Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 7


    మరో పదిహేనురోజులకి __ మధ్యాహ్నం పన్నెండున్నర అయింది, రవి ఇంకా ఇంటికి రాలేదని, బస్సు వస్తుందేమో అని చూస్తూ గుమ్మం ముందు నిలుచున్నాను. మార్నింగ్ స్కూల్. ఏడుగంటలనించి పన్నెండువరకూ స్కూలు__ రోజూ ఈపాటికి వచ్చే రవి ఇంకా రాలేదని ఆరాటంగా బస్సుకోసం ఎదురుచూస్తూ వీధి వరండాలో తచ్చాడుతున్నాను.
    రోడ్డుమీద కఱ్ఱల మోపులు ఎత్తుకుని కొందరు వెడుతున్నారు. మా ఇంటి ముందుకి వచ్చేసరికి వాళ్లు ఎండకి కాస్త అలుపు తీర్చుకోడానికి ఇంటిముందున్న పెద్ద చెట్లకింద మోపులు దింపుకుని ఆయాసం తీర్చుకుంటున్నారు. ఇద్దరు ముగ్గురు ఆడవాళ్లు సందేహిస్తూనే గేటు తీసుకొని లోపలికి వచ్చి నన్ను చూసి, కాసిని నీళ్ళు పొయ్యి తల్లీ నోరెండిపోతుంది.... ఎక్కడా నీటిసుక్క రాలడంలేదు పైపుల్లోంచి' అన్నాడు. 'నీళ్లేగా ఏం భాగ్యం' అంటూ లోపలికి వెళ్లి చెంబుతో తెచ్చియిచ్చాను. ఆ నీళ్లు తాగిన వాళ్లల్లో ఆనాటి ఆ తల్లి వుంది. దాన్ని గుర్తుపట్టి 'నీ కూతురేది, యివాళ రాలేదే?' అనడిగాను. అది ఒక్కసారిగా గొల్లుమని ఏడుపు లంకించుకుంది. 'ఇంకెక్కడి కూతురో.... నా కూతురో.... నానే సంపేసుకున్నానో తల్లీ.... నా నోట్లో దుమ్ముకొట్టి ఎల్లిపోయిందో నా కూతురు.' ఆ తల్లి గోడుగోడున చేత్తో బుర్ర కొట్టుకుంటూ ఏడవడం ఆరంభించింది. తెల్లబోయాను. ఆఁ చచ్చిపోయిందా! ఎలా చచ్చిపోయింది. ఏం జరిగింది? నా సందేహాలు ప్రశ్నలయ్యాయి. ఆ తల్లి ఏడుస్తూంటే ఆ మిగతావాళ్ళు అసలు సంగతి చెప్పారు. ఆనాడు యింటికి వెళ్లేసరికి కూతురు ఒళ్ళెరగకుండా పడిపోయింది. ఎండ దెబ్బకో తల్లికొట్టిన దెబ్బలకో, తిండిలేకో ఏమయితేనేం వళ్ళు తెలియని జ్వరముతో మూసిన కన్ను మరి తెరవలేదట! ఆ మర్నాడంతా వళ్ళు తెలియని స్థితిలోనే వుందట. ఆసుపత్రికి మోసుకొచ్చారట. బలహీనంమీద వడదెబ్బ కొట్టిందన్నారట డాక్టర్లు. తెలివిలోకి రాకుండానే చచ్చిపోయింది మూడో రోజున.
    "రూపాయి డబ్బులు తెచ్చేది తల్లీ రోజూ, నా నోటికూడ కూడు నానే పడదోసుకున్నాను. రూపాయెట్టి సిరుతిండి కొనుక్కోనే లేదు. ఎల్లిపోయిందిరోయి నా కూతురు, నా కూతురో...." ఏడుస్తున్న ఆ తల్లిని మిగతావాళ్ళు మందలిస్తూ, ఓదారుస్తూ తీసికెళ్ళిపోయారు బయటకి.
    కూతురు చచ్చిపోయినందుకంటే ఆ కూతురు తెచ్చే రూపాయి పోయినందుకు ఎక్కువ ఏడుస్తున్నట్లుగా వుంది దాని ఏడుపు! ఇదేం తల్లి? చచ్చిపోయిన ఆ పిల్లమీద జాలి కలిగిందికాని, రోజూ చస్తూ బ్రతికే యీ తల్లిమీద నాకప్పుడు జాలి అనిపించలేదు!!

                                                *    *    *    *

    వంటిగంట అవుతున్నా బస్సు జాడలేదు. బస్సు ఎందుకు రాలేదో అన్న ఆదుర్దా ఒక పక్క,పిల్లాడు యెండలో ఆకలితో ఏమయ్యాడో అన్న ఆందోళనతో ఆరాటంగా యింట్లోకి బయటికి పదిసార్లు తిరుగుతూ ఆరాటపడ్డాను. ఏం చెయ్యను! టైము గడిచిపోతూంది. బస్సు పాడయ్యిందా? కొంపదీసి ఎక్కడన్న ఏక్సిడెంటవలేదుగదా? ఎవరినన్నా పంపుదాం అన్నా యింట్లో ఎవరూ లేరు! ఆయనకూడా టూర్ లో వున్నారు. లేకపోతే కారు తీసికెళ్ళేవారు. ఏం చెయ్యడమో తెలియక కంగారుపడ్డాను. ఆందోళనకి తోడు ఆకలి కరకరలాడిస్తూంది. ఉదయం ఎనిమిది గంటలకి తిన్న టిఫిను. రోజూ యింటికి వచ్చాక పన్నెండున్నరకి వాడు నేను కలిసి తినడం అలవాటు. వంటిగంటన్నర అవుతున్నా బస్సు జాడ లేదు. ఇంట్లోకి బయటికి తిరిగి తిరిగి కాళ్ళలో నీరసం వచ్చి కుర్చీలో కూలబడ్డాను. ఆకలి ఒక ప్రక్క__ పోనీ భోంచేద్దాం అంటే, అయ్యో పిల్లాడు యింకా తినలేదే అన్పించింది.వాడు ఆకలితో ఎండలో ఎక్కడ మాడుతున్నాడో అన్నం తినేయనా నేను అన్పించింది. ఏం చెయ్యాలో తోచక నిస్సహాయంగా మరోసారి వీధిలోకి వెళ్లాను. బస్సు జాడ లేదు. ఎన్ని గ్లాసుల నీళ్ళతో ఆకలిని చంపగలను. రెండు గంటలవుతూంది. వాడంటే ఉదయం పాలు తాగాడు, ఎగ్ తిన్నాడు. టిఫిను తిన్నాడు. మధ్యలో ఇంటర్వల్లో తినడానికి శాండ్ విచెన్ యిచ్చాను. నేను ఉదయం ఎనిమిది గంటలకు తిన్న ఇడ్లీ తప్ప ఏం తిన్నాను? స్కూల్లో ఏదన్నా ప్రోగ్రాం వుందేమో! ఏవేవో ఆలోచనలతో రెండు గంటలు కొట్టడం విని యింక ఆకలికి ఆగలేక నన్ను నేను సమర్థించుకుంటూ కంచంముందు కూర్చున్నాను. వాడు రాలేదనే ఆరాటంలోనే ఏదో యింత తిన్నాననిపించుకుని లేచానో లేదో బస్సువచ్చి ఆగింది. 'బస్సు త్రోవలో పాడయిందమ్మా' అంటూ వాడువచ్చాడు. వాడి మొహం చూస్తూంటే__ అప్పటికి ఆకలి చల్లారిన నాకు___ పసిపిల్లాడు తినకుండా నేను తినడం ఏదో తప్పుపని చేసినట్లనిపించింది. 'అమ్మా, నీ వన్నం తినేశావా అప్పుడే' అని రవి అడిగేసరికి గిల్టీగా ఫీలయ్యాను. ఆ క్షణంలో అప్రయత్నంగా ఆ కర్రలమ్మి మొహం కన్పించింది. ఎండలో మైళ్ళకి మైళ్ళు నడిచి కఱ్ఱలమ్ముకుని పిల్లలకి గంజినీళ్ళు పోసే ఆ అమ్మకంటె నేనెందులో ఎక్కువ అన్పించింది. ఇంటిపట్టున నీడలో సుఖంగా కూర్చున్న నేను ఆకలికి ఒంటిగంటకంటే ఎక్కువ ఆగలేక పిల్లాడికి పెట్టకుండానే నా కడుపు నింపుకున్న నేను మాతృత్వం గురించి, మమతలు అనుబంధాలు గురించి మాట్లాడటం కన్నా హాస్యాస్పదం ఏముంటుంది?
    అన్నీ సవ్యంగా వున్నంతసేపే ఆప్యాయతలు, అనుబంధాలు అన్న నిజం గుర్తించలేని నాకు ఆ తల్లి ముందు నిలబడే అర్హత వుందా అన్పించింది!

                                                                                          (జ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక' 73)

                                                   *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS