గోవిందుడు అందరివాడేలే: షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ

  తారాగణం: రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, కాశీ విశ్వనాథ్, సమీర్, కాదంబరి కిరణ్ తదితరులు.   సాంకేతికవర్గం: కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: యువన్ శంకర్ రాజా, రచన: పరుచూరి బ్రదర్స్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: క‌ృష్ణవంశీ.   అటు రామ్‌చరణ్ అభిమానులు, ఇటు కృష్ణవంశీ అభిమానులు ఎంతో ఎదురుచూస్తు్న్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా విడుదలైంది. ఇది ఒక కుటుంబ కథా చిత్రం. లండన్‌లో పుట్టి పెరిగిన ఒక యువకుడు తన వంశ మూలాలను వెతుక్కుంటూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక తెలుగు గ్రామానికి వచ్చి, విడిపోయిన తన కుటుంబాన్ని ఎలా కలిపాడన్నది కథాంశం. క‌ృష్ణవంశీ మార్కు ఫ్యామిలీ అంశాలతోపాటు, రామ్‌చరణ్ మార్క్ యాక్షన్ కూడా పుష్కలంగా వున్న సినిమా. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కలర్ ఫుల్‌గా వుంది. సరికొత్త రామ్‌చరణ్ కనిపించాడు. సినిమాలో అక్కడక్కడా పాత సినిమాల ఛాయలు వున్నప్పటికీ వాటిని కొత్తగా చూపించాడు. రామ్‌చరణ్, కాజల్‌జంట బాగుంది. వీళ్ళిద్దరి మధ్య విరసాలు, సరసాలు వర్కవుట్ అయ్యాయి. రామ్‌చరణ్ - ప్రకాష్ రాజ్, రామ్‌చరణ్ - జయసుధ, రామ్‌చరణ్ - శ్రీకాంత్‌ మధ్య సన్నివేశాలు బాగున్నాయి. ప్రకాష్ రాజ్ - జయసుధ మరోసారి తమ నట విశ్వరూపం చూపించారు. మన కుటుంబాన్ని మనమే కలుపుకోవాని చెప్పే కథతో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గోవిందుడు అందరివాడేలే. పేరుకు తగ్గట్టుగా అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చేలా వున్న ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా.

తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏపీలో ప్రతిష్టిస్తాం: చంద్రబాబు

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్యాంక్ బండ్ మీద వున్న తెలుగు మహనీయుల విగ్రహాలను పీకేసీ లారీలో వేసి ఆంధ్రప్రదేశ్‌కి పంపుతానని అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఈ వ్యాఖ్యలకు మంచి సమాధానం చెప్పారు. తెలుగుజాతి గర్వించదగ్గ తెలంగాణ మహనీయుల విగ్రహాలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టిస్తామని అన్నారు. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను తొలగిస్తానని కేసీఆర్ అనడం సమంజసంగా లేదని చెప్పారు. మంగళవారం నాడు చంద్రబాబు నాయుడు ఎలక్ట్రానిక్ మీడియా సంపాదకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలు.   * రైతుల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి వుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రుణ మాఫీ చేసి తీరుతాం.   * నాదెళ్ళ సత్యకి ఆంధ్రప్రదేశ్ విధానాలు బాగా నచ్చాయి.   * ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఏ మీడియాకీ మేం అభ్యంతరం తెలుపలేదు.   * రాజకీయ పార్టీలకు పేపర్లు, టీవీలు వుండటం సబబు కాదు.   * పార్టీల కోసం అవినీతి సొమ్ముతో పేపర్లు, టీవీలు పెట్టడమేమిటి? అలా పెట్టినా ఎంత దుష్ప్రచారం చేసినా ఎన్నికలలో గెలవలేకపోయారు.   * ఆంధ్ర ప్రదేశ్‌కి ఏ పరిశ్రమ వచ్చినా మేం సిద్ధం. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తాం.   * కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై నేను స్పందించను.   * తెలంగాణలో అన్ని సమస్యలకూ నేనే కారణం అని చెప్పడం సరికాదు. ఎరువుల సమస్యకు కూడా నేనే కారణమా? ప్రజలు మాటలను నమ్మరు.. చేతలను నమ్ముతారు.

నన్ను మోసం చేశాడు బాబోయ్

  హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కి ఓ యువతి వచ్చింది. తనను ఓ యువకుడు మోసం చేశాడు బాబోయ్ అని కంప్లయింట్ చేసి, అతని వివరాలు పోలీసులకు ఇచ్చింది. ఈ కథనం అంతా చదివిన తర్వాత ఎవరు మోసం చేశారు.. ఎవరు మోసపోయారు.. అసలు మోసం అంటే ఏమిటి? మోసం చేయకుండా నీతిగా వుండటం ఏమిటి అనే అంశాన్ని గౌరవనీయులైన పాఠకులే ఆలోచిస్తే వారికే సమాధానం దొరకుతుంది. ఇంతకీ పాయింట్‌లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా మధిరకు చెందిన సదరు యువతి హైదరాబాద్‌లోని వనస్థలిపురంతో భర్త, ముగ్గురు పిల్లలతో నివసిస్తోంది. ఆమెకి ఓ మిస్డ్ కాల్ ద్వారా పంజాగుట్టలో కంప్యూటర్ కోర్సు చేస్తున్న భద్రాచలానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ తరచుగా ఫోన్లో మాట్లాడుకుంటూ వుండేవారు. అలా వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగీ పెరిగీ ఓ ఫైన్ మార్నింగ్ ఆమె తన భర్తని, ముగ్గురు పిల్లల్ని వదిలేసి ఆ యువకుడితో వెళ్ళిపోయింది. ఆమె, ఆ యువకుడు వారంరోజులు మిగతా ప్రపంచాన్ని మరచిపోయారు. వారం తర్వాత అతను ఆమెను ఓ లేడీస్ హాస్టల్లో వదిలి గాయబ్ అయిపోయాడు. దాంతో ఆమెకి అతను తనను మోసం చేశాడన్న విషయం అర్థమైపోయి అర్జెంటుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లయింట్ చేసింది.

టీ హోం మంత్రి నాయినికి అస్వస్థత

  తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అస్వస్థతకి గురయ్యారు. ఆయనను యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. నాయిని నరసింహారెడ్డి వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. స్టీల్ మ్యాన్‌లా వుండే నాయిని నరసింహారెడ్డి అస్వస్థతకి గురయ్యారని, ఆస్పత్రిలో చేర్చారన్న వార్త తెలిసిన తెలంగాణ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు హోంమంత్రిగా అద్భుతంగా పనిచేస్తున్న నాయినికి ఏమైందోనని బాధపడ్డారు. అయితే నాయిని ఆందోళన చెందాల్సినంత అనారోగ్యానికి గురి కాలేదని, స్వల్ప అస్వస్థతకు మాత్రమే గురయ్యారని, తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.

వైద్య సీట్లు భర్తీ చేయాలి... తల్లిదండ్రుల మొర

  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైద్య సీట్లు అన్నీ భర్తీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌తో వారు మంగళవారం విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఎదుట ఆందోళన చేపట్టారు. మొత్తం సీట్లు భర్తీ చేయకపోతే కౌన్సెలింగ్ నిలిపివేయాలని, సీట్లు భర్తీ చేయని వైద్య కళాశాలల గుర్తింపు వెంటనే రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వానికి సూచించారు. కాలేజీ యాజమాన్యాలు చేసిన తప్పులకు విద్యార్థులు బలి కావాలా అంటూ వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పెట్టుబడులు కావాలిగానీ, విగ్రహాలు వద్దా?: కిషన్ రెడ్డి

  హైదరాబాద్‌కి సీమాంధ్ర ప్రాంత ప్రజల పెట్టుబడులు కావాలిగానీ, ఆ ప్రాంత మహనీయుల విగ్రహాలు ట్యాంక్‌బండ్ మీద మాత్రం వుండకూడదా అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని ప్రశ్నించారు. ఏదేమైనా, ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆంధ్ర ప్రాంత మహనీయుల విగ్రహాలను తొలగించాలనే కేసీఆర్ ఆలోచన సరికాదని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను తొలగించాలని అనదం కేసీఆర్ రెచ్చగొట్టే ధోరణికి నిదర్శనమన్నారు. తెలంగాణ మహనీయుల విగ్రహాలు పెట్టేందుకు అక్కడ బోలెడంత చోటుందని, అలాంటప్పుడు ఆంధ్ర ప్రముఖుల విగ్రహాలను తొలగించాలని యోచించటం సరికాదని కేసీఆర్‌కు హితవు పలికారు.ఆంధ్రావారిని తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నప్పుడు ఆ ప్రాంతం వారి విగ్రహాలు హైదరాబాద్‌లో ఉండటంలో తప్పేంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

ఈరోజుతో ‘ఆర్కుట్’ బంద్

  గతంలో సోషల్ మీడియా రంగంలో ఒక ఊపు ఊపిన ‘ఆర్కుట్’కి సోష వచ్చింది. ఫేస్‌బుక్ రంగంలోకి వచ్చిన తర్వాత ఆర్కుట్‌ని పట్టించుకునేవారే లేకుండా పోయారు. ఈ వెబ్‌సైట్ సొంతదారు అయిన గూగుల్ దీన్ని ఫేస్‌బుక్‌కి దీటుగా అభివృద్ధి చేయాలని భావించింది. అయితే దీనికి అంత సీన్ లేకపోవడంతో పట్టించుకునేవారే లేకుండా పోయారు. దీంతో ఆర్కుట్‌ని మూసేయాలని గూగుల్ సంస్థ నిర్ణయించింది. సెప్టెంబర్ 30, 2014వ తేదీ నుంచి ఆర్కుట్ పనిచేయదు. ఈ సైట్‌లో తమకు సంబంధించిన సమాచారం, ఫొటోలను పొందాలని అనుకునేవారు మంగళవారం లోపు తమ అకౌంట్లోకి వెళ్ళి సమాచారం దాచుకోవచ్చు. ఈరోజు తర్వాత ఆర్కుట్ పేజీ ఓపెన్ కాదు. ఈ రోజు తర్వాత ఆర్కుట్‌లోని సమాచారం పొందాలని అనుకునేవారు గూగుల్‌ అకౌంట్ ద్వారా ప్రయత్నించాల్సి వుంటుంది. ఏది ఏమైనప్పటికీ గుడ్ బై ఆర్కుట్.

జయలలితకు మద్దతు.. కడుపు మాడ్చుకున్న తమిళ సినిమా

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అభిశంసనకు గురయ్యారు. ఆమెకు కోర్టు నాలుగేళ్ళ జైలు శిక్ష, వంద కోట్ల జరిమానా విధించింది. అయితే తమిళనాడులోని చాలామంది ప్రజలు మాత్రం ఆమెకు అన్యాయంగా శిక్ష వేశారనే భావిస్తున్నారు. ముఖ్యంగా తమిళ సినిమా రంగం జయలలితకు వచ్చిన కష్టాలు చూసి తల్లడిల్లిపోతోంది. అందుకే తమిళనాడులోని పలువురు చలనచిత్ర నటులు,టీవీ నటులు నిరాహార దీక్షకు దిగారు. జయలలితకు జైలు శిక్ష వేయడాన్ని నిరసిస్తూ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. మరోవైపు తమిళనాడులో సినిమా థియేటర్ల బంద్‌కి ఎగ్జిబిటర్ల సంఘం పిలుపు ఇవ్వడంతో రాష్ట్రంలో థియేటర్లు మూతపడ్డాయి.

బాయ్‌ఫ్రెండ్ వేధింపులు.. మోడల్ ఆత్మహత్య

  ప్రముఖ మోడల్ అర్చనా పాండే (26) ముంబైలోని తన ఫ్లాట్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వాళ్లకు ఆమె ఇంటినుంచి దుర్వాసన రావడంతో వాళ్లు పోలీసులకు చెప్పగా విషయం బయటపడింది. రెండు రోజుల క్రితమే అర్చనా పాండే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ముంబై వెర్సోవా ప్రాంతంలోని న్యూ మహాడా కాలనీలోని ఓ అపార్టుమెంట్ 12వ అంతస్థులో అర్చనా పాండే ఫ్లాట్ వుంది. తన ఫ్లాట్‌లో బెడ్ రూంలో వున్న సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని అర్చనా పాండే ఆత్మహత్య చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్ ఒమర్ పఠాన్ తీవ్రమైన వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని అర్చనా పాండే సూసైడ్ నోట్‌లో తెలిపింది.

భార్య ముక్కు, చెవులు కోసిన మగ మృగం

  ఎప్పుడో త్రేతాయుగంలో రామాయణంలో శూర్పణఖ ముక్కుచెవులు కోశారని చదువుకున్నాం. ఈ కలియుగంలో కూడా అలాంటి సంఘటన జరిగింది. అయితే అలా ముక్కుచెవులు కోయించుకుంది శూర్పణఖ కాదు.. కోసింది రామలక్ష్మణులు కాదు.. కట్టుకున్న భార్య ముక్కుచెవులు ముదనష్టపు భర్తగారు కోసేశారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలంలోని గొల్లబుద్ధారం గ్రామానికి చెందిన రజిత అనే మహిళ ముక్కు, కుడి చెవిని ఆమె భర్త శ్రీనివాస్ సోమవారం రాత్రి కోసేశాడు. ఆ తర్వాత ముక్కును, చెవిని తీసుకుని వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు శ్రీనివాస్‌ని అరెస్టు చేశారు. తీవ్రంగా గాయపడిన రజితని ఆస్పత్రికి తరలించారు.

మోడీ, ఒబామా భేటీ.. గుజరాతీలో పలకరింపు

  అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీని పలుకరించేందుకు ఆ దేశ అధ్యక్షుడు ఒబామా స్వయంగా గుజరాతీ భాషను నేర్చుకున్నారు. సోమవారం మోడీకి ఇచ్చిన విందు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మోడీతో భేటీ కోసం నెలల తరబడి వేచి చూస్తున్న ఒబామా, విందు సందర్భంగా మోడీని గుజరాతీ భాషలో పలుకరించారు. ‘‘కెమ్ ఛో (ఎలా ఉన్నారు)’’ అంటూ మోడీని పలుకరించిన ఒబామా అక్కడి వారందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. దానికి మోడీ స్పందించి ‘థాంక్యూ’ అన్నారు. విందులో భాగంగా ఒబామాతో పాటు ఆ దేశ ఉపాధ్యక్షుడు జో బిడెన్, విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ, జాతీయ భద్రతా సలహాదారు సుసాన్ రైస్ హాజరు కాగా, మోడీ వెంట భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికాలో భారత రాయబారి జై శంకర్ ఉన్నారు.

హేమంత్ కర్కరే భార్య మృతి.. బ్రెయిన్ డెడ్

  2008 సంవత్సరంలో ముంబైపై జరిగిన 26/11 ఉగ్రవాద దాడిలో ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటిఎస్) చీఫ్ దివంగత హేమంత్ కర్కరే భార్య కవిత మెదడులో రక్తసావ్రం (బ్రెయిన్ హెమరేజ్)తో బాధపడుతూ బ్రెయిన్ డెడ్ అయి ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో సోమవారం మరణించారు. తన భర్త మృతి చెందినప్పటి నుంచి నుంచి బాగా కుంగిపోయిన కవిత.. ముంబైలోని ఒక కాలేజీలో అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా మెదడులో రక్తస్రావంతో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం తన నివాసంలో అపస్మారక స్థితిలో పడిపోయిన కవితను హుటాహుటిన హిందూజా ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు కవిత కర్కరే బ్రెయిన్ డెడ్ అయినట్టు ప్రకటించారు. కర్కరే దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారు జీవితంలో స్థిరపడ్డారు. కవితా కర్కరే మరణానంతరం తన అవయవాలను వైద్య పరిశోధనలకు వినియోగించాలని కోరేవారు.

బండ్ల గణేష్ చంపుతానన్నాడట.. కేసు...

  సినీ నిర్మాత బండ్ల గణేష్ మీద చీటింగ్ కేసు నమోదైంది. ‘గబ్బర్ సింగ్’ సినిమా హక్కులు ఇచ్చే విషయమై సినీ నిర్మాత బండ్ల గణేష్ తనను మోసం చేశారని ధర్మచరణ్ అనే ఫైనాన్సియర్ సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గణేష్ మీద చీటింగ్ కేసు నమోదైంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గబ్బర్‌సింగ్ చిత్రం ఆంధ్రా ఏరియా హక్కుల కోసం గుంటూరుకు చెందిన ఫైనాన్సియర్ ధర్మచరణ్ తులసీ 2011లో రూ.80 లక్షలను ఆ సినిమా నిర్మాత గణేశ్‌కు చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే బండ్ల గణేష్ ఆ సినిమా హక్కులు ధర్మచరణ్‌కు కాకుండా మరొకరికి విక్రయించాడు. ఒప్పందాన్ని ఉల్లంఘించి సినిమా రైట్స్‌ను మరొకరికి విక్రయించినందున తన డబ్బులు తిరిగివ్వాలని బాధిత ఫైనాన్సియర్ ఎన్నిసార్లు అడిగినా బండ్ల గణేష్ ఎంతమాత్రం స్పందించలేదు. తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వకపోగా తనను చంపుతానని బెదిరిస్తున్నాడని ఆ ఫైనాన్షియర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దాంతో బండ్ల గణేష్ మీద పోలీసులు బండ్ల గణేష్ మీద ఐపీసీ సెక్షన్ 420, 406, 506 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న బండ్ల గణేష్ ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందం గాలింపు చర్యలు చేపట్టింది.

ఆంధ్రప్రదేశ్‌లో జన్మభూమి: బదిలీలపై నిషేధం

  జన్మభూమి కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల బదిలీలపై నిషేధం విధించారు. అక్టోబర్ 10 వరకు ఉన్న బదిలీల సడలింపును అక్టోబర్ 30వ తేదీవరకు పొడిగించారు. జన్మభూమి కార్యక్రమం సందర్భంగా కొంతకాలాన్ని ప్రభుత్వం నిషేధపు కాలంగా ప్రకటించింది. జన్మభూమి ప్రారంభమయ్యే అక్టోబర్ రెండో తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు బదిలీలపై నిషేధం అమలులో ఉంటుంది. మళ్లీ అక్టోబర్ 21 నుంచి 30వ తేదీవరకు ఆ నిషేధాన్ని సడలిస్తారు. జన్మభూమి కార్యక్రమం అమలులో ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు బదిలీలపై నిషేధాన్ని అమలు చేయాలని అనేక జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.