సారీ నట్వర్‌సింగ్ తాతయ్యా: ప్రియాంక
posted on Aug 1, 2014 @ 5:54PM
కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ రాసిన ఆత్మకథ పుస్తకం విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. ఈ పుస్తకం పుణ్యమా అని సోనియా, రాహుల్, ప్రియాంకకి సంబంధించిన అనేక విషయాలు బయటపడ్డాయి. పాపం నట్వర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి పళ్ళూడిపోయే వయసు వచ్చే వరకూ సేవ చేశారు. అయినా ఆయన్ని ఓ కుంభకోణానికి బాధ్యుణ్ణి చేసి బలిపశువుని చేశారు. పాపం నట్వర్ సింగ్ పరిస్థితి ఓడ మల్లయ్య... బోడి మల్లయ్యలా తయారైంది. అయితే ఈమధ్యకాలంలో నట్వర్ సింగ్ తన ఆత్మకథ రాస్తున్నారని, అందులో వివాదాస్పద అంశాలు వుంటాయని అనుమానం వచ్చిన సోనియా ఫ్యామిలీ నట్వర్ సింగ్‌ని కాకా పట్టడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తల్లిని, తమ్ముడిని భుజాన వేసుకుని తిరిగే ప్రియాంక నట్వర్ సింగ్‌కి గతంలో జరిగిపోయినవన్నీ మర్చిపో తాతయ్యా.. అవన్నీ బయటపెట్టకు తాతయ్యా ప్లీజ్ అని సొంత మనవరాలిలాగా గోముతనం ప్రదర్శించినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నో ఢక్కాముక్కీలు తిన్న నట్వర్ సింగ్ ప్రియాంక అభిమానానికి మురిసిపోకుండా తన ఆత్మకథలో అనేక వివాదాస్పద అంశాలు చేర్చి కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని కడిగిపారేసే పనిలో వున్నారు.