లార్డ్స్ లో ధోనిసేన ధమాకా

చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో 28ఏళ్ళ తరువాత భారత్‌ జట్టు టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో స్టులో 95 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. భారత పేసర్‌ ఇషాంత్‌ శర్మఅత్యుత్తమ గణంకాలు నమోదు చేసి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్‌ నిర్దేశించిన 319 పరుగుల లక్ష్య చేదనలో ఇంగ్లాండ్‌ ఇశాంత్‌ దెబ్బకు 223 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో రూట్‌(66), ఆలీ(39),కుక్‌(22),బ్యాలెన్స్‌ (27) పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఇశాంత్‌తోపాటు జడేజా, సామీ చెరో విటెక్‌ పడగొట్టారు.దీంతో 28 ఏళ్ల తరువాత లార్డ్‌‌సలో టెస్ట్‌ మ్యాచ్‌ ను గెలిచిన భారత జట్టుగా ధోనీ సేన చరిత్రను తిరగరాసింది.

ఎంసెట్ కౌన్సిలింగ్ కేసు 4కు వాయిదా!

  ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణ కేసు విచారణను వచ్చేనెల 4వ తేదీకి వాయిదా పడింది. ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులకు సమస్యాత్మకంగా పరిణమించిన ఈ కేసును సుప్రీం కోర్టు ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం కౌన్సిలింగ్‌ను అక్టోబర్ నెలాఖరు వరకు వాయిదా వేయాలని భావిస్తోంది. దీన్ని కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ ముఖోపాధ్యాయ, జస్టిస్ బాబ్డేలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాదనను పరిశీలించిన తర్వాత ఈ కేసును ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును తెలంగాణ తరఫున హరీష్ సాల్వే వాదించగా, ఆంధ్రప్రదేశ్ తరఫున గంగూలీ వాదనలు వినిపించారు. ఈ అంశపై ఆంధ్రప్రదేశ్ కౌంటర్ దాఖలు చేయాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది.

నాయిని సారీ చెప్పాల్సిందే: షబ్బీర్

  కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ అంశాన్ని వ్యతిరేకిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం స్టూడెంట్స్ చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు సబబేనని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. తమ హక్కుల సాధన కోసం ఆందోళన చేస్తున్నవారిపై దారుణంగా లాఠీఛార్జ్ చేయటం సరైన పద్ధతి కాదని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. తెలంగాణ విద్యార్థి లోకాన్ని అవమానించే విధంగా మాట్లాడిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తక్షణం విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విద్యార్థులపై లాఠీఛార్జ్ జరగటం బాధాకరమన్నారు.

కుటుంబానికి లక్షన్నర రుణ మాఫీ: చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్‌లో రైతుల రుణమాఫీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఒక్కో రైతు కుటుంబానికి లక్షన్నర రుణ మాఫీ చేయనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. రైతు రుణమాఫీ అంశంపై కోటయ్య కమిటీ నివేదిక తనకు అందిన సందర్భంగా చంద్రబాబు సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. రుణాన్ని తిరిగి చెల్లించిన వారికి, చెల్లించని వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని చంద్రబాబు వెల్లడించారు. రుణమాఫీలో అక్రమాలు జరగకుండా కోటయ్య కమిటీ కొన్ని సూచనలు చేసిందని చంద్రబాబు తెలిపారు. రైతు రుణ మాఫీ కోసం 37,900 కోట్లు అవసరమవుతాయని, ఎఫ్ఆర్‌బిఎం పథకం ద్వారా 25 వేల కోట్ల వరకు నిధులు సమకూర్చుకోవచ్చని చంద్రబాబు చెప్పారు.

ఉస్మానియా విద్యార్థులపై లాఠీఛార్జ్: ఖండన

  తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జిని కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీలు మధుయాష్కీ, వివేక్‌, రాజయ్య, పొన్నం ప్రభాకర్ ఖండించారు. విద్యార్ధుల చేస్తున్నది న్యాయమైన పోరాటమని సమర్థించారు. ఇంటికో ఉద్యోగమన్న హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న నిజాన్ని టీఆర్ఎస్ నాయకులు మర్చిపోరాదని అన్నారు. తమకు ఉద్యోగాలు రావన్న విద్యార్ధుల ఆందోళనపై టీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బియాస్ నది దుర్ఘటన: మృతదేహాలన్నీ లభ్యం!

  హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో గల్లంతైన విఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీకి చెందిన విద్యార్థులందరి మృతదేహాలు లభ్యమయ్యాయి. సోమవారం నాడు కల్లూరి శ్రీహర్ష అనే విద్యార్థి మృతదేహం నదిలో లభ్యం కావడంతో ఈ ప్రమాదంలో చనిపోయిన విద్యార్థుల మృతదేహాలన్నీ లభించినట్టు అధికారులు ప్రకటించారు. కాగా ఆదివారం నాడు గాలింపు చర్యల సందర్భంగా రెండు మృతదేహాలు బయటపడ్డాయి. ఈ మృతదేహాలు కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామానికి చెందిన దాసరి శ్రీనిధి, హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన రిషితారెడ్డివిగా అధికారులు గుర్తించారు. కాగా సోమవారం నాడు గాలింపుల సందర్భంగా కల్లూరి శ్రీహర్ష మ‌తదేహం కూడా లభించినట్టు సమాచారం అందింది. ప్రమాదం జరిగిన 42 రోజులకు మృతదేహాల అన్వేషణ పూర్తయింది.

అంధ బాలలను చావబాదిన ‘అంధుడు’

  కాకినాడలోని గ్రీన్ ఫీల్డ్స్ అంధుల పాఠశాలకు కరస్పాండెంట్‌గా ఒక అంధుడైన కేవీ రావు వున్నాడు. సోమవారం నాడు సదరు కరెస్పాండెంట్ స్కూల్‌లో చదివే పిల్లలను అంధుడు కాని ప్రిన్సిపాల్ సహకారంతో బెత్తంతో దారుణంగా చావబాదాడు. తాను స్వయంగా అంధుడు అయినప్పటికీ అంధ బాలలను దారుణంగా కొట్టడం కెమెరా కంటికి దొరికిపోయింది. అల్లరి చేశారన్న నెపంతో ముగ్గురు అంధ బాలలను బెత్తంతో చావబాదాడు. తనకు కనిపించదు కాబట్టి పిల్లలను ప్రిన్సిపాల్ సహకారంతో బెత్తంతో ఒళ్ళు వాచిపోయేలా చావబాదాడు. ఈ అంశం మీద డీఈవో, మండల విద్యాశాఖాధికారి స్పందించారు. కరస్పాండెంటుపై అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెడతామని తెలిపారు. బాలల హక్కుల కమిషన్కు చెందిన అచ్యుతరావు కూడా ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు. పిల్లలను చావబాదిన కరెస్పాండెంట్, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది.

సీపీఎం రాఘవులు ఉచిత సలహాలు!

  సీపీఎం నాయకులు అధికారంలో వున్నవారికి ఉచిత సలహాలు ఇవ్వడంలో చాలా ముందుంటారు. సీపీఎం నాయకుడు రాఘవులు తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకి కొన్ని ఉచిత సలహాలు ఇచ్చారు.. కొన్ని విమర్శలు చేశారు. ఆ వివరాలు ఇవి...   1. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అలా కురిపించట్లేదేంటి?   2. వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్న తపన అటు చంద్రబాబుకు, ఇటు కేసీఆర్‌కి కనిపించడం లేదు. ఇద్దరూ వివాదాలు కొనసాగాలనే కోరుకుంటున్నారు.   3. రుణమాఫీ చేస్తానని చంద్రబాబు, కేసీఆర్ చెప్పింది ఓట్ల కోసమే తప్ప రైతులకు మేలు చేయాలని కాదు.   4. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఫీజు రీ ఎంబర్స్‌మెంట్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కృష్ణాజలాల విడుదల వంటివి వివాదాలుగా మారాయి.   5. 1956 ముందు ఉన్న వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందనడం సరికాదు.

