ప్రీతీజింటాకి బాలీవుడ్ నైతిక మద్దతు... సానుభూతి..!

  తన మాజీ ప్రియుడు నెస్ వాడియాతో న్యాయ పోరాటం చేస్తు్న బాలీవుడ్ నటి ప్రీతీ జింటాకి బాలీవుడ్ నైతిక మద్దతును ఇస్తోంది. ఈ సమస్య నుంచి ప్రీతీ జింటా సాధ్యమైనంత త్వరగా బయటపడాలని బాలీవుడ్ కోరుకుంటోంది. యాక్టివ్‌గా వుంటే ప్రీతీజింటా జీవితంలో ఇన్ని చీకటి కోణాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు. నెస్ వాడియాతో ప్రీతీజింటాకి వున్న గొడవలు టీ కప్పులో తుఫానులాగా సమసిపోతాయని వారంతా భావించారు. అయితే మేటర్ చాలా సీరియస్‌గా వుందన్న విషయం ప్రీతీజింటా తాజా లేఖతో బయటపడటంతో వారందరూ ప్రీతీ జింటా మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. తన మాజీ ప్రియుడు నెస్ వాడియా తనను మానసికంగా, శారీరకంగా హింసించాడంటూ ఫిర్యాదు చేస్తూ ప్రీతీజింటా మంగళవారం ముంబై పోలీసు కమిషనర్‌కి రాసిన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

నరకాసురుడి వధ ఎప్పుడో చేసేశారు: గాలి

  తెలుగుదేశం పార్టీని అదేపనిగా విమర్శిస్తు్న్న వైసీపీ నాయకుడు జగన్ మీద తెలుగుదేశం నాయకులు ఎదురుదాడి ప్రారంభించారు. జగన్ ది అంతా అవినీతి బతుకు అని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు విమర్శించారు. ''16 నెలలు జైల్లో ఉన్నారు..బతుకంతా అవినీతి బతుకు.. ప్రజల భూములు కబ్జా చేశారు..లక్ష కోట్లు తిన్నారు..ఎప్పుడు జైలుకు పోతారో తెలియదు..వీరు చంద్రబాబుపై విమర్శలు చేస్తారా'' ? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నరకాసురుడి వధ ఎప్పుడో చేసేశారని, ఆయన గెలిస్తే ఊర్లను ఊర్లు తినేసే వాడని విమర్శించారు. తెలంగాణకు చిచ్చు పెట్టింది వైఎస్ అని, ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడు ఇలాంటి పిలుపునిస్తారా ? అని గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు ప్రశ్నించారు.

రంభ కేసు: నటి సోదరుడి పూర్తి క్లారిఫికేషన్

  రంభ కుటుంబం మీద, తల్లిదండ్రుల మీద రంభ మరదలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పెట్టిన గృహహింస కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసు నేపథ్యంలో రంభ సోదరుడు శ్రీనివాస్ మీడియా ముందుకు వచ్చి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరణ ఇచ్చారు...   1. నా భార్య పల్లవి మా కుటుంబ మీద తప్పుడు కేసు పెట్టింది. ఆమె చెన్నైలోని మా ఇంట్లో వున్న వజ్రాల నగలు, మా ఇద్దరు పిల్లలను తీసుకుని హైదరాబాద్‌లోని పుట్టింటికి ఈ ఏడాది ఫిబ్రవరి 2న వచ్చేసింది. ఈ విషయాన్ని అప్పుడే మా తండ్రి చెన్నైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.   2. నేను ఆ సమయంలో టొరంటోలో వున్నాను. నా భార్య ఆస్తితో, పిల్లతో పుట్టింటికి వెళ్ళిపోయిందని తెలిసి నేను ఇండియాకి తిరిగి వచ్చాను. నా భార్య తాను చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికే మా మీద ఈ గృహహింస కేసు పెట్టింది.   3. నాకు పల్లవితో పెళ్ళయి పదిహేనేళ్ళు అయింది. ఇద్దరు పిల్లలున్నారు. ఇన్నాళ్ళుగా లేని వేధింపులు ఆమెకు నేను దేశంలో లేనప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చాయో, ఇంట్లోంచి నగలు తీసుకుని ఎందుకు వెళ్ళిపోయిందో మాకు తెలియదు.   4. ఈ విషయం మీద నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాను. నన్ను అరెస్టు చేయకూడదని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.   5. 1999లో నాతో పెళ్ళయిన సమయానికి పల్లవి కుటుంబం అద్దె ఇంటిలో వుండేది. ఇప్పుడు వారికి ఒక బంగ్లా, మూడు ఫ్లాట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?   6. పల్లవి కుటుంబం మాకు ఏ రూపంలో కట్నం ఇచ్చారో.. మేం కట్నం కోసం ఎప్పుడు వేధించామో ఆధారాలతో సహా నిరూపించాలని డిమాండ్ చేస్తున్నాను.   7. మహిళల భద్రత కోసం ఉద్దేశించిన 498ఎ సెక్షన్‌ని దుర్వినియోగం చేయడం సరైన పద్ధతి కాదు.   8. ప్రచారం కోసమే పల్లవి ఈ కేసులో నా సోదరి రంభని ఇరికించింది. ఈ కేసుతో రంభకి ఎలాంటి సంబంధం లేదు.ఆమెని ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు.

బెంగళూరు గర్ల్ రేప్ కేసు: స్కూలు ఛైర్మన్ అరెస్టు

  వారం రోజుల క్రితం బెంగుళూరులోని విబ్జియార్ పాఠశాలలో ఆరేళ్ళ బాలికపై స్కూలులో అత్యాచారం జరిగింది. స్కూలులో పనిచేసే సిబ్బందే అత్యాచారం చేశారని స్కూలు పేరెంట్స్ తల్లిదండ్రులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఆందోళన కార్యక్రమాలు తీవ్రం కావడంతో సదరు పాఠశాల ఛైర్మన్ రుస్తుం కేర్వాలాను పోలీసులు అరెస్టు చేశారు. పాఠశాల యాజమాన్యాన్ని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో పాఠశాల ఛైర్మన్‌ని అరెస్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేయక రాష్ట్ర ప్రభుత్వానికి తప్పలేదు. దారుణమైన అత్యాచార సంఘటనపై కర్నాటక ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ఆందోళనకారులు విమర్శిస్తున్నారు.

అప్పు ఇచ్చాడు.. ఆత్మహత్య చేసుకున్నాడు!

  అప్పు రేపు... అప్పు అప్పుడే విరోధం అని పెద్దలు ఏనాడో చెప్పినా కొంతమంది అమాయకులు చూసి చూసి మోసం చేసేవాళ్ళకే అప్పు ఇస్తారు. వాటిని వసూలు చేసుకోలేక నానా బాధలూ పడతారు. ఇలాగే ఒక బిల్డర్‌కి 30 లక్షలు అప్పు ఇచ్చిన ఆల్విన్ కంపెనీ రిటైర్డ్ ఉద్యోగి ఒకరు ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ఆల్మిన్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేసిన ప్రభాకర్ అనే వ్యక్తి తాను కష్టపడి సంపాదించుకున్న 30 లక్షల రూపాయల డబ్బును ఒక బిల్డర్‌కి అప్పుగా ఇచ్చాడు. ఆ బల్డర్ షరా మామూలుగా మోసం చేశాడు. దాంతో మనస్తాపానికి గురైన ప్రభాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన సూసైడ్ నోట్‌లో సదరు బిల్డర్ పేరు రాసి మరీ చనిపోయాడు. పోయిన ప్రాణం ఎలా తిరిగిరాదో, మోసగాడికి ఇచ్చిన అప్పు కూడా అలాగే తిరిగి రాదు.

జగన్‌కి బుద్ధి, జ్ఞానం లేవు: దేవినేని ఉమా విమర్శ

  తెలుగుదేశం పార్టీని అదేపనిగా విమర్శిస్తు్న్న వైసీపీ నాయకుడు జగన్ మీద తెలుగుదేశం నాయకులు ఎదురుదాడి ప్రారంభించారు. ప్రజలకు మేలు చేస్తు్న్న తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడిని పనిగట్టుకుని మరీ విమర్శిస్తున్న జగన్‌కి బుద్ధి, జ్ఞానం లేవని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ప్రజలకు మేలు చేస్తే నరకాసుర వధ పేరుతో తమ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తారా అని ఆయన జగన్ని ప్రశ్నించారు. చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేయమంటూ జగన్ పిలుపునివ్వడంపై ఆయన మండిపడ్డారు. అవినీతి కేసులలో ఇరుక్కుపోయి వున్న జగన్‌కు చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు.

పాకిస్థాన్ కోడలు సానియా తెలంగాణ బ్రాండ్ అంబాసిడరా?

  తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మిర్జాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించడం పట్ల తెలంగాణ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మన శత్రుదేశమైన పాకిస్థాన్‌కి కోడలిగా వెళ్లిన సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడం చాలా దారుణమైన విషయమని తెలంగాణ బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిసెంబర్లో జరిగే హైదరాబాద్ స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముస్లిం ఓటు బ్యాంకు కోసం కేసీఆర్ ప్రభుత్వం ఇలాంటి ఫీట్లు చేస్తోందని ఆయన విమర్శించారు. సానియాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడం, ముస్లింలకు రిజర్వేషన్లు, రంజాన్‌కు ముందే జీతాల చెల్లింపులు ఈ పథకంలో భాగమేనని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మజ్లిస్‌కు తెరాస తలొగ్గి తెలంగాణ రాజముద్రలో చార్మినార్ పొందుపర్చిందని, ఫీజు రీయింబర్స్‌మెంటుకు 1956 స్థానికత నిబంధనను పెట్టిన తెరాస ప్రభుత్వం మహారాష్ట్రలో పుట్టి పాకిస్థాన్ కోడలిగా వెళ్లిన సానియాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. మరి ఇప్పుడు సోనియాకు స్థానికత వర్తించదా అని డాక్టర్ లక్ష్మణ్ నిలదీశారు.

జగన్‌లో నరకాసురుడి లక్షణాలు

  జగన్‌లో నరకాసురుడి లక్షణాలు ఉన్నాయని, అందుకే ఆయన్ని తెలుగు ప్రజలు వద్దనుకున్నారని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ‘నరకాసుర వధ’ పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు గత రెండు మూడు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌నే నరకాసురుడిగా అభివర్ణిస్తూ యనమల విమర్శించారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయడం జగన్‌కి ఎంతమాత్రం ఇష్టంలేదని, అలాంటి వ్యక్తికి రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు జగన్‌కి ఎంతమాత్రం లేదని యనమల అన్నారు.

పార్లమెంటులో గరమ్ గరమ్ ‘చపాతి’

  ఢిల్లీలోని న్యూ మహారాష్ట్ర సదన్‌లో కేటరింగ్ చేసే ఒక ముస్లిం వ్యక్తి తమకు సంప్రదాయమైన మహారాష్ట్ర వంటకాలు చేసి పెట్టలేదంటూ శివసేన ఎంపీలు 11 మంది అతని చేత బలవంతంగా చపాతీ తినిపించి అతని రంజాన్ ఉపవాస దీక్షను భగ్నం చేసిన సంఘటన పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. బుధవారం ఉదయం లోక్సభ ప్రారంభంకాగానే పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు. మత స్వేచ్ఛను శివసేన ఎంపీలు కాలరాశారని విరుచుకుపడ్డారు. శివసేన ఎంపీలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ప్రధాని నరేంద్ర మోడీ సభలో ఉండగానే ఈ గందరగోళం చోటుచేసుకుంది. స్పీకర్ సమిత్రా మహాజన్ సర్దిచెప్పినా వారు వెనక్కు తగ్గలేదు. దీంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. రాజ్యసభ కూడా ’చపాతి’ ఘటనపై వేడెక్కింది.

కవిత కాశ్మీర్‌ మీద ఆ కామెంట్స్ చేయకుండా వుండాల్సింది!

  టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కాశ్మీర్ విషయంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దేశంలోని కొన్ని భాగాలు భారత్‌కు చెందినవి కావని, దీన్ని మనం అంగీకరించాలని కవిత కాశ్మీర్‌ను ఉద్దేశిస్తూ ఇటీవల ఓ చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్రానికి పూర్వం జమ్ము-కాశ్మీర్, హైదరాబాద్ ప్రత్యేక దేశాలని, భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కాశ్మీర్, హైదరాబాద్‌లను బలవంతంగా భారతదేశంలో కలిపారని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జమ్ముకాశ్మీర్‌తో పాటు తెలంగాణలో భూచట్టాలు ఒకేలాగా ఉన్నాయని ఇరుప్రాంతాల్లో స్థానికులు తప్ప ప్రాంతేతరులు భూములు కొనడం నిషిద్ధమని ఆమె అన్నారు. జమ్ముకాశ్మీర్‌పై భారతదేశానికి స్పష్టత రావాలని అవసరమైతే భారత్ అంతర్జాతీయ సరిహద్దుల్ని మార్చుకోవాలని అంటూ కాశ్మీర్‌ను భారత్ వదులుకోవాలన్న అర్థంలో కవిత మాట్లాడారు. ఈ వ్యాఖ్యల మీద దేశవ్యాప్తంగా ఎంతో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కవిత చేసిన వ్యాఖ్యలు దేశ సమగ్రతపైనా, సమాఖ్య చట్టబద్ధతపైనా అనుమానాలు రేకెత్తించే విధంగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా వుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు టీఆర్ఎస్ నేతల్లో అంతర్గతంగా వ్యక్తమవుతున్నాయి. కవిత తన దూకుడుతో కూడిన మాటలను సీమాంధ్రుల మీద ప్రయోగిస్తే పర్లేదుగానీ, దేశ సమగ్రత మీద ప్రయోగించడం లేనిపోని ఇబ్బందులను సృష్టించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

టీ మంత్రుల్ని తరిమి కొడతాం: ఓయు స్టూడెంట్స్

  ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు వాస్తవంగా శాంతి కాముకులు. అయితే వారికి ఆగ్రహం వచ్చిందంటే వారిని ఆపడం ప్రభుత్వం, పోలీసుల వల్ల అయ్యే ఛాన్స్ లేదు. వారికి ఆగ్రహం తెప్పించేది రాజకీయ నాయకులే. అలాగే రాజకీయ నాయకుల చెవిలో పువ్వు వ్యవహారాలు ఉస్మానియా విద్యార్థుల దగ్గర మాత్రం కుదరవు. గతంలో ఇలా ప్రయత్నించిన అనేకమంది నాయకులు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల నుంచి గుణ ‘పాఠాలు’ నేర్చుకున్నారు. అందుకే ఉస్మానియా ఏరియాకి వెళ్ళాలంటే చాలామంది రాజకీయ నాయకులకు దడ. ఇదిలా వుంటే, ఉస్మానియా విద్యార్థి లోకం మరోసారి ఆగ్రహించింది. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం మీద విద్యార్థులు గుర్రుగా వున్నారు. అందుకే, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అడుగుపెడితే మంత్రులని కూడా చూడకుండా తరిమి కొడతామని తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ఆ యూనివర్శిటీ విద్యార్థులు హెచ్చరించారు. ఆందోళన చేస్తున్ విద్యార్థులను సముదాయించేందుకు మొన్నీమధ్య వెళ్లిన మంత్రులు హరీష్‌రావు, జగదీశ్వర్‌రెడ్డిని అడ్డుకున్నారు. మంత్రులను అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. వీరి ధాటిని తట్టుకోవడం మంత్రులకు కష్టమైపోయింది. అందువల్ల ఉస్మానియా విద్యార్థులు మంత్రులను తరిమి కొడతామని హెచ్చరికలు చేసిన నేపథ్యంలో తెలంగాణ మంత్రులు ఉస్మానియా యూనివర్సిటీ ఏరియాకి వెళ్ళకపోవడం మంచిది.

ఫేస్‌బుక్ పుణ్యమా అని విడాకులు!

ఫేస్‌బుక్ కారణంగా స్నేహాలు, అనుబంధాలు పెరగడమే కాదు.. ఉన్న అనుబంధాలు కూడా తెగిపోయే అవకాశాలున్నాయి. ఈ పాయింట్‌కి బలం చేకూర్చే సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా బోలెడన్ని వున్నాయి. పచ్చగా వున్న కాపురాలు సైతం ఫేస్ బుక్ పుణ్యమా అని కూలిపోయిన సందర్భాలకి అయితే లెక్కే లేదు. ఈమధ్యకాలంలో ఫేస్ బుక్ కారణంగా పెటాకులైపోయిన పెళ్ళిళ్ళ సంఖ్య చాలా వుందని ఒక అధ్యయనం చెబుతోంది. ఫేస్ బుక్ కారణంగా దాంపత్య సంబంధాలకు ముప్పు వాటిల్లుతోందని ఓ అధ్యయనంలో పరిశోధకులు వెల్లడించారు. ఫేస్‌బుక్ వల్ల అమెరికాలోనే ఇలాంటి పెటాకుల కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అమెరికాలో ప్రతి ఏటా జరిగే విడాకుల శాతం మరో నాలుగు శాతం పెరిగిందట. ఆ నాలుగు శాతం పెరగడానికి ఫేస్‌బుక్కే కారణమట.

నీటి సరఫరాపై అంతర్జాతీయ సదస్సు

బేగంపేటలోని హోటల్ గ్రీన్‌పార్క్ వేదికగా నగరాలు, పట్టణాలల్లో నీటి సరఫరాపై అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈనెల 24, 25 తేదీల్లో సెమినార్‌ జరుగుతుంది. జలమండలి, ఇండియన్‌ వాటర్‌ వర్క్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సెమినార్‌ను సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రారంభిస్తారు. భారత్, అమెరికా, జపాన్ దేశాలకు చెందిన 250మందికి పైగా నిపుణులతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు, అధికారులు, వ్యాపారవేత్తలు సదస్సుకు హాజరుకానున్నారు. పదేళ్లకోసారి జరిగిగే ఈ సెమినార్‌ను గతంలో గోవా, చెన్నై నగరాల్లో నిర్వహించారు.

ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫా? సారీ!

  ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా వుంది కాబట్టి పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వడం కుదరని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి చినరాజప్ప అన్నారు. అయితే ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన వివరించారు. పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వాలన్న ఉద్దేశం మంచిదేగానీ, ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుందనే విషయాన్ని పరిశీలించాలని ఆయన అన్నారు. కొత్త రాష్ట్రం కావడం, సిబ్బంది కొరత తీవ్రంగా వున్న ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వడం సమంజసం కాదేమోనని ఆయన అన్నారు. నెలరోజుల్లో పోలీస్ శాఖను ప్రక్షాళన చేస్తామని మంత్రి చెప్పారు.