మగపిల్లలన్నాక తప్పులు చేయడం సహజం: ములాయం
posted on Jul 19, 2014 @ 9:06PM
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు హత్యలు, సామూహిక అత్యాచారాలకు, మత ఘర్షణలకు నిలయంగా మారిపోయింది. గత కొన్ని నెలలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడో అక్కడ నిత్యం హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మూడు రోజుల క్రితం లక్నోలో మోహన్ లాల్ గంజ్ అనే ప్రాంతానికి చెందిన 30ఏళ్ల మహిళను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి ఆ తరువాత చాలా కిరాతకంగా చంపేశారు.
అదే విషయం గురించి అధికార సమాజవాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ ను మీడియా ప్రశ్నిస్తే, “దేశంలో కెల్లా అత్యధికంగా 21కోట్ల మంది జనాభా యూపీలోనే ఉన్నారు. అందువల్ల ప్రతీ నేరాన్ని అదుపు చేయడం అసాధ్యం. అయినా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే యూపీలోనే అత్యాచారాలు చాలా తక్కువ” అని నిసిగ్గుగా సమర్ధించుకొన్నారు. ఇదివరకు ఓసారి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ “మగపిల్లలు అన్నాక తప్పులు చేయడం సహజం. అంతమాత్రన్న వారినందరినీ దండించాలంటే ఎలా?” అని ప్రశ్నించారు కూడా.
ఇక ఆ తండ్రికి తగ్గ కొడుకు యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. పెరుగుతున్న ఈ నేరాలను మీడియా ఎత్తి చూపిస్తే, “దేశంలో చాలా చోట్ల ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. కానీ మీడియా మాత్రం ఒక్క యూపీలోనే అత్యాచారాలు జరుగుతున్నట్లు గగ్గోలు పెడుతోంది,” అని సమర్ధించుకొన్నారు.
ఆవు చేలోబడి మేస్తుంటే దూడ గట్టున ఎందుకు మేస్తుంది? రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాధినేత ఈవిధంగా మాట్లాడుతుంటే, పార్టీ నేతలు, మంత్రులు మాత్రం ఎందుకు సిగ్గుపడాలి అనుకోన్నారో ఏమో పార్టీకి చెందిన నరేష్ అగర్వాల్ అనే నాయకుడు మీడియాతో మాట్లాడుతూ “ నేతాజీ (ములాయం సింగ్) చెప్పిన మాట అక్షరాల సత్యం. లక్నో రేప్, హత్య కేసులో మాకు తెలిసిన సమాచారం ఏమిటంటే ఆ మహిళా తనకు బాగా తెలిసిన వ్యక్తితోనే బయటకు వెళ్ళింది. ఆ తరువాత ఈ సంఘటన జరిగింది. అందువల్ల ప్రతీ నేరాన్ని అదుపు చేయడం అసాధ్యం. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దేశమంతటా ఎక్కడో అక్కడ ఇటువంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ పరిస్థితిలో మార్పు లేదు. అటువంటప్పుడు ఒక్క యూపీలోనే అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నట్లు మీడియా చూపించడం చాలా అన్యాయం,” అని యధా రాజా తధా ప్రజా అని నిరూపించారు.
ప్రజల ధన మాన ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలే ఈవిధంగా మాట్లాడుతుంటే మరి హత్యలు, అత్యాచారాలు పెరగడంలో ఆశ్చర్యం ఏముంది? రాష్ట్రంలో 21 కోట్ల మంది జనాభా ఉన్నారని తెలిసి ఉన్నపుడు అందుకు తగినంత మంది పోలీసులను నియమించుకొని, వారికి కూడా నైతిక విలువలు పాటించేలా శిక్షణ ఇస్తే ఇటువంటి నేరాలు ఎందుకు జరుగుతాయి? కానీ అధికారం చేప్పట్టిన పార్టీలు ఆపని చేయకపోగా రాష్ట్రమంతట వేలకొద్దీ తమ నేతల విగ్రహాలు, చివరికి తమ పార్టీ గుర్తుగా ఉన్న జంతువుల విగ్రహాల ఏర్పాటు చేయడానికి విచ్చలవిడిగా ప్రజాధనం ఖర్చు చేస్తుంటారు. అటువంటప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటాయని ఏవిధంగా ఆశించగలము? అందుకే అది అత్యాస అవుతుందని స్వయంగా అధికార పార్టీ నేతలే చెప్పుకొంటున్నారు.