Previous Page Next Page 
ఆంతస్తులూ అంతఃకరణలూ పేజి 18

                    

                                      11
    భారత దేశానికి స్వాతంత్యం లభించి పదహైదు సంవత్సారాలయింది. శతాబ్దానికి పైగా పరాయి వాళ్ళ పాలనలో ఉన్న భారతీయులకు స్వాతంత్ర్యం లోని స్వేచ్చా, హాయీ, తియ్యదనమూ ఎలాంటివో తెలిసి వచ్చాయి. శాంతి, అహింస అనే ఆయుధాలతోనే స్వాతంత్ర్యం తెచ్చుకున్న భారతీయుల స్వాతంత్య సమర చరిత్రకు ప్రపంచ చరిత్రలోనే ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత తో ఉంది ఓ విలక్షణం - వైవిద్యం.
    పుజ్య  జాపూజీ ఆశీర్వాచనాలతో భారతీదేవి అల్లారుముద్దుగా పెంచుతుంది. చిరంజీవిని స్వతంత్ర బాలను. వయసు తక్కువ కావడం వల్లా, వాతావరణంతో అప్పుడప్పుడు చెడు గాలులు రేగిడం వల్లనూ ఆ బాల ఇంకా కొంచెం బలహీనంగానే ఉంది. అంతేగాక ఆ బాల ఎదుర్కొంటున్న సమస్యలు రోజు రోజుకూ విపరీతంగా పెరిగి పోతున్నాయి. దేశం నలుమూలలా అభ్యుదయ సాధనకై ప్రణాళికలు ఆచరణ లో  పెట్టుబడుతున్నాయి. కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. కొన్ని కొన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తూనే ఉంది. అయినా స్వార్ధపరులు కొందరు ఆ అభివృద్ధికి నిరోధాన్ని కరిగిస్తూనే ఉన్నాడు. డబ్బు సంచులు దాచుకుని మాతృద్రోహం చేస్తూనే ఉన్నాడు.
    కానీ అదంతా దేశం లోపల జరుగుతున్న విషయం. ఈ పెదహైదు సంవత్సరాల తర్వాత చైనా ముష్కరులు ఈరోజు దేశ స్వాతంత్యాన్ని కబళించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
    ఇది ఇరవయ్యవ శతాబ్దం. మానవుడు నాగరికతా శిఖరాలనందుకుంటున్న రోజులు. అయితే లోకం పోకడను పరిశీలించి చూసినట్లయితే నాగారికతలోనే - అనాగరికత , విజ్ఞానం తోనే - అజ్ఞానం, విశాల భావాల్లోనే - సంకుచిత్వం - ప్రసన్నంగా ఉన్ననని తెలీకపోదు.
    ఒకప్పుడు మానవుడు పశువు గానే బ్రతికాడు. ఆరోజు దేహ బలానికే ప్రాధాన్యం. ఎవరు బలవంతుడో వాడే జీవించేందుకు అర్హుడు. అలాంటి రోజులు పోయాయని సంతోషిస్తున్న మానవాళి కి అదొక కలలాగే ఇట్టే కరిగిపోయింది రాజ్యకాంక్ష. అధికార దాహం ఇంకా మానవుడి లో తీరలేదేమో అనిపిస్తుంది.
    భానుమూర్తి పేపరు ముందు పెట్టుకుని ఆలోచనల్లో తెలిపోతున్నాడు. అప్పుడప్పుడే చైనా వాళ్ళు ఇండియా సరిహద్దు ప్రాంతాల్లోకి మెల్లమెల్లగా చొచ్చుకుని వస్తున్న సమయం అది. భారతీయులంతా తీవ్రంగా, ఘాటుగా ఆలోచిస్తున్న విషయం.
    "మిమ్మల్నే!"
    భానుమూర్తి ఆలోచనల్లో నుండి తేరుకుని గుమ్మం వైపు చూశాడు. చెమ్మ గిల్లిన కన్నులతో, పాలిపోయిన ముఖంతో విశాల గుమ్మంలో నిల్చోనుంది.
    "ఏవిటి? అలా ఉన్నావెం?..... ఏవైంది?' తడబడే గొంతుతో అడిగాడు.
    "నా..న్నా..."
    భానుమూర్తి చివ్వున కుర్చీ లో నుండి లేచి విశాల వాళ్ళ హాల్లోకి నాలుగంగల్లో చేరుకున్నాడు.
    హల్లో మంచం మీద పడుకున్నాడు రాఘవయ్య. ప్రక్కనే కళ్ళు తుడుచుకుంటూ కూర్చోనుంది కృష్ణవేణమ్మ. రాఘవయ్య కు ఊపిరి తీసుకోవడమే కష్టమై పోతుంది. అయన హృదయం లో గూడు కట్టుకున్న బాధంతా కళ్ళల్లో ప్రతి ఫలిస్తుంది.
    "మాస్టారూ! ఎలా ఉంది?' మంచం దగ్గరికి వెళ్ళి ఆదుర్దాగా ప్రశ్నించాడు భానుమూర్తి.
    'ఇక లాభం లేదంటూ సైగ చేసి చెప్పాడు రాఘవయ్య. కృష్ణ వేణమ్మ ఘోల్లుమంది. విశాల పైట చేరుగులో ముఖం దాచుకుంది.
    "విశాలా! ఇలా చూడు! నువ్వే ఇలా అధైర్యపడిపోతే ఎలా చెప్పు? అమ్మ చూడు ఎలా దుఖపడుతుందో ? నే వెళ్ళి జట్కా తీసుకొస్తాను. ఏడవకు. వెళ్ళి మాష్టారు దగ్గర కూచో" అని భానుమూర్తి సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు.
    పది నిముషాలు భయంగా, ఆత్రంగా, నిర్జీవంగా గడిచిపోయాయి. జట్కా వచ్చి వాకిలి ముందు ఆగింది. ఈలోపల మీనాక్షి కూడా వచ్చింది.
    భానుమూర్తి, విశాలా, కృష్ణ వేణమ్మ కలిసి రాఘవయ్య ను జట్కా లో పడుకో బెట్టారు. కాళ్ళ దగ్గర కృష్ణ వేణమ్మ కూర్చుంది. వెనకే సైకిలు మీద వెళ్ళాడు భానుమూర్తి.
    విశాల ఇంటికి తాళం  పెట్టి రిక్షాలో వెళ్ళింది.
    విశాల వెళ్ళేసరికి రాఘవయ్య కు ఆక్సిజన్ ఇస్తున్నారు. కృష్ణ వేణమ్మ దూరంగా నిల్చుని బిక్కు బిక్కుమని చూస్తుంది. మధ్యాహ్నానికల్లా రాఘవయ్య కొంచెం తేరుకున్నాడు. మందులూ, ఇంజక్షన్లూ ఇచ్చేవి ఇస్తూనే ఉన్నారు. సాయంకాలాని కల్లా ఆయాసం అదీ కాస్త తగ్గి, ముఖంలో తేటదనం కనిపించింది.
    విశాల బార్లీ, బ్రెడ్డూ , కృష్ణ వేణమ్మకు కారియర్ లో అన్నం తీసుకు వచ్చింది సాయంత్రం. భానుమూర్తి అంతకు ముందే వచ్చాడు. కృష్ణ వేణమ్మ బల్ల మీద కూర్చుని తన ఆలోచనల్లో తను తేలిపోతోంది. నర్సు లోపలికి వచ్చి టెంపరేచర్ నోట్ చేసుకుని లైట్ వేసి వెళ్ళింది.
    విశాల కిటికీ దగ్గర నిల్చుని వాన తుంపర కేసి చూస్తుండి పోయింది. నర్సు మందు తీసుకు వచ్చింది.
    "ఇక్కడేన్నాళ్ళు ఉండాలో?' అన్నాడు రాఘవయ్య నర్సు ముఖంలోకి చూస్తూ.
    "ఉదయమేగా వచ్చారు?" నవ్వుతూ అంది నర్సు.
    'అప్పుడే పోవడానికి లేదన్న మాట!' అన్నాడు రాఘవయ్య విచారంగా నవ్వుతూ.
    నర్సు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
    "ఆరోగ్యం లేనివాడు బ్రతకడం అనవసరమనిపిస్తుంది, భానూ!" అన్నాడు రాఘవయ్య.
    భానుమూర్తి ఏమీ జవాబు చెప్పలేదు.
    "ఆరోగ్యాన్ని మించిన సంపద మరొకటి లేదని తెలిసీ మనం ఆజాగ్రత్తగా ఉంటున్నాం. నాకు ,ముప్పై సంవత్సర'మప్పుడు ఉబ్బసం వచ్చింది. ఆరోజే తెలిసింది ఆరోగ్యం విలువ. ఈరోజు నాకు అరవై సంవత్సరాలు. ముప్పయి సంవత్సరాలుగా ఈ దుర్భర జీవితాన్ని నెట్టు కోస్తున్నాను. ఇంకా ఎన్నాళ్ళు బ్రతకాలో తెలీదు." కొంచెం ఆయాసంగా అన్నాడు రాఘవయ్య.
    "ఎక్కువగా మాట్లాడకండి మాస్టారూ!' భానుమూర్తి వారించాడు.
    "ఎప్పుడు చెప్పాలనుకున్న విషయం అప్పుడే చెప్పాలి. లేకుంటే తర్వాత చెప్పలేక పోవచ్చు."
    "ఏవిటి, నాన్నా నువ్వు మాట్లాడ్డం?'విశాల కోప్పడింది.
    "నువ్వూర్కో విశాలా? నీకేం తెలుసు? భానూ! అనుభవంతో చెప్తున్నా నా మాట నెప్పుడూ మరిచిపోకు. జీవితంలో దారిద్ర్యంతో బ్రతకవచ్చు, కష్టాలతో బ్రతకవచ్చు. కానీ అనారోగ్యంతో బ్రతకడం కష్టం. అందుకనే ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకు...."
    'అలాగే, మాస్టారూ."
    నర్సు లోపలికి వచ్చి రాఘవయ్య మాట్లాడ్డం చూసి కోపగించుకుంది.
    "ఇక వెళ్తాను మాస్టారూ!' అంటూ భాను మూర్తి లేచి నిల్చున్నాడు.
    "నువ్వూ వెళ్ళవే విశాలా! చీకటి పడింది." అంది కృష్ణవేణమ్మ.
    "భానూ! విశాల గూడా వస్తుంది తీసుకెళ్ళు" అన్నాడు రాఘవయ్య.
    "నేను వెళ్ళగలను" అంది విశాల నవ్వుతూ.
    ఇద్దరూ వరండాలోకి వచ్చారు. తుంపర పడుతూనే ఉంది.
    "ఎలా వెళ్ళడం?" అన్నాడు భానుమూర్తి.
    "ఈ తుంపరేం చేస్తుంది? వెళ్దాం పదండి!" అంది విశాల.
    "తడుస్తాం!"
    "ఓ! ఏం ఫర్వాలేదు."
    "జలుబు చేస్తుంది."
    విశాల నవ్వుతూ-"ఊ .... తర్వాత?" అంది.
    "తర్వాత జ్వరం రాగలదు" అన్నాడు భానుమూర్తి వచ్చే నవ్వాపుకుంటూ.
    "అబ్బో!"
    "మరేమనుకున్నారు?ఇప్పుడేగా మాష్టారు ఆరోగ్యం గురించీ జాగ్రత్తగా ఉండమన్నారు?'
    "అయితే?"
    "కాసేపు ఆగి వెళ్దాం."
    వరండాలోని నలభై కాండిల్స్ బల్బు మెత్తగా, మందంగా వెలుగును చిమ్ముతుంది. పలచని మబ్బులు ఆకాశం నిండా ఉన్నాయి.
    "మీకు శ్రమ కలిగించాము" అంది విశాల - ఎదురుగా ఉన్న క్రోటను చెట్ల వైపు చూస్తూ.
    భానుమూర్తి విశాల వైపు తీవ్రంగా చూసి "శ్రమా? అలాంటిదేం లేదు. తోటి మానవునికి కష్ట సమయంలో సాయం చెయ్యడం గూడా శ్రమే అయితే యిక బ్రతకడం నిరర్ధకమే!" అన్నాడు.
    విశాల భానుమూర్తి ముఖంలోకి కళ్ళెత్తి చూసి, చూపులు ప్రక్కకు త్రిప్పుకుని పన్నీటి జల్లులాంటి వర్షపు జల్లులో తడుస్తున్న చెట్ల వేపు చూడసాగింది.
    "నిన్న సాయంత్రం మాష్టారు బాగున్నారు కదా?" ప్రశ్నార్ధకంగా విశాల ముఖంలోకి చూస్తూ అన్నాడు భానుమూర్తి.
    "ఏం బాగు! ఈ మధ్య మూన్నాళ్ళుగా వర్షం పడుతుందాయె . అందులోనూ నిన్న సాయంత్రం మురళి విషయ మెవరో చెప్పారు...."
    "మురళి విషయమా? ఏం చేశాడేమిటి?" అన్నాడు భానుమూర్తి ఆత్రంగా.
    "మీకు తెలుసేమో అనుకున్నాను...."
    "లేదు. తెలుస్తే ఎందుకడుతాము?"
    "ఎవర్నో పెళ్ళయిన అమ్మాయిని తీసుకుని...." విశాల ఇక చెప్పలేకపోయింది. కంఠం  బరువుతో , బాధతో నిండిపోయింది. చివాల్న తల మరో వేపుకు త్రిప్పుకుంది.
    భానుమూర్తి మనసు ఆవేదనతో నిండి పోయింది.
    వాన తుంపర ఆగిపోయింది. కానీ కారు మేఘాలు ఆకాశాన్ని దట్టంగా కమ్మేశాయి.
    "ఇంకా ఆలస్యం చేశామంటే పెద్ద వర్షమే రావచ్చు."
    "పదండి మరి."
    ఇద్దరూ హాస్పిటల్ గేటు దాటి బయటికి వచ్చారు. ఒక్క జట్కా గానీ, రిక్షా గానీ లేదు.
    "సైకిలు తెచ్చుకోవలసింది' అంది విశాల. భుజాల నిండుకూ పైట కప్పుకుంటూ.
    "ఓ స్నేహితుడు కావాలంటే ఇచ్చాను."     
    "టైమెంత?"
    "ఎనిమిది" అన్నాడు వాచీ చూసి.
    ఇద్దరూ నడక ప్రారంభించారు. సగం దూరం పోయేసరికి కుండలతో కుమ్మరించినట్లు  వర్షం ప్రారంభమైంది. ఏం చెయ్యడమా అని అలోచించి, ఓ నిర్ణయానికి వచ్చేసరికి ఇద్దరూ సగం తడిసిపోయారు. దూరంగా వెళుతున్న రిక్షాను కేకేవేశాడు భానుమూర్తి. వర్షం జోరులో రిక్షా వాడికి వినిపించినట్లు లేదు.
    "ప్చ్! వెళ్ళిపోయాడు!" అన్నాడు నిరాశగా.
    "ఈ సందుల్లో ఇక రిక్షాలు దొరకడం కష్టమే. ఏం చేస్తాం? పోదాం పదండి!" అంది.
    "ఇప్పటికే సగం తడిశాం. ఇంకా పూర్తిగా తడిసేందుకా? వద్దు, వద్దు ...రేపు మాస్టారూ నన్నే చివాట్లు వేస్తారు. అదో, ఆ వరండాలో కెళ్ళి నిల్చుద్దాం పదండి! ఈ లోపల ఏదన్నా రిక్షా వస్తే మిమ్మల్ని పంపెస్తాను" అన్నాడు.
    విశాలకు ఏం చెప్పేందుకు తోచలేదు. మౌనంగా భానుమూర్తిని అనుసరించింది.
    "ఇదేదో అంగడి లా వుంది. తాళం పెట్టి వుంది. చలిగా ఉంది. అలా మూల కెళ్ళి నిల్చొండి!" అన్నాడు.
    విశాల మూలగా వెళ్ళి ఒదిగి నిల్చుంది. వర్షం జోరుగా కురుస్తుంది. కన్ను పొడుచుకున్నా కానరాని కాటుక లాంటి నల్లటి చీకటి రాక్షసి దిగంతాలంతా దట్టంగా వ్యాపించింది. దూరంగా వెలుగుతున్న వీధి లైటు కాంతి వల్ల విశాల కట్టుకున్న తెల్లని చీర అస్పష్టంగా మసక మసగ్గా కనుపిస్తుంది. నిశ్శబ్దంగా, నీరసంగా ఒక్కో క్షణమే జరిగి పోతుంది. ఉన్నట్టుండి ఎక్కడో ఒక్క ఉరుము ఉరిమింది. ఒక్క మెరుపు మెరిసింది.
    ఆ మెరుపులో చూశాడు - విశాల ముఖంలోకి భానుమూర్తి. కన్నీళ్లు చెక్కిళ్ళ మీదుగా జారి పోతున్నాయి. సన్నగా వణుకుతుంది-- పెనుగాలిలో, లతలా . భానుమూర్తి మనసులో ఎన్నో ప్రశ్నలు చెలరేగాయి.
    మురళి ప్రవర్తనకా? మాష్టారు గారి అనారోగ్యానికా? దేనికి? లేక తన స్వవిషయమా? అడిగితె? ఊహు.... ఏమనుకుంటుందో ? అసలే అభిమానవతి. భానుమూర్తి ఆలోచిస్తున్నాడు.
    వర్షం అలాగా కుండలతో కుమ్మరించినట్లు కురుస్తుంది. దానితో పాటు చలిగాలి జివ్వుమంటూ వీస్తుంది. పెద్ద శబ్దం చేసుకుంటూ దగ్గర్లో మరెక్కడో పిడుగు పడ్డట్లయింది.
    విశాల శరీరం గజగజలాడింది. గుండెలు దడదడలాడాయి. పెదిమలు కదల్చి అస్పష్టంగా ఏదో అంది.
    భానుమూర్తి హృదయం అను కంపతో నిండి పోయింది.
    "భయపడుతున్నారా? రేపటి కల్లా మాస్టారూ బాగా కోలుకుంటారు."
    'అవును."
    "మరెందుకు కన్నీరు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS