రాహుల్ కామెడీ!
posted on Jan 30, 2014 @ 7:20PM
రాబోయే ఎన్నికల తర్వాత దేశానికి ప్రధాని అయిపోవాలని కలలు కంటున్న రాహుల్‌గాంధీ వ్యవహారశైలి, ఆయన మాట్లాడే తీరు చూసి రాజకీయ వర్గాలు నవ్వుకుంటున్నాయి. ప్రజలు నవ్వాలో ఏడవాలో అర్థంకాక విస్తుపోతున్నారు. ఖర్మకాలి వచ్చే ఎన్నికల తర్వాత ఈయనగానీ దేశ ప్రధాని అయిపోడు కదా అని భయపడిపోతున్నాడు. ఆమధ్య నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని సృష్టించాయి.
రాజకీయ అపరిపక్వతతో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ నెత్తిన బండల్లా మారాయి. ముజఫర్ నగర్ అల్లర్ల విషయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులకే నచ్చలేదు. అలాగే తనకు ప్రాణహాని వుందంటూ రాహుల్ గాంధీ మాట్లాడిన పిరికిమాటలు ఆయన స్థాయిని చెప్పకనే చెప్పాయి. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేలమట్టం కావడానికి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాహుల్ గాంధీ పిల్ల చేష్టలు, విచిత్రమైన మాటలు చూసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన మీదే ఆధారపడి ఆయన్నే కాబోయే ప్రధానిగా ప్రమోట్ చేస్తోంది. సోనియాగాంధీ కొడుకుగా పుట్టిన పుణ్యానికి ఆయనకి దక్కుతున్న అదృష్టమది. లేటెస్ట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను స్వీకరించిన రాహుల్ ప్రస్తుతం పేపర్లలో ఆఫ్ పేజీ ప్రకటనలు ఇచ్చుకుంటూ, ఛానెళ్ళలో తన బొమ్మ నిండుగా కనబడేట్టు చూసుకుంటున్నారు.
ఈ మధ్య ఒక జాతీయ ఛానెల్లో రాహుల్ గాంధీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు రాహుల్ గాంధీ ఇచ్చిన సమాధానాలు విని అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతమాత్రం పరిణతి లేకుండా రాహుల్ చెప్పిన సమాధానాలు నవ్వు తెప్పించేలా వున్నాయని ముక్తకంఠంతో అంటున్నారు. ఆచితూచి, ఒక పద్ధతి ప్రకారం, ఒక అవగాహనతో మాట్లాడే నరేంద్రమోడీకి - నోటికి ఏది వస్తే అది మాట్లాడే రాహుల్ గాంధీకి మధ్య పోటీనా అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్‌గాంధీ ఒక పాపులర్ కమెడియన్‌గా తయారయ్యాడని అంటున్నారు.