నకిలీ బాస్
వసుంధర

"ఎక్కడి కెళ్తరు బాబూ !" అనడిగాడు రిక్షావాడు.
"సుందర్రావు పేట" అన్నాను.
"ఎక్కండి బాబూ" అంటూ సీటు సర్దాడు రిక్షావాడు.
"ఎంత?" అడిగాను అడుగు కూడా ముందుకు వేయకుండా.
"మీకు తెలియన్దేముందండీ , మీకు తోచినంతివ్వండి."
"అలా కుదరదు. కచ్చితంగా ఇంతని తేల్చి చెప్పు."
"ఎక్కి కూచోండి బాబూ. మీ దగ్గరబెరాలేంటి?"
నేను చిరాగ్గా రిక్షావాడి కేసి చూసి, "అర్ధరూపాయిస్తాను, వస్తావా?' అనడిగాను. వాడు తెల్లబోయాడు.
"సుందర్రావు పేటకి అర్ధరూపాయా, ఇదేం న్యాయమండీ"అన్నాడు.
"అందుకే, ఎంతిస్తే న్యాయమో నువ్వే చెప్పు" అన్నాను.
"అయిదు రూపాయలండి. అంతా ఇచ్చే మామూలు రేటే అది!"
ఈసారి తెల్లబోవడం నా వంతయింది. "అయిదు రూపాయలా?' అన్నాను నోరు తెరచి.
"అందుకే , తమ కెంత న్యాయమని తోస్తుందో చెప్పండి" అన్నాడు రిక్షావాడు.
అతగాడు నాతో వేళాకోళమాడాడని అర్ధమయింది " నా ఒళ్లు కుతకుతలాడింది. నేను అర్ధరూపాయన్నప్పుడు బహుశా అతగాడి ఒళ్ళు కూడా అలాగే కుతకుతలాడి ఉంటుంది. అందుకే అయిదు రూపాయలని దెబ్బకు దెబ్బ తీశాడు. కానీ వాడి అంతస్తే క్కడ, నా అంతస్తేక్కడ నేనిచ్చే వాణ్ణి, తను పుచ్చుకునే వాడు. కాస్త అణకువ ఉండొద్దూ. నాలోని అహం లేచింది. "అర్ధరూపాయికి పైసా ఎక్కువివ్వను" అన్నాను.
'అయిదు రూపాయలకు పైసా తగ్గను. ఎవడు కడతాడో నేనుచూస్తాను" అన్నాడు రిక్షావాడు.
నేను టైము చూసుకున్నాను. అక్కడికి చేరుకోడానికి కింకా రెండున్నర గంటల వ్యవధి ఉంది. ఇప్పుడు తన కొచ్చిన తొందరేమీ లేదు. ఈలోగా ఎవడో ఒకడు బేరం కట్టకపోడు. ఇలా అలోచించి ఎదురుగా వున్న హోటల్లోకి దూరాను.
చెప్పుకోదగ్గ ఆకలి లేదు, అందుకే సింపుల్ గా కాఫీ ఆర్డరిచ్చాను.
ఈరోజు నా జీవితంలో మరపురాని రోజుగా మారబోతోంది. అందుకు రెండున్నర గంటల వ్యవధి మాత్రమున్నది. ఆ తర్వాత నా జీవితం , జీవితవిధానం పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న హోటల్లో మళ్ళీ నేను కాలు పెట్టను. కొద్ది క్షణాల క్రితంలా రిక్షా వాళ్ళతో బెరాలాడుతూ సమయం వృధా చేయను.
అప్పుడు నాకు ప్రతిక్షణం అమూల్యమవుతుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా కారు సిద్దంగా ఉంటుంది. కారు తలుపులు డ్రైవర్ స్వయంగా తెరుస్తాడు. నా పక్కన కారులో వెనుక సీటులో చిత్ర వుంటుంది.
అందమైన చిత్ర పక్కన ఉండగా కాలం కారుకన్న వేగంగా పరుగెడుతుంది. జీవితం మధురాతీమధురంగా ఉంటుంది.
అసలు చిత్రతో నా పరిచయమే విచిత్రమైంది!
పాక హోటల్లో సింగిల్ టీకి అర్ధరిచ్చి జేబులోకి చేయి పోనిచ్చి స్పర్శా జ్ఞానంతో పైసలు లెక్క పెడుతున్నాడొక రోజు, మరో తినుబండారమేదైనా అర్దరివ్వగలనెమో నన్న ఆశతో , నా వేషం డాబుగా వుండడం వల్ల హోటల్ యజమాని - కమ్ - సర్వర్ చాలా మర్యాద చేస్తున్నాడు. నామీద అతని గౌరవం సింగిల్ టీ అర్దరివ్వగానే తగ్గిపోయిందనిపించింది. అటువంటి చోట్ల నా గౌరవం తగ్గడం నేను సహించలేను.
నా బుర్ర చురుగ్గా పనిచేయగా, హోటల్ యజమాని వద్దకు వెళ్ళి , చెవిలో చెప్పినట్లుగా అన్నాను. "నాకో చిన్న సహాయం , చేసి పెట్టాలి. అలా చూడు" అన్నాను.
అతనటు కేసి చూసి , "ఎవరో అమ్మాయి పాన్ షాపు ముందు నిలబడి ఉంది" అన్నాడు.
నిజానికి నేనా అమ్మాయిని చూడలేదు. అతను చూపించగానే 'ఇదీ ఒకందుకు మంచిదే"అనుకుని, "ఆ అమ్మాయిని కనిపెట్టి చూస్తుండాలి. ఆమె అక్కడుండగా ఏమేం చేస్తుందో గమనించాలి. నేనిక యిక్కడుండడం ప్రమాదకరం. మళ్ళీ కొన్ని గంటల తర్వాత వస్తాను. నీవు చేసే ఈ సహాయానికి నేను స్వయంగా ఇచ్చే ప్రతిఫలం కాక ప్రభుత్వం నుంచి కూడా గుర్తింపు లభిస్తుంది" అన్నాను.
ఆ హోటల్ యజమాని ముఖంలో ఆశ్చర్యం, సంతోషం, గర్వం మూడు కనపడ్డాయి. అతని కళ్ళలో నా పట్ల ఆరాధనా భావం లాంటిదికూడా కనబడింది. నాకిప్పుడు సంతృప్తిగా ఉంది. అతను నిరాకరించినా సింగిల్ టీ కి బలవంతంగా డబ్బులిచ్చేశాను. బయటకు వచ్చి మిగిలిన డబ్బులతో ఒక కిళ్ళీ షాపులో పిప్పర మెంట్లు కొనుక్కున్నాను. సరిగ్గా నాలుగు వచ్చాయి. ఇంక జేబులు ఖాళీ అయిపోయాయి.
బజారులో తిరగాసాగాను. ఎన్నో వస్తువులు కనిపిస్తున్నాయి. చాలా కొనాలని వుంది. నా జేబులో డబ్బు లేకపోవడం షాపుల వాళ్ళ దురదృష్టం! జేబులో డబ్బుంటే ఎంతమందో ఏమీ కొనకుండా వెళ్ళిపోతున్నారు.
హటాత్తుగా నా కళ్ళకు నేలమీద పదిపైసలు బిళ్ళ కనబడింది. చటుక్కున తీసి జేబులో వేసుకున్నాను. మళ్ళీ కాళ్ళలో కాస్త బలం వచ్చింది. ఇంకో సింగిల్ టీ తాగవచ్చును. కానీ ఆ పనిచేయలేదు. అయాచితంగా వచ్చిన డబ్బు ఎలాగూ లోకువే. అందుకే ఆ పది పైసలూ ఒక చోట లాటరీ ఆడాను. ఆరోజు నా అదృష్టం బాగుంది పది పైసలూ పది రూపాయ లయింది.
సింగిల్ టీ ఏం కర్మ! ఏకంగా భోజనమే చేయవచ్చు.
"ఏం మనిషిని నేను? ఇంతకాలం ఉద్యోగానికి అప్లికేషన్స్ పెట్టడం లోనే సమయం వృధా చేశాను. ధన సంపాదన కుద్యోగం కాకుండా లక్ష మార్గాలున్నాయి " అనిపించింది.
హటాత్తుగా నాకు సింగిల్ టీ హోటలతను గుర్తు కొచ్చాడు. అతనితో నేను మళ్ళీ వస్తానని చెప్పాను. నన్నొక గొప్పవాడుగా అతను గుర్తు పెట్టుకోవాలంటే అతన్ని మళ్ళీ కలుసుకోవాలి. చిన్న బహుమానం ఇవ్వాలి. కుతూహలం లేకపోయినా జరిగినదేమిటో తెలుసుకోవాలి.
నన్ను చూస్తూనే సింగిల్ టీ హొటలతను నమస్కారం చేశాడు. జేబులోంచి ఒక రెండు రూపాయల నోటు తీసి అతనికిచ్చి, "దగ్గరుంచుకో , జరిగినదేమిటో చెప్పు" అన్నాను కుతూహలాన్ని నటిస్తూ.
హొటలతని ముఖం అంతా బాగా లేదు. 'ఆమెతో కనీసం ఇద్దరు మగాళ్ళు మాట్లాడారండీ. వాళ్ళు వెళ్ళి పోయాక, ఒక కారు వచ్చి ఆమె ముందుగా అగిందండి. నేను చూసి నంబర్ కూడా నోటు చేసుకున్నానండీ. ఒక అయిదు నిముషాలు ఆమె ఆ కార్లోని మనిషితో మాట్లాడిందండి. తర్వాత సూటిగా నా దగ్గరకు వచ్చిందండి. "ఎవరైనా నన్ను గమనించమని చెప్పారా?" అనడిగిందండి నన్ను. లేదని చెప్పాను. ఆమె తన వేనిటీ బ్యాగులోంచి పది రూపాయలు నోట్లు తీసి పట్టుకున్నరండి. "నిజం చెబితే నీకు చాలా డబ్బిస్తానన్న రండి" నేను చెప్పేశాను. నేను కారు నంబరు నోట్ చేసుకున్న కాగితాన్ని కూడా అడిగి తీసేసుకుందండి. మీరు రాగానే తనకు చెబితే డబ్బిస్తానంది. ఈ ప్రాంతాలలోనే ఉండి వుంటుంది."
నాకాశ్చర్యం కలిగింది. ఈరోజు నా అదృష్టం బాగున్నట్లుంది. ఏదో పరువు నిలబెట్టుకోడంకోసం నేనామెను చూపించాను. ఆమెలో ఏ విశేషమూ ఉంటుందని కూ నేను భావించలేదు. వాటం చూస్తె ఆమె ఏదో ముఠా మనిషిలా గుంది. వాళ్ళ దృష్టిలో నేను పడ్డట్లున్నాను. మంచిదే. వాళ్ళు నాతొ పరిచయానికి ప్రయత్నించవచ్చు. రిస్కు లేకంతవరకూ నాలుగుడబ్బులు వెనకేసుకోవచ్చు. ఇదే ఉద్దేశ్యంలో "నేను ఎదురుగా ఉన్న పాన్ షాప్ దగ్గర నిలబడతాను. ఆమె వచ్చి అడిగితె నన్ను చూపించు. ఆమె ఇచ్చే ప్రతిఫలం తీసుకో. ప్రస్తుతానికి నేను చేయగల ప్రత్యుపకారం ఇదే" అన్నాను.
అతను నా వంక ఆరాధానాభావంతో చూస్తూ "సార్ , ఆమె కాగితం తీసుకున్నా నాకా కారు నంబరు గుర్తుందండి. యం. వై. 112" అన్నాడు.
నేనతని భుజం తట్టి "ప్రభుత్వం నీ సహాయాన్ని తప్పక గుర్తిస్తుంది" అన్నాను హుందాగా.
అక్కణ్ణించి బయటపడి పాన్ షాపు చేరుకున్నాను. అటూ ఇటూ చూస్తూ అప్పుడప్పుడు టీ దుకాణం కేసి కూడా చూస్తున్నాను. సరిగ్గా అయిదు నిముషాల్లో ఆ అమ్మాయి ఆ దుకాణం లో అడుగు పెట్టింది. ఓరకంట నేను అన్ని గమనిస్తున్నాను. అతనామేకు నన్ను చూపిస్తున్నాడు. ఆమె అతనికి డబ్బిస్తోంది. బహుశా కొన్న పద్దులై వుంటాయి.
ఇలాంటి మనిషి దృష్టిలో పడితే చాలు. ఆ మాత్రం సంపాదన చాలు. నాకు చాలా ఎక్కువ అవుతుంది. నా ఆచూకీ ఇచ్చినందుకే ఆ టీ దుకాణం అతనికి కొన్ని పదులు ముట్టాయి. అలాంటి పనులు చాలా చేసి పెట్టగలను నేను అలా డబ్బిస్తే!
ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చింది. బాగా సమీపానికి వచ్చేక, ఎగాదిగా చూసింది. "హలో!" అన్నాను.
"హలో!" అంటూ ఆమె కూడా విష్ చేసింది.
మరికాస్త దగ్గరగా వచ్చి "మీ పేరు!" అంది.
"మనిషిని చూపించినందుకే టీ దుకాణమతనికి కొన్ని పడులిచ్చారు. పేరు తెలుసుకోవాలంటే ఖర్చవుతుంది మరి" అన్నాను.
ఆమె నావంక చూసి తియ్యగా నవ్వి, "చూడండి, నేను చాలా అందంగా కనిపిస్తాను , తియ్యగా నవ్వుతాను. మాట్లాడతాను. కానీ, నేను పాము కంటే ప్రమాదకరమైన మనిషిని. నాతో ఆటలు పనికిరావు."
"పాముల వాడు నాగుపాముతో అడుకోడు. దాని చేత ఆడిస్తాడు" అన్నాను ఎటో చూస్తూ. ఆమె ఎవరై వుంటుందో, మా పరిచయం యెలా దారి తీస్తుందో అని ఆలోచిస్తున్నాను.
ఆమె ముఖంలో రోషం, ఉక్రోషం రెండూ కనిపించాయి. నామాటకు జవాబు కోసం ఆలోచిస్తోందనుకుంటాను. నేనే మళ్ళీ అన్నాను. "ఇందులో కోపగించుకోవలసినదేమీ లేదు. మీ సంగతి మీరు చెప్పారు. నా సంగతి నేను చెప్పాను, అంతే!"
ఈసారి ఆమె నవ్వింది. "ఒకరి సంగతి ఒకరికి పూర్తిగా తేలియాలంటే మరికొంత పరిచయం అవరమనుకుంటాను" అంది.
