Previous Page Next Page 
అష్టపది పేజి 16


    
    'ఓ యబ్బ ఆచారం ఇంతోటి సిండా ఆచారాలు మాకు తెలిసిచస్తేకదా! మంచి మర్యాద లేకుండా వెళ్ళు వెళ్ళు అని తోలేస్తున్నది.' అని లోలోపలే తిట్టుకుని పైకి చిరునవ్వు ముఖమంతా అలుముకుని "అలాగే అలాగే మీరు దగ్గర వుండి తీసుకు వస్తానంటే నేనెందుకు. మీ ఆచారం మీ యిష్టం. తెల్లారేసరికి మీ ఇంటి కోడలు కాబోతున్నది." అంటూ యిందిరా రాణి అక్కడ నుంచి వెళ్ళిపోయింది.
    
    'క్షమించు అమ్మా! నేను అబద్దాలు ఆడటమే కాక ఒకటికి రెండు నేరాలు చేస్తున్నాను. మీరు నా శ్రేయస్సు కోరి ఈ పెళ్ళి తలపెట్టారు. నా బాధ మీకు అర్ధం కాదు. నేను నేరస్తురాలిని. పాపాత్మురాలిని. నేను మీ మాట అన్నా వినాలి. మీరు నా మాట అన్నా వినాలి రెండూ జరగలేదు.' శీతల్ రాణి అనుకుంది. మనసు మూగగా మూలుగుతుంటే వరసగ జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి.
    
    సి.బి.ఐ. అధికారిణి తగ్గుస్వరంతో ఏం చేయవలసింది చెప్పుకుపోతున్నది.
    
    శీతల్ తల్లి విషయంలో మూగ బాధపడుతూ గతం ఆలోచిస్తూ సి.బి.ఐ. అధికారిణి చెపుతున్న కొన్ని మాటలు వింది మరి కొన్ని మాటలు వినలేదు.
    
    శీతల్ చేసింది ఒకే ఒక్క పొరపాటు అదే పెరిగి పెరిగి అంతకంతకు నేరం పెద్దదయి చివరికి ఇంట్లోంచి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. అది ఆమె చేతులారా చేసుకున్న నేరం ఇహపై ఆమె నేరంలోంచి బైటపడలేదు. ప్రమాదాల ఊబిలోకి చేరువుగా ప్రయాణం చేస్తున్నది. అది అక్షరాలా నిజం కాబట్టే పరధ్యానంగా ఆలోచిస్తూ సి.బి.ఐ అధికారిణి చెప్పే కొన్ని మాటలు వినలేదు.
    
    ఎవరి కర్మకు ఎవరు కర్తలు?
    
    పెళ్ళి కూతురు వున్న గదిలోకి ఎవరో ఒకరు వచ్చి వెడుతున్నారు. దానితో శీతల్ కి సి.బి.ఐ. అధికారిణి మాట్లాడుకోవడం కూడా కుదరడం లేదు.
    
    వేడుక ఆచారం మొదలయ్యే సమయం అయింది.
    
    బిలబిల లాడుతూ ఆ గదిలోకి కొందరు అమ్మాయిలు వచ్చి ఏదేదో మాటలు చెప్పబోయారు.
    
    సి.బి.ఐ. అధికారిణి ముఖానికి దట్టంగా వేలాడే పూలమాలలుగల పూల కిరీటాన్ని శీతల్ రాణి ముఖానికి పెట్టింది. అలా పెడుతూ "బాత్ రూమ్" అంటూ శీతల్ కి వినిపించేటంత తగ్గుస్వరంతో గుర్తుచేసింది.
    
    శీతల్ చీర సవరించుకుంటూ లేచినుంచుంది. "బాత్ రూమ్ కి వెళ్ళి రావాలి. వెళ్ళిరావచ్చా ఆంటీ!" అంటూ అందరూ వినేలా అడిగింది.
    
    "పిచ్చి పిల్లా! బాత్ రూమ్ కి కూడా అడగాలా వెడుదువుగాని పద" అంటూ సి.బి.ఐ. అధికారిణి లేచి శీతల్ చేయి పుచ్చుకుని ఆ గదిలోనే ఓ పక్కగా వున్న ఎటాచ్డ్ బాత్ రూమ్ వేపు నెమ్మదిగా నడిపించుకు వెళ్ళింది.
    
    శీతల్ బాత్ రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకుంది.
    
    బాత్ రూమ్ లో
    
    దాడాపుస్ శీతల్ ఎత్తు, అదేలావుగల అమ్మాయి ఇప్పుడు శీతల్ ధరించిన పెళ్ళికూతురు డ్రస్ ధరించి ఓ పక్కగా వదిగి నిలుచుని వుంది శీతల్ రాక కోసం యెదురు చూస్తూ.
    
    "మిస్ శీతల్ రాణీ! ఇదిగో బ్రీఫ్ కేస్ దీనిలో మీరు ధరించాల్సిన డ్రస్ వుంది. డ్రస్ మార్చుకుని ఇప్పుడు మీరు ధరించిన నగలు డ్రస్సుతీసి బ్రీఫ్ కేసులో పెట్టి తయారుగా ఉండండి. ఈల వినిపించగానే ఆంటీ మీకు చెప్పినవిధంగా వెళ్ళిపొండి మీ కోసం రంజిత్ యెదురు చూస్తూ ఉంటాడు. పూల కిరీటం ఇలా యివ్వండి. నేను ధరించి బయటకి వెడతాను. ఊ...క్విక్. టైము లేదు" బాత్ రూములో వున్న అమ్మాయి నెమ్మదిగా చెప్పినా స్ఫుటంగా చెప్పింది.
    
    పరీక్షగా ఆ అమ్మాయిని చూస్తున్న శీతల్ చిన్న ఉలికిపాటుతో తేరుకుని తన ముఖానికి తొడిగిన పూలకిరీటం తీసి ఆ అమ్మాయి చేతికి జాగ్రత్తగా అందించింది.
    
    ముఖాన్ని కవరుచేసే పూలకిరీటాన్ని అనుభవం ఉన్న దానిలా తానే అమర్చుకుని "విష్ యు గుడ్ లక్" అనేసి మృదువుగా శీతల్ భుజంతట్టి ఆ అమ్మాయి బాత్ రూమ్ లోంచి బయటికి వెళ్ళిపోయింది.
    
    బాత్ రూమ్ లోంచి ఆ అమ్మాయి బయటకి రాంగానే తలుపు దగ్గర రెడీగా వున్న సి.బి.ఐ. అధికారిణి చనువుగా అమ్మాయి రెక్కపుచ్చుకుని ఆ గదిలోంచి నడిపించగా వెళ్ళిపోయింది.
    
    వాళ్ళని అనుసరించి వచ్చిన అమ్మాయిలు వెళ్ళిపోయారు.
    
                                                               *    *    *
    
    బాత్ రూమ్ లో వున్న శీతల్ తేరుకోటానికి సరిగ్గా అయిదునిమిషాలు పట్టింది.
    
    బాత్ రూమ్ లోపల బోల్టు బిగించుకుని బ్రీఫ్ తెరిచింది. లక్షాధికారుల ఇంట్లో బాత్ రూమ్ లు మధ్యతరగతి వాళ్ళ ఇంట్లోని బెడ్ రూమ్ అంత విశాలంగా ఉంటాయి కాబట్టి చుక్కనీరు కాకుండా ఎన్ని డ్రస్ లు అయినా మార్చుకోవచ్చు. శీతల్ వేగంగా తన వంటిమీద డ్రస్ విప్పేసి బ్రీఫ్ కేసు లో వున్న డ్రస్ ని వేసుకుని క్విక్ గా కొద్ది మేకప్ చేసుకుని రెడీ అయింది.
    
    "ఈ బ్రీఫ్ కేసుని ఇక్కడే వదిలి వెడితే; అది మంచి పని కాదు. దీనిలో చాలా ఖరీదైన నగలు వున్నాయి. కట్టుగుడ్డలతో తాను ఇల్లు వదులుతున్నప్పుడు రంజిత్ దగ్గర డబ్బులేదు. ఈ నాటకం, ఇంతమంది మనుష్యులని ఏర్పాటు చేయటం- రంజిత్ కి చాలానే ఖర్చు అయి వుంటుంది. అక్కడికి తను రజియా చేతికిచ్చి అయిదు వేలు పంపించింది. అదిప్పుడు ఖర్చయిపోయి వుంటుంది. డబ్బు అవసరం అవుతుంది. కనుక నగలు దగ్గరవుంటే మంచిది..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS