Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 16


    "ఓ విషమ పరిస్థితి నుంచి బయటపడటానికి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని పెళ్ళిచేసుకోక తప్పలేదు."
    "అంటే అది నిన్ను బెదిరించిందా?"
    "ఊహు..."
    "మరి!"
    "ఆ విషమ పరిస్థితి ఏమిటో ప్రస్తుతం చెప్పలేను డాడీ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక మాట నిజం, నేనొక చిక్కులో ఇరుక్కొని పీక దాకా కూరుకుపోయాను. దానిలోంచి బయటపడాలంటే అంతకన్నా గత్యంతరం లేకపోయింది.
    "నువ్వేమి చేశావని పీకదాకా కూరుకుపోయావ్. నాతో మాట మాత్రం చెబితే నేను నిన్ను రక్షించేవాడిని కదా!"
    "ఆ రక్షిస్తారు, మీ సుపుత్రుడికి కావలసినంత స్వేచ్చ ఇచ్చారు. అది ఏమో వేడిని ప్రేమలోకి దింపి వుంటుంది. వీడు లక్షాధికారి పుత్రుడు అని ముందుగానే తెలుసుకుని వుంటుంది, వీడివల్లనో, ఎవడివల్లనో కడుపో, కాలో, వచ్చి వుంటుంది. ఆ వంకతో వేడిని నలుగురిలో అల్లరిచేస్తానని బెదిరించి వుంటుంది. దాంతో వీడు భయపడిపోయి అది చెప్పినట్లు విని వెంటనే దాని మెళ్ళో మూడు ముళ్ళు  వేసి వుంటాడు.
    మీరు గమనించారో లేదో, ఆ పిల్ల దాని పొట్ట కాస్త ఎత్తుగా వున్నది. అసలు వీడొక తెలివితక్కువ పనిచేశాడు. అపుడే మా మమ్మీ, డాడీదగ్గరకు వెళదాం పద అని ఇక్కడకు అపుడే తీసుకురాలసింది" అంది ఊర్మిళాదేవి.
    "మీ మమ్మీ చెప్పినట్లే జరిగిందిరా?" అడిగాడు రావుగారు.
    "మీరు ఊహించింది ఏదీ కాదు" అన్నాడు కిరణ్.
    "మేము ఊహించింది కాకపోతే మరేమిటి ఆ విషమ పరిస్థితి?" అడిగాడు రావుగారు.
    "డాడీ, ఇన్ని మాటలెందుకు, నేను ఎవరూ తప్పించలేనంత పెద్ద చిక్కులొ ఇరుక్కున్నాను. అదేమిటి అని నన్ను ప్రశ్నించవద్దు. మీరెన్ని ప్రశ్నలు వేసినా దానికి సమాధానం ఇవ్వను. నన్ను ఆ చిక్కునుండి పూర్తిగా రక్షించింది కామిని. పూర్తిగా ఏమిటి శాశ్వతంగా రక్షించింది. అందువల్ల నేను పెళ్ళిచేసుకోవటం జరిగింది.
    "ఓహో నీకు సహాయం చేసినందుకు ప్రతిఫలంగా నువ్వు పెళ్ళిచేసుకున్నావన్నమాట. గతంలో మీరు ప్రేమించుకున్నామని అన్నావు అది అబద్దమన్నమాట"
    "కాదు, కాదు. అదికూడా నిజమే."
    "మరి కడుపు....."
    "అది నిజమే."
    "ప్రేమించుకోవటం నిజం. నీవలన ఆపిల్ల తల్లి కాబోవటం నిజం, అర్జంటుగా పెళ్ళి చేసుకోవటం నిజం. ఎటొచ్చి ఆ చిక్కేమిటి! అది ఒక్కటే చెప్పవన్న మాట."
    "అంతే డాడీ, మీరు నన్ను క్షమించాలి. అది ఒక్కటే నేను కోరేది."
    తల్లి, తండ్రికి తెలియని విషమ పరిస్థితి బిడ్డకు ఏమివస్తుంది ఊర్మిళా నీకు తెలుసా?"
    "నాకెన్నో తెలుసు కానీ ఇది తప్ప." అంది ఊర్మిళా దేవి.
    రావుగారు కొద్దిసేపు ఆలోచించి అడిగాడు "ఆ పిల్లకు ఎవరైనా వున్నారా?"
    "ఒక పినతండ్రి తప్ప ఎవరూలేరు. ఆయనకీ భార్యా బిడ్డలు లేరు. ఆయనదగ్గరే వుంటున్నది. బి.ఎ. పూర్తిచేసింది. వుద్యోగాల వేటలో వుండగా నాతో ఆమెకు పరిచయం అయ్యింది." కిరణ్ చెప్పాడు. అంతేకాని, ఓసారి రేస్ కోర్స్ లో పరిచయమయినట్లు, మరోసారి క్లబ్బులో తనతో పేకాడటం అలాటివేమీ చెప్పలేదు.
    "కిరణ్" బిడ్డ ఎన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులు మనసులో దాచుకుంటారు. నీవు మాకొక్క బిడ్డవైయుండి, ముందే చమాకు చెప్పాపెట్టకుండా పెళ్ళిచేసుకొచ్చావ్. చాలా పెద్ద తప్పుపని చేశావ్. అయినా నిన్ను నేను క్షమిస్తున్నాను. అలాగే నువ్వు ఎంత ఘోరమైనపనిచేసినా క్షమిస్తాను. సవ్యమైన పరిస్థితిలో నువ్వు ఆ పిల్లని పెళ్ళిచేసుకోలేదు. నా వూహ ప్రకారం అయితే ఆ కామిని, దాని బాబాయ్ గారు కలిసి ఏదో విషయంలో నిన్ను బ్లాక్ మెయిల్ చేసి నీ మెడలు వచ్చి అప్పటికప్పుడు పెండ్లిజరిగేలా చూసుంటారు అవునా?" రావుగారు శాంతంగా అడిగారు.
    కిరణ్ చాలా తెలివిగా క్విక్ గా ఆలోచించాడు.
    "డాడీ, కామినీ అటువంటిది కాదు. నన్ను రక్షించుకోవడానికి తన ప్రాణం అడ్డువేసింది. దానికి ప్రతిఫలంగా నేనామెను పెళ్ళిచేసుకున్నాను.
    మీరు వూహించినట్లు కామిని నన్ను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసివుంటే, ఈ విషయం ఎలాగో అలాగా మీకు చెప్పి, కామిని నోరుమూసుకుని వెళ్ళిపోయేలా చేసివుండేవాడిని. డాడీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. మీరీ నిముషాన నన్ను సజీవంగా చూస్తున్నారంటే అది కామినీ దయ వల్లనే."
    "నువ్వు చెప్పే తీరుతప్ప, ఆ పిల్ల తీరుచూస్తూంటే అలా అన్పించడంలేదు. ఆ చూపులు, ప్రవర్తన సంస్కారం వున్న అమ్మాయిలా తోచడం లేదు. కోడలిగా చెప్పుకోటానికి నాకు ఎంతమాత్రం నచ్చలేదు." ఊర్మిళాదేవి అంది.
    కిరణ్ మాట్లాడలేదు.
    రావుగారు మరికొన్ని ప్రశ్నలు అటు ఇటు త్రిప్పి వేశారు. రావుగారు ఎన్ని రకాలుగా త్రిప్పి, త్రిప్పి ప్రశ్నలు వేసినా కిరణ్ ఒక్క మాట మీదనే వున్నాడు. మొదట ఏమి చెప్పాడో, మళ్ళీ మళ్ళీ అదే చెప్పాడు. అంతేకాని, కాస్త మాటకూడా నోరుజారి బయట పెట్టలేదు.
    పావుగంట తరువాత.
    "అంతే డాడీ ఇక నేను చెప్పవలసినది ఏమీలేదు. కామినీకి ఈ ఇంటికోడలిగా స్థానం ఇస్తేనే, నేను కామిని ఇక్కడ వుండటం జరుగుతుంది. మీకు ఇష్టం లేని పక్షంలో మే మిరువురం బయటకు వెళ్ళిపోతాం. అంతకు తప్ప గత్యంతరం లేదు. మీ నిర్ణయం ఏమిటో చెబితేనే..."
    రావుగారు ఆలోచిస్తూ వుండిపోయాడు.
    "మీ అబ్బాయికి ఎప్పుడు పెళ్ళిచేశారు అంటే ఏమి చెప్పను. లోకులికీ ఈ పిల్ల నా కోడలు అని ఎలా చెప్పను. నాకిదంతా చూస్తుంటే అయోమయంగానే కాదు, అసహ్యం గాను కూడా వుంది" ఊర్మిళాదేవి మొహం చిట్లిస్తూంది.
    రావుగారి ఆలోచనలు పరిపరివిధాల సాగినవి. కిరణ్ కాస్త ఆకతాయిగా తిరుగుతాడని తనకు తెలుసు. కొద్ది దురలవాట్లు వున్నాయని కూడా తెలుసు. అలాగే ఎంత విషమ పరిస్థితి వచ్చినా, తనతో చెప్పి డబ్బుతోనో పలుకుబడితోనో, శాశ్వతంగా రూపుమాపగలశక్తి వుందని కూడా తెలుసు. అయినా కిరణ్ ఇంతపని చేశాడంటే దీని వెనుక చాలా పెద్ద కథ వుండే వుంటుంది. ఎన్ని విధాలుగా అడిగినా ఆ విషయం గురించి కిరణ్ చెప్పటంలేదు అంటే అది చాలా భయంకరమైనది కూడా అయివుంటుంది. కిరణ్ ఇంట్లోంచి వెళ్ళి పొమ్మంటే తక్షణం వెళ్ళిపోతాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS