దానివల్ల ప్రయోజనం ఏమీలేదు. తను కొడుకుని దూరం చేసుకోవడం తప్ప. కిరణ్ ని, దాన్ని ఇక్కడే వుండనిచ్చి అసలు జరిగిందేమిటో తను తెలుసుకోవాలి. అప్పుడు ఏం చెయ్యాలి అన్నది నిర్ణయించుకుంటే సరి.
ఇదంతా ఆలోచించిన రావుగారు భార్యను ప్రక్కగదిలోకి పిలుచుకు వెళ్ళారు.
"ఆ పిల్ల బెదిరింపో, లేక ఏదన్నా ఘోరం జరిగిందో మనకు తెలియదు. వాడు జరిగింది దాస్తున్నాడు అంటే అది ఎంత భయంకరమైనదో ఆలోచించు మనం ఇపుడు చేయవలసింది ఒకటే. మనవాడిని మనం రక్షించు కోవడం కోసం ప్రస్తుతం మనం వాడి మాటలకి తలవొగ్గి ఇద్దరినీ ఇంట్లో వుంచుదాం."
"ఆపిల్ల ఎందుకో నాకు కోడలిగా నచ్చలేదు" అంది ఊర్మిళాదేవి.
"నీకే కాదు, నాకూ నచ్చలేదు. అలా అని కొడుకుని దూరం చేసుకుంటామా!"
"ఉహు..."
"కనుక మనం ప్రస్తుతం వారిద్దరినీ ఇంట్లో వుంచాల్సిందే. ఆపిల్ల కాని ఎవరూ కాని తనని బ్లాక్ మెయిల్ చెయ్యటం లేదని కిరణ్ చెప్పాడు. అయినా వాడు ఏ వుచ్చు ముడిలో చిక్కుకున్నాడో మనం నెమ్మదిగా తెలుసుకోవాలి. నేను చాలా డీప్ గా ఆలోచించాను. కిరణ్ ని రక్షించు కోటానికి, అసలు రహస్యం తెలుసుకోటానికి, ప్రస్తుత పరిస్థితిలో మనం తల వొగ్గక తప్పదు."
భర్త చాలా వివేకంగా ఆలోచిస్తాడని, ప్రతిదీ చాలా దూరదృష్టితో చూస్తాడని ఊర్మిళాదేవికి బాగా తెలుసు. అయిన అలా వివరంగా చెప్పేసరికి ఆమె కూడా తగ్గిపోయింది. 'మీ ఇష్టం' అంది.
ఇరువురు కలిసి మరల కొడుకు దగ్గరకు వచ్చారు.
"కిరణ్, నీవు పెళ్ళి చేసుకొచ్చానని నలుగురికి చెప్పి హంగులూ, ఆర్భాటాలు ఏవీ చెయ్యము. నలుగురూ అడిగితే మా వాడికి ఇష్టమైంది. రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు వాడిష్టాన్ని నేను కాదనలేదు. దట్సాల్ అని చెప్పేస్తాను. ఇంట్లో మీరు హాయిగా కొడుకు. కోడలిగానే వుండవచ్చు. కానీ, ఒకటి మాత్రం గుర్తుంచుకో నువ్వింకా ఆపదలో మునిగివుంటే నాతో ధైర్యంగా చెప్పు. అది ఎంత పెద్దదైనా సరే నామీద ఈగ వాలకుండా క్షణాలలో ఉఫ్ మని వూది పారేస్తాను. ఇంతకుమించి చెప్పేదేమీ లేదు" అన్నాడు రావుగారు.
"థాంక్స్ డాడీ" అన్నాడు కిరణ్.
ఆ తరువాత ముగ్గురూ కలసి కామినీదేవి దగ్గరకు వచ్చారు.
"కామినీ నిన్ను అమ్మా నాన్న తను కోడలిగా స్వీకరించారు" ఆనందంగా చెప్పాడు కిరణ్.
కామినీదేవి మొహంలో చిరునవ్వు చిందులాడింది.
11
ఆ హోటల్ ముందు చాలా మంది జనం గుమికూడి వున్నారు క్రొత్తగా ఆ గుంపులోకి జొరబడ్డ ఆ వ్యక్తి 'ఇక్కడ ఏం జరిగింది' అని అడిగాడు.
"నాకూ తెలియదు. లోపల ఒకామె చనిపోయి పడివుందట. ఎవర్నీ లోపలికి వెళ్ళనివ్వడం లేదు." అతను చెప్పాడు.
"చచ్చిపడి వుంటే చూడటానికి వెళ్తే ఏమయిందట?"
"చచ్చి పడుండటమంటే మామూలుగా కాదు. హత్య చేయబడింది."
"కత్తితోనా?"
"నాకు తెలియదయ్యా బాబూ!"
"రివాల్వర్ తోనా?"
"నాకు తెలియదయ్యా బాబూ అని చెప్పానా!"
"మరి హత్యా అని చెప్పావు కదయ్యా! మరి కత్తీ కాక రివాల్వర్ కాక మరి ఎలా చంపినట్లు? ఓహో నైలాన్ తాడుతో గొంతు పిసికా?"
"కాదు అవతల అతనికి ఒళ్ళు మండింది. ఆ మూడూ కాదు బావిలోకి త్రోసి చంపాడు" అన్నాడు.
"అలా ముందే చెబితే సరిపోయేది కదా! అంటూ జనాన్ని తోసుకుని ముందుకి వెళ్ళాడు. కాస్త ముందుకు వెళ్ళినతరువాత బుర్ర పనిచేసింది. హోటల్ లో బావి ఎక్కడ వుంటుందబ్బా! అని. "ఏమయ్యా నన్ను చూస్తుంటే ఆటలుగా వుందా? నాకు ఏమన్నా పిచ్చనుకున్నావా! హోటల్లో కాని ఎక్కడ వుంటుంది. ఏదీ చూపించు." అని అడుగుదామని వెనక్కు వచ్చాడు. అక్కడ ఆ వ్యక్తి కనపడలేదు. "దరిద్రుడు వెధవ అంటూ నా భార్యకే కాదు వీడికి కూడా నేనంటే లోకువగా వున్నట్టుంది. వేళాకోళం మాటలు మాట్లాడటానికైనా ఒక హద్దువుండాలి." అనుకుంటూ మళ్ళీ ముందుకు సాగాడు.
అతని పేరు గోవిందరావు. 40 పైనే వయస్సు ఉంటుంది. సాధారణమైన దుస్తులతో బక్క ప్రాణి లాగా వున్నాడు. కళ్ళకింద మటుకు ఉబ్బెత్తుగా వుంది, అలా వుండటం గమనించినవారికి అతడు తాగుడుకు బానిస అని తెలుస్తుంది.
హోటల్ లో ఒక సర్వరుతో గోవిందరావుకి బాగా పరిచయం వుంది. అటుగా వస్తున్న అతని ద్వారా లోపలికి వెళ్ళాడు. హోటల్ లోపలికి అందరినీ రానివ్వడంలేదు అయినా శవానికి కొద్ది దూరంగా చుట్టూ మూగి 10, 12 మంది వున్నారు. అందరూ తగ్గుస్వరంతో మాట్లాడుకుంటున్నారు. గోవిందరావు లోపలికి వెళ్ళిన సమయంలోనే పోలీసులు బిలబిలలాడుతూ లోపలికి వచ్చారు. దాంతో గోవిందరావు ఏదో అనబోయి నోరుమూసుకుని ప్రక్కకు జరిగాడు.
హోటల్ మేనేజర్, ఇన్ స్పెక్టర్ ఇద్దరు కానిస్టేబుల్స్ శవం దగ్గరకు వెళ్ళారు. ఫింగర్ ప్రింట్స్ ఎక్స్ పర్ట్, ఫోటో గ్రాఫర్ మరొక ఇద్దరు వారివెంట వున్నారు.
"పోలీసులు రావడంతో అందరి నోళ్ళూ మూతబడి పోయాయి. అందరూ చూస్తూ వుండిపోయారు మౌనంగా.
"మొదటిసారిగా ఈ శవం చూసింది ఎవరు" అడిగాడు ఇన్ స్పెక్టర్.
ఓ పని చేసేవాడు ముందుకు వచ్చాడు. "నేను సార్" వినయంగా చెప్పాడు.
"అసలేం జరిగింది? ఈ శవాన్ని ఎలా కనుగొన్నారు? ఇన్ స్పెక్టర్ అడిగాడు.
మేనేజర్ వివరంగా చెప్పటం మొదలుపెట్టాడు.
"మా హోటల్లో వెనుకవైపు మెట్లు వున్నాయి. అవసరం అయితే అటువైపునుండి కూడా దిగవచ్చు. పనివారు, ఎవరైనా ఒకరు ఎప్పుడైనా అటు మెట్లు వుపయోగించి దిగుతారు. మెట్లకింద గదిలాగా వుంటుంది. అక్కడ హోటల్ కి సంబంధించిన పాత పనిముట్లు, విరిగిపోయిన సామాను అక్కడ పడవేసి వుంచుతాము. ప్రతిరోజూ వుదయం నేనొక సారి హోటల్ అంతా తిరిగి చెకింగ్ చేస్తాను. మెట్లదగ్గరికి వచ్చినపుడు దుర్వాసన వచ్చింది.
