ఈ దాహం తీరనిది..

      కర్నాటక జలదాహం అంత ఈజీగా తీరేట్టు కనిపించడం లేదు. అటు కావేరీ నది విషయంలో తమిళనాడు నోరు కొడుతోంది. ఇటు కృష్ణానది విషయంలో ఆంధ్రప్రదేశ్ గొంతు ఎండేలా చేస్తోంది. అయినా ఇంకా నీళ్ళ కరువు తీరనట్టు వ్యవహరిస్తోంది. తాజాగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో మిగులు జలాల విషయంలో ఆంధ్రకు అన్యాయం. కర్ణాటకకు అపాత్రదానం జరిగిపోయింది.   ఈ విషయంలో తప్పు ఎవరిదన్న విషయంలో వివిధ రాజకీయ పార్టీలు ఒకరిమీద ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నప్పటికీ మొత్తమ్మీద తెలుగువాడికి అన్యాయం జరిగింది. ఈ విషయంలో కేంద్రంతో తీవ్రంగా పోరాడాల్సిన అవసరం వుంది. రాజకీయాలకు అతీతంగా తెలుగువారందరూ ఒక్కటై ఈ విషయంలో మనకున్న హక్కును సాధించుకోవాల్సిన అవసరం వుంది. బ్రిజేష్ కుమార్ తీర్పు ఇప్పటికే తెలుగు ప్రజల గుండె మండిపోయేలా చేస్తుంటే, కర్నాటక ప్రజలు సంబరాలు చేసుకునేలా చేసింది. ఇప్పటికే అదనంగా దక్కిన నీటి వాటాతో సంతృప్తి చెందని కర్ణాటక ఇప్పుడు మరో వివాదాన్ని పైకి తీసుకొచ్చింది. నీటి విషయంలో తన కక్కుర్తి బుద్ధిని బయటపెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌కి పంపిణీ చేస్తున్న నీటిలో నాలుగు టీఎంసీల నీటి మీద తనకు హక్కు వుందని, ఆ నాలుగు టీఎంసీలను ఆంధ్రకు పంపడం ఆపి వాటిని తనకే కేటాయించాలని కర్ణాటక భావిస్తోంది. దీనికోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. మరి ఈ విషయంలో అయినా తెలుగు ప్రజలు కలసి కట్టుగా పోరాటం చేస్తారో లేక తమలో తాము కలహించుకుంటూ కర్ణాటక ఈ విషయంలోనూ గెలిచేలా చేస్తారో చూడాలి.

నిరాశలో టీ-వాదులు!

      కేంద్రంలో చకచకా మారుతున్న పరిణామాలు తెలంగాణ వాదులలో నిరాశను కలిగిస్తున్నాయి. మొన్నటి వరకూ అంతా తమకు అనుకూలంగా వున్నాయని అనుకుంటున్న పరిస్థితులు రోజు రోజుకు మారుతూ రాయల తెలంగాణ వరకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాయల తెలంగాణ అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తోందన్న వార్తలు రావడంతో తెలంగాణ వాదులు ఖిన్నులయ్యారు.   రాయల తెలంగాణ ప్రతిపాదనకు తాము ఎంతమాత్రం ఒప్పుకునేది లేదని అన్ని పార్టీలకు చెందిన తెలంగాణవాదులు తేల్చేసి చెప్పేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు సంబంధించిన ఆందోళన ఇంకా అందరి మనసులలో వుండగానే, శీతాకాల సమావేశాలలో తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశాలు తక్కువంటూ వచ్చిన వార్తలు విభజనవాదులను మరింత ఆందోళనకు గురిచేశాయి. శీతాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం నాడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ బిల్లు ఈ సమావేశాలలో వచ్చే అవకాశం లేదన్న సంకేతాలు స్పష్టంగా వ్యక్తమయ్యాయి. ఇది టీ-వాదులను పూర్తి నిరాశలో ముంచేసింది. అయితే అవకాశం లేదు లేదంటూనే ఈ సమావేశాల్లోనే టీ బిల్లు తేవడానికి కృషి చేస్తామని కేంద్రం చెప్పడం టీ-వాదులలో ఏదో ఒకమూల ఆశ మిణుకు మిణుకుమనేలా చేసింది. అయితే కేంద్రం ఈ సమావేశాల్లో టీ-బిల్లు తేదని పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో తెలంగాణ అంశాన్ని ఎవరూ ఊహించని విధంగా టేబుల్ ఐటమ్‌గా ఆమోదించిన చరిత్ర కాంగ్రెస్‌కి వుంది. అదే తరహాలో ఎవరూ ఊహించని విధంగా బిల్లును పార్లమెంటులో ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం నిరాశ అలమకుని వున్న తెలంగాణ వాదులు కేంద్రం తమ విషయంలో సానుకూలంగా వుంటుందన్న అభిప్రాయంలో వున్నారు. ఈ సమావేశాల్లోనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఈ కృషిలో పూర్తిస్థాయిలో నిమగ్నమై వున్నారు.

ఇదేం విడ్దూరం?!

      కృష్ణానది మిగులు జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల మీద పిడుగులా పడిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతమాత్రం కదిలించడం లేదు. ఈ తీర్పు ద్వారా తెలుగు వారికి అన్యాయం జరిగిందని దేశమంతటా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, రాష్ట్రంలోని చాలా పార్టీలు, ప్రజలు ఈ తీర్పు పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నప్పటికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ, అటు కేంద్ర ప్రభుత్వం గానీ ఎంటర్‌టైన్‌మెంట్ చూస్తున్నాయే తప్ప ఇది అన్యాయం అనే సాహసం చేయలేకపోతున్నాయి.   రాష్ట్రంలోని పార్టీలలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీఆర్‌ఎస్ మినహా మిగిలిన పార్టీలన్నీ ఇది దారుణమని బాధపడుతున్నాయి. టీఆర్ఎస్ ఈ తీర్పు విషయంలో పెద్దగా స్పందించలేదు. ఇది పెద్దగా పట్టిచుకోవాల్సిన అంశం కాదని లైట్‌గా తీసుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరుస్తోంది. ఇక వైఎస్సార్సీపీ అయితే నేరమంతా చంద్రబాబు మీద వేయడానికి ప్రయత్నం చేసింది. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిపడిందని చెబుతూ మోకాలికి, బోడిగుండుకి ముడి వేసే ప్రయత్నం చేయడం మరో ఆశ్చర్యకరమని విశ్లేషకులు అంటున్నారు. మిగులు జలాలు అడగం అని వైఎస్సార్ లేఖ రాసిన విషయం వైఎస్సార్సీపీ మరచిపోయినట్టు నటిస్తోందని అనుకుంటున్నారు. ఇక అధికార కాంగ్రెస్ అయితే ఇది అసలే సమస్యే కాదన్నట్టు వ్యవహరించడం ఆ పార్టీకి తెలుగు వారి పట్ల వున్న చులకన భావానికి మరో తార్కాణంగా నిలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయం మీద తీవ్రంగా ప్రతిస్పందించిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వాదనను కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తూ వుండటం ఊహించిన పరిణామమేని వారు అంటున్నారు. అన్ని విషయాలలోనూ తెలుగువారు అన్యాయానికి గురవుతూ, అనాథలుగా మిగిలిపోవడం దారుణమని భావిస్తున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు విషయంలో రాష్ట్రపతి జోక్యం ద్వారానే తెలుగువారికి న్యాయం జరిగే అవకాశం వుంది కాబట్టి అన్ని పార్టీలూ విభేదాలు పక్కన పెట్టే ఈ విషయంలో సరైన రీతిలో కృషి చేస్తేనే ఫలితం వుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 సిద్దం

  ఈ రోజు కేంద్రమంత్రి మరియు కేంద్రమంత్రుల బృందంలో సభ్యుడు అయిన జైరాం రమేష్ 69పేజీలు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013(జీ.ఓ.యం. నివేదిక)ను దాదాపు సిద్దం చేసినట్లు సమాచారం. దానిని మంగళవారం నాడు జరుగబోయే కేంద్రమంత్రుల బృందం సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఆయన సిద్దం చేసిన నివేదికలో ప్రస్తుతం తెరపైకి వచ్చిన రాయల తెలంగాణాను ప్రతిపాదించారా లేక ముందు అనుకోన్నట్లుగానే ఆంధ్ర, తెలంగాణాలనే ప్రతిపాదించారా? అనే అంశం రేపు జరిగే తుది సమావేశం తరువాతనే తెలియవచ్చును. హైదరాబాద్ అంశం కూడా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.   ఈనెల 5నుండి 20వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగబోతున్నందున, కేంద్రమంత్రి కమల్ నాథ్ సోమవారం నాడు డిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ శీతాకాల సమావేశాలలోనే తెలంగాణా బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, ఒకవేళ కుదరకపోతే సభ్యుల కోరిక మేరకు సమావేశాలు పొడిగించే అవకాశం ఉందని అన్నారు.   కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కూడా రాయల తెలంగాణా ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు తెలిపారు. అయితే దానిని వ్యతిరేఖిస్తున్నానని అన్నారు. బిల్లు తుది దశకు చేరుకొంటున్న ఈ తరుణంలో అటువంటి ప్రతిపాదనల వల్ల ఎవరికీ లాభం లేకపోగా కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అన్నారు. అటువంటి ప్రతిపాదనే ఉంటే, దానిని అడ్డుకొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానని అన్నారు.

కాంబ్లీ గుండెపోటు నిజమేనా?

      మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి గతంలో ఒకసారి గుండెకి సంబంధించిన సమస్య వచ్చింది. దానికి సంబంధించి చికిత్స కూడా జరిగింది. తాజాగా ఈమధ్య మరోసారి కారులో వెళ్తున్న కాంబ్లీకి గుండెపోటు వచ్చింది. సమయానికి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడే వుండటంతో ఆయన కాంబ్లీని అర్జెంటుగా హాస్పిటల్‌కి తరలించడం జరిగింది. ప్రస్తుతం కాంబ్లీ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. హాస్పిటల్‌లో కోలుకుంటున్నాడు. ఇది అందరికీ తెలియని విషయమే..   అయితే కాంబ్లీ గుండెపోటు విషయంలో ఆయన గురించి బాగా తెలిసున్నవారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంబ్లీ అగ్రశ్రేణి క్రికెటర్‌గా ఎదిగినప్పటికీ  కాంబ్లీ కేరెక్టర్ ఎవరూ హర్షించే విధంగా వుండదన్న అభిప్రాయాలున్నాయి. సకల దుర్గుణాలూ, అవలక్షణాలూ వున్న కాంబ్లీ కుటుంబం నుంచి మాత్రమే కాకుండా సమాజం నుంచి స్నేహితుల నుంచి కూడా దూరమైపోయాడు. తన బాల్యమిత్రుడు సచిన్ టెండూల్కర్ కూడా కాంబ్లిని దూరంగా పెట్టాడు. గతంలో కాంబ్లి మీద ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. అన్ని రకాలుగా పతనమైపోయిన కాంబ్లి ఇప్పుడూ ఎవరికీ అవసరం లేని, ఎవరూ పట్టించుకోని వ్యక్తిగా మిగిలిపోయాడు. సచిన్ తనను పట్టించుకోవడం లేదని గతంలో కామెంట్లు చేయడంతో సచిన్ అతన్ని పూర్తిగా కట్ చేశాడు. తాజాగా సచిన్ రిటైరైన తర్వాత జరిగిన విందుకు కూడా సచిన్ కాంబ్లీని ఆహ్వానించలేదు. సచిన్ తనను పిలవలేదని కాంబ్లీ టీవీలో ఎక్కి మరీ బాధపడ్డాడు. కెమెరాల ముందు కన్నీరు కార్చాడు. ఇలాంటి ట్రిక్కులు ప్రదర్శించడంలో కాంబ్లి సిద్ధహస్తుడని, ఈ ఏడుపు గానీ, గుండెపోటు ఎపిసోడ్ గానీ కాంబ్లీ ట్రిక్కుల్లో భాగమేనని ఆయన గురించి తెలిసినవాళ్ళు అంటున్నారు. తనను దూరం చేసిన సచిన్‌కి మళ్ళీ చేరువ కావడానికే కాంబ్లీ గుండెపోటు ట్రిక్ ప్లే చేసి వుంటాడన్న అభిప్రాయపడుతున్నారు. హాస్పిటల్‌లో వున్న తనను పరామర్శించడానికి సచిన్ తప్పకుండా వస్తాడన్న ఉద్దేశంతోనే ఈ ట్రిక్ ప్రయోగించి వుంటాడని అంటున్నారు. కాంబ్లీని పరామర్శించడానికి సచిన్‌ని హాస్పిటల్‌కి తెచ్చే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరిగాయి. కాంబ్లీకి గుండెపోటు నిజంగా వచ్చిందో  లేదో గానీ, జనం మాత్రం ఇది ఒక డ్రామా అని అనుకుంటున్నారు. మొత్తమ్మీద ‘ట్రిక్ మాస్టర్’ కాంబ్లీ పరిస్థితి ‘నాయనా పులివచ్చే’ కథమాదిరిగా తయారైంది.

‘రాయల’కు సానుకూలత?!

      హైదరాబాద్ రాజధానిగా, పది జిల్లాలతో కూడిన ఆంక్షలు లేని తెలంగాణ కావాల్సిందేనని నిన్న మొన్నటి వరకూ నిర్మొహమాటంగా, నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా ప్రకటిస్తూ వచ్చిన విభజనవాదుల్లో ఇప్పుడు మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాయల తెలంగాణ వైపు అడుగులు వేస్తున్న విషయం స్పష్టమవుతున్న సందర్భంలో కరడుగట్టిన తెలంగాణ వాదుల్లో కూడా మార్పు కనిపిస్తోంది.   ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ దగ్గర కేంద్ర ప్రభుత్వం రాయల తెలంగాణ ప్రస్తావన తెచ్చినప్పుడు మామూలుగా అయితే ఆయన ఆవేశాన్ని ప్రదర్శించేవారు. గతంలో జరిగిన ఒక సమావేశంలో తెలంగాణకు వ్యతిరేకమైన ప్రతిపాదనలు వచ్చినప్పుడు సమావేశం మధ్యలో నుంచే ఆవేశంగా బయటకి వచ్చిన ట్రాక్ రికార్డు ఆయనకు వుంది. అయితే మొన్న కేంద్రం ఆయన రాయల తెలంగాణ ప్రస్తావన తెచ్చినప్పుడు మాత్రం ఆయన గతంలో ప్రదర్శించిన ఆవేశం ప్రదర్శించలేదు. రాయల తెలంగాణ తప్ప వేరే ప్రత్యామ్నాయం తమకు కనిపించడం లేదని, దీనికి కాదంటే అసలు రాష్ట్ర విభజన అంశాన్నే మూలన పడేసే ప్రమాదం వుందని దామోదరకు బ్రెయిన్ వాష్ చేయడంతో ఆయన రాయల తెలంగాణకు ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చిందని అర్థం చేసుకున్నట్టు సమాచారం. సమావేశం నుంచి బయటకి వచ్చిన తర్వాత దామోదర మాట్లాడిన తీరులో రాయల తెలంగాణ పట్ల ఆయన వ్యతిరేకతను పెద్దగా కనబరచలేదు. తెలంగాణ కాంగ్రెస్‌లో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపిస్తున్న వారందరికీ అధిష్ఠానం బ్రెయిన్ వాష్ చేసే పనిలో బిజీగా వున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది ఈ పరిణామానికి సానుకూలతను వ్యక్తం చేసినట్టు తెలిసింది. టీ కాంగ్రెస్ పరిస్థితి ఇలా వుంటే, టీఆర్ఎస్ పార్టీలోనూ రాయల తెలంగాణకు ఓకే అంటే ఓ పనైపోతుంది కదా అన్న అభిప్రాయాలు వ్యకమవుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ అని పట్టిన పట్టు విడవకుండా, తెగేదాకా లాగడం మంచిది కాదన్న అభిప్రాయంలో కొందరు టీఆర్ఎస్ నాయకులు ఉన్నట్టు సమాచారం. రాయల తెలంగాణ ఇస్తే శ్రీశైలం ప్రాజెక్టు భూములు ఏ ప్రాంతానివన్న సమస్య సమసిపోతుందని, అలాగే వైశాల్యంలో, పార్లమెంటు – అసెంబ్లీ సీట్ల విషయంలో సీమాంధ్రతో సమానంగా వుండొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.

కేంద్రం కాకి లెక్కలు!

      కేంద్రం తన రాయల తెలంగాణ ప్రతిపాదనని ఎప్పుడెప్పుడు బయటపెట్టాలా అని ఉవ్విళ్లూరుతున్నట్టుంది. కాకిలెక్కలకు ఎంతమాత్రం తీసిపోని అంచనాలతో రాయల తెలంగాణ ఇవ్వాలని ఫిక్సయిపోయినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తేనెతుట్టెని కదల్చగానే కేంద్రాన్ని అనేకానేక సమస్యలు చుట్టుముట్టాయి. కొన్ని సమస్యలు ప్రథమ చికిత్స చేస్తే తగ్గిపోయే రోగాల్లాంటివి కాగా, మరికొన్ని సమస్యలు ఎప్పటికీ వదలక పీడించే దీర్ఘకాలిక రోగాల్లాంటివి. ఈ రోగాలన్నిటినీ నివారించే సర్వరోగ నివారణి ‘రాయల తెలంగాణ’ అని కేంద్రం భావిస్తోంది.   రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపేయడం వల్ల  కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వుండే అద్భుతమైన ఫలితాలేవో వచ్చేస్తాయని కేంద్రం కలలు కంటోంది. కొత్త రాష్ట్రంలో తాను అధికారంలోకి రావడానికి, ఎక్కువ ఎంపీ సీట్లు గెలవటానికి, టీఆర్ఎస్, బీజేపీలను కొత్త రాష్ట్రంలో కంట్రోల్ చేయడానికి, అసెంబ్లీలో తీర్మానం ఆమోదింపజేసుకోవడానికి, జలవివాదాలు తలెత్తకుండా వుండటానికి, సీమాంధ్రకు రాజధాని సమస్య రాకుండా వుండటానికి... ఇలా ఒకటీ రెండు కాదు రెండు మూడు డజన్లకు పైగా అంశాలను కేంద్రం ఆలోచించి పెట్టేసుకుంది. తెలంగాణను ప్రకటించి తాను తప్పు చేశానన్న అపరాధభావం కాంగ్రెస్ పార్టీలో, కేంద్ర ప్రభుత్వంలో అంతర్లీనంగా వుంది. తనకు ఎంతమాత్రం ఉపయోగపడేలా లేని లేనిపోని తద్దినాన్ని అనవసరంగా నెత్తికెత్తుకున్నానని మథనపడుతోంది. తెలంగాణ ఇచ్చేసిన నింద పడేది కాంగ్రెస్ పార్టీమీదే అయినా రాజకీయ లబ్ధి మాత్రం టీఆర్ఎస్‌కి వెళ్లేలా పరిస్థితులు తయారయ్యాయని బాధపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అవసరమైతే తెలంగాణ ఇవ్వకుండా తప్పించుకోవడానికి కూడా రాయల తెలంగాణ ప్రతిపాదన ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అడుసు తొక్కిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి రాయల తెలంగాణని ఉపయోగించుకోవాలని భావిస్తోంది.

ఓదార్చింది చాల్లేవయ్యా మగడా!

      జగన్ మరోసారి ఓదార్పు యాత్ర మొదలెట్టాడు. వైఎస్సార్ చనిపోయి నాలుగేళ్ళు దాటిపోయింది. ఆయన చనిపోయిన బాధ తట్టుకోలేక నిజంగా గుండె ఆగి చనిపోయిన వాళ్ళు ఎంతమంది వున్నారోగానీ, జగన్ ఎంత ఓదార్చినా వాళ్ళ సంఖ్య మాత్రం తరగడం లేదు. ఒకవేళ నిజంగా వైఎస్ మరణం వల్ల బాధతో గుండె ఆగి చనిపోయినవాళ్ళ కుటుంబాలు ఈ నాలుగేళ్ళుగా జగన్ వస్తాడు.. మమ్మల్ని ఓదారుస్తాడని ఎదురుచూస్తూ వుంటాయా? సరే ఇదెలా వున్నా, జగన్ చేస్తున్న ఓదార్పు యాత్రల విషయంలో ఓదార్చింది చాల్లేవయ్యా మగడా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.   ఈ గుసగుసలు వినిపిస్తోంది ఎవరో బయటి వాళ్ళు కాదు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే ఇలా గుసగుసలాడుకుంటున్నారు. నాలుగేళ్ళ నుంచి  జగన్ పాడుతున్న ఓదార్పు పాట విని వాళ్ళకి బోర్ కొట్టేసింది. ఉద్యమాలు చేయడానికి, జనాల్లోకి వెళ్ళడానికి బోలెడన్ని సమస్యలు, ఇష్యూలు వుండగా జగన్ ఈ ‘ఓదార్పు’నే పట్టుకుని వేలాడుతూ వుండటం చూసి నాయకులు, కార్యకర్తలు చిరాకు పడుతున్నారు. జగన్ ఇలా వ్యవహరిస్తూ వుండటం వల్ల పార్టీ నష్టపోతోందని బాధపడుతున్నారు. ఇలా బాధపడుతున్నవాళ్ళని ఓదార్చేవాళ్ళే లేకపోవడం బాధాకరం. బయట అందర్నీ ఓదార్చే జగన్ కూడా వాళ్ళని ఓదార్చడం లేదు. కొంతమంది నాయకులు ఇక ఓదార్పు యాత్రని ఆపేద్దాం బాబూ అని జగన్‌కి చెబితే జగన్ వాళ్ళని పిచ్చోళ్ళని చూసినట్టు చూశాడని తెలిసింది. ఓదార్పు యాత్ర  ద్వారా తనకు ప్రజల్లో ఫాలోయింగ్ పెరిగిపోతోందని, ఇకముందు ఇలాంటి పనికిరాని సలహాలు ఇవ్వద్దని సదరు నాయకులను జగన్ హెచ్చరించాడని తెలిసింది. ఈ విషయంలో ఇంకోసారి నోరెత్తితే పార్టీలోంచి బయటకి పంపిచేస్తాడన్న భయంతో అందరూ కిక్కురుమనకుండా ఉన్నారు. ఎలాగూ జగన్ తన విధానం మార్చుకోడు. రాబోయే ఎన్నికలలో ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో వైఎస్సార్సీపీ చిత్తుగా ఓడిపోతుంది. అప్పుడు వైఎస్సార్సీపీ నాయకులందరూ కలసి జగన్‌ని ఓదార్చాల్సి వస్తుంది.  

ఇంకా బల్బు వెలగలేదా?

      రాష్ట్ర విభజన డ్రామాని నానా రకాల ట్విస్టులు తిప్పిన కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్ గా రాయల్ తెలంగాణ ట్విస్ట్ ఇచ్చింది. మంత్రివర్గ సమావేశం ఎప్పుడు జరగబోతోందీ చెప్పేసింది. జీఓఎం ఇచ్చిన నివేదికకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపేస్తుందని కూడా డిసైడ్ చేసేసింది. బిల్లును రాష్ట్రపతి దగ్గరకి ఎప్పుడు పంపేదీ, రాష్ట్రపతి నుంచి రాష్ట్ర అసెంబ్లీకి బిల్లు ఎప్పుడు వచ్చేదీ తీర్మానించేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో గానీ, జనవరిలో జరిపే ప్రత్యేక సమావేశాల్లోగానీ బిల్లు ఆమోదం పొందుతుందని జోస్యం చెప్పేసింది.   యుపీఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లు విషయంలో ఇలాంటి విషయాలని ముందే చెప్పేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుకు బీజేపీ మద్దతు ఉండే అవకాశం లేదని తెలుసుకోలేకపోవడం పాపం అమాయకత్వం!  రాష్ట్ర విభజన విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం విధానం మారిందన్న విషయం రాష్ట్రంలో  చిన్నపిల్లలక్కూడా అర్థమైపోతోంది. కేంద్ర ప్రభుత్వం ట్యూబ్‌లైట్ బుర్ర మాత్రం ఇంకా వెలిగినట్టు లేదు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి నిజంగానే అర్థం కాలేదో, లేక అర్థమైనా అర్థంకాన్నట్టు వన్నెచిన్నెలు పోతోందో అనేది అర్థం కాని విషయం. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో వున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రచార సభ జరిపినా ప్రతిసభలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తెస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా విభజిస్తోందని, యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసం తెలుగు జాతిని చీల్చుతోందని విమర్శిస్తూనే వున్నారు. అలాగే మొన్నామధ్య ఓ సభలో మోడీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ భారతీయ ప్రజలని ప్రాంతాల పేరుతో విభజిస్తోందని, దానిని తాము ఎంతమాత్రం అంగీకరించమని స్పష్టంగా ప్రకటించారు. సర్దార్ పటేల్ చెప్పిన సమైక్యతే తమ విధానమని ఆయన ఎలుగెత్తి చాటుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనను నరేంద్రమోడీ ఇంత బాహాటంగా వ్యతిరేకిస్తూ వుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన విషయంలో వెనకడుగు వేయకుండా ఆత్రాన్ని ప్రదర్శిస్తూ వుండటాన్ని అమాయకత్వం అనుకోవాలా? అతి తెలివికి తార్కాణమనుకోవాలా?  

ఢిల్లీ కూడా గోవిందా!

      దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరాజయాల పరంపర త్వరలో ప్రారంభం కాబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతాపార్టీ విజయకేతనం ఎగరేసే అవకాశాలు నూటికి నూరుశాతం వున్నట్టు సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ఎన్నికలలో ఏం జరగొచ్చన్న అంశం మీద రెండు ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు విశ్వసనీయమైన సర్వే సంస్థలతో ఒపీనియన్ పోల్ నిర్వహించాయి.   ఇండియా టుడే గ్రూప్ సంస్థ ఓఆర్జీ సంస్థతో కలసి సర్వే జరిపింది. అలాగే ఏబీపీ న్యూస్, దైనిక్ భాస్కర్, నీల్సన్ సంస్థలు సంయుక్తంగా మరో సర్వే నిర్వహించాయి. ఈ రెండు సర్వేల్లోనూ ఢిల్లీలో రాబోయేది బీజేపీ పాలనేనని స్పష్టమైంది. ఈ సర్వేలో ఢిల్లీ ఓటరు మహాశయులు ‘కమలానికి ఓటేయని కరములు కరముల్?.. కాంగ్రెస్‌ని తిట్టని జిహ్వ జిహ్వా?’ అంటూ ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీని మట్టి కరిపిస్తామని చెప్పేశారు. ఇండియా టుడే నిర్వహించిన సర్వే బీజేపీ ప్రభుత్వం స్థాపించడానికి స్పష్టమైన ఆధిపత్యం లభించే అవకాశం వుందని చెప్పింది. దైనిక్ భాస్కర్ నిర్వహించిన సర్వే మాత్రం బీజేపీకి సాధారణ మెజారిటీ కంటే నాలుగు స్థానాలు తక్కువగా వస్తాయని తేల్చింది. కాంగ్రెస్ పార్టీకి 18 నుంచి 25 సీట్లు వచ్చే అవకాశం వుంది. రెండు సర్వేలూ ఆమ్ ఆద్మీ పార్టీకి పది స్థానాలు వస్తాయని వెల్లడించడం విశేషం. బీజేపీకి మెజారిటీ కంటే సీట్లు తక్కువ వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ సహకారం తప్పని సరి అవుతుంది. ఏది ఏమైనా ఢిల్లీలో పదిహేనేళ్ళ కాంగ్రెస్ పాలనకు ఈ ఎన్నికలతో తెరపడింది. కేంద్రంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయే అవకాశం వుందన్నదానికి ఢిల్లీ ఫలితాలు నిదర్శనం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీలో తమ పార్టీ ఓడిపోయే అవకాశం వుందని డౌటొచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుగురించి ఆలోచిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత హైకమాండ్ మొట్టికాయ వేసిందేమోగానీ, వెంటనే మాట మార్చి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో ఘన విజయం సాధిస్తుందని, ఎవరి సహకారం అవసరం లేకుండానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పుకొచ్చారు. టోటల్‌గా ఏంటంటే, దేశ రాజధాని ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ గోవిందా.. గోవింద!  

జగన్ సమైక్యగానం ఓట్లు సీట్లకోసమేనా?

    ఊహించినట్లే వైకాపా నేతల సమిష్టి కృషివల్ల శనివారం సాయంత్రం కుప్పంలో జరిగిన జగన్ సమైక్య సభకు భారీ ఎత్తున జనాలు తరలి వచ్చారు. ఈ సభలో అతని సమైక్యాంధ్ర ఉద్యమం యొక్క అసలు ఉద్దేశ్యాలు కూడా అతనే మరోసారి స్వయంగా బయట పెట్టుకొన్నాడు.   ప్రస్తుతం డిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియ చకచక జరిగిపోతూ, వచ్చే ఎన్నికలలోగానే రాష్ట్ర విభజన చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుంటే, అతను రాబోయే ఎన్నికలలో తనకి 30 యంపీ సీట్లు ఇస్తే రాష్ట్రాన్నివిడగొట్టకుండా ఆపుతానని హామీలు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది.   ఎన్నికల వరకు రాష్ట్ర విభజన జరుగకపోతే అతను చెపుతున్న మాటలకి అర్ధం ఉంటుంది. కానీ ఒకవేళ ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరిగిపోయి, అధికారికంగా రెండు రాష్ట్రాలు ఏర్పడిపోయిన తరువాత, అతనిని గెలిపిస్తే విడిపోయిన రెండు రాష్ట్రాలను ఏవిధంగా సమైక్యపరచగలరో కూడా అతను వివరించి ఉంటే బాగుండేది.   తను కోరుకొన్న విధంగా 30 యంపీ సీట్లు ఇచ్చి ప్రజలు తన పార్టీని గెలిపిస్తే, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే పార్టీకే మద్దతు ఇచ్చి, మనకు నచ్చిన వ్యక్తినే ప్రధాని కుర్చీలో కూర్చోబెడదామని అతను ప్రజలకు చెప్పడం అతని అహంభావానికి నిదర్శనం. ఇంకా ఇది సమైక్య రాష్ట్రమే గనుక, తెలంగాణాను కూడా వదులుకొన్న వైకాపా ఇప్పుడు కనీసం ప్రాంతీయ పార్టీ కూడా కాదు. ఒక ఉప ప్రాంతీయ పార్టీ స్థాయికి కుచించుకు పోయింది. అటువంటి పార్టీకి అధ్యక్షుడయిన అతను కేంద్రంలో ప్రధానిగా ఎవరుండాలో, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉండాలో తనే స్వయంగా నిర్ణయిస్తానని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదం.   ఇక నేడు కూడా అతను మళ్ళీ 30 యంపీ సీట్లు గురించే మాట్లాడటం గమనిస్తే, అతను చేసేది సమైక్యవాదన, కానీ ఆలోచనలు మాత్రం ఓట్లు, సీట్ల గురించేనని అర్ధం అవుతుంది. అంటే సమైక్యవాదం ముసుగులో సీమాంధ్రలో తన పార్టీని బలపరచుకొని రానున్న ఎన్నికలలో అన్ని యంపీ, యం.యల్యే. సీట్లు గెలిచేసి రాష్ట్రంలో, కేంద్రంలో తానే చక్రం తిప్పేయాలని ఆత్రం అతని ప్రతీ మాటలో వ్యక్తం అవుతోంది.   మరో ఆసక్తికరమయిన సంగతి ఏమిటంటే సీమాంధ్రలో ఉన్నవి కేవలం 26యంపీ సీట్లు మాత్రమే, కానీ అతను 30 సీట్లు గెలుస్తామని చెపుతున్నారు. మరి మిగిలిన ఆ 4 యంపీ సీట్లు ఎక్కడివి? అంటే బహుశః సీమాంధ్ర ప్రజలు అధికంగా నివసిస్తున్న హైదరాబాద్ జంటనగరాలలో ఉన్న 3 సీట్లు, ఖమ్మంలో ఉన్న ఒక్కసీటు తామే గెలుస్తామని అతను భావిస్తున్నారేమో?   ఒక రాజకీయ పార్టీ అధినేతగా జగన్ తన పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావాలని కోరుకోవడంలో ఎటువంటి తప్పులేదు. అయితే అందుకు అతను ఎంచుకొన్నవిధానమే చాలా తప్పు. ఒకప్పుడు తెరాస తెలంగాణా ఉద్యమాలతో ఏవిధంగా రాజకీయంగా బలీయమయిన శక్తిగా ఎదిగిందో, తెలంగాణా సెంటిమెంటుని వాడుకొని ఏవిధంగా ఎన్నికలలో లబ్ది పొందిందో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదేవిధంగా ప్రజలలో బలంగా ఉన్నసమైక్యభావనలను వారి బలహీనతగా భావిస్తూ సమైక్యవాదం పేరుతో ఎన్నికలలో గెలవాలని ప్రయత్నిస్తున్నారు. అది కూడా రాష్ట్ర విభజన జరిగిపోతున్న ఈ తరుణంలోనేకాక, విడిపోయిన తరువాత కూడా సమైక్య సెంటిమెంటుతో ఓట్లు పిండుకోవాలని అనుకోవడం చాలా హేయమయిన రాజకీయం.   నిజం చెప్పాలంటే సీమాంధ్రలో కాంగ్రెస్, తెదేపాలకు ఎటువంటి బలమయిన క్యాడర్ ఉందో, అదేవిధంగా కారణాలేవయినప్పటికీ జగన్ని అభిమానించేవారు కూడా చాలా మందే ఉన్నారు. అటువంటప్పుడు అతను చెప్పుకొంటున్న నీతి, నిజాయితీలతో కూడిన రాజకీయాలు చేసుకొంటే, వారే కాదు ఇతరులు కూడా అతని వైపు ఆకర్షితులయ్యే వారేమో! కానీ అతని ఆలోచనా విధానము, వ్యవహార శైలి ఎప్పుడూ విచిత్రమే, అనుమానాస్పదమే. నేటి సభలో అతను పలికిన మాటలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.   నిజానికి అతను సమైక్యాంధ్ర కోసం ఈ సభ నిర్వహించి ఉంటే, రేపటి నుండి మళ్ళీ పెద్ద ఎత్తున ప్రజాఉద్యమాలు మొదలుపెడదామని ప్రజలకు పిలుపు ఇచ్చి ఉండాలి. కానీ, 30 యంపీ సీట్ల గురించి, డిల్లీలో చక్రం తిప్పడం గురించి మాట్లాడారు.   ఎన్నికలలో తన పార్టీ గెలిచేందుకు అతను ఈవిధంగా సమైక్యసభలో, ఓదార్పు సభలో నిర్వహిస్తూ ప్రజలను ఆకర్షించాలని ప్రయత్నించే బదులు, ముందుగా తన పార్టీని అంతర్గతంగా బలోపేతం చేసుకొని, ఆ తరువాత ప్రజలవద్దకు వెళ్లి ఈ డొంక తిరుగుడు మానుకొని, నేరుగా తనకే ఓటేసి గెలిపించమని, తన పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి చేయాలనుకొంటున్నారో చెప్పుకొంటే అతను పోగొట్టుకొన్న ‘విశ్వసనీయత’ మళ్ళీ పెరిగి, రానున్న ఎన్నికలలో విజయం సాధించవచ్చునేమో! కానీ, ఈవిధంగా ప్రజల బలహీనతమీద ఆడుకొని అడ్డు దారిలో విజయం సాధించాలని ప్రయత్నిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.

ప్రక్షాళన ఎందుకంట?

      పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భలే వెరైటీగా మాట్లాడుతూ వుంటాడు. అంతలోనే కామెడీ చేస్తుంటాడు. అంతలోనే సీరియస్ అయిపోతూ వుంటాడు. తెలంగాణ ఇస్తే తప్పేంటంటాడు.. అంతలోనే సమైక్యాంధ్ర అని నినాదిస్తాడు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానంటాడు. మళ్ళీ తానే అధిష్ఠానాన్ని ఎదిరించేవాళ్ళని పార్టీలోంచి తరిమేస్తానంటాడు.     ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు.. ఆయనగారు సభ్యుడిగా వున్న కాంగ్రెస్ పార్టీనే ఒక విచిత్రమైన సంస్థ.. అందులో వున్న ఆయన విచిత్రంగా వుండక మరెలా వుంటారు? తాజాగా బొత్సగారికి కాంగ్రెస్ పార్టీలోనే వుంటూ అధిష్ఠానాన్ని విమర్శిస్తున్న వాళ్ళ మీద పీకలదాకా కోపం వచ్చేసింది. వెంటనే ఆయన అలాంటి వాళ్ళు 26 మందితో ఒక లిస్టు తయారు చేశారు. వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని హూంకరించారు. అలాంటి వాళ్ళందర్నీ పార్టీలోంచి తరిమేసి పార్టీని ప్రక్షాళనం చేస్తానని ప్రతిజ్ఞ చేసేశారు. అయితే రాజకీయ విమర్శకులు మాత్రం బొత్సకి అంత శ్రమ అవసరం లేదని సూచిస్తున్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో ఎలాగూ ఖాళీ అయిపోతోబోతోంది. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ నాయకులు పార్టీ మారిపోయారు. ఇంకా చాలా మంది కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా వున్నారు. ఇంకా నెలా రెండు నెలలు ఆగితే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్త అనేవాడు కూడా మిగలకుండా ఖాళీ అయిపోతుంది. అప్పుడు సీమాంధ్రలోని పార్టీ ఆఫీసులన్నిటికీ తాళాలు వేసి ఆ తాళాలు సోనియా చేతిలో పెట్టవచ్చు కదా అని బొత్సకి సూచిస్తున్నారు. ఈ కొద్దికాలం భాగ్యానికి ప్రక్షాళన లాంటి పెద్దమాటలు ఉపయోగించడం అనవసరం అని సూచిస్తున్నారు.  

కుట్ర జరిగే వుండొచ్చా?

      హిందూ మతానికి పునాదిలాంటి కంచి ఆశ్రమ ఆచార్యులు హత్య కేసు నుంచి ఏ మచ్చ లేకుండా బయటపడ్డారు. ఇది హిందూ లోకానికి ఎంతో ఊరట కలిగించిన అంశం. ఎక్కడో ఎవరో చేసిన హత్యని కంచి ఆశ్రమంలో జరిగినట్టు, ఆ హత్యను కంచి ఆచార్యులే చేసినట్టు పోలీసులు కహానీ అల్లారు. ఆధ్యాత్మిక జీవితమే తప్ప అన్నెం పున్నెం ఎరుగని కంచి స్వాముల మీద నిందారోపణ చేసి వారిని కారాగారానికి కూడా తరలించి మనోవేదనకు గురిచేశారు.   ఈ కేసు విషయంలో తీర్పు ఇచ్చిన సమయంలో కోర్టు కూడా పోలీసులను ఘాటుగా విమర్శించింది. సాక్షులను ప్రభావితం చేసేంతగా ముదిరిపోయిన పోలీసుల అత్యుత్సాహాన్ని ఆక్షేపించి అక్షింతలు వేసింది. పోలీసుల అతి కారణంగా నిర్దోషులు అవమానాల పాలయ్యారు. సందట్లో సడేమియా అన్నట్టు అసలు నిందితులు తప్పించుకునిపోయారు. కంచి స్వాముల మీదే టార్గెట్ చేసి వారిని ఇబ్బందిపెట్టడంలో బిజీగా వున్న పోలీసులు అసలు హంతకులు తప్పించుకుపోవడానికి రాజమార్గం వేశారు. ఇదిలా వుంటే బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలు సరికొత్త సంచలనానికి, ఆలోచనలకు తెరతీశాయి. హిందూ మతాన్ని దెబ్బ తీసే క్రమంలో భాగంగా సోనియాగాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి కుట్రపన్ని కంచి స్వాములను కేసులో ఇరికించారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవే అయిన్పటికీ కొట్టిపారేయాల్సినవి కూడా కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తన అల్లుడు అనిల్‌ని క్రైస్తవ ప్రచార రంగంలో పైకి తేవడం కోసం ఆ రంగంలో అప్పటికే టాప్‌లో వున్న కేఎ పాల్‌ని బజారుకీడ్చిన చరిత్ర వైఎస్సార్‌కి వుంది. అలాగే హిందూ మతానికి, హిందూ పుణ్యక్షేత్రాలకు వ్యతిరేకంగా గతంలో జరిగిన అనేక ప్రయత్నాలను పరిశీలించినట్టయితే కంచి స్వాములను వ్యతిరేకంగా కుట్ర జరిగిందేమోనన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. అయితే ఆ కుట్ర పన్నింది సోనియా, వైఎస్సారేనా అన్నది మాత్రం ఎవరూ చెప్పలేని విషయం. చూద్దాం.. ముందుముందు ఏదైనా బయటపడొచ్చేమో!

జగన్ తెలివే తెలివి!

      రాష్ట్రాన్ని అడ్డంగా ముంచేసిన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పోతూపోతూ తనకంటే వెయ్యిరెట్లు ఎక్కువ తెలివితేటలున్న జగన్ని ఈ రాష్ట్రానికి కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడు. తెలివితేటల్లో ఆయనే ముదురనుకుంటే ఆయనగాని తనయుడు జగన్ మహాముదురు... ఇంకా చెప్పాలంటే దేశముదురు! వివిధ సందర్భాలలో జగన్ ప్రదర్శిస్తున్న తెలివితేటలు చూస్తుంటే కాకలు తిరిగిన రాజకీయ పరిశీలకులకే నోటమాట రావడం లేదు. ఏదైనా ఇష్యూని తనకు అనుకూలంగా టర్న్ చేసుకోవడంలో జగన్ తెలివే తెలివని నోళ్ళు పెగల్చుకుని మరీ అంటున్నారు.   ఇప్పుడు కృష్ణానది మిగులు జలాల విషయంలో రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. తెలుగోడు భవిష్యత్తులో నీళ్ళో రామచంద్రా అని అల్లాడే పరిస్థితులు వచ్చే ప్రమాదం వుంది. రాష్ట్రమంతా ఈ బాధలో వుంటే, జగన్ మాత్రం ఈ ఇష్యూలో కొత్తకోణం ఆలోచించాడు. ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబే కారణమని తేల్చిపారేశాడు. ‘‘మిగులు జలాల మీద మేము హక్కు కోరం’’ అని దివంగత రాజశేఖరరెడ్డి ట్రిబ్యునల్‌కి లేఖ రాసిన పాపమే ఇప్పుడు తెలుగు ప్రజల పాలిట శాపంగా మారిందని అందరూ దివంగతుడైన పెద్దమనిషిని విమర్శిస్తున్నారు.  ఈ సమయంలో నేరం తన తండ్రి మీదకు రాకుండా వుండటానికి జగన్ భలే పథకం వేశాడు. ఈ ఇష్యూలో చంద్రబాబునే దోషిగా నిలబెట్టే ప్లాన్ వేశాడు. దాంతో చంద్రబాబు తన తొమ్మిదేళ్ళ హయాంలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లే ఇప్పుడీ పరిస్థితి వచ్చిందని వెరైటీ పాట పాడటం మొదలుపెట్టాడు. లేఖ రాసి తప్పు చేసిన తన ‘బాబు’ మీద వున్న ఫోకస్‌ని తన రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్ర‘బాబు’ మీదకు మళ్ళేలా స్కీమ్ సెట్ చేశాడు. ఈ స్కీమ్‌ని మరింత మోయడానికి జగన్ మానసపుత్రికలు పేపరు, ఛానలూ ఎలాగూ ఉండనే వున్నాయి. దొంగే దొంగా దొంగా అని అరిస్తే ఎలా వుంటుందో ఇదికూడా అలాగే వుంది.

తెలంగాణ తల్లి.. శంకరన్న లొల్లి!

      తెలుగువారి ఐకమత్యానికి స్ఫూర్తిప్రదాతగా నిలిచే ఒక అద్భుతమైన భావన తెలుగుతల్లి. తెలుగుతల్లిని కన్నతల్లిలా భావించే తెలుగుజాతిలో కొన్ని విచ్ఛిన్నకర శక్తులు బయలుదేరి జాతిని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి. వారి విచ్ఛిన్నకర కార్యకలాపాలు తెలుగుతల్లిని అవమానించడంతోనే ప్రారంభమయ్యాయి. తెలుగుతల్లి కాన్సెప్ట్ ని కాపీకొడుతూ ‘తెలంగాణతల్లి’కి రూపకల్పన చేశారు. తెలంగాణ అంతటా ఎక్కడ పడితే అక్కడ మురుక్కాలవ పక్కన, చెత్తకుండీ పక్కన తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేస్తూ తాము తల్లిగా భావిస్తున్న మూర్తినే అవమానిస్తున్నారు.   ఇదిలా వుంటే తెలంగాణ తల్లి ఆహార్యం గురించి ఎన్నో విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుబడిదారులు, ధనికులకు ప్రతినిధిగా అత్యంత ఆడంబరంగా వుందన్న విమర్శలు వినిపించాయి. అలాగే కేసీఆర్ కుమార్తె కవిత పోలికలు తెలంగాణ తల్లిలో కనిపిస్తున్నాయని ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ ఆల్రెడీ విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ యోధురాలు చాకలి ఐలమ్మను గుర్తు చేసేలా వుండాలే తప్ప కవితను గుర్తు చేసే విధంగా వుండాలని ఆయన డిమాండ్ చేస్తున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఇప్పుడు తెలంగాణ తల్లికి మరికొన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. ఆ కష్టాలకు కారణం ఎవరో కాదు... కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకరన్న. సోనియాగాంధీకి గుడి కట్టి తీరతానని శపథం చేసిన శంకరన్న తాజాగా ఓ సరికొత్త స్టేట్‌మెంట్ పడేశారు. తెలంగాణ తల్లి అంటే వేరే ప్రత్యేకంగా ఎవరో కాదంట.. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీనే తెలంగాణ తల్లి అట! మితిమీరిపోయిన వ్యక్తిపూజకి ఇంతకంటే పరాకాష్ట మరొకటి వుంటుందా? ఈలెక్కన పొరపాటున తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ తల్లి పరిస్థితి ఏమైపోతుందో! టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వీధివీధిలో ఏర్పడే తెలంగాణ తల్లి విగ్రహాలలో కవితమ్మని చూసుకునే అదృష్టం కలుగుతుంది. అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని రద్దు చేసి తెలంగాణ తల్లి పేరుతో సోనియాగాంధీ విగ్రహాలనే పెట్టేస్తారు. ఏదో కామెడీకోసం రాశారుగానీ నిజంగా అలా జరుగుతుందా అనుకుంటున్నారా.. పొరపాటున కూడా అలా అనుకోకండి. తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడితే ఆ రాష్ట్రంలో ఏదైనా జరగొచ్చు!  

బీజేపీకి తెరాస గాలం!

      నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతానని ఊరించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఈమధ్యకాలంలో మనసు పూర్తిగా మార్చుకుంది. కాంగ్రెస్‌లో విలీనం అయి తెలంగాణలో కాంగ్రెస్‌కి అధికారం అప్పగించేబదులు తానే అధికారం వెలగబెట్టాలన్న ఐడియాకి టీఆర్ఎస్ వచ్చేసింది. టీఆర్ఎస్ తనలో విలీనమైపోతుందని ఆశపడి తెలంగాణకి ఓకే చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ కొత్త వ్యూహం చూసి నోరు తెరిచింది.   టీఆర్ఎస్‌ని తమ పార్టీలో కలిపేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ప్లాన్లు వేసినా టీఆర్ఎస్ కొరకరాని కొయ్యలా తయారైంది. దాంతో టీఆర్‌ఎస్ తనలో విలీనం కాదని కాంగ్రెస్ ఫిక్స్ అయిపోయింది. కాంగ్రెస్‌తో విలీనం మాటని అటకెక్కించిన టీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తోంది. బీజేపీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుని తెలంగాణలో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే సీట్లన్నిటిలో విజయం సాధించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. దేశవ్యాప్తంగా వీస్తున్న మోడీ ప్రభంజనాన్ని తమకు అనుకూలంగా తిప్పుకోవాలని టీఆర్ఎస్ పథకరచన చేస్తోంది. దీనిలో భాగంగా తెరాస నాయకత్వం సుష్మా స్వరాజ్, రాజ్ నాథ్ సింగ్‌ల దగ్గరకి రాయబారాన్ని పంపినట్టు తెలుస్తోంది. అయితే ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య అని ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య అనే టైపు అయిన టీఆర్ఎస్‌ని నమ్మడానికి, పొత్తు కుదుర్చుకోవడానికి బీజేపీ నాయకత్వం ఆసక్తి చూపించనట్టు తెలుస్తోంది. పొత్తు సందర్భంగా భారీ స్థాయిలో సీట్లు కేటాయిస్తామని టీఆర్ఎస్ ఆఫర్ల మీద ఆఫర్లు కురిపిస్తున్నా బీజేపీ అగ్ర నాయకత్వం పట్టించుకోవడం లేదన్నట్టు సమాచారం. తెరాసతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల తెరాసకే లాభం తప్ప తమకేమీ ఒరిగేది లేదని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు కుదుర్చుకుంటే అది తెలుగుదేశంతో అయితేనే మంచిదన్న అభిప్రాయంలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. తద్వారా ఇటు తెలంగాణతో పాటు అటు సీమాంధ్రలో కూడా తమ పార్టీ పుంజుకునే అవకాశం వుందని బీజేపీ నాయకులు భావిస్తున్నట్టు తెలిసింది.

ఇక ఏడవండి!

      ఓ తెలుగోళ్ళారా.. ఇక ఏడవండి! ఏడవమంటే అలా చూస్తారేంటి? బాగా ఏడవండి! ఇంతకీ నేనెవరనుకుంటున్నారా? నేను.. మీ కృష్ణవేణిని.. అర్థం కాలేదా? కృష్ణానదిని! ఎక్కడో పుట్టి.. ఎక్కడెక్కడో ప్రవహించి, తెలుగింటికి చేరే జీవనదిని! నాలో వున్న నీటిని వాడుకునే విషయంలో జస్టిస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు ఇచ్చిందిగా... నాలో వున్న మిగులు జలాల వాడకం విషయంలో మీకు అంత సీన్ లేదని డిసైడ్ చేసిందిగా! కర్నాటక, మహారాష్ట్రలు ఎక్కువ నీటిని వినియోగించుకునే విధంగా తీర్పు ఇచ్చేసిందిగా! ఇప్పుడు మీకు ఏడుపొస్తోంది కదూ.. ఏడవండి! మీ తెలుగోళ్ళు ఏడవటం మినహా ఏం చేయగలరు?   మీరు ఎప్పుడు చూసినా విడిపోదామా, కలిసుందామా, హైదరాబాద్ ఎవరిది, భద్రాచలం ఎవరిదని పోట్లాడుకుంటారే తప్ప.. మీరు పోట్లాడుకోవడం వల్ల ఎంత నష్టపోతారన్నది ఏనాడైనా ఆలోచించారా? ఇప్పుడు చూడండి ఏమైందో! అల్మట్టి డ్యామ్ ఎత్తు పెరిగిపోతుంది. మీ స్టేట్లోకి వచ్చే నా నీరు తగ్గిపోతుంది. మీలోమీరు కొట్టుకుంటూ సరైన వాదనలు వినిపించకపోవడం వల్ల కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళది పైచేయి అయింది. ఇప్పుడీ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు ఓకే చేసిందంటే 2050 వరకు మీ ఏరియా ఎడారే! బిరబిరా కృష్ణమ్మ తరలిపోతుంటేను బంగారు పంటలే పండుతాయి అని తెలుగుతల్లి పాటని పాడటం కాదు.. కృష్ణవేణి.. తెలుగింటి విరిబోణి.. కృష్ణవేణి.. మా ఇంటి అలివేణీ అని సినిమా పాటలు పాడుకోవడం కాదు..  నా నుంచి మీకు న్యాయంగా రావాల్సిన నీళ్ళ వాటాని పొందడానికి మీరు ఏం కృషి చేశారని ప్రశ్నిస్తున్నా! మీలో మీరు పోట్లాడుకుంటూ వుండటం వల్ల అందరికీ మీరు చులకనైపోయారు. 42 మంది ఎంపీలున్న ఆంధ్రప్రదేశ్‌గా వున్నప్పుడే మీ మాట పట్టించుకునేవాడు ఎవడూ లేకుండా పోయాడే! రేపు రాష్ట్రం రెండు ముక్కలైతే మీ మొహాలు చూసేవాడెవడైనా వుంటాడా? బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పువల్ల ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర రెండూ ఎండుతాయ్. ఖర్మకాలి రాష్ట్రం విడిపోతే నీళ్ళకోసం తెలుగోళ్ళే తన్నుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మిగతా విషయాల్లో ఎలాగైనా తన్నుకుని చావండిగానీ, నా నీళ్ళ విషయంలో మాత్రం కాస్త కలసికట్టుగా వుండి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. ఇప్పటికైనా నా మాట వింటే బాగుపడతారు. లేకపోతే మీ ఖర్మ! ఇట్లు.. -మీ కృష్ణానది

జగన్ కలలు!

      పదహారు నెలలపాటు జైల్లో గడిపి వచ్చిన జగన్ అక్కడ పనేమీ లేకపోవడంతో కలలు కనడం బాగా ప్రాక్టీసు చేసినట్టున్నాడు. అందుకే జైల్లోంచి జనాల్లోకి వచ్చాక కూడా కలలు కనడం కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం జగన్ రాబోయే ఎన్నికల తర్వాత తాను ముఖ్యమంత్రి అయిపోతున్నట్టు కల కంటున్నాడు. కల కంటే కన్నాడు.. ఆ కలని కనిపించిన ప్రతి ఒక్కరికీ చెబుతున్నాడు. తనకు వచ్చిన ప్రతి కలనీ బయటకి చెప్పాలనుకునే మానసిక వ్యాధి పేరేంటో మానసిక వైద్య నిపుణులే చెప్పాలి. ప్రస్తుతం జగన్ వరద బాధితులను పరామర్శించే నెపంతో సీమాంధ్రలో తిరుగుతున్నాడు. తుఫాను బాధితుల పరామర్శ కార్యక్రమంలోనే ఓదార్పు యాత్రని, సమైక్య సందేశాలని మిక్స్ చేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మూడు దెబ్బలకు ఒకే పిట్ట అన్నట్టుగా మూడు కార్యక్రమాలను ఒకేదాంట్లో మిక్స్ చేసి ఓటరు పిట్టని కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. జగన్ వెళ్ళిన ప్రతిచోటా రైతులు తమ కష్టాలన్నీ వెళ్ళబోసుకుంటుంటే, జగన్ మాత్రం ప్రతి చోటా త్వరలో నా ప్రభుత్వం రాబోతోంది. అప్పుడు మీకు న్యాయం జరుగుతుందని చెప్తున్నాడట. తుఫాను బాధితులకు న్యాయం చేయండంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ఒక పద్ధతిగా వుంటుందిగానీ, నా ప్రభుత్వం వచ్చాక మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పడమేంటని జనం విసుక్కుంటున్నారు. జగన్ చేస్తున్న యాత్ర ఎన్నిక ప్రచార యాత్రలా వుందే తప్ప తమను పరామర్శించడానికి వచ్చిన యాత్రలా లేదని జనం అంటున్నారు. పీడకలలాంటి తుఫానును ఎదుర్కొన్న తమ కన్నీళ్ళు తుడవడం మానేసి తాను కంటున్న కల గురించి చెప్పుకోవడమే ఎక్కువైపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

విభజన.. కేసీఆర్ భజన!

      తిలాపాపం తలా పిడికెడన్నట్టు రాష్ట్ర విభజన పాపాన్ని అన్ని పార్టీలకూ తలా పిడికెడు పంచితే తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రం నాలుగైదు పిడికిళ్ళు పంచాలి. ఇదిలా వుంటే, రాష్ట్రంలో ఒకపక్క విభజన పర్వం నడుస్తుంటే మరోపక్క టీఆర్ఎస్‌లో కేసీఆర్ భజనపర్వం నడుస్తోంది. తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని నాయకులుగా తెరమీదకు వచ్చిన ఛోటామోటా లీడర్లందరూ కేసీఆర్‌ భజన చేయడంలో నిమగ్నం అయి వున్నారు.   టీఆర్ఎస్‌లో జై తెలంగాణ అన్న ప్రతి ఒక్కరు రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేనో, ఎంపీనో అయిపోవాలని కలలు కంటున్నారు. వాళ్ళలో ఎంతటి పచ్చి అబద్ధాన్నయినా నిజమని పెద్ద గొంతుతో వాదించగల శ్రవణ్ ఒకరు. పార్టీ నాయకత్వమే తన టాలెంట్‌ని గుర్తించి తనను ఏదైనా సీట్లో నిలబెట్టే ఆఫర్ ఇస్తుందేమోనని ఆయన ఎదురుచూశారు. చూసీ చూసీ కళ్ళు కాయలు కాసినయ్యే తప్ప అటుపక్క నుంచి ఎలాంటి సిగ్నల్ లేకపోవడంతో తానే కేసీఆర్‌ని పొగడటం ద్వారా తాను అనుకున్నది సాధించుకోవాలని అనుకుంటున్నట్టున్నారు. అందుకే కేసీఆర్ని ఆకాశానికెత్తేస్తూ మాట్లాడుతున్నారు. శ్రవణ్ మాటల ప్రకారం కేసీఆర్ తెలంగాణకి జాతిపిత అట. దేశ స్వాతంత్ర్య పోరాటానికి గాంధీజీ ఎలాంటివాడో తెలంగాణ స్వాతంత్ర్య పోరాటానికి కేసీఆర్ అంతటి నాయకుడట. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే 1969లో ఉద్యమం నడిపినవాళ్ళు, ఇప్పుడూ అప్పుడూ ఉద్యమంలో అమరులైనవాళ్ళు ఏమైపోయినట్టో! ఈ సందేహం వచ్చింది ఏ సీమాంధ్రుడికో, టీఆరెస్సేతర తెలంగాణవాదికో కాదు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లోనే వున్న కేశవరావుకి.  తెలంగాణ టాపిక్ మీద జరిగిన ఓ మీటింగ్‌లో పాల్గొన్న కేకే.. శ్రవణ్ మాట్లాడిన దానికి పూర్తి భిన్నంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి కథానాయకుడెవరూ లేరని..తెలంగాణ వస్తుందంటే దానికి కారణం అమరవీరుల త్యాగమేనని నొక్కి వక్కాణించారు. పనిలోపనిగా కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు కూడా శ్రవణ్ కామెంట్ల మీద సెటర్లు విసిరారు. తెలంగాణ బండికి కేసీఆర్ డ్రైవర్ కావొచ్చేమోగానీ ఓనర్ కాదని అనేశారు. అందర్నీ తిట్టడమే తప్ప పొగడ్డంలో ప్రాక్టీసు లేనిశ్రవణ్ పొగడక పొగడక పొగిడితే ఆ పొగడ్తకి పొగబెట్టేవాళ్ళు బయల్దేరారు.