జయలలితకు మద్దతు.. కడుపు మాడ్చుకున్న తమిళ సినిమా

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అభిశంసనకు గురయ్యారు. ఆమెకు కోర్టు నాలుగేళ్ళ జైలు శిక్ష, వంద కోట్ల జరిమానా విధించింది. అయితే తమిళనాడులోని చాలామంది ప్రజలు మాత్రం ఆమెకు అన్యాయంగా శిక్ష వేశారనే భావిస్తున్నారు. ముఖ్యంగా తమిళ సినిమా రంగం జయలలితకు వచ్చిన కష్టాలు చూసి తల్లడిల్లిపోతోంది. అందుకే తమిళనాడులోని పలువురు చలనచిత్ర నటులు,టీవీ నటులు నిరాహార దీక్షకు దిగారు. జయలలితకు జైలు శిక్ష వేయడాన్ని నిరసిస్తూ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. మరోవైపు తమిళనాడులో సినిమా థియేటర్ల బంద్‌కి ఎగ్జిబిటర్ల సంఘం పిలుపు ఇవ్వడంతో రాష్ట్రంలో థియేటర్లు మూతపడ్డాయి.

బాయ్‌ఫ్రెండ్ వేధింపులు.. మోడల్ ఆత్మహత్య

  ప్రముఖ మోడల్ అర్చనా పాండే (26) ముంబైలోని తన ఫ్లాట్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వాళ్లకు ఆమె ఇంటినుంచి దుర్వాసన రావడంతో వాళ్లు పోలీసులకు చెప్పగా విషయం బయటపడింది. రెండు రోజుల క్రితమే అర్చనా పాండే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ముంబై వెర్సోవా ప్రాంతంలోని న్యూ మహాడా కాలనీలోని ఓ అపార్టుమెంట్ 12వ అంతస్థులో అర్చనా పాండే ఫ్లాట్ వుంది. తన ఫ్లాట్‌లో బెడ్ రూంలో వున్న సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని అర్చనా పాండే ఆత్మహత్య చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్ ఒమర్ పఠాన్ తీవ్రమైన వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని అర్చనా పాండే సూసైడ్ నోట్‌లో తెలిపింది.

భార్య ముక్కు, చెవులు కోసిన మగ మృగం

  ఎప్పుడో త్రేతాయుగంలో రామాయణంలో శూర్పణఖ ముక్కుచెవులు కోశారని చదువుకున్నాం. ఈ కలియుగంలో కూడా అలాంటి సంఘటన జరిగింది. అయితే అలా ముక్కుచెవులు కోయించుకుంది శూర్పణఖ కాదు.. కోసింది రామలక్ష్మణులు కాదు.. కట్టుకున్న భార్య ముక్కుచెవులు ముదనష్టపు భర్తగారు కోసేశారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలంలోని గొల్లబుద్ధారం గ్రామానికి చెందిన రజిత అనే మహిళ ముక్కు, కుడి చెవిని ఆమె భర్త శ్రీనివాస్ సోమవారం రాత్రి కోసేశాడు. ఆ తర్వాత ముక్కును, చెవిని తీసుకుని వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు శ్రీనివాస్‌ని అరెస్టు చేశారు. తీవ్రంగా గాయపడిన రజితని ఆస్పత్రికి తరలించారు.

మోడీ, ఒబామా భేటీ.. గుజరాతీలో పలకరింపు

  అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీని పలుకరించేందుకు ఆ దేశ అధ్యక్షుడు ఒబామా స్వయంగా గుజరాతీ భాషను నేర్చుకున్నారు. సోమవారం మోడీకి ఇచ్చిన విందు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మోడీతో భేటీ కోసం నెలల తరబడి వేచి చూస్తున్న ఒబామా, విందు సందర్భంగా మోడీని గుజరాతీ భాషలో పలుకరించారు. ‘‘కెమ్ ఛో (ఎలా ఉన్నారు)’’ అంటూ మోడీని పలుకరించిన ఒబామా అక్కడి వారందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. దానికి మోడీ స్పందించి ‘థాంక్యూ’ అన్నారు. విందులో భాగంగా ఒబామాతో పాటు ఆ దేశ ఉపాధ్యక్షుడు జో బిడెన్, విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ, జాతీయ భద్రతా సలహాదారు సుసాన్ రైస్ హాజరు కాగా, మోడీ వెంట భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికాలో భారత రాయబారి జై శంకర్ ఉన్నారు.

హేమంత్ కర్కరే భార్య మృతి.. బ్రెయిన్ డెడ్

  2008 సంవత్సరంలో ముంబైపై జరిగిన 26/11 ఉగ్రవాద దాడిలో ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటిఎస్) చీఫ్ దివంగత హేమంత్ కర్కరే భార్య కవిత మెదడులో రక్తసావ్రం (బ్రెయిన్ హెమరేజ్)తో బాధపడుతూ బ్రెయిన్ డెడ్ అయి ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో సోమవారం మరణించారు. తన భర్త మృతి చెందినప్పటి నుంచి నుంచి బాగా కుంగిపోయిన కవిత.. ముంబైలోని ఒక కాలేజీలో అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా మెదడులో రక్తస్రావంతో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం తన నివాసంలో అపస్మారక స్థితిలో పడిపోయిన కవితను హుటాహుటిన హిందూజా ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు కవిత కర్కరే బ్రెయిన్ డెడ్ అయినట్టు ప్రకటించారు. కర్కరే దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారు జీవితంలో స్థిరపడ్డారు. కవితా కర్కరే మరణానంతరం తన అవయవాలను వైద్య పరిశోధనలకు వినియోగించాలని కోరేవారు.

బండ్ల గణేష్ చంపుతానన్నాడట.. కేసు...

  సినీ నిర్మాత బండ్ల గణేష్ మీద చీటింగ్ కేసు నమోదైంది. ‘గబ్బర్ సింగ్’ సినిమా హక్కులు ఇచ్చే విషయమై సినీ నిర్మాత బండ్ల గణేష్ తనను మోసం చేశారని ధర్మచరణ్ అనే ఫైనాన్సియర్ సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గణేష్ మీద చీటింగ్ కేసు నమోదైంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గబ్బర్‌సింగ్ చిత్రం ఆంధ్రా ఏరియా హక్కుల కోసం గుంటూరుకు చెందిన ఫైనాన్సియర్ ధర్మచరణ్ తులసీ 2011లో రూ.80 లక్షలను ఆ సినిమా నిర్మాత గణేశ్‌కు చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే బండ్ల గణేష్ ఆ సినిమా హక్కులు ధర్మచరణ్‌కు కాకుండా మరొకరికి విక్రయించాడు. ఒప్పందాన్ని ఉల్లంఘించి సినిమా రైట్స్‌ను మరొకరికి విక్రయించినందున తన డబ్బులు తిరిగివ్వాలని బాధిత ఫైనాన్సియర్ ఎన్నిసార్లు అడిగినా బండ్ల గణేష్ ఎంతమాత్రం స్పందించలేదు. తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వకపోగా తనను చంపుతానని బెదిరిస్తున్నాడని ఆ ఫైనాన్షియర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దాంతో బండ్ల గణేష్ మీద పోలీసులు బండ్ల గణేష్ మీద ఐపీసీ సెక్షన్ 420, 406, 506 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న బండ్ల గణేష్ ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందం గాలింపు చర్యలు చేపట్టింది.

ఆంధ్రప్రదేశ్‌లో జన్మభూమి: బదిలీలపై నిషేధం

  జన్మభూమి కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల బదిలీలపై నిషేధం విధించారు. అక్టోబర్ 10 వరకు ఉన్న బదిలీల సడలింపును అక్టోబర్ 30వ తేదీవరకు పొడిగించారు. జన్మభూమి కార్యక్రమం సందర్భంగా కొంతకాలాన్ని ప్రభుత్వం నిషేధపు కాలంగా ప్రకటించింది. జన్మభూమి ప్రారంభమయ్యే అక్టోబర్ రెండో తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు బదిలీలపై నిషేధం అమలులో ఉంటుంది. మళ్లీ అక్టోబర్ 21 నుంచి 30వ తేదీవరకు ఆ నిషేధాన్ని సడలిస్తారు. జన్మభూమి కార్యక్రమం అమలులో ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు బదిలీలపై నిషేధాన్ని అమలు చేయాలని అనేక జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

బాల్యంలోనే ప్రతిభని గుర్తించి ప్రోత్సహించాలి: సచిన్

  పిల్లలలోని క్రీడా ప్రతిభను వారి చిన్నతనంలోనే గుర్తించి ప్రోత్సహించాలని సచిన్ టెండూల్కర్ అన్నారు. అయితే భారతదేశంలో అలాంటి వ్యవస్థ లేకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐ ఎస్‌ఎల్‌) ఫ్రాంచైజీ కేరళ బ్లాస్టర్స్‌కు సహ యజమాని అయిన సచిన్‌ టెండూల్కర్ ఆ జట్టు జెర్సీలను విడుదల చేయడానికి సోమవారం కోచి వచ్చాడు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ ‘‘చాలా దేశాలలో క్రీడాకారులను చిన్నవయస్సులోనే గుర్తించి, వారికి తగిన శిక్షణ ఇస్తారు. కానీ మన దేశంలో వారు యుక్తవయస్సుకు వచ్చాకే ఈ ప్రక్రియ మొదలవుతుంది. దాంతో వారు ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు వీలుండడంలేద’’ని తెలిపాడు. తాము స్థానిక ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తామని సచిన్ టెండూల్కర్ చెప్పాడు.

ఎర్రబెల్లి, కడియం గొడవపడ్డారు

  వరంగల్ జిల్లా జడ్.పి. సర్వసభ్య సమావేశంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నువ్వానేనా అంటూ పోటాపోటీగా విమర్శించుకున్నారు. ఎరువుల కొరతపై చర్చ విషయంలో... ఎంపీ కడియం, ఎర్రబెల్లి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టిఆర్ఎస్ పార్టీలో చేరతానని తనకు ఫోన్ చేయలేదా? అని కడియం శ్రీహరి.. ఎర్రబెల్లిని ప్రశ్నించగా, ఆ విషయాలకు ఇది వేదిక కాదని ఎర్రబెల్లి అన్నారు. ఇటీవల తెలంగాణ సీఎం కెసిఆర్‌ను ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎర్రబెల్లి తాను టిడిపిలోనే కొనసాగుతానని తేల్చి చెప్పిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ళ

  మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) సత్య నాదెళ్ల సోమవారం హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌కు(ఎంఐడీసీ) వచ్చారు. మైక్రోసాఫ్ట్ అధికార బృందంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అలాగే ఆదివారం నాడు ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిశారు. సోమవారం ఎంఐడీసీ అంతర్గత సమావేశంలో ఉద్యోగులను ఉద్దేశించి చేసిన కీలకోపన్యాసంలో భవిష్యత్ దిశానిర్దేశం చేశారు. కంపెనీని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై తన అభిప్రాయాలను మైక్రోసాఫ్ట్ ఉద్యోగులతో సత్య నాదెళ్ళ పంచుకున్నారు. మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సత్య నాదెళ్ళ హైదరాబాద్‌కి రావడం ఇదే తొలిసారి. అలాగే మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌‌కి రావడం కూడా ఇదే మొదటిసారి.

హీరోయిన్ నగ్న ఫొటోలు.. ప్రచారంలో..

  పాపం హాలీవుడ్ హీరోయిన్లు తమమీద తామే ముచ్చటపడి తమ నగ్నంగా ఫొటోలు దిగుతూ వాటిని తమ పర్సనల్ కంప్యూటర్లలో పెడుతున్నారు. హ్యాకర్లు ఎంచక్కా ఆ కంప్యూటర్లని హ్యాక్ చేసి ఫొటోలను బయట పెట్టేస్తున్నారు. హాలీవుడ్‌లో ఈమధ్యకాలంలో ఇలా హీరోయిన్ల నగ్న చిత్రాలు బయటపడటం చాలా మామూలైపోయింది. ఇప్పటికే జెన్నిఫర్ లారెన్స్, రిహానా లాంటి హాలీవుడ్ స్టార్ల నగ్న చిత్రాలను హ్యాకర్లు బయటపెట్టేశారు. తాజాగా మరో హాలీవుడ్ తార హ్యాకర్ల దాడిలో దొరికిపోయింది. హాలీవుడ్ హీరోయిన్, మోడల్ కారా డెలెవింగ్నే కంప్యూటర్ని హ్యాక్ చేసి ఆమె నగ్న ఫోటోలను హ్యాకర్లు బయటకు లీక్ చేశారు.

ఐటీ సీఇఓల సదస్సులో పలు ఒప్పందాలు

  విశాఖపట్టణంలో జరుగుతున్న ఐటీ కంపెనీల సీఇఓల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వానికి - విప్రో, టెక్ మహీంద్రా, సమీర్ తదితర సంస్థలతో కీలకమైన ఒప్పందాలు జరిగాయి. 400 కంపెనీల నుంచి ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు బాలకృష్ణన్ హాజరయ్యారు. మధురవాడ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ అభివృద్ధికి అవగాహన ఒప్పందం, మధురవాడ ఐటీ సెంటర్ అభివృద్ధికి మాబ్ ఎంఈ / స్టార్ట్ అప్ విలేజ్‌తోతో ఒప్పందం, చిరు వ్యాపారులు, మహిళలు ఇంటర్నెట్ ద్వారా లబ్ధి పొందేందుకు వీలుగా గూగుల్ సాయం, డిజిటల్ ఎ.పి. ప్రాజెక్టులో భాగంగా గూగుల్ ఇండియాతో అవగాహన ఒప్పందం వంటి ఒప్పందాలు ఈ సదస్సులో జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ఐటీ సలహాదారు సత్యనారాయణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే శక్తి చంద్రబాబుకు ఉందని అన్నారు.

కేంద్రమంత్రి అనంత్ గీతే రాజీనామా వదంతులు...

  నరేంద్రమోడీ మంత్రివర్గంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా వున్న శివసేనకు చెందిన ఎంపీ అనంత గీత రాజీనామా చేశారన్న వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రంలో శివసేన - బీజేపీ పొత్తు చిత్తయిన నేపథ్యంలో అనంత గీతే తన పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని శివసేన అధినేత అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. అయితే, అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కేంద్రమంత్రి అనంత్ గీతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే జాతీయ మీడియాలో మాత్రం అనంత్ గీతే రాజీనామా చేశారంటూ ప్రచారం సాగుతోంది.

చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ ఐటీ రంగం ముందడుగు: ఆబ్జెక్ట్‌వన్ ఎం.డి. కంఠంనేని రవిశంకర్

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేసిన నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో కూడా ముందడుగు వేయించడానికి కృషిని ప్రారంభించారు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ స్థాయి ఐటీ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యాలయాలను ప్రారంభించడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాడు విశాఖపట్టణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐటీ కంపెనీల సీఇఓల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆబ్జెక్ట్‌వన్, తెలుగువన్, టోరీ ఇంటర్నెట్ రేడియో సంస్థల వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్, ఐటీ రంగ ప్రముఖుడు కంఠంనేని రవిశంకర్ పాల్గొన్నారు. ఐటీ సంస్థల అధిపతిగా ఈ సదస్సులో అగ్రతాంబూలం అందుకుంటూ మొదటగా మాట్లాడిన కంఠంనేని రవిశంకర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీరంగం ముందడుగు వేస్తుందన్న సంపూర్ణ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఐటీ రంగంలో ఏపీలో భవిష్యత్తులో ఎన్నో లక్షల మందికి మంచి అవకాశాలు లభించే అవకాశం వుందని అన్నారు. ఆబ్జెక్ట్‌వన్, తెలుగువన్ తదితర సంస్థల ద్వారా ఐటీ రంగంలో ఎన్నో విజయాలను సాధించి, ఎన్నో వేల మందికి మంచి ఉద్యోగ అవకాశాలను కల్పించిన తాను ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం అద్భుతమైన అభివృద్ధి చెందడానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప(క)న్నీరు సెల్వం ప్రమాణం..

   తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ రోశయ్య రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి పదవిని అధిష్టించటం ఇది రెండోసారి. 2001లో జయ జైలుకు వెళ్లిన ఇటువంటి పరిస్థితుల్లోనే పన్నీరు సెల్వం సీఎం బాధ్యతలు చేపట్టారు. తమిళనాడులో రాజకీయంగా పలుకుబడి ఉన్న దేవర్ కులం నుంచి సీఎం పీఠాన్ని అధిరోహించిన తొలివ్యక్తిగా పన్నీర్ రికార్డు సృష్టించారు. అయితే ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో పన్నీరు సెల్వం భావోద్వేగంతో కంటతది  పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తుందని ఆయన ఊహించకపోవడం వల్ల కన్నీరు పెట్టుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జయలలిత కేసు తీర్పు సందర్భంగా కూడా పన్నీరు సెల్వం కన్నీరు పెట్టుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు కూడా కన్నీరు పెట్టుకున్నారు.