జగన్ విషయంలో కళ్ళు తెరిపించిన రోజా...
posted on Aug 30, 2017 @ 6:40PM
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారు అని ఒక సారి పరిశీలిస్తే- జగన్ తనకి తాను నిజాయితీపరుడు, డబ్బులు లేని వాడు మరియు తదుపరి ముఖ్యమంత్రి గా ఊహించుకుంటున్నాడు. ఇక చంద్రబాబు నాయుడు మాటల్లో చెప్పాలంటే, జగన్ ఒక అవినీతిపరుడు, మూర్ఖుడు, రాజకీయ పరిజ్ఞానం లేని వాడు. ఇక సాధారణ జనం ఏమనుకుంటున్నారు అనే విషయం, నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. తాను ఏం చేస్తాడో చెప్పడం పోయి, అధికార పక్షం తప్పులు ఎత్తిచూపడం పోయి, వ్యక్తిగత దూషణకి దిగిన జగన్ అందరి విమర్శలు ఎదుర్కోవడమే కాకుండా, తగిన ప్రతిఫలం కూడా అనుభవిస్తున్నాడు.
ఇక జగన్ కి అత్యంత సన్నిహితురాలు, సోదరి సమానురాలు అయిన రోజా తన అన్న గురించి మనకి తెలియని చాలా విషయాలు చెప్పి మన కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసారు. ఒక రకంగా మనకు కొత్త జగన్ ని పరిచయం చేసే మహత్కార్యానికి నాంది పలికారు.
* జగన్ గురించి మనకు 1 శాతం కూడా తెలియదట. ఆయన రాముడు , కృష్ణుడు క్రీస్తు అల్లా అంతటి గొప్ప వాడట. అయితే, రోజా జగన్ అన్నని ఆ దేవుళ్లతో పోల్చకపోయినా, ఆయన కూడా దాదాపు గొప్పవాడు అనే సందేశం ఇచ్చారు. మీకు తెలుసా, జగన్ ప్రాణం పోతున్నా మడమ తిప్పడట. అందుకే, కొన్ని నియోజకవర్గాల్లో ఓడిపోతాం అని తెలిసినా మాట తప్పకూడదు అన్న నియమంతో టికెట్లు మార్చలేదుట. వై.ఎస్.ఆర్ ని అభిమానించేవారి కోసమే సోనియాని ఎదిరించి జైలు శిక్ష అనుభవించాడుట.
* జగన్ నిజయతీపరుడు అని చెబుతూ... ఈ మాట మీకు నవ్వు తెప్పించొచ్చు... అని జనాల స్పందన ఎలా ఉండబోతుందో ముందే ఊహించారు రోజా గారు. జగన్ నీతిమంతుడు కాకపొతే కోట్లు చిమ్మి డబ్బుతో అబద్ద వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయ్యేవాడు అనే అభిప్రాయం వ్యక్తపరిచారు. అంటే, దీన్ని ఎలా తీసుకోవచ్చు- జనాలు డబ్బులు పంచిన వాళ్ళకే ఓట్లు వేస్తున్నారనా!
* భారతి సిమెంట్ కంపెని ప్రపంచ స్తాయిలో అవార్డ్ గెలుచుకుంది అని వివరించిన రోజా... జగన్ బాగానే సంపాదించాడు, సంపాదిస్తున్నాడు అని మనకి సూచనగా చెప్పింది. అలా అయితే, మరి జగన్ ఏంటి తనకి పంచడానికి డబ్బులు లేవంటాడు...?
* పవన్ కళ్యాణ్, మోడీ లని కూడా ఈ చర్చలోకి లాగిన రోజా, భలే కొసమెరుపు ఇచ్చింది. జగన్ ని పుచ్చలపల్లి సుందరయ్య తో పోల్చే ధైర్యం చేసింది. ప్రభుత్వపు వ్యక్తిగత దూషణలు దాడులను పట్టించుకోకుండా పుచ్చలపల్లి సుందరయ్య లాంటి గొప్పవారిని తలపించే విధంగా సబ్జెక్ట్ మాట్లాడుతూ ఒక కొత్త సంస్కృతిని ప్రవేశ పెట్టాడు, అని వ్యాఖ్యానించిన రోజాకి నిజంగా ఆ మహానుభావుడి గురించి కొంతయినా తెలుసా అనే సందేహం వస్తుంది.
* ఒక వ్యక్తిని పొగడాలి అంటే మూడు రకాలు. ఒకటి నేరుగా పొగడడం. రెండోది అవతలి వ్యక్తిని దూషించి తద్వారా తాము మెప్పుపొందే వ్యక్తిని పొగడడం. ఇక చివరిది, గొప్ప వ్యక్తితో పోల్చడం. రోజా ఆత్మపరిశీలన చేసుకోవలసిన విషయం ఏంటంటే, జగన్ ఏ విషయంలో పుచ్చలపల్లి సుందరయ్య గారితో పోలికలున్న లేదా పోల్చదగ్గ వ్యక్తి. పుచ్చలపల్లి ఒక మంచి రెబెల్ అని ఎవర్ని అడిగినా చెబుతారు. రోజా పొరపాటున జగన్ అధికార పార్టీ నేతల్ని దూషించే విధానం చూసి, ఆయన్ని రెబెల్ గా ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నట్లుంది కాబోలు!
* ఇక రోజా విషయానికి వస్తే, జగన్ అన్నని ఎప్పటికీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఖరాఖండీగా చెబుతుంది. వాస్తవంగా తీసుకుంటే, రోజా కి కనుచూపుమేరలో అంతగా ఆదరించే మరో అన్నయ్య కనిపించడం లేదనే చెప్పాలి. రోజా గతంలో చేసిన తీవ్ర విమర్శల దృష్ట్యా చంద్రబాబు పొరపాటున కూడా ఆమెను మళ్ళీ పార్టీలోకి తీసుకునే ఆలోచన చేయడు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో మరో చెప్పుకోదగ్గ పెద్ద పార్టీ లేదా అధికారం చేబట్టే సత్తా ఉన్న పార్టీ ప్రస్తుతానికి ఇంకోటి లేదు. ఇవన్నీ పరిశీలిస్తే, మరి రోజాకి కి జగన్ అన్న కాకుండా ఇంకో ప్రత్యామ్నాయం ఉందా!