ట్యాంక్‌బండ్ మీద విగ్రహాలు తొలగించరాదు... శంకర్రావు

  ట్యాంక్ బండ్ మీద వున్న కొన్ని విగ్రహాలను తొలగించే ఆలోచన వుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు శంకర్ రావు తీవ్రంగా ఖండించారు. ట్యాంక్బండ్పై సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలు అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనటం సరికాదని ఆయన అన్నారు. ఉన్న విగ్రహాలను తొలగించకుండా తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని శంకర్రావు చెప్పారు. ట్యాంక్ బండ్ మీద వున్న సీమాంధ్రుల విగ్రహాలను తొలగిస్తే హైదరాబాద్ ఇమేజ్‌కి విఘాతం జరుగుతుందని శంకర్రావు వ్యాఖ్యానించారు. తెలుగువారి మధ్య ఐక్యత లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు మాట్లాడే ప్రజల మధ్య విద్వేషాలు పెంచడం మంచిది కాదని మాజీ మంత్రి శంక్రరావు అభిప్రాయపడ్డారు.

28 ఏళ్ళ తర్వాత భారత్‌కి స్వర్ణ ‘యోగం’

  భారత్‌కు 28 సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా క్రీడల్లో భారత రెజ్లర్ యోగేశ్వర్ కుమార్ స్వర్ణ పతకాన్ని అందించాడు. పురుషుల 65 కిలోల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో అతను తజకిస్తాన్ రెజ్లర్ జలీంఖాన్ యుసుపోవ్‌ను 3-0 తేడాతో చిత్తుచేసి, చిరస్మరణీయ టైటిల్‌ను అందుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన యోగేశ్వర్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌ను ప్రదర్శించడంతో యుసుపోవ్ అతనికి ఏ దశలోనూ గట్టిపోటీని ఇవ్వలేకపోయాడు. 1986 సియోల్ ఆసియా క్రీడల్లో కర్తార్ సింగ్ స్వర్ణ పతకం సాధించాడు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత భారత్‌కు మరో స్వర్ణాన్ని యోగేశ్వర్ అందించాడు. 2006 ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించిన యోగేశ్వర్  ఈసారి విజేతగా స్వర్ణ విజేతగా నిలిచాడు.

ఔటర్ రింగ్‌రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

  ఔటర్ రింగ్ రోడ్డు మీద శంషాబాద్ ప్రాంతంలో జరిగిన జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగివున్న లారీని... కారు (ఏపీ 16 టీఎల్ 5252) వెనకనుంచి వేగంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్నవారిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళతో పాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరందరూ విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా శంషాబాద్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ ఎక్సయిజ్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న  సత్యనారాయణ అనే వ్యక్తి కుటుంబం ఈ కారులో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో సత్యనారాయణ భార్య, ఒక కుమార్తె, బావమరిది మరణించగా, సత్యనారాయణతోపాటు మరో కుమార్తె పరిస్థితి విషమంగా వుంది.

బీజేపీ ఎమ్మెల్యేకి పోలీసుల నోటీసులు.. అభ్యంతరకర వ్యాఖ్యలు..

  హైదరాబాద్ గోషామహల్ బీజేజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి పోలీసు శాఖ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అభ్యంతరకర ఉపన్యాసం చేశారనే అభియోగంతో గోషామహల్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసు జారీ అయ్యింది. రాజాసింగ్‌కు ముందుగా నోటీసు జారీ అయింది. కొద్దిరోజుల క్రితం గోషామహల్ నియోజకవర్గ అభివృద్ది కార్యాలయం వద్ద రాజాసింగ్ ప్రసంగిస్తూ దాండియా ఉత్సవంలో హిందువులు కాని వారిని అనుమతించరాదని ఉత్సవ సంఘాలకు ఆయన సూచించారన్నది ఆయన మీద ఉన్న ఆరోపణ. అయితే ఇది అభ్యంతరకరమని, వివిధ వర్గాల మధ్య ద్వేషాలు పురికొల్పే అవకాశం ఉందని పోలీసులు భావించి, దీనిపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ని పోలీసులు కోరారు.

టీఆర్ఎస్‌లోకి తీగల, సాయన్న అంటూ జగన్ మీడియా ప్రచారం

  ఆంధ్రప్రదేశ్‌లో అధికారం దక్కించుకోలేకపోయిన జగన్ పార్టీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలని ప్రయత్నిస్తోంది. పలువురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం చేస్తోంది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం చేస్తోంది. అయినప్పటికీ ఆయన చేరుతున్న దాఖలాలు కనిపించడం లేదు. అలాగే ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు... మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే సాయన్న టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని ప్రచారం చేస్తోంది. ఇక్కడ ఇలా ప్రచారం చేస్తున్న జగన్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఎంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేయడానికి సిద్ధంగా వున్నారో లెక్కలు వేసుకోవడం మరచిపోయినట్టుంది.

మాడిసన్ స్క్వేర్‌ గార్డెన్‌లో మోడీ నామస్మరణ

  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూయార్క్‌లోని మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌ వద్ద నిర్వహించిన ప్రవాస భారతీయ సభ విజయవంతమైంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సెలబ్రిటీల షోస్‌కు, సభలకు వేదిక! అలాంటి చోట భారత ప్రధానమంత్రి హోదాలో ఒక రాజకీయ నేతగా నరేంద్ర మోడీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో సుమారు దాదాపు 20 వేల మంది ఎన్నారైలతో పాటు.. అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల సభ సభ్యులు కూడా పాల్గొన్నారు. మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో మోడీ సభకు అవుతున్న ఖర్చు.. 15 లక్షల డాలర్లు. అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు. అమెరికాలోని ప్రవాస భారతీయులు, భారతీయ - అమెరికన్ల నుంచి ఈ మొత్తాన్ని విరాళాలుగా వసూలు చేసి ఈ సభను నిర్వహించారు. న్యూయార్క్‌ వీధుల్లో భారతీయం ప్రతిధ్వనించింది. భారత్‌మాతాకీ జై, మోడీ జిందాబాద్‌, హర హర మోడీ వంటి నినాదాలతో మాడిసన్‌ స్క్వేర్‌ మార్మోగిపోయింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హెచ్.ఎల్.దత్తు ప్రమాణం

  భారత సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హెచ్.ఎల్. దత్తు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 14 నెలలపాటు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగే 63 సంవత్సరాల దత్తు ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరికంటే సీనియర్. ఈయన 2015 డిసెంబర్ 2వ తేదీ వరకు సీజేగా కొనసాగుతారు. దత్తు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఈ స్వల్ప కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ టి.జె.కురియన్, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, రవిశంకర్ ప్రసాద్, వెంకయ్య నాయుడు, బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ, విపక్ష పార్టీ తరపున కాంగ్రెస్ నేతలు అభిషేక్ సింఘ్వీ, రాజీవ్ శుక్లాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

తమిళనాడు కొత్త సీఎం పన్నీరు సెల్వం.. పాత మంత్రులే వుంటారు..

  తమిళనాడు కొత్త సీఎంగా అన్నాడీఎంకే కోశాధికారి, ఆ రాష్ట్ర ప్రజాపనుల శాఖామంత్రి ఒ.పన్నీర్ సెల్వం ఎంపికయ్యారు. ఆయన సోమవారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్ కె రోశయ్య నుంచి పన్నీరు సెల్వానికి ఆహ్వానం అందింది. తమిళనాడులో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని ఏఐఏడీఎంకే శాసనసభాపక్ష నేత పన్నీర్ సెల్వంకు ఆ రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆహ్వానం పంపారు. దీంతో, తమిళనాడులో సోమవారం కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలుశిక్ష పడటంతో ఆమె ముఖ్యమంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోయారు. ఫలితంగా ఆమె స్థానంలో కొత్త వారసుడి ఎంపిక జయలలిత ఆదేశం మేరకు ఆదివారం రాయపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఇందులో జయలలిత సూచన మేరకు.. తన వీరవిధేయుడు, మంత్రి పన్నీర్ సెల్వంను ఏడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.పన్నీరు సెల్వం మంత్రివర్గంలో కూడా జయ మంత్రివర్గంలోని మంత్రులే కొనసాగుతారని తెలుస్తోంది.