త్వరగా ఢిల్లీ అసెంబ్లీ రద్దు చేయండి ప్లీజ్: కేజ్రీవాల్

  ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ని కోరారు. అసెంబ్లీని సాధ్యమైనంత త్వరలో రద్దు చేయాలని, లేకపోతే భారతీయ జనతాపార్టీ ఢిల్లీలో అధికారంలోకి రావడానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు డబ్బు ఎరగా వేసే అవకాశం వుందని అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్‌తో భేటీ తర్వాత ఆ వివరాలను కేజ్రీవాల్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తన విజ్ఞప్తికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి సరైన స్పందన లభించలేదని కూడా ఆయన ట్విట్ చేశారు. 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో గత ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ అండతో అధికారాన్ని చేపట్టినా, ఆ అధికారాన్ని నిలుపుకోలేక ప్రభుత్వాన్ని రద్దు చేసింది.

తెలంగాణ‌లో కొత్త మంత్రులెవరు?

  పదకొండు మంది మంత్రివర్గ సహచరులతో కలసి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేసీఆర్‌తో కలసి ఆయన మంత్రివర్గంలో మొత్తం 12 మంది సభ్యులున్నారు. ఒక వారంలో తన మంత్రివర్గాన్ని విస్తరించడానికి కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి తెలంగాణ మంత్రివర్గం విస్తరణలో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని, వారిలో ఒక మహిళ కూడా వుండే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా ఛాన్స్ పొందేదెవరన్న చర్చ తెలంగాణ రాజకీయవర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. ఆరుగురికే అవకాశం ఉన్నప్పటికీ మంత్రిపదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేలందరూ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

రుణమాఫీపై కోటయ్య కమిటీ నివేదిక సమర్పణ!

  రైతుల రుణమాఫీ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోటయ్య కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందజేసింది. బ్యాంకుల నుంచి కమిటీకి పూర్తి సమాచారం అందకపోయినప్పటికీ అందుబాటులో వున్న వివరాలతో కోటయ్య కమిటీ నివేదికను పూర్తి చేసి చంద్రబాబు నాయుడికి అందించింది. మంగళవారం నాడు కోటయ్య కమిటీ నివేదిక ప్రభుత్వానికి సమర్పించాల్సి వుంది. ఒకరోజు ముందే సోమవారం నాడు నివేదిక అందజేసింది. నివేదిక సమర్పించడానికి కమిటీ 45 రోజుల సమయాన్ని తీసుకుంది. రైతులు తీసుకున్న రుణాల విలువ రూ.72 వేల కోట్లు కాగా, ఇందులో వ్యవసాయ రుణాలు రూ.62వేల కోట్లు, డ్వాక్రా, చేనేత రుణాలు రూ.12వేల కోట్లు, బంగారంపై రుణాలు రూ.34వేల కోట్లు, పంటరుణాలు రూ. 26వేల కోట్లుగా కోటయ్య కమిటీ తెలిపింది. రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలను కమిటీ ఈ నివేదికలో పొందుపరిచింది. పంట రుణమైతే లక్షన్నర, బంగారం రుణమైతే 50 వేలు మాఫీ చేయాలని, రుణమాఫీ కోసం ఎర్రచందనం నిల్వల అమ్మమ్మకం, బాండ్లు జారీ చేయడం ద్వారా డబ్బు సమకూర్చుకోవాలని కమిటీ సూచించింది. కుటుంబానికి ఒక్క రుణాన్ని మాఫీ చేయాలని కోటయ్య కమిటీ సిఫారసు చేసినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్ బోనాలు అదుర్స్!

  హైదరాబాద్‌ నగరంలో ఆదివారం నాడు బోనాల ఉత్సవాలు అద్భుతంగా జరిగాయి. పాతబస్తీలోని సింహవాహిని దేవాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అలాగే ప్రభుత్వం తరఫున బంగారు బోనం అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా పలు దేవాలయాలలో అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేవాలయాల వల్ల జరిగిన ఊరేగింపులలో భాగంగా పోతరాజు నాట్య విన్యాసాలు, శివసత్తుల నాట్యం, యువత కేరింతలు, విచిత్ర వేషధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఒకవైపు బోనాలు, మరోవైపు రంజాన్ ప్రార్థనలు.. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.

నిఠారి దోషులకు రాష్ట్రపతి క్షమాబిక్ష నిరాకరణ

  2005-2006 మధ్యకాలంలో పలువురు చిన్నారుల మీద అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన నిఠారీ హత్యల కేసులో దోషులుగా నిరూపణ అయిన ఐదుగురికి మరణశిక్ష ఖరారైంది. తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఈ ఐదుగురూ పిటిషన్ పెట్టుకున్నారు. అయితే ఈ పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. దాంతో వీరికి ఉరి ఖాయమైంది. త్వరలో వీరిని ఉరి తీస్తారు. ఈ కేసులో కోలీతోపాటుగా మహారాష్టక్రు చెందిన అక్కాచెల్లెళ్లు రేణుకాబాయి, సీమా, అదే రాష్ట్రానికి చెందిన రాజేంద్ర ప్రహ్లాద్‌రావు వాస్నిఖ్, మధ్యప్రదేశ్‌కు చెందిన జగదీష్, అసోంకు చెందిన హోలీరామ్ బోర్డోలికి త్వరలో ఉరిశిక్ష అమలు చేయనున్నారు.

‘సాక్షి’ వల్లే జగన్ ఓడిపోయాడట...!

  జగన్‌ని ఎన్నికలలో గెలిపించడానికి ఆయన సొంత మీడియా ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదు. ఆ సంగతి అలా వుంటే జగన్ మీడియా మీద రాజకీయ వర్గాల్లో భారీ స్థాయిలో విమర్శలున్నాయి. అయితే వాటిని జగన్ ఎంతమాత్రం పట్టించుకోరు. తాజాగా జగన్ మీడియా మీద కొత్త విమర్శ వచ్చింది. ‘సాక్షి’ కారణంగానే జగన్ ఓడిపోయాడన్న కామెంట్ వినిపించింది. ఆ కామెంట్ చేసిందే ఏ ఇతర పార్టీ నాయకుడో కాదు.. సాక్షాత్తూ వైసీపీ ఎమ్మెల్యేనే కావడం వెరైటీ. చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాక్షి కారణంగానే జగన్ ఓడిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షి జగన్ పత్రిక కాబట్టి అందులో అన్నీ జగన్‌కి అనుకూలంగా వుండే వార్తలే వస్తూ వుంటాయని, ఇతర పార్టీల నాయకులను అదేపనిగా సాక్షి మీడియాలో తిడుతూ వుంటారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని ఆయన అన్నారు. సాక్షి మీడియా వైసీపీ కరపత్రిక అన్న ముద్ర ప్రజల్లో బలంగా పడటంతోపాటు ఎన్నికల సమయంలో సాక్షి పత్రిక ప్రచురణలు, చానల్‌ ప్రసారాలు జగన్‌తో పాటు తమ పార్టీలో అతి విశ్వాసాన్ని కల్పించాయని అందుకే తమ పార్టీ ఎన్నికలలో ఓడిపోయిందని ఆయన అన్నారు.

వీళ్ళు టీచర్లు కాదు.. కీచకులు!

  టీచర్లే కీచకులై ఆడపిల్లల్ని శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. గురు బ్రహ్మ, గురుర్విష్ణు: గురుదేవో మహేశ్వర: అని గురువుకు అత్యంత ఉన్నతమైన స్థానం మన సమాజం ఇచ్చింది. అయితే కొంతమంది గురువులు మాత్రం ఆడపిల్లల విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారు. అకృత్యాలకు పాల్పడుతున్నారు. నిన్నగాక మొన్న బెంగుళూరులో ఒక స్పోర్ట్స్ టీచర్ ఆరేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అంశం మీద ఇంకా ఆందోళనలు జరుగుతూ వుండగానే అలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతానికి చెందిన ఒక కళాశాల లెక్చరర్ కమ్ డైరెక్టర్ తనపై, మరికొందరు విద్యార్థినులపై అత్యాచారం చేశాడంటూ ఆ కళాశాలకు చెందిన ఒక విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇతని వేధింపులను తట్టుకోలేక గతంలో కొంతమంది విద్యార్థినులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు.