మాసాయిపేట ప్రమాదం: ఆ విద్యార్థి బతికే వున్నాడు!
posted on Jul 25, 2014 @ 12:12PM
మెదక్ జిల్లా మాసాయిపేటలో స్కూలు బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో 16 మంది విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చనిపోయిన విద్యార్థి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అందజేయడంలో జరిగిన పొరపాటు గందరగోళాన్ని సృష్టించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన దత్తు అనే విద్యార్థి మృతదేహాన్ని దర్శన్‌గౌడ్ అనే విద్యార్థి మృతదేహంగా భావించిన వైద్యులు ఆ మృతదేహాన్ని దర్శన్‌గౌడ్ తల్లిదండ్రులకు అప్పగించారు. దర్శన్‌గౌడ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతూ ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే గాయపడిన విద్యార్థులలో ఒక విద్యార్థి స్పృహలోకి వచ్చి, తనపేరు దర్శన్ గౌడ్ అని తన తల్లిదండ్రుల వివరాలను చెప్పడంతో వైద్యులు షాక్ అయ్యారు. దర్శన్ గౌడ్ తల్లిదండ్రులను పిలిపించగా వారు ఎంతో ఆనందంతో ఆస్పత్రికి వచ్చి తమ కుమారుడిని గుర్తించి గుండెలకు హత్తుకున్నారు. చనిపోయాడని భావించి అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత తమ కుమారుడు బతికే ఉండటం చూసి ఆ తల్లిదండ్రుల ఆనందానికి అంతులేకుండా పోయింది. ఇదే సమయంలో వారు అంత్యక్రియలు జరిపిన విద్యార్థి మృతదేహం ఎవరిదని పరిశీలిస్తే అది దత్తు అనే విద్యార్థి మృతదేహంగా తేలింది.