ఇదో నవశకమా...'అదే' నాసిరకమా ...

 

 

 

ఏదైతేనేం ఆమాద్మీ అనే సరికొత్త పార్టీ తొలిసారి భారతరాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని రికార్డుల్ని స్వంతం చేసుకుని సగర్వంగా అధికారాన్ని అలంకరించనుంది. సామాన్యుడి పక్షం అనే ఆకర్షణీయమైన నినాదంతో అవినీతిని ఊడ్చేస్తాననే అద్భుతమైన ఆశాదీపం వెలుగుల్లో దూసుకొచ్చిన ఈ పార్టీని జనం ఆదరించిన తీరు ... సంప్రదాయ పార్టీల పట్ల ప్రజల్లో నెలకొన్న తీవ్ర నిరాశా నిస్పృహలకు నిలువుటద్దంగా నిలిచింది. ఈ నేపథ్యంలో అధికారానికి అవసరమైనన్ని సీట్లు రాకపోయినా ప్రజాభిప్రాయం మేరకు పాలనా పగ్గాలు చేపడుతున్నట్టు ప్రకటించిన ఆమాద్మీ ఇకపై ఎలా పనిచేస్తుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. విఐపి సంస్కృతికి చరమగీతం పాడడం, ఢిల్లీకి స్వయంప్రతిపత్తి కలిగించడం, కాలనీల క్రమబద్ధీకరణ, పక్కా ఇళ్ళ నిర్మాణం ... వంటి ఎన్నో జనాకర్షక, విప్లవాత్మకమైన ప్రణాళికలను ప్రకటించిన ఆమాద్మీ ఆచరణలో అదీ మైనారిటీ ప్రభుత్వంతో ఎలా అమలు చేస్తుందనేది ప్రతిఒక్కరిలోనూ ఆసక్తిని రేకెత్తించేదే. ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోవడానికి అంగీకరించడం ఆమాద్మీకి తొలి మైనస్ పాయింట్. సరే ... ఇప్పుడు తప్పనిసరై తీసుకున్నామనో, ప్రజలు చెప్పారు కాబట్టి అంగీకరించామనో సమర్థించుకోవచ్చు. అయితే అధికారం కోసం భవిష్యతులో కాంగ్రెస్ అడుగులకు మడుగులొత్తడం అనేది చేయకుండా, అవసరమైతే పదవుల్ని తృణప్రాయంగా వదులుకోగాలగాలి. అప్పుడే ఆమాద్మీ నిఖార్సయిన సామాన్యుడి పార్టీగా మనగలుగుతుంది.


విప్లవాత్మకమైన ఆలోచనలతో ముందుకొచ్చిన పార్టీలు ఎక్కువకాలం కొనసాగడం, పాలనా పరంగానూ విజయవంతం కావడం తమ రాజకీయ భవిష్యత్తుకు ఎంత మాత్రం మంచిది కాదనే వాస్తవం తెలుసు కాబట్టి ... మిగిలిన పార్టీలు, వాటికి అండగా ఉండే కార్పొరేట్లు, వ్యాపారవేత్తలు, మాఫియాలు ... ఆమాద్మీ తరహా రాజకీయం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందనే భయంతో ఉన్న బలమైన నేతలు... కేజ్రీవాల్ కు అడుగడుగునా అడ్డంకులు సృస్టిస్తారనే విషయంలో సందేహం లేదు. వీటన్నింటినీ తట్టుకుని, అధికారం అనే ఆకర్షక వలయంలో చిక్కుకోకుండా ఐదేళ్ళ పాటు ఆమాద్మీ స్వచ్చమైన పాలనను, జవాబుదారీ వ్యవస్థను అందించగలిగితే ... అది నిజంగా అద్భుతమే. అలా జరగాలని ఆశిద్దాం. ఆ అద్భుతం భారతదేశ రాజకీయాల్ని మలుపు తిప్పాలని కోరుకుందాం.

Teluguone gnews banner