శీతల్ ఆలోచనలు శరవేగంగా సాగుతుండగా బాత్ రూమ్ బయట నుంచి ఈలశబ్ధం, ఆ వెంటనే మునివేళ్ళతో బాత్ రూమ్ తలుపుమీద తట్టిన శబ్దం వినిపించింది.
శీతల్ నెమ్మదిగా తలుపుతీసి తొంగిచూసింది.
"నేను కారు డ్రైవర్ ని ఆంటీ రమ్మన్నారు బయలుదేరండి" వచ్చినతను గాభరాగా అటూ యిటూ చూస్తూ తగ్గుస్వరంతో చెప్పాడు.
అప్పటికే శీతల్ గుండె దడదడలాడుతున్నది. బాత్ రూమ్ లోంచి ఖంగారుగా యివతలికి వచ్చింది. బ్రీఫ్ కేసుని మాత్రం మరచిపోకుండా చేత్తో పట్టుకునే ఉంది.
"ఎవరైనా మిమ్మల్ని చూసి గుర్తుపడితే కష్టం. పూర్తిగా తలదించుకుని వేగంగా నా వెనుకనేరండి" అంటూ మారుమాటకి ఆస్కారం లేకుండా డ్రైవర్ ముందుకు సాగాడు.
శీతల్ పూర్తిగా తలదించుకుని అతనివెనుకనే బయలుదేరింది.
ఇరువురు కలసి క్షేమంగా ఆ ఇంటిబయటికి వచ్చారు. గోడవారగా ఉన్న ఎర్రరంగు మారుతీకారు డోర్ తెరిచి "తొందరగా ఎక్కండి. ఎవరో ఇటు వస్తున్నారు" గాభరాగా అన్నాడు డ్రైవరు.
శీతల్ క్విక్ గా కారు ఎక్కేసింది అలా కారు ఎక్కి ఇలా సీటుమీద కూర్చునే లోపలే కారు డోరు పడటం, రెప్పపాటుకాలంలో లోపల వున్న తను శీతల్ ముఖం మీదకి సిరంజితో మత్తుమందు స్ప్రే చెయ్యటం, మోసం అనే పదంలోని మో దగ్గరే ఆగిపోయిన ఆమె తలవాల్చేయటం, వెంటనే అతను ఆమెని పట్టుకుని సరీగా కూర్చోబెట్టి సీటుకు జార్లగిలేశాడు. అదేక్షణంలో కారు ముందు దూకి యమస్పీడుతో అక్కడనుంచి కనుమరుగయింది.
ఇది ఎవరూ గమనించలేదు. ఓ వేళ గమనించి అనుమానించే టైము, ఆస్కారం లేకుండా ఆ సంఘటన జరిగిపోయింది.
డ్రయివర్ నని చెప్పి మారుతీ కారు వరకూ శీతల్ తీసుకుని వెళ్ళిన అతను కారు ఎక్కలేదు. బయటనే నిలబడిపోయాడు. మారుతీకారు కనుమరుగు అయిందాకా చూస్తూ మరో దిక్కుగుండా సాగిపోయాడు. కొంతదూరం వెళ్ళి రిక్షా ఎక్కాడు. అక్కడితో వాళ్ళపని పూర్తి అయింది.
ఆ ఇంటికి మరో పక్కన ఇంకో ఎర్రరంగు మారుతీ కారు ఆగి వుంది. ఆ కారు కూడా శీతల్ ని ఎక్కించువెళ్ళటానికి రెడీగా వుంది.
ఆ మారుతీ కారు సి.బి.ఐ. వాళ్ళది.
శీతల్ బాత్ రూమ్ లోంచి బైటపడి డ్రైవర్ వెళ్ళిపోయిన పదినిమిషాలకి సి.బి.ఐ. అధికారి బాత్ రూమ్ దగ్గరకు వచ్చి ఈలవేశాడు.
