Previous Page Next Page 
అష్టపది పేజి 15


    
    రజియా చేత కబురు రంజిత్ కి పంపించడంవల్ల రంజిత్ మనుషులని పంపించాడని శీతల్ అనుకుంటున్నది ఆ ధైర్యం తోనే ఉన్నది.
    
    వచ్చిన ముగ్గురూ రంజిత్ పంపితే వచ్చినవాళ్ళు కాదని సి.బి.ఐ. వాళ్ళని శీతల్ కి తెలియదు.
    
    సి.బి.ఐ వాళ్ళని శీతల్ కి తెలుస్తే ఏం చేసేది!
    
    ఏమో అది శీతల్ కే తెలియాలి.
    
    కొత్తఆట తాలూకా ఆచారం తన ప్రాణంమీదకి తెచ్చారని ఆచారం పేరుతో పధకం తయారుచేసింది కూడా ఇప్పుడు వచ్చిన సి.బి.ఐ. వాళ్ళేనని, ఈ విషయంలో సురేంద్రనాథ్ నిమిత్తమాత్రుడని....ఇవేవీ శీతల్ కి తెలియదు.
    
    తెలిస్తే!...
    
    తన జాగ్రత్తలో తను ఉండేది.
    
    ఓ పక్క కారుమబ్బులు గాఢంగా కమ్ముకువస్తుంటే శీతల్ మాత్రం ఏం చేయగలదు.
    
    శీతల్ చేసిందల్లా తొందరపడి నోరు జారడం అది కూడా సి.బి.ఐ. వాళ్ళముందు.
    
    ఈ పెళ్ళి జరుగుతుందా లేదా?
    
    శీతల్ హంతకురాలిలాగా బయటపడనుందా? పెళ్ళికూతురుగా పల్లకి ఎక్కనుందా?
    
    ఏమో?
    
    ఏం కానున్నదో?
    
    మరి కొద్ది గంటలలో పడనుంది ఆ పరమ రహస్యం అందాక వేచి చూడవలసిందే.
    
                                                                 *    *    *
    
    సరదా వేడుక విడిదింట్లో మొదలైంది.    

 

    పెళ్ళి కూతురు శీతల్ రాణిని చక్కగా అలంకరించారు. మగపెళ్ళివారి ఆచారం ప్రకారం విడిదింట్లో తీసుకెళ్ళి ఒక గదిలో కూర్చోబెట్టారు.
    
    మిగతా పెళ్ళికూతుళ్ళ పెళ్ళి కొడుకుల అలంకరణ అప్పటికే జరిగిపోయింది. అందరి ముఖాలకి దట్టంగ పూల మాలలు వేలాడే కిరీటం లాంటిది తగిలించారు.
    
    సరదా వేడుకగల ఆ ఆచారం మరో గంటకి మొదలవుతుంది అనగా ఈ లోపలే లేడీ సి.బి.ఐ. అధికారి శీతల్ దగ్గర కొచ్చి కూర్చుని మాటలు మొదలు పెట్టింది శీతల్ దగ్గర స్నేహితురాళ్ళు వుంటే బైటకెళ్ళి కూర్చోమని పంపించి వేసింది.
    
    "నా కోసం రంజిత్ చాలా రిస్క్ తీసుకున్నాడు.
    
    ఈ పరిస్థితులలో..." శీతల్ నెమ్మదిగా ఏదో చెప్పబోయింది.
    
    "ఇష్" అంటూ సి.బి.ఐ. అధికారిణి అడ్డు తగిలింది.
    
    తను ఎంత విషమ పరిస్థితిలో వుంది శీతల్ కి తెలుసు. ఒక అబద్దానికి మరో అబద్దం, ఒక తప్పుకి మరో తప్పు, ఒక నేరానికి రెండో నేరం తోడవుతున్నాయి. సమస్య జటిలం అయే లోపల.
    
    "ఏమిటి ఆలోచిస్తున్నావ్?" ఆమె తగ్గు స్వరంతో అడిగింది.
    
    "నా కోసం మీరు ఏం చేశారా అని" శీతల్ కి చాలా ఆతృతగా వుంది వివరం తెలుసుకోవాలని.    

 

    "వివరం చెప్పడానికి లేదు. ఎవరైనా వస్తే మళ్ళీ చెప్పడం కుదరదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను."
    
    "చెప్పండి నా బుర్ర పని చెయ్యడం ఆనాడే ఆగిపోయింది. నా భారం రంజిత్ మీద పెట్టాను. రంజిత్ కి కబురు మాత్రం చేయగలిగాను. రంజిత్ ఏం చెప్పి పంపాడో చెప్పండి అదే చేస్తాను."
    
    "నీలాగానే మరో అమ్మాయికి వేషం వేయించాడు. ఆ పిల్లని బాత్ రూమ్ లో దాచాను. సరదా ఆచారం గల ఆట మొదలయ్యే సమయానికి నేను ఆ అమ్మాయిని తీసుకెళతాను. నీవు బాత్ రూమ్ లో దాక్కో అవతల ఆట రంజుగా సాగుతుంటుంది. అందరూ సరదాగా ఆట చూస్తుంటారు నేను గాని, నాతో వచ్చిన మా వాళ్ళు గాని ఈ గది దగ్గరకు వచ్చి ఈల వేస్తాము. లైన్ క్లియర్ అయితే గాని మేము రాము..."
    
    ఆమె చెపుతుంటే శీతల్ జాగ్రత్తగా వింటున్నది.
    
    "నీవు ఈ లోపల బాత్ రూమ్ లో వుండి చేయవలసింది వకటుంది. చక చక డ్రన్ మార్చుకుని అక్కడ నేను రెడీగా వుంచిన డ్రస్ వేసుకో ఈలవింటూనే బైటికి వచ్చేసేయి. ఈ ఇంటి ఇటు పక్క మార్గంగుండా బైటికి వెళ్ళంగానే గోడ పక్కనే ఎర్ర రంగు మారుతీ కారు రెడీగా వుంటుంది అది ఎక్కి..."
    
    ఇందిరా రాణి గదిలోకి రావడంతో ఆమె చటుక్కున మాటలు ఆపేసింది. అంతేకాదు మాట మార్చి "అమ్మాయిని దగ్గరుండి దగ్గరుండి నేను తీసుకు వస్తాను మీరు వెళ్ళి కూర్చోండి వదినగారూ!" అంది తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో.
    
    "ఫరవాలేదు మీకు శ్రమ ఇవ్వడం దేనికని..." నవ్వుతూ అంది ఇందిరారాణి.
    
    "ఇది మా సరదా ఆచారం. దీనిలో మీరు వేలు పెట్టకూడదు. అమ్మాయిని దగ్గరుండి నేను తీసుకు వస్తాను మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. ఈ లోపల అమ్మాయితో నేను మాట్లాడుకుంటూ కూర్చుంటాము" కాస్త గట్టిగానే చెప్పింది ఆమె.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS