మనసు తిరిగి పూర్వ స్థితికే వచ్చింది. ఏదో అవ్యక్తమైన బాధ. కట్టలు తెంచుకుని ఉప్పెనలా పొంగింది కోపం. ఎవరి మీద చూపగలదు? ఆ కోపం చివరకు కన్నీళ్ళలోకి మారింది. నవ నాగరికులమని చాతీ విరుచుకు తిరిగే వీళ్ళెందుకింత మొరటుగా, అసభ్యంగా ప్రవర్తిస్తారో విశాల కర్ధం కాలేదు.
స్త్రీ పురుషుడు కలిసి ప్రతి రంగంలోనూ పనిచేయ్యందే దేశం ఉన్నతి నందుకోలేదని వేదిక నెక్కి ఉపన్యసించే పురుష పుంగవులు,ఆ వేదిక దిగగానే ఎంతగా మారిపోతారో! ప్రపంచంలోని విచిత్రాలలో యిది మరొకటి!
ఇలాంటి ఉత్తరాలు రావడం తనకు క్రోత్తమీ కాదు. అక్రమమైన సంబంధాలేర్ప్రచుకుని ఆనందాన్ని, పొందాలనుకునే వీళ్ళ మనస్తత్వం ఎన్నాళ్ళు ఆలోచించినా విడని సమస్యగానే ఉండి పోయింది. చక్కని రాజమార్గం ఉండగా అడ్డదోవల్లో నడవాలని ఎందుకు కోరుకుంటారో? కేవలం స్త్రీ పురుషుల మిధ్య నున్న శారీరక సంబంధమే జీవిత లక్ష్యమనే వాళ్ళకు తనెలాంటి జవాబు చెప్పలేదు. మాతృర్వాహంచే స్త్రీ లో గాడంగా లేనటయితే అసలు స్త్రీ వివాహాన్నే కొరదేమో?
మెల్లగా తల్లుపు కొట్టిన చప్పుడయింది. విశాల గుండెలు గుబిల్లు మన్నాయి. ఆలోచనా స్రవంతికి ఆనకట్ట పడింది. "తలుపు తీయడమా? వద్దా?' అలా ధైదీభావమానవయై ఓ నిముషం ఊరకుండిపోయింది.
మళ్ళీ తలుపు టకటక కొట్టిన చప్పుడు.
"ఎవరు ?' ధైర్యాన్నంతా పుంజుకుని అంది.
అసలు తనెందుకింతగా భయపడాలి? మెల్లగా వణుకుతున్న చేత్తో తలుపు గడియ తీసి , తలుపు కొద్దిగా తెరిచి అవతల నిలిచోనున్న వ్యక్తిని చూచిన విశాల సిగ్గుతోనూ, ఆశ్చర్యంతోనూ కుంచించుకు పోయింది.
"మీరా!" అంది ఆశ్చర్యాన్నుండి తేరుకుని.
"నేనే!" నవ్వుతూ అన్నాడు భానుమూర్తి.
"రండి!"తలుపు పూర్తిగా తెరుస్తూ ఆహ్వానించింది.
భానుమూర్తి హాల్లోకి వచ్చి కలయజూస్తూ "మీ అమ్మగారు లేరా?' అన్నాడు.
"ఊహు....ఈరోజు నాన్నకు కాస్త ఆయాసంగా ఉంటె హాస్పిటల్ లోనే ఉండిపోయింది.
"ఆమె వున్నారనే అనుకున్నాను" అన్నాడు గోడ వేపు చూస్తూ- ఏదో తప్పిదం చేసిన వాడిలా.
భానుమూర్తి ఎందుకలా అన్నాడో విశాల కర్ధం కాకపోలేదు.
"అమ్మ లేకుంటే నేం? రాకూడదా?' అంది మెల్లగా నవ్వుతూ.
"రాకూడదని ఏం లేదు" విశాల ముఖంలోకి చూస్తూ అన్నాడు.
"కూర్చోండి! నిల్చోనే ఉన్నారేం?"
"అలాగున్నావెం?' అన్నాడు కుర్చీలో కూర్చుంటూ.
విశాల జవాబు చెప్పలేదు.
"మురళి విషయం ఏం తెలీలేదా?"
"ఊహు...."
"ఎంతసేపలా నిల్చుంటావు?"
"నిల్చోగలిగినంత సేపు!"
"అంటే నన్ను త్వరగా వెళ్ళి పొమ్మని అర్ధం అన్నమాట!' విశాల ముఖంలోకి ఓరగా చూస్తూ అన్నాడు.
"బాగుంది! అర్ధాలు బాగానే తీస్తారు!" అంది చిన్నగా నవ్వి.
"మహిళా మండలిలో రేపేదో మీటింగుందంట. తప్పకుండా హాజరు కావాలని సుధీర చెప్పమంది."
"ఊ...."
"అక్కడి కెళ్తే అందరూ కలిసి వెళ్ళచ్చని కూడా చెప్పింది.
"సరే."
"మరిచిపోవు గదూ?"
"ఎలా మరిచిపోతాను?"
'అంటే?"
"సుధీ చెప్పెపంపినప్పుడు."
"ఓ!"
మసక మసగ్గా ఉన్న చీకట్లో విశాల ముఖ కవళికలు సరిగ్గా చూడలేక పోయాడు." భానుమూర్తి. అప్పటికప్పుడే చీకటి దిశ దిశలా అలుముకుంటూ ప్రాకుతుంది.
విశాల లేచి వెళ్ళి లైటు వేసింది. ప్రకాశవంతంగా వెలుగుతున్న విద్యుద్దీపకాంతిలో విశాల ముఖం లోని ప్రతి రేఖనూ చదవ గలిగాడు భానుమూర్తి. చెంపల మీద ఏర్పడిన కన్నీటి చారికలు కొట్టవచ్చినట్లు కన్పిస్తున్నాయి. భానుమూర్తి హృదయం లో ఎవరో చెయ్యి పెట్టి దేవినట్లయింది.
'విశాలా!"
"ఊ...."
"నే నొక్క విషయం అడుగుతాను. దాచకుండా చెప్తావా?'
"అడగండి!" అంది పమిట చెరగు మెలి పెడుతూ కళ్ళు క్రిందకు దించుకుని.
"కన్నీరు చారికలు కట్టేటట్లు ఎడ్వవలసిన కారణమేమిటి?"
విశాల అదిరిపడి కళ్ళెత్తి ఓ క్షణం భానుమూర్తి ముఖంలోకి చూసి కళ్ళు దించుకుని మెదలకుండా ఉండిపోయింది. అయినా ఉచ్చ్వాస విశ్హ్వాశాల వేగం మటుకు కొంచెం ఎక్కువగానే ఉంది.
"ఆ రాత్రి గూడా యిలాగే ఏడ్చావు. ఆరోజూ, ఈరోజూ ఒకే కారణం కాకున్నా నీలో నువ్వే కుమిలిపోతున్నావని నేను కచ్చితంగా చెప్పగలను. బాధలందరికీ ఉంటాయి. హృదయం లోనే వాటిని బంధిస్తే హృదయానికే దెబ్బ. మోయలేని భారాన్ని హృదయం మీద వేయడం అన్యాయం కాదూ? హృదయంలోని వేదనేమిటో ఆత్మీయుల ముందన్నా బయటపెట్టాలి. లేకుంటే జీవితం దుర్భర మవుతుంది."
భానుమూర్తి ఆగి విశాల ముఖంలోకి చూశాడు. విశాల ముఖం గంబీరంగా ఉంది.
"నాముందే నీ బాధలన్నీ చెప్పుకోమని నా ఉద్దేశం కాదు."
"అంటే?" మ్లానమైన ముఖంతో అంది.
"నీ ఆత్మీయుల దగ్గరే...."
"మీరు నాకు ఆత్మీయులు కారా?" మధ్యలోనే భానుమూర్తి మాటలకూ అడ్డువచ్చి అంది.
"అది నువ్వు నిర్ణయించుకోవలసిన విషయం అనుకుంటాను."
విశాల బరువుగా నిట్టూర్చింది. భానుమూర్తి బాధగా చూశాడు.
"పోనీ, నేను అత్మీయుడ్ననే భావమే నీకున్నట్లయితే నీ బాధేమిటో నాతొ చెప్పవచ్చుగా?"
"నేను చెప్పచ్చు. మీరు వినచ్చు. కానీ దాని వల్ల కలిగే లాభమేమిటో చెప్పండి!" అంది విషన్న వదనంతో.
"లాభమే లేదంటావా?" నిస్సహాయదృక్కులను విశాల మీద పరచి అన్నాడు భానుమూర్తి.
"ఏముంది?"
"కనీసం మనసులో భారమన్నా కాస్త తగ్గదంటావా?"
"ఏవో...."
"పోనీ , నీ కిష్టం లేకుంటే మానేయ్! నేను బలవంత పెట్టను. కానీ నువ్వొక కన్నీటి బొట్టు రాలిస్తే, నా హృదయం లో కన్నీటి ధారలే ప్రవహిస్తాయని తెలుసా విశాలా?' అన్నాడు వ్యధిత కంఠంతో.
విశాల కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. హృదయంలో ఆవేదన ఉప్పెనలా పొంగి ప్రవహించింది. ఎంత ప్రయత్నించినా తన ముఖంలోని భావాలను దాచలేక పోయింది.
"ఒక్కోసారి సత్యమే అసత్యంలా కనిపిస్తుంది. నామ్మలేని నిజాలు కూడా ప్రపంచంలో ఉంటాయి." సన్నగా వణుకుతున్న గొంతుతో అన్నాడు.
"దయచేసి అలా మాట్లాడకండి!" అంటూ ముఖం దోసిట్లో దాచుకుంది.
"విశాలా! ఇలా చూడు! ఎందుకలా బాధపడతావు? ఏం జరిగిందో చెప్పవూ?" ముఖం మీద కప్పుకున్న రెండు చేతులను మృదువుగా తొలగించి అడిగాడు.
"ఏం చెప్పమంటారు? అసలెలా చెప్పను?" అస్పష్టంగా గొణిగింది.
"నన్నింకా పరాయివాడిగానే భావిస్తున్నావా, విశాలా? నీకెలా చెప్పాలో నాకర్ధం కావటం లేదు." విచారంగా అన్నాడు.
"అది చదవండి!" అంది జీర గొంతుతో.
భానుమూర్తి మంచం మీద పడున్న కాగితం తీసి ఆత్రంగా చదివాడు. తర్వాత చర్రున చింపి పడేశాడు. ముఖం కోపంతో జేవురించింది. దవడలు, పెదిమలు అదిరాయి. కన్నులు ఎరుపురంగును పులుముకున్నాయి.
"ఎవరు?' అన్నాడు కఠినంగా.
"తెలీదు."
"ఊ.... ఎవడో అప్రాచ్యుడేదో రాశాడని ఏడుస్తూ కూర్చుంటావా? చదువుకున్నదానివి, లోకజ్ఞానం తెలిసిన దానివి..."
"అందుక్కాదు. ఆ మాత్రం నాకు తెలీదా? ఎన్నో అంటారు. ఎన్నో రాస్తారు..." ఆగిపోయింది.
"మరి?"
"నా జీవితమే అంధకారమయం, గమ్యం అగమ్యంగా ఉంది. ఏదారిన వెళ్ళాలో.... ఎవర్ని నమ్మాలో.... " నేలచూపులు చూస్తూ గొణిగింది.
"అంటే? నన్ను గూడా శంకిస్తున్నావా?" కిటికీ ఊచలు పట్టుకుని దూరంగా అంధకారం లోకి చూస్తూ అన్నాడు.
విశాల దగ్గరి నుండి ఎలాంటి జావాబూ రాకపోయే సరికి వెనక్కూ తిరిగి - "స్వనిర్మితమైన రంగుటద్దాల్లో నుండే అందర్నీ చూడ్డం అలవాటు చేసుకున్నావు. మగవాళ్ళంతా మంచివాళ్ళని నేను చెప్పను. అలాగని అందరూ చెడ్డ వాళ్ళంటే మటుకు నేను ఒప్పుకోను సుమా! ఏదైనా ఒక విషయాన్ని ఒకే కోణం లో నుండి చూడ్డం అన్యాయం కాదా, విశాలా? నువ్వు నన్నెందుకలా శంకిస్తున్నావో నాకు తెలియడం లేదు. బహుశా.... సుధీరను చేసుకుంటానని అత్తయ్యకు మాట యిచ్చి ఉండటం చేతనే నన్ను నువ్వింతగా సందేహిస్తున్నావనుకుంటాను." అని, ఆగి విశాల ముఖంలోకి చూశాడు.
విశాల ఔనన్నట్లుగా మెల్లగా తల ఆడించింది.
భానుమూర్తి విచారంగా నవ్వి - "సుధీరను పెళ్ళి చేసుకుని నీతో ప్రేమ]
సరగాలాడేటంతటి దుర్మార్గుడుగా నన్ను చిత్రించుకొన్నావన్న మాట! నేనేం పాపం చేశానో నన్నోక్కరూ అర్ధం చేసుకోలేకున్నారు!" అని గద్గదకంఠం తో అన్నాడు.
విశాలమైన విశాల కళ్ళు ఆశ్చర్యంతో మరీ విశాలమయ్యాయి.
"అయితే సుధీర యీ విషయం నీతో చెప్పనే లేదా?' అన్నాడు కొంచెం ఆశ్చర్యంగానే.
"ఊహూ... చెప్పలేదు."
"సుధీరను నేను చేసుకోవడం లేదు. అలా కాదు! సుధీరే నన్ను చేసుకోవడం లేదు. ఇక నైనా నిశ్చింతగా ఉంటావా? మాస్టారింటికి రాగానే మన పెళ్ళి విషయం మాట్లాడాలనుకుంటున్నాను."
విశాల సిగ్గుతోనూ, ఆలోచనల తోనూ తేలిపోతూ తలవంచుకునే ఉండిపోయింది.
"ఇంకా ఏవిటా ఆలోచన? సందేహాలుంటే బయటపెట్టు. అంతేగానీ మనసులోనే పెట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడవకు" అన్నాడు నవ్వుతూ.
"క్షమించండి! తొందరపడ్డాను" అంది మెల్లగా.
"ఎవర్నీ ఎవరూ క్షమించ నక్కరలేదు. లేనిపోని ఆలోచనలు పెట్టుకుని మనసు పాడుచేసుకోకు సరేనా?' విశాల గడ్డాన్ని మృదువుగా పైకెత్తి ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తూ, అన్నాడు.
విశాల కళ్ళతోనే నవ్వి చూపులు ప్రక్కకు త్రిప్పుకుంటూ - "నేను రాఘవయ్య మాస్టరు గారమ్మాయిని కాను" అంది.
"తెలుసు" అన్నాడు గంబీరంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ.
"విశాలా!' అంటూ గుమ్మం దగ్గరికి వచ్చిన మీనాక్షి ఆశ్చర్యంతో ఓ లిప్త కాలం పాటు నిల్చుండి పోయింది.
భానుమూర్తి వెనక్కు తిరిగి చూసి మౌనంగా వెళ్ళిపోయాడు. విశాల ముఖం సిగ్గుతో ఎర్రబడింది.
మీనాక్షి వచ్చిన పనేమిటో చెప్పకుండా గిరుక్కున తిరిగి పోయింది. విశాల హృదయంలో కలుక్కుమని ముళ్ళు గుచ్చుకున్నట్లయింది.
ఆ రాత్రి భోజనాల దగ్గర కూడా మీనాక్షి కోపంగానే ఉంది. భానుమూర్తి హృదయం విలవిల్లాడిపోయింది. అయినా తనేం తప్పు చేశాడని మీనాక్షి అంతగా కోపగించుకోవడం? అదే భానుమూర్తి కర్ధం కాలేదు. ఆ మాటే అడిగేశాడు కూడా.
"అందరికీ నీతులు చెప్పెపాటి వాడివి! నీకు మటుకు అవి వర్తించవా ఏమిటి?" అంది కాస్త కోపంగానే.
"అంటే? ఏమిటి నువ్వంటున్నది?' అన్నాడు కొంచెం ఆశ్చర్యంగానే.
"ఇంత చదువుకోన్నావు. ఆడపిల్లల జీవితాలతో చెలగాటాలాడడం ఏం సబబు చెప్పు? నీకు మటుకు అది న్యాయంగా కనిపిస్తుందా? పోనీలే , నువ్వు మగాడివి ఎలా తిరిగినా , ఎవరితో తిరిగినా అదేమని ఎవ్వరూ అడగరు! కానీ,విశాల కన్నా కాస్త బుద్ది వుండక్కర్లేదా?' చీత్కారం చేస్తూ అంది మీనాక్షి.
