Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 18


    ఆ పాత సామాన్ల కింద పందికొక్కో, ఎలుకో, చచ్చి చచ్చిపడివుందనుకున్నాను.
    ఇతనిపేరు సోము. సోమూని పిలిచి అక్కడ ఏదన్నా జంతువు చచ్చిపడివుందేమో చూడు అనిచెప్పి, నేను వెళ్ళిపోయాను.
    పావుగంట తరువాత.
    సోమూ పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చాడు.
    సార్, సార్ మెట్లకింద సామాన్లకి అవతల ప్రక్కగా ఒక అమ్మాయి అటు తిరిగివుంది సార్. వంటిమీద గుడ్డలు కూడా లేవు సార్. నాకు భయమేస్తున్నది సార్. దిగి చూస్తూనే పెద్దగా అరిచాను కూడా వెంటనే పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు వచ్చాను. ఈ విషయం చెప్పటానికి. సోమూ చెప్పాడు.
    నేను కంగారుగాలేచి పరుగెత్తాను. అప్పటికే మా హోటల్ లో పనిచేసే నలుగురు అక్కడ నించుని వున్నారు. ఆ విచిత్రం చూస్తూ ఏం జరిగింది? ఏమిటి? అంటే ఎవరూ కూడా మాకేమీ తెలియదన్నారు. నేను పనివాళ్ళచేత ఇవతలికి తీయించి ఆ అమ్మాయిని యిక్కడ పడుకోబెట్టాను. అక్కడ అంతా చాలా దుర్గంధం వ్యాపించింది. ఆమె పూర్తిగా దిగంబరంగా వుండటంతో, చిన్న గుడ్డను మొలమీద ఆచ్చాదనగా కప్పించాను నేను. వెంటనే మీకు ఫోన్ చేశాను. ఇది హత్యే అనుకుంటున్నాను సార్. ఎందుకంటే వంటిమీద ఏ గాయాలూ లేకపోవచ్చు. కాని, ఈ అమ్మాయిని ఇక్కడ దాయటం జరిగిందికదా! ఈ విషయం బయట ప్రపంచానికి తెలిస్తే మేము అల్లరి అయిపోతాము. మా హోటల్ కి ఎవరూ రారు.
    అందుకనే నిజానిజాలు వెంటనే బయటకు లాగాలి సార్." అప్పుడే కొందరు రూమ్స్ ఖాళీచేసి వెళ్ళిపోయారు. అంటూ భయంతో వివరించాడు మేనేజర్.
    "ఐ.సీ." అంటూ తలపంకించాడు ఇన్ స్పెక్టర్.
    "ఉదయం నుండి ఎన్ని రూమ్స్ ఖాళీ చేసివెళ్ళారు."
    వుదయం నుండి ఈ విషయం బయటపడేలోపల సెకండ్ ఫ్లోర్ లొ ఒక రూమ్, థర్డ్ ఫ్లోర్ లో మూడు రూమ్స్ వాళ్ళు ఖాళీచేసి వెళ్ళారు శవం విషయం బయటపడ్డ తరువాత ఫైవ్ రూమ్స్ వాళ్ళు ఖాళీచేసి వెళ్ళారు.
    "మీరు వాళ్ళని వెళ్ళనివ్వకుండా వుండాల్సింది." అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "అక్కడికి మంచిగా బ్రతిమలాడుతూ చెప్పానుసార్. అయినా వాళ్ళు వినిపించుకోలేదు సార్. నాకు బాగా తెలిసిన వాళ్ళు. తరచూ మా హోటల్ కి వచ్చే కస్టమర్స్ వాళ్ళ మాట తీసేయలేకపోయాను." మేనేజర్ వినయంగా వచ్చాడు.
    మేనేజర్ భయస్తుడని, నెమ్మదస్తుడని గ్రహించాడు ఇన్ స్పెక్టర్.
    ఇన్ స్పెక్టర్ పరిశీలనగా డెడ్ బాడీని చూశాడు. చదువు సంస్కారం మిసమిసలాడే యవ్వనము, చూడంగానే ఆకట్టుకునే అందముగల అమ్మాయని గ్రహించాడు.
    డెడ్ బాడీని ఎక్కడనుండో తీసుకువచ్చి ఇక్కడ పడవేసి వుండరు. ఇది ఈ హోటల్ లో జరిగిన హత్య పైకి గాయం ఆనవాలు తెలియకుండా చంపివేసి సాక్ష్యాధారాలు ఎక్కడ లభిస్తాయో అని వంటిమీద వస్త్రాలు లేకుండా చేతి వాచీ, నగలు అన్నీ తీసేశారు. ఆఖరికి హెయిర్ పిన్స్ కూడా......
    అనిత డెడ్ బాడీని చూస్తూ ఆలోచిస్తున్న ఇన్ స్పెక్టర్ చూపులు హెయిర్ పిన్ అనుకుంటూ తలవైపు చూడటం వల్ల ఉబ్బెత్తుగా వాచి నల్లగా కమిలిపోయిన అనిత కణత కనిపించింది. కాస్త వంగి పరిశీలనగా చూశాడు. కణతమీద కమిలిన గుర్తు చాలా చక్కగా కనిపిస్తోంది. ఏదో అర్ధమయినట్లు తలపంకించాడు.
    ఫోటోగ్రాఫర్, ఫింగర్ ప్రింట్ ఎక్స్ పర్ట్ వాళ్ళపని వాళ్ళు చేసుకుపోతున్నారు.
    అక్కడ నుంచున్నవాళ్ళలో ఒకతను వెళ్ళబోతూంటే వెళ్ళొద్దని చెప్పాడు ఇన్ స్పెక్టర్. అక్కడవున్న వాళ్ళవైపు తిరిగి కొద్దిసేపు ఎక్కడవాళ్ళక్కడ వుండండి. నేను చెప్పే వరకూ ఈ హోటల్ లో వున్నవాళ్ళు బయటకు వెళ్ళటం గాని, బయటవాళ్ళు లోపలికి రావటంగాని, జరుగకూడదు. అంటూ కానిస్టేబుల్స్ వైపు తిరిగాడు.
    "ఫోర్ నాట్ వన్, వన్ నాట్ టు, మీరిరువురూ హోటల్ మెయిన్ గేటువద్దవుండి, లోపలివాళ్ళను బయటికి బయటివారు లోపలికి వెళ్ళనివ్వకుండా చూడండి" అని చెప్పాడు.
    ఆ తరువాత.
    "మీలో ఎవరైనా ఈమెను గుర్తుపట్టగలరా? అందర్నీ ఉద్దేశించి అడిగాడు ఇన్ స్పెక్టర్.
    ఎవరూ మాట్లాడలేదు.
    "మేనేజర్ మీరు గుర్తుచేసుకుని చెప్పండి. ఈ అమ్మాయి వంటరిగా గాని, ఎవరితోనన్నా కలిసికాని, లేక ఎవరికోసమన్నాగాని, ఈ హోటల్ కి రావటం జరిగిందా?"
    "గుర్తులేదుసార్, రోజూ హోటల్ కి ఎంతోమంది వచ్చిపోతుంటారు సార్. నా పని నేను చేసుకుపోవటమేగాని, పనిగట్టుకొని ఎవరినీ చూడను. పైగా ఈ వయస్సు ఆడపిల్లల్ని అసలు చూడను."
    "అదేమిటి? ఆశ్చర్యంగా అడిగాడు ఇన్ స్పెక్టర్.
    "గత ఏడాది ఇదే వయస్సువున్న మా అమ్మాయి విషజ్వరంతో ఒక్కరోజులో చనిపోయింది. అప్పటినుంచి నేను ఏ ఆడపిల్లను చూచినా నా కూతురే గుర్తుకువస్తుంది. అందువల్ల నేను ఈ వయస్సు పిల్లలను పరిశీలనగా చూడను. తల వంచుకుని నాపని నేను చేసుకుపోతాను." విచారంగా చెప్పాడు మేనేజర్.
    మేనేజర్ వెంట ఒక కానిస్టేబుల్ ని పంపిస్తూ "హోటల్ మొత్తం గాలించి ఈమెతాలూకా వస్తువులు ఎక్కడైనా దాచివున్నాయేమో చూచివచ్చి నాకు చెప్పు." అన్నాడు ఇన్ స్పెక్టర్.
    మేనేజరు, కానిస్టేబులు వెళ్ళిపోయారు అక్కడ నుండి.
    అనిత డెడ్ బాడీని అక్కడవున్న వాళ్ళలో ఇద్దరు గుర్తుపట్టారు. కాని పోలీసువాళ్ళతో వ్యవహారం అని వాళ్ళు పెదవి కదపలేదు. నరనరాన భయం ఆవరించగా పెదవి కుట్టేసుకున్నట్లు వుండిపోయారు. ఆ ఇద్దరిలో ఒకరు సర్వరు, రెండవ అతను ఆ హోటల్ కి బొత్తిగా సంబంధంలేని సామాన్య మానవుడు గోవిందరావు.
    ఆ 44వ నెంబరు రూమ్ లో వున్న కిరణ్ కి సర్వ్ చేసిన రూంబోయ్ వేరేవాడు. ఒకవేళ అతను అనిత శవాన్ని చూసినా గుర్తుపట్టలేడు. కారణం అతను అనితను సరిగ్గా చూడకపోవటమే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS