Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 9


    భవిష్యత్తుని ఊహించిన విశ్వనాథం సీత నిర్ణయమే చాలా మంచిదన్న అభిప్రాయానికి వచ్చాడు.
    ఓ డిగ్రీ తెచ్చుకుంటుంది. ఏదో ఉద్యోగం చూసుకుని ఒకరి మీద ఆశపడకుండా బ్రతక గలుగుతుంది. అదృష్టంవుంటే అప్పుడే ఆమెకి నచ్చిన వాణ్ణెవణ్నైనా కట్టుకుంటుంది. కనీసం ఒకరి దయా ధర్మాలమీద ఆధారపడకుండా ఉంటుంది. పెళ్ళి చేయలేకపోయినందుకు ఆమెకామాత్రం ఉపాధి కల్పించడం తన కనీస ధర్మం.
    "ఏమంటారు నాన్నా!" జవాబుకోసం ఆశగా చూసింది సీత ఆలోచిస్తున్న తండ్రి మొహంలోకి.
    "నీవు చెప్పిందే బాగుందమ్మా! సెకండ్రీ గ్రేడు ట్రైనింగేం ఖర్మ! నిక్షేపంగా పైకి చదువుకో. ఏ డిగ్రీ అన్నా సంపాదించాక, ఏదో మంచి ఉద్యోగం దొరక్కపోదు. పెళ్ళి చెయ్యలేని అసమర్థుణ్ణయినందుకు యీ మాత్రమైనా చేసి నీకో దారి చూపెట్టడం నా బాధ్యత!"
    "బాగుంది వరస! దానికి మతిపోతే, మీరు దానికి సై అంటారేమిటి? ఆడపిల్లకి పెళ్ళి చేయడం మాని, చదివించి ఉద్యోగం చేయిస్తారట" కోపంతో కసిరింది కమలమ్మ.
    "అవునే, ఏం చెయ్యమంటావు! దానికేదో దారి చూపించకపోతే మన తర్వాత దాని గతేం కాను?"
    "దారి!....గోదారి!.... అంతకన్నా కట్ట కట్టుకుని ఆ గోదార్లో దూకితే ఏ బాధ వుండదు!" రుసరుసలాడుతూ వెళ్లిపోయింది కమలమ్మ.
    "మీ అమ్మకి నీ పెళ్ళి కాలేదన్న చింతలో మతి పూర్తిగా పోయింది. నువ్వు ఆవిడ మాటలు పట్టించుకోకమ్మా! రేపే కాలేజీకి అప్లికేషన్ రాయి!" కూతురికి ధైర్యం ప్రోత్సాహం ఇచ్చాడు విశ్వనాథం.
    చూస్తుండగానే అయిదేళ్ళు అయిదు నిమిషాల్లాగ గడిచినట్లనిపించింది సీతకి. చదువుమీదే దృష్టి వుంచుకుని. బి.ఏ. బి.యి.డి. అయింది. ఆ తర్వాత కష్టం లేకుండానే ఓ ఊళ్లో గరల్స్ స్కూల్లో టీచరు ఉద్యోగం సంపాదించుకుంది.
    యీ అయిదేళ్ళలో యింట్లో పరిస్థితులు చాలా మారాయి. కూతురి పెళ్ళి బెంగతోనే మంచం పట్టి తీసుకుని తీసుకుని సీత బి.ఏ. చదువుతూండగానే కన్నుమూసింది కమలమ్మ. యిటు భార్య మరణం, కూతురు భావి జీవితాన్ని గురించిన చింత, హఠాత్తుగా సంక్రమించిన పక్షవాతంతో మంచంలో తీసుకుంటూ, కొడుకింట్లో, కొడుకు చేతుల మీదుగా దాటిపోవడానికి యెదురుచూస్తూ కాలం గడుపుతున్నాడు విశ్వనాథం.
    మొదటిసారిగా ఉద్యోగంలో చేరడానికి అన్నను వెంటబెట్టుకుని ఉద్యోగం ఊరు చేరుకుంది సీత. అన్నగారు ముందుగానే ఓ స్నేహితుడి ద్వారా ఓ ఇల్లు కుదిర్చి పెట్టాడు?
    విశ్వనాథం సీతని ఆడపిల్లని అత్తవారింటికి సాగనంపినట్లుగా ఎన్నో జాగ్రత్తలు బోధపరిచాడు. సీత పెళ్ళి ఖర్చుకు దాచిన డబ్బు చదువుకు అవగా మిగిలిన రెండొందలు చేతిలో పెడ్తూ 'అమ్మా' యిదే నీ సారెడబ్బు అనుకో, దీంతో యింట్లోకి కావల్సిన వస్తువులు ఏమన్నా కొనుక్కోమని సాగనంపుతూంటే ఆయన కళ్ళలో నీరు తిరిగింది. సీతకి కూడా పుట్టిన ఊరుని తండ్రిని వదిలి వెళ్ళడానికి ఎంతో కష్టం అనిపించినా క్రొత్తగా చెయ్యబోయే ఉద్యోగపుటుత్సాహంతో ఆ బాధ త్వరగానే మరచిపోయింది.
    సీతకి ఇల్లు బాగానే అమరిందనిపించింది చిన్నదైనా. ముందు ఒక పెద్దగది. దాని గుమ్మం వీధివైపు వుండడం మూలాన బయటికి వెళ్లేటప్పుడు తాళం వేసుకు వెళ్ళచ్చు. వెనకాతల ఓ చిన్న గది సామాన్లు పెట్టుకోడానికి. దాని వెనక చిన్న వంటగది. కుళాయి, బాత్ రూము అన్నీ సదుపాయంగా ఉన్నందుకు, చవగ్గా నలభై రూపాయల్లో అన్నీ అమరినందుకు యెంతో ఆనందించింది.
    ముందు గదిలో తండ్రి యిచ్చిన డబ్బుతో కొన్న టేబిల్, కుర్చీ, మంచం వేసుకుంది. వెనగ్గదిలో పెట్టెలు, బట్టలు సర్దింది. వంటగదిలో క్రొత్తగా కొన్న స్టవ్, గిన్నెలు యింటినుంచి తెచ్చుకున్న ఊరగాయలు అన్నీ అమర్చుకుంది. ఆ చిన్న క్రొత్త సంసారాన్ని చూసి మురిసిపోయింది. ఆమె కలలన్నీ పండి యెన్నేళ్ళనించో యెదురు చూసిన స్వర్గం కళ్ళముందు కనిపించినట్లయింది. సంసారానికి కావల్సినవన్నీ ఒక్కొక్కటే ప్రతి నెలా కొనుక్కోవాలనుకుంది. ఇన్నాళ్ళకి తనదీ అంటూ ఏర్పడిన సంసారం ఆమెని ఎంతో మురిపించింది.
    చెల్లెలి దగ్గర రెండు రోజులుండి అన్నీ అమర్చి, అన్ని అప్పగింతలు పెట్టి, సెలవులకి వస్తూండమని, వారం వారం ఉత్తరాలు రాయమని హెచ్చరించి అన్నగారు వెళ్ళిపోయాడు.
    మొదటినెల జీతం అందుకోగానే తనేదో పెద్ద ఘనకార్యం సాధించినట్లు తృప్తిపడింది సీత. ఓ అరవై రూపాయలు తండ్రికి, అన్నకి, వదినకి బట్టలకంటూ యింటికి పంపుతూ ప్రతినెల ఓ నలభై రూపాయలు తండ్రికి మందుల కోసం పంపుతానంటూ రాసింది. దానికి విశ్వనాథం బాధపడ్తూ అమ్మా ఆడపిల్ల సొమ్ము తినమంటావా? నీకు పెట్టవలసింది పోయి, నీదగ్గిర తీసుకోనా' అంటూ వ్రాసిన సీత సొమ్ము పంపడం మానలేదు. యింటి దగ్గిర ఉన్న ఒక్కడి సంపాదన రెండువందల జీతంతో వదిన, యిద్దరు పిల్లలు రోగిష్టి తండ్రి అందరికీ గడవడం కష్టం.
    ఆ పరిస్థితి ఆమెకి తెలుసు. తను పంపక పోతే జరక్కపోదు గాని, పంపితే సహాయంగా వుంటుంది. పైగా తను తండ్రిని పెద్దతనంలో ఆదుకో గలుగుతూందంటే అదొక తృప్తి, సంతోషం.
    ఉదయం లేచి స్నానం వగైరా కానిచ్చి కాఫీ పెట్టుకుని త్రాగి ఆ స్టవ్ మీదే వంట కానిచ్చి కాసేపు ఏ పుస్తకమో చదివి, భోంచేసి స్కూలుకి వెడుతుంది. మధ్యాహ్నం కాఫీ ఫ్లాస్కులో పోసుకు పట్టుకుపోతే యింక సాయంత్రందాక యింటికి రావడం బెంగవుండదు. సాయంత్రం ఇంటికి వస్తూనే కాసేపు రెస్ట్ తీసుకుని మొహం కడిగి, వంటచేసుకుని వెంటనే తినేస్తుంది. ఆ తర్వాత మర్నాడు చెప్పవలసిన పాఠాలు ఓ గంట చూసుకోడం, పడక....యిదీ సీత దినచర్య.
    అన్ని విధాల అన్నీ సుఖంగా అమరినందుకు యెంతో సంతోషించింది. స్కూల్లో హెడ్ మిస్ట్రెస్ చాలా మంచిది. మొదటిరోజే ఎంతో అభిమానం కనపరిచింది. వచ్చిన పదిహేను రోజులకే తోటి ఉపాధ్యాయినులతో స్నేహం కుదిరింది. పిల్లలలో కూడా సీత పాఠాలు బాగా చెపుతుందన్న పేరు వచ్చింది.
    ఇంటావిడని 'పిన్నిగారూ' అంటూ పిలిచి మంచి చేసుకుంది సీత. సీతకి పనిమనిషిని, పాలు వగైరాలకి మనుష్యులని కుదిర్చి పెట్టింది ఇంటామె. కూర నార వీధిలోనికి వచ్చినవి తను కొనేటప్పుడు సీతకి ఏరి పెట్టడం పండగలకి భోజనాలకి పిలవడం వగైరాల్తో సీతతో కలుపుగోలు తనం చూపింది.
    ఇంటావిడ ఏభై ఏళ్ల మనిషి. భర్తపోయి అయిదు సంవత్సరాలైంది. ఉన్న యిద్దరు కూతుళ్ళు కాపరాలు చేసుకుంటున్నారు. భర్త వదిలిన ఆస్థి, స్వంత యింట్లో గుట్టుగా కాలక్షేపం చేస్తూంది ఆమె. మగ సాయానికి తమ్ముడు శంకరాన్ని యింట్లో తెచ్చి పెట్టుకుంది.
    శంకరానికి చదువు సంధ్యలు అబ్బలేదు. మెట్రిక్ మూడుసార్లు తప్పి యింక ఆ ఉద్యమం విరమించుకున్నాడు. అక్కగారి యింట్లో తిష్ఠ వేసి ఆమె డబ్బుతో దర్జాలు వెలిగించడం ఒక్కటే ఉద్యోగం. పొలం పనులు, కాస్త డబ్బు వ్యవహారాలు చూసి మగ దక్షతగా వుంటాడని యింట్లో వుంచుకున్న ఆమె రాను రాను తమ్ముడి అధికారానికి పూర్తిగా లోబడి, అతనిచేతి కీలుబొమ్మ అయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS