హైదరాబాద్‌లో బాబోయ్ చిరుతపులి

  హైదరాబాద్ శివార్లలో చిరుత విహరిస్తూ జనాల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. హైదరాబాద్ శివార్లలో వున్న రాజేంద్రనగర్ చుట్టపక్కల వున్న గ్రామాలలో గత కొద్ది రోజులుగా చిరుత తిరుగుతోంది. ఇప్పటి వరకు ఈ చిరుత మనుషుల మీద దాడి చేయపోయినప్పటికీ ఒక లేగదూడను చంపి తిన్నది. కొంతమంది మనుషులు చిరుతపులిని చూసినట్టు చెబుతున్నారు. రాజేంద్రనగర్ సమీపంలోని బండ్లగూడ, కిస్మత్పూర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఈ చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్థులు అంటున్నారు. తమ గ్రామాల పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు ఈ రెండు గ్రామాల సర్పంచులు రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

లోయలో పడిన బస్సు: బస్సులో 30 మంది...

  హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బస్సులో లోయలో పడుతున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సోమవారం నాడు హిమాచల్ ప్రదేశ్‌లో ఒక బస్సు లోయలో పడిపోయింది. లోయలో పడిన బస్సులో 30 మంది వున్నట్టు తెలుస్తోంది. వర్షాల కారణంగా కొండప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్‌లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. దీనివల్ల బస్సుల బరువుకు రోడ్లు క్రుంగిపోతూ ప్రమాదాలు జరుగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో లోయలు ఎక్కువ కావడంతో బస్సులు కొద్దిగా జరిగినా లోయలో పడిపోతూ వుంటాయి. తాజాగా సోమవారం జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి వుంది.

బస్సు బోల్తా- 40 మందికి గాయాలు

  కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో 40 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి సమీప ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన కొంతమంది తీర్థయాత్రల కోసం జనతా ట్రావెల్స్కు చెందిన ఓ బస్సును బుక్ చేసుకున్నారు. వీరంతా హైదరాబాద్ నుంచి శబరిమలై వెళుతున్నారు. మహానంది వద్ద అడ్డు వచ్చిన చిన్నరాయిని డ్రైవర్ తప్పించబోయాడు. అయితే బస్సు అదుపు తప్పటంతో బోల్తా పడింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఇల్లు మారనున్న సీఎం చంద్రబాబు

  ఏపీ సీఎం చంద్రబాబు త్వరలో ఇల్లు మారనున్నారు. ఇప్పటి వరకు జూబ్లీహిల్స్‌లోని సొంత ఇంటి నుండి లేక్ వ్యూ అతిథి గృహానికి మారాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇటీవలి వరకు లేక్ వ్యూ అతిథి గృహం ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉంది. సచివాలయంలో సీఎం కార్యాలయం సిద్ధం కాకపోవడంతో ఇప్పటి వరకు లేక్ వ్యూ అతిథి గృహం నుండే అధికారిక కార్యకలాపాలు నిర్వహించారు. ఈ దసరా పండుగ నాటికి సచివాలయంలోని తన కార్యాలయం సిద్ధం కావడంతో బాబు అక్కడికి మారారు. ఈ నేపథ్యంలో లేక్ వ్యూను తన అధికారిక నివాసంగా మార్చుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆదివారం నాడు ఆయన కుటుంబ సభ్యులు లేక్ వ్యూ అతిథి గృహాన్ని పరిశీలించారు. అవసరమైన మార్పులు, చేర్పులు చేసిన తర్వాత డిసెంబరు నెలలో లేక్ వ్యూ అతిథి గృహానికి బాబు కుటుంబం మారనున్నట్టు తెలుస్తోంది.

విమానంలో గ్రెనేడ్: నలుగురు సస్పెన్షన్

  భారత ప్రధాని నరేంద్రమోడీ ఉపయోగించే స్టాండ్ బై విమానంలో డమ్మీ హ్యాండ్ గ్రెనేడ్ లభించిన ఉదంతం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి నలుగురు ఎయిర్ ఇండియా ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో ఇద్దరు ముంబైకి చెందిన వారు... ఇద్దరు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్ ఇండియా అధికారులు. ఎన్ఎస్‌జీ కమెండోలు నిర్వహించిన మాక్ డ్రిల్ సందర్భంగా ఈ డమ్మీ గ్రెనేడ్ విమానంలోకి చేరింది. దీనిని ఎవరూ గుర్తించలేకపోయారు. మాక్ డ్రిల్ తర్వాత విమానాన్ని చెక్ చేసిన వారు కూడా ఈ గ్రెనేడ్‌ని కనుగొనలేకపోయారు. మొత్తమ్మీద ఈ సంఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా తనిఖీలు చేసిన నలుగురు అధికారులను స పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు సస్పెండ్ చేశారు.

ఆడపిల్లల్ని వేధిస్తే కళ్ళు పీకేయిస్తా: కేసీఆర్

  తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల్ని వేధించేవాళ్ళ కళ్ళు పీకేయిస్తానని, దానివల్ల ఎంత వివాదం జరిగినా తాను వెనకాడనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సన్నాహక సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బాగుండాలంటే మహిళలకు భద్రత వుండాలని, ఆడపిల్లలకు రక్షణ కల్పించకపోతే తెలంగాణ సర్కారు పరువు పోయినట్టేనని కేసీఆర్ చెప్పారు. అందుకే ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటేనే పోకిరీల లాగూలు తడిచే విధంగా చట్టాలను కఠినతరం చేస్తామని ఆయన తెలిపారు. ఆడపిల్ల మీద అఘాయిత్యాల విషయంలో హైదరాబాద్ కూడా ఢిల్లీలా తయారైందని ఇలాంటి వాటిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని, ఆడపిల్లలను వేధించేవారికి కఠినంగా శిక్షిస్తామని కేసీఆర్ అన్నారు.

ఏపీ రైతు సాధికార కార్పొరేషన్ ఏర్పాటు

  రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రయత్నాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సాధికార కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ రైతు సాధికార కార్పొరేషన్ ద్వారానే రైతు, డ్వాక్రా రుణాల మాఫీ జరుగనుంది. కోటి రూపాయల మూల నిధితో సంస్థను ఏర్పాటు చేశారు. రుణమాఫీకి రూ. 5 వేల కోట్లు కమిటీకి మళ్లించారు. 10 రూపాయల విలువల గల పది లక్షల షేర్లను జారీ చేశారు. ఈ కమిటీ సభ్యులుగా ఐదుగురు ఉన్నతాధికారులను ప్రభుత్వం నియమించింది. వ్యవసాయ డైరెక్టర్లుగా ఆర్థిక శాఖ, వ్యవసాయ అనుబంధ రంగాల ముఖ్యకార్యదర్శులు, నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవసాయశాఖ కమిషనర్‌ వ్యవహరించనున్నారు. విజయవాడ కేంద్రంగా ఈనెల 22 నుంచి ఈ కార్పొరేషన్  పనిచేయనుంది.

అమరవీరుల జాబితా విడుదల చేయాలి

  తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల సంఖ్యను 462 అని తెలంగాణ ప్రభుత్వం చేసిన అధికారిక ప్రకటనను చూస్తుంటే, అమరవీరుల త్యాగాలను, బలిదానాలను బోగస్‌గా మార్చారనే అనుమానం కలుగుతోందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ 1200 మంది అమరులయ్యారని తెలంగాణ రాష్ట్ర సమితి పదేపదే చెప్పి ఎన్నికలలో రాజకీయ లబ్ది పొందిందని ఆయన ఆరోపించారు. గతంలో టీఆర్ఎస్ చెప్పిన సంఖ్య నిజమే అయితే కేవలం 462 మంది పేర్లను మాత్రమే ఎందుకు ప్రకటించారని ఆయన ప్రశ్నించారు. మిగిలిన 738 మందిని ప్రభుత్వం గుర్తించకపోవడం వారికి ద్రోహం చేయడమే అవుతుందని ఆయనఅ న్నారు. అమరవీరుల మీద తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే అమరవీరుల జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

శ్రీ‌నువైట్లకు సిగ్గు లేదా?: ప్రకాష్‌రాజ్

  నాపై రాళ్లు విస‌ర‌కండి ఇటుక‌లుగా మార్చి ఇల్లు క‌ట్టుకొంటా.. నాపై నిప్పులు చెర‌గ‌కండి వాటితో దీపం వెలిగించుకొంటా నాపై విషం చిమ్మకండి అది మింగి నీల‌కంఠుడిగా మారిపోతా నన్ను త‌రిమేయాల‌ని చూడ‌కండి చేర‌వ‌ల‌సిన చోటికి ముందే చేరుకొంటా.. - ఇది ప్రకాష్‌రాజ్ ఆవేద‌న‌.. ఆగ‌డు సినిమా నుంచి త‌న‌ని తీసేసిన త‌ర‌వాత‌.. శ్రీ‌నువైట్లతో త‌న‌కున్న వివాదం గురించి ఓ ప్రెస్‌మీట్‌లో ప్రకాష్‌రాజ్ ఇచ్చిన వివ‌ర‌ణ ఇది. దీన్నే ఆగ‌డు సినిమాలో శ్రీ‌నువైట్ల వాడేసుకొన్నాడు. అదేంట‌ని శ్రీ‌నువైట్లని అడిగితే `ప్రకాష్‌రాజ్ చెప్పిన క‌విత నాకు న‌చ్చింది. అందుకే వాడుకొన్నా..` అని సింపుల్‌గా చెప్పాడు. కానీ ప్రకాష్‌రాజ్ మాత్రం సింపుల్‌గా తీసుకోలేదు. ఈరోజు హైద‌రాబాద్‌లో గోవిందుడు అంద‌రివాడేలే ప్రెస్‌మీట్లో... శ్రీ‌నువైట్లపై నిప్పులు చెరిగాడు.. ప్రకాష్‌రాజ్‌. `శ్రీ‌నువైట్లకు సిగ్గులేదా?? నా ఆవేద‌న అలా అర్థమైందా? క‌నీసం ఫోన్ చేసి అడ‌గాల‌న్న జ్ఞానం లేదా? అంత అహంకార‌మా? అంద‌రినీ ఇలా వాడేసుకొంటాడా?? త‌న‌కు న‌చ్చక‌పోతే ప‌రిశ్రమ‌లో ఉండ‌కూడ‌దా..? న‌న్ను మూడేళ్లు బ్యాన్ చేయాల‌ని చూశాడు. ఓ మ‌హేష్ బాబు లాంటి స్టార్ హీరో, కోట్లు పెట్టే నిర్మాత ఉండ‌గా... క‌సితో సినిమా తీయాలి. మ‌రొక‌రిపై కక్షతో సినిమా తీయ‌కూడ‌దు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రాంగోపాల్‌వ‌ర్మ, ఎన్టీఆర్‌లు ఏం చేశారు.. కోన వెంక‌ట్ ఏం చేశాడు?? వాళ్లపై క‌సితో ఎందుకు సినిమా తీయాలి..? అంత అహంకారం ఉండ‌కూడ‌దు. రేపు శ్రీ‌నువైట్ల నాకు మంచి క‌థ చెబితే త‌ప్పకుండా న‌టిస్తా. అంద‌రూ బాగుండాల‌న్నది నా అభిమ‌తం`` అంటూ చెల‌రేగిపోయాడు. ప్రకాష్‌రాజ్ తాజా వ్యాఖ్యలు మ‌రెంత దుమారాన్ని రేపుతాయో చూడాలి.

ఆ ఛాలెంజ్ నాకు గర్వకారణం: కమల్ హాసన్

  స్వచ్ఛ భారత్ ఉద్యమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఛాలెంజ్ చేసిన తొమ్మిది మందిలో తాను ఒకడిని కావడం తనకు గర్వాన్ని కలిగిస్తోందని నటుడు కమల్ హాసన్ అన్నారు. తొమ్మిది జాబితాలో తన పేరు ఉన్నందుకు ప్రధానికి మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛ భారత్ కోసం మోడీ విసిరిన సవాల్ ప్రతిష్టాత్మకమైన ఆహ్వానమని ఆయన అన్నారు. తన పేరును ఆ జాబితాలో చేర్చడం మోడీ ఔదార్యానికి నిదర్సనమని కమల్ హాసన్ చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్‌ను ప్రధాని మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మోడీ సవాల్‌కి తాను సానుకూలంగా ప్రతిస్పందిస్తున్నానని కమల్ హాసన్ అన్నారు. తన అభిమానులు గత ఇరవై ఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు నటుడు కమల్ హాసన్ తెలిపారు.

మోడీకి భారీగా ఫేస్‌బుక్ ఫాలోవర్లు

  భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి భారతదేశంలో మాత్రమే కాకుండా అమెరికాలో కూడా భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. మరే భారతీయ రాజకీయ నాయకుడికీ లేనంతగా నరేంద్ర మోడీకి అమెరికన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని న్యూయార్క్ టైమ్స్ చెబుతోంది. అమెరికన్ రాజకీయ నాయకులకు ఉన్న ఫాలోయింగ్ కంటే మోడీకున్న అమెరికన్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంఖ్య ఎక్కువని సదరు పత్రిక పేర్కొంది. బుధవారం నాటికి మోడీ అమెరికన్ ఫేస్ బుక్ ఫ్యాన్స్ సంఖ్య 170,529కి చేరింది. నరేంద్ర మోడీ సోషల్ మీడియాను ప్రజలతో కమ్యునికేషన్‌ను ప్రధాన వేదికగా ఎంచుకోవడమే ఇందుకు ప్రధాన కారణమని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది.

మహిళల వస్త్రధారణపై ఏసుదాసు వ్యాఖ్యలు: కేరళ కాంగ్రెస్ ఆగ్రహం

  భారతీయ మహిళలు జీన్స్ ప్యాంట్లు ధరించకూడదంటూ ప్రముఖ గాయకుడు ఏసుదాసు చేసిన వ్యాఖ్యల మీద కేరళ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏసుదాసు పాటలు పాడుకోవటంతో ఆగితే మంచిదని, మహిళల వస్త్రధారణ మీద కామెంట్లు చేయడం మంచిది కాదని వారు అంటున్నారు. గాంధీ జయంతి సందర్భంగా తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏసుదాస్ మాట్లాడుతూ జీన్స్ వంటి వస్త్రాధారణ వల్లే మహిళలు ఇబ్బందులు పాలవుతున్నారని, ఇలాంటి వస్త్రధారణ భారతీయ సంస్కృతి కాదనీ, అందువల్ల నిండైన వస్త్రాలు ధరించాలని సూచించారు. ఏసుదాసు వ్యాఖ్యలపై కేరళ మహిళా కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. ఏసుదాస్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని కేరళ మహిళా కాంగ్రెస్ నేత బిందు అన్నారు.