ప్రవాస భారతీయులకు లైఫ్‌లాంగ్ వీసాలు.. మోడీ

  ప్రవాస భారతీయులకు భారత మోడీ వరాలు ప్రకటించారు. ప్రవాస భారతీయులకు జీవితకాలం వీసాలు ఇస్తానని మోడీ ఈ సందర్భంగా ప్రకటించారు. భారత సంతతికి చెందినవారు పోలీసులకు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. అమెరికాలోని భారత యంత్రాంగాలు అమెరికా పౌరులకు దీర్ఘకాలిక వీసాలను ఇస్తాయని, భారతదేశం వచ్చిన తర్వాత అమెరికా పర్యాటకులకు వీసాలు ఇస్తామని ఆయన చెప్పారు. ఆన్‌లైన్ వీసాల విధానాన్ని ప్రవేశపెడుతామని, ప్రస్తుత సమస్యలను పరిష్కరించడానికి వీసా ఔట్‌సోర్సింగ్‌ను విస్తరిస్తామని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రవాస భారతీయులు భారతదేశంపై ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారని, భారతదేశంలో కూడా ప్రజలు ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ప్రజల కలలను, ఆకాంక్షలను అన్నిటినీ తన హయాంలోనే నెరవేరుస్తామని హామీ ఇస్తున్నానని ప్రధాని మోడీ అన్నారు.

జయలలిత బెయిల్ పిటిషన్ దాఖలు.. రాంజెఠ్మలానీ లాయర్..

  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష, జరిమానా పడిన జయలలిత ఈరోజు నాడు కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం నుంచి ఈ నెల ఆరో తేదీ వరకూ హైకోర్టుకు దసరా సెలవుల నేపథ్యంలో జయలలిత తరఫున వాదిస్తున్న న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని పిటిషన్లో కోరారు. ఇదిలా వుంటే ఈ బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణకు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ పిటిషన్‌పై జయలలిత తరఫున ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ వాదించనున్నట్టు తెలుస్తోంది.

జయ తర్వాత జైలుకు జగన్...

  అక్రమ ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రికి నాలుగేళ్ళ జైలుశిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధించిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి వైసీపీ నేత జగన్ మీద పడింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీడీపీ నాయకులు జగన్ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. 66 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు వున్నందుకు జయకు నాలుగేళ్ళ జైలుశిక్ష పడిందని, మరి వేలాది కోట్ల అక్రమ ఆస్తులు వున్న జగన్‌కి ఎన్నాళ్ళు జైలు శిక్ష పడుతుందో ఊహించుకోవచ్చని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. భవిష్యత్తులో జగన్‌ కూడా జైలుకు వెళ్ళక తప్పదని ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు.

తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలి

  తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ నాయకుడు, న్యాయ కోవిదుడు సుబ్రహ్మణ్యం స్వామి అభిప్రాయపడ్డారు. ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో జయలలితకు నాలుగేళ్ళ జైలు, ఆమె సహచరులు నలుగురితో కలిపి వంద కోట్ల జరిమానా బెంగుళూరు ప్రత్యేక కోర్టు విధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో తమిళనాడులో కనీసం నాలుగు నెలలపాటు రాష్ట్రపతి పాలన విధించడమే న్యాయమని, లేకపోతే అరాచకశక్తులు తమిళనాడులో అల్లర్లు సృష్టించే ప్రమాదం వుందని ఆయన అన్నారు. జయలలిత మీద సుబ్రహ్మణ్య స్వామి వేసిన కేసు ఫలితంగానే ఆమెకు జైలు ప్రాప్తించింది. కాగా, జయలలితకు కోర్టు దోషిగా నిర్ధారించి శిక్ష విధించినందుకు నిరసనగా పలువురు అన్నా డీఎంకే పార్టీ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి ఇంటి మీద రాళ్ళు విసిరారు.

జయమ్మ కథ చివరికి జైలుకి

  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను దోషిగా నిర్ధారించిన బెంగళూరు ప్రత్యేక కోర్టు శనివారం ఐదు గంటల ప్రాంతంలో జయలలితకు, ఆమె సన్నిహితులు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు నాలుగేళ్ళ జైలు శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో జయలలిత తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో మొదట ముఖ్యమంత్రి జయలలితకు కనీసం ఏడేళ్ళ జైలు శిక్ష పడుతుందని అనుకున్నారు. అయితే ప్రత్యేక కోర్టు ఆ శిక్షను నాలుగేళ్ళకు పరిమితం చేసింది. జయలలితకు నాలుగేళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పగానే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.జయలలితను కోర్టు నుంచే జైలుకు తరలించే అవకాశం వుంది.

పని మానేసి పండగలేంటి భై?

  తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతిరోజూ బతుకమ్మ ఆడాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద తెలంగాణ బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం పనిచేయడం మానేసి పండుగలు చేస్తోందని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రైతులు దసరా పండుగ చేసుకునే స్థితిలో లేరని ఆయన అన్నారు. విద్యుత్ సమస్య కారణంగా రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు పడుతోందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసలు పరిపాలన అనేదే కనిపించడం లేదని చెప్పారు. నాలుగు నెలల పాలనలో ఒక రూపాయి విలువైన కరెంటు అయినా రాష్ట్ర ప్రభుత్వం కొన్నదా అని నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే ప్రభుత్వ కార్యాలయాల్లో బతుకమ్మ పండుగ జరుపుతున్నారని నాగం విమర్శించారు.

జయ స్నేహితురాలు శశికళ కూడా దోషే..

  జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె స్నేహితురాలు శశికళను కూడా బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్థారించింది. వీరిద్దరితో పాటు జయలలిత పెంపుడు కుమారుడు సుధాకరన్, ఇళవరసిలు కూడా దోషులుగా తేలారు. పురచ్చితలైవిగా, అమ్మగా పేరొందిన జయలలిత 1991లో తొలిసారి తమిళనాడు సీఎంగా ఎన్నికయ్యారు. 43 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన జయలలిత 1996 ఎన్నికల్లో ఓడిపోయారు. అధికారంలో ఉన్న సమయంలో జయలలిత భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో అప్పటి జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి జయలలితపై ఫిర్యాదు చేశారు.

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం?

  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా ఖరారైన జయలలితకు నాలుగేళ్ళ జైలు శిక్ష పడిన నేపథ్యంలో ఆమె తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వుంటుంది. రెండేళ్ళకు మించి శిక్ష పడినందున తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో జయలలిత ఇలాగే ఓ కేసులో ఇరుక్కుపోతే తన వీర విధేయుడు పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెట్టారు. ఇప్పుడు ఆయన తమిళనాడు ఆర్థికమంత్రి పదవిలో వున్నారు. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం మీద పన్నీరు సెల్వం కూర్చునే అవకాశం వుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్న ప్రతిపక్ష డీఎంకే స్పందించింది. తమిళనాడు అసెంబ్లీ రద్దు కావాలని తాము కోరుకోవడం లేదని, అలాగే తమిళనాడులో రాష్ట్రపతి పాలన రావాలని కూడా కోరుకోవడం లేదని డీఎంకే వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.