలోని పదిజిల్లాల నుంచి తెప్పించుకున్నాను. జిల్లాల పోలీసు ఉన్నతాధికారులనుంచి ఈ నివేదికలు అందాయి. నేనూ, తెలంగాణా మిత్రులు కొందరం వాటిని పరిశీలించడం జరిగింది. మొత్తం నివేదికల్ని పరిశీలించగా తేలిన సత్యం ఏమిటి? ఈ ఆత్మహత్యల్లో నూటికి 90 మందికిపైగా ఎస్.సి., ఎస్.టి., బి.సి. బలహీనవర్గాలకు చెందిన ముద్దుబిడ్డలవేనని రుజువైంది! అన్ని వేళలా, అన్నిత్యాగాలూ వృధా అయినవిగా భావించకూడదు. కాని కొందరు స్వార్థపూరిత లక్ష్యంతో ప్రారంభించే ఉద్యమంలో తప్ప ప్రాంతాల నిజమైన పురోగతి కోసం, సామ్యాజ్యవాద వ్యతిరేక పోరాటంలోకి, విమోచన పోరాటాలలోకి, పెట్టుబడిదారీ, భూస్వామ్యవర్గాల దోపిడీకి నిరసనగా జరిగే ఉద్యమాలలోకి దూకే వీరకిశోరాల త్యాగాలు మాత్రమే బేషరతు త్యాగాలవుతాయి, విలువైన త్యాగాలవుతాయి, కనుకనే అలాంటి త్యాగాల కోసం "అడ్వాన్స్ గ్యారంటీల''తో ఎవరూ ప్రవేశించరు! అలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించరు. కాని తెలుగుజాతిని చీల్చడం కోసం కొందరు రాజకీయ నిరుద్యోగులు జరుపుతూవచ్చిన విభజనోద్యమానికి నాయకుల పదవీస్వార్థం మినహా మరొక లక్ష్యం లేదు. కనుకనే నిజమైన ప్రజాతంత్ర ఉద్యమానికి చుక్కాని పట్టగలిగిన శక్తులు వేరు. అలాటివాళ్ళను వేరుచేసి ముందుగా "శిలువ వేసో, షూట్ చేసో, విషమిచ్చో ధనికవర్గ శక్తులు చంపేస్తాయి. ఈ విషయాలు తెలిసిన మావోయిస్టు పార్టీ ఆలస్యంగానైనా తాజాగా విభజనోద్యమం వెనక ఏ శక్తులు పనిచేస్తున్నాయో, సమైక్యాంధ్ర విశాలాంధ్రగా రూపొంది, పెట్టుబడిదారీ చట్రం అనుమతించిన పరిధుల్లోనే పరిమితుల్లోనే, అంతకుముందు రెండు రకాల పరాయిపాలనలలో (బ్రిటిష్, నిజాముల హయాముల్లో) ఎన్నడూ నోచుకోనంత అభివృద్ధిని సాపేక్షంగా మాత్రమే నమోదు చేస్తున్న సమయంలో ఆ పార్టీ కేంద్రీకరణ, ఈ పరిమిత ప్రగతిని పునాది చేసుకుంటూనే మరిన్ని "జాంబవంతుడి అంగల''తో సమున్నత స్థాయిలో అభివృద్ధిని సాధించగల సామాజిక సమూల పరివర్తనా శకాన్ని ఆవిష్కరించే దిశగా శక్తియుక్తుల్ని వొడ్డవలసి ఉంటుంది!   పెట్టుబడిదారీ, అర్థ భూస్వామ్య సమాజవ్యవస్థలో రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలలోని ప్రాంతాల మధ్య, ప్రాంతాలలోని వివిధ జిల్లాల మధ్య అనివార్యమయ్యే అంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, దోపిడీవ్యవస్థకు కాపలాదార్లుగా మాత్రమే 'రాణించ'గల రాజకీయ నిరుద్యోగ నాయకులు స్వార్థప్రయోజనాలతో అధికార లాలసతో తలపెట్టే ఉద్యమాలను నిర్ద్వింద్వంగా సకాలంలో ఖండించి, బలంగా నిరసించాల్సిన బాధ్యత పురోగామి శక్తులయిన మిలిటెంట్ శక్తులదే కావాలి. ఇందుకు చిన్న ఉదాహరణ టాంక్ బండ్ పై నెలకొన్న మూడుప్రాంతాలవారి తెలుగు తేజోమూర్తులయిన సంస్కృతీపరుల విగ్రహాలను విధ్వంసం చేసిన తరువాత అందులో పాల్గొన్నవారిని ఆ విధ్వంసకాండకు బాధ్యత వహించిన కొన్ని పార్టీలు ఎవరికివారు ఎదుటివారి మీదకు నెట్టేశారు. అలా నెట్టిన వారిలో "మార్కిస్టు-లెనినిస్టు'' ముద్రలతో చెలామణీ అవుతున్న "సెక్షన్లు'' కూడా ఉన్నాయని గమనించాలి! ఇప్పుడు కూడా "సమైక్యాంధ్ర మహాసభ'' ద్వారా క్రమశిక్షణతో, వేలెత్తి చూపడానికి వీలులేని సంయమనంతో సర్వత్రా శాంతియుతంగా వ్యవహరించిన ఎ.పి.ఎన్.జీ.వో.లను "సీమగూండాలుగా, రౌడీలు''గా ముద్రవేయడానికి కొందరు వేర్పాటువాదులు ప్రయత్నించడాన్ని యిప్పటికైనా మావోయిస్టుమిత్రులు పరిగణనలోకి తీసుకోవాలి!   "ఎదురుబొంకు'' సామెతను గుర్తుంచుకోవాలి! అటు సీమాంధ్రను, ఇటు దక్కన్ లోని హైదరాబాద్ సంస్థానాన్ని 300-400 సంవత్సరాలపాటు వలసలుగా మార్చుకుని ఏలిన బ్రిటిష్ సామ్యాజ్యవాదులు, నిజాంపాలకులూ పరస్పరం దొంగచాటు ఒప్పందాల ద్వారా అటు కోస్తాంధ్రను, ఇటు తెలంగాణాను, అటు రాయలసీమనూ ప్రజల సంపదనూ దోచుకుని పొందిన అపారమైన ధనరాశులతో ఇరుపక్షాల రాజ్యాలు కాపాడుకున్నారని మరవరాదు; ఈ పాలకుల మధ్య ఈనాటి మాదిరిగానే ఆనాడూ బ్రిటిష్ వాళ్ళకు ఉత్తరాంధ్రను, మధ్యాంధ్రను, రాయలసీమనూ నిజాం నవాబులు అమ్మి భారీగా సొమ్ము చేసుకున్న సంపదతోనూ, తెలంగాణా ప్రజలను దోచుకున్న సంపదతోనూ హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. అందుకే హైదరాబాద్ యావత్తు తెలుగుజాతికేగాక, అనేక బాధలకు గురైన సామాన్య ముస్లిం ప్రజాబాహుళ్యానికి కూడా రాజధానిగా రూపుదిద్దుకుంది. ఈ వాస్తవాన్ని కూడా మావోయిస్టులు గుర్తించి, వ్యూహాన్ని తెలుగుజాతి సమైక్యతా పరిరక్షణ కోసం ముందడుగు వేయక తప్పదు! ఒక్కసారి తెలంగాణా సాయుధపోరాట యోధుడైన దేవులపల్లి వెంకటేశ్వర్రావు అన్న మాటల్ని మావోయిస్టులు గుర్తుచేసుకోవడం మంచిదికాదా? దేవులపల్లి మాటల్లో "ఒకే భాషా సంస్కృతులకు పునాదిగా ఏర్పరచుకున్న రాష్ట్రంలో యావత్తు తెలుగుజాతికి మాత్రమే స్వయంనిర్ణయహక్కు ఉంటుందిగాని, జాతిలో ఒక భాగానికి ఉండదుగాక, ఉండదు!

తెరాస ఉనికిని కాపాడుకొనేందుకే విద్వేష ప్రచారం

  తెరాస నేతలు తాము బంద్ కు పిలుపునిచ్చినప్పటికీ, ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ ఊహించినదాని కంటే చాలా విజయవంతంగా ముగియడంతో సహజంగానే జీర్ణించుకోలేకపోతున్నారు.   సభ సందర్భంగా వేలాది మంది తరలి వస్తున్నపుడు బయట జరిగిన చిన్నచిన్నసంఘటనలను, సభలో పోలీస్ కానిస్టేబుళ్ళు శ్రీనివాస్, శ్రీశైలంలపై జరిగిన దాడి, సభలో జరిగిన అవకతవకలను, నేతల ప్రసంగాల వంటివి వాటిని తెరాస నేతలు భూతద్దంలో ఎత్తి చూపుతూ, ఆవేశంతో ఉన్నతెలంగాణా ప్రజలను మరింత రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా తెరాస నేతలు ప్రజాగ్రహాన్నితమకు అనువుగా మలచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, తెలంగాణా కాంగ్రెస్ నేతలు కూడా జరిగిన యావత్ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నపటికీ, ఈ విషయంలో వారందరూ చాలా సంయమనంతో మాట్లాడటం గమనార్హం. అందుకు వారిని మెచ్చుకోక తప్పదు.   కాంగ్రెస్ తీసుకొన్నవిభజన నిర్ణయంతో తెరాస ఉనికి ప్రశ్నార్ధకమవగా, తెలంగాణాలో టీ-కాంగ్రెస్ పరిస్థితి చాలా మెరుగుపడింది. ఆ దుగ్ధతోనే తెరాస నేతలు తెలంగాణా ప్రజలను రెచ్చగొట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తూ వారి ఆగ్రహాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని తిప్పలు పడుతున్నారు.   హైదరాబాదులో ఏపీఎన్జీవోలు సభ నిర్వహించడం నిజంగానే బల ప్రదర్శన అని ఒప్పుకోక తప్పదు. బల ప్రదర్శనకు వచ్చిన వారు, అందుకు అనుగుణంగానే ప్రవర్తిస్తారు తప్ప నాలుగు శాంతి ప్రవచనాలు చెప్పుకొని ‘మమ’ అనుకోని వెళ్లిపోరనేది తెరాస నేతలకు కూడా తెలుసు. ఈ సందర్భంగా తెరాస నేతలు మిలియన్ మార్చ్ సందర్భంగా జరిగిన విగ్రహాల విద్వంసం ఒకసారి గుర్తుకు తెచ్చుకొంటే మంచిది. ఒకవేళ ఆ రోజు వారికి ఎవరయినా సమైక్యవాది ఎదురుపడి ‘జై సమైక్యాంధ్ర’ అని నినదించి ఉండి ఉంటే, అతనికీ సభలో పోలీస్ కానిస్టేబుల్ కి పట్టిన గతే పట్టేదనేది కాదనలేని సత్యం.   తెరాస నేత హరీష్ రావు సభకు వచ్చినవారికి ఆహారం, పాలు, పళ్ళు, పూలు ఇచ్చి గౌరవించాలని చెపితే, ఏపీఎన్జీవోలు తిరిగి వెళుతున్నపుడు వారి బస్సులపై కొందరు రాళ్ళతో దాడి చేసినపుడు కొంత మందికి గాయాలయ్యాయి. సమైక్యవాదులు తెలంగాణా విద్యార్ధులపై దాడి చేసారని ఆరోపిస్తున్నతెరాస నేతలు, ఈ దాడిని ఖండించలేదు, గాయపడినవారి పట్ల సానుభూతి చూపలేదు, కనీసం ఆ దాడిని ప్రస్తావించలేదు కూడా.   ఉద్రేకంగా ఉన్న రెండు సమూహాలు ఎదురయితే ఇటువంటి ఘర్షణలు తప్పవనే సంగతి తెలిసినప్పటికీ, తెరాస నేతలు ప్రజల మధ్య మరింత చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలకున్నతెలివిడి తెరాస నేతలకి లేక కాదు. కానీ తమ ఉనికిని కాపాడుకొనేందుకే వారు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంటారు.   ఒకసారి కేసీఆర్ , మరొకసారి ఈటెల, ఇంకోసారి హరీష్ రావు ప్రజలను రెచ్చగొడుతూ తెలంగాణా వేడిని కొనసాగిస్తుంటారు. ఈ నేతలందరూ మళ్ళీ అదే నోటితో ఆంధ్రా వాళ్ళని కడుపులో పెట్టుకొని కాపాడుతామని పలకడం చూస్తుంటే నోటితో నీతులు పలుకుతూ, నొసటితో వెక్కిరిస్తున్నట్లుంటుంది.