Previous Page Next Page 
ఆంతస్తులూ అంతఃకరణలూ పేజి 19

                    

                                     12

    "కబురు చేశావుట ఎందుకూ?"
    "నీకై నువ్వు రావడం మానేసి చాలా రోజులయిందిగా? అందుకే!"
    "బొత్తిగా తీరిక ఉండడం లేదు."
    "కూర్చో."
    "భానుమూర్తి కుర్చీలో కూర్చుని విజయ ముఖంలోకి చూస్తూ -- "నీకెలా వుందిప్పుడు?" అన్నాడు.
    "ఓ మోస్తరు. సెలవు అయిపొయింది. రేపే హైదరాబాదు వెళ్ళాలి.
    "ఆరోగ్యం బాగుంటే వెళ్ళడమే మంచిది. ఇక్కడ నీకేం తోస్తుంది?" అన్నాడు భానుమూర్తి కిటికీ లో నుండి తోటలోకి చూస్తూ.
    ఈజీ చైర్లో పడుకోనున్న విజయ క్రీగంట భానుమూర్తి వేపు చూస్తూ -- 'సుధీ నిన్ను చేసుకోనన్నదటగా?" అంది.
    భానుమూర్తికి కొంచెం ఆశ్చర్యమే కలిగింది. తనను చెప్పవద్దని సుధీనే రహస్యాన్ని ఎందుకు వెల్లడి చేసిందో అర్ధం కాలేదు. కానీ అత్తయ్య కు మటుకు యీ విషయం తెలిసినట్లు లేదు. తను మేడమీదికి వస్తుంటే మాములుగానే పలకరించింది.
    'అత్తయ్య క్కూడా తెలుసా?' అన్నాడు కొంచెం ఆత్రంగా.
    "అంత భయపడతావెం? అమ్మకు తెలీకుండా ఎన్నాళ్ళలా దాస్తారు?'
    "ఆహ.... యిందులో దాచావలసిందేముంది?"
    "మరి?తెలుస్తే తెలుస్తుంది."
    "నిజమే...." నాన్చాడు.
    "అమ్మకు తెలిస్తేనేగా నీకింకో పెళ్ళి కూతుర్ని చూసి పెట్టుతుంది?' సన్నగా నవ్వుతూ అంది విజయ.
    "అక్కర్లేదు."
    "ఏం? పెళ్ళి చేసుకోవా?"
    భానుమూర్తి మాట్లాడలేదు.
    "మాట్లాడవేం?"
    "అత్తయ్య నాకు పెళ్ళి కూతుర్ని వెతికి పెట్టవలసిన అవసరం లేదు."
    "అంటే? నువ్వే చూసుకున్నావా? చూసుకుంటావా? ఏవిటి కధ?"
    "కాఫీ తీసుకు రమ్మంటావా ? అమ్మగారు కనుక్కో రమ్మన్నారు " అన్నాడు నౌకరు గది గుమ్మంలో నిల్చుని కర్టెను కొద్దిగా తొలగించి, "టీ తీసుకురా!" అంది విజయ.
    "నీతో హైదరాబాదు నేనూ రానా?' అన్నాడు భానుమూర్తి మాట మారుస్తూ.
    "ఎందుకూ?' ముఖం చిట్లించి భానుమూర్తి కన్నుల్లోకి చూస్తూ అంది విజయ.
    భానుమూర్తి ఏదో చెప్పాలనుకొని విజయ ముఖంలోని భావాలను చూసి ఆగిపోయాడు. మరో నిమిషం నిశ్శబ్దంగా గడిచిపోయింది. విజయ గది గుమ్మానికి రెండు వేపులా అమర్చిన గాజువాజుల వేపు చూస్తుంది. వాటిలో ఉన్న లతలు పైకి ప్రాకి ఎంతో అందంగా ఉన్నాయి. నౌకరు ట్రే తీసుకొచ్చి టేబిలు మీద పెట్టి వెళ్ళిపోయాడు.
    "నా ప్రశ్నకు జావాబు చెప్పలేదు. ఇష్టం లేదు గాబోలు!" అంది విజయ టీ కలుపుతూ.
    "ఇష్టం లేకపోవడమంటూ ఏం లేదు..."
    "మరి చెప్తే విని నేనూ సంతోషిస్తానుగా?' టీ కలపడం మాని తలెత్తి భానుమూర్తి ముఖం లోకి చూస్తూ అంది విజయ.
    "నాకు కాబోయే అర్ధాంగిని నేనే నిర్ణయించుకోవడం తప్పంటావా?"
    "అలా అని ఎవరనగలరు?"
    'అంటే?"
    'అయితే ఆ నిర్ణయ మేదో జరిగి పోయి నట్లేనా?"
    "ఊ....' తలవంచుకుని ఊ కొట్టాడు.
    విజయ ఉలిక్కిపడి భానుమూర్తి ముఖం లోకి పరిశీలనగా చూస్తూ టీ కప్పు ముందుకు నెట్టి ---"ఎవరామే ?' అంది.
    "ఇప్పుడెందుకు? సమయమొచ్చినప్పుడు చెప్తాగా?" టీ కప్పు చేతిలోకి తీసుకుంటూ అన్నాడు.
    "అంత రహస్యమా?' అంది నిష్టూరంగా.
    "నీముందు నాకు రహస్యా లేమున్నాయి, విజయా?' టీ కప్పులో నుండి తలెత్తి లాలనగా అన్నాడు.
    "నువ్వునన్నిలాగే మభ్య పెట్తున్నావు, భానూ!" అంది విజయ తేలిగ్గా నవ్వుతూ.
    భానుమూర్తి ఫక్కుమని నవ్వి - 'అవును, పాపం! నువ్వంత అమాయకురాలివి గదూ?" అన్నాడు.
    అందుకు విజయ ఓ చిరునవ్వు నవ్వింది. టీ త్రాగడం పూర్తీ చేసి కప్పు టేబిలు మీద పెట్టుతూ ఏదో అనబోయి మానుకుని సాలోచనగా భానుమూర్తి ముఖంలోకి చూస్తుండి పోయింది విజయ.
    భానుమూర్తి టేబిలు మీద పిచ్చిగా వ్రేళ్ళతో రాస్తూ అందాలను రంగరించుకుంటున్న ప్రాచీన కన్నె వైపు చూస్తుండి పోయాడు. రంగు రంగుల మేలి ముసుగులో నుండి ఆమె సుందర పరవారవిందాం వినూత్నంగా వింతగా మెరుస్తుంది.
    సుధీర గదిలోకి రావడం ఇద్దరూ గమనించలేదు.
    "ఈ రహస్య సమాలోచానకు అంతరార్ధమేమిటో?" చేతులు మడిచి కట్టుకుని నవ్వుతూ అంది సుధీర.
    "నీగురించే! ఎక్కడి నుండి తమరి రాక!" అంది విజయ.
    "మహిళా మండలి నుండి."
    "పారిస్ లో గంట గంటకూ ఫాషన్స్ మారుతుంటాయట! ఈ గంటలో నిలువు గీతలు ఫాషనయితే మరుగంటలో అడ్డగీతలు , ఆ తర్వాత గంట అడ్డ గీత కింద మరో చిన్న అడ్డగీతా.... చూస్తుంటే మీ మహిళామండలి గూడా ఫారిస్ ను మించి పోయేటట్లుంది!" అంది విజయ నవ్వుతూ.
    'అలాగేం లేదు." ముఖం ముడిచి అంది సుధీర.
    "మరి వెళ్ళేటప్పుడు గాజులూ, చెయినూ కమ్మలూ వున్నాయిగా? తిరిగొచ్చేసరికి లేవు! ఈలోపల ఫాషన్ మారకుంటే నగలేమయ్యాయి?"
    "ఆ వాచీ కూడా తీసెయ్ , సుధీ! బాగుంటుంది!" నవ్వును దాచుకోలేక నవ్వేస్తూ అన్నాడు భానుమూర్తి.
    "ఏవిటా అని చూస్తున్నాను! నీ వ్యాఖ్యానమంతా నా గురించే అన్నమాట! ఫాషన్ కోసం కాదు నగలు తీసింది."
    "దేశ రక్షణ నిధికి మా మహిళా సమాజం తరపున డబ్బు వసూలు చేసి పంపాలనుకుంటున్నాము. తొలి బోణీ మనదే!' విజయ కెదురుగా కుర్చీలో కూర్చుంటూ నవ్వి అంది సుధీర.
    భానుమూర్తి , విజయా ఆశ్చర్యంలో నుండి తెరుకునేసరికి కొన్ని క్షణాలు పట్టింది.
    "బాగుంది!"
    "ఏం? నేచేసిన పని బాగాలేదా?"
    "అమ్మకు తెలుసా?"
    "ఓ! ఇప్పుడే చెప్పి వచ్చాను."
    "ఏమంది?"
    "ఏమంటుంది? మంచిపనే చేశావంది!"
    "ఏవంటే మటుకు నువ్వు లెక్క చేస్తావా?' అదోరకంగా నవ్వుతూ అంది విజయ.
    "అదీ నిజమే! అందుకే నన్ను ఎవరూ ఎవనరనుకుంటాను." ఫక్కున నవ్వి అంది సుధీర.
    "నిన్న బజార్లో నీతో వున్నదేవరు?"
    "శేఖరమే!"
    "పరిచయం స్నేహమైందా?' అంది విజయ భ్రూముడి ముడిచి, కళ్ళు చిట్లించి వ్యంగ్యంగా కఠినంగా.
    భానుమూర్తి సుధీర ముఖంలోకి చూసి నవ్వాడు.
    "అవును" అంది సుధీర నిశ్చలంగా.
    "ఈ స్నేహ మెందులోకి మారుతుందో?" అంది విజయ వెటకారంగా.
    "అది కాలమే నిర్ణయిస్తుంది. నువ్వూ, నేనూ ఏం చెప్పగలం?" అంది విజయ ముఖం లోకి చూస్తూ సుధీర ఏమీ తొణక్కుండా.
    విజయ విసురుగా తల త్రిప్పుకుని - "ఏవో బాబూ! నీ ప్రవర్తన నాకేం నచ్చలేదు. నాన్నే వుంటే నువ్విలా ఆటలాడేదానివా? అతనేక్కడ? నువ్వెక్కడ?" అంది.
    'అతను బహుశా యిప్పుడు పార్కులో వుంటాడనుకుంటాను! నేను యిక్కడ మెడ మీద నీ ఎదురుగుండా వున్నాను!' అదే నిశ్చల కంఠంతో అంది సుధీర.
    భానుమూర్తి ఫక్కుమని నవ్వాడు. విజయ కోపంగా లేచి వెళ్ళిపోయింది అక్కడి నుండి.
    'అక్కయ్య కేందుకంత కోపం?" అంది సుధీర భానుమూర్తి ముఖంలోచూచి- ముఖం ముడిచి.
    "ఏవో మరి? నన్నడిగితే నేనేం చెప్పను? ఆ విషయం విజయనే అడగలేక పోయావా?' అన్నాడు చిరునవ్వుతో.
    "నీ అభిప్రాయమేమిటి?"
    "దేనిమీద?"
    "ఈ విషయంలోనే....' అంది అస్పష్టంగా .
    'అంటే?"
    సుధీర ఓరగా చూసింది భానుమూర్తి ముఖంలోకి. భానుమూర్తి ముసిముసిగా నవ్వుతున్నాడు.
    "నవ్వులాటలా వుంది గాబోలు!" అంది తెచ్చిపెట్టుకున్న కోపంతో.
    "సుధీ!"
    ఆ కంఠంలో ఆత్మీయతా, అదరమూ గోచరించాయి సుధీరకు.
    "ఈ విషయంలో నా అభిప్రాయాన్ని యింతకు ముందే చెప్పాను గుర్తుందా?"
    "ఊ...."
    'అంతకన్నా ఎక్కువగా యింకేం చెప్పలేను." కుర్చీలోంచి లేస్తూ అన్నాడు.
    "నేరుగా యింటికే వెళ్తావా?"
    "అవును."
    "విశాలతో రేపోసారి రమ్మని చెప్తావా?"
    "అలాగే."
    "ఎందుకని అడగవెం?"
    "బాగుంది. మధ్యలో నాకెందుకు?' నవ్వకుండా ఉందామనుకుని నవ్వేశాడు.
    "దేశరక్షణ నిధి వసూళ్ళ విషయంలో రేపో మీటింగు పెట్టుకుంటున్నాము. విశాల మెంబరు. తప్పక రమ్మన్నానని చెప్పు."
    "అధికారమంతా నీదిలాగే వుందే!"
    'అయితే యీ మధ్య నేను సెక్రటరీ పదవిని పొందానన్న శుభవార్త నీవర్కూ రాలేదన్న మాట!"
    "నిజమా! నాకు తెలీదు సుమా! అయితే ఒ చిన్న టీ పార్టీ అరేంజ్ చెయ్యరాదూ?"
    భానుమూర్తి తమ యింట్లోని పద్దతులను ఎగతాళి చేస్తున్నాడని సుదీరకు తెలుసు. అందుకనే కొరాకోరా చూసింది.
    "బాబోయ్! ఏవిటా చూపులు! ఆ! అంతేనా? విశాలతో యింకేమన్నా చెప్పాల్నా?"
    "నే చెప్పవలసింది అంతే! ఒకవేళ నువ్వేమైనా చెప్పాలనుకుంటే ....." అని గలగలా నవ్వింది.
    "నువ్వొట్టి కొంటె పిల్లవు!" అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు భానుమూర్తి.

                                *    *    *    *
    అసలు ఆడదంటేనే అలుసు. చదువుకుని ఉద్యోగం చేస్తున్న వాళ్ళంటే అదోవిధమైన తిరస్కార భావం. చులకన. ఇక పెళ్ళి కాలేదంటే సరేసరి! చెప్పనే అక్కర్లేదు. అందరి కళ్ళూ ఆటే! ఏదో కొద్దో గొప్పో ప్రయత్నం చేసి చిక్కినంత సౌఖ్యాన్ని దక్కించుకుందామానుకునే వాళ్ళు చాలా మంది! తన దారమ్మాట  తను పోతున్నా పోనీరుగా? ఊహు.... వాళ్ళ విచిత్ర మనస్థితి ఏమిటో తన కర్ధం కాదు. చెక్కిళ్ళ మీద కారిన కన్నీటిని తుడుచుకుని తలగడ క్రిందున్న జాబు తీసింది విశాల.
    ఆరోజు స్కూల్లో ఫ్యూను ఉత్తరం తెచ్చి యిచ్చాడు. అది చదివిన మరుక్షణమే విశాల ముఖం కోపంతోనూ, అవమానం తోనూ కందిపోయింది.
    'అలా వున్నావేం?' అని టీచర్సు యిద్దరు ముగ్గురు అడిగారు కూడా.
    విశాల ఏం చెప్తుంది?
    సాయంత్రం యింటికి రాగానే కృష్ణ వేణమ్మతో పాటు హాస్పిటల్ కి వెళ్ళి రాఘవయ్య ను చూసి వచ్చింది. మనసుకు ఉల్లాసం, ఉత్సాహం బొత్తుగా లేవు. ఏవిటో మనసంతా శూన్యంగా ఉన్నట్టుంది. కృష్ణవేణమ్మ హాస్పిటల్లో ఉండిపోవడం చేత వంట చేసేందుకు క్కూడా బుద్ది పుట్టలేదు. హాస్పిటల్ నుండి రాగానే మంచం మీద వాలిపోయింది. ఆలోచనలు గజిబిజిగా అల్లుకొని మెదడు నంతా అల్లకల్లోలం చేస్తున్నాయి.
    కవరు లోంచి కాగితం తీసి మడత విప్పి అక్కడో వాక్యాన్నీ, అక్కడో వ్యాక్యాన్ని చదువు కుంటూ మనసులోనే వ్యాఖ్యానం చేసుకోసాగింది.
    'ప్రాణప్రదమైన ప్రేయసికి!"
    ప్రాణలిస్తాడు గాబోలు!
    'నువ్వసలు పెళ్ళి చేసుకోదలుచుకోలేదా?'
    పాపం! ఎంత శ్రద్ధ!
    "ఎవర్నన్నా ప్రేమించావా?'
    ఊ....
    "లేక తగినవాడు దొరకలేదా?'
    ఊహు....
    "నీ యవ్వనమంతా అడవి గాచిన వెన్నెల అయిపోతుందని నా విచారం!"
    ప్చ్!
    'నువ్వు చదువుకొన్న దానివేగా? -ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు.'
    మరి ఉత్తర మెందుకు, మహాశయా?' నా కలల్లో కనిపిస్తున్న స్వప్న సుందరివి నువ్వు!'
    నే ఒక్కత్తినేనా?
    'ఈరోజు సాయంత్రం మీ యింటి కొస్తాను.'
    అంతవరకూ తమాషాగా తీసుకున్నా, ఆ వాక్యం చదివేసరికి విశాల గుండెలు జల్లుమాన్నాయి.
    నిజంగా వస్తాడా? వస్తే మటుకు తనకు భయమెందుకు? ఇది ఊరే కాని అడవి కాదుగా? నలుగురూ చూస్తె ఎవనుకుంటారు? ఏ వుంది అనుకొనేందుకు? ఊహు....
    అసహనంతో కాగితం తిప్పి తర్వాత వాక్యం చూసింది. అదే చివరి వాక్యం కూడా.
    'మకరంద భరితమైన వికసిత కుసుమాన్ని అస్వాదించకుండా మధుకరం ఉండగలదా?'
    ఛీ! ఛీ!
    కాగితాన్ని రెండు చేతులతో నలిపి మంచం మీదకు విసిరి కొట్టింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS