Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 8


                                                    ఆడపిల్ల

    "భగవంతుడా! యీ ఆడపిల్లల పెళ్ళి బాధ పగవాళ్ళకి కూడా వద్దు!" చేతిలోని ఉత్తరం బల్లమీద పడేసి, కనిపించని దేముడికి మొర పెట్టుకున్నాడు విశ్వనాథం.
    ఏమిటి? వీళ్ళూ నచ్చలేదని రాసేశారా ఏమిటండీ?" ఆత్రుతగా భర్త మొహంలోకి చూస్తూ అడిగింది కమలమ్మ.
    "ఆహా! మహారాజులా వ్రాశారు! వాళ్ళకేం! మగపిల్లలవాళ్లు! నచ్చలేదని వ్రాసి పారేస్తారు. మన పాట్లు వాళ్ళకెందుకు తెలుస్తాయి!"
    "ఖర్మ!....యింక యీ జన్మకి దానికి పెళ్ళయ్యే గీత లేదులావుంది!"
    "యింక దానికి పెళ్ళి చేయడం నా వల్ల గాదు! నేనింక తిరగలేనే!" నిట్టూరుస్తూ బాధగా తలపట్టుకున్నాడు విశ్వనాథం.
    "ఏమిటో, దాని రాత యిలావుంది. దాని యీడు వాళ్ళందరూ పెళ్ళిళ్ళయి సంసారాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఇంకా మనగుండెల మీద కుంపటిలా కూర్చుంది. ఈ పెళ్లికొడుకుల కోరికలకి అనుగుణంగా కాస్త తెల్లతొక్క అయినా బాగుండేది. వాళ్ళ కోరికలెలా ఆకాశాన్నంటుతున్నాయో దీనందమూ అలాగే వుంది!"
    బాగుంది. మనకు లేని అందం మనపిల్లకి ఎక్కడనించి వస్తుంది? వాడెలా వుండనీ, చేసేది గుమాస్తా పని, కాని వాడి కాబోయే భార్య మాత్రం సినిమా తారలా వుండాలి, చదువుండాలి, స్టేటస్ వుండాలి. మామగారికి దండిగా కట్నమివ్వగల తాహతు వుండాలి! యీ హిరణ్యాక్ష వరాలన్నీ తీరాలంటే ఆడపిల్లలకి యీ జన్మలో పెళ్ళిళ్ళవడం అనేది అసంభవం!"
    "యిదంతా మన ఖర్మ!....దానికి పెళ్ళి కాలేదన్న బాధ అటుంచి, లోకుల బాధ భరించలేకుండా వున్నాను. మనపిల్ల పెళ్ళిబాధ మనకంటే ఊర్లో వాళ్ళకెక్కువగా ఉన్నట్లుంది. ప్రతిరోజూ క్రొత్తగా అడగడమే" "అమ్మాయికి పెళ్ళి కుదిరిందా, 'పెళ్లెప్పుడూ?" అంటూ, అక్కడికి పెళ్ళి అనేది ఓ గంటలోనో, రోజులోనో కుదిరిపోయేటట్టు కుదిరినా, మనమేదో కావాలని చేయకుండా ఊరుకున్నట్టు! వాళ్ళ యింట్లో ఆడపిల్లలున్నా సరే, అక్కడికి ఆ బాధలేవీ తమకు లేనట్లు, మనమే చేయక పాపం గట్టుకున్నట్టు పరామర్శించ బోతారు! వెధవగోల వచ్చిపడింది. దీని మూలంగా యీ బాధలన్నీ తల్చుకుంటే, పుట్టగానే పీక నులిమి అవతల పారేశాను గాదేమో అనిపిస్తూంది!" కూతురు పెళ్ళి కాలేదన్న బాధతో ఉక్రోషంగా అంది కమలమ్మ.
    "హుష్, ఊరుకో! అదివింటే బాధ పడ్తుంది!" మందలించాడు విశ్వనాథం.
    ప్రక్క గదిలోంచి అంతా వింటూనే వుంది సీత. సీత అందగత్తె కాదు? అలాగని కురూపీ కాదు. ఏ వికారం లేదు. ఎటొచ్చీ కాస్త పొట్టిగా, నల్లగా వుంటుంది. పుట్టిన అందరూ తెల్లగా ఉండరు! నల్లటి వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకుండాను లేదు. అయితే సీత కెందుకు పెళ్ళిగాదు? ఘటన లేదనో, అదృష్టం లేదనో సరిపెట్టుకోవాలి. ఇంచుమించు పదేళ్ళ నించి సాగుతున్న పెళ్ళి ప్రయత్నాలు ఇప్పటికీ ఏ కొలిక్కీ రాకపోవడానికి కారణం సీత దురదృష్టం అని చెప్పుకోవాలి. సీతకంటే ముందు ముగ్గురు ఆడపిల్లలకి అంత ప్రయాస లేకుండానే పెళ్ళిళ్ళు అయ్యాయి. పెద్ద చదువు లేకపోయినా, అందగత్తెలు కాకపోయినా పెద్ద కట్నాలు పోయకుండానే ఏదో వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతికేపాటి సంబంధాలు చేశాడు. ఎటొచ్చీ సీత వేళకి పరిస్థితులు చాలా మారాయి.
    కాలానుగుణంగా సీతని మెట్రిక్ వరకు చదివించాడు విశ్వనాథం. అంతకంటే ఎక్కువ చదివిస్తే అంతకు మించిన మొగుడ్ని తెచ్చే తాహతు లేక సీతని మెట్రిక్ తో మానిపించి అప్పట్నుంచి పెళ్ళి సంబంధాలు వెతకడం ఆరంభించారు.
    మెట్రిక్ చదివిన పిల్లకి ఏ బి.ఏ. మొగుడన్నా కావాలి. అతడికి ఈమె నచ్చాలి! తన తాహతుకి మించిన కట్నం ఇవ్వడానికి సిద్ధపడ్డా ఫలితం శూన్యం! కొందరు ఫోటో చూసే తిరిగిపోయారు! పిల్లను చూసి నచ్చలేదన్నారు కొందరు, కొందరికి మిగతా విషయాలు కుదరలేదు. గత పదేళ్ళనించి చూచిన పది, పదిహేను సంబంధాలు యిలాగే అయిపోయాయి. రోజులు గడిచిన కొద్దీ సమస్య పెద్దది కాసాగింది. ముఖ్యంగా సీతకి. సంతలో పశువులాగ తనకీ పెళ్ళిచూపుల శల్యపరీక్షలు ఎప్పటికి అంతం అవుతాయో, అసలు అంతంటూ వుంటుందో, ఉండదో తేలని సమస్య అయింది. ఒక్కొక్క సంబంధం వచ్చి తిరిగి పోతుంటే సీతకు పెళ్ళిపట్ల విముఖత రోజురోజుకీ పెరగసాగింది. అయినా పైకి చెప్పలేక, తల్లి తండ్రులకి కష్టం కల్గించలేక తనలోని బాధని తనలోనే అణుచుకునేది.
    తల్లి తండ్రుల మాటలతో, సీత తనకింక పెళ్ళికావడం కల్ల అని నిశ్చయించుకుంది. యింక అనవసర ప్రయాసతో, అనవసరపు ఆశలతో తండ్రి బాధపడకూడదు! ఆ మాట తండ్రితో గట్టిగా చెప్పాలి తను.
    టేబిల్ మీద తలవాల్చి మనసులోని ఆవేదనని కన్నీళ్ళ ద్వారా వెలిబుచ్చుతూన్న సీత కళ్లు వత్తుకుంటూ లేచి నిల్చుంది.
    "ఏడుస్తున్నావా అమ్మా!" కూతురి మొగంలోకి చూడగానే విశ్వనాధం గొంతు పూడింది!
    "నువ్వెందుకే తల్లీ ఏడవడం! నిన్ను కన్నందుకు, నీకు పెళ్ళిచేయలేక నలుగురిలో తలెత్తుకు తిరగలేక మే మేడవాలి గాని!" కటువుగా అంది కమలమ్మ. ఎవరిమీద చూపలేని కోపం, పగ, కసి, బాధ తీర్చుకోడానికి ఆమెకింక ఎవరూ కనపడలేదు.
    "అవును. నువ్వన్నట్టు పుట్టగానే గొంతు పిసికి పారేసివుంటే అప్పటి ఏడుపుతో సరిపోయేది మీకు. ఇప్పుడిలా నా గురించి ఏడవాల్సిన అవసరం లేకపోయేది!" ఉక్రోషంగా అంది సీత.
    "అమ్మ ఏదో బాధలో అందమ్మా! నీవు కూడా అలా మాట్లాడతావేమిటి?"
    "నాన్నా. నేనొకటి చెపుతాను వింటావా?"
    "ఏమిటి?"
    "ఇకనించి మీరు నా పెళ్ళిమాట ఎత్తడానికి వీలులేదు. యీ రోజు నించి నాకోసం సంబంధాల వేట మానేయండి."
    "మానేసి" శుష్కహాసం చేశాడు విశ్వనాథం.
    "నేనసలు పెళ్ళి చేసుకోను, మీరనవసరంగా బెంగ పెట్టుకోకండి" దృఢంగా అంది సీత.
    "బాగుంది సంబరం! పెళ్ళి వద్దుట! పెళ్ళిచేసుకోకుండా కూర్చో, యింక తలెత్తుకోనక్కరలేదు నలుగుర్లోనూ! యిప్పటికే సగం చచ్చాను అడ్డమైనవాళ్ళ దెప్పులతోటి.
    "నాన్నా! నేనేదన్నా ఉద్యోగం చూసుకుంటాను. సెకండరీ గ్రేడు ట్రైనింగ్ కి పంపించండి. ఏ స్కూలులో నన్నా ఉద్యోగం దొరకకపోదు, నా పొట్ట నేను పోసుకుంటాను!"
    సీత తన నిర్ణయం చెప్పాక విశ్వనాథం కొంతసేపు ఆలోచించాడు. చివరికి విశ్వనాథంకి కూతురు చెప్పింది సబబుగానే తోచింది. పెళ్ళి కాని సీత సంగతి తను కాస్త హరీ అనగానే ఏమవుతుంది? ఆమె కాళ్ళమీద ఆమె నిలబడలేని పరిస్థితిలో ఆమె బ్రతుకు నానా అగచాట్ల పాలవుతుంది. కొడుకు కొంతకాలం మంచిగా వున్నా, తరువాత ఎలా మారుతాడో! వాడి సంపాదన వాడికే చాలదు. యింక చెల్లెలిని ఎన్నాళ్ళు భరిస్తాడు! అన్నగారి యింట్లో చాకిరి చేస్తూ, వాళ్ళు విసుక్కుంటూ పడేసే మెతుకులతో ఎన్నాళ్ళని కాలక్షేపం చేస్తుంది?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS