బీటల బాటలో యుపిఎ!

      రెండు పర్యాయాలు పరిపాలించి దేశాన్ని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యుపిఏ శకం త్వరలో ముగిసిపోబోతోంది. వచ్చే ఎన్నికలలో యుపీఏ ఉనికే ఉండబోదన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒకపక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ యుపీఏ ప్రభుత్వం రాబోతోందని, ఆ ప్రభుత్వానికి రాహుల్‌గాంధీ నాయకత్వం వహించబోతున్నాడని కలలు కంటున్నారు. వీళ్ళ కలలు ఇలా వుంటే, వాస్తవంలో పరిస్థితులు మరోలా వున్నాయి.   ప్రస్తుతం యుపిఏ భాగస్వామ్య పక్షాలుగా వున్న అనేక పార్టీలు వచ్చే ఎన్నికల తర్వాత  కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టే ఉద్దేశంలో లేనట్టు తెలుస్తోంది. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు, కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టిన పాపానికి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులన్నీ యూపీయేలోని మిగతా పార్టీల మెడలకు కూడా చుట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీని శత్రువుగా చూస్తున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టిన పార్టీలను కూడా శత్రువులుగా చూస్తున్నారు. ఇది యూపీఏలోని పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. అందుకే ఎన్నికలలోపు కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోయి, ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేనట్టుగానే పోటీలో నిలబడితే మంచిదని అనేక పార్టీలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి క్రమంగా దూరమయ్యే వ్యూహాలు రచిస్తున్నాయి. లేటెస్ట్ గా కాశ్మీర్‌కి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రస్తుతం యుపిఎలో వుంది. కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తున్నందుకు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా కేంద్రంలో మంత్రిగా వున్నారు. అలాగే కాశ్మీర్‌లో ఒమర్ అబ్దుల్లాకి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తోంది. అయితే కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమయ్యే ఆలోచనలో వున్నారు. కాశ్మీర్ పరిపాలనకు సంబంధించినే అనేక విషయాల్లో కాంగ్రెస్ పార్టీ జోక్యం ఎక్కువ కావడం, తనను శాశించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ వుండటాన్ని ఒమర్ అబ్దుల్లా సహించలేకపోతున్నారు. దాంతో కాశ్మీర్‌కి సంబంధించినంతవరకు కాంగ్రెస్ పార్టీ జోక్యాన్ని తగ్గించే ప్రయత్నంలో ఉన్నారాయన. అదేవిధంగా ఈమధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం ప్రజల్లో భారీ స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేస్తే కేంద్రంలో యుపీఏలో భాగస్వామిగా వుండే మాట దేవుడెరుగు.. కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని కాశ్మీర్‌లో కూడా అధికారం పోయే ప్రమాదం వుందని ఒమర్ అబ్దుల్లా భయపడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి దూరం కావడానికి ఆయన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్టు అర్థమవుతోంది.

మాటల తూటాల మారెప్ప!

      ఎంతటివారి మీదైనా మాటల తూటాలు విసరడంలో మాజీ మంత్రి మారెప్ప శైలే వేరు. ఆయన మంత్రిగా వున్నప్పుడు కూడా ఎంతమాత్రం జంకూగొంకూ లేకుండా వాగ్బాణాలు విసిరేవారు. ఆయన మాట్లాడే తీరు చూస్తే చాలా కామెడీగా వుంటుంది. అయితే ఆ మాటల్లో చాలా లోతు వుంటుంది. ఆ మాటలు ఎవరికి ఎంత లోతు గాయాలు చేయాలో అంత గాయాలు చేస్తూనే వుంటాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుడిగా ఎదిగిన మారెప్ప వైఎస్సార్ ఆకస్మిక మరణంతో రాజకీయంగా కొంత వెనకబాటుకు గురయ్యారు.   అయితే వైఎస్సార్ మీద తనకున్న అభిమానాన్ని ఆయన కుమారుడు జగన్ మీద కూడా ప్రసరింపజేశారు. అయితే జగన్ మారెప్ప అభిమానం మీద జెల్లకొట్టాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన మారెప్ప  జగన్‌ని తన పిల్లల్ని తానే తినే పాము అంటూ అభివర్ణిస్తూ జగన్ పార్టీకి గుడ్ బై కొట్టేశారు. తాజాగా ఆయన తన మాతృసంస్థ అయిన కాంగ్రెస్ పార్టీలోని విధానాలు, పరిస్థితుల మీద సూటిగా బాణాలు విసురుతున్నారు. ఈమధ్య రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిట్టింగ్ సభ్యులుగా వున్న కేవీపీ, టీఎస్సార్, ఖాన్‌లకు మరోసారి అవకాశం ఇచ్చింది. దీనిమీద మారెప్ప తీవ్రంగా విరుచుకుపడ్డారు. పార్టీకి సేవ చేసే వారిని రాజ్యసభకి పంపించకుండా శ్మశానానికి వెళ్ళడానికి సిద్ధంగా వున్న ముసలివాళ్ళకి రాజ్యసభ సీట్లు ఎందుకిచ్చారని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. మళ్ళీ రాజ్యసభ సీట్లు పొందిన ముగ్గురు పెద్దమనుషుల్నీ ఆయన పేరు పేరున ఘాటుగా విమర్శించారు. వేరే ఎవరైనా ఇలాంటి విమర్శలు చేసి వుంటే సదరు పెద్దమనుషుల అనుయాయులు గయ్యిమని విరుచుకుపడేవారే. అయితే విమర్శలు చేసింది మారెప్ప కావడంతో ఎవరూ కిక్కురుమనడం లేదు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కూడా లేరు కాబట్టి ఆయన్ని పార్టీ పరంగా శిక్షించడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. ఏది ఏమైనప్పటికీ మారెప్ప చేసిన విమర్శలు ఘాటుగా వున్నప్పటికీ, వాటిలో వాస్తవాలు లేకపోలేదన్న అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురి అభ్యర్థిత్వం పట్ల కాంగ్రెస్ పార్టీలోనే భిన్నస్వరాలు గుసగుసల రూపంలో వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు బాహాటంగానే వీళ్ళ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. టీ సబ్బరామిరెడ్డి పార్టీకి ఏ రకంగా ఉపయోగపడ్డారని మళ్ళీ సీటు ఇచ్చారని నిర్మొహమాటంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

రాహుల్ కామెడీ!

      రాబోయే ఎన్నికల తర్వాత దేశానికి ప్రధాని అయిపోవాలని కలలు కంటున్న రాహుల్‌గాంధీ వ్యవహారశైలి, ఆయన మాట్లాడే తీరు చూసి రాజకీయ వర్గాలు నవ్వుకుంటున్నాయి. ప్రజలు నవ్వాలో ఏడవాలో అర్థంకాక విస్తుపోతున్నారు. ఖర్మకాలి వచ్చే ఎన్నికల తర్వాత ఈయనగానీ దేశ ప్రధాని అయిపోడు కదా అని భయపడిపోతున్నాడు. ఆమధ్య నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని సృష్టించాయి.   రాజకీయ అపరిపక్వతతో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ నెత్తిన బండల్లా మారాయి. ముజఫర్ నగర్ అల్లర్ల విషయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులకే నచ్చలేదు. అలాగే తనకు ప్రాణహాని వుందంటూ రాహుల్ గాంధీ మాట్లాడిన పిరికిమాటలు ఆయన స్థాయిని చెప్పకనే చెప్పాయి. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేలమట్టం కావడానికి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ పిల్ల చేష్టలు, విచిత్రమైన మాటలు చూసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన మీదే ఆధారపడి ఆయన్నే కాబోయే ప్రధానిగా ప్రమోట్ చేస్తోంది. సోనియాగాంధీ కొడుకుగా పుట్టిన పుణ్యానికి ఆయనకి దక్కుతున్న అదృష్టమది. లేటెస్ట్‌ గా కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను స్వీకరించిన రాహుల్ ప్రస్తుతం పేపర్లలో ఆఫ్ పేజీ ప్రకటనలు ఇచ్చుకుంటూ, ఛానెళ్ళలో తన బొమ్మ నిండుగా కనబడేట్టు చూసుకుంటున్నారు. ఈ మధ్య ఒక జాతీయ ఛానెల్లో రాహుల్ గాంధీ ఒక ఇంటర్వ్యూ  ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు రాహుల్ గాంధీ ఇచ్చిన సమాధానాలు విని అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతమాత్రం పరిణతి లేకుండా రాహుల్ చెప్పిన సమాధానాలు నవ్వు తెప్పించేలా వున్నాయని ముక్తకంఠంతో  అంటున్నారు. ఆచితూచి, ఒక పద్ధతి ప్రకారం, ఒక అవగాహనతో మాట్లాడే నరేంద్రమోడీకి  - నోటికి ఏది వస్తే అది మాట్లాడే రాహుల్ గాంధీకి మధ్య పోటీనా అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్‌గాంధీ  ఒక పాపులర్ కమెడియన్‌గా తయారయ్యాడని అంటున్నారు.

అలకలో పిడకలవేట!

      అధికారాన్ని నిలుపుకోవడానికి ఏ అవకాశాన్నీ వదులుకోని శైలి కాంగ్రెస్ పార్టీది. ఒకవేళ ఏ అవకాశమూ లేకపోతే కొత్త అవకాశాలను కల్పించుకునే శైలి కూడా కాంగ్రెస్ పార్టీదే. అత్యుత్సాహంగా తెలంగాణని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో ఆల్రెడీ గల్లంతైపోయింది. విభజన పాపాన్ని మూటగట్టుకున్నప్పటికీ తెలంగాణ ప్రాంతలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేమీ లేదని, వచ్చే ఎన్నికలలో ఇప్పుడున్న సీట్లు కూడా వచ్చే ఆశలు లేవని ఈమధ్య జరిగిన కొన్ని సర్వేలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో గెలిచే అవకాశాలున్న ఇతర పార్టీల నాయకులను లాక్కోవడానికి పథకాలు వేస్తోంది.   టీఆర్ఎస్‌తో ఒకవైపు విలీనం చర్చలు జరుపుతూనే ఆ పార్టీ నాయకులను బుట్టలో వేసుకునే పనులు ముమ్మరం చేసింది. తెలుగుదేశం నాయకులను కూడా ఆకట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. లేటెస్ట్ గా రాజ్యసభ అభ్యర్థిగా తనను ఎంపిక చేయలేదని అలిగిన మోత్కుపల్లి నర్సింహులు మీద కాంగ్రెస్ పార్టీ కన్ను వేసింది. మోత్కుపల్లి అలిగినట్టు ఇలా సమాచారం వచ్చిందో లేదో కాంగ్రెస్ పార్టీ మోత్కుపల్లిని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఎవరు కాస్తంత అలిగినా వాళ్ళ మీద ‘ఆకర్ష’ పథకాన్ని ప్రయోగించడానికి కాంగ్రెస్ పార్టీ ఉత్సాహపడిపోతూ వుంటుంది. గతంలో ఎర్రబెల్లి అలిగినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఆశలు పెట్టుకుని స్వాగత ద్వారాలు తెరిచింది. అయితే ఎర్రబెల్లి మాత్రం అవసరమైతే రాజకీయాల్లోంచి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుని బతుకుతా తప్ప కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరనని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. అయినా జ్ఞానోదయం కలగని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం నాయకుల మీద గాలాలు, వలలు విసురుతూనే వుంది.  తాజాగా మోత్కుపల్లి మీదకి వల విసిరింది. ఈసారి కూడా కాంగ్రెస్ వల చిరిగిపోయే ఛాన్స్ వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

వెంకయ్య చెప్పిన వేదం!

      రాష్ట్ర విభజన విషయంలో భారతీయ జనతాపార్టీ మనసు మారుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పిన మాటలు మొన్నటి వరకూ నమ్ముతూ వచ్చిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు ఈ విషయంలో అసలు వాస్తవాలను తెలుసుకుంది. అందుకే బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి గానీ, కిషన్ రెడ్డి నుంచి గానీ తెలంగాణ విషయంలో ఏకపక్ష ప్రకటనలు రావడం లేదు. తెలంగాణ రావాల్సిందే.. కానీ సీమాంధ్రుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని ఇప్పుడు బీజేపీ కొత్త పల్లవి పాడుతోంది.   తెలంగాణ విషయంలో పేనుకు పెత్తనం ఇచ్చినట్టు కిషన్‌రెడ్డికే మొత్తం అధికారం ఇవ్వడంతో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి బోడిగుండులా అయిపోయింది. దాంతో ఇంతకాలం మౌనం వహించిన బీజేపీ అగ్ర నాయకుడు వెంకయ్య నాయుడు రంగంలోకి దిగారు. తెలంగాణ విషయంలో బీజేపీ చేసిన పొరపాట్లను సరిదిద్దే పనిలో ఆయన ప్రస్తుతం వున్నారు. కేంద్రం పంపిన తెలంగాణ బిల్లు తప్పుల తడకలా వుందని, ఈ బిల్లు ఇటు తెలంగాణ వారికి గానీ, అటు సీమాంధ్ర ప్రజలకు గానీ ఆమోదయోగ్యంగా లేదని వెంకయ్య నాయుడు చెబుతూనే వున్నారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు ఇస్తుందేమోనన్న భయం మొన్నటి వరకూ సీమాంధ్ర ప్రజల్లో వుండేది. అయితే వెంకయ్య నాయుడు రంగప్రవేశం చేసిన తర్వాత ఆ భయం తగ్గింది. బుధవారం నాడు విజయవాడలో వెంకయ్య ఏర్పాటు చేసిన బహిరంగసభ సీమాంధ్రులలో ధైర్యాన్ని కలిగించింది. రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత సులభం కాదన్న విషయం కూడా స్పష్టమైంది. వెంకయ్య నాయుడు వేదం లాంటి ఒక మాట అన్నారు. ‘‘ఎక్కడో ఇటలీలో పుట్టిన సోనియాగాంధీ భారతదేశాన్ని ఏలుతోంది. విజయవాడలో పుట్టినవాడు హైదరాబాద్‌లో వుండకూడదా?’’ అని వెంకయ్య అన్న మాట సీమాంధ్రులలో ధైర్యాన్ని ఎంతగానో పెంచింది. కాంగ్రెస్ పార్టీ చేయాలని తలపెట్టిన అడ్డగోలు విభజనకు భారతీయ జనతాపార్టీ ఒప్పకోదన్న నమ్మకం ఇప్పుడు సీమాంధ్రులలో మరింత బలపడుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ని, తెలుగువారిని కాంగ్రెస్ పార్టీ నుంచి కాపాడగలిగే కీలక వ్యక్తుల్లో వెంకయ్య నాయుడు కూడా ఒకరు.

దుద్దిళ్ళ వారి తంటాలు!

      మావోయిస్టుల చేతిలో అన్యాయంగా చనిపోయిన తన తండ్రి దుద్దిళ్ళ శ్రీపాదరావు రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడం మినహా రాజకీయంగా ఎలాంటి చరిష్మాలేని వ్యక్తి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అని రాజకీయ వర్గాలు భావిస్తాయి. గతంలో రాజకీయాల గురించి ఓనమాలు కూడా తెలియని ఆయన ఎమ్మెల్యే అయ్యారన్నా, మంత్రి అయ్యారన్నా దానికి కారణం ఆయన ప్రతిభ కాదు.. ఆయన తండ్రి మీద ప్రజలకి వున్న సానుభూతే కారణమంటారు. ‘నీ తండ్రికి పట్టిన గతి మరచిపోయావా?’ అని జేఏసీ నాయకుడు కోదండరామ్ బెదిరించడం వల్లనో, నలుగురితోపాటు నారాయణలా వుండాలన్న ఉద్దేశం వల్లనో గానీ శ్రీధర్‌బాబు తాను కూడా తెలంగాణ రాగం ఆలపించారు.   తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడు కాబట్టి ఏదో తెలంగాణ పాట పాడుతున్నారులే అని మొన్నటి వరకూ అందరూ అనుకున్నారు. అయితే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన శ్రీధర్‌బాబు తెలంగాణ బిల్లు విషయంలో  అతిగా అధికారాలను చేతిలోకి తీసుకోవడంతో మంత్రి పదవిని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మంత్రి పదవిని పోగొట్టుకుని తాను చేసిన త్యాగానికి తెలంగాణ ముఖ్యమంత్రి పదవి రూపంలో ప్రతిఫలాన్ని పొందాలని శ్రీధర్‌బాబు ఆశస్తున్నట్టు ఆయన వ్యవహారశైలి చూస్తుంటే అనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వస్తుందో రాదో తెలియని తెలంగాణకు ముఖ్యమంత్రి అయిపోవాలని ఇప్పటికే పాతికమందికి పైగా తెలంగాణ నాయకులు కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ సంగతి అలా వుంచితే, కాంగ్రెస్ పార్టీలోనే ఆ లిస్టు చేంతాడంత పొడవుంది. ఆ లిస్టులో మొదటి స్థానంలో వుండటానికి శ్రీధర్‌బాబు తపన పడుతున్నారు. అవకాశం కల్పించుకుని మరీ ముఖ్యమంత్రి మీద విమర్శలు గుప్పిస్తూ తెలంగాణ హీరోలా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  అయితే ఒకవేళ తెలంగాణ వచ్చినా శ్రీధర్‌బాబుని పక్కకి నెట్టేసే శక్తులు చాలా వున్నాయని, ఆ వాస్తవాన్ని గ్రహించలేక శ్రీధర్‌బాబు అనవసరంగా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ సీమాంధ్ర ప్రజల అభిమానాన్ని కోల్పోతున్నారని విశ్లేషిస్తున్నారు.

కాంగ్రెస్‌కి దగ్గొచ్చింది!

      ఇప్పటికే అనేక అనేక రోగాలు, రొష్టులతో మంచాన పడే స్థితిలో వున్నరాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి మరో వ్యాధి కూడా తగులుకుంది. రాష్ట్ర కాంగ్రెస్‌కి అకస్మాత్తుగా ‘దగ్గు’ పట్టుకుంది. ఆ దగ్గుతో కాంగ్రెస్ నాయకులందరూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏ మందు వాడితే ఈ దగ్గు దగ్గుతుందో అర్థంకాక ఖళ్ళుఖళ్ళుమంటూ దగ్గుతూనే చికిత్స కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ని వేధిస్తున్న ఆ దగ్గు పేరు దగ్గుబాటి దంపతులు.   రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరు మొదటి నుంచి దగ్గుబాటి దంపతులకు ఇబ్బందికరంగానే తయారైంది. మరోవైపు విశాఖ సీటు నాదేనని సుబ్బరామిరెడ్డి చేసిన నానా యాగీ ఈ దంపతులకు కాంగ్రెస్ పార్టీ మీద విరక్తి కలిగేలా చేసింది. కేంద్ర మంత్రి హోదాలో వున్న దగ్గుబాటి పురంద్రీశ్వరి రాష్ట్ర విభజన విషయంలో కేంద్రానికి మద్దతు ఇచ్చారు. అయితే సీమాంధ్రుల హక్కులకు భంగం కలిగితే ఎంతమాత్రం సహించేది లేదని చెప్పారు. సీమాంధ్ర ప్రజల హక్కుల విషయంలో పురంద్రీశ్వరి చేసిన సూచనలన్నీ బుట్టదాఖలు చేసి కేంద్రం ఏకపక్ష బిల్లును రాష్ట్రానికి పంపింది. దీంతో తీవ్రంగా హర్టయిన దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్ పార్టీ మీద విముఖతను మరింత పెంచుకున్నారు. వీరు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే ఆలోచనలో వున్నారన్న అభిప్రాయాలు వారి అనుయాయుల నుంచి వ్యక్తమయ్యాయి. నిజానికి సుబ్బరామిరెడ్డి తన యాగీకి ఫుల్‌స్టాప్ పెట్టకుండా వుండి వుంటే కాంగ్రెస్ పార్టీకి వీరిద్దరూ ఎప్పుడో గుడ్ బై కొట్టేసేవారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులుగా ప్రజల్లో తమకున్న గౌరవమే తమని రాజకీయాలలో విజయాలు సాధించేలా చేస్తోందే తప్ప, కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలు కాదని ఈ దంపతులు భావిస్తున్నారు. తాజాగా దగ్గుబాటి దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టుగా, వారికి తెలుగుదేశం పార్టీ ఆహ్వానం పలుకుతున్నట్టుగా పర్చూరులో వెలిసిన ఫ్లెక్సీలు రాష్ట్ర రాజకీయ రంగంలో సంచలనం సృష్టించాయి. ఈ ఫ్లెక్సీలు ఎవరు పెట్టి వుంటారన్న విషయంలో కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దగ్గుబాటి దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరడమే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  రాష్ట్ర విభజనకు ఉత్సాహం చూపించి అడ్డంగా మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీలో వుంటే కుక్కతోక పట్టుకుని రాజకీయ గోదారి ఈదినట్టే అవుతుందని దగ్గుబాటి దంపతుల సన్నిహితులు భావిస్తున్నారు. ఈ దంపతులు తెలుగుదేశంలోకి రావడం రాష్ట్ర రాజకీయాలలో శుభ పరిణామమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చిన్న చిన్న ఇగోలు వదులుకోవడం తప్ప వీరు తెలుగుదేశంలోకి రావడానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవని భావిస్తున్నారు. దగ్గుబాటి దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ వస్తున్న వార్తలను కొంతమంది ఖండిస్తున్నప్పటికీ, నిప్పు లేకుండా పొగ రాదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్ పార్టీని వీడటం అంటూ జరిగితే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యే అవకాశం వుంది.

కూకట్‌పల్లి బరిలో అశోక్‌బాబు?!

      జేపీ పప్పులు ఇక కేపీలో ఉడకవని అర్థమైపోతోంది. గత ఎన్నికలలో జయప్రకాష్ నారాయణ్‌ని ప్రేమగా గెలిపించిన కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు వేరే ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకరోజు రాష్ట్ర విభజనకు అనుకూలంగా, మరోరోజు వ్యతిరేకంగా మాట్లాడే జేపీ కేపీ ప్రజల మనసులను బాధపెట్టారు. రీసెంట్‌గా అసెంబ్లీలో విభజన బిల్లు చర్చలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా జేపీ మాట్లాడిన తీరు స్థానికంగా మెజారిటీగా వుండే సీమాంధ్ర ప్రజల మనసులు విరగ్గొట్టేసింది. రాబోయే ఎన్నికలలో జేపీకి తగిన పాఠం చెప్పాలని కూకట్‌పల్లి ఓటర్లు భావిస్తున్నారు.   హైదరాబాద్‌లో వున్న సీమాంధ్ర ప్రజల గుండె చప్పుడును అసెంబ్లీలో వినిపించాల్సిన జయప్రకాష్ అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని కూకట్‌పల్లి ఓటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. జేపీ తన రాజకీయ భవిష్యత్తును కూకట్‌పల్లిలోనే వెతుక్కుంటూ వచ్చే ఎన్నికలలో కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు ఈమధ్య లోక్‌సత్తా విడుదల చేసిన తొలి జాబితాలో ప్రకటించారు. అయితే వచ్చే ఎన్నికలలోనూ గెలవాలని భావిస్తున్న కేపీ కలలు కల్లలయ్యే ప్రమాదం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో కలవటానికి జేపీ చూపిస్తున్న ఉత్సాహం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆయనను అభిమానించే వారి మీద ప్రభావం చూపిస్తోంది. ఢిల్లీలో అట్టర్ ఫ్లాప్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీతో జట్టు కట్టడానికి జేపీ చూపిస్తున్న చొరవని ఎవరూ హర్షించడం లేదు. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లి సీటు మీద రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టిని నిలిపాయి. సమైక్య ఉద్యమాన్ని విజయవంతంగా నడుపుతున్న పరుచూరి అశోక్‌బాబుని ఈ నియోజకవర్గం నుంచి జేపీకి పోటీగా నిలపాలనే ఆలోచన అన్ని పార్టీల్లోనూ మొగ్గతొడిగింది. దీనికి సంబంధించి అశోక్‌బాబును ఒప్పించడానికి, తమ పార్టీవైపు అశోక్‌బాబును లాక్కోవడానికి ప్రయత్నాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి అశోక్‌బాబు రాజకీయాల్లో చేరనని చెబుతున్నప్పటికీ ఎన్నికల సమయానికి అశోక్‌బాబును జేపీ మీద పోటీకి ఆయన్ని ఒప్పించవచ్చన్న ఆశావాదం రాజకీయ పార్టీల్లో కనిపిస్తోంది. దీనికితోడు ఈమధ్య కాలంలో జేపీని కూకట్‌పల్లిలో ఓడించే అభ్యర్థిని నిలబెడతామని అశోక్‌బాబు ప్రకటించారు. ఆ అభ్యర్థి వేరేవెరో ఎందుకు అవ్వాలి.. అశోక్‌బాబే ఎందుకు కాకూడదన్న ఆలోచనలో రాజకీయ వర్గాలు వున్నాయి.

చైతన్యరాజు వెనుక చాణక్యులు ఎవరు?

      ప్రస్తుతం రాష్ట్ర విభజన నాటకం రాష్ట్రంలో మాంఛి రసపట్టులో వుండగానే, తెలుగు ప్రజలకు రాజ్యసభ ఎన్నికల రూపంలో మరింత ఎంటర్‌టైన్‌మెంట్ అందుతోంది. రామాయణంలో పిడకల వేటలా, సినిమాలో ఉండే ఉపకథలా తయారైన రాజ్యసభ ఎన్నికల ప్రహసనంలో కాంగ్రెస్ మార్కు రాజకీయాలను చూసి ప్రజలకి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. రాజ్యసభ సీట్లకు తుమ్మబంక రాసుకుని కూర్చున్నట్టు సెటిలైపోయిన ముగ్గురు ‘పెద్ద’ మనుషులకు మళ్ళీ రాజ్యసభ టిక్కట్లు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిని రగిలిస్తోంది.     నిన్నటి వరకూ తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తామని గంట మోగించిన గంట, హారన్ మోగించిన జేసీ దివాకర్‌రెడ్డి ప్రస్తుతం చప్పుడు చేయకుండా వుండిపోయారు. ఎమ్మెల్సీ చైతన్యరాజు మాత్రం తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలో నిలబడ్డారు. రాముడు మంచి బాలుడిలా అధిష్ఠానం అడుగుజాడల్లో నడిచే చైతన్యరాజు ఇప్పుడు తిరుగుబాటు అభ్యర్థిగా నిలబడటం వెనుక కాంగ్రెస్ అంతర్గత రాజకీయం చాలా భారీ స్థాయిలో ఉంటుందన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాకినాడలో ట్రిపుల్ ఐటీ శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి పల్లంరాజు మంత్రిత్వశాఖలో వుండే ఈ సంస్థలో చైతన్యరాజు భాగస్వామిగా వున్నారు. పల్లంరాజు ఆశీస్సులతోనే చైతన్యరాజుకు ఈ సంస్థలో భాగస్వామ్యం దక్కిందనేది బహిరంగరహస్యం. ఇప్పుడు చైతన్యరాజు తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలో నిలబడటం అధిష్ఠానం దగ్గర పల్లంరాజుకు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చే అవకాశం వుంది. ఇది తెలిసినా చైతన్యరాజు బరిలో నిలిచాడంటే, చైతన్యరాజు అభ్యర్థిత్వం వెనుక పల్లంరాజు హస్తం కూడా వుండే అవకాశం వుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధిష్ఠానం దగ్గర ఎప్పుడూ తన పట్టును కోల్పోకుండా నెగ్గుకొస్తున్న కేవీపీని ఈ ఎన్నికలలో దెబ్బతీయడానికే చైతన్యరాజును రంగంలోకి దించారా అనే అనుమానాలను కూడా రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. చైతన్యరాజుకు సీఎం ఆశీస్సులు కూడా వుండే అవకాశాలను కూడా తీసిపారేయాలేమని అంటున్నారు. చైతన్యరాజు బరిలో నిలవటం వెనుక మరో వ్యూహం కూడా వుండే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఓట్లతోపాటు జగన్ పార్టీ ఎమ్మెల్యేల ఓట్లు కూడా కలిస్తే చైతన్యరాజు గెలిచే అవకాశం వుందన్న అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే కాంగ్రెస్, వైకాపా తెరచాటు స్నేహం బయటపడే అవకాశం వుంది. అందువల్లే ఒక తిరుగుబాటు అభ్యర్థిని రంగంలోకి దించి, ఆ అభ్యర్థికి వైకాపా ఎమ్మెల్యేల ఓట్లు వేయించాలన్న ఆలోచన ఉన్నట్టు కొందరు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అలా చేయడం ద్వారా వైకాపా మద్దతుతో మరో రాజ్యసభ స్థానాన్ని సొంతం చేసుకోవచ్చన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ వుందని అంటున్నారు. ఈసారి రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏవేవో గజిబిజి వ్యూహాలు వేస్తూ తన సంఖ్యాబలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ బుర్ర తిరుగుడు వ్యూహాలు సామాన్య ప్రజలకు ఎంతమాత్రం కొరుకుడుపడటం లేదు.  

వినాశకాలే విపరీత బుద్ధి

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్నశాసనసభలో టీ-బిల్లుకి వ్యతిరేఖంగా సుదీర్గమయిన వాదన చేసిన తరువాత లోపభూయిష్టమయిన ఆ బిల్లుని వెనక్కి త్రిప్పి పంపమని కోరుతూ స్పీకర్ కు నోటీసు ఇచ్చారు. అంతేగాక బిల్లుని వ్యతిరేఖిస్తూ తీర్మానం నోటీసు కూడా ఇచ్చారు. దీనిపై తెలంగాణావాదులందరూ మండిపడుతున్నారు. కానీ, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ మాత్రం ముఖ్యమంత్రి కొత్తగా చెప్పిందేముందంటూ ఆయన వాదనలను చాలా తెలికగా కొట్టిపడేశారు.   శాసనసభ అభిప్రాయలు తెలుసుకోవడానికి మాత్రమే బిల్లును పంపాము, గనుక అందరూ తమ అభిప్రాయలు చెప్పవచ్చని, ఇంతవరకు 87మంది సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పారని, వారందరికీ కృతజ్ఞతలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చెపుతున్నట్లుగా బిల్లులో లోపాలు ఉన్నట్లయితే వాటికి పరిష్కారాలు కూడా రాజ్యాంగంలో ఉన్నాయని ఆయన అన్నారు.   ముఖ్యమంత్రి నిన్న సభలో మాట్లాడుతూ, జస్టిస్ జీవన్ రెడ్డి తీర్పుని పేర్కొంటూ రాష్ట్రానికి సంబంధించిన అంశంపై శాసనసభకు సర్వ హక్కులు ఉంటాయని, చేతిలో అధికారం ఉంది కదా అని కేంద్రం రాష్ట్ర శాసనసభ యొక్క హక్కులను కబళించలేదని గట్టిగా వాదించారు. ఆ హక్కులున్నందునే కేంద్రం బిల్లుని రాష్ట్ర శాసనసభకు పంపిందని, అందువల్ల బిల్లుని ఆమోదించే, వ్యతిరేఖించే హక్కు రాష్ట్ర శాసనసభకు ఉంటుందని ఆయన గట్టిగా వాదించారు. కానీ, దిగ్విజయ్ సింగ్ మాత్రంబిల్లుకి వ్యతిరేఖంగా రాష్ట్ర శాసనసభ ఎటువంటి అభిప్రాయలు వ్యక్తం చేసినా చివరికి తిరస్కరించినా దానిని పట్టించుకొనవసరం లేదనే విధంగా మాట్లాడుతున్నారు. అంతేగాక యావత్ రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి, అధికార, ప్రతిపక్ష శాసనసభ్యుల అభిప్రాయానికి అసలు విలువేలేదనట్లు మాట్లాడటం చూస్తే ఆయనకు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి రాజ్యాంగ విధానాల పట్ల, ప్రజాస్వామ్య వ్యవస్థపట్ల ఎంత చులకన భావం ఉందో అర్ధమవుతోంది. రాష్ట్ర శాసనసభకు, ముఖ్యమంత్రి మాటలకు విలువే లేదని కాంగ్రెస్ భావిస్తున్నపుడు వారిని అపహాస్యం చేయడానికే పంపినట్లవుతుంది.   బిల్లులో లోపాలు ఉంటే వాటికి రాజ్యాంగంలో పరిష్కారాలు కూడా ఉన్నాయని ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నారో కానీ, కాంగ్రెస్ అధిష్టానం తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం బిల్లుని ఎన్ని మెలికలు తిప్పినా, ఒకవేళ రాష్ట్రపతి బిల్లుపై వచ్చిన అభ్యంతరాలను, వ్యతిరేఖంగా వచ్చిన వాదనలను, ఇరుప్రాంతాలవారు కోరుతున్న సవరణలను పరిగణనలోకి తీసుకొన్నట్లయితే, అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు సంజాయిషీలు, వివరణలు చెప్పుకోవలసివస్తే తల దించుకోక తప్పదు.   ఒకవేళ ఆయన అభ్యంతరం చెప్పకపోయినా, రేపు బిల్లుకి వ్యతిరేఖంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయినప్పుడు, బిల్లు రాజ్యాంగ సూత్రాలకు విరుద్దంగా రూపొందించబడిందని కోర్టు భావిస్తే, అప్పుడు దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లుగానే వాటికి రాజ్యాంగ ప్రకారం పరిష్కారాలు చూపమని కేంద్రాన్ని ఆదేశిస్తే పోయేది కాంగ్రెస్ పరువే తప్ప రాష్ట్ర శాసనసభ పరువు కాదు.   బిల్లు తిరిగి వచ్చిన తరువాత దానిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తామని  ఒక్క ముక్కతో దిగ్విజయ సింగ్ సరిపెట్టి ఉందవచ్చును. కానీ, శాసనసభ బిల్లుపై ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినా మాకు నష్టం లేదనడం అహంకారమే. కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం కట్టబెట్టిన తెలుగు ప్రజల పట్ల దిగ్విజయ్ సింగ్ ఇంత చులకన భావం ఎందుకు ప్రదర్శిస్తున్నారో, ఇంత అవమానకరంగా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. ఆయన మాటల వలన సీమాంధ్రలో కాంగ్రెస్ పట్ల మరింత వ్యతిరేఖత పెరగడం తధ్యం.   కాంగ్రెస్ వ్యూహం ప్రకారం సీమాంధ్రలో కాంగ్రెస్ వ్యతిరేఖ ఓటుతో తన రహస్య మిత్రులకు రాజకీయ లబ్ది చేకూర్చి వారి నుండి మద్దతు పొందాలని భావిస్తోంది గనుకనే ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ప్రజలలో కాంగ్రెస్ పట్ల మరింత వ్యతిరేఖతను పెంచే ప్రయత్నం చేస్తున్నారేమో అనే అనుమానం కలుగుతోంది. వినాశకాలే విపరీత బుద్ది అని దీనినే అంటారేమో!

తెదేపా ఎన్నికల సన్నాహాలు ఇంకా ఎప్పుడు మొదలవుతాయో

  రాష్ట్ర విభజన కారణంగా తెదేపా చాలా విచిత్రమయిన, ఇబ్బందికరమయిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. రాష్ట్ర విభజన జరిగినా, జరుగకపోయినా రెండు ప్రాంతాలలో పోటీ చేయాలని భావిస్తున్నతెదేపా ఎన్నికలు దగ్గరపడుతున్నపటికీ, ఇంతవరకు తెలంగాణాపై దృష్టి కేంద్రీకరించలేకపోతోంది. ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరిగినట్లయితే, తెదేపా తెలంగాణా లో పోటీ చేయడానికి ఎన్నికల సంఘం వద్ద తమ పార్టీని జాతీయ పార్టీగా రిజిస్టర్ చేయించుకోవలసి ఉంటుంది. అంతే గాక తెలంగాణాకు ప్రత్యేకంగా ఒక అధ్యక్షుడిని, పార్టీ కార్యవర్గం, పాలక మండలి తదితర ఏర్పాట్లనీ చేసుకోవలసి ఉంటుంది. ఆ ఏర్పాట్లు చేసుకొని ఉంటే, వారు అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు గట్టిగా కృషి చేసేందుకు అవకాశం ఉండేది. అదేవిధంగా తెదేపా తెలంగాణాకు అనుకూలమనే సంకేతం ఇచ్చినట్లయి అక్కడి ప్రజలలో కూడా పార్టీ పట్ల నమ్మకం ఏర్పడేది.   కానీ, అదే కారణంగా పార్టీ సీమాంధ్రలో నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే తెదేపా ఇచ్చిన లేఖ కారణంగానే రాష్ట్ర విభజన జరుగుతోందని పనిగట్టుకొని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, వైకాపాలు, ఒకవేళ తెదేపా ఈ ఏర్పాట్లు మొదలుపెట్టినట్లయితే, తెదేపా రాష్ట్ర విభజనకు మొగ్గుచూపుతోంది కనుకనే తెలంగాణా కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసుకొంటోoదని మరింత బలంగా ప్రచారం చేస్తే, సీమాంధ్రలో పార్టీకి తీరని నష్టం కలగవచ్చును. అంతే కాక తెలంగాణాకి ప్రత్యేక పార్టీ శాఖ ఏర్పాటు చేసినట్లయితే దాని కోసం ఆధిపత్యపోరు మొదలయితే, అది పార్టీని తెలంగాణాలో మరింత బలహీనపరుస్తుందనే భయం కూడా ఉండి ఉండ వచ్చును. అందుకే తెలంగాణాలో పార్టీకి తీరని నష్టం జరుగుతున్నా తెదేపా చూస్తూ వెనక్కి తగ్గవలసి వస్తోంది.   బహుశః వచ్చేనెల పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందితే అప్పుడు వెంటనే రెండు రాష్ట్రాలలో తెదేపా శాఖల ఏర్పాట్లు చేసుకోవచ్చును. ఒకవేళ ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరగకుంటే యధాతధంగా కొనసాగవచ్చును. పార్లమెంటులో తెలంగాణా బిల్లు బహుశః ఫిబ్రవరి ఆఖరివారంలో ప్రవేశపెట్టబడవచ్చును. అందువల్ల తెదేపా మార్చి మొదటి వారం వరకు తెలంగాణా విషయంలో అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఈ లోగా అభ్యర్ధుల ఎంపిక ఒక కొలిక్కి వస్తే సీమాంధ్రలో పేర్లను విడుదల చేసి, ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టుకోవచ్చును.

వైకాపా మడికట్టుకోని ఎందుకు కూర్చోందో

  రాజ్యసభ ఎన్నికల ప్రకటన వెలువడగానే వైకాపాకు తగినంత బలం లేకపోయినా, కాంగ్రెస్, తెదేపాలను దెబ్బతీసేందుకయినా తన అభ్యర్ధులను రంగంలో దింపుతుందని అందరూ భావించారు. కనీసం ఒక్క అభ్యర్దినయినా నిలబెట్టి వైకాపాలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నసీమాంధ్ర కాంగ్రెస్, తెదేపా నేతలకు వలేసి క్రాస్ ఓటింగ్ కి ప్రోత్సహిస్తుందని అందరూ భావించారు. కానీ తగినంత మంది శాసనసభ్యుల బలం లేనందున తమ అభ్యర్ధులను నిలబెట్టడం లేదంటూ వైకాపా మడి కట్టుకొని కూర్చోవాలనుకోవడం చాలా ఆశ్చర్యకలిగిస్తోంది.   ఎదుటవాడివి రెండు కళ్ళు పోతాయంటే తనది ఒక కన్ను పోగొట్టుకోవడానికి కూడా సిద్దపడే వైకాపా ఇంత నీతిగా మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకు వైకాపా చెప్పిన మరోసాకు కూడా చాలా విడ్డూరంగా ఉంది. ఇతర పార్టీల బలంమీద ఆధారపడి అభ్యర్థిని నిలబెడితే అది కుమ్మక్కు రాజకీయాల్లో భాగమేనని, విభజనకు అనుకూలంగా మూడు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని న్నది తమ అభిప్రాయమని మైసూరా రెడ్డి ఆరోపించారు.   నిరుడు జరిగిన పంచాయితీ, సహకార ఎన్నికలలో వైకాపా తన రాజకీయ ప్రత్యర్దులతోనే కలిసి ఏవిధంగా షేరింగ్ చేసుకొందో అందరికీ తెలుసు. మరిప్పుడు నీతులు ఎందుకు ప్రభోదిస్తుందంటే, బహుశః కాంగ్రెస్ హై కమాండ్ నుండి పోటీకి అనుమతి రాకపోవడం వలననే కావచ్చును. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి వ్యతిరేఖంగా తమ అభ్యర్ధులను నిలబెట్టే ఆలొచనలో ఉన్నారు గనుక, కాంగ్రెస్ తన అభ్యర్ధులను గెలిపించుకోవాలంటే గతేడాది కాంగ్రెస్ లోనుండి వైకాపాలోకి గంపగుత్తగా వెళ్ళిపోయిన కాంగ్రెస్ శాసనసభ్యులందరి మద్దతు అవసరం ఉంటుంది. వారిని కాంగ్రెస్ పార్టీ అనర్హులుగా ప్రకటించినప్పటికీ, నేటికీ వారందరూ కాంగ్రెస్ శాసనసభ్యులుగానే వైకాపాలో కొనసాగుతున్నారు. గనుక, ఇప్పుడు వారి మద్దతు కోరి ఉండవచ్చును.   ఒకవేళ వైకాపా తన అభ్యర్ధిని కూడా పోటీలో నిలబెడితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు గనుకనే బహుశః పోటీ చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి పైకి కాంగ్రెస్ పార్టీని, దాని అధిష్టానాన్నిఎంతగా విమర్శిస్తున్నపటికీ, తమ మధ్య జరిగిన రహస్య ఒప్పందం మేరకు దానికి అన్నివిధాల మద్దతు కొనసాగించవచ్చును. కాంగ్రెస్ అధిష్టానం నిలబెట్టిన అభ్యర్ధులకు తగినంత బలం లేనట్లయితే వైకాపా శాసనసభ్యులు వచ్చి వారిని ఆదుకోవచ్చును. ఒకవేళ వైకాపా మద్దతు అవసరం పడకపోతే, వైకాపా యధావిధిగా తన నీతి సూక్తులు వల్లించుకొంటూ, కాంగ్రెస్, తెదేపా, కిరణ్ వర్గాలను విమర్శిస్తూ కాలక్షేపం చేసుకోవచ్చును. మరో రెండు వారాల్లో ఏ సంగతీ తేలిపోతుంది.

కొత్త పార్టీ ప్రచారానికి ప్రమోటర్స్ ఎవరో?

  గత వారం పదిరోజులుగా సమైక్యాంధ్ర పోస్టర్లు, హోర్డింగ్స్, టీవీ చానళ్ళలలో జోరుగా ప్రకటనలు సీమాంధ్ర ప్రజలను ఉరుములేని వర్షంలా కమ్ముకొంటున్నాయి. ప్రచారం ఇంత జోరుగా సాగుతున్న ఇంతవరకు ఈ ప్రచారం వెనుక ఎవరున్నారనే సంగతి చాలా గోప్యంగా ఉంచబడటం విశేషం.   పార్టీ స్థాపించి, దాని కార్యవర్గ సభ్యుల పేర్లు ప్రకటించి ఇంత భారీ ప్రచారం చేసి ఉండి ఉంటే చేస్తున్న ఖర్చుకి ఒక అర్ధం, పరమార్ధం ఉండేవి. కానీ కనీసం పార్టీ పేరు, వ్యక్తుల ఫోటోలు కూడా లేకుండా కోట్లు ఖర్చు చేసి ఇంత భారీ ఎత్తున ప్రచారం చేయడం చూస్తే, కొత్త పార్టీ వెనుక మంచి ‘సౌండ్ పార్టీలే’ ఉన్నాయని అర్ధమవుతోంది.   ఈ ప్రచారంలో నినాదాలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెపుతున్నమాటలే గనుక ఆయనే ఈ ఖర్చు అంతా భరిస్తున్నారా? అనే అనుమానం కలుగుతుంది. ఒకే ఒక వ్యక్తి ఇంత భారీగా ఖర్చు పెట్టడం కష్టమే కాదు చాల రిస్క్ తో కూడుకొన్న వ్యవహారం. గనుక మొదటి నుండి ఆయనను వెనకేసుకు వస్తూ అండగా నిలబడిన విజయవాడ యంపీ లగడపాటి రాజగోపాల్, మంత్రులు టీజీ వెంకటేష్, శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు తదితరులు బహుశః ఈ ఊరుపేరులేని కొత్త పార్టీకి పార్టనర్స్ మరియు ప్రమోటర్స్ అయ్యుండే అవకాశం ఉంది. వీరు కాక కొత్త పార్టీ పెడితే టికెట్స్ ఆశిస్తున్న లేదా ఖాయం చేసుకొన్నఅభ్యర్ధులు కూడా పెట్టుబడి పెడుతూ ఉండవచ్చును.   ఇక ఇందులో తెలుస్తున్నమరో విషయం ఏమిటంటే, ఎన్నికలలో పోటీచేసేందుకయితే ఎంతఖర్చుకయినా వెనుకాడని మన రాజకీయ నేతలు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ఇంత చేతి చమురు వదిలించుకోరు. కానీ ఖర్చు చేస్తున్నారంటే అర్ధం కొత్తపార్టీ ఎన్నికలనే లక్ష్యంగా చేసుకొని ఏర్పాటవుతోందని తెలుస్తోంది.   ఈరోజు లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడుతూ “పిచ్చ్ సిద్దమయింది. మరి అది బ్యాటింగ్ కి అనుకూలమో లేక బౌలింగ్ కి అనుకూలమో త్వరలో తేలిపోతుంది,” అని వ్యాక్యానించారు. ఆయన మాటల ప్రకారం బ్యాటింగ్ అంటే కొత్త పార్టీ స్థాపించి ఎన్నికలలో పోటీ చేయడం అనుకొంటే, బౌలింగ్ అంటే రాష్ట్ర విభజన చేస్తున్నకాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొత్తపార్టీ వెనక్కి తగ్గడంగా అనుకోవచ్చునేమో! అంటే ఈ ఒట్టొట్టి ప్రచారంతో కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు కాంగ్రెస్ అధిష్టానాన్నిభయపెట్టి లొంగదీసుకొని, రాష్ట్ర విభజన విషయంలో వెనక్కితగ్గేలా చేసి కొత్తపార్టీ కూడా వెనక్కి తగ్గుతుందని ఆయన చెపుతున్నారేమో! బహుశః అందుకే ఇంత భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నఎవరి పేర్లు బయటపడకుండా జాగ్రత్తపడుతున్నారు.   కానీ, కొత్త పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి మొలవబోయే మరో కొత్త కొమ్మేఅయినప్పుడు ఇంకా ఈ ముసుగులో గుద్దులాటలెందుకో? ఈ బ్యాటింగు, బౌలింగ్ దేనికో, ఈ పిచ్చిపిచ్చి పిచ్చులు దేనికో లగడపాటే చెప్పాలి మరి.

ఉత్తరా(మా)యణం

    .......కె. శివరామకృష్ణ     రాశాను ప్రేమలేఖలెన్నో... దశాను ఆశలెన్నో.. అంటూ ప్రణయ గీతం వినపడాలే కానీ కాలం యవనంలోకి తొంగి చూడని వారు ఉండరు! ఇప్పుడైతే.. చేశాను ఎస్ఎంఎస్ లెన్నో.. పంపాను ఊసులెన్నో' అంటూ ఈ తరం నాయకానాయికలు ' లవ్ ' చిందులేస్తారు. 'సెల్' కాలమొచ్చి నిద్రలేచావా' అంటూ మేల్కొలుపులు, సుప్రబాతం పలికి.. మంచిగా నిద్రపో' అంటూ పవళింపు సేవవరకు ఎప్పటికప్పుడు 'సొల్లు' తున్నారు కానీ.. ఇంతకుమునుపైతే.. అన్నింటికీ లేఖలతోనే రాయభారం నడిచేది చివరకు రాజకీయాల్లో నిర్ణయాలు, ప్రతిస్పందనలు కూడా లేఖల్లోనే బట్వాడా. అప్పట్లో.. రాజకీయ ప్రేమలేఖలు వెలుగు చూడడానికి నాలుగైదు రోజులు పట్టేది. ఎవరో ఒక లీకువీరుడు ఉప్పదించేదాక తాజా కబురు బయకి పొక్కెది కాదు. రాజకీయం స్పీడ్ పెరిగాక. అక్కడ లేఖ రాయడం ఇక్కడ లీకు చేయడం అంతా అరగంటకో వార్త బులిటెన్ సాక్షిగా బహిరంగ రహస్యమవుతుంది ! రాజకీయం ముదురు పాకాన పడే కొద్ది లేఖల్లో అక్షరాలు ఆయుధాలుగా మారతాయి ! ఈ అక్షరాలే శిలాఘాతాలై రాస్తాల్ని విభజించే పాశుపతాస్త్రాల అవుతాయనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష ఉదాహరణ. యూపీఎ నిర్ణయానికి ఆధారమైన కాంగ్రెస్ వర్కింగ్ పార్టీలన్నీ లేఖలు ఇచ్చాకనే మేం నిర్ణయం తీసుకున్నాం. అని ! భాషాప్రయుక్త రాష్ట్రాన్ని విడగొట్టే సత్తా అక్షరానికి ఉందా.. అనుమానం ఉంటె ఏ కాంగ్రెస్ కామందుడినడిగినా ఎదే చెబుతాడు.   విభజన లేఖలు, సమన్యాయం లేఖలు, రాజ్యాంగాన్ని కాపాడాలని ఆక్రోశించే లేఖలు. అఫిడవిట్లతో  లేఖలు, బహిరంగ లేఖలు అన్నీఇన్నని కాదులే! ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అన్నట్టుగా బోలెడు లేఖలు, కానీ ప్రేమలేఖల మతలబే  వేరు! ప్రేయసికైనా శ్రీమతికైనా లేదా శ్రీవరికైనా రాసే లేఖలో ప్రియాఅన్న పిలుపు నుంచి ఇట్లు నీ ప్రియసఖి /సఖుడు' అనేంతవరకు ప్రతి అక్షరం ప్రేమపాశమే. వరసమారితే ఈ ప్రేమదాసులే దేవదాసులన్నది వైన్షాపులకెరుక! ఆరోపణలు, రాజీనామాలతో లేఖలు రాసే రాజకీయ గోవిందయ్యలు కూడా ఈ  మధ్య ప్రేమలేఖలని పలవరిస్తున్నారు! షోకాజ్ల్ని, రాజీనామాల్ని ప్రేమిస్తున్నారు! విభజన నిర్ణయానికి సీమాంధ్రలో కాంగ్రెస్ చచ్చిపోయిందోచ్' అంటూ ఎదురైనా వారినల్లా గిల్లి మరీ చేబుతున్న జేసి దివాకర్ రెడ్డికి అధిష్టానం షోకాజ్ ఇచింది. పార్టీ పరువు బాగున్నడితే ,ఏమిటప్పా సంగతి ' అంటే అదేదో మా కుటుంబ వ్యవహారం లే అన్నట్టుగా నేతా శ్రీ బదులిచ్చే వారు. 'వేటుకు వేళయరా'  అని కోడై కూసే శికాజ్ కూడా ప్రేమలేఖ గా కనిపించింది. ఈ లెటర్, లో విరసమే ఉంటుందని తెలిసినా లేఖను ప్రేమించడం నేతాగణానికే చెల్లుతుంది. తన శాఖా మార్చాలని అలిగిన శ్రీధర్బాబు ఎడం చేత్తో పమపిన రాజీనామా గురించి సీఎం ను అడిగితె ' ఆ లేఖే కాదు.. చాలా ప్రేమలేఖలు అందుతున్నాయి అంటారు! ఈ లెక్కన ప్రేమలేఖల్ని రాజకీయనాయకులు తెగ ప్రేమించేస్తే ప్రేమికులేమైపోవాలి! వారి ప్రేమాయణం ఏం కావాలి! మనసుకింత హాయినిచ్చే కబుర్లు మోసుకొచ్చే ఉత్తరం ఇచ్చే పోస్ట్ మ్యానే కరువయ్యాడు! ఎక్కడన్నా.. అడపా దడపా పోస్ట్లు వినిపిస్తున్నాయే కానీ ఇవి తంతి తపాలా కార్యాలయం పోస్ట్లు కావండోయ్! అవన్నీ ట్విట్టర్,పేస్ బుక్, గూగుల్ ప్లస్,ఆర్కూట్ పోస్ట్లు. పోస్ట్లు రెండు కూడా ఊసుల మోపులే కానీ రెండింటికి కొంచం ధర్మబేధముంద. తపాలా లేఖను చిరునామాదారులే చదువుకుంటారు. ఇంటర్నెట్లో చేసే పోస్ట్ల్ల్ని విశ్వదర్శనం చేయిస్తారు. ఎవరు పోస్ట్ చేసినా మిగిలిన నెట్జీవుల్ని చూస్తాయి. వ్యాఖ్యలు, ప్రతివ్యాఖ్యలతో  పోస్ట్ని కాస్తా కామెంట్ భారతం' చేస్తాయి.  ఎన్నికల ప్రచారంలో నాయకులకు మైలేజీ ఇవ్వడంలోనూ' ఈ పోస్ట్'ల తీరే వేరు. కాంగ్రెస్, బీజెపి నాయకులైన దిగ్విజయ్, మోదీల మధ్య పోట్లా(స్ట్) ట నెటిజన్లను కూడా విభజన చేయడం షరా మామూలే! లక్ష కోట్లపై పేటెంట్ ఉన్న నాయకుడు ' సోనియమ్మను నేను నేను అడుగుతున్నా' అని ప్రశ్నించాగానే నెటిజన్లు కూడా ' నేను అడుగుతున్నా' అంటూ పేరడీ ప్రశ్నలతో పోస్టెత్తించారు. ల్యాండ్ ఫోన్ల పై మొబైల్ లా దాడి పెరిగాక తట్టి తపాలాశాఖ కాస్తా తంతే 'టపాలా శాఖగా' మారింది.  ఆ శాఖ ఉండేదంనట్టుగా  గోడకు వేలాడదీసిన తీగకు  గుది గుచ్చిన ఉత్తరాలే సాక్షి. హైటెక్ కాలంలోనూ ఉత్తరాలేంటి ? అని నొసలు చిట్లించబోయి మౌస్ క్లిక్ చేస్తాం కానీ..! అక్షరానిది అక్షయశక్తి. అక్షరాలను వెతుకుతూ ముందుకు పరిగెత్తే చూపుల వెనుక మనసు ఉరుకెత్తుతుంది. తోచినప్పుడల్లా లేఖాగుచ్చంలోని ఊసుల్ని నెమరవేసుకోవచ్చు. ఈ ముద్రణాలవల్లే 24 గంటల పాటు వార్తా ప్రత్యక్ష ప్రసారాలు చేసే టీవీ చేనెళ్ళు ఎన్ని వచ్చినా పత్రికలు' నెట్' కొస్తున్నాయి. ఏతావాతా ఉత్తరాలు బట్వాడా చేసే తపాలాశాఖ ఇటివలే కలం చేసిన ' టెలిగ్రామ్ ' లాగా టపా కట్టేయకుండా బతికి బట్టకట్టాలని ఉత్తర ప్రియుల ఆరాటం! ఇదంతా ఎందుకంటారా ' 'ఉత్తరామాయణ' కలం గుర్తుకొచ్చి ఉత్తి పుణ్యానికి చెప్పా!

రాజకీయాలలో ఐటెం గర్ల్!

  సినిమాలలో ఐటెం గర్ల్స్ ను చూసాము. చివరికి క్రికెట్ వంటి ఆటలలో చీర్ గర్ల్స్ ని కూడా చూసాము కానీ, రాజకీయాలలో ఐటెం గర్ల్స్ ని ఎన్నడూ చూసి ఉండము. రాజకీయాలలో ఆమాద్మీ పార్టీ ఒక ఐటెం గర్ల్ వంటిదని ప్రముఖ రచయిత, ఆమాద్మీ పార్టీ మద్దతుదారుడయిన చేతన్ భగత్ వ్యాఖ్యానించడం విశేషం.   ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సినిమా ఆఫర్లు దొరకని హీరోయిన్లు ఏవిధంగా ఐటెం గర్ల్స్ గా మారిపోతారో అదేవిధంగా ప్రభుత్వం నడపడం చేతకాని ఆమాద్మీ పార్టీ కూడా రాజకీయాలలో ఒక ఐటెం గర్ల్ గా మారిపోయిందిప్పుడు. సాక్షాత డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వం వహించి నడిరోడ్డు మీద రెండు రోజులు ధర్నా చేయడాన్ని చూసి నేను చాలా సిగ్గుపడుతున్నాను. రానున్నఎన్నికలలో ఆమాద్మీ పార్టీ దేశవ్యాప్తంగా పోటీచేయబోతున్నందున దేశప్రజల దృష్టిని ఆకర్షించాలనే ప్రయత్నంలో ధర్నాకు కూర్చోవడం సిగ్గుచేటు,” అని అన్నారు.   దేశంలో తక్కువ ధర ప్లేన్ టికెట్స్ పరిచయం చేసిన గోపీనాథ్ ఆమాద్మీ పార్టీలో సభ్యుడు కూడా. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈవిధంగా నడిరోడ్డు మీద ధర్నాలు చేయడం ఏవిదమయిన సంకేతాలు పంపిస్తుంది? సమస్యలుంటే వాటిని తన కార్యాలయంలో కూర్చొని పరిష్కరించాలి తప్ప ఇలా నడిరోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేయడం, ప్రజలకి ఇబ్బందులు కలిగించడం సరయిన పద్ధతి కాదు,” అని అన్నారు.   ఒకప్పుడు ఆయనతో కలిసి పనిచేసిన మాజీ పోలీసు అధికారిణి కిరణ్ బేడీ మరో అడుగు ముందుకు వేసి, “పరిపాలించలేని ఆమాద్మీ ప్రభుత్వాన్ని వెంటనే డిస్మిస్ చేయాలని కేంద్రాన్ని కోరారు.”   అపూర్వమయిన ప్రజాధారణతో ప్రభుత్వ పగ్గాలు చెప్పటిన ఆమాద్మీ పార్టీపై దేశ వ్యాప్తంగా ప్రజలు చాలా ఆశలు పెట్టుకొన్నారు. అదేవిధంగా ఆమాద్మీ పార్టీ కూడా ప్రజలకు అనేక ఆశలు రేపింది. బహుశః ఈ మూడు వారాల పాలనలోనే అవన్నీఆచరణ సాధ్యం కావని గ్రహించిందో లేక తన పరిమితులు గ్రహించడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఈవిధమయిన చవకబారు ఎత్తుగడలతో కాలక్షేపం చేస్తోందో కానీ మొత్తం మీద, కేవలం మూడు వారాలలోనే ఆమాద్మీ తన పరువు పోగొట్టుకొంది.   వచ్చే ఎన్నికలలో దేశంలో అన్ని రాష్ట్రాలలో వీలయినన్ని ఎక్కువ యంపీ స్థానాలకు పోటీ చేస్తానని ప్రకటించిన ఆమాద్మీ ఈ ధర్నాతో ఇతర రాష్ట్ర ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేయబోతే అది కాస్తా బెడిసికొట్టి పార్టీ ప్రతిష్టను మంటగలపడం వలన తన అవకాశాలను తానే స్వయంగా పాడుచేసుకొన్నట్లయింది. ప్రజల సమస్యలు తీర్చుతుందని ఆమాద్మీని ఎన్నుకొంటే ఇప్పుడు అదే ప్రజలకు సమస్యగా మారడం విచిత్రం.   ఆమాద్మీ వైఫల్యం కాంగ్రెస్. బీజేపీలకు వచ్చేఎన్నికలలో వరంగా మారవచ్చును. అటువంటి పార్టీలకు ఓట్లు వేస్తే ఏవిధంగా వృధా అవుతాయో అవి కధలుకధలుగా చెప్పి, ప్రజలను తమ వైపుకి త్రిప్పుకోవచ్చును. అందువల్ల ఆమాద్మీ ఇప్పటికయినా మేల్కొని మిగిలిన కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని, తన హామీలను అమలుచేయలేకపోయినా, కనీసం డిల్లీలో చక్కని పాలన అందించే ప్రయత్నం చేసినా ఉన్నఆ పరువయినా మిగులుతుంది. లేకుంటే, వచ్చే ఎన్నికల తరువాత ఆమాద్మీ నామరూపాలు లేకుండా మయమయిపోవడం తధ్యం.

తెలంగాణాపై కాంగ్రెస్, బీజేపీల డబుల్ గేమ్స్-1

                                                                                కాంగ్రెస్ వ్యూహం: కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణా అంశంతో చాలా కాలంగా దాగుడు మూతలు ఆడుతున్నాయి. ఎన్నికలలోగా రాష్ట్ర విభజన చేసి, తెలంగాణా ఏర్పాటు చేస్తానని కాంగ్రెస్ పార్టీ చెపుతున్నపటికీ, సకాలంలో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి దానిని ఆమోదింపజేస్తుందో లేదో అనుమానమే. ఇక, బీజేపీ బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తామని చెపుతున్నపటికీ, దాని మాటలకి చేతలకి ఎక్కడా పొంతన కనబడటం లేదు. రాష్ట్ర విభజన ద్వారా రాష్ట్రంలో తన రాజకీయ ప్రత్యర్ధులను చావుదెబ్బతీసి, అధికారం చేజిక్కించుకోవాలని కలలుగంటున్నకాంగ్రెస్ పార్టీ, ప్రస్తుత పరిస్థితుల్లో తప్పకుండా రాష్ట్ర విభజన చేస్తుందనే నమ్మకం లేదు. ఎందుకంటే, విభజన చేసినా, చేయకపోయినా తెలంగాణాలో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు. ఇంతవరకు వెలువడిన సర్వేలలో తెరాసకే విజయావకాశాలు ఎక్కువని తేలడంతో, కేసీఆర్ విలీనానికి ఇష్టపడటం లేదు. తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకపోయినట్లయితే తెరాసను తట్టుకొని కాంగ్రెస్ గెలవలేదు. రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెస్ సీమాంధ్రలో చాలా వ్యతిరేఖత మూటకట్టుకొంది. అందుకే ఆ వ్యతిరేఖతను కూడా తెలివిగా సొమ్ము చేసుకొని రానున్నఎన్నికలలో గెలిచేందుకు కిరణ్ కుమార్ రెడ్డితో మరో ‘కాపీ కాంగ్రెస్ పార్టీ’ స్థాపనకు కూడా రంగం సిద్దమవుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అమలు చేస్తున్నవ్యూహం ప్రకారం సీమాంధ్రలో సమైక్యవాదంతో కిరణ్, జగన్ ఇద్దరు గెలవాల్సి ఉంటుంది. అయితే అందుకు రాష్ట్ర విభజన చేయడం కంటే, అంతవరకు తీసుకువెళ్ళగలిగితేనే వారిరువురూ ఎన్నికలలో పూర్తి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఒకసారి రాష్ట్ర విభజన జరిగి ఎన్నికలలోగా తెలంగాణా కూడా ఏర్పాటయిపోయినట్లయితే, ఇక వారు చేసే సమైక్యవాదానికి అర్ధం ఉండదు గనుక కాంగ్రెస్ పార్టీ విభజన ప్రక్రియను కడదాకా తీసుకు వెళ్లి బీజేపీ మీద నెపం నెట్టి బయటపడవచ్చును. లేదా బిల్లుని రాష్ట్రపతి వద్ద త్రొక్కిపెట్టించయినా తప్పుకోవచ్చును. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వచ్చేఎన్నికలలో గెలిస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణా సమస్యను తాపీగా పరిష్కరించుకొనే అవకాశం ఉంటుంది. ఓడిపోయేట్లు ఉంటే, తెలంగాణా సమస్యను మరింత జటిలం చేసి వదిలిపెట్టవచ్చును.

తెలంగాణాపై కాంగ్రెస్, బీజేపీల డబుల్ గేమ్స్-2

                                           బీజేపీ  వ్యూహం ఇక, బీజేపీ విషయానికి వస్తే, తెలంగాణా బిల్లుకి మద్దతు ఈయడమంటే కాంగ్రెస్ గెలుపుకి తోడ్పడటమే అవుతుంది. గనుకనే, మొదటి నుండి సమన్యాయం రాగం ఆలపిస్తూ తన జాగ్రత్తఃలో తాను ఉంది. ఆ ప్రయత్నంలోనే మొన్న డిల్లీలో తన సీమాంధ్ర నేతలతో ర్యాలీ చేయించి దానికి వెంకయ్యనాయుడిని పంపించి తన మనసులో మాట బయటపెట్టింది. తాము తెలంగాణా ఏర్పాటు కోరుకోతున్నామని చెపుతూనే, సీమాంధ్రకు అన్యాయం జరగకుండా బిల్లులో కొన్ని సవరణలు పెడతామని వెంకయ్యనాయుడు ద్వారా సూచింది.   రాష్ట్ర విభజన చేసి సీమాంధ్ర ప్రజల ఆగ్రహానికి గురయిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీజేపీ సీమాంధ్ర ప్రాంతానికి అనుకూలంగా చేసే ప్రతిపాదనలను తిరస్కరించలేదు. అలాగని వాటిని ఆమోదించి తెలంగాణా ప్రజలకు ఆగ్రహం కలిగించలేదు. గనుక, ముందుగానే ఈవిధంగా హెచ్చరించి కాంగ్రెస్ పార్టీని వెనక్కి తగ్గేలా చేయగలిగితే దానిపై నెపం వేసి తప్పుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకే వచ్చే ఎన్నికలలో తమ పార్టీ గెలిస్తే ఇరుప్రాంత ప్రజలకి పూర్తి ఆమోదయోగ్యంగా రాష్ట్ర విభజన చేస్తామని బీజేపీ అధ్యక్షుడు రాజ నాథ్ సింగ్ తో సహా బీజేపీ అగ్రనేతలందరూ కొత్త పల్లవి అందుకొన్నారు. అచ్చ తెలంగాణావాది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పుడు గతంలో మాదిరిగా తమ పార్టీ తెలంగాణా బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తుందని గట్టిగా చెప్పలేకపోవడానికి కారణం కూడా అదే.   వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో బీజేపీ మరిన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకోవాలంటే, మరింత బలంగా తెలంగాణా వాదం వినిపించాల్సి ఉంటుంది. అలా జరగాలంటే వచ్చే ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరగకూడదు గనుక బిల్లుకి బీజేపీ బిల్లుకి మద్దతు ఈయకుండా తప్పుకోవచ్చును. అదేవిధంగా, సీమాంధ్రలో తెదేపాతో జత కట్టాలని భావిస్తున్న బీజేపీ అక్కడ కూడా లాభాపడాలంటే, కాంగ్రెస్ పార్లమెంటులో తెలంగాణా బిల్లుని ప్రవేశపెట్టినా, పెట్టకపోయినా వెంకయ్య నాయుడు వంటి వారు గట్టిగా సీమాంధ్ర హక్కుల గురించి మాట్లాడవలసి ఉంటుంది. ఇప్పుడు ఆయన అదే చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ లెక్కలు సరిచూసుకొని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినట్లయితే, ముందే చెప్పినట్లుగా బీజేపీ బిల్లులో సీమాంధ్రకు అనుకూలంగా కొన్ని సవరణలు సూచించి కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టి తను క్షేమంగా బయటపడే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ ఏ కారణంగానయినా బిల్లుని ప్రవేశపెట్టకపోయినా అంతకంటే ఎక్కువ రాద్ధాంతం చేసి, తెలంగాణా ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేయడం ఖాయం. అందువల్ల, ఈ రెండు ప్రత్యర్ధ పార్టీలు ప్రజలకిచ్చిన మాట కోసం ఒకదానికొకటి సహకరించుకొని వచ్చే ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు చేస్తాయని నమ్మడం కష్టం.

నేరారోపణలు ఎదుర్కొంటున్న శశీధరూర్ కి కాంగ్రెస్ సానుభూతి !

  కేంద్ర మంత్రి శశీధరూర్ భార్య సునంద పుష్కర్ రెండు రోజుల క్రితం డిల్లీలో ఒక ప్రముఖ హోటల్ లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన భర్తకు మెహర్ తరార్ ఒక పాకిస్తానీ పాత్రికేయురాలితో వైవాహికేతర సంబంధం ఉందని, ఆమె తమ కాపురంలో చిచ్చుపెట్టినట్లు సునంద ఆరోపించింది. అంతేగాక, మెహర్ తరార్ పాకిస్తానీ గూడచారి సంస్థ ఐ.యస్.ఐ. ఏజెంట్ కూడా అని ఆమె ఆరోపించారు. ఈ నేపధ్యంలో సునంద పుష్కర్ హోటల్ రూములో అనుమానాస్పద పరిస్థితిలోమరణించడంతో, ఆమె భర్త శశీధరూర్ తన నిర్దోషిత్వం నిరూపించుకోవలసి ఉంది.   సునంద ఆరోపిస్తునట్లు శశీధరూర్ వైవాహికేతర సంబంధం కలిగి ఉండటం నిజమయితే అదొక నేరము. ఇక కేంద్రమంత్రి వంటి ఒక బాధ్యాతాయుతమయిన పదవిలో ఉంటూ, ఒక పాకిస్తానీ మహిళతో అందునా ఒక పాత్రికేయురాలు, పాకిస్తానీ గూడచారి సంస్థ ఐ.యస్.ఐ. ఏజెంట్ అని ఆరోపింపబడుతున్నవ్యక్తితో సంబంధాలు కలిగి ఉండటం మరో తీవ్రమయిన నేరం. సునంద పుష్కర్ వంటి ఒక మహిళ తన భర్తపై ఊసుపోక ఆరోపణలు చేసి ఆత్మహత్య చేసుకొంటుందని భావించలేము. కానీ, ఆమె ఆరోపణలలో నిజానిజాలు ఎలా ఉన్నపటికీ, వారిరువురి మధ్య పాకిస్తానీ మహిళా కారణంగానే చాలా గొడవలు జరిగాయని, చివరికి అదే ఆమె మరణానికి దారి తీసినట్లు స్పష్టమవుతోంది.   ఈ వ్యవహారంలో శశీధరూర్ దోషా, నిర్దోషా? అనే సంగతిని తేల్చవలసింది పోలీసులు. కానీ, సునంద పుష్కర్ మరణం తరువాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సహా మొత్తం కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆయనకు సంతాపం తెలిపేందుకు బారులు తీరడంతో అతను నిర్దోషని వారు ముందే దృవీకరిస్తునట్లుంది. ఒక పాకిస్తానీ మహిళతో వైవాహికేతర సంబంధం, భార్య అనుమానస్పద మరణం వంటి రెండు తీవ్ర అభియోగాలను ఎదుర్కొంటున్న శశీధరూర్ ని, ముందుగా మంత్రి పదవిలోనుండి తప్పించి, ఆయనపై విచారణకు ఆదేశించవలసిన కాంగ్రెస్ అధిష్టానం, అతనికి సానుభూతి చూపడం ఒక తప్పయితే, అతనికి తమ మద్దతు ఉన్నట్లుగా వ్యవహరించడం ద్వారా పోలీసు విచారణను, కేసును కూడా పరోక్షంగా ప్రభావితం చేయడం మరో పెద్ద తప్పు. స్వయంగా ఒక మహిళా అయిన సోనియా గాంధీ, సాటి మహిళకు అన్యాయం చేసిన (చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న) వ్యక్తిని స్వయంగా పరామర్శించడం చాలా తప్పని చెప్పవచ్చును. అదే ఒక సాధారణ వ్యక్తి ఇటువంటి నేరారోపణలు ఎదుర్కొంటునట్లయితే సమాజం అతనిని ఇంచుమించుగా వెలివేసినంత పనిచేసేది. మహిళా సంఘాలు కూడా ఉద్యమించి ఉండేవి. కానీ, శశీ ధరూర్ కేంద్రమంత్రి కావడంతో అతనికి మినహాయింపు దక్కిందేమో! అని భావించాల్సి ఉంటుంది.                 

సమైక్య పార్టీ రిలీజ్ ఎప్పుడు?

సీమాంధ్రలో కొత్త రాజకీయ పార్టీ స్థాపనకి తెర వెనుక సన్నాహాలు చాలా జోరుగానే సాగుతున్నట్లున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల తరచూ పలుకుతున్న“సమైక్యం మా విధానం, సమైక్యాంధ్ర మా నినాదమంటూ” వ్రాసి ఉన్నపోస్టర్లు, భారీ ఫ్లెక్సీ బ్యానర్లు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో, ప్రధాన కూడళ్ళలో ఇప్పుడు విరివిగా కనిపిస్తున్నాయి. కానీ పోస్టర్లలో ఏ రాజకీయ నేత ఫోటో లేకపోవడంతో, కొత్త పార్టీపై ప్రజలలో, మీడియాలో కూడా చర్చ సాగుతోంది. దానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సారధ్యం వహిస్తారని అందరూ భావిస్తున్నపటికీ ఇంతవరకు ఆయన మాత్రం బయటపడలేదు.   పార్టీ పెట్టకమునుపే, పార్టీ ఊరు పేరు కూడా లేకుండా ఇంత భారీ ఖర్చుతో భారీ ఎత్తున ప్రచారం చేయడం చూస్తే కనీసం రెండు మూడు పెద్ద తలకాయలు దీనివెనుక ఉండవచ్చుననిపిస్తోంది. ఒకవేళ ఇది కూడా కాంగ్రెస్ అధిష్టానం వ్యూహంలో భాగమే అయినట్లయితే, కొత్త పార్టీ స్థాపనకు తెరవెనుక నుండి కాంగ్రెస్ కూడా సహాయపడుతున్నా ఆశ్చర్యం లేదు. కానీ, ఇందులో ప్రస్తుతానికి ప్రధాన పాత్రధారులుగా ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులయిన శైలజానాథ్, టీజీ వెంకటేష్, గంటా శ్రీనివాసరావు, లగడపాటి తదితరులు కనిపిస్తున్నారు. వీరికి ఏపీయన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబును కూడా జోడించుకోవచ్చును. ఆయన ఈ కొత్తపార్టీలో చేరడమో లేక దానికి తమ ఉద్యోగుల పూర్తి మద్దతు అందించడమో చేయవచ్చును. బహుశః జనవరి 23ముహూర్తం ఖరారు చేసుకొని ప్రచారం మొదలుపెట్టినట్లున్నారు గనుక, ఆరోజుకి ఈ కొత్త సమైక్య పార్టీపై పూర్తి స్పష్టత రావచ్చును.