పవన్ కళ్యాణ్ వల్లే ఓడారా.. ఇన్నాళ్ళకి తెలిసిందా?

  వైసీపీ నాయకులకు తమ పార్టీ ఎన్నికలలో ఎందుకు ఓడిపోయిందో ఇన్నాళ్ళకు తెలిసినట్టుంది. టాలీవుడ్ స్టార్ పవన్ కల్యాణ్ కారణంగానే మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, పవన్ కళ్యాణ్ కారణంగానే తమ పార్టీ ఓడిపోయిందని నగరి శాసనసభ్యురాలు, వైసీపీ నాయకురాలు రోజా అన్నారు. మంగళవారం చిత్తూరులో రోజా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన సందర్భంగా ఈ టాపిక్ తీసుకొచ్చారు. రైతుల రుణమాఫీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన తమకు అర్థం కావడం లేదని రోజా చెప్పారు. రుణమాఫీ విషయంలో చంద్రబాబు రైతులను మభ్యపెట్టడానికే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

బైక్‌ మీద ప్రవాహాన్ని దాటబోతే ప్రాణాలే పోయాయి...

  మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు మహా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. బేతుల్ పట్టణం సమీపంలో చిన్న చప్టా రోడ్డు మీద నుంచి ప్రవహిస్తున్న వాగు రోడ్డుకు కోత వేసేసింది. రోడ్డు కొద్దిగానే మిగిలింది. అయితే ఒక యువకుడు ఆ రోడ్డు మీద నుంచి ప్రవాహం మధ్యలోంచి బైక్‌ని నడిపించాలని ప్రయత్నించాడు. తటపటాయిస్తూనే బైక్‌ని ముందుకు నడిపించాడు. అయితే అనుకోకుండా వాగును దాటడంలో అజాగ్రత్తగా వ్యవహరించడంతో ఆ యువకుడు బైక్‌తో సహా ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ప్రవాహం మహా భయంకరంగా వుందని, ఆ ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడు ఇక బతికే అవకాశం లేదని స్థానికులు అంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్‌ పుత్రోత్సాహం.. ట్విట్టర్‌లో ఆనందం

  టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు మంగళవారం ఉదయం పండంటి మగపిల్లాడు పుట్టిన విషయం తెలిసిందే. పుత్రోత్సాహంలో వున్న జూనియర్ ఎన్టీఆర్ తన ఆనందాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. 2009లో ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ 2010 నుంచి అందులో ఏ ట్విట్స్ పోస్ట్ చేయలేదు. కొడుకు పుట్టగానే జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్‌లో ట్విట్ పోస్ట్ చేశారు. ‘‘చాలా కాలం నుండి ట్విట్టర్‌కు దూరంగా ఉంటున్నా. కొడుకు పుట్టిన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా ఈ రోజు మీ అందరితో పంచుకుంటున్నా. ఈ సందర్భంగా మా కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

నెస్ వాడియా నా ముఖాన్ని సిగరెట్లతో కాల్చాడు: ప్రీతీ జింటా

  తన మాజీ ప్రియుడు నెస్ వాడియా తనను గతంలో ఎన్నోసార్లు శారీరకంగా హింసించాడని బాలీవుడ్ నటి ప్రీతీజింటా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను నెస్ వాడియా అనేకసార్లు సిగరెట్లతో తన ముఖాన్ని కాల్చాడని ఆమె ఫిర్యాదు చేసింది. ముంబై పోలీసు కమిషనర్‌కు రాసిన లేఖలో ప్రీతీ జింటా ఈ విషయాన్ని తెలిపింది. ‘‘కొన్నిసార్లు అతను భయంకరంగా ప్రవర్తించేవాడు. ఆ సమయంలో అతను నన్ను చంపేస్తాడేమోనని భయపడేదాన్ని. అతని ఆగడాలను భరించలేక ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో అతనికి దూరమయ్యాను’’ అని ఆ లేఖలో ప్రీతీజింటా పేర్కొంది. అయిదేళ్ళు ప్రేమించుకున్న వీరిద్దరూ ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు భాగస్వాములుగా గతంలో వున్నారు. ఈమధ్యే ప్రీతీజింటా నెస్ వాడియా మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీఎల్ సందర్భంగా నెస్ తనను దూషించి చేయి చేసుకున్నాడని ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

షరపోవాకి క్రికెట్ గురించి తెలియకపోవచ్చు తప్పేముంది: సచిన్

  టెన్నిస్ స్టార్ మారియా షరపోవా క్రికెట్ దేవుడు సచిన్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు సచిన్ అంటే ఎవరని ప్రశ్నించడం, సచిన్ అంటే ఎవరో నీకు తెలియదా అని ఆమె మీద భారత క్రికెట్ అభిమానులు, సచిన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కొంతమంది సచిన్ అభిమానులు సోషల్ నెట్ వర్క్.లో షరపోవా మీద ఘాటుగా స్పందించారు. ఈ వివాదం గురించి సచిన్ ఇంతకాలం స్పందించలేదు. తాజాగా ఈ అంశం మీద సచిన్ తన ప్రతిస్పందన తెలిపారు. రష్యన్ క్రీడాకారిణి షరపోవాకు క్రికెట్ గురించి తెలిసి వుండకపోవచ్చునని, అంతమాత్రానికి ఆమె విషయంలో పరుషంగా వుండటం తగదని అన్నారు. మనం ఎవరినీ మన వ్యాఖ్యలతో బాధపెట్టకూడదని సచిన్ హితవు పలికారు.

యాదవరెడ్డిని కాంగ్రెస్ నుంచి గెంటేశారు!

  కాంగ్రెస్ పార్టీ విప్‌ను ధిక్కరించిన జడ్పీటీసీ, ఎమ్మెల్సీ కె. యాదవరెడ్డిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. యాదవరెడ్డిని ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ పీసీసీ ప్రకటించింది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌తో యాదవరెడ్డి చేతులు కలిపారు. ఎమ్మెల్సీగా కూడా అయిన ఆయన శాసనమండలి ఛైర్మన్ ఎన్నికల్లోను టీఆర్‌ఎస్ అభ్యర్థికే మద్దతు పలికారు. దీంతో పార్టీ విప్‌ను ఉల్లంఘించిన ఆయనపై అనర్హత వేటు వేయాలని డీసీసీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై బదులివ్వాలని కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కేంద్రమాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి శిష్యుడిగా కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించిన యాదవరెడ్డి ఏఐసీసీ సభ్యుడు కూడా. ఈ క్రమంలోనే ఆయనపై బహిష్కరణాస్త్రం ప్రయోగించడం ఆలస్యమైందని కాంగ్రెస్ పార్టీవర్గాలు చెబుతున్నారు.

ఎయిర్‌లైన్స్ బిజినెస్‌లోకి రామ్ చరణ్

  ప్రముఖ నటులు చాలా మంది సినిమాలు చేస్తూనె ఇతర బిజినెస్ లు చాలా చేస్తున్నారు. ఇప్పుడు వీరి జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. తాజాగా చెర్రీ ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు. "టర్బో మెగా" పేరుతో ఏర్పాటయ్యే ఈ ఎయిర్‌లైన్స్ రామ్‌చరణ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. సివిల్‌ ఎవియేషన్స్‌ మినిస్టరీ నుంచి అనుమతులు కూడా మంజురయ్యాయి. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు ఎన్‌ఓసీ ఇచ్చినట్లు తెలిసింది. రూ.15 కోట్ల షేర్ క్యాపిటల్, మరో రూ.12 కోట్ల పెయిడప్ క్యాపిటల్‌తో గతేడాది మార్చి 14నే 'టర్బో మెగా ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్' పేరిట ఓ ఫర్మ్ కూడా రిజిస్టర్ చేయించారు. ఈ కొత్త వెంచర్‌కి రామ్‌చరణ్‌తోపాటు మరో డైరెక్టర్‌గా వంకాయలపాటి ఉమేష్‌ వ్యవహరిచనున్నట్లు సమాచారం.

సికింద్రాబాద్‌లో సోనియా సభ పెడితే కాంగ్రెస్ గెలిచేదా?

  తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన మంగళవారం నాడు గాంధీ భవన్‌లో ‘ఎన్నికల ఫలితాలు - పార్టీ పునర్వ్యవస్థీకరణ’ అనే చర్చ జరిగింది. ఈ చర్చా కార్యక్రమంలో పలువురు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులతోపాటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఒక వెరైటీ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే అది సోనియాగాంధీ వల్లేనని ఆయన అన్నారు. అలాగే సికింద్రాబాద్‌లో సోనియాగాంధఈ సభను నిర్వహించి వుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలిచేదని ఆయన అన్నారు. సోనియాగాంధీ సికింద్రాబాద్‌లో సభ పెట్టడానికి, కాంగ్రెస్ పార్టీ గెలవటానికి లింకేంటో అర్థంకాక సభలో వున్నవారు గజిబిజి అయిపోయారు. అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టే ఆలస్యంగా విడుదల చేయడం, మేనిఫెస్టోలో రైతు రుణ మాఫీ పథకాన్ని పెట్టకపోవడం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని షబ్బీర్ చెప్పారు.

ధరలు తగ్గించం: సిమెంట్ కంపెనీలు!

  ప్రస్తుతం మార్కెట్లో సిమెంట్ బస్తా ధర 350 రూపాయల చేరువలో వుంది. సిమెంట్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గత పది రోజులుగా బిల్డర్లు సిమెంట్ కొనుగోలు చేయకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిమెంట్ ధరలు తగ్గించే ప్రసక్తే లేదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా వున్న సిమెంట్ కంపెనీల ప్రతినిధులు ప్రకటించారు. సిమెంట్ ధరలను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. సిమెంట్ కంపెనీలకు గత మూడు సంవత్సరాలుగా వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికే సిమెంటు ధరలను పెంచామని, ప్రస్తుతం సిమెంట్ కంపెనీలు సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో వున్నాయని వారు అన్నారు. ఒక సిమెంట్ బస్తా తయారు చేయడానికి తమకు 330 రూపాయలు ఖర్చవుతోందని వారు ఈ సందర్భంగా చెప్పారు. సిమెంట్ ధరల విషయంలో బిల్డర్లు చేస్తున్న వాదనలు సత్యదూరమని వారు అన్నారు. గతంలో తమ దగ్గర వున్న స్టాకును అమ్ముకోవడానికి మాత్రమే సిమెంట్ ధరలు తగ్గించామని, అవే ధరలను ఇప్పటికీ అమలు చేయమంటే కుదరదని సిమెంట్ కంపెనీల ప్రతినిధులు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు.

కట్జూ వ్యాఖ్యలపై సుప్రీంలో పిటిషన్

  సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంగళవారం ఒక పిటీషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. కట్జూ తన వ్యాఖ్యల్లో పేర్కొన్నట్టుగా న్యాయ వ్యవస్థలో అవినీతిపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదులు రాజారామన్, సతీష్ గల్లా ఈ పిటిషన్ దాఖలు చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్రాసు హైకోర్టుకు చెందిన అదనపు న్యాయమూర్తి పదవీకాలం పొడిగింపు విషయంలో ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాజీపడ్డారని కట్జూ చేసిన ఆరోపణలు సంచలనం కలిగించాయి. కట్జూ వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. ఉభయ సభల్లో ఇదే అంశంపై జరిగిన స్వల్పస్థాయి చర్చలో కూడా కట్జూ వ్యాఖ్యలను ప్రభుత్వం కూడా సమర్థించింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులుగా ఉన్న ఆర్.సి. లహోటి, వైకే సబర్వాల్, కేజీ బాలకృష్ణన్ రాజకీయ ఒత్తిడికి తలొగ్గి అసంబద్ధంగా వ్యవహరించారని విమర్శించారు.

కాశ్మీర్‌పై కవిత వ్యాఖ్యలు: దేశవ్యాప్త దుమారం

  అఖండ భారతదేశంలో అంతర్భాతమైన కాశ్మీర్ విషయంలో టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన కొన్ని వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దేశంలోని కొన్ని భాగాలు భారత్‌కు చెందినవి కావని, దీన్ని మనం అంగీకరించాలని కవిత కాశ్మీర్‌ను ఉద్దేశిస్తూ ఇటీవల ఓ చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్రానికి పూర్వం జమ్ము-కాశ్మీర్, హైదరాబాద్ ప్రత్యేక దేశాలని, భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కాశ్మీర్, హైదరాబాద్‌లను బలవంతంగా భారతదేశంలో కలిపారని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జమ్ముకాశ్మీర్‌తో పాటు తెలంగాణలో భూచట్టాలు ఒకేలాగా ఉన్నాయని ఇరుప్రాంతాల్లో స్థానికులు తప్ప ప్రాంతేతరులు భూములు కొనడం నిషిద్ధమని ఆమె అన్నారు. జమ్ముకాశ్మీర్‌పై భారతదేశానికి స్పష్టత రావాలని అవసరమైతే భారత్ అంతర్జాతీయ సరిహద్దుల్ని మార్చుకోవాలని అంటూ కాశ్మీర్‌ను భారత్ వదులుకోవాలన్న అర్థంలో కవిత మాట్లాడారు. కవిత చేసిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ సింఘ్వీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలు దేశ సమగ్రతపైనా, సమాఖ్య చట్టబద్ధతపైనా అనుమానాలు రేకెత్తించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని అన్నారు. వాస్తవాలను వక్రీకరించడం కవితకు తగదని హితవు పలికారు. కవిత వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరమని మరో కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు. ఇలాంటి విపరీత వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ తండ్రయ్యాడు: జాతకచక్రం ఇదిగో..!

  యువ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు మంగళవారం ఉదయం 11 గంటలకు పండంటి మగపిల్లాడు పుట్టాడు. హైదరాబాద్‌లోని రెయిన్ బో హాస్పిటల్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కి పుత్రోదయం అయింది. జూనియర్ ఎన్టీఆర్ కొడుకు జాతక చక్రాన్ని పరిశీలించిన జ్యోతిషులు తండ్రికి తగ్గ కొడుకు పుట్టాడని, నందమూరి వారి నూతన వారసుడు వంశం పేరును నిలబెట్టేవాడు, వంశ ప్రతిష్టను ముందుకు తీసుకెళ్ళేవాడు అవుతాడని చెబుతున్నారు. జ్యోతిషుల అభిప్రాయం ప్రకారం... నందమూరి బుజ్జోడు రోహిణీ నక్షత్రంలో, కన్యాలగ్నం, వృషభరాశిలో, చంద్రమహాదశలో పుట్టాడు. ఈ ముహూర్తంలో పుట్టినవాళ్ళు చాలా అందంగా వుంటారు. మంగళవారం నాడు పుట్టాడు కాబట్టి నందమూరి వంశానికి అలంకారమైన ఆవేశంతోపాటు మంచి ఆశయాలు కూడా కలిగి వుంటాడు. దూకుడును ప్రదర్శించే మంచి శక్తివంతుడు అవుతాడు. ఏదైనా అనుకుంటే సాధించే పట్టుదల కలిగినవాడు అవుతాడు. అలాగే రోహిణీ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ధర్మచింతన వుంటుంది. మంచి లౌక్యం కలిగి వుంటాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నెగ్గుకొచ్చే చాతుర్యం కలిగి వుంటాడు. ఏ రంగంలో అయినా తన ఆధిక్యత నిలుపుకుంటాడు. ఈ జాతకుడికి సాహస క్రీడల పట్ల మక్కువ వుంటుంది. కళారంగంలో మంచి ప్రావీణ్యం, అభినివేశం వుంటాయి. కళారంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. జూనియర్ ఎన్టీఆర్ కొడుకు జాతకం విషయంలో జ్యోతిషులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు చూస్తుంటే, రాబోయే రోజుల్లో కాబోయే స్టార్ పుట్టాడని భావించవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నిర్ణయం తీసుకోలేదు: నారాయణ

  ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గానీ, రాజధాని ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ చెప్పారు. ఢిల్లీలో శివరామకృష్ణన్ కమిటీతో భేటీ అయిన అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని రాష్ట్రంలోని 13 జిల్లాలకు అందుబాటులో వుండేలా వుండాలని, విజయవాడ - గుంటూరు మధ్య నీటి లభ్యత ఎక్కువగా వుందని ఆయన చెప్పారు. అయితే ఈ ప్రాంతంలో రాజధాని విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అంటే రవాణా సదుపాయలు కూడా బాగా వుండాలని, రాష్ట్రంలో నాలుగు జిల్లాలలోని ప్రాంతాలు రాజధాని ఏర్పాటుకు అన్ని విధాలా అనుకూలంగా కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ జిల్లాలు అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉంటాయన్నారు. ఈనెల 26వ తేదీన శివరామకృష్ణన్ కమిటీతో మరోసారి సమావేశం కానున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు.

శ్రీకృష్ణుడి నక్షత్రంలో పుట్టిన ఎన్టీఆర్ వారసుడు!

తెలుగు ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు ఈ రోజు ఉదయం 11 గంటలకు కొడుకు పుట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంలోనూ, అభిమానుల్లోనూ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. వీరి ఆనందానికి మరోక కారణం కూడా వుంది, అదేంటంటే..ఈ వారసుడు శ్రీ కృష్ణ భగవానుడు పుట్టిన రోహిణి నక్షత్రంలో పుట్టాడట. కృష్ణుడి నక్షత్రంలో పుట్టిన ఈ బుజ్జి కృష్ణయ్య తండ్రి సమస్యలను దూరం చేసే అదృష్టాన్ని తీసుకువచ్చాడని అంటున్నారు. అలాగే ఇప్పుడు పుట్టిన ఈ చిన్ని కృష్ణుడికి కూడా ముత్తాత పోలికలు వుంటే ఇక తమ ఆనందానికి అంతే వుండదని నందమూరి వంశాభిమానులు అంటున్నారు.

పరిశ్రమలకు సింగిల్‌ విండో విధానం:కేసీఆర్‌

  హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ ఫ్యాప్సీ, ఫిక్కీ సీఐఐ ప్రతినిధులతో నూతన పారిశ్రామిక విధానంపై చర్చించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్‌ విండో విధానం ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించనున్నట్టు ఆయన తెలిపారు. సీఎం కార్యాలయానికఇనుసంధానంగా ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పూర్తి పారదర్శకంగా నతన పారిశ్రామిక విధానం ఉంటుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు 24 గంటలు విద్యుత్‌ అవసరమని, విద్యుత్‌ సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారని, మంచి పరిశ్రలను ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. తెలంగానలో అవినీతి లేని పాలన అందిస్తామని చెప్పారు.