ఇప్పుడు
ఆ రూమ్ లో
ఆర్.కె.అధికారి ఆయన అసిస్టెంట్లు సమావేశమై ఈ కేసు గురించి తీవ్రంగా పరిశీలిస్తున్నారు.
అక్కడ
అయిదుగురు మగవాళ్ళు నలుగురు ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎదుటి ఛయిర్ లో ఆర్.కే.అధికారి చక్రపాణి కూర్చున్నాడు. వాళ్ళ మధ్యనున్న టేబుల్ మీద దినపత్రికలు పరమేశ్వరీ ఆలయం తాలూకావివరాలు వివిధఫోటోలు సేకరించిన వార్తలు మొత్తం ఈ కేసు తాలూకావే వున్నాయి.
"కేసు పూర్వాపరాలు తెలుసుకున్నారు. రిపోర్టులన్నీ చూశారు. గుడిచుట్టూ తవ్విన తీరు. ఈ హత్యలు గోడమీద రాతలు. వీటన్నిటిని బట్టీ మీ కేసునిపిస్తున్నది తెలయజేయండి. మీ వూహకి ఏది తడితే అది చెప్పండి. మన ఆలోచనలన్నీ వకేరకంగా సాగుతున్నాయో లేక మనలో ఎవరికయినా కొత్త ఆలోచనలు తడుతున్నాయో అన్నీ చూసుకుని ఓ నిర్ధారణకి వద్దాము. అప్పుడు ఆలోచిస్తాను ఈ కేసు ఎవరికి అప్పగించాలనేదీను. యు కెన్ ప్రొసీడ్!" చక్రపాణి అన్నాడు.
ఎవరికీ తోచింది వాళ్ళు చెప్పారు. ఆధారాలు చూపించారు. ఇలా జరిగి ఉండొచ్చున్నారు. ముందు ముందు ఇంకా ఇలా జరగవచ్చు జరిగి తీరుతుంది.....
వాళ్ళు చెప్పింది చక్రపాణికి నచ్చలేదు.
అక్కడున్న తొమ్మిదిమందిలో ఆరుగురు చెప్పటం పూర్తి అయింది.
ఇంకా చెప్పవలసింది ముగ్గురు.
ఆ ముగ్గురి పేర్లు.
ఉన్నికృష్ణ మనోహర్.
మాధురీ మహంతి.
అనుపమ సర్కార్.
ఉన్నికృష్ణ మనోహర్ కొంతవరకు బాగానే చెప్పాడు.
మాధురీమహంతి కూడా ఫరవాలేదు.
చివరికి అనుపమ సర్కార్ మిగిలింది. ఆమె చెప్పటం మొదలుపెట్టింది.
"ఇంతవరకూ మనవాళ్ళు చెప్పింది మనం అందరం వినటం జరిగింది. చివరికి అందరి నోటంటా వచ్చింది వకేమాట. దీని వెనుక ఏదో పెద్ద కారణమే వుంది అని....
ఎస్.దీని వెనుక పెద్ద కారణం కాదు పెద్ద హస్తం ఉంది. కనిపించని ఆ చెయ్యి ఏదో అదృశ్యంగా ఉండి ఆడిస్తున్నది, ఈ అలజడికి హత్యలకి మామూలు కారణం ఎంత మాత్రం కాదు.
గోడమీద రాతలుచూసి ఇది రాడికల్స్ పని అనుకోకూడదు. అణుమాత్రం కూడా వాళ్ళ హస్తం దీనిలో లేదు. వాళ్ళసలు ఇలాంటి పనులు చేయరు.
ఈ మధ్య టెర్రరిస్టులు పెరిగి ఎక్కడబడితే అక్కడ హత్యలు, అలజడులు సృష్టించటం తెలిసిందే. కాని ఇది టెర్రరిస్టు పనికాదు. వాళ్ళ హస్తం ఈ కేసులో లేదు.
ముందుగా మనం చూడవలసింది.....!
గుడిచుట్టూతా తవ్వితే లాభం ఏమిటి! ఊహకి కూడా అందని విచిత్ర్రం ఇది. విగ్రహాలని చోరీచేసి విదేశాలకి అమ్మటం......గుడిలో దొంగలుపడి పగలు ఎత్తుకెళ్ళటం ఇవన్నీ ఎప్పుడూ జరుగుతున్న విషయాలే.
ఈ కేసులో తమాషా ఏమిటంటే గుడి గుడిలో విగ్రహం పదిలంగా ఉన్నాయి. గుడిచుట్టూ తానే తొవ్వటం జరిగింది, దూరతీరాలలో ఉన్న భక్తులకి ఆకర్షణ కలగజేస్తూ ఏదో గిమ్మిక్స్ చేసి వాటిని ప్రచారం చేసి అందరినీ రప్పించటం చేశారు అనుకోటానికి ఆధారాలులేవు. ఉదాహరణకి...........
(ఫలానాచోట వేపచెట్టు తియ్యని పాలని రాత్రింబవళ్ళు అదే పనిగా కారుస్తున్నది. ఫలానాచోట ఓ రాతిలోంచి రక్తంచుక్కలు చుక్కలుగా పడుతున్నది. మరోచోట పుట్టలోంచి అయిదు శిరస్సుల నాగేంద్రుడు అర్ధరాత్రి పైకివచ్చి దర్శనం ఇస్తున్నాడు)
"......ఇలాంటివేవీ అసిరిపల్లెలోగాని పరమేశ్వరీదేవి ఆలయంలోగాని జరగలేదు. కేవలం తొవ్వటం మాత్రమే జరిగింది. ఆ తొవ్వటమైనా లోతుగా తోవ్వారా అదేమీలేదు అరడుగు లోతు మాత్రమే తొవ్వారు. గుడిచుట్టూతా తిరిగి ప్రదక్షిణాలు చేస్తారు. గుడి చుట్టూతా తడిగుడ్డలతో దొర్లుతారు. ఇలాంటి మొక్కులు ఉంటాయి ఆచారాలు ఉంటాయి. అంతేగాని గుడిచుట్టూతా తొవ్వటం మనుషులని నరికి పోగులు పెట్టటం ఎక్కడాలేదు. కనుక దీనికి ఏదో బలీయమైన కారణం ఉండే ఉంటుంది.
ఇది మతిస్థిమితం లేనివాడు చేసిన పిచ్చిపనికాదు ప్రాక్టికల్ జోకర్ పని అంతకన్నా కాదు ప్రసిద్ద ఆలయంగా పేరుబడటానికి చేసిన పనికూడా కాదు, నాస్తికుల పనికాదు, దేముడి మీద కోపం తెచ్చుకుని చేసిన వెర్రిపని అసలేకాదు, ఇదేదీకాదు కాబట్టి దీని వెనుక చాలా బలీయమైన పెద్ద కారణం ఉందని గట్టిగా చెప్పొచ్చు. ముఖ్యంగా హత్యలు కూడా జరిగాయి కాబట్టి అనుమానించటానికి తగిన ఆస్కారం ఉంది.
