ఎమ్మార్ కేసులో నష్టపోయిన ఎపిఐఐసి : సిబీఐ
posted on Mar 16, 2013 9:01AM
ఎమ్మార్ కేసులో అభియోగాల నమోదు నిమిత్తం సిబీఐ కోర్టు ప్రధాన న్యాయాధికారి యు.దుర్గాప్రసాద్ ఎదుట సిబీఐ డిప్యూటీ సలహాదారు బల్లా రవీంద్రనాథ్ వాదనలు వినిపిస్తూ "2004లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మార్ ప్రాపర్టీస్ గత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో మార్పులు చేసి ప్రాజెక్టును తిరిగి చేప్పట్టిందని, గతంలో రెండు ఎస్సీవీలుగా ఉన్న ప్రాజెక్టును మూడు ఎస్సీవీలుగా చేపట్టిందని, దీనికోసం ప్రభుత్వం 535 ఎకరాల భూమిని కేటాయించినట్లు చెప్పారు. ఈ సంస్థల్లో ఎపిఐఐసి ఎం.డి.గా బి.పి.ఆచార్య ఉమ్మడి సంస్థల నామినీ డైరెక్టర్ గా ఉండి దుబాయ్ సంస్థ రూ,వందల కోట్లను కొల్లగొడుతున్నా ప్రేక్షకపాత్ర పోషించారని, డాక్యుమెంట్లలో చూపిన ధరకంటే ఎక్కువ ధరలకు విల్లాలను విక్రయిస్తున్నారని తెలిసీ వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించలేదని పేర్కొన్నారు. అంతే కాకుండా ఎపిఐఐసికి తెలియకుండా ఈ.హెచ్.టి.పి.ఎల్., ఎమ్మార్ ఎంజీఎఫ్ తో అభివృద్ధి ఒప్పందం కుదుర్చుకున్నందువల్ల ఎపిఐఐసికి దక్కాల్సిన 25 శాతం వాతా 5 శాతానికి పడిపోయి దాదాపు రూ.43కోట్లకు పైగా నష్టపోయిందన్నారు. కోనేరు రాజేంద్రప్రసాద్ సూచనలతో తుమ్మల రంగారావు స్టైలిష్ హోమ్స్ ను ఏర్పాటు చేసి, చదరపు గజం పత్రాల్లో రూ.5 వేలుగా చూపించి అదనంగా రూ.4వేల నుంచి రూ. 45వేల వరకూ వస్తూసు చేశారన్నారు. కోనేరు సూచనలతో రంగారావు స్టైలిష్ హోమ్స్ ద్వారా 105 విల్లాల స్థలాల విక్రయాలు జరిగాయన్నారు. ఈ విక్రయాలతో తుమ్మల రంగారావు రూ, 96.01 కోట్లు వసూలు చేసిందని, ఈ మొత్తాన్ని కోనేరు రాజేంద్రప్రసాద్ కు, సునీల్ రెడ్డికి అందజేశారన్నారు. బి.పి.ఆచార్య, ఎమ్మార్ హిల్స్ టౌన్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్, ఎమ్మార్ ప్రాపర్టీస్, ఎమ్మార్ ఎం.జీ.ఎఫ్., కోనేరు రాజేంద్రప్రసాద్, విజయరాఘవ తదితరుల పాత్ర గురించి కోర్టుకు వినిపించారు.