పూర్వం రాజుల కాలంలో దేముడికి అలంకరించే ఆభరణాలేగాక గుడి గోపురం గుడి గోడలు తలుపులు అన్నీ బంగారు రేకులతో తాపడం చేసేవారు రత్న ఖచితమణి మాణిక్యాలు అమ్మవారికి నగలుగా ఉండేవి కోట్లకొద్దీ బంగారం రత్నాలు సోమనాథ దేవాలయంలోనే దోచుకెళ్ళారు ఇలాంటి గత చరిత్రలు ఎన్నో మనందరికీ తెలిసిందే ఆ రోజుల్లో ప్రతి ఆలయం వెండి బంగారాలకు విజయాలు ఈ రోజుల్లో ఆలయాలు రాళ్ళూ రప్పలకూ విలయాలు అన్నాడు ఓ కవి.
ఆ కవి మాటలు పూర్తిగా యదార్దాలు కావు. కోట్లకొద్దీ బంగారం ధనరాసులు ఎక్కడోదాకా ఎందుకు ఏడుకొండలు మీదనే ఉన్నాయి పరమేశ్వరీ ఆలయం విషయానికి వస్తే పైకి అలా కనబడుతూ పాతిక శౌరీల బంగారం కూడా లేదు ప్రత్యేక సందర్భాలలోను పూజలప్పుడు ఉత్సవాలప్పుడు మాత్రం దేవికి బంగారు నగలు అలంకరించటం జరుగుతున్నది పరమేశ్వరీ ఆలయ అధికారులు అమ్మవారి నగలని బ్యాంక్ లాకర్ లో దాయటం జరుగుతున్నది అవసరమైనప్పుడు మాత్రమే తీస్తున్నారు.
ఈ విషయాలన్నీ ఇప్పుడు అప్రమత్తమేమోనని అనుకోటానికి లేదు. కేసు పరిశీలించేముందే అన్ని వైపులనుంచీ ఆలోచించటం మంచిదని ఈ విషయాలన్నీ తీసుకురవటం జరిగింది, చాలా కొద్దిమందికి దేముళ్ళు దేవాలయాల విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి దేవాలయాల గోడలలోను దేముడి విగ్రహాల కింద అంతులేని సంపదలు ఉన్నాయని పూర్వం రాజులు గోడల్లోను, పునాదుల్లోను దేవతా విగ్రహాల పీఠాల కింద ఆ ధనరాసులని దాచేవారని చెపుతుంటారు.
కొన్ని ఆధారాలబట్టి ఈ విషయంలో ఏమాత్రం సందేహంలేదు గత చరిత్ర-విషయమే తీసుకుంటే మౌర్యవంశంలోని రాజామహదేవ్ ని అతని దాయాదులే రాజ్యంకోసం రాత్రికి రాత్రే అన్యాయంగా కత్తిపట్టి అందరి కుత్తుకలూ కోస్తూ ఎదురైన ప్రతివాడి తలా నరికివేస్తూ కోటను అన్యాయంగా ఆక్రమించుకోవటం జరిగింది. పోరాడే సమయం లేదు. అతనివాళ్ళే తిన్న ఇంటి వాసాలు లెక్కబెడుతూ, కోటను ఆక్రమించుకోవటం జరిగింది. ఎదురునిలిచి పోరాడటానికి సమయం మించిపోయింది గత్యంతరంలేని పరిస్థితులలో రాజామహదేవ్ భార్యతో, ఒక్కగానొక్క కొడుకుతో కోటలోంచి రహస్యమార్గం నుంచీ బయటకి వెళ్ళిపోవటం జరిగింది. చాలా ఏళ్ళు రాజామహదేవ్ అజ్ఞాతవాసంలో ఉండిపోయాడు. రాజామహదేవ్ తన దగ్గర అమూల్యమైన మణి మాణిక్యాలు, రత్నఖచితహారాలు, ఇంకా ఎన్నో రకాలయిన అమూల్యసంపద ఎక్కడదాచాడో కానరాక కోటను ఆక్రమించిన దాయాదులు ఎన్నోచోట్ల త్రవ్వకాలు సాగించారు. కోటలో అంగుళం అంగుళం గాలించి వదిలిపెట్టారు. కానీ వాళ్ళకి ఆ సంపద దొరకలేదు, అజ్ఞాతంలో ఉన్న రాజామహదేవ్ తన స్థానాన్ని తిరిగి తను పొందటానికి చాటుగా ఎందరో మనుష్యులని సిపాయిలనీ సేకరించాడు. కానీ వాళ్ళకి తిండీ బట్టా ఆయుధాలు సమకూర్చడం చాలా కష్టం, కానీ ఆయన ఏ మాత్రం కష్టపదకుండా ధనం తీసుకువచ్చి వాళ్ళకి అందించేవాడు. అన్నీ సక్రమంగా నిర్వహించి తిరిగి యుద్ధంచేసి కోటను స్వాదేనం చేసుకుని అతని రాజ్యాన్ని అతను పొందాడు. ఆయన ఆ ధనాన్ని ఎక్కడదాచాడో మీలో ఎవరికైనా తెలుసా?" అంతవరకూ చెప్పి అనుపమా సర్కార్ అడిగింది.
అక్కడ ఉన్న ఎవరూ మాట్లాడలేదు.
చక్రపాణి మాత్రం "నాకు తెలుసు, అయినా నువ్వే చెప్పు?" అన్నాడు చిరునవ్వుతో.
"దేవాలయంలో ధ్వజ స్థంభం క్రింద అందరికీ తెలిసిందే దేవాలయాల్లో ధ్వజస్థంభాలు గుడికి ఎదురుగా ఇవతలగా ఉంటాయి. ఆ ధ్వజస్థంభానికి కుంకుంబొట్టు పెట్టి ఉంటుంది. ఆ కుంకంబొట్టు క్రింద ఒక బటన్ లాంటిది ఏర్పాటుచేశారు. అది నొక్కితే ధ్వజస్తంభం ప్రక్కన నేలమీద పలక ప్రక్కకు జరుగుతుంది. ఆ పలక క్రింది మెట్లు ఉన్నాయి మెట్లుదిగి లోపలికి వెడితే చిన్న గది ఉంది, ఆ గదిలో అతని మణిమాణిక్యాలు, ధనరాసులూ దాచి వుంచబడ్డాయి. ఈ రహస్యం మహారాజుకి తప్ప ఎవరికి తెలియదు. అంత క్రింతం కోటను ఆక్రమించుకున్న దాయాదులు ఆలయాన్ని కూడా సోధించి వదిలిపెట్టారు కాని! ధ్వజస్థంభంజోలికి వెళ్ళలేదు, ఎందుకంటే ధ్వజస్థంభం గుడిముందు నలుగురికీ కనిపించే విధంగా ఉంది. అందువల్లనే ఎవరికీ అనుమానం రాలేదు.....
"అయితే ఇప్పుడు పరమేశ్వరీ ఆలయ విషయంలో కూడా అలాంటిది ఏదయినా ఉందని నీ అనుమానమా?" మధ్యలో అడ్డుతగిలి చక్రపాణి అడిగాడు.
"నో, సర్! ఉదాహరణకి రాజామహదేవ్ కధ చెప్పాను. దేవాలయంలో ధనురాసులు దాచడమనేది, మన గత చరిత్రలు చూస్తే చాలా బయటపడతాయి. అలా ధనరాసులకోసం ఏ దొంగవాడో కన్నువేసి ఈ కేసు తాలూకా పరమేశ్వరీ ఆలయంలో ఇలా ధనరాసులు దాచివున్నా యేమో అని ఏ ఆధారమూ దొరికి గుడిచుట్టూ త్రవ్వి ఉంటాడని నేను భావించడం లేదు. ఎందుకంటే గుడిచుట్టూతా ఉన్న రాళ్ళని పైకి ఎత్తటం జరిగింది. లోతు అరడుగు కూడా త్రవ్వలేదు. పైగా గోడమీద హెచ్చరికలు చూశారుకదా! విధినిక్షేపాలకోసం ఈ పని జరుగలేదు. ఏదో......ఏదో......చాలా విచిత్రమైన పెద్ద కారణం ఈ కేసులో దాగివుంది. వాళ్లిప్పటికీ నాలుగుసార్లు ప్రయత్నించారంటే అక్కడితో ఈ కధ ఆగలేదు అని అర్ధం. కారణం చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. మరోసారి వాళ్ళు ప్రయత్నిస్తారన్నది ఖాయం. ఈ తఫా చాలా పెద్ద ప్లాను వేసి చాలా పకడ్బందీగా వ్యవహారం పూర్తిచేస్తారు. ఈ సమయంలో మనంకూడా రంగంలోకి దిగితే, వాళ్ళ చర్యలన్నీ కనిపెట్టి సమయం చూసి టకీమని పట్టేయవచ్చు. ఒకళ్ళని పట్టడం అంటూ జరిగితే అసలు విషయం తెలుస్తుంది.
