లంబా పళ్ళు చప్పుడుకాకుండా కొరుక్కున్నాడు.
"సాధనా! నీ ప్లాన్ చెప్పు!" ఆర్ష అడిగాడు.
"బాస్! నాప్లాన్ మీవక్కరికి మాత్రమే చెపుతాను, మీరు ఓకే అంటే నేను బయలుదేరి వెళతాను."
సాధన ఆమాట అనగానే ఆర్ష ఆమోదసూచకంగా తలఆడించి లేచి నిలబడ్డాడు.
ఆర్ష సాధనా కలిసి పక్క రూమ్ లోకి వెళ్ళిపోయారు.
లంబా పళ్ళునూరుకుంటూ వుండిపోయాడు.
పన్నెండు నిమిషాలు గడిచిపోయింది.
ఆర్ష వెలిగిపోయే ముఖంతో గదిలోంచి బైటికివచ్చి సాధనకి ఈకేసు అప్పగించినట్టు ప్రకటించాడు.
అందరూ చప్పట్లు కొట్టారు.
లంబాకూడా కొట్టాడు చప్పట్లు. అలా కొడుతూనే అనుకున్నాడు. నీకు నేనే ప్రత్యర్ధినే ఎలా విజయంసాధిస్తావో చూస్తాను. నేను ఇక్కడ ఉండగానే చేయి ఎత్తుతావుటే చెయ్యి! నీచేయి విరిచేది నేనే. నిన్ను పడగొట్టకపోతే నాపేరు లంబాయేకాదు." ఆ నిమిషానే లంబా మనసులో ప్రతిజ్ఞపూనాడు.
యుద్ధం జోరుగా సాగుతున్నప్పుడు ఉపసేనాధిపతి సేనాధిపతికి అడ్డుతగిలితే సాధించేది విజయంకాదు అపజయం.
లంబా అడ్డం తగలనున్నాడు.
సాధన ఏంచేయనుందో చూడాల్సిందే మరి.
లంబా సంగతి సాధనకి తెలుసు, ఓరకంటితో అతన్ని చూసి నవ్వుకుంది.
"నాకు తెలుసు నేను ఇద్దరినీ ఎదుర్కోవాలి" అనుకుంది సాధన.
9
ఆర్.కె.
రా కేంద్రం దానిని ఆర్.కె అంటారు. దీనిని గురించి అందరికీ తెలియదు.
స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ ,లోకూడా మళ్ళీ కొన్ని స్పెషల్ వి ఉన్నాయి వాటిలో ఆర్.కె.వకటి.
పరమేశ్వరీదేవి ఆలయంకేసుని సి.ఐ.డి లు అంతతేలికగా తీసుకోదల్చుకోలేదు. పోలీసులవల్ల ఏమీకాలేదు. పైగా అధికార్లు తీసుకున్న జాగ్రత్తవల్ల ఇద్దరిప్రాణాలు హరీఅన్నాయి.
రాత్రిళ్ళు గుడిలోపల ఇద్దరు వాచ్ మాన్ లు తుపాకులు చేతబూని పహారాతిరగటం బైట మరోఇద్దరు వాచ్ మాన్ లు కాపలాకాయటం రాత్రిళ్ళు గుడిగోడలకి కరెంట్ పాకే ఏర్పాట్లు అక్కడక్కడా అలారం దొంగలువస్తే మొరగటానికి కుక్క చాలాజాగ్రత్తలు తీసుకొని గుండెల మీద చేయివేసుకుని నిర్భయంగా ఉన్నారు.
షరా మామూలే.
ఈతఫా దొంగలు ఎలా లోపలికి దూరారో తెలియదు ఎలా బైటికి వచ్చారో తెలియదు. కొత్తగా గచ్చువేసిన మరోవైపు నాలుగుగజాల వెడల్పున బండలు ఎత్తేశారు తవ్వారు.
అక్కడితో ఆగితే ఫరవాలేదు.
కాపలాకాచే కుక్కని లోపలతిరుగుతున్న వాచ్ మాన్ లని బైటవున్న ఇద్దరినీ చాలాచక్కగా చంపిపారేసి అలారంబెల్ మోగకుండాచేసి కరెంట్ ఆపిపారేసి వెళ్ళిపోయారు.
పైగా
అక్కడ గోడలమీద చాక్ పీసుతో రాసి మరీవెళ్ళారు.
ఆరాతలు ఇలా ఉన్నాయి.
జాగ్రత్తోం జాగ్రత్త.
తస్మాత్ జాగ్రర్త.
అయ్యల్లారా అమ్మల్లారా! గుడిలోవున్న అమ్మవారూ! నాయనా ఇన్ స్పెక్టర్ వర్ధనం (నందివర్ధనం) ఆబాలగోపాలంలారా భక్తులారా! పై.....ఆ___పై అధికార మహాశయులారా! మాకళ్ళు గుడిమీద పడ్డాయి. గుడిచుట్టూతా తవ్వటమేమిఖర్మ సరైన సమయంచూసి గుడిమొత్తాన్ని తవ్విపారేస్తాము, మళ్ళీ మాట్లాడితే పేల్చిపారేస్తాం ఏవనైనా చెప్పి చేయగల ధైర్యం నాకున్నది కాబట్టే ముందుగా తెలియజేస్తున్నాను, మీపాట్లు మీరుపడండి.
బేవ కూఫ్ వెధవాయిల్లారా!
జాగ్రత్తోం జాగ్రత్త
తస్మాత్ జాగ్రత్త
గుడి గోడమీద చాక్ పీసుతో రాసిన ఆ రాతలని ఫోటోతీశారు.
శవపరీక్షలు పోలీసుకుక్కలు పేపరువార్తలు ప్రజల భయాందోళనలు.....
ఇదివరకన్నా
చాలా తీవ్రస్థాయిలో
సంచలనంతో
ఇదంతా జరిగిన తరువాత పోలీసువాళ్ళు ఆపైఅధికారులవల్ల లాభంలేదని తెలిసి.....అప్పుడు ఆర్, కె కి ఈకేసు అప్పజెప్పటం జరిగింది.