శీతల్ లోపల లేనందున బాత్ రూమ్ తలుపు తెరుచుకోలేదు.
సి.బి.ఐ. అధికారి మరోసారి ఈల వేశాడు.
ఉహూ, ఈ తఫా కూడా బాత్ రూమ్ తలుపు విరుచుకోలేదు.
సి.బి.ఐ. అధికారికి అనుమానం వచ్చింది. బాత్ రూమ్ లోకి వెళ్ళాడు. ఏముంది, బాత్ రూమ్ ఖాళీ బాత్ రూమ్ లో చెంప పిన్ను, నాలుగైదు మల్లెపూలు కనపడ్డాయి ఓ పక్కగా. తలపంకించి బాత్ రూమ్ లోంచి బైటికొచ్చాడు.
సి.బి.ఐ అధికారి బాత్ రూమ్ లోంచి బైటికి వస్తూనే నలువైపులా తిరిగి వేగంగా పరిశోధించాడు. ఆయన అనుమానం బలపడింది. పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు తమాషా ఆచారం ఆట ఆడేచోటుకి వెళ్ళి తన అసిస్టెంట్లకి కనుసౌంజ్ఞ చేశాడు. ఆ క్షణాన్నే వాళ్ళిద్దరూ ఇవతలికి వచ్చారు.
"శీతల్ కనపడటం లేదు" సి.బి.ఐ అధికారి చెప్పాడు.
"కనపడటం లేదా? ఈల శబ్దం వినబడేదాకా బాత్ రూమ్ లోనే వుండమన్నానే!" సి.బి.ఐ. అధికారిణి గాభరా చెందుతూ అంది.
"ఏదో జరిగింది" సి.బి.ఐ. అధికారి తీవ్రంగా ఆలోచిస్తూ అన్నాడు.
"ఏదో అంటే?" ఈ తఫా అసిస్టెంట్ అడిగాడు.
"చర్చించటానికి సమయం లేదు. మనం ముగ్గురం అయిదే అయిదు నిమిషాలలో నలువైపులా గాలిద్దాం. శీతల్ కనపడక పోతే పెళ్ళికూతురు వేషంలో వున్న శ్యామాని కోడ్ తో పిలువు. ఏ మాత్రం ఆలశ్యం చేయకుండా శ్రీశైలం వెళ్ళిపోదాం. వెరీ డేంజర్ పొజిషన్ ఏర్పడింది మూవ్ క్విక్ లీ."
"ఎస్ సర్" అంటూ ఇవురువూ చెరో పక్కకు పోయారు.
సి.బి.ఐ అధికారి పరిసరాలని జాగ్రత్తగా గుర్తించి మరో పక్కకి వెళ్ళాడు.
అయిదు నిమిషాలు పూర్తి అయింది.
ముగ్గురు తిరిగి వచ్చారు. వారి మధ్య రెండే నిమిషాలు సంభాషణ జరిగింది. ఆ తర్వాత వేగంగా ఇరువురు బైటికి వెళ్ళిపోయారు. ఆమె పెళ్ళికూతురి వేషంలో వున్న శ్యామాని తీసుకు రావటానికి వెళ్ళింది. మరో అయిదు నిమిషాల తర్వాత.
విడిదింటికి ఓ పక్కగా ఎప్పటి నుంచో నిలిచిన ఓ ఎర్రరంగు- మారుతీ కారు శరవేగంగా కదిలిపోయింది.
* * *
కొత్త ఆచారం తాలూకు సరదా అలవాటు అయింది.
అందరూ హాలులో చేరారు.
నలుగురు పెళ్ళి కొడుకులు ముగ్గురు పెళ్ళికూతుళ్ళూ సురేంద్రనాథ్ సి.బి.ఐ అధికారి కోసం అటుచూశాడు. ఆయన కనపడలేదు. ఆయన తాలూకా కూడా దరిదాపుల్లో కానరాలేదు.